“మీ అమ్మ మీ దగ్గర వున్నారా? ” అని అడిగాడు.
“వంటింట్లో వుంది ” అంది సంయుక్త. ఆమెకంతా అయోమయంగా వుంది.
“ఆమె దగ్గరకు వెళ్లి స్పీకర్ పెట్టండి. ప్లీజ్!” అన్నాడు. సంయుక్త అలానే చేసింది. శ్రీధర్ చెప్పసాగాడు.
“సంయుక్తా! నిన్న మీతో చెప్పిన విషయం మీ నాన్నతో చెప్పాను. ఆయన కచ్చితంగా ఏదీ చెప్పకుండా నన్ను గేటు బయటికి తోసుకుంటూ వెళ్లి తనెక్కడికో వెళ్లిపోయారు”
“…”
“అంటే నిర్ణయం మనకే వదిలేసారని అనుకుంటాను “
“…”
” మనకి పెద్దగా పరిచయం లేదు. మనం కలుసుకున్నదికూడా రెండే రెండుసార్లు . అంతలోనే ఇలాంటి నిర్ణయానికి ఎలా వచ్చానని మీరు అనుకోవచ్చు. నన్ను మీ పక్కింట్లో మొదటిసారి చూసాకే మీలో చైతన్యంలాంటిదేదో పుట్టుకొచ్చి ఆ జీవితంలోంచీ బయటపడ్డారని అనుకుంటున్నాను”
“…”
“నాకుకూడా మిమ్మల్ని చూసాకే పెళ్లిమీదికి ధ్యాస పోయింది. అమ్మ మా చిన్నప్పుడే పోయింది. నాన్న మరో పెళ్లి చేసుకోలేదు. ఆడదక్షత లేని కుటుంబం కావటాన్న పండుగలు, వేడుకల్లాంటివాటికి మేము దూరంగా వుండిపోయాము. అక్కలు ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. వాళ్లకి కాకుండా నేనెలా చేసుకుంటానని ఇన్నేళ్ళూ ఆగిపోయాను”
“…”
“…మీ జీవితం ఇలాంటి మలుపు తీసుకోకపోతే మీ స్ఫూర్తితో కుటుంబం ఏర్పరుచుకునేవాడిని. ఎందుకు… అంటే… దే జస్ట్ హేపెన్…జనాంతికంగా కొన్ని విషయాలు జరుగుతాయి. కాబట్టి… సంయుక్తా! ఇప్పుడు మనమధ్య ఎలాంటి అవరోధాలూ లేవు. అందుకే ఈ ప్రతిపాదన.”
“…”
“నేను మీ గేటు అవతల వున్నాను. ఇక్కడ ఇలా ఎంతోసేపు నిలబడితే బావుండదు. పది నిముషాలు ఎదురుచూస్తాను. ఇష్టమైతే నాతో వచ్చెయ్యండి. సివిల్ మేరేజి చేసుకుందాం “చెప్పదలుచున్నదంతా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు.
“ఏమిటే ఇది?” అని శారద అడిగేలోగా సంయుక్త అక్కడినుంచి వెళ్ళిపోయింది.ఒక అపసవ్యమైన పనికి అనేక సమస్యలు పిలకల్లా పుట్టుకొస్తాయి. కూతురి పెళ్ళి ఒక పొరపాటు. శేషు తనకి అల్లుడి స్థానంలో నచ్చలేదు. మేనల్లుడిగా అతని అల్లరి భరించడం వేరు. ఎవరూ తనమాట వినలేదు. అక్కగారితో వియ్యమని వుబ్బితబ్బిబ్బయాడు భర్త. ఆ ఆనందం ఎన్నాళ్ళో నిలవలేదు. విడాకులని దాటుకుని వచ్చి నిలబడింది. ఇప్పుడేం చెయ్యాలి తను? సంయుక్తని వెళ్లద్దని ఆపాలా? ఎంతకాలం? ఆగితే శేషు మారతాడా? అవకాశం వుందా? అప్పుడే మరో పెళ్ళికి సిద్ధమయాడతను. ఈ శ్రీధర్ ఇప్పటికిప్పుడు తేల్చమంటున్నాడు. ఏదో ఒకటి తేల్చి చెప్పి అతన్ని పంపేయకుండా గేటుదగ్గర నిలబెట్టి భర్త తను వెళ్లిపోవటమేమిటి? అంటే నిర్ణయం కూతురికి వదిలేసాడా? సందిగ్ధంలో పడింది.
అరగంట తర్వాత రాజారావు తిరిగి వచ్చాడు. గేటు బయట శ్రీధర్ కనిపించలేదు. గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు. ఇల్లంతా శ్మశాననిశబ్దం పరుచుకుని వుంది. శారద అనేక భావాలతో సంఘర్షించి అలిసిపోయి అభావంగా కూర్చుని వుంది. భర్త రాకతో మళ్ళీ సంఘర్షణ మొదలైంది.
“అది అతన్తో వెళ్లిపోయింది ” అంది ధైర్యం తెచ్చుకుని.
“పిల్లలు?”
“వెంట తీసుకెళ్ళిపోయింది “
రాజారావు దిమ్మెరపోయాడు. నిలుచున్నపళంగా కుర్చీలో కూలబడ్డాడు. సంయుక్త విడాకుల తర్వాత ఇది రెండో అఘాతం. చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. కూతుర్లో ఇంత తెగింపు వుందనుకోలేదు. ఎన్నో విషయాల్లో జయలక్ష్మి జోక్యం చేసుకుని ఆమె నిర్ణయాలని తనపై రుద్దినప్పుడు అతని మనసులో ఇంకోలా జరగాలనే కోరిక వుండేది. ఇప్పుడూ అలానే జరిగింది. శారదో, సంయుక్తో తను శ్రీధర్తో గట్టిగా చెప్పలేకపోయిన విషయాన్ని చెప్పి పంపిస్తారనుకున్నాడు. అందుకు భిన్నంగా జరిగింది. కొన్ని పొరలని తవ్వుకుంటూ వెళ్తే ఇలా జరగాలనేది కూడా అతని ఆకాంక్షే.
ఏం జరగబోతోందోనని శారద భయపడింది. రాజారావు జడుడిలా అలా కూర్చోవడం ఇంకా భయాన్ని కలిగించింది. తనుగా మాట్లాడాలన్నా భయమే. ఒక పరిస్థితి ఇన్ని రకాల భయాలని సృష్టించడం మనుషులమధ్య గడ్డకట్టిన సంకోచాలని వ్యక్తపరుస్తుంది. మనసులో మాటలని పంచుకోనివ్వదు.
అతనెవరు? ఎలాంటివాడు? నీకెలా పరిచయం ? అని కూతురిని అడగటానికి భయం…జవాబేం వస్తుందోనని. ఎంతసేపూ ఆ పరిచయం తుంచెయ్యమనే చెప్తూ వచ్చింది. అలా కాకపోతే ముందు రాత్రి అతను అడిగినదాన్ని తనకి చెప్పేది. విని భర్తతో చర్చించగలిగే అవకాశం… ముగ్గురూ కూర్చుని ఏం చెయ్యాలో నిర్ణయించుకోగలిగే సానుకూలత వుంటే ఏం చెయ్యటానికేనా తమకి వ్యవధి వుండేది. పునరాలోచనకి వీలుండేది. చాలాసేపటికి నోరు తెరిచాడు రాజారావు.
“ఇంటి తలుపులు ఎప్పుడూ తెరచే వుంచు శారదా, ఏ క్షణాన ఏ స్థితిలో అది తిరిగొచ్చినా చోటివ్వడానికి”
“…”
శారదకి ఏడుపొచ్చింది. ఈ సమస్యకు ఇదా పరిష్కారం?
“నేను చాలా పిరికివాడిని. పరిస్థితులని ఎదుర్కోలేను. ఆరోజున జయక్కకి ఎదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా సమ్మూని శేషుకిచ్చి చేసాను. అది కాపురం చెయ్యలేక ఏడ్చినప్పుడల్లా నా లోలోపల బాధపడ్డానుతప్ప గట్టిగా నిలదీసి అడగలేకపోయాను. అది విడాకులంది. దానికీ కాదనలేదు. ఈరోజు అతనొచ్చి అడిగితే ఖరాఖండిగా కాదనలేక పక్కకి తప్పుకున్నాను. వాళ్లే నిర్ణయించుకుంటారనున్నాను. అలాగే నిర్ణయించుకున్నారు. మంచో…చెడో…ఏం జరిగినా ఇకమీదట దాని జీవితం దానిష్టం” అంటూ కుర్చీలో వెనక్కి వొరిగి టవల్ ముఖంమీద కప్పుకున్నాడు.
శారద బహిరంగంగానే ఏడ్చింది. ఇద్దరూ ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లకపోయినా విషయం గుప్పుమనిపోయింది. రాజారావు పరివారమంతా వచ్చింది. ఎవరూ ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోతున్నారు.
“అది బరితెగించిందిరా! నీ కడుపున చెడబుట్టింది. చచ్చిందనుకో! అసలు పుట్టనేలేదనుకో… “అని జయలక్ష్మి తిడుతుంటే గిజగిజలాడిపోయాడు. మిగిలిన అందరూ తలోమాటా అన్నారు.
“అది కాపురానికి వెళ్లనని మొండికేసినప్పుడే జాగ్రత్తపడాల్సింది. చస్తే చచ్చేది. ఈ తలవంపులు వుండేది కాదు” అన్నాడు నారాయణరావు. రెండు కాలువల్లో సమాంతరంగా సాగుతున్న నీళ్ళు ఒక కాలువలోంచీ ఇంకో కాలువలోకి ఎలా వెళ్లలేవో, వీళ్ళ ఆలోచనలూ అంతే. ఎదుటివారి అక్కరని గుర్తించవు. రాజారావుకి కోరుకుంటున్నదీ వాళ్లు ఇస్తున్నదీ కలవట్లేదు. శారదకైతే కడుపు మండిపోతోంది. లోపల ఒక్కత్తే కూర్చుని ఏడుస్తుంటే వసంత వెళ్లి దగ్గర కూర్చుంది.
“ఏంటి అక్కయ్యా ! దిక్కులేనిదానిలా ఒక్కత్తినీ నడిరోడ్డుమీదికి పంపేసావా? మీరిద్దరూ నిలబడి కనీసం ఏ గుళ్ళోనో పెళ్లి చేసినా బావుండేది ” అంది కళ్ళ నీళ్ళు పెట్టుకొని.
అంతమంది వున్న కుటుంబంలో వాళ్లిద్దరే ఒకరికొకరు ఓదార్పు. మూడోకోడలు మళ్ళీ మేనరికం. ఆ తానులో ముక్కే.
“అతనొచ్చాడు. హాల్లో కూర్చున్నాడు. బావగారితో చెప్పదలుచుకున్నది చెప్పాడు. నేను వంటింట్లోనూ అది దానిగదిలోనూ వుండి విన్నాం. ఆ తర్వాత ఆయనా, అతనూ వెళ్లిపోయారు. అది ఫోను తీసుకుని నా దగ్గరకి వచ్చింది. అతనే…చెప్పాలనుకున్నది మరోసారి చెప్పి గేటవతల పదినిమిషాలు ఎదురుచూస్తానన్నాడు. అది దాని గదిలోకి వెళ్ళింది. నాకేం చెయ్యాలో తోచలేదు. ఆడవాళ్ళకి ఏ స్వతంత్రం వుండదుగా, మెదళ్ళు మొద్దుబారిపోయి వుంటాయి . అతను వెళ్లేదాకా గదిలోనే వుండిపోతుందనుకున్నాను. అలికిడికి హాల్లోకి వచ్చి చూస్తే గేటు దాటుతూ కనిపించింది” పదేపదే అదే దృశ్యం కళ్ళముందు కదలాడుతుంటే అంది శారద.
“ఇప్పుడేం చేద్దాం అక్కయ్యా! బావగారు ఏమంటున్నారు?”
“ఆయనేమంటారు వసంతా? సగం మనిషి. మిగిలిన సగం ఆ పెద్దావిడ “
“ఎంత అపురూపంగా పెరిగింది అది! శేషుకి ఇచ్చి చేసి బతుకు బుగ్గి చేసారు. ఇతనెవరో, ఎలాంటివాడో! ఒకసారి వెళ్లి చూడు అక్కయ్యా!” అంది.
“ఎక్కడికి వెళ్ళాలి? వెళ్లి ఏం చెయ్యాలి? బావగారు కలిసి వస్తే ఏదేనా చెయ్యగలను. ఎదిరించి ఇల్లొదిలి వెళ్తే …. దానికి ఏ కష్టమేనా వస్తే ఆశ్రయం ఎక్కడ ఇవ్వాలి?”
వాళ్లిద్దరూ మాట్లాడుకోవటం చూసి జయలక్ష్మి హాల్లోంచే అంది, “ఆడపిల్ల విషయంలో ఆ తెలివి ముందే వుండాలి. నయాన్నో భయాన్నో కాపురానికి పంపమంటే విన్నావు కాదు…ఇప్పుడు అనుభవిస్తున్నావు. తల్లీకూతుళ్ళు ఏకమై నా తమ్ముడిని క్షోభపెడుతున్నారు. ఇహమీదట ఇంట్లో దాని మాటెత్తడానికి వీల్లేదు”
శీను, శేషు ఇంకో నలుగురు మగపిల్లలు శ్రీధర్ ఇంటిమీదకి గొడవచెయ్యటానికి బయల్దేరారు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందుగానే వూహించిన శ్రీధర్ పోలీసు ప్రొటెక్షన్ తీసుకున్నాడు. వీళ్ళు ఇంకేం చెయ్యలేక తిరిగొచ్చారు. పరామర్శల పర్వం, ఓదార్పుల అధ్యాయం అయాయి. తుఫానుగాలి కుదిపి కుదిపి వదిలిపెట్టిన చెట్లలా మిగిలారు భార్యాభర్తలు.
క్లుప్తంగా రిజిస్టర్ మేరేజి చేసుకున్నారు శ్రీధర్, సంయుక్త. అన్నీ తనతో నిమిత్తం లేకుండానే జరిగిపోతున్నట్టు అనిపించింది ఆమెకి. ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి పెళ్లికి ముందు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు శ్రీధర్.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.