జ్వాలాపురంపిల్ల కోసం by S Sridevi

  1. జుర్రేరు నదీలోయ by S Sridevi
  2. జ్వాలాపురంపిల్ల కోసం by S Sridevi
  3. సోన్‍లోయలో సరికొత్త చందమామ by S Sridevi
  4. కనిపించని ఒకటో వంతెన by S Sridevi

ఆరుబయట నిలబడి ఉన్నాడు అతడు. చుట్టూ పచ్చగా పైర్లు… అవి దాటితే దట్టమైన అడవులు, కొండలు, గుహలు. నిర్మలంగా పారుతున్న జుర్రేరు నది. అనంతమైన కాలం. అనాదినుంచీ వున్న నాగరీకత. మనుషులు మారారు. తరాలు మారాయి. కొన్నాళ్ళు వదిలేసి వెళ్ళారు. మళ్ళీ తిరిగితిరిగి వచ్చారు. అదే చోటు, అదే నది, అవే గుట్టలు, అడవులు.
తలపైకెత్తి చూసాడు. అటువైపు నల్లటిమబ్బులు ఎవరో తరుముకొస్తున్నట్టు వస్తున్నాయి. ఆ మబ్బులు నీటిని మోసుకొస్తున్నట్టు లేవు. బరువుగా ఉండి భారంగా కదులుతున్నాయి. కొంచెం వింతగానే వున్నాయి. ఆ వింతని ఓ కంటచూస్తూనే పనులు పూర్తిచెయ్యసాగాడు.
ప్రియురాలిని కలవాలి. ఆవలి వడ్డున ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమె తండ్రి దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ పల్లెవారికి చూపెడుతుంది అప్పటినుంచి ఆ పల్లెలో తనూ ఒకడు. తమ కోసం ఒక చిన్నిగుడిసె అందులో తనూ, ఆమె.
చాలా చిన్నప్పట్నుంచీ ఇద్దరూ ఒక జట్టు.
పెద్దచెట్టుని గట్టిగా కౌగిలించుకుని రెండుచేతుల వేలికొసలనీ కలపాలని ప్రయత్నిస్తుంటే ఆమె చూసింది మొదటిసారి. కిసుక్కున నవ్వేసి పరుగుతీసింది. వెంటాడి పట్టుకున్నాడు. నవ్వినందుకు అతనికి కోపం, వుక్రోషం. అతనికి దొరికిపోవడం ఆమెకి ముచ్చట. వేడుక.
“ఎందుకలా చేసావు? అలా ఎవరేనా చేస్తారా” ఆమె ప్రశ్నలు.
“ఎంత పెద్దయానో చూసుకుంటున్నాను” అతని జవాబు.
“పెద్దైతే?”
“నిన్ను పెళ్లాడతాను”
“పెద్దవ్వు మరి”
నవ్వులు, పరిహాసాలు.
ఆమె సోగకళ్ళు… చురుకైన చూపులు… ఎందులోనూ తనకి తగ్గని దేహదారుఢ్యం…
ఆమె చుట్టూ అతను, అతని చుట్టూ ఆమె.
జుర్రేరు ఆవలి పల్లెలో పిల్లని తెలిసినప్పుడు విత్తు నేలలో పెట్టాక ఆకాశంలోంచీ నీరు కురిసి మొక్క మొలిచి మళ్లీ విత్తును ఇవ్వటాన్ని చూసినంత ఆశ్చర్యం. నేలలో పెట్టిన గింజ మళ్ళీ కనిపించదు. అది ఏదేదోగా మారిపోతుంది. నేలలోంచీ బైటికి పొడుచుకు వస్తుంది. వేలెడౌతుంది. జానేడూ బారెడూ ఔతుంది. ఇంకా పెరుగుతుంది. చివరికి నిండా గింజల్ని నింపుకుని కనిపిస్తుంది. ఒక్క గింజ గుప్పెడు విత్తుల్ని యిస్తుంది. ఆమెకూడా అంతే. ఈ భూమిలాగ, విత్తులాగా… ఆడవాళ్ళంతా అంతే… అతని మనసు పులకించింది.
ఆలోచనలు కట్టిపెట్టి గబగబా పని పూర్తి చేసుకున్నాడు. మొలలోతు నీళ్ళలోకి దిగాడు. కట్టుకున్న బట్టని నీళ్ళలో చక్కగా వుతికి రెండుచేతుల్తో పిండి మళ్ళీ కట్టుకున్నాడు.
బార వెయ్యడానికి చేతులు సాచేలోగా… తృటి కదా ఆ కొలత… అంత చిన్న వ్యవధిలో చేతిమీద ఏదో పడింది. చూసుకున్నాడు దాన్ని. నల్లనల్లగా పొడిలా వుంది. పైకి మరోసారి చూసాడు. ఈత మొదలుపెట్టాడు.
వెనుక వొడ్డుని కోలాహలం. అతని పల్లెవాసులు కేకలు పెడుతున్నారు వెనక్కి రమ్మని. అతను నవ్వుతూ చెయ్యి వూపి ముందుకు సాగాడు.
ఉన్నట్టుండి పెద్దగాలి. ఆ గాలిలో కొట్టుకొచ్చి మీదనేదో కుప్పలుకుప్పలుగా పడటం… ఆ దృశ్యాన్నే కదూ, ఆమె అర్థం కాక చూసింది? అతను ఉక్కిరిబిక్కిరవుతూ నీళ్లలోకి మునిగాడు. ఆ తర్వాత ఏమయ్యాడో చెప్పడానికి చరిత్ర లేదు


“జ్వాలాపురం. 75000 సంవత్సరాలు. అరేబియా సముద్రందాకా బూడిద వర్షం కురిసింది. తూర్పునుంచి గాలి తోసుకుంటూ వస్తే పశ్చిమంవైపు పరుగులు తీశారట. పదిమందికి ఒకరే బతికేరట. ఉత్పాతానికి ముందుకూడా 40000 ఏళ్ళుగా అక్కడ వ్యవసాయం జరిగింది. ఆ బూడిద దుప్పటీని తొలగించుకుని తర్వాతకూడా బతికేరు. ఇప్పుడు మంచు కురిస్తే దాన్ని తొలగించుకుని బతకట్లేదా, అలాగ. పాతరాతియుగం, మధ్యరాతియుగం, కొత్తరాతియుగం … విని విని ఈ మాటలు విసుగుపుడుతున్నాయి. వ్యవసాయం ఉంటే కొయ్యనాగళ్లు వుండవా? ఉండచ్చునేమో! అవి కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి” అన్నాడు ఆర్కియాలజిస్ట్.
“ప్రాథమిక వ్యవసాయ గ్రామాలు, నదీలోయ నాగరికతలు… ఇప్పుడు ముందుకి వెళ్లడానికి బాగుంది” అన్నాడు పథికుడు.