తిరస్కృతులు – 26 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“స్లీపింగ్ పిల్స్ ఎందుకు వాడుతున్నావు? వంట్లో బావుండట్లేదా? డాక్టరుకి చూపించుకున్నావా? ఏమన్నాడు?” అడిగాడు. అడిగి, నా జవాబుకోసం చూడకుండా, “సంతోషం లేదు. కోరి తెచ్చుకున్న కష్టాలు. అంతేనా?” అడుగుతూ పిల్లలు పడుకున్న గది తలుపులు దగ్గరగా వేసి వచ్చాడు.
“నీతో చాలా మాట్లాడాలి. అందుకే ఆగిపోయాను” అన్నాడు. ఇద్దరం హాల్లోకి వచ్చాము. అక్కడి సోఫాలో కూర్చున్నాడు. నేను తనకి ఎదురుగా వున్న మరోదాంట్లో కూర్చున్నాను. నేను కూర్చున్నచోటినుంచీ చూస్తుంటే ఆరోజు ప్రమీలాదేవి వచ్చి అక్కడే కూర్చోవటం గుర్తొచ్చింది.
“ఇప్పుడు చెప్పు, పెళ్ళెందుకు మానేసావు?” అతని గొంతు తీవ్రంగా వుంది. తను చెప్పినట్టు చెయ్యనందుకు కోపంగా వున్నాడు. కానీ, ప్రభాకర్‍గురించి, అతనితో నా పెళ్ళిగురించి మొదట్లో పడ్డంత వుద్రేకం ఇప్పుడు పడటంలేదు.
“ఎన్నిసార్లు చెప్పను, ఒకే విషయాన్ని?”
“నిన్నూ పిల్లల్నీ వదిలిపెట్టి నేనుమాత్రం వుండగలనని నువ్వెలా అనుకున్నావు?”” అతని గొంతు ఖంగుమంది. నేను తీక్షణంగా చూసానతన్ని. “ఐతే, నాదా తప్పు?” అడిగాను.
“సరే, మనిద్దరిమధ్యా సరిదిద్దుకోలేనంతగా విబేధం వచ్చింది. సుఖంగా బతకగలిగే మార్గాలన్నీ వదిలేసి, అందరం కట్టకట్టుకుని కష్టపడేలా చేస్తున్నావ్. కనీసం అది నీకు అర్థమౌతోందా?”
“నువ్వు అనుకునే సుఖాలు లేకపోయినా మనుషులు బతకచ్చు. కార్లలో తిరక్కపోవటం, మార్బుల్ ఫ్లోరింగ్, సెంట్రలైజ్‍డ్ ఏసీ లేకపోవటం ఇవేనా , నువ్వనుకునే సుఖాలు? అవేవీ లేకుండానే నేను పెరిగాను. ఈ యింట్లో పుట్టాను. ఈ గచ్చుమీద పాకుతూ పెరిగాను. పిల్లలూ పెరుగుతారు”
“నేనలా పెరగలేదు. నా పిల్లలు అలా పెరగాలని నేను కోరుకోను” కచ్చితంగా వుంది అతని జవాబు. “ఇప్పుడెక్కడ రాజీ చేసుకుందాం?” అడిగాడు. నేనేం మాట్లాడలేదు.‍
“డబ్బు లేకపోయినా బతకచ్చు. నిజమే. ఐతే నా ప్రశ్న… వున్నాకూడా లేనట్టు ఎందుకు బతకాలని. నీకు డబ్బక్కర్లేదు. కానీ సుధా సుమలు నాకున్నదాంట్లో పావువంతు వారసులు. వాళ్లెందుకు కష్టాలుపడుతూ బతకాలి?”
“…”
“జరిగిన విషయంలో నువ్వింకా సమాధానపడలేదని నాకు తెలుసు. ఆఫీసులో వుండగా హఠాత్తుగా స్ట్రోక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‍కి మూవ్ చేసారు. ఐసీయూలో వుంచారు. నీ విషయంలో అప్పటికి నేను ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. బైటికి వెళ్తే ప్రమీల బోలెడంత నగానట్రా పోగేసుకుంటుంది. నువ్వు బంగారం కొనుక్కోవు. నీకు అక్కర్లేదు. డబ్బు కూడా నీకు అక్కర్లేదు… అన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి. అంతా సవ్యంగా జరిగిపోతుంటే మనిషి ఏవిధంగా నిర్లక్ష్యంగా వుంటాడో అలా నిర్లక్ష్యం చేసాను. పరిస్థితులు తలకిందులయ్యాయి. నీకు హాని తలపెట్టవద్దని ప్రమీలని అడిగాను. బదులుగా నిన్ను దూరం పంపించమంది. పిల్లల్ని వదిలిపెట్టి వుండలేనన్నాను. తను పెంచుతానంది. సరేననక తప్పని పరిస్థితి. పిలిపించి నీతో ఆ విషయం మాట్లాడతానంది. అంతదాకా ఎంతో సంయమనంతో వున్న వ్యక్తి నిన్ను చూడగానే బరస్టైంది”
“నీ ఎదురుగా తను నన్ను అవమానం చేస్తుంటే నువ్వు చూస్తూ వూరుకున్నావు”
“నాకు నీ క్షేమం ముఖ్యం. తనతో వాదన కాదు”
“నువ్వే నాతో యీ విషయాలు ఆమె వచ్చేలోగా మాట్లాడవచ్చు. ఆరోజుని నేను నీలో మరో మనిషిని చూసాను. చాలా అసహ్యం వేసింది. నీమీదేకాదు నామీదకూడా”
నేనన్న మాటలకి రాజ్ చాలా హర్టయ్యాడు. అతని ముఖం మానమైంది. అతన్ని అవమానించాలని నేనలా అనకపోయినా, ఆరోజు నేను పడ్డ బాధ యిప్పుడతని అనుభవంలోకి వచ్చింది.
“ప్రమీల నీ విషయంలో అంత సంఘర్షణ పడ్తోందని నేనెప్పుడూ వూహించలేదు. అన్ని రొటీన్ విషయాల్లాగే దీన్ని తీసుకుని మధ్యమధ్యలో తన అసహనాన్ని చూపిస్తోందనుకునేవాడిని. కానీ ప్రేమనీ- పెళ్లినీ, నిన్నూ- తననీ పోల్చుకుని చూస్తోందనుకోలేదు. అసలా అవసరం ఏముంది? ఆమె మాటలు నీకు బాధనిపించినా అర్థం చేసుకుంటావనుకున్నాను. ఎందుకంటే మనం ఆమెకి అంతకన్నా ఎక్కువే బాధని యిచ్చాము” అన్నాడు. చాలాసేపటికి తనున్న స్థితిలోంచీ తేరుకుని.
నేను తలదించుకున్నాను. సరిగ్గా యిలాంటి భావనే యిప్పుడిప్పుడు నాకు కలుగుతోంది.
“ఆమె కోణంలోంచీ ఆలోచించడం ప్రారంభించాక నాకే అనిపించింది, తప్పు చేసినట్టు. నీతో పరిచయం కాకముందు చాలా రుత్‍లెస్‍గా వుండేవాడిని. తనని పట్టించుకునేవాడిని కాదు. అప్పుడు లేని బాధ ఆమెకి తర్వాత కలిగింది. నిన్ను దూరంగా పంపించాక కూడా తను సంతోషంగా లేదు. ఏదో తప్పుచేసినట్టు ఫీలయ్యేది. అపరాథభావన తన కళ్లలో కనిపించేది. పిల్లల్ని హాస్టల్లో వేసాను. వాళ్లని యింట్లోనే వుంచమని చెప్పడానికి తనకి అహం అడొచ్చింది. ఒక్కర్తీ గదిలో కూర్చుని ఏడుస్తూ వుండేది. బిజినెస్ పూర్తిగా వదిలేసింది. అలా తనని నేనెప్పుడూ చూడలేదు. నా ప్రవర్తనకి జవాబులా, నన్ను లెక్కపెట్టనట్టుగా పొగరుగా వుండేది తను. తనలా వున్నందుకే నేనిలా తయారయ్యానని సమర్ధించుకునేవాడిని నేను. అంతా తను కోరుకున్నట్టే జరిగినా ఇంకా ఎందుకు బాధపడేదో తెలిసేది కాదు. మామధ్య రిలేషన్‍షిప్ బాగా స్ట్రెయినైంది. మరోవైపు సుమ బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంది. ఇద్దర్నీ ఇంటికి తీసుకొచ్చేసాను. ప్రమీల రియాక్షన్ ఎలా వుంటుందోనని భయపడ్డాను. కానీ తను వీళ్లని చాలా బాగా చూసుకుంది. తద్వారా మళ్లీ నాకు దగ్గరవాలనుకుందేమో తెలీదు. తనని అంత తక్కువగా అనుకోలేను” అన్నాడు.
అతనలా చెప్తుంటే మామధ్యనున్న అడ్డుగోడ లాంటిదేదో కరిగిపోతున్నట్టనిపించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవటమంత గొప్ప ఆయుధం మరొకటి లేదు. అతనిపట్ల నాలో మళ్లీ వెనుకటి ప్రేమ పుట్టకపోయినా జరిగిన సంఘటనలని పారదర్శకమైన దృష్టితో మళ్ళీ చూస్తాననేది నిర్వివాదాంశం.
“ఆమె మొదట్నుంచీ అలాగే వుండేదా?” అడిగాను.
“ఏ విషయంలో?”
“నా విషయంలో”
“లేదు. మొదట్లో చాలా మామూలుగా కొన్నాళ్ళ వ్యవహారంలా తీసుకుంది. నాలో మార్పొస్తున్నకొద్దీ ఆమె ఆలోచనల్లో కూడా మార్పొచ్చింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తుండటం చూసాక ఇంకా మారింది” అతను ఆగాడు. అతని నిస్సహాయతని ఆధారంగా చేసుకుని ఆమె నన్ను అవమానించిందనే విషయాన్ని వదిలేస్తే యీ సమస్యకి ఎన్నో కోణాలు.
“చనిపోయినరోజు ఆమె యిక్కడికి వచ్చింది” సంకోచంగా చెప్పాను. రాజ్ చప్పుని తలతిప్పి చూసాడు. తన కళ్లలో ఆశ్చర్యం, అపనమ్మకం… నా దగ్గరకొచ్చి, గట్టిగా నా భుజం గుచ్చి పట్టుకున్నాడు. “ఇక్కడికా?” అడిగాడు.
తలూపాను. “పిల్లల్ని తనతో పంపించమని అడిగింది. నేను పెళ్లి చేసుకుని, స్థిరపడితే బావుంటుందని చెప్పింది”
“నిజంగానా వసూ? నేను… నేనింకా నమ్మలేకపోతున్నాను”
“నేనే నమ్మలేకపోతున్నాను””
“ఇంకేం మాట్లాడింది?”
“నువ్వన్నట్టు నేను డబ్బుకి దొరికే వస్తువునో అలాంటి మనిషినో అయితే ఆమె యింతగా మాట్లాడేది కాదు. కానీ నేను నీతో వున్న ఆరేళ్లలో డబ్బు పోగేసుకోలేదన్న విషయం ఆమెని పజిల్ చేసింది. రాజ్! ఆపరేషనప్పుడు నా గురించి అడిగావా?”
“అందులో తప్పేముంది? అవే ఆఖరి క్షణాలౌతాయేమో! కావల్సినవాళ్లందర్నీ చూసుకోవాలని వుండదా? నువ్వొస్తానని ఆఖరిదాకా చూసాను. ఆఖర్లో కూడా అడుగుతూనే వున్నాను. మళ్లీ తెలివిరాగానే అడిగాను”
“అదే ఆమె మనసుకి తీసుకుంది”
“అర్ధం కావట్లేదు. ప్రమీలా, పిల్లలూ ఎదురుగా వున్నారు. మీ ముగ్గురూ కనిపించలేదు. ఎదురుగా లేనివాళ్ల గురించి అడగరా? అడక్కుండా ఎలా? ఆరాటం ఆపుకోలేకపోయాను”
“నీకంటే నేను కావాలి. కానీ ఆమెకి? నేను ప్రత్యర్ధిని. విరోధిని. నీ ఆరాటాన్ని ఆమె అపార్థం చేసుకుంది. అదే ఆమెని బాగా బాధపెట్టింది””
“ఔనా?!”
“నీతో ఇవన్నీ చెప్పిందా?” తలూపాను.
“ఇంకేం మాట్లాడింది?”
“చాలా బాధపడ్డట్టనిపించింది. నువ్వెప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదా?”
“బాధా? తనకేం బాధ? చేతినిండా డబ్బు. ఏ వూరేనా వెళ్ళాలనుకుంటే ముందు అక్కడి నగలు, బట్టలదుకాణాలు, ఖరీదైన హోటళ్ళ గురించి వివరాలన్నీ తెలుసుకునికానీ బయల్దేరేదికాదు. విలాసవంతమైన జీవితం. స్వంత వ్యాపారాలున్నాయి. నా వ్యాపారాల్లో తనకీ వాటాలున్నాయి. పుట్టింటివాళ్ళు గొప్ప ఆస్తిపరులు…”
నాకు విస్మయం కలిగింది. ఆమె ఏ కృత్రిమ విలువల్లోనైతే నమ్మకాన్ని పెంచుకుని, ఆత్మవంచన చేసుకుందో వాటిని అతను నిజంగా నమ్మటం.
“ఆరోజుని నాతో వేటి గురించైతే వ్యతిరేకంగా వాదించిందో, వాటిని మళ్లీ తనే వప్పుకుంది నా దగ్గిరకొచ్చి. గమ్మత్తనిపించింది” అన్నాను.
చాలాసేపటి తర్వాత రాజ్ చాలా సంకోచిస్తూ అన్నాడు.
“వసూ! ప్రమీల లేదు. నాతో వచ్చెయ్యకూడదూ? మా యింటికి తీసుకెళ్తాను.”
అతనిలా అడుగుతాడని నేనూహించిందే కాబట్టి ఆశ్చర్యమేమీ కలగలేదు. జవాబు కూడా ముందే ఊహించి పెట్టుకున్నాను. అదే చెప్పాను. “ఆమె స్థానం ఆమెదే. నా స్థానం నాదే. నేనిప్పుడు నీ భార్య స్థానంలోకి వచ్చినా నన్నెవరూ అలా గుర్తించరు. ఇన్నాళ్లూ బైటెక్కడో వుంచాడు. ఇప్పుడింక అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ఏకంగా ఇంటికే తీసుకొచ్చాడు” అంటారు.
అతని ముఖం ఎర్రబడింది. “పోనీ, యింకెక్కడేనా వుందాం”
“అంతకన్నా గొప్పగా మాట్లాడరు” అని, నవ్వేసాను. “ఇంక నాకా ఆసక్తి లేదు. రాజ్! నీతో నేను ఎంజాయ్ చేసాన నుకుంటున్న టైంలో ఇక్కడ నా తల్లిదండ్రులు అనేక సమస్యల్లో వున్నారు. నేను ఎంజాయ్ చేసాననుకున్నది వాస్తవమా కాదా అనే విషయం యిప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. అలాంటి అనిశ్చిత సుఖం నాకొద్దు. నాకు పిల్లల బాధ్యతే కాదు, మా అమ్మా నాన్నలని కూడా చూసుకోవలసిన అవసరం కూడా వుంది. నాకిప్పుడు నలుగురు పిల్లలు”
” ఏం చేస్తావు? వంటరిగా ఎలా వుంటావు?” ఆవేదనగా అడిగాడు.
నేను చిన్నగా నవ్వాను. “ఇప్పడది అంత అర్జెంటుగా రాత్రికి రాత్రికే నిర్ణయించుకోవలసిన విషయమా?”
“నువ్వు చాలా మొండిదానివి. నా మాట విని, నాతో వచ్చెయ్. అనేవాళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే వుంటారు” అన్నాడు.
“వద్దు. ఆ విషయం తప్పించి యింకేదైనా చెప్పు”
“ఎందుకని? అంతగా మనసు విరిగిపోయిందా నామీద?”
“ఆ సంబంధం లోకం దృష్టిలో ఎంత తక్కువదో అర్ధమయ్యాక రావానిపించడంలేదు.”
“పోనీ ఫారెన్ వెళ్తావా? చదువు కంటిన్యూ చెయ్యచ్చు. అక్కడుండి చదువుకో. మంచివాళ్ళెవరేనా తటస్థపడితే పెళ్లి చేసుకుని సెటిలవ్వచ్చు. మీ అమ్మానాన్నా పెద్దవాళ్లు. నీతో చివరిదాకా రారు. నువ్విక్కడ లేకపోయినా వాళ్ల మంచీచెడూ నేను తెలుసుకుంటుంటాను. నేను నీకు అన్యాయం చేసానంది ప్రమీల. అదేమిటో ఇప్పుడు తెలుస్తోంది. అమాయకంగా నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీకు మంచీచెడూ చెప్పి వారించి పంపించే వయసు వుంది అప్పుడు నాకు. కానీ అలా చెయ్యలేదు. కళ్ళు మూసుకుపోయాయి. స్వార్థం చూసుకున్నాను ” అన్నాడు బాధపడ్తూ.
“ఇప్పుడప్పుడే నాకేదీ చెయ్యాలని లేదు. ఆలోచించుకునే టైం యివ్వు. జరిగిన సంఘటనల ప్రభావంలోంచీ ఇంకా తేరుకోలేదు. కొత్త సంఘటనలని కోరుకోవట్లేదు. పిల్లల చదువులగురించి ఆలోచించి చెప్తాను…అవన్నీ వదిలిపెట్టు… మీ పిల్లలగురించి చాలా బాధపడింది ఆమె”
“తనకి నువ్వు పెద్ద చుట్టానివెలా అయావు?” ఆశ్చర్యంగా అడిగాడు.
“మీయిళ్ళలో జరిగిన ఎన్నో విషయాలు ఆమెని బాధపెట్టాయి. ఎప్పట్నుంచీ అలా ఆలోచిస్తోందో తెలీదు, బయటపడింది మాత్రం ముందు మనిద్దరినీ తర్వాత నీతో సుధాసుమల్నీ చూసాక” నాతో అన్న విషయాలు చెప్పాను.
“పెద్దాడు చాలావరకూ ప్రమీల పుట్టింట్లో పెరిగాడు. బాగా మొండిగా తయారయ్యాడు. చెప్పినమాట అసలు వినడు. ఏదేనా హాస్టల్లో వెయ్యాలనుకుంటున్నాను. చిన్నాడు అసలు నా దగ్గిరకే రాదు. ఎంతసేపూ వాడికి అమ్మ కావాలి. బాగా బెంగపడ్డాడు. నాకూ వాడి విషయమే బెంగగా వుంది” అన్నాను.
“హాస్టల్లోనా? వద్దు. హాస్టల్లో వుండే పిల్లలు ఇంటిని ఎంత మిస్‍చేస్తారో నాకు తెలుసు. నీదగ్గిరే వుంచుకుని వెంట వెంట తిప్పుకుంటూ వాళ్ళని దార్లోకి తెచ్చుకో. పసివాళ్ళు వాళ్ళు. బుజ్జగిస్తే ఎంతలో దగ్గిరకి వస్తారు? మగపిల్లలుకదా, సుధాసుమల్లా సున్నితంగా వుండరు. నువ్వే నీ పద్ధతులు మార్చుకోవాలి యిక” అన్నాను.