పెళ్లి పిలుపు – 6 by S Sridevi

  1. పెళ్లి పిలుపు – 1 by S Sridevi
  2. పెళ్లి పిలుపు – 2 by S Sridevi
  3. పెళ్లి పిలుపు – 3 by S Sridevi
  4. పెళ్లి పిలుపు – 4 by S Sridevi
  5. పెళ్లి పిలుపు – 5 by S Sridevi
  6. పెళ్లి పిలుపు – 6 by S Sridevi
  7. పెళ్లి పిలుపు – 7 by S Sridevi
  8. పెళ్లి పిలుపు – 8 by S Sridevi
  9. పెళ్లి పిలుపు – 9 by S Sridevi
  10. పెళ్లి పిలుపు – 10 by S Sridevi
  11. పెళ్లి పిలుపు – 11 by S Sridevi
  12. పెళ్లి పిలుపు – 12 by S Sridevi
  13. పెళ్లి పిలుపు – 13 by S Sridevi
  14. పెళ్లి పిలుపు 14 by S Sridevi“
  15. పెళ్లి పిలుపు – 15 by S Sridevi

దానికిముందు అతని ఇంట్లో చాలా చర్చ జరిగింది. పెద్దక్క మేఘమాల అంది.
” చాలా సాహసంతో కూడిన నిర్ణయం తీసుకున్నావు. ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్లి అయ్యింది. అంటే కొంత గతం… నీతో సంబంధం లేనిది… ఉంటుంది. ఆ పెళ్లి విఫలమైంది… అంటే ఆమె గతం విషాదంతో నిండి ఉంటుంది. ఆ పైన ఇద్దరు పిల్లలు. సంఘం వొప్పని ఎవరి సపోర్టూ ఉండని పెళ్లి మీది . మా విషయం వదిలేయ్. ఆ అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఏమాత్రం సహకరించరు. ఆమెని నువ్వు మామూలు మనిషిని చెయ్యాలి. ఆమె పిల్లల్ని ప్రేమించగలగాలి. పెద్దగా చదువుకున్నది కాదు కాబట్టి సోషల్ లైఫ్ కూడా పెద్దగా వుండదు. ఆశాభోంస్లేనో శోభాడేనో ఆమె స్థానంలో ఊహించకు. ఆమెనుంచి ఏమీ ఆశించకుండా అన్ని నువ్వే ఇవ్వడానికి సిద్దపడి ఉంటేనే చేసుకో” అని తమ్ముడిని హెచ్చరించింది.
“ఆమెను చూశాకే నాకు పెళ్లి మీదకి పోయింది. అనుకోకుండా ఆమె చేసుకోబోతున్నాను. ఈ పెళ్లి నాకోసం ” అన్నాడు శ్రీధర్. సంయుక్తని కూడా అలాగే అడిగింది మేఘమాల.
“మీరిద్దరూ కలుసుకోలేదు. పెద్దగా మాట్లాడుకోలేదు . ఏం చూసి ఎలా నమ్మి మా తమ్ముడిని చేసుకోవాలనుకుంటున్నావు?” అంది. దానికి సంయుక్త చాలా స్పష్టంగా జవాబు చెప్పింది.
” మా జీవితాలని మార్చుకోవడం కోసం అతను నాకు, నేను అతనికీ ప్రేరణ అయ్యాము. మేము ఒకరిలోకి ఒకరం సింకయాము. ఏవేనా కారణాలచేత నా నిర్ణయం తప్పైతే…” ఆగింది సంయుక్త. బలంగా శ్వాస తీసుకుని పూర్తి చేసింది. ” మా యింటి తలుపులు నా వెనుక ఎప్పుడూ మూసుకోవు”
సంయుక్త తను అనుకున్నంత బలహీన మనస్కురాలు కాదని అర్థమయింది మేఘమాలకి. శేషుతో తన పెళ్లి ఎందుకు విఫలమైందో క్లుప్తంగానే అయినా మరో సందేహానికి అవకాశం లేకుండా చెప్పింది. ఆడవాళ్ళు బలహీనతతోనే కాక ఆఖరి పోరాటంగా కూడా ఆత్మహత్యకి ప్రయత్నిస్తారని అర్థమయి, తను నమ్మే స్త్రీవాద భావాలకు కొత్త భాష్యం దొరికినట్టైంది మేఘమాలకి.
అలాగ వాళ్ల పెళ్లైంది. పెళ్లైన విషయంగానీ , పెళ్లి తేదీగానీ పెద్దగా ఎవరికీ చెప్పలేదు శ్రీధర్. ప్రత్యేకించి బహిరంగపరచకపోవటానికి కారణం సంయుక్త పిల్లలు తమ కుటుంబానికి బహిర్భాగమౌతారని. పెళ్లి విషయం సంయుక్త తల్లిదండ్రులకీ తెలిసింది.ఆమె చర్యలో అనైతికత లేదని ఇద్దరూ నిశ్వసించారు. చిన్నచిన్న తిరస్కారాలు, ఇబ్బందులు వస్తునే వున్నాయి శ్రీధర్‍కి సంయుక్త కుటుంబంనుంచి . దూరంగా వెళ్లిపోతే బాగుంటుందన్న వుద్దేశ్యంతో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు. అతని పై ఆఫీసరుకూడా విషయాలన్నీ విని రికమెండ్ చేసాడు.
నలుగురు వేరువేరు వ్యక్తులు సభ్యులుగా వుండేవారు శ్రీధర్ కుటుంబంలో. ఎవరి ఆలోచనలూ, జీవనగమ్యాలూ వారివి. ఐదో వ్యక్తిగా సంయుక్త వచ్చి చేరింది. పిల్లలు ఆమెకి ఎవరివల్లనో పుట్టినవాళ్ళుగా కాకుండా ఆమె పిల్లలుగానే చూడబడుతున్నారు.తనకొక విశిష్టమైన స్థానం, గౌరవం…సంయుక్త కలలోకూడా వూహించనివి లభించాయి.
ఇల్లు నాలుగ్గదులూ హాలుగా వుంటుంది. ఎవరెవరు ఎక్కడ వుద్యోగం చేస్తున్నా రెండు మూడు రోజులకొకసారి ఇక్కడికి వచ్చేస్తారు. ఆదివారంనాడు శ్రీధర్ తండ్రి వస్తాడు. ఆరోజుని అందరూ కలుసుకోవడం తప్పనిసరి. ఎవరి గది వారికి వుంది. ఇంట్లో ఎక్కడ చూసినా పుస్తకాలే. పొందికగా సర్ది వుంటాయి. మేఘమాల ఫెమినిస్టు సాహిత్యం ఎక్కువగా చదువుతుంది. నీహారికవి మెడికల్ జర్నల్స్, రిసెర్చి పేపర్లు. శ్రీధర్ తండ్రి జిడ్డు క్రిష్ణమూర్తిని. శ్రీధర్ ఆఫీసు రూల్స్, వ్యవహారాలకి సంబంధించినవి, లా బుక్స్‌తోపాటు సాహిత్యం చదువుతాడు. “పాతివ్రత్యంనుంచీ ఫెమినిజందాకా… ” అనే మల్లాది సుబ్బమ్మగారి పుస్తకాన్ని సంయుక్తకి చదవమని ఇచ్చింది మేఘమాల.
కట్టుబట్టలతో ఇంట్లోంచీ వచ్చిన సంయుక్తని తీసుకెళ్ళి ఆమెకీ పిల్లలకీ బట్టలు, పెళ్లికని వుంగరం కొన్నాడు శ్రీధర్.
“రేపు మేఘమాల వస్తుంది. తనతో వెళ్లి ఇంటికి కావలిసినవన్నీ తెచ్చుకోండి” అని తన కార్డు ఇవ్వబోయాడు. తీసుకోలేదు సంయుక్త.
“ఎందుకు? నా దగ్గర డబ్బు వుంది. కావలిసినప్పుడు అడుగుతాను ” అంది.
శ్రీధర్ చిన్నగా నవ్వి, ” మీరూ నేనూ ఇక వేరువేరు కాదు. ఒకరిలోకి ఒకరం సింకయామని చెప్పారుగా?” అన్నాడు.
ఆ అమ్మాయి చాలా సాధారణమైనదని అర్థమయింది శ్రీధర్‍కి. చీరలు, నగలు, ఒక చిన్న ప్రశంస, ఒక చిరునవ్వు …అంతకన్నా మరేమీ అక్కరలేదు. పిల్లలని ఆడిస్తూ, తనాడుతూ, అందరినీ నవ్విస్తూ తను నవ్వుతూ , అందరి అవసరాలూ చూస్తూ, మాటపడకుండా మాట అనకుండా అనుభవాల బరువుని దింపుకుంటోంది. తన వునికిని చూపించకుండా వీచి ఆహ్లాదపరిచే పిల్లగాలి తెమ్మెరలా అనిపించింది అందరికీ …శ్రీధర్‍కి.
అతనంటే చాలా ఇష్టం ఆమెకి. కానీ చిన్న సంకోచం.
విషయాలు కొద్దిగా పాతబడ్డాక సంయుక్తని చూడటానికి వచ్చింది శారద. ఆమె దుఃఖం చూడలేక, తనని తను ఓదార్చుకోలేక రాజారావే పంపాడు. అది శ్రీధర్ ఆఫీసులో వుండే సమయం. పిల్లలని మేఘమాల తీసుకెళ్లింది. వాళ్ల కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. ఆమెకి వాళ్లతో గడపడం చాలా సరదాగా వుంది. శ్రీధర్‍కీ, సంయుక్తకీ ఏకాంతం కల్పించటం కోసం కూడా అదొక ప్రయత్నం.
” ఎలా ఉన్నావమ్మా? పిల్లలు ఏరి? బావున్నారా? స్కూలుకి పంపటం లేదట? ” ఆర్తిగా అడిగింది శారద.తల్లిదండ్రుల విషయంలో తన నమ్మకం నిజమైనందుకు సంయుక్త సంతోషపడింది.
“నువ్వెలా వున్నావమ్మా? నాన్న? ” ఆరాటంగా అడిగింది. తన విషయాలన్నీ చెప్పింది.” శ్రీధర్ ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడట. ఏకంగా అక్కడే చేరుద్దామన్నాడు. ఇప్పుడు వాళ్లని అతని పెద్దక్క… ఆరోజు నన్ను చూడటానికి వచ్చిందే ఆవిడ… తీసుకెళ్ళింది”
“మనుషులు మంచివాళ్ళేనా?”
“చాలా”
“నువ్వు కోరుకున్నట్లేనా?”
“అనుకుంటున్నాను “
“ఆరోజు నీ తెగింపు చూసి చాలా భయపడ్డాను సమ్మూ!”
“అతను గవర్నమెంట్ ఆఫీసరు. పెళ్లి చేసుకుంటానన్నాడు. భయం దేనికి?”
“ఏమోనే! నీ బతుకిలా అస్తవ్యస్తం చేసామని నాన్న ఒకటే ఏడుపు. ఆ మనిషిని అలా ఎప్పుడూ చూడలేదు”
“అక్కడే వుంటే ఏం జరిగేదో చెప్పనామ్మా? బావకి మళ్ళీ పెళ్లి చేసేవారు. తర్వాత పిల్లలని లాక్కునేవారు. పిల్లలకోసమని నన్ను అతనికి రెండో భార్యని చేసేవారు…మన ఆస్తి పోకూడదుకదా?”
“అంత ఆలోచించావా నువ్వు?” ఆశ్చర్యంగా అడిగింది శారద.
“అలాగని భయమేసేది”
“నీ బేంకుకార్డు వాళ్లదగ్గరే వుంది. తిరిగివ్వలేదు చూడు. అందులో వున్నదంతా చెక్కు మీద డ్రా చేసేసాను. అకౌంటు క్లోజ్ చెయ్యటానికి నువ్వు కూడా సంతకం చెయ్యాలట. అందుకని అలా వదిలేసాను” అని తను తెచ్చిన డబ్బు ఇచ్చింది.
“ఆ కార్డు బ్లాక్ చేయించి కొత్త కార్డు తీసుకునేదాకా ఇది వాడుకో” అని రాజారావు ఏటీయం కార్డు ఇచ్చింది శారద. “డబ్బుకి అతనిమీద ఆధారపడకు. అలాగని పొగరుమోత్తనంగానూ వుండకు. ఆడవాళ్ళు విలువ కోల్పోయేది డబ్బు లేనప్పుడే. తన డబ్బు మరొకరు ఖర్చు చేస్తుంటే దూబరాగానే అనిపిస్తుంది సంపాదించేవాడికి…అదెంత అవసరమైన ఖర్చైనా. గొడవలూ అసంతృప్తులూ ఎన్నున్నా నేను మీ అత్తలమధ్య నిలబడగలిగానంటే నాకు మా నాన్న ఇచ్చిన పొలం, అమ్మ బంగారం…నా డబ్బు నాకుండటం. అవి లేక వసంత పిన్ని ఇంకా ఎక్కువ కష్టాలు పడుతోంది. దానికి బాబాయ్ కొనే చీరకి కూడా మీ అత్తలు లెక్కలు వేస్తారు. అంత అస్వతంత్రపు బతుకు… కార్డు మీద నీకు కావలిసినప్పుడు తీసి వాడుకో. నాన్న వేస్తుంటారు. మాకున్నది నువ్వేగా?”అంది.
“నాన్నకి నామీద కోపం పోయిందా?” అడిగింది సంయుక్త.
“మనిషికి రెండు ముఖాలుంటాయి. ఒకటి బైటికి చూపేందుకు, ఇంకొకటి మనసనే అద్దంలో మనని మనం చూసుకునేందుకు. సంఘంకోసం కొన్ని డాంబికాలు చూపించక తప్పదు. దాని విలువలకి వ్యతిరేకంగా వెళ్లినప్పుడు మనని మరోసారి నమ్మదు. ఆ నమ్మకం పోగొట్టుకోలేము. తప్పనిసరై చేసానని వొప్పించడానికి ప్రయత్నిస్తాము. ఆ బేరం దగ్గర వున్నారు ఆయన”
” మనం ఇలా ఎప్పుడూ మాట్లాడుకోలేదు ” అంది సంయుక్త.శారద నవ్వింది.
“శేషూవాళ్ళమీద శ్రీధర్ పోలీస్ రిపోర్టు ఇచ్చాడట?”“
“మరి లేకపోతే? వీధిన పడి కొట్టుకోలేముకదా!”
“జయత్త చాలా గొడవచేసింది. ఆమెకి నాన్న భయపడతారు. అదే ఈ గొడవలన్నింటికీ కారణం. అలాగని నిన్ను దూరం చేసుకోలేరు కదా? ఆ మనిషి మనసులోది బైటపడటానికి సమయం పడుతుంది “
“ఇంటికి రానా అమ్మా? నాన్నని చూడాలని వుంది. ఇలా వెలిపడ్డట్టు వుంటే బాధనిపిస్తోంది “
“రా సమ్మూ! వచ్చి నీ వస్తువులన్నీ తీసుకెళ్ళు”
ఎక్కువసేపు వుండలేకపోయింది శారద అక్కడ. అది కూతురి ఇల్లు కాదనిపిస్తోంది. కానీ ఆ కొద్దిసేపట్లోనే ఎంతో గ్రహించింది. శ్రీధర్ అభిరుచులు…అతను చదివే పుస్తకాలు… ఆ ఇంట్లోని వాతావరణం…శేషుకీ అతనికీ గల తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మనిషి చుట్టూ వుండే సహజ వాతావరణం అతని మనసుకి అద్దం పడుతుంది. ఆ వాతావరణం కృత్రిమంగా వుంటే చూసేవారికి వారి సహజజ్ఞానంవల్లనో, అనుభవంవల్లనో, వయసువల్లనో తెలిసిపోతుంది. హాని కలగనంతవరకూ ఎవరూ పట్టించుకోరు. తెలుసుకోలేరు కాబట్టి ఆడపిల్లలు మోసపోతున్నారు. సంయుక్తకి అనుభవం వుంది. అందుకే శ్రీధర్‍ని సరిగానే అంచనా వేసింది. శారదకి వయసూ, అనుభవం రెండూ వున్నాయి. అర్థమయింది. మనసుకి సాంత్వన కలిగింది. ఇంటికొచ్చాక రాజారావుకి చెప్పింది.
“దాన్నొకసారి ఇంటికి పిలిపించుకుంటాను. అక్కడేం మాట్లాడలేకపోయాను” అంది. అతను తలూపాడు. విషయం తెలుసుకుని జయలక్ష్మి గొడవచేసింది.
“కూతుర్ని వదిలిపెట్టి శారద వుండలేదక్కా! బెంగపెట్టుకుని చచ్చిపోయేలా వుంది” అన్నాడు.
“ఇంకేం? నువ్వూ వెళ్ళు . కూతురు నీకూ అపురూపమేగా?” ఎద్దేవా చేసింది. అతను నిర్వేదంగా నవ్వాడు.
“మంచికో చెడుకో అది అలాంటి పని చేసింది. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా వుండరు. మాకున్నది ఒక్కర్తి. అన్ని అవలక్షణాలతోనూ పుట్టిందనుకో. తెలివితక్కువది. అమాయకురాలు. అందుకని నష్టపోవాలని అనుకోలేంకదమ్మా? అది సుఖంగా వుండాలనే కోరుకుందాం. మా సంతోషం దానితోనే అని నాకు అర్థమైంది… అది మా దగ్గరున్నా, ఎక్కడున్నా ” అన్నాడు రాజారావు. ఆయన గొంతు వణికింది. “శేషుకికూడా మంచి సంబంధం చూసి చేద్దాం”
“నువ్వేదో కలలు కంటున్నావుగానీ, పూర్ణకుంభాన్ని తన్నుకుని, ఎండమావి వెంట పరిగెత్తింది. ఆవిషయం అర్థమైన రోజునకూడా నిన్ను వోదార్చటానికి నేనే వస్తాను” అని జయలక్ష్మి అంటుంటే రాజారావు అక్కడినుంచి లేచి వెళ్ళిపోయాడు.
సంయుక్తని తామెవరూ కలుపుకోకూడదని నిర్ణయించుకుని మిగిలినవాళ్ళంతా ఆవిడకి దన్నుగా నిలబడ్డారు. అయ్యో! అక్కయ్య ఎంత బాధపడుతోంది అనుకుంటున్నారుగానీ, అన్నయ్యకెంత కష్టం వచ్చిందని అనిపించట్లేదు. ఆయనది స్వయంకృతం…వాళ్లకి.
“వేసెయ్ అక్కయ్యా, బావగారికొక వీరతాడు” శారదతో అని నవ్వింది వసంత.