తిరస్కృతులు – 29 by S Sridevi

  1. తిరస్కృతులు – 21 by S Sridevi
  2. తిరస్కృతులు – 22 by S Sridevi
  3. తిరస్కృతులు – 23 by S Sridevi
  4. తిరస్కృతులు – 24 by S Sridevi
  5. తిరస్కృతులు – 25 by S Sridevi
  6. తిరస్కృతులు – 26 by S Sridevi
  7. తిరస్కృతులు – 27 by S Sridevi
  8. తిరస్కృతులు – 28 by S Sridevi
  9. తిరస్కృతులు – 29 by S Sridevi
  10. తిరస్కృతులు – 30 by S Sridevi
  11. తిరస్కృతులు – 31 by S Sridevi

“స్టేషన్లో పార్క్ చేస్తాను. ప్రభాకర్‍తో చెప్పండి. కొండపల్లి పంపించమని” కార్లో కూర్చుంటూ చెప్పాను. డోర్ వెయ్యబోతుంటే నా చేతిమీద తన చెయ్యి వేసి ఆపింది గీత. ఏమిటన్నట్టు చూపాను.
“నేను అన్నీ తెలిసే, యిష్టపడి ప్రభాకర్ని చేసుకున్నాను. పెళ్లికి ముందు మనకి ఎందరో కలుస్తారు. వాళ్లలో ఒకరో యిద్దరో మనసుకి దగ్గరగా కూడా రావచ్చు. వాళ్ల విషయంలో ఏవో వూహించుకున్నా అవి జరగకపోవచ్చు. మీయిద్దరి గురించి నేను అలాగే అనుకున్నాను. ప్రభాకర్ కూడా నన్నెప్పుడూ బాధపెట్టలేదు. మిమ్మల్ని చేసుకోలేకపోయినందుకు అతనికి బాధ వుందేమో. దాన్నెప్పుడూ బైటపెట్టలేదు. కానీ… మిమ్మల్ని చూసాక… మీ సమక్షంలో అతను పొందుతున్న ఆనందం మా పెళ్లయాక యిప్పటివరకూ నేను చూడలేదు. మిమ్మల్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి వుండటం ఇష్టంలేనట్టు మీ చుట్టూ తిరుగుతున్నాడు. అతను జడపదార్థంలా వున్నా ఫర్వాలేదుగానీ అతన్లోని చైతన్యం. మీరు నింపేదైతే నేను భరించలేను. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. అతన్ని మర్చిపోండి” అంది నెమ్మదిగా నా చెయ్యి వదిలి, రెండు చేతులూ జోడిస్తూ.
“ప్రభాకర్, మైకేల్ మాట్లాడుకుంటుంటే ఎప్పుడేనా చూసారా?” మృదువుగా అడిగాను. చూసానన్నట్టు తలూపింది. ఇద్దరూ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఒకొక్కసారి నవ్వొచ్చేది నాకు, ఈ యిద్దరు మొద్దవతారాలూ అన్నేసి గంటలు ఏం మాట్లాడుకుంటారా అని.
“ప్రభాకర్, మైకేల్, వసంత… అంతే. మేం పెళ్ళిచేసుకోవాలనుకున్నది ఒక తప్పు ప్రతిపాదన. జరిగి వుంటే ఒక డిజాస్టర్‍గా ముగిసేది” అన్నాను.
వెనక్కి జరిగి డోర్ వేసింది. నేను ఒక్క క్షణం అలాగే చూసి, కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాను.
నువ్వెవరు, మా జీవితాలని నిర్దేశించడానికి? అని అడిగింది ప్రమీలాదేవి. అతని జీవితంలో సంతోషం నింపేది నువ్వైతే అలాంటి సంతోషమే తనకి అక్కర్లేదంటోంది గీత. వీళ్లిద్దరికీ హక్కులూ అధికారాలూ వున్నాయి. వాటితో తమ మగవారిని శాసిస్తున్నారు. కానీ నేను? ఎవరికీ చెందను, ఎవరిమీదా ఎలాంటి హక్కులూ లేవు… వాళ్లు నన్నెంత కోరుకునేవారైనాగానీ నేను, నా జీవితం, నా యిష్టం… అంతే! వంటరి నక్షత్రంలాంటి నేను.
వాచీ చూసుకున్నాను. ఇంకా టైముంది. స్టేషనుకి వెళ్లే దార్లో ఒక ట్రావెల్ ఏజన్సీలో కారు యిచ్చి నా ఎడ్రస్‍కి పంపించమని చెప్పాను.
అక్కడినుంచీ ఆటోలో స్టేషన్‍కి చేరుకున్నాను. బయల్దేరినట్టు నాన్నకి ఫోన్‍చేసి చెప్పి, టిక్కెట్టు కొనుక్కునేసరికి ట్రెయిన్ వచ్చింది. ఎక్కి సీటు వెతుక్కుని కూర్చున్నాను. కిటికీలోంచి బైటికి చూస్తే ప్రభాకర్ ఆదుర్దాగా అటూయిటూ తిరుగుతూ కనిపించాడు. నా కోసం వెతుకుతున్నాడు.
ఎందుకు ఇతన్నింతగా బాధపెడ్తున్నాను? పెళ్లి చేసుకోవాలనుకుని, చేసుకోవటం కుదరకపోతే ఆ వ్యక్తులు యింక కలుసుకోకూడదా? గీతకి భయపడుతున్నానా? చెళ్లుమని చరిచినట్టయింది. మళ్ళీ ఇంకో ఆలోచన… తల్లీ, భార్యా తను లేనప్పుడు నన్నేమైనా అన్నారని అనుకుంటాడేమో! టైము చూసుకున్నాను. రైలు కదలటానికి ఇంకో పదినిముషాలుంది. కిందికి దిగాను. అతను నావైపే వస్తున్నాడు.
“ఇంతరాత్రి బయల్దేరటమేమిటి? నేను వచ్చేదాకానేనా వుండద్దా? పద, ఇంటికి వెళ్దాం” అన్నాడు.
“ట్రయిన్ టైమౌతోందని వచ్చేసాను. మళ్ళీ ఇంకోసారి వస్తాను” అన్నాను.
“నాకు తెలుసు, నువ్వు రావు. ఇదే నేను నిన్ను ఆఖరిసారి చూడటం” అన్నాడు.
“అదేం మాట? నేను దేశం వదిలిపోవటంలేదు” అన్నాను. నెమ్మదిగా మాటలు మొదలయాయి.
నేను వచ్చేసాక తను ఏమేం చేసాడో ఏమేం కొన్నాడో, భార్య ఎంత బాగా సహకరిస్తోందో చెప్పాడు. పికిల్ యూనిట్ పెట్టారట. నన్ను నేనొక మగవాడిగా వూహించుకున్నాను, అతను చెప్తుంటే. అప్పుడు ఈక్వేషన్ సరిపోయింది. చాలాకాలంతర్వాత కలుసుకున్న స్నేహితుల్లా అనిపించాం నాకు మేము. మామధ్య పెళ్ళి ప్రస్తావన, ఆ అధ్యాయం చెరిగిపోతే బావుండేదనిపించింది. రైలు కూతకూసి కదిలింది. నేను చప్పుని ఎక్కేసాను. అతను చెయ్యూపుతూ నిలబడి వుండిపోయాడు.
గీత నేను క్షేమంగా చేరానో లేదో తెలుసుకుని పెట్టేసింది. మామధ్య ప్రభాకర్ వూసు రాలేదు.


వెంటవెంటనే జరిగిన ఈ రెండు మరణాలూ నన్ను బాగా కదిలించాయి. ఈ విశ్వమంతా ప్రేమమయం అనేట్టు ఎన్నో ప్రేమకథలు, నాలాంటి త్రిశంకుస్వర్గపు జీవితాలు, ప్రేమకోసం చావులు…
అప్పటిదాకా మామూలుగానే వుంటారు మనుషులు. హఠాత్తుగా ఒక వ్యక్తి పరిచయమౌతారు. ఒక విద్యుత్తరంగంలాంటిది వళ్లంతా ప్రవహించి మనసుని జాగృతం చేస్తుంది. ఆ వ్యక్తితో స్నేహం చెయ్యాలనీ, వాళ్ళతో సన్నిహితంగా గడపాలనీ అనిపిస్తుంది. ఆ కోరిక పేరే ప్రేమా? కాదు. చాలాకొద్దిమందిలో మాత్రమే స్త్రీపురుష ప్రవృత్తులు వ్యక్తమౌతాయి. అప్పుడుకూడా అది ప్రేమ కాదు. మగవారి శరీరం వుత్పత్తి చేసే కోటానుకోట్ల స్పెర్మటొజోవా తన స్పెసీస్ పెర్పెట్యువేట్ కావాలనుకుని వుత్తేజితమౌతుంది. అందులో శాశ్వతమైన బంధాన్ని గురించిన ఆలోచన వుండదు. ఒకవేళ అలాంటి ఆలోచన చేసినా, అది సొసైటల్ కండిషనింగ్. అంతే. స్త్రీకి తన హద్దులు తెలుసు. పర్యవసానాలూ తెలుసు. ఆమె ఎండమావిగా మారిపోతుంది. అతను పరుగు మొదలుపెడతాడు. ఈ పరుగులో అతనికి వేరే ఆకర్షణలు కనిపిస్తే ఆగుతాడు, ఆవైపు మరలుతాడు. లేకపోతే ఆ ఎండమావినే ప్రేమ అనుకుని మనసులో పెట్టుకుంటాడు.
మైకేల్ చదువుకుంటూ వున్నరోజుల్లో ప్రమీలాదేవిని చూశాడు. ప్రేమించాననుకున్నాడు. అందుకోసం… అంటే ఆ భావనకోసం దెబ్బలు తిన్నాడు, కోలుకున్నాడు. చదువైంది, ఉద్యోగం రాలేదు. వయసు వచ్చింది, పెళ్ళవలేదు. ఆ ఎండమావి చుట్టే ఆలోచనల ప్రపంచాన్ని నిర్మించుకుని దాన్నికూడా ప్రేమే అనుకున్నాడు. అలా అనుకోవటాన్ని ప్రేమించాడు. ఆమె రూపు ఇప్పుడు, ఇన్నేళ్ళ తర్వాత అతనికి గుర్తుకూడా వుండి వుండకపోవచ్చు. ఐనా దాన్ని జీవధారగా చేసుకుని బతికాడు.
ఈ విషయంలో ప్రమీలాదేవి కరెక్టు. ఆమె ప్రేమని నమ్మలేదు. పెళ్ళికోసం ఎదురుచూసింది. పెళ్ళిచేసుకున్న వ్యక్తితో అనుబంధం ఏర్పరుచుకుంది. మైకేల్ ప్రేమ ఆమెకి ఏరిపారెయ్యాల్సిన సమస్యలా అనిపించి వుంటుంది. వంటిమీద వాలిన క్షుద్రకీటకాన్ని విదిలించేసినట్టు విదిలించి వుంటుంది.
ఒక్కసారి కమ్చీదెబ్బ తిన్నట్టు అనిపించింది. నేను… నేనూ అంతేగా! ఇంకా పూర్తిగా స్పష్టమవకుండా వున్నదేదో విడిపోయింది. పెద్ద దు:ఖపు కెరటం విరుచుకుపడింది. నేను అలా ఏడుస్తుంటే అమ్మమ్మ నిశితంగా చూసింది. పిల్లలని నా దగ్గరికి రానివ్వకుండా బొమ్మలముందు కూర్చోబెట్టింది.
అమ్మకి ఫోన్ చేసి మాట్లాడింది.
“ఏమే, అది ఇద్దరు చంటిపిల్లల్ని వేసుకుని వచ్చి నా యింటిముందు నిలబడింది. మనసు చెరువైపోయింది. లోపలికి పిలిచి ఆదరించాను. అక్కున చేర్చుకున్నాను. భర్తతో కలిసి వస్తే దెబ్బలాడినా, కోప్పడ్డాను. ఒక్కర్తే వచ్చింది. తర్వాతకదా, అతని రాకపోకలు? అతన్తో దెబ్బలాడదామన్నా భార్యపోయిన కష్టంలో వున్నాడు. ఇది అతన్తో వెళ్లనని కూర్చుంది. పోనీ అదే మాటమీద ధ్యైర్యంగా వుంటోందా అంటే లేదు. పగలూ రాత్రీ ఒకటే ఏడుపు. నేను చూడట్లేదనుకుంటోందిగా అన్నీ కనిపిస్తునే వున్నాయి. తిండి సరిగా తినదు. నీకు బాధ్యత లేదా? అతను వచ్చాడని అలిగి వెళ్ళినదానివి, మళ్ళీ రాలేదు. కావాలనుకున్నా, వద్దనుకున్నా అతను దాని యిద్దరు పిల్లలకీ తండ్రి. వద్దనుకుంటున్నది అది. అతనుకాదు. ఆ దిక్కుమాలిన వుద్యోగం వదిలేసి వచ్చి యిక్కడుండి దానికోదారి చూపిస్తే మంచిది. ఎంత వయసొచ్చినా నీకది పిల్లేకదా?” అంది.
అమ్మావాళ్ళు రాత్రికల్లా దిగేసారు. వాళ్ళకి బోనస్‍లా రాజ్ మరోవైపునించి వచ్చాడు. ముగ్గురూ హాల్లో ఎదురుపడ్దప్పుడు అమ్మ లేచి వెళ్ళిపోబోయింది. నేను తన చెయ్యి పట్టుకుని ఆపాను.
“రాజ్, మా అమ్మా, నాన్న” అన్నాను. అతనెవరో వాళ్ళకి తెలుసుకాబట్టి ఇంక చెప్పలేదు. అతను వాళ్ళకి నమస్కారం చేసాడు.
“మీరిద్దరు మాట్లాడుకోండి” అని ముందు అమ్మ, వెనుక నాన్న అక్కడినుంచీ వెళ్ళిపోయారు.
నేను చాలా అలిసిపోయి వున్నాను. అతను బాగా నిస్పృహలో వున్నాడు. ప్రమీలాదేవి మరణం అతన్ని బాగా కృంగదీసింది. ఆమె వున్నప్పుడు వాళ్ళ వ్యాపారాలన్నీ చూసుకునేది. పిల్లల బాధ్యత పూర్తిగా ఆమెదే. ఇప్పుడలాకాదు. ఆమె వదిలివెళ్ళినవన్నీ ఇతనిమీద పడ్డాయి. చాలామంది మగవారు అలాంటి బాధ్యతలని తగిలించి తను తప్పుకోవడానికి చిలక్కొయ్య వెతుక్కుంటారు. అది మరోపెళ్ళి. ఇతనికి నేను.
“నిన్ను యింటికి తీసుకొచ్చేస్తానని అందరూ భయపడిపోతున్నారు. అందులో అంత భయపడే విషయం ఏముందో నాకు అర్థం కావటంలేదు. సరే, నువ్వు రానన్నావు… రావని చెప్పాను. ఐనా వాళ్ళెవరూ నమ్మడం లేదు. నా ప్రతికదలికమీదా నిఘాయే. చిన్నాడు ప్రమీలకోసం బెంగపెట్టుకున్నాడు. విడవకుండా జ్వరం… కలవరింతలు…ఏడుస్తున్నాడు. నాకు చాలా భయంగా వుంది ” అన్నాడు. పెద్దకొడుకు చాలా అగ్రెసివ్‍గా వున్నాడట. ఇంకా చాలా కంప్లెయింట్లున్నాయి.
రాజ్ చెప్పినదంతా చాలా ప్రశాంతంగా… లేని వోపిక తెచ్చుకుని విన్నాను.
“వాళ్ళకి నువ్వు కన్నతండ్రివి. నువ్విలా నిముషానికోసారి ఇక్కడికి వచ్చేస్తుంటే వాళ్ళు అలానే అనుకుంటారు. ఇంక పూర్తిగా కుటుంబాన్ని పట్టించుకోవనిపిస్తుంది. అక్కడే వుండి, పిల్లలని దగ్గిర చేసుకోవాలి. ప్రమీలాదేవికోసం, పిల్లలకోసం నాదగ్గర బాధపడితే వాళ్ళకెలా తెలుస్తుంది? నువ్వు పడుతున్న బాధేదో పిల్లలదగ్గర బాధపడు. నీకు వస్తున్న కన్నీళ్ళేవో వాళ్లమీద వొంపు. రాజ్! మనం చేసింది తప్పు. తప్పుని తప్పని వప్పుకోవటంలో తప్పులేదు. చిన్నాడిని ఒక్కక్షణంకూడా వదిలిపెట్టకు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడల్లా పెద్దాడిని వెంటతీసుకెళ్ళు. మీ ఆఫీసులకికూడా వెంటపెట్టుకుని వెళ్ళు. వాళ్ళకి నీపైన నమ్మకం కలిగించు. వాళ్లమ్మ లేకపోవటాన్ని నువ్వెలా అనుభవిస్తున్నావో వాళ్ళకి తెలిసేలా చెయ్యి” అన్నాను.
చాలాసేపు ఇదే చెప్పాను. ఒక పెద్ద అనారోగ్యం, ఒక వ్యక్తి మరణం జీవితాలని ఎలా తారుమారు చేస్తాయో అర్థమౌతోంది. ఇకమీదట తను చెయ్యాల్సినదంతా వంటరిప్రయాణమే అనే విషయం అతనికి అర్థమై జీర్ణించుకోవటానికి సమయం పట్టింది.
“అంతేనా, వసంతా?” అన్నాడు విచలితుడై.
వెళ్ళిపోతానని లేచాడు.
“ఇంతరాత్రి ఒక్కడివీ ఎలా వెళ్తావ్? అందులో డ్రైవ్ చేసుకుంటూ?” అడిగాను.
“లేదు వెళ్ళాలి”
“ఈ స్థితిలో అలా ఎలా వెళ్తారు? మాకు తెలిసినతను డ్రైవరున్నాడు. వెంట తీసుకెళ్ళండి” అంది అమ్మమ్మ ముందుపడి, ఫోన్ చేసి ఆ అబ్బాయిని పిలిస్తే వచ్చాడు.
రాజ్ వెళ్ళిపోయాడు. ఒక బలమైన నిశ్వాస.
“నువ్వతన్తో వెళ్తే తప్పేమిటి?’అంతగా రమ్మని అడుగుతున్నాడు. అతను ఇంకెవర్నేనా చేసుకుంటే?” అమ్మమ్మ ప్రశ్న.
ఏదని జవాబు చెప్పను? ఒక వేటగా మొదలైంది. ఆటలా అదలా ఇంకా సాగుతోంది. అక్కడికి నేను వెళ్తే చాలా విషయాలని వప్పుకోవాలి. నా పిల్లలని, వాళ్ళకి గల చట్టపరమైన హక్కులని, రాజ్‍కి నామీద వున్న భావోద్వేగాధారతనీ… ఇంకా చాలా వప్పుకోవాలి. ప్రేమలనీ, బంధాలనీ పంచుకోవాలి. ఇవేవి వాళ్ళు చెయ్యరు. రాజ్ మరో పెళ్ళి చేసుకున్నా వాళ్లకి ఇష్టమే వుంటుందిగానీ, నేను మాత్రం ఆ యింటికి వెళ్ళకూడదు. ఇంత ప్రతిఘటనమధ్య నేను వెళ్తే అతన్ని విడదీసుకుని ఇవతలికి తీసుకెళ్ళటమౌతుంది తప్ప అతని పిల్లలకి ప్రయోజనం వుండదు.
“అవేవీ జరగవులే అమ్మమ్మా! అతని ప్రాణం ఆ పికిలిపిట్టల్లో వుంది” అన్నాను పిల్లలకేసి చూపిస్తూ.
“వసూ! ముంబైలో నా ఫ్రెండ్‍కి ఇంజనీరింగ్ ఫర్మ్ వుంది. నాకు జాబ్ ఇస్తానన్నాడు. నా సంతకాలు పనికిరావుగానీ, నా వర్క్, అనుభవం పనికొస్తాయిగా? అందరం అక్కడికి వెళ్తే బావుంటుందేమో ఆలోచించు. నువ్వుకూడా ఏదేనా జాబ్ వెతుక్కుందువుగాని. అమ్మ ముందు కొన్నాళ్ళు లీవు పెట్టి తర్వాత రిటైర్‍మెంటు తీసుకుంటుంది. పిల్లలని కూడా మంచి స్కూల్లో వేసి చదివించవచ్చు. అందరం ఒకచోట వుండచ్చు. ఆలోచించుకుని చెప్పమ్మా!” అంతా నెమ్మదించాక నాన్న అన్నారు.
అందరికీ మార్పు కావాలి. ఈ పల్లెటూళ్ళో ఎంతకాలం వుండగలను? ఏమీ చెయ్యకుండా? కాదనటానికి నాకే కారణం కనిపించలేదు.