ఝరి 91-100 by S Sridevi

  1. ఝరి 1-10 by S Sridevi
  2. ఝరి 11-20 by S Sridevi
  3. ఝరి 21 to 30 by S Sridevi
  4. ఝరి 31-40 by S Sridevi
  5. ఝరి 41-50 by S Sridevi
  6. ఝరి 51-60 by S Sridevi
  7. ఝరి 61-70 by S Sridevi
  8. ఝరి 71-80 by S Sridevi
  9. ఝరి 81-90 by S Sridevi
  10. ఝరి 91-100 by S Sridevi

“మమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడానికి మా అమ్మానాన్నలు చాలా కష్టపడ్డారు. అంటే మిగిలిన యిళ్ళలో తల్లిదండ్రులు కష్టపడలేదని కాదు. ఇది ప్రతిమధ్యతరగతి కుటుంబంలోనూ వుండే కథే. నాకు ఇద్దరు తాతయ్యలూ లేరు. అటు తాతయ్య, నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ బియ్యే చదువుతున్నప్పుడు ఈ తాతయ్య పోయారు. మామయ్య అమ్మకన్నా ఏడాది పెద్ద. ఆ వయసుకి ఆయన ఇంటిబాధ్యతలు ఎత్తుకుని, పెళ్ళిచేసి పంపించడమే చాలా గొప్పవిషయం. అమ్మ తర్వాత ఇంకా ఐదుగురు పిన్నులు, ఇద్దరు మామయ్యలు. మా మామ్మ అస్సలేమీ తెలీనిది. అమ్మని చాలా బాధలు పెట్టిందట. అమ్మకి వెంటనే పిల్లలు పుట్టలేదని నోములు, వ్రతాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు ఒకటేంటి సమస్తం చేయించేదట. ఇద్దరి జీతాలూ చాలక, అప్పులుకూడా అయ్యేవట. జీతం చాలట్లేదని నాన్న ఎప్పుడేనా అంటే, నీ భార్య తన పుట్టింటివాళ్ళకి దోచిపెడుతోందని యాగీ చేసేదట. జీతం వచ్చినరోజైతే ప్రతీనెలా గొడవేనట. పర్సు లాక్కుని, లెక్కబెట్టుకుని-
ఇంకా పదిరూపాయలు రావాలి. దార్లో మీ అమ్మకి ఇచ్చి వచ్చావు- అనేదట.
గవర్నమెంటు వుద్యోగస్తులంటే జీతం ఎప్పుడూ ఒకటే అంకె రాదుకదా? ఏదేనా నెల్లో ఎరియర్సో, ఇంక్రిమెంటో వస్తే పక్కనెలలో ఎందుకివ్వలేదని దెబ్బలాడేదట. ఎందుకేనా రికవరీ వచ్చి తగ్గితే ఇంక ఆ జరిగే గొడవ భరించడానికి దుస్సహంగా వుండేదట. నాన్న గట్టిగా చెప్పడంతో ఆగిందిగానీ లేకపోతే అమ్మమ్మావాళ్ళింటికి వెళ్ళి దెబ్బలాటలు పెట్టుకునే మనిషే ఆవిడ. దాదాపు పదిహేడేళ్ళు భరించింది అమ్మ ఇదంతా. ఆమె అంత ఓర్చుకుంటే ఈరోజుని మేం ముగ్గురం ఇలా వున్నాం. అలాంటి అమ్మని తప్పుపట్టాడు సుధీర్.
గీతని వాడు అంతగా ఇష్టపడుతున్నాడని మాకెవరికీ తెలీదు. మా చిన్నప్పుడు అన్ని కుటుంబాలవాళ్ళం అవంతీపురంలోనే వుండేవాళ్ళం. అందరం కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. రాజావారి బళ్ళోనూ, కాలేజిలోనూ చదువుకున్నాం. గీత మా అందర్లోకీ చిన్న. అది పుట్టాక మరో ఐదారేళ్ళు మా యిళ్ళలో పిల్లలు పుట్టలేదు. అందుకని, అదీ, దానిపై ఇద్దరూ అంటే రవళీ, వసంత్ మాతోటే వుండేవారు. దాన్ని వీళ్ళలో ఎవరికేనా ఇస్తారా అనే ప్రస్తావన ఎప్పుడూ బయటికి రాలేదు. దాని మనసులో ఏముందోకూడా ఎవరికీ తెలీదు. డిగ్రీతో చదువాపేసి వుద్యోగంలో చేరింది.
ఎందుకే- అంటే,
మా నాన్న చదివించలేరు- అంది.
మేమేమీ కట్నం అడగలేదు. సుధీర్ని ఎమ్మెస్ చదివించి పిల్లనిచ్చుకొమ్మంది అమ్మ. అన్నకి సాయం చేస్తున్నాననే అనుకుంది ఆవిడ. పాతికేళ్ళు తను పెంచి పెద్దచేసి, ప్రయోజకుడిని చేసిన కొడుకుని ఆయన చేతిలో పెడుతున్నాననుకుంది. ఆలోచించుకోవలసింది ఆయనకదా? కానీ జవాబు గీత దగ్గిర్నుంచీ వచ్చింది. మా అందర్లోకీ అది చిన్నపిల్ల. మా అమ్మానాన్నల వొళ్ళో తనూ ఎక్కి తొక్కిందే. ఆ జవాబే మామయ్య చెప్పి వుంటే పెద్దవాళ్ళందరి గౌరవాలూ నిలబడేవి. జో! కట్నం తీసుకోకూడదు నిజమే. అది పెద్ద నేరం. మరి ఈ పెద్ద చదువులన్నీ ప్రభుత్వం వుచితంగా చెప్పిస్తోందా? పిల్లలకి పెద్ద చదువులు చెప్పించిన తల్లిదండ్రులు దివాలా తియ్యాలా? లేక పైకి ఎదగాలన్న కోరికలని మధ్యతరగతివాళ్ళు తుంచేసుకోవాలా? ఇందులో విన్‍విన్ వుండదా?” అంది సుమతి అతనికి ఆ విషయం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు.
తల్లికూడా ఇలాంటి మాటలే అనడం గుర్తొచ్చింది జోగేశ్వర్రావుకి.
“మీ నాన్న పెద్దచదువులు చదువుకోవాలనుకున్నారు. కుదర్లేదు. ఎమ్మెస్సీలో సీటొస్తే డబ్బులు కట్టలేక చదివించనన్నారట మీ తాతయ్య. మీరు తెలివైనవాళ్ళు. సీట్లు తెచ్చుకున్నారు. మా శక్తికి మించినదే ఐనా చదివించాం. మీరూ బానే చదివారు. పైకొస్తారు, సంతోషం. గవర్నమెంటు ఫీజులు తక్కువే వుండచ్చుగానీ కోచింగు దగ్గిర్నుంచీ మొదలుపెట్టి ఎంత ఖర్చుపెట్టి వుంటామో, మేమిప్పుడు లెక్కలు చెప్పబోవటం లేదు. మిమ్మల్ని పైకి తీసుకురావడానికి మేము చాలా జీవితాన్ని నష్టపోయాం. నాది చిన్న ప్రైవేటు వుద్యోగం. వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాంటిది. పెన్షనుండదు. మీ నాన్న ఒక్కరి పెన్షనుమీదా మేమిద్దరం బతకాలి. పెళ్లయ్యాక మీ జీతాలమీద పెత్తనం ఆ వచ్చే ఆడపిల్లలు చేస్తారు. వాళ్ళ దయాధర్మంమీద మేం ఆధారపడి వుండటం బావోదు. కనుక, మీ యిద్దరూ ఈ అప్పులవీ తీర్చుకుని, మమ్మల్ని వడ్డున పడేసి పెళ్ళిళ్ళు చేసుకోండి. అదీకాక, కట్నాలూ కానుకలూ వద్దనుకుంటే దండలపెళ్ళి చేసుకుని బంధువులకి సమాధానం చెప్పుకుని, బోసి వొళ్ళతో తిరుగుతూ, పప్పుకీ వుప్పుకీ తడుముకుంటూ మాలాగే మీరూ బతకండి ” అంది.
ఈ సమాజం మిగతావాటికన్నా భిన్నమైనది. తల్లిదండ్రులు పిల్లలకోసం త్యాగం చేస్తారు. అలా త్యాగం చెయ్యగలిగితేనే పిల్లలు ఎదుగుతారు. బదులుగా తల్లిదండ్రులు వాళ్ళనుంచీ భవిష్యత్తులో పోషణా, వృద్ధాప్యంలో ఆదరణా కోరుకుంటారు. అది పిల్లల కనీసబాధ్యత. నన్నెందుకు కన్నావు, ఈపాటి చెయ్యలేకపోతే అనే ప్రశ్నకి అవకాశం వుండదు- తమ కడుపున పుట్టమని వాళ్ళని వీళ్ళేం బతిమాలి వుండరుకాబట్టి. కట్నం వద్దంటే చేసుకోవడానికి సంతోషంగా ముందుకొచ్చే ఆడపిల్ల పెళ్ళయ్యాక కోరికలు అదుపులో వుంచుకొమ్మంటే వింటుందా? మారాల్సింది వ్యవస్థ. మనుషులు కాదు.
కట్నం తీసుకోవాలా వద్దా అన్న చర్చ ఇంట్లో నడుస్తుండగానే సుమతితో పెళ్ళిప్రసక్తి వచ్చింది. బేరాలేమీ జరగలేదు. వాళ్ళు ఇస్తామన్నదానికి తాము వప్పుకున్నారు. అందులో సగం సుమతికి బంగారానికీ, ఇంకొంత పట్టుచీరలకీ ఇచ్చి, పెళ్ళిఖర్చులుకూడా వాళ్ళిచ్చినదాంట్లోనే సరిపెట్టి, పెళ్ళితతంగంలోంచీ బైటపడ్డారు.
పెళ్ళి వేడుగ్గానే జరిగింది. సుమతి తన జీవితంలోకి వచ్చింది. పెద్దగా కోరికలేవీ లేని సంతుష్టజీవి. బావా బావా అంటూ ప్రేమగా వెంట తిరిగే ఏడుగురు బావమరుదుల బలగం. అందరూ సుమతికి ప్రాణం పెడతారు. కట్నం తీసుకున్నాడని ఎవరూ తనని తక్కువగా చూడలేదు. కానీ మేనమామకోసం కట్నం తీసుకోవద్దనుకున్న ఈ ఏడుగురినీ చూస్తుంటే తన భుజాలు తనకే తడిమి చూసుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి.
“నో రిగ్రెట్స్ జో! ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అది అమ్మావాళ్ళకి తెలుసు. నాకు ఏదైతే ఇచ్చారో అది సంతోషంగానే ఇచ్చారు. చిన్నప్పట్నుంచీ నాకేం కావాలో చూసుకుని, నేనేం చెయ్యాలో, ఎలా వుండాలో చెప్తూ పెంచారు నాన్న. ఆయన అలా చెప్పడాన్ని లీడర్‍షిప్ క్వాలిటీస్ అనుకుంటాను నేను. పెన్సిలుని చెక్కి చెక్కి ముల్లు కోసుగా చేసినట్టు పెద్దవాళ్ళు మనని పదునుతీస్తారు. లేకపోతే మనం పనికిరాని పనిముట్లమే. అందుకు బదులుగా వాళ్ళ గౌరవం దెబ్బతినకుండా చూసుకోవడం మన కనీసబాధ్యత” అంది సుమతి. ఆమె మొదటే నచ్చింది అతనికి. ఇప్పుడు మరీమరీ నచ్చింది. స్వంత చెల్లెళ్ళులేని అతను గీతతో పెరిగే అనుబంధాన్ని తగ్గించుకుని దూరం జరిగాడు.
ఆ సంవత్సరం మహతితో కలిపి ముగ్గురి పెళ్ళిళ్ళు జరిగాయి. ఇటు రవళికీ, అటు ప్రవల్లికకీ సంబంధాలు చూస్తున్నారు. లక్ష్మి యింట్లో గీత అధ్వర్యంలో మొదలైన పెళ్ళిపెట్టి ఇంకా వేడుకలకోసం తెరుచుకునే వుంది.


గీతకి తొమ్మిదోనెల నడుస్తోంది. మెటర్నిటీలీవు పెట్టింది. లీవులో రిలీవౌతుంటే కొత్తగా వచ్చిన ఒక క్లర్కు అన్నాడు-
“లేడీస్‍కేంటీ మేడం! చక్కగా మూడేసినెలల మెటర్నిటీ లీవు. ఇప్పుడది నాలుగునెలలు చేస్తారట. ఇంట్లో కూర్చుని జీతం తీసుకోవచ్చు” అని.
“మాకుగాబట్టి మూడునెలలూ నాలుగు నెలలతో సరిపెడుతున్నారు. అదే మగవాళ్ళు కనాల్సి వస్తే అసలు వుద్యోగాలే చెయ్యం అంటారు” బదులిచ్చేసి వచ్చింది.
ఇప్పుడందరూ ఇద్దరికి మించి కనట్లేదుకాబట్టి మొదటి కాన్పు పుట్టింట్లోనూ, రెండో కాన్పు అత్తవారింట్లోనూ జరపడం ఆనవాయితీగా మారింది. గీతని తనే వుంచుకుంది లక్ష్మి. విజ్జెమ్మ మనవరాలిని చూసుకోవడానికి నెలముందే వచ్చేసి వుంది. గీత అమ్మమ్మ, వాసు నాయనమ్మ ఇప్పుడు లేరు. తల్లికిబదులు మరదలికి తోడుగా తనొచ్చింది వాసు పెద్దమేనత్త, సక్కూబాయి. ఎప్పుడూ వుండే మనుషులకి అదనంగా మరో యిద్దరు చేరేసరికి ఇల్లంతా మనుషులే తిరుగుతున్నట్టు అనిపించింది నీలిమకి. యశోద వచ్చి వెళ్తోంది. ఒకరోజో రెండురోజులో వుంటుంది. ఆవిడ వున్నప్పుడు రామారావు భోజనానికి ఇక్కడికే వస్తాడు. ఒక్క డెలివరీకి ఇంతమంది ఏం చేస్తారని వింతగా అనిపించింది నీలిమకి.
మాధురికి పాప పుట్టినప్పుడు తమ కుటుంబమే అన్నీ చూసుకున్నారు. పెదనాన్నలున్నా, అది తమింటి వ్యవహారం అన్నట్టు వదిలేసారు. తల్లీ తండ్రీ హాస్పిటల్‍కి తీసికెళ్తే తను ఇంట్లో వుండి చూసుకుంది. మానస ఇంటికీ, హాస్పిటల్‍కీ తిరిగింది. పాప పుట్టిన వార్త తెలిసాకే అందరూ ఒకొక్కరుగా వచ్చారు. ప్రహ్లాద్‍కీ, అతని తల్లికీ తమది పరాయిల్లు. పైగా ముందుగా రమ్మని ఎలాంటి ఆహ్వానం లేదు. వాళ్ళూ వార్త తెలిసాకే వచ్చారు.
గీత తల్లిదండ్రులని ఇంత దగ్గిరగా చూడటం ఇదే మొదలు నీలిమకి. ఎవరో ఒకానొక రామారావు చిన్నప్పుడే తండ్రి పోతే ఇంటి బాధతలు ఎత్తుకుని, కుటుంబాన్ని నిలబెట్టాడని చెప్తే అది పక్కింటివాళ్ళకీ, ఎదురింటివాళ్ళకీ పెద్ద విశేషమేమీ కాదు. మామూలుగా విని తలూపుతారు. ఎప్పుడో తను పుట్టనిక్రితం జరిగిన, తనకి సంబంధంలేని సంఘటనల్లోని గొప్పతనం నీలిమకి అర్థం కాదు. కానక్కర్లేదు. తన తల్లిదండ్రుల్లానే వాళ్ళూ అనిపిస్తారు.
మాధవ్ యశోదని ఆటపట్టిస్తాడు.
“మా అత్త పెళ్ళయ్యాక షోగ్గా కాలేజీకి వెళ్ళి చదువుకుంది తెలుసా?” అంటాడు నీలిమతో. ఆవిడ మొహమాటపడుతుంది. “అరేయ్, పెళ్లైనా నీ అల్లరి ఇంకా పోలేదురా!” అంటుంది.
పెద్దపిల్లయ్యాక ఏడోతరగతితో చదువాపేసింది ఆవిడ. పెళ్లై వచ్చాక మెట్రిక్కి కట్టించాడు రామారావు. రాజావారి కాలేజిలో చేరి, డిగ్రీకూడా చేసింది. కూతుళ్లవిషయంలోనేనా, కోడలివిషయంలోనేనా విజ్జెమ్మది ఒక్కటే ఆలోచన, చేతినిండా పనిలేకపోతే ఆలోచనలు పక్కదారిపడతాయని. ఇష్టమైన వ్యాపకం కల్పిస్తే మరోటి ఆలోచించే టైము వుండదనే, అందరినీ చదువుకి ప్రోత్సహించింది. ఆ చదువులో పడి, ఇంకా పెళ్ళవలేదని వాళ్లకీ, ఇంత పెద్ద కుటుంబమనీ యశోదకీ ధ్యాసే వుండేదికాదు.
ఆ కుటుంబంలో ప్రతిమనిషీ ఒక పుస్తకం. చిన్నప్పటి జ్ఞాపకాలు, సంఘటనలు గుర్తుచేసుకుంటూ తింటూ తిరుగుతూ రోజులు దొర్లించెయ్యగలరు. రామారావు వచ్చినప్పుడు ఆయన చుట్టూ కూర్చుని అందరూ కబుర్లు చెప్తారు. గీత ఆయన చెయ్యి వదిలిపెట్టదు. ఎప్పటెప్పటి విషయాలో చెప్తాడాయన. వీళ్ళంతా కుతూహలంగా వింటారు. అందరూ నీలిమతో ప్రేమగానే వుంటారు. ఐనా తనకీ గీతకీ మధ్యగల తేడా స్పష్టంగా తెలుస్తుంది. తనకి ఈ మనుషులెవరూ ఏదీ కారు. మాధవ్‍కి వాళ్ళందరితో వుండే అనుబంధమే ఆమెకి ఇబ్బందిగానూ అసహజంగానూ అనిపిస్తుంది. అతనొక్కడే తన లంకె. ఆ లంకెని తన వైపు లాక్కోగలిగేంత బలం తనకి వుందా? అలాంటప్పుడు నీలిమకి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది.
ఆ యిల్లు తనది. రామారావు స్థానంలో తన తండ్రి కూర్చుని వుంటాడు. ఆయన చెప్పే విషయాలకి తాము ముగ్గురు అక్కచెల్లెళ్ళు, తమ భర్తలు శ్రోతలు- అనిపిస్తుంటుంది.
నాన్నకూడా ఈయనలాగే చాలా కష్టపడ్డాడు. చాలాకాలందాకా సరైన వుద్యోగం రాక, అన్నదమ్ములెవరి సహకారం లేక, కన్నది ముగ్గురూ ఆడపిల్లలవటంతో పెళ్ళిళ్ళు చేసి పంపడానికి సంపాదించినదంతా ధారపోసి, ఈరోజుకీ స్వంతిల్లు లేకుండా అద్దెంట్లో కాలం గడుపుతున్నాడు. గీతా వాసూ ఇక్కడినుంచీ వెళ్ళిపోతే వాళ్ళ వెనక అత్తగారుకూడా వెళ్ళిపోతుంది. మామగారిని వెంట తీసుకెళ్తుందా, ఆయన వెళ్తాడా అనేది వేరే విషయం. ఆయన ఎందులోనూ తలదూర్చడు. ఇంట్లోకే రాడు. ఆయన్ని చూసుకోవడం పెద్ద సమస్య కాదు. తండ్రినీ తల్లినీ ఇక్కడొచ్చి వుండమనచ్చు- అని.
కోరిక చాలా విచిత్రమైనది. ఔచిత్యపు పరిధిని దాటనంతవరకూ దాన్ని అందరూ గౌరవిస్తారు. ఆ పరిధిని వదిలేసి పరుగులుపెడితే ఎదురయ్యే ప్రతిఘటన తీవ్రంగా వుంటుంది. మొదట నీలిమ సమస్య గీతతో కలిసి వుండలేకపోవటం ఒక్కటే. ఇప్పుడు దానికి ఒక పిలక పుట్టుకొచ్చింది.


యమున గీతకి తన పిల్లలని చూపించడానికి తండ్రితో కలిసి లక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటికి ఆమెకి ప్రసవమై నెల. ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. హర్ష, హర్షిత వాళ్ళ పేర్లు. బారసాలకి ఎవర్నీ పిలవలేదు. పిలవందే ఎలా వెళ్ళాలని ఎవరూ వెళ్లలేదు. వెళ్ళినవాళ్ళకి పూట భోజనంకూడా పెట్టగలిగే పరిస్థితి కాదు వాళ్లది. ఇబ్బంది పెట్టడం దేనికని అవసరమైనంతవరకే వెళ్ళి పలకరించి వచ్చారు.
యమున, ఆమె తండ్రి వచ్చేసరికి అందరివీ భోజనాలయ్యాయి. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు అత్తాకోడళ్ళు. లోపలెక్కడో పడుక్కుని వుంది విజ్జెమ్మ. సక్కూబాయి –
“నీ దేవుడేమంటున్నాడో నాకూ చెప్పు- అంటూ తమ్ముడి గదికి వెళ్ళి కూర్చుంది. కుటుంబాన్ని గాలికి వదిలేసి, వేదాంతంలోనూ, వైరాగ్యంలోనూ పడ్డ ఆయన్ని చూస్తే ఆవిడకి వళ్ళుమంట. మగవాడు, ఇంటికి పెద్దవాడు, బాధ్యతలు పట్టించుకోకపోతే లక్ష్మి ఒక్కర్తీ ఎంతకని చూసుకోగలదు, అక్కడికి రామారావు నిస్వార్థజీవికాబట్టి వీళ్ళు వడ్డుని పడ్డారని.
వీధితలుపులు ఎప్పుడూ తీసే వుంటాయి. యమునా, ఆమె తండ్రీ ముందు సంకోచంగా లోపలికి అడుగుపెట్టి, గీతని చూసి, అదో అసంకల్పితచర్యలా పిల్లల్ని ఆమె పాదాలకి చెరోవైపునా పొత్తిళ్లతో నేలమీదే పెట్టాక, తండ్రి కాస్త దూరంగా జరిగి నిలబెడితే యమున వంగి గీత పాదాలకి నుదురు ఆనించింది. ఇదంతా తృటిలో జరిగిపోయింది. గీత బిత్తరబోయింది. ముందుగా తేరుకున్నది లక్ష్మి.
“ఏంటమ్మాయ్, ఇది? లే పైకి. ముందు పిల్లల్ని నేలమీంచీ తియ్యి” అని కోప్పడింది. బక్కపలచటి పిల్ల. కళ్లలో ప్రాణాలు పెట్టుకున్నట్టే వుంది. అమాయకత్వం, బేలతనం మొహంలో పోటీపడుతున్నాయి. ఇలాంటిపిల్లని అలా ఎలా చేసావురా అనుకుంది రాణాగురించి బాధగా. క్షణమాత్రపు ప్రలోభంతో ఎంత బరువు నెత్తిమీదికి తెచ్చిపెట్టుకుంది అని పెళ్లవకుండా తొందరపడ్డందుకు యమునమీదా కోపం వచ్చింది.
“మిమ్మల్ని అక్కా అని పిలవచ్చో లేదో! నా కళ్లకైతే మీరు ఆ అమ్మవారిలాగే అనిపిస్తున్నారు. మీయిల్లొక దేవాలయంలా వుంది. మా మూడు ప్రాణాలూ మీరు పెట్టిన భిక్ష. మీరు చెప్పకపోతే నన్నూ నా పిల్లల్నీ ఎవరూ పట్టించుకునేవారు కాదు. అనాథల్లా దిక్కులేని చావు చచ్చిపోయేవాళ్ళం. మీకు పిల్లల్ని చూపించి దీవెనలు తీసుకుని వెళ్ళాలని వచ్చాం. మిమ్మల్ని మాయింటికి పిలిచి మర్యాదలు చేసే స్తోమత లేదు మాకు” అంది ఆ పిల్ల లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ. ఐతే తను అలా అనుకోవడం ఇంకొకళ్లకి ఆక్షేపణగా వుంటుందని అనుకోలేదు. నీలిమ లోపల్నుంచీ తన్నుకొస్తున్న విసురుని అణచుకుంటూ అక్కడినుంచీ వెళ్ళిపోయింది.
రాణా పిల్లలంటే గీతకి వాళ్ళని ముట్టుకోవాలనికూడా అనిపించలేదు. బావోదని ఒకమాటు దగ్గిరకి తీసుకుని ఇచ్చేసింది. ఆ కాస్తకే వొళ్ళంతా కంపరం పుట్టేసింది. పాలు చాలక ఎండునక్కిరికాయల్లా వున్నారు ఇద్దరూను. అల్పంగా అరచేతిలో పట్టేంత వున్నారు. కీచుకీచుమని ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు ఏడుస్తున్నారు.
అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేసింది. ఎలాంటి మగవాడు వాడు? తమతో చిన్నప్పుడు కలిసి తిరిగి, ఆడింది వాడేనా? చిన్నప్పట్నుంచే వాడి బుద్ధి వేరేగా వుండేది. మిగిలిన ఆరుగురూ ఇచ్చిన కంపర్ట్ తనకి ఎప్పుడూ ఇవ్వలేదు. తర్వాతకూడా తనని చాలా బాధపెట్టాడు. ప్రేమించానని పిచ్చిమాటలన్నీ చెప్పి, చివరికి ఏంకావాలో బైటపెట్టాడు. పెళ్ళయాకకూడా వదిలిపెట్టలేదు. తర్వాత ఆ అవసరాన్ని యమునతో తీర్చుకున్నాడు. అది మెడకి చుట్టుకునేసరికి తప్పనిసరై తాళికట్టాడు. వాడు అలాంటివాడుసరే, సంధ్యత్తావాళ్ళూ పట్టించుకోకపోవడమేంటి? వాళ్ళ మనవలేకదా? ఆ మామయ్య అలా ఎందుకు చేస్తున్నారు? ఎన్నో సందేహాలు.
లక్ష్మి చూపించినట్టు పిల్లలని అక్కడున్న దివాన్‍మీద పడుకోబెట్టి, తను కింద కూర్చోబోయింది యమున. ఇష్టమో, బలవంతమో, తమ కుటుంబంలోకి వచ్చింది. చెల్లెలి కొడుక్కి ఇద్దరు పిల్లల్ని కన్నది. పరాయిది ఎలా ఔతుందనుకుంది లక్ష్మి.
“పైన కూర్చోమ్మా! అలా కింద కూర్చోకూడదు” అంది. బెరుగ్గా సోఫా అంచుని కూర్చుంది యమున. ఆమె తండ్రికి ఎంత చెప్పినా వినలేదు. కిందనే మఠం వేసుకుని కూర్చున్నాడు. ఉతుకులకి కోరారంగుకి మారిన ధోవతి, పైన బాగా నలిగిపోయి ముడతలున్న పాతచొక్కా వేసుకున్నాడు. గీత లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తూ విజ్జెమ్మని వెంటబెట్టుకుని వచ్చింది.
“రాణా అమ్మమ్మని. మీ యిద్దరూ కలిసి మా యింటికి వచ్చారు, గుర్తుందా?” అని అడిగి, “దీన్ని చూసావా? నా మనవరాలు. నా పెద్దకొడుకు కూతురు. మాయిళ్ళలో ఏ ఒక్కళ్ళు బాధపడుతున్నా ఓర్చుకోలేదు. వాళ్ల నాన్న నేర్పించాడు దానికి అలాగ. దాని మాటకికూడా మాయింట్లో అంత విలువ” అంటూ గీతనిగురించి చెప్పి, “నీలిమేదే?” అని అడిగింది. ఆమె అక్కడ వుండి వుంటే, “ఇది నా కూతురి చిన్నకోడలు. కుందనాల బొమ్మ. వీళ్ళ అక్కపెళ్ళిలో చూసి, మనసు పారేసుకున్నాడు నా మనవడు” అని చెప్పేది.
“ఇప్పటిదాకా ఇక్కడే వుంది. ఈమధ్య దానికి చిన్నసందడికికూడా తలనెప్పి వచ్చేస్తోంది. వెళ్ళి పడుక్కున్నట్టుంది” అంది లక్ష్మి, కొంచెం విసుగ్గా. ఈమధ్య నీలిమ ప్రవర్తన ఆవిడకి నచ్చట్లేదు. ఇంటికి ఎవరేనా వచ్చేసరికి తలనెప్పని గదిలో తలుపేసుకుని కూర్చుంటోంది. పిల్లలగురించి అడుగుతారు. ఎందరని మమూలుగా అడిగేవాళ్ళు, ఇంకా కాలేదా అని అడిగేవాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రేమతోనో, కుతూహలంతోనో అడుగుతారు. చెప్పేవిధంగా చెప్పాలి. గదిలో ఎన్నాళ్ళు దాక్కోగలదు? వచ్చినవాళ్ళు ఏమనుకుంటారు? పంథొమ్మిదిమంది పిల్లలు ఈ యింట్లో వయసుకి వచ్చి వున్నారు. పెళ్ళిళ్ళు, తర్వాతి తతంగాలు, వరసపెట్టి జరుగుతున్నాయి. ఎవరికోసం మరొకరి జీవితంలో జరిగేవి ఆగవు. అందుకు వుదాహరణగా మాధురి, మానసలే వున్నారు. ఒక తల్లి పిల్లలే ఐనా ఎవరికి జరిగేవి వాళ్లకి జరిగాయి. నీలిమకోసం ఆగలేదు. ఇంకాకూడా జరుగుతాయి. గీతకి నెలతప్పినప్పట్నుంచీ నీలిమలో చాలా మార్పొచ్చింది. దాచుకున్నా దాగకుండా అసూయ కనిపిస్తోంది. మధ్యలో గీతేం చేసింది? ఇంచుమించు అవే ఆలోచనలు కలిగి కూతురికేసి సాలోచనగా చూసి తలూపింది విజ్జెమ్మ.
“నా కుటుంబం మొత్తానికీ తప్పబుట్టింది వాడొక్కడే. పోనీలేమ్మా! మేమంతా వున్నాం. వాడికి గట్టిగా చెప్తాం, ఇలా వుండకూడదని. చక్కటి పిల్లల్ని కన్నావు. ఆరోగ్యం బాగా చూసుకో, పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకో. మీ అత్తమామలుకూడా పిల్లల్ని చూసారంటే మారతారు” అంటూ యమున పక్కని కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడింది. పిల్లల్ని ఒకరి తర్వాత ఒకర్ని ఎత్తుకుని ముద్దు చేసింది. పెద్దావిడ దగ్గర కూర్చుని అంత ప్రేమగా మాట్లాడుతుంటే తలదించుకుని కూర్చుంది యమున. అది బెరుకా? గౌరవమా? అర్థమవలేదు ఎవరికీ.
ఆ అమ్మాయి ఇదివరకు బట్టల షోరూమ్‍లో పనిచేసేది. అక్కడ చేస్తున్నప్పుడే రాణాతో పరిచయం. పెళ్లయ్యాక ఆ పని మానేసి, అతనితో కొన్నాళ్ళు కలిసి వుంది. తండ్రి తీసుకెళ్ళిపోయాక ఖాళీగా వుండిపోయింది. పైసాకూడా తెచ్చుకోకుండా తండ్రిమీద ఆధారపడి తినడం బాధనిపించినా ఆరోగ్యం సహకరించక వూరుకుంది. రాణా ఎంతోకొంత ఇస్తున్నాడు. అది ఓమూలకి రావట్లేదు. ఇప్పుడిక మళ్ళీ పని వెతుక్కుంది. కుట్టుసెంటర్లో దొరికింది. ఒకసారి పనిలో చేరాక మళ్ళీ తీరిక చిక్కదని ఇటొచ్చింది. విజ్జెమ్మతో యమున ఇవన్నీ చెప్తుంటే వింటూ కూర్చుంది గీత. ఆమె చూసిన జీవితాలకి కిందిమెట్లమీది జీవితం ఇది.
“భోజనాలు చేద్దురు. ఎప్పుడనగా బయల్దేరారో ఏమిటో! ” అంటూ ఏర్పాట్లు చూడటానికి లేచింది లక్ష్మి.
యమున మొహమాటపడింది. “పర్వాలేదండీ! వెళ్తూ దార్లో తినేస్తాం” అంది.
“ఈ యిద్దరు పిల్లల్నీ పెట్టుకుని వెళ్తూ దార్లో తింటారా? అందులోనూ పచ్చిబాలింతరాలివి, బైట తిండి తింటావా? భలేదానివే” లక్ష్మి నిండుగా నవ్వింది. గీత అప్పటికే లోపలికి వెళ్ళి, ఏర్పాట్లు చూస్తోంది. మాధవ్‍, వాసూ ఇంకా తినలేదుగాబట్టి అన్నీ వున్నాయి వీళ్ళిద్దరూ తింటుంటే వాళ్ళకి వండచ్చనుకుంది. పిల్లల్ని తను చూసుకుంటానని తండ్రీకూతుళ్ళని పంపింది విజ్జెమ్మ. యమున తండ్రి ఆకలి చంపుకోవడానికి అలవాటుపడ్డాడు. బాగా ఆకలనిపించినప్పుడు ఇంత టీ తాగి తిండి మరోగంట వాయిదావేసుకోవడం నేర్చుకున్నాడు. కానీ యమున చిన్నది. అమడపిల్లలు. పుట్టి నెల. ఎన్నోరోజుల ఆకలి తీర్చుకుంటున్నట్టు, ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబ తింటుంటే తెల్లబోయి చూసింది గీత. ఎందుకు? ఎందుకిలా? అప్పుడు తనకీ హరిచందనకీ తేడా. ఇప్పుడు యమునకీ తనకీ. చిన్నగా మొదలైన బాధ అణువణువూ నిండిపోతున్నట్టై, నిలబడలేకపోయింది. గోడకి ఆనుకుంది.
“అలా వున్నావేమే? ఏమైంది? వెళ్ళి కూర్చో” అంది లక్ష్మి కంగారుగా.
“ఏం లేదత్తా!” అంటూ ఆమె వెళ్ళి హాల్లో కూర్చుంటే నీలిమని కేకేసి, మిగతాపని అప్పజెప్పింది లక్ష్మి.
భోజనాలయ్యి వాళ్ళు బయల్దేరుతుంటే సంచీలో ఐదుకేజీల బియ్యం పోసిచ్చి, ఆయనకి పంచెలచాపు, యమునకి రెండుచీరలు పెట్టి, పిల్లలిద్దరికీ చెరో వందా ఇచ్చింది లక్ష్మి. యమున మాటిమాటికీ వీధికేసి చూస్తోంది. ఆమె కళ్ళలో నిస్పృహ. ఇక్కడికి వస్తున్నట్టు రాణాకి ఫోన్ చేసింది. అతను వస్తాడని ఆ ఎదురుచూపు. ఆఖరినిముషంలో వచ్చాడతను. ఆమె ముఖం విప్పారింది.
గీత విషయంలో రవి చేతుల్లో తన్నులు తిన్న ఎన్నోయేళ్ళతర్వాత అతను ఆయింట్లో అడుగుపెట్టడం. సంకోచంగా వచ్చాడు. అందుకే ఆ ఆలస్యం. అతన్ని చూడగానే గీత లేచి లోపలికి వెళ్ళిపోయింది. విజ్జెమ్మకి జరిగిన సంగతులేవి తెలీవుకాబట్టి ఆమె వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది.
“లోపలికెళ్ళి మాట్లాడుకోండిరా, ఇద్దరూను” అంది లక్ష్మి.
“నీ కోడలు తన్నినా తంతుంది. ఇక్కడిదాకా రానిచ్చింది. అదే సంతోషం” అన్నాడు రాణా. జరిగింది తెలిసే అవకాశం లేదుగాబట్టి, తమ విషయంలో అతని ప్రవర్తనపట్ల గీతకి ఆ కోపం అనుకుంది యమున.
“మనింటికి వెళ్దాం” అన్నాడు భార్యతో.
“వద్దండీ! ఇద్దరు పిల్లల్తో చేసుకోలేను. నేను మా నాన్నతో వెళ్ళిపోతాను” అంది యమున.
“పోనీలే, మీ నాన్ననికూడా రమ్మను”
“అమ్మకి ఇబ్బంది. మరోమనిషి లేకపోతే ఆవిడకి గడవదు. నేను అక్కడే వుంటాను. తీరినప్పుడు మీరే అక్కడికి వస్తుండండి”
“సరేనైతే” అన్నాడు. తలాతోకా లేని ఆ సంభాషణ పూర్తైంది. పిల్లల్ని దగ్గిరకి తీసుకోవడంగానీ, ఎత్తుకోవడంగానీ చెయ్యలేదతను. వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వస్తానని వెళ్ళాడు.
“మనమేమీ జమీందార్లం కాదుకదా, అత్తయ్యగారూ! ఆ అమ్మాయి వైద్యానికి తలోయింతా వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడివన్నీ ఇవ్వడం దేనికి? వాళ్లవాళ్ళు చూసుకోరా?” అంది నీలిమ దుగ్ధగా.
“ఇంట్లో సంపాదించేవాళ్ళు నలుగురుండగా నా కూతురు జమీందార్లకేం తక్కువ?” అంది విజ్జెమ్మ. నీలిమ ముఖం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోయింది.
“ఏమిటే, వీడు? ఆ కాపురమేమిటి? దాంతో ఆ అతకని పొతకని మాటలేంటి? పిల్లల్ని కన్నెత్తేనా చూసాడూ?” అంది విజ్జెమ్మ.
“సంధ్య కాపురమే అలా తగలబడింది. వీడిలా వుండటంలో వింతేముంది? మళ్ళీ వస్తాడేమో, దార్లో పడేలా నాలుగు మంచిమాటలు చెప్పు” అంది లక్ష్మి. అనుకున్నట్టుగానే రాణా వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వచ్చాడు.
“అన్నం తిన్నావురా?” అడిగింది విజ్జెమ్మ మనవడిని. తిన్నానన్నట్టు తలూపాడు.
“ఇద్దరు పిల్లల తండ్రివయ్యావు. ఇంకా ఇలాగే వుంటే ఎలారా? తల్లికే సరైన పోషణ లేదు, ఇంక పిల్లలకేం తాపుతుంది? పాలు కొని పోసే స్తోమతుందా వాళ్ళకి? ఏదో ఒక వుద్యోగం వెతుక్కుని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవద్దూ? ఆడపిల్లని జాలిపడి అంతా తలోయింతా వేసుకుని వైద్యమంటే చేయించారుగానీ, ఇంకేం పెడతారు? అది నెల బాలింతరాలు. అప్పుడే పనికి పోతానని చెప్తోంది. దాని ఆరోగ్యం ఏం కాను?” అంది విజ్జెమ్మ.
“సరైన వుద్యోగం దొరకట్లేదు అమ్మమ్మా!” అన్నాడు రాణా.
“కోరుకున్న వుద్యోగం దొరకడానికి అంతగొప్ప చదువు నువ్వేం చదివావురా, వచ్చిందేదో చెయ్యాలిగానీ” అంది లక్ష్మి.
“ఏదేనా వ్యాపారం మొదలుపెడదామనుకుంటున్నాను ఆమ్మా!” అన్నాడు. సరిగ్గా అప్పుడే వచ్చాడు మాధవ్. ఆమాటలు విన్నాడు. అతను ఇక్కడికెందుకు వచ్చాడన్న ఆశ్చర్యాన్ని పక్కనబెట్టి-
“అరేయ్, ఏదో ఒక వ్యాపారమంటూ వుండదు. ఏ వ్యాపారం చెయ్యబోతున్నావో స్పష్టంగా అనుకుని, దాని ప్రొడక్షను, సప్లై చెయిన్, మార్కెట్ అన్నిటినీ స్టడీ చేసి ప్రాజెక్టు తయారు చేసుకోవాలి. ఏ ఎత్తుని మొదలుపెడుతున్నావో ఖర్చులేమి వుంటాయో, పెట్టుబడి ఎంత కావాలో ఎస్టిమేట్ వేసుకుని అప్పుడు ఎవరేనా వ్యాపారంలోకి దిగేది” అని మాట్లాడుతునే లోపలికి వెళ్ళిపోయాడు.
“వాడిని ఎంటర్టేన్ చెయ్యకు మాధవ్. మళ్ళీ వచ్చివెళ్ళటాలు మొదలెడతాడు” అంది గీత లోపల.
“అదేంటి, ఆవిడకి నచ్చకపోతే ఇంకెవరూ మాట్లాడకూడదా?” అంది నీలిమ అతను గదిలోకి రాగానే.
“ఆవిడకేకాదు, మాకూ ఎవరికీ యిష్టం వుండదు. అవన్నీ నీకు తెలీవు. మన పెళ్లవకముందు జరిగినవి” అన్నాడతను. భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు రాణా, మాధవ్ చాలా క్లోజుగా వుండేవారు. రాణా దారితప్పుతున్నాడని గ్రహించగానే వాసు మాధవ్‍మీద పట్టు బిగించి, ఇద్దరికీ మధ్య ఎడాన్ని పెంచాడు. ఇద్దరికీ పోలికలుకూడా కలుస్తాయి. ఆ సారూప్యతే నీలిమకి రాణాపట్ల సానుకూలత దృక్పథాన్ని ఏర్పరిచింది.
“మాధవ్ చాలా మారిపోయాడు ఆమ్మా! నాతో ఇలా వుంటాడనుకోలేదు. పక్కన కూర్చుని రెండునిముషాలు మాట్లాడే తీరికకూడా లేనంత బిజీయా?” అన్నాడు రాణా చిన్నబుచ్చుకుని, తనూ వెళ్ళడానికి లేస్తూ.
“ఉద్యోగస్తులకి కూర్చుని కబుర్లు చెప్పేంత తీరిక ఎక్కడుంటుందిరా? ఐనా, నువ్వు చేసినదానికి ఆపాటి మాట్లాడాడు. సంతోషించు” అంది లక్ష్మి. అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక వచ్చి విజ్జెమ్మదగ్గిర కూర్చుంది గీత. ఆమె మనసులో తలెత్తిన ప్రశ్నలు వంట్లో ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి.
“మామ్మా! నా చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని అంటుంటారుకదా, తినడానికికూడా లేకుండా ఎప్పుడేనా వున్నామా?” అడిగింది.
“లేదమ్మా! అలా ఎప్పుడూ జరగలేదు. నాది పెద్దసంసారమని మా అమ్మ ఒకటో రెండో బియ్యంసంచులు పంపించేది. మా తమ్ముళ్ళతో గొడవొచ్చినదాకా అది సాగింది. పెరట్లో చిక్కుడు, ఆనప పాదులు వేసి ఇల్లెక్కించేదాన్ని. బచ్చలితీగ వుండేది. మామిడిచెట్టుండేది, ఒకటో రెండో కాయలు ఏ కాలంలోనూ దొరికేవి. తాతయ్య వున్నన్నాళ్ళూ వైద్యం చేయించుకున్నవాళ్ళు ఏవో ఒకటి పంపేవారు. రాజావారి తోటనించీకూడా వచ్చేవి. డబ్బులంటే వుండేవికాదుగానీ, తిండికి లోపం జరగలేదు. ఆరోజుల్లో ఎవరి దగ్గిరా డబ్బులాడేవి కాదులే గీతా! ప్రాణావసరం వస్తే నా నానుతాడు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుని తరవాతెప్పుడో విడిపించుకునేవాళ్ళం” అందావిడ.
“రాజావారికి అన్ని ఆస్తులుండి మనం సాధారణంగా ఎందుకుండాలి? అందరికీ ఒక్కలాగే ఎందుకుండదు?”
“ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకలా వుండరు. తరాలనాడు ఓ తల్లిపిల్లలే కొందరు ఆస్తులు నిలబెట్టుకుని ప్రయోజకులయ్యీ, ఇంకొందరు ఆస్తులు పోగొట్టుకుని అప్రయోజకులయ్యీ వుంటారు. ఎంత వున్నా మూడుతరాలు మించి నిలవదంటారు. మొదటితరంలో కష్టపడి సంపాదిస్తారు. రెండోతరంలో కూర్చుని తింటారు. తరవాతితరంలో వ్యసనాలు మొదలౌతాయి. మనవరకూ మనం పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యాన్నిబట్టి ఆ యిళ్ళని వెతికి పట్టుకుని వాటిల్లో పడేస్తాడు దేవుడు. మన చేతుల్లో ఏదీ వుండదు” అందావిడ.
పుణ్యం, పాపం, ఆ పసిపిల్లలేం చేసుకుని వుంటారు? గీతకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆబగా అన్నం తింటున్న యమున రూపం కళ్ళముందునుంచీ తొలగిపోవడంలేదు. “ఎందుకో ఏడుపొస్తోంది మామ్మా!” అంది.
“ఎందుకే? తిన్నదరక్కా?” అని తిట్టిందావిడ.
“ఏముందీ? యమునని చూసిందికదూ? కన్నీటికుండలు నెత్తిమీదికెక్కాయి. ఏమే గీతా! ఆ పిల్ల కోరి వాడిని చేసుకుంది. ఆడపిల్ల అంత తెగబడకూడదు. తండ్రి పెళ్ళిచెయ్యగలడు, చెయ్యలేడు. దానంతట అది వెతుక్కోవడమేనా? ఏమంత వయసు మీరిపోయిందనే? పట్టుమని పాతికేళ్ళు లేవు. అలాంటి బుద్ధితక్కువపనులు చేస్తే బతుకులు ఇలానే అఘోరిస్తాయి. రాణా వడ్డూ పొడవూ చూసి భ్రమలో పడిపోయింది. శరీరం ఎదిగినట్టు వాడికి బుర్ర ఎదగలేదు. బాధ్యత తెలీదు. ఎదిగిన కొడుకుని ఏ తల్లిదండ్రులుమాత్రం ఎంతకని పోషిస్తారు? అక్కడికీ దుబాయ్ వెళ్తానంటే డబ్బిచ్చారు. మోసపోయాడు. కొన్నాళ్ళు స్నేహితులతో కలిసి వ్యాపారం వెలగబెట్టాడు. వ్యాపారమే మునిగిందో, స్నేహితులే ముంచారోగానీ డబ్బైతే వదిలింది. ఇప్పుడు మళ్ళీ మొదలెడతానంటున్నాడు. వాళ్ళిద్దరూ పెళ్ళికిముందు ఏం ఏడ్చారో! పెళ్ళయాక నాలుగు నెలలు కలిసున్నారేమో! ఆ పిల్ల పుట్టింటికి వెళ్ళిపోయింది. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. దాని పద్ధతిలో అది బతుకుతుంది. నీలా నాలా వుండదు. ఎక్కడేనా కలిస్తే పలకరిస్తాం. మనింటి పిల్లలని ముద్దుచేస్తాం. పదో పాతికో కలిగింది చేతిలో పెడతాం. అంతే” అంది లక్ష్మి. గీత ఆలోచనలకి అక్కడొక కామా పడింది. కానీ అన్నం తింటుంటే యమున రూపం, పాలు తాగుతుంటే పిల్లల కీచు ఏడ్పులు గుర్తొచ్చి ఆమెని భయపెట్టాయి. ప్రశాంతంగా వుండనివ్వలేదు.
రాత్రి భోజనాలవేళ లక్ష్మి చెప్పింది, యమున వచ్చి వెళ్ళిన విషయం.
“రాణాకూడా వచ్చాడామ్మా?” అడిగాడు వాసు కొంచెం కోపంగా.
“వాళ్ళు వెళ్ళేముందు వచ్చి వాళ్ళని బస్సెక్కించి మళ్ళీ వచ్చాడు. ఐదునిముషాలుండి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ వుందికదూ, అందుకు వచ్చాడు” అంది లక్ష్మి.
“చిన్నప్పుడు అందరు ఒక ప్రాణంలా పెరిగారుకదరా? వాడినలా ఎలా వదిలేసారు?” అంది విజ్జెమ్మ బాధపడుతూ.
“మేం పనికిరాలేదు అమ్మమ్మా, వాడికి. చెత్తవెధవల్తో తిరిగేవాడు. ఇప్పటికీ అంతే. వాళ్ళే వాడికి సర్వం” అన్నాడు మాధవ్.
“రేపు బారసాలకి అంతా వస్తారుకదా, సంధ్యనీ, దాని భర్తనీ అందర్లో పెట్టి నిలదీస్తాను. ఇష్టమో కష్టమో పెళ్ళంటూ చేసుకున్నాక దానికి కట్టుబడి వుండాలి. రెండుచేతులూ కలిస్తేనేగా, చప్పట్లు? తప్పంటూ జరిగిందంటే అందులో ఆడా మగా ఇద్దరి పాత్రా వుంటుంది. వీడేమో దులపరించుకుని తిరుగుతున్నాడు, అదేమో నెల బాలింతరాలు. వెళ్ళి సంపాదించుకొచ్చి, పిల్లల్ని పోషించుకోవాలా? మనింటా వంటా ఇలాంటివి లేవు” అందావిడ.
“అవన్నీ వద్దులే, అమ్మమ్మా! రవి మామయ్యతో చెప్పిద్దాం. సుమతీ, మహీ, సమీరా, తులసీవాళ్లంతా వస్తారు. కొత్తకోడళ్ళుంటారు. బావగార్లముందూ, ఆడపిల్లలముందూ గొడవెందుకు? ఇంటిపరువు తీసుకోవడం దేనికి? విడిగా మాట్లాడుకుందాం” అన్నాడు వాసు. భోజనాలయ్యాయి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు.
“ఏదేనా చెయ్యాలనుకుంటే చెయ్యి. అంతేగానీ ప్రపంచభారమంతా నువ్వే మోస్తున్నట్టు తిరక్క” అన్నాడు వాసు గీతతో.
“అలా కనిపిస్తున్నానా?” అడిగిందామె.
“నీగురించి నాకు తెలీదా తల్లీ? పరామర్శకి వెళ్ళి ఇంకో కొడుకుని ఎత్తుకొచ్చావు”
“వాళ్ళవాళ్ళంతా వుండగా మనం ఎందుకు చెయ్యాలన్నది ప్రశ్న”
“అప్పుడే వదిలెయ్యాల్సింది. తలదూర్చావు”
“అలా ఎలా? తిండీ లేక, వైద్యమూ లేక చచ్చిపోయేది యమున”
“ఇప్పుడా పిల్లలూ అంతే. ఎవరూ పట్టించుకోక, ఆకలి తీరక” ఆగిపోయాడు.
“ప్లీజ్ వాసూ, అలా అనకు” ఆమెకి కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి.
“ఎక్కువగా ఆలోచించకు. ఏం చెయ్యాలో రవి మామయ్యని కలిసి ఆలోచిస్తాను. ఎలాగా మయూని స్కూల్లో వేస్తూ వాడికి తోడుగా వుండేలా ఇంకో పిల్లాడి చదువు ఎత్తుకుందామనుకున్నాం. అదేదో ఇప్పుడే మొదలుపెడదాం. పాలడబ్బాలకి పెద్ద ఖర్చవదులే. మనిద్దరికీ బోల్డంత సర్వీసు ముందుంది. మన సంపాదనలో తరిగిపోయేది లేదు” అన్నాడు.
“కమలాకర్‍గారు ఫోన్ చేసి, మాట్లాడారు. ఇక్కడ వీడు చేస్తున్నట్టే అక్కడ వాడూ బాగా అల్లరి చేస్తున్నాడట” అంది గీత.
“బారసాలకి రమ్మందాం” అన్నాడు.
“ఆవిడ కదిలే స్థితిలో లేదట. సైకియాట్రిస్టుకి చూపిస్తున్నారట. మనమే వీలుచూసుకుని వెళ్ళి చూసి రావాలి”
అవతలగదిలో నీలిమ మాధవ్‍తో అంటోంది.
“మీ వదిన సాక్షాత్తు అమ్మవారేనట. కాళ్ళకి దణ్ణాలూ, ఆహాలూ వోహోలూ”
“ఏం? ఆవిడేదైనా ఎర్రటి పట్టుచీర కట్టుకుని, ఇంత కుంకంబొట్టు మెత్తుకుని కూర్చుందా?” పకపక నవ్వాడు మాధవ్.
“కొందరి దగ్గర గారాలూ, ఇంకొందరికి దానాలూ. అందరూ ఆమె చూపుడువేలి చుట్టూ తిరుగుతారు”
“నువ్వూ ఇచ్చావుకదా? కాళ్ళు ముందుపెట్టి దణ్ణం పెట్టమనాల్సింది” అన్నాడు ఇంకా నవ్వుతునే. చురచుర చూసింది నీలిమ. ఇతనికి ప్రతీదీ వేళాకోళమే. “అడిగి దణ్ణం పెట్టించుకోవల్సినంత ఖర్మ నాకు పట్టలేదు. పెట్టేవాళ్ళకీ, పెట్టించుకునేవాళ్ళకీ వుండాలి ఆ జ్ఞానం” విసురుగా అంది. అతను నవ్వుతునే వున్నాడు.
“ఔను, రాణా బావగారితో మీకేంటి గొడవ?” అడిగింది.
“మా రహస్యాలన్నీ చెప్పించేస్తావేంటి కొంపతీసి? పదకొండుమంది పిల్లలం, పాతిక ముప్పయ్యేళ్ళపాటు ఒక్కగుంపుగా తిరిగామంటే ఎన్ని వుంటాయి?”
“ఏమిటో అవి?”
“చెప్పక తప్పదా?”
“దాచుకోండైతే”
“పెళ్ళికిముందు రాణా గీతనేదో అన్నాడు. వాసు వాడిని చితక్కొట్టేసాడు. వీళ్ళ పెళ్లయ్యాకకూడా ఏదో గొడవైతే యిద్దరూ వాళ్ళింటికెళ్ళి దెబ్బలాడి వచ్చారు. రవి మామయ్యకి తెలిసి వాడిని చితక్కొట్టేసాడు”
“ఈ యాంగిల్‍కూడా వుందా, ఆవిడ లవ్‍స్టోరీలో? మీ అన్నయ్యా వదినా చిన్నప్పట్నుంచీ కలిసి తిరిగేవారా? వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుంటారని మీకందరికీ తెలుసా?” కుతూహలంగా అడిగింది. లక్ష్మిని అప్పుడెప్పుడో అడిగినవే, ఇతన్ని మళ్ళీ అడిగింది.
“అలాంటిదేం లేదు. సడెన్‍గా పెళ్ళి ప్రస్తావన వచ్చింది. ఇద్దరూ ఒకళ్ళ పేరొకళ్ళు చెప్పారు”
“అంతేనా?!”
“అంతకన్నా ఏం వుంటుంది? మనిద్దరికీ మధ్యనిమాత్రం ఏం జరిగింది?”
“గొడవ వాళ్ళకి మధ్యని. మధ్యలో మీరెందుకు మాట్లాడకపోవటం?”
“మనమూ వాళ్ళూ ఏమిటి? గీత మా వదిన. మా పదకొండుమందిదీ ఒకటే మాట. అందులో తప్పుచేసింది వాడు. మిగిలినవాళ్ళం వాడిని ఎక్స్‌పెల్ చేసాం”
“సుమతి వదిన అతన్తో మాట్లాడుతుంది”
“మాట్లాడ్డమంటే? ఇందాకా నేను మాట్లాడలేదా? అలాగే. అవసరమైతే మాట్లాడుతుంది. ఎదురుపడితే మాట్లాడుతుంది. వాసూ, సుధీర్ తప్ప మిగతా అందరం దానికన్నా చిన్నవాళ్ళం. ఆ చనువుతో కోప్పడుతుంది, చరుస్తుందికూడా”
“ఆవిడ మీ వదినతో ఎందుకు మాట్లాడదు?”
మాధవ్ ముఖంలో నవ్వు మాయమైంది. చెప్పాలా వద్దా అనే సందిగ్ధం. ఎందుకు, ఈ అనవసర కుతుహలం? మరొకళ్ళ జీవితంలోకి తొంగిచూడటం? చెప్పకపోతే అలుగుతుంది. మరోవిధంగా తెలుసుకుంటుంది. ఎవరో ఒకళ్ళు చెప్తారు. దానికన్నా తనే చెప్పడం మేలు.
“సుధీర్‍కి గీతని అడిగారు. గీత చేసుకోనంది. అదే కోపం” క్లుప్తంగా అన్నాడు. నీలిమ అపనమ్మకంగా చూసింది. ఏమంత అందంగా వుండని గీతని రాజకుమారుడిలాంటి సుధీర్‍కా? అతనికో సుమంత్‍కో ముందు తననీ, తర్వాత మానసనీ అడగాలనుకుని అందుకోలేమని వూరుకున్నాడు తండ్రి. అలాంటిది గీతని వాళ్ళు అడగడం, ఆమె కాదనటమూనా?!! నిజమేనా?!!
“సుమతి మీ అన్నయ్యతో బానే మాట్లాడుతుందిగా?”
“అమ్మా! తల్లీ! మాలో మాకు ఎన్ని గొడవలూ కోపాలూ వున్నా అవేం సీరియస్ విషయాలు కాదు. మాకేం ఆస్తిపంపకాల్లేవు, తగూలాడుకోవడానికి. వాసు తనకి అన్న. వాడిమీద పెత్తనం చేస్తుంది. గీత వదిన, తను ఆడబడుచు. అందుకు ఈవిణ్ణి సాధిస్తోంది. వాళ్ళిద్దరూ మాయింట్లో మహారాణులు. అమ్మావాళ్ళవైపునించీ అది పెద్దమనవరాలు. మామయ్యల పిల్లల్లో గీత పెద్దది. ఈవిడెంతో ఎంతో అదీ అంతే. ఇద్దరూ సమవుజ్జీలు. అది మాట్లాడకుండా సాధిస్తే ఇది నోరు తెరవకుండా పుల్లలు పెడుతుంది” అన్నాడు. అని,
“చిన్నప్పటి స్నేహాలు ఒకళ్ళమీద ఒకళ్ళకి అధికారాన్నివ్వవు నీలూ! అవసరం వస్తే ప్రాణం పెడతాయి తప్ప అతిక్రమణలు చెయ్యనీవు. సరదాగా కలుసుకుని మాట్లాడుకోవడానికీ, ఒక డైవర్షన్‍లాగా, స్ట్రెస్ బస్టర్‍లాగా అంతే. పీర్‍గ్రూపనేది మనిషికి చాలా అవసరం. మనింట్లోనే ఇందరం వున్నాం. బయటి స్నేహాలు అవసరం లేదు. నీకు ఎవరితో కంఫర్టబుల్‍గా వుంటుందో వాళ్ళతో ఓపెన్‍గా మాట్లాడ్డం మొదలుపెట్టు. గీత చెడ్డది కాదు. తనకి కల్మషం తెలీదు. నీమీద తనకి ఎలాంటి కంప్లెయింట్సూ లేవు. తనని అందరూ ఇష్టపడటానికి కారణం మన కుటుంబంలో తన స్థానం. పెద్దమామయ్య కూతురు, వాసుని చేసుకుందని. వాసంటేకూడా అందరికీ ఇష్టం. వీళ్ళిద్దరనేకాదు, మనింట్లో పిల్లలందరికీ ఒకళ్లనొకళ్ళు ఇష్టపడటమే నేర్పించారు. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలం అమడపిల్లల్లా పెరిగాం” అన్నాడు అనునయంగా.
నీలిమకి అతను చెప్పినవి సంతృప్తినివ్వలేదు. ఇంకా వివరంగా, పూసగుచ్చినట్టు తెలుసుకోవాలనుంటుంది. అప్పుడేకదా, అతనికీ తనకీ అరమరికలు లేకుండా వుండేది? ఏదీ పూర్తిగా చెప్పకుండా అన్నీ దాచుకుంటే ఎలా? అతను చెప్పిన- గీతని కలుపుకుపోవటమనేది అసలు నచ్చలేదు. నీడలా, వూడలమర్రిలా అందర్నీ, అన్నిటినీ గీత ఆక్రమించేస్తూ వుంటే ఆ చీకట్లోకి తను వెళ్ళటం జరిగేపనికాదు. తొమ్మిదిమంది మగపిల్లలూ, పదిమంది ఆడపిల్లలూ వున్న ఈ కుటుంబంలో తన వునికి ఎక్కడ? కేంద్రకంలాంటి గీతని దూరంగా జరిపితేగానీ తనకి పట్టుదొరకదు. తనలో ఏర్పడ్డ వెల్తిలోకి మరికాస్త ద్వేషాన్ని వంపుకుంది నీలిమ.
ఆరోజు గడిచింది. వాసు తనేదో ఒకటి చేస్తానన్నాడుగాబట్టి గీతకి నిశ్చింతగా వుంది. అతనుకూడా ఆమె నమ్మకాన్ని వమ్ముచెయ్యలేదు. పాలడబ్బాలు కొని పంపమని డబ్బివ్వటానికి రవి యింటికి వెళ్ళాడు.
“ఎలా వుందిరా, నీ వీరప్రేమికురాలు? డేట్ ఎప్పుడిచ్చారు?” అడిగింది కుసుమ వేళాకోళంగా. వాసు సిగ్గుపడ్డాడు.
“కొత్తగా పెళ్ళైనట్టూ, ఇదే తొలిచూలన్నట్టూ అలా సిగ్గుపడతావేరా? దబాయించి ఎలా తిరగాలో ఇంకా నేర్చుకోలేదా దానిదగ్గిర? అసలు మీయిద్దర్లో ఎవరెక్కువ సిగ్గుపడతారు, నువ్వా? రౌడీరాణీయా? ” ఆటపట్టించింది.
“అత్తా!!” అన్నాడు వాసు ఇంకా సిగ్గుపడిపోయి. ఆమె నవ్వేసి, “మాట్లాడుకోండి. టిఫెన్ తెస్తాను” అంటూ లోపలికి వెళ్ళింది. వాసు తనొచ్చినపని చెప్పాడు రవికి.
“మీకెందుకురా?” అన్నాడు రవి.
“ఆ పిల్లల్ని చూసి గీత చాలా బాధపడుతోంది. కళ్ళమ్మట నీళ్ళొక్కటే తక్కువ. పోయినసారి ఎంత హడావిడి చేసిందో నీకు తెలీనిదేముంది? ఇప్పుడు ఇదో కొత్తగొడవ. డెలివరీకి వుంది. ఈ ఆలోచనలతో ఏమి ప్రాణంమీదకి తెచ్చుకుంటుందోనని భయంగా వుంది. అమ్మమ్మేమో పంచాయితీ పెడదామంది. గీతేమో హక్కులూ లెక్కలూ అంటూ మాట్లాడుతోంది. దానికి న్యాయం అంటే కచ్చితంగా చాకుతో కోసి పండుముక్క తీసి ముందు పెట్టినట్టుండాలి. అలా ఎలా కుదుర్తుంది? టైము చూసుకుని వచ్చినట్టు అసలా అమ్మాయి మా యింటికెందుకొచ్చిందో తెలీడం లేదు. జాలిపడతామనా? వాడే పంపించినట్టున్నాడు” అన్నాడు వాసు.
“పంచాయితీ దేనికిరా? ఎవళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవాలిగానీ, చిన్నపిల్లలా కూర్చోబెట్టి నచ్చజెప్పడానికి?” నిరసనగా అన్నాడు రవి.
“నేనూ వద్దన్నాను మామయ్యా! వీడితోటి న్యూసెన్స్‌గా వుంది. టిక్కెట్టు కొని దుబాయ్ తీసుకెళ్ళి పాస్‍పోర్టు లాక్కుని వదిలేసి రావాలి వెధవని. మేమూ ఈ వూరొదిలిపెట్టం, వాడూ ఇక్కడినుంచీ కదలడు. అమీతుమీ తేల్చుకోవాలన్నట్టే వుంది వ్యవహారం” అన్నాడు వాసు. రవి నవ్వాడు.
“నేనున్నారా! మీ జోలికి వాడు రాకుండా చూసుకుంటాను. ఈ పాలడబ్బాల్లోకూడా నీ పేరొద్దు. అమ్మ పంపించిదని చెప్తాను. ఆవిడదగ్గిరా డబ్బుంటుందిగా? ఎవరో ఒకళ్లం ఇస్తుంటాం. నమ్ముతాడులే” అన్నాడు. కుసుమ దోసెలు పోసి తీసుకొచ్చింది. వాళ్ళ పిల్లల చదువులగురించి అడిగాడు వాసు. అతనక్కడ వుండగానే గీత మేనమామ ఫోన్‍చేసాడు. రవి ఎత్తి, పలకరింపులు అవగానే వాసుకి ఇచ్చాడు.
“మీ యింటికి చేసాను. నువ్వు ఇక్కడున్నావని గీత చెప్తే మళ్ళీ ఇక్కడికి చేసాను” అన్నాడాయన. అక్కడికి చేసి, మళ్ళీ ఇక్కడికి చేసాడంటే ఏదో ముఖ్యమైన వ్యవహారమే అయుంటుందనుకున్నాడు వాసు. అతని ఊహ నిజమే. వాళ్ళ వూరికి ఇరవై కిలోమీటర్లదూరంలో వున్న చిన్నపల్లెలో పదిహేడెకరాల ఏకఖండిక పొలం అమ్మకానికి వుందట.
“మా అన్నదమ్ములిద్దరం చెరి నాలుగెకరాలూ తీసుకుంటుంన్నాం వాసూ! అంతకన్నా కొనలేం. మిగిలింది మీ అన్నదమ్ములిద్దరూ తీసుకుంటారా? కెనాల్‍కింది భూమి. ముందుముందు రేట్లు బాగా పెరుగుతాయి. అక్కరేదనుకుంటే నాలుగైదేళ్ళయాక అమ్మెయ్యచ్చు. కౌలుకివ్వడం అవీ నేను చూసుకుంటాను. వాళ్ళకి ఇంకో బేరం వుంది. అందుకని తొందరపెడుతున్నారు” అన్నాడు. ఒక తమాషాయైన ఆలోచన వాసు మనసులో కదిలింది. మయూఖ్ పుట్టినప్పుడు గీతకి వాళ్ల నాన్న స్థలం ఇచ్చాడు, ఇప్పుడు తను పొలం ఇస్తేనని. ఆలోచించుకుని కాసేపట్లో చెప్తానన్నాడు వాసు.
“కొనడం మంచిదేరా! డబ్బురూపంలో దాచుకుని ఏం లాభం? నేనూ కలిసేవాడిని, కానీ పిల్లల చదువులున్నాయి. అదయ్యాక పెళ్ళిళ్ళు చెయ్యాలి. కాబట్టి, ఇప్పటప్పట్లో ఏం చెయ్యలేను” అన్నాడు రవి. కమలాకర్‍గారికి ఫోన్ చేసాడు వాసు. ఆయనకూడా తీసుకొమ్మనే అన్నాడు. కొన్ని పనులు సంకల్పమాత్రాన జరిగిపోతాయి. వాసుకి అలా జరిగితే మాధవ్‍నిమాత్రం తీసుకోకుండా ఆపింది నీలిమ.
“వాళ్ళు మీ వదినకి మేనమామలు. ఆవిడకోసం చేస్తారు. మనం ఆమధ్యలోకి వెళ్ళడం ఎందుకు? మనకి వాళ్ళెందుకు చేస్తారు? కౌలూ అవీ సరిగ్గా ఇవ్వకపోతే ఎవరిని అడుగుతారు? చుట్టరికాలూ, చిన్నప్పటిస్నేహాలూ డబ్బుదగ్గిర కాదు” అంది.
“అలా ఎందుకు చేస్తారు? వాళ్ళు మంచివాళ్ళు. నాలుగైదుసార్లు వాళ్ళింటికికూడా వెళ్ళాం. ఒకసారి నువ్వూ వచ్చావు” అన్నాడు మాధవ్.
“తులసినీ, గీతనీ ఒక్కలా చూసేవారని ఆ రికార్డంతా మళ్ళీ వెయ్యకండి. ఇద్దర్నీ ఒక్కలా ఎందుకు చూస్తారు? ఆ భ్రమలోంచీ బైటికి రండి ముందు. పంక్తిలో అవమానపరచకపోతే ఎదుటివాళ్ళు మనని తమతో సమానంగా చూసారనుకుంటాం. సంస్కారం వున్నవాళ్లెవరూ అలా అవమానపరచరు. వాళ్ళూ అంతే. మీ వదినకి పెట్టినదాంట్లో తులసికి ఎన్నోవంతు పెట్టారు?”
మంచిగా చూడటం అంటే మాధవ్‍కీ బాగానే తెలుసు. నీలిమ అన్నట్టు పంక్తిలో గౌరవించడమే మన దగ్గిర సమానత్వం. ఆస్తులెవరూ పంచి యివ్వరు. వాళ్లతో కలిసి పొలం తీసుకోవడం నీలిమకి ఇష్టం లేదనే విషయం గ్రహించాడు. ఆగిపోయాడు. అతను ఆగిపోవటం ఆమెకి ఒక విజయంలా అనిపించింది. కానీ అదొక తప్పు నిర్ణయమనీ, దానివలన అన్నకీ తనకీ స్థాయీబేధం ఏర్పడుతుందనీ వూహించలేకపోయాడు. బేరసారాలన్నీ అయ్యాకే విషయం వాసుదాకా వచ్చింది. అతనికి పని తేలికైంది. తల్లికి చెప్పి, రామారావుని వెంటబెట్టుకుని వెళ్ళి అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంటు రాసుకుని వచ్చాడు. గీతచేతకూడా జీపీయఫ్ అడ్వాన్సు పెట్టించాడు. పొలం కొనడానికని అడిగితే పీయఫ్ అడ్వాన్సు ఇవ్వరు. వైద్యకారణాలు చూపించి అప్లై చెయ్యాలి. ఎక్కడో గుచ్చుకుంది ఆమెకి. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టిందికూడా వెనక్కి తీసుకున్నాడు వాసు. అదీకాక అప్పటిదాకా నిండునదుల్లా డబ్బుతో తొణికిసలాడుతున్న అకౌంట్సన్నీ ఒక్కసారి ఖాళీ అవటంచేత కలవరపడింది.
“నెల తిరిగేసరికి జీతాలొస్తాయి. మళ్ళీ ఎంతలో దాచుకుంటాం?” అని ఓదార్చాడు. వీళ్ళ నాలుగెకరాలు పోను మిగిలిన భూమి బైటివాళ్ళు తీసుకున్నారు. అది తమింట్లోనే కలిస్తే బావుంటుందని అతనికి అనిపించినా సుధీర్‍తో మొదలుపెట్టి వసంత్‍దాకా ఎవరి కారణాలు వాళ్లకే వున్నాయి తీసుకోకపోవడానికి. ముందు గీతకి కానుకగా తీసుకుందామని అనుకున్నాడు. అదంత బావుండదని తల్లి పేరుమీద రిజిస్టరు చెయ్యాలనుకున్నాడు. ఎవరి పేర్న వుంటేనేం అనిపించింది.
“నా పేరెందుకురా?” అంది లక్ష్మి వినగానే. అందులో అసహజమేమీ లేదు. కానీ వాసు బైటికి వెళ్ళాలన్న ప్రస్తావన వచ్చినప్పట్నుంచీ నీలిమని నమ్మలేకపోతోంది. ఆమె మనసు చదివినట్టు కలగజేసుకుంది సక్కూబాయి.
“మళ్ళీ రేపెలా వెనక్కి తీసుకుంటావ్ వాసూ? మరదలికి నువ్వొక్కడివే కొడుకువి కాదు. మాధవ్, తులసి మంచివాళ్ళే. రేపు మీ పిల్లలు పెద్దౌతారు. పెళ్ళిళ్ళౌతాయి. బయటివాళ్ళు ఇంటివ్యవహారాల్లోకి వస్తారు. పంపకాలల్లో ఎక్కువతక్కువైలైనట్టు వాళ్ళకి అనిపించదా? వాళ్ళకి ఇవన్నీ తెలీవుకదా? అమ్మమీద ప్రేమ వుంటే ఇంత బంగారం కొనిపెట్టు, ఆమె పెట్టుకుంటుంది, ఎవరికేనా ఇచ్చుకుంటుంది. నాలుగు చీరలు కొనివ్వు. డబ్బివ్వు. ఆమెకి నచ్చినట్టు చేసుకుంటుంది. ఆస్తిలెక్కలుమాత్రం ఎప్పుడేనా తెగ్గొట్టుకునేలా వుండాలి” అంది. జీవితం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతి అడుగూ ఆచితూచి వెయ్యాలి. కనీసం మొదట్లో కొంత ప్రయాణం అలా చెయ్యాలి. ఆ తర్వాతే నడక సాఫీగా సాగుతుంది. ముందుతరంవాళ్ళ అనుభవం, లోకజ్ఞత ఆ నడక నేర్పిస్తాయి.
“అబ్బ! మీ అన్నమీదా వదినమీదా ఈగ వాలనివ్వరు ఎవరూ. ఎన్ని కాపలాలో!” అంది నీలిమ ఏకాంతంలో.
“అత్త చెప్పింది మనకీ వర్తిస్తుందికదా?”అన్నాడు మాధవ్. అతనెప్పుడూ ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. రామారావు, వాసు చెప్పినట్టు చేసుకుపోవడమేతప్ప ఇలా తర్కించడం రాదు. నీలిమ ఇలా మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తుందతనికి.
యమున వచ్చివెళ్ళడం, పొలంకోసం తిరగడం, ఇద్దరి ఆఫీసుల్లో పీయఫ్ లోన్లు పెట్టడం, బేంకు బేలన్సులు చూసుకోవడం, డెలివరీకీ, బారసాలకీ డబ్బు సిద్ధం చేసుకోవడం చాలా తిరుగుడైంది వాసుకి నాలుగైదురోజులు. పుట్టబోయే విహంగ్‍కూడా అతనవన్నీ సరిచూసుకుని కాస్త వూపిరి పీల్చుకునే సందిచ్చి తను భూమ్మీదికి వచ్చేస్తున్నట్టు ప్రకటన చేసాడు. తెల్లారి రెండింటికి ఈ లోకంలోకి రావడానికి హడావిడి మొదలుపెట్టాడు వాడు. వాసు రెండు ఆటోలు తీసుకొచ్చాడు. మొదటి ఆటోలో యశోద, లక్ష్మి, గీత వెళ్తే వాసు వెనక బైకుమీద వెళ్ళాడు. ఇంకో ఆటోలో విజ్జెమ్మ, సక్కూబాయి ఎక్కారు. మయూఖ్‍కి తోడుగా నీలిమ ఇంట్లోనే వుంది.
“ఇంతమంది దేనికి? ఏం చేస్తారు? డాక్టరు రానిస్తుందీ?” ఆశ్చర్యంగా అడిగిందామె.
“ఇదేం చూసావు? మయూగాడి టీమ్ ఇంకా పెద్దది. డాక్టరు తెలిసినావిడే. నర్సు ఓ గదిలో వీళ్లందర్నీ మాట్లాడకుండా కూర్చోమంటుంది. వీళ్ళు నోళ్ళమీద వేళ్ళు వేసుకుని బడిపిల్లల్లా కూర్చుంటారు” అన్నాడు మాధవ్ గట్టిగా నవ్వి. “డెలివరీ అవగానే పెద్దత్తని ఇక్కడ దింపి, నిన్ను తీసుకెళ్తాను” అని తనూ వెళ్ళాడతను. నీలిమ ఇంట్లోకి వచ్చి లక్ష్మి పడుకునేచోటులోకి మయూఖ్‍ని జరిపి పక్కని తను పడుక్కుంది. నిద్ర రాలేదు. వాడి స్పర్శ వెచ్చగా తగుల్తోంది. నిద్రలో దేనికో నవ్వుతున్నాడు. ఎంతో సమ్మోహనమైన నవ్వు. రెప్పవెయ్యకుండా చూస్తూ వుండిపోయింది. నెమ్మదిగా కదలిక. ఆమె మనసులో. తనకి పెళ్లై వచ్చినప్పటికి వీడు చిన్నవాడు. ఏదో అల్లరిపని చేసి, తల్లో మామ్మో కేకలేస్తే పరుగున వచ్చి తన వళ్ళో మొహం దాచేసుకునేవాడు. మాధవ్ వెనక దాక్కునేవాడు. అతనికీ తనకీ మధ్య దోబూచులాడేవాడు. ఇప్పుడూ అంతే! దగ్గిరకి వచ్చేసి వళ్ళో ఎక్కికూర్చుంటాడు. వీడిని దగ్గిరకి తీస్తోందని తెలిసి, వాళ్ళ పిల్లాడిని నువ్వు ఎత్తుకు మొయ్యడమేంటని తండ్రి కోప్పడ్డాడు. తను దగ్గిరకి తీయడం తగ్గించింది.
ఎందుకు తనకి ఇలా జరిగింది? పసిపిల్లల మైమరపులకి దూరమైంది? పిల్లలసలు పుడతారా? పుట్టరా? పుట్టకపోతే తన జీవితానికి అర్థం ఏమిటి? మాధవ్ పెద్దమేనత్తని చూస్తోంది. ఆవిడ బాల్యవితంతువు. పిల్లల్లేరు. చెల్లెలి పిల్లల్నీ, తమ్ముడిపిల్లల్నీ పెంచుతూ గడిపిందట. ఎవరికి ఏ అవసరం వున్నా ఆవిడ వెళ్తుంది. ఆవిడ పాతతరం మనిషి. మరి తన జీవితం ఎలా వుండబోతోంది? గీత పిల్లల్ని పెంచడం, మాధురీ, మానసలకి అవసరాలొచ్చినప్పుడు వెళ్ళి తల్లికి సాయంగా నిలబడటం, అంతేనా అన్న ప్రశ్నతో మొదలై మనసులోని బాధంతా కన్నీటిరూపంలో బయటికి వచ్చింది. ఆమె ఎంతగానో కోరుకున్న ఏకాంతం అది. ఆ ఏకాంతంలోకి చాలా దు:ఖాన్ని వంపింది. ఇంకా మనసనే పాత్ర ఖాళీ అవట్లేదు. ఎంత సమయం గడిచిందో తెలీలేదు.
ఫోను మోగితే లేచి వెళ్ళింది. ఎత్తితే మాధవ్.
“మళ్ళీ బాబు పుట్టాడు. అత్త పోలికనుకుంటున్నారు. ఆవిడలాగే గుమ్మటంలా భలే వున్నాడు” అన్నాడు. అతని గొంతునిండా సంతోషం.
“అప్పుడే?!” నీలిమ తెల్లబోయింది. “గుమ్మటంలా బావుండడమేమిటి?”’అని నవ్వింది. “మీ వదినగానీ విందంటే తంతుంది” అని, “ఎలా వున్నారు తల్లీకొడుకులిద్దరూ?” అడిగింది.
“ఇక్కడెవరూ వెళ్ళనివ్వట్లేదుగానీ, చక్కగా వాడినెత్తుకుని ఇంటికొచ్చేసేలా వుంది” నవ్వాడతను. “కృష్ణ వస్తాడు, పాలు, కాఫీ, టీ, వేణ్ణీళ్ళు విడివిడిగా ఫ్లాస్కుల్లో పోసి బాస్కెట్లో సర్ది వాడితో పంపించు. నేను కాసేపట్లో వస్తాను” చెప్పాడు.
హడావిడి మొదలైంది. కాఫీటీలు, వేణ్ణీళ్ళు కాచి పెట్టింది. ఫ్లాస్కులన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నారు. వాటిల్లో పోసిపెట్టింది. మయూఖ్ లేస్తే వాడికి మొహం కడిగి పాలుపట్టింది. కృష్ణ తనతో తీసుకెళ్ళాడు. మళ్ళీ ఒక్కర్తే. తల్లితో మాట్లాడాలనిపించింది. అమ్మకన్నా బలమైన ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది? ఆవిడకీ బాధగానే వుంది. కానీ ఏం చెయ్యగలదు?
“బాధ వుంటుందిగానీ లోపలే దాచుకో. మీకిద్దరికీ వయసు మించిపోలేదు. పుడతారన్న ఆశ వదులుకోకు. సంకల్పబలం చాలా గట్టిది” అంటూ నాలుగుమాటలు చెప్పిందావిడ. ఆవిడ దగ్గిర్నుంచీ రీసీవరు తీసుకుని తండ్రి మాట్లాడాడు.
“ఆ టైమొస్తే పుట్టక ఎక్కడికి పోతారుగానీ, మీ బావ పొలం కొన్నాట్ట? అంత డబ్బెక్కడిదో ఏంటో తెలుసుకున్నావా? మీరెందుకు కొనలేదు? ఎకరమో రెండెకరాలో మీ పేరా పెట్టించుకోలేకపోయారా? ఇప్పుడీ పురిటికీ బారసాలకీ ఎవరు పెడుతున్నారు? ఏడుపులూ రాద్ధాంతాలూ కాదు, ఇవన్నీకూడా చూసుకోవాలి. ఉన్నదంతా వాళ్ళకే వూడ్చిపెట్టేస్తే రేపు మీరెలా బతుకుతారు? రెండుజీతాలవాళ్ళనీ, ఒంటిజీతగాడినీ ఒకేలా చూస్తే ఎలా? మీ అత్తగారికి చెప్పేవాళ్ళెవరూ లేరా? పెత్తనమంతా ఆవిడదేలావుంది. పెళపెళ్ళాడించేస్తోంది” అన్నాడు. ఆయన మాటలు నీలిమలో వున్న భావోద్వేగాలని ఒక్క దులుపు దులిపి, మనసుని ఖాళీ చేసాయి.
ఇంటికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, ఫ్లాస్కుల్తో కాఫీలు, టీలు పాలు సరఫరా ఔతున్నాయి. ఇడ్లీలు పెట్టమని, ఉప్మా చెయ్యమని ఫర్మానాలు వస్తున్నాయి. చేసి పంపిస్తోంది. వచ్చి బాబుని చూసి వెళ్ళమన్న పిలుపు ఆమెకి రాలేదు. తనని మర్చిపోయారా? కావాలనే వుపేక్షించారా? గొడ్రాలని తనమీద ముద్ర వేసారా? అప్పుడేనా? అందుకే పిలవలేదా? అందరూ సరే, వస్తానన్నవాడు మాధవ్ ఏమయ్యాడు? అతన్నికూడా అవమానించారా? తండ్రిమాటలకి పిట్టల్లా ఎగిరిపోయిన ఆలోచనలూ దు:ఖాలూ మళ్ళీ వచ్చి చేరాయి. ఒక్కర్తీ కూర్చుని గుండెలు అవిసిపోయేలా ఏడ్చింది. పదౌతుంటే వాసు వచ్చాడు మేనత్తని తీసుకుని.
“ఇందాకే రావల్సింది నీలిమా! తులసొచ్చింది. మాట్లాడుతూ కూర్చున్నాను. నువ్వెళ్ళు. ఇక్కడ నేను చూసుకుంటాలే” అందావిడ.
“పదమ్మా, వెళ్దాం” అన్నాడు వాసు. అర్జెంటు ఫైల్సున్నాయని ఆఫీసునించీ మనిషొస్తే మాధవ్ వెళ్ళాడని చెప్పాడు. అందరూ చూసాక ఇంక తప్పదన్నట్టు తను గుర్తొచ్చిందనుకుంది. అపార్థం అనేదానికి మనసులో బీజం పడితే అది మొలకెత్తకుండా వుండదు. మనసెంతో ప్రతిఘటిస్తుంటే అతని వెనక బైక్ ఎక్కి కూర్చుంది.
“కోడల్ని కనిస్తావనుకుంటే మళ్ళీ మగపిల్లాడిని కన్నావు వదినా!” వెళ్ళేసరికి గునుస్తోంది తులసి గీత దగ్గిర.
“మాదే మేనరికం. మళ్ళీ ఇదోటా? నాకు కూతురు పుట్టినా నీ కొడుక్కి ఇవ్వను. నీకు మళ్ళీసారి కూతురు పుట్టినా నా కొడుక్కి చేసుకోను. అదుగో, చిన్నొదిన వచ్చింది. తనతో బేరాలాడుకో” అందామె. గర్వమా? హేళనా? నీలిమకి మామూలుగా అనిపించలేదు ఆ మాటలు. పిల్లవాడిని చూసింది. మాధవ్ అన్నట్టు బొద్దుగా వున్నాడు. మయూలా పొడుగనిపించట్లేదు. వాడు తండ్రి పోలికైతే వీడు తల్లిపోలిక కావచ్చు. అమ్మమ్మ పోలికంటే అంతేకదా!
మూడోరోజుని డిశ్చార్జై ఇంటికి వచ్చింది గీత. ఆమె వంట, విహీ పనులు, మయూ గారాబాలు, ఇంటిపని, వచ్చివెళ్ళేవాళ్ళని చూసుకోవడం ఒకొక్కరూ మీదేసుకుని జాగ్రత్తగా చేస్తున్నారు.
మాధవ్ వాసు ఆఫీసుకి వెళ్ళి పదివేలు ఇవ్వబోయాడు. నీలిమకి అభ్యంతరం వుంటుందనుకోలేదు. స్వతంత్రించాడు.
“ఎందుకురా?” అన్నాడు వాసు తెల్లబోయి.
“ఉంచరా! బోల్డంత ఖర్చు. భూమికూడా కొన్నావు. కొంచెం కుదురుకున్నాక మళ్ళీ ఇవ్వచ్చులే. చాలా, ఇంకో పది తేనా బేంకునించీ?” అన్నాడు మాధవ్.
“మా దగ్గిరది సరిపోతుందిరా! అన్నీ లెక్కలేసుకునే కొన్నాను”
“అంత లెక్కలేసుకునే అవసరం నీకేంట్రా వాసూ? బారసాల ఘనంగా చేద్దాం. ఉండనీ. మిగిలిపోతే హడావిడయ్యాక తిరిగి ఇచ్చేద్దువుగాని” మాధవ్ బలవంతం చేసాడు. అతన్ని చిన్నబుచ్చడం యిష్టంలేక తీసుకున్నాడు వాసు. విషయం తెలిసి, నీలిమ ముభావంగా వుండిపోయింది. “ఇచ్చేసాక చెప్పడం దేనికి? ఇచ్చేముందే ఒకమాట అనాల్సింది” అంది. ఆమె ఆక్షేపిస్తుందనుకోలేదు. అతను తెల్లబోయాడు.
“వద్దనే అన్నాడు వాడు. కానీ ఇంతఖర్చులో వున్నాడు, ఇబ్బందిపడతాడని నేనే బలవంతంగా ఇచ్చాను. మిగిలితే బారసాల అవగానే ఇచ్చేస్తాడు. లేకపోతే కొంచెం టైము తీసుకుంటాడు” అన్నాడు మాధవ్. అనాల్సి వచ్చింది. నిజానికి వాసు తిరిగి ఇవ్వకపోయినా అతనికి పెద్దగా పట్టింపు వుండేదికాదు. అన్నదమ్ములు అంతంత లెక్కలు ఎప్పుడూ పెట్టుకోలేదు.
“పొలం కొనుక్కున్నారు. చేతిలో డబ్బు లేకుండానైతే అంతపెద్ద వ్యవహారానికి వెళ్లరు. ఇంకేం ఖర్చులుంటాయి? మిగిలిందంతా మీ అమ్మగారేకదా పెట్టుకునేది?” ఆరాగా అడిగింది.
“ఏమనుకుంటున్నావు? ఎవర్నిగురించి మాట్లాడుతున్నావు? ఇద్దరూ చాలా ఇండిపెండెంట్. మయూ పుట్టినప్పుడే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకున్నారు. మామయ్యని పెట్టనివ్వలేదు”
“ఏమో!” అంది నీలిమ. ఆమెకైతే నమ్మకం కలగలేదు. సంఘటనలన్నీ నమ్మకం అపనమ్మకం అనే రెండిటిమధ్య వుండే బరికి అటూయిటూ చేరినప్పుడు అనుబంధాలలో లోతు తగ్గుతుంది. ఆమె ఆ లోతుతక్కువతనంలో కొట్టుకులాడుతోంది. వాసూ గీతలతో అతనికిగల అనుబంధాన్ని ఆ విభజనరేఖమీద నిలబెట్టానని అనుకుంటోందిగానీ, ఆ నిలబడ్డది తామిద్దరి బంధంకూడా అని గ్రహించలేకపోయింది.
మాధవ్ ఇచ్చాడని తీసుకున్నాడుగానీ, ఆ డబ్బు వాడే వుద్దేశ్యం ఎంతమాత్రం లేదు వాసుకి. చిన్నకొడుకు పుట్టుక అప్పుతో మొదలవ్వడం ఇష్టంలేదు. అది పొలం కొన్న సంతోషాన్ని చంపేస్తుందని నమ్మకం. గీతకికూడా యిష్టంలేదు. అందులోనూ వున్నదంతా ఖర్చుపెట్టేస్తున్నారు, డబ్బు చాలక అప్పుచేస్తున్నామన్న భావనతో బెంబేలెత్తిపోయింది. మాధవ్‍ని రమ్మంది. అతని వెనక నీలిమకూడా వచ్చింది.
“ఇలా డబ్బులు ఎవరిదగ్గిరా ఎప్పుడూ తీసుకోలేదురా! అప్పుకదా? తప్పు చేసినట్టుంది. నాన్నకి తెలిస్తే కోప్పడతారు. పొలం కొంటున్నామంటేనే అంత డబ్బెక్కడిదని నిలదీసారు. మేము ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్నామని అనుకున్నారు. బావ షేర్లలో పెడతాడని చెప్పాను.
షేర్ల బిజినెసంటే జూదంకదమ్మా? పోతే, పోయిందని ఆడతారు. వస్తే, ఇంకా సంపాదించాలని ఆడతారు. అదొక వ్యసనం. ఎలా అలవాటైంది? ఎప్పట్నుంచీ మొదలుపెట్టాడు? ఎప్పుడూ నాకెందుకు చెప్పలేదు- అని నిలదీసారు. తనిప్పుడు అల్లుడుకదూ? అందుకని తనవంతు చివాట్లుకూడా నాకే పడ్డాయి” అంది బేలగా. కళ్ళమ్మట నీళ్ళొక్కటే తరువాయి. ఏం మాట్లాడాలో మాధవ్‍కి వెంటనే తోచలేదు.
“ఇంత అమాయకంగా వుంటే ఎలా బతుకుతారే? నువ్వు భయపడి వాడినీ బెదరగొడుతున్నావు. పెద్దౌతున్నావుకదు గీతా? ఇంకా స్కూలుపిల్లలా మాట్లాడితే ఎలా? నలుగుర్లోకీ వెళ్తున్నావు. లోకజ్ఞానం నేర్చుకోవాలి. మామయ్య విషయం వేరు. అప్పు తెచ్చినా తనకి తీర్చగలిగే పరిస్థితి వుండేది కాదు. అన్నదమ్ములమధ్య అవసరాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. దాన్ని అప్పనరు. ఆయనకి అదీ జరగలేదు. అలాగని మనమధ్యనికూడా వుండకూడదంటే ఎలా? రేపు నేను ఇల్లేనా స్థలమేనా కొంటే మిమ్మల్ని అడగనా? మిమ్మల్నేకాదు, మిగిలినవాళ్ళనీ అడుగుతాను. నేనూ యిస్తాను. లేకపోతే ఇన్నేళ్ళ మన స్నేహానికి విలువేంటి? బేంకులోన్లకీ, కోపరేటివ్ సొసైటీ లోన్లకీ వెళ్ళేకన్నా, ముందు ఇంట్లో యింట్లో సర్దుకుంటే మంచిదికదా? షేర్లనేవి ఇల్లీగల్ బిజినెస్ కాదు. అందులో డబ్బుపెట్టి లాభం తియ్యాలంటే చాలా తెలివి కావాలి. ఈ విషయంలో వాసుకి వున్న నాలెడ్జి నాకు లేదు. నేనూ పెట్టేవాడిని. అది తప్పైతే కమలాకర్‍గారు ఎందుకు చెప్తారు వాడికి? వాడెందుకు చేస్తాడు? వాళ్ళు వెళ్ళిపోయాక వాడు షేర్లలో పెట్టడం మానేసాడు. ఇప్పుడు పెట్టేది ఫండ్స్‌లో. రోజులు మారాయి. సంపాదనలు పెరిగాయి. ఎవరూ ఇద్దర్నీ ముగ్గుర్నీ మించి కనట్లేదు. ఎవరివీ మరీ హేండ్‍ టు మౌత్ జీవితాలుకాదు. బేంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనేకాదు, ఇంకా అనేకచోట్ల దాస్తున్నారు. మామయ్యకి నేనూ వాసూ చెప్తాంలే” అన్నాడు. ఆమె తలూపింది.
“ఆఫీసులో నీమీద వత్తిడి ఏమైనా వస్తోందా? కొన్ని బ్ర్రాంచిల్లో డబ్బివ్వనిదే పనులు జరగవు. ఈ సిస్టమ్‍ని నువ్వూ నేనూ మార్చలేం. అలాంటి సమస్య వస్తే అంతగా ప్రాధాన్యత లేని బ్రాంచికి అడిగి వేయించుకో. భయపడకూడదు, లొంగకూడదు. మన తెలివితేటలు ఆఫీసువర్కులోనే చూపించక్కర్లేదు. ఇంట్లోకూడా చూపించుకోవచ్చు. పిల్లల పెంపకంలో చూపించచ్చు. ఇంకా చదువుకోవచ్చు” అన్నాడు.
“నువ్వు లంచం తీసుకుంటావా?” కొద్దిగా సంకోచించి అడిగింది గీత.
“తీసుకోను” స్థిరమైన జవాబు వచ్చింది అతన్నుంచీ. “ఆ కారణాన్న నేనూ చాలా ఇబ్బందులు పడాల్సొస్తోంది. తప్పదు. బ్రిటిషువాళ్ళు తగలబెట్టిపోయారు దేశాన్ని. దొంగలు దోచినట్టు దోచారు. దొంగలైతే దోచుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు మన సంస్కారానికి నిప్పంటించి వెళ్ళారు. ప్రతివాడికీ వాడిది కాని డబ్బుమీద ఆశే. వాళ్ళు నేర్పించారు. వాళ్ళని చూసి నేర్చుకున్నారు. ఇచ్చే జీతాలు చాలవు. పైన ఐదు పదీకోసం ఆరాటపడిపోతూ వుంటారు. మనింట్లో డబ్బులకోసం కక్కుర్తిపడాల్సిన పరిస్థితిలేదు. మనం అలా పెరగలేదు” అన్నాడు. పిల్లాడు ఆకలికి లేచాడు. మాధవ్ లేచి ఇవతలికి వచ్చాడు. నీలిమ రెండునిముషాలు అక్కడే వుండి, గీతకేమైనా కావాలేమో అడిగి, తనూ వెళ్ళింది.
“అదేమిటి, చదువుకుని వుద్యోగం చేస్తూ వాళ్ళ నాన్నకి అలా భయపడుతుంది? ఆయన సరదాగానే వుంటారుగా?” ఆశ్చర్యంతో తలమునకలౌతూ అడిగింది.
“పెద్దౌతే అమ్మానాన్నలకి భయపడక్కర్లేదంటావా?” అడిగాడతను. “మరైతే నేను? నీకు భయపడాలా?” నవ్వులాటగా మార్చేసాడు.


బారసాల మొదట వేసుకున్న లెక్కలప్రకారమే ఘనంగా జరిగింది. అటూయిటూ తేడాలో ఇంట్లో పెద్దతరం అంతా దాదాపు రిటైరయ్యారు. ఏదేనా వేడుక వస్తే అందరూ తీరుబడిగా బయల్దేరుతున్నారు. లీవు పెట్టాలి, దొరుకుతుందో, దొరకదో అన్న దిగులు లేదు. తిరిగి వెళ్ళిపోవాలన్న హడావిడి లేదు. పరుగు పెట్టి పెట్టీ ఆగి శ్వాస తీసుకుంటున్నట్టుగా వుంది అందరికీ. సంకెళ్ళలోంచీ విడుదలై స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటునట్టూ వుంది. రాణా, యమున తప్ప అందరూ వచ్చారు. మహతిని చూస్తే సంతోషం వేసింది గీతకి. ఆమెకి చెరోవైపూ కూర్చుని తమమధ్య మాటలు కలవకుందా జాగ్రత్తపడుతూ చాలాసేపు మాట్లాడారు గీత, సుమతి.
ఎంతోకాలం తర్వాత గురుమూర్తి సంతోషంగా వున్నాడు. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవడు అందరూ బయల్దేరి నాలుగు బైకులమీద వచ్చారు. ఆయన అలా సంతోషంగా వుంటే ఇల్లే వెలిగిపోతున్నట్టుంది. వాసు పొలంకొన్నాడన్నది అందరికీ ఒక సంచలనవార్త. అద్దెయిళ్ళలో గడిపి, చిన్నదేనా ఒక గూడు వుండాలని కలలు కని, నానాపాట్లూ పడి ఒకింటివాళ్ళమయ్యాం అనిపించుకున్న తరం అది. గురుమూర్తి మొదట్లోనే ఇల్లు కట్టుకున్నా పిల్లలు పెద్దవాళ్లయాక అమ్మేసాడు. రెండోసారి కొన్నది సుమతికి పెళ్ళికి తీసేసాడు. సుధీర్ మళ్ళీ కొని, లోన్ ఇస్‍స్టాల్‍మెంట్స్ కడుతున్నాడు. ఇల్లూ, స్థలం, ఇప్పుడీ పొలం. ఇంత చిన్నవయసులో అన్నీ అమరిన గీతనీ వాసునీ చూస్తుంటే అందరికీ ఇన్స్పిరేషన్‍లా అనిపిస్తోంది. ముగ్గురక్కచెల్లెళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. కుటుంబరావు వెళ్ళి పద్మా, రాజశేఖరాల పక్కని కూర్చుంటే ఆయన భార్యమాత్రం పద్మని పలకరించి, లక్ష్మి దగ్గర కాసేపు కూర్చుని, అరుణదగ్గిర స్థిరపడింది.
వాసు దగిర్నుంచి విహంగ్‍ని తీసుకుని సుమతి ముద్దుచేసింది. పురిటివళ్ళు తీసేసి కాస్త బక్కగా అనిపిస్తున్నాడు వాడు. రంగుకూడా తక్కువ. నలకలా వున్నాడు ఆమె కట్టుకున్న పసుపురంగు పట్టుచీరమీద. మనసులోంచీ వుబికిపడే మమకారాలకి బాహ్యరూపం ఆటంకం కాదు.
“అరేయ్, మీ నాన్న ఇంతెత్తుని పహిల్వాన్లా వుంటాడు. నువ్వేమో బల్లిలాగా నల్లిలాగా కంటికి ఆనకుండా వున్నావు. వాడు ఎత్తుకుంటే నువ్వస్సలు కనిపించట్లేదు తెలుసా?” అంటోంది మురిపెంగా. విజ్జెమ్మ వింది ఆ మాటలని.
“నల్లీ, బల్లీ అంటావేంటే వాడిని? ఇలాంటి వూసులతోనే పెంచుతున్నావా నీ కొడుగ్గాణ్ణి? బంగారుకొండా, బాచాలతండ్రీ, వజ్రాలమూటా కాసులపేరూ అని ముద్దుచేస్తారు పిల్లల్ని. రాముడంటారు, బాలకృష్ణుడంటారు” అంది.
“ఊ< నల్లీ బల్లీ అంటే కనీసం మాకు అంటుకునేనా వుంటాడు. బంగారుకొండా, వజ్రాలమూటా అను నువ్వు, కౌబాయ్‍లా గుర్రం ఎక్కి వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు” అంది గీత. ఆ సంభాషణ విని మానస ఫక్కుమని నవ్వింది. “మీ వదిన ఇలానే మాట్లాడుతుందా ఎప్పుడూ?” అడిగింది పక్కనే వున్న వసంత్‍ని. అతనూ నవ్వాడు.
“వాడినిలా ఇవ్వవే” అడిగాడు గురుమూర్తి. సుమతి అందించింది. “నాలుగెకరాల భూస్వామి నాన్నా!” అంది ముచ్చటగా.
ఆయనకి పిల్లలంటే చాలా యిష్టం. మొదట్లో కొంచెం బెట్టు చూపించినా, వరసపెట్టి ఈ సైన్యాన్నంతటినీ ఎత్తుకు తిప్పినవాళ్ళలో ఆయనా వున్నాడు. ఇప్పుడు మళ్ళీ పరుగులు తీస్తూ కాళ్లకి అడ్డాలు పడుతున్నవాళ్ళూ, వళ్ళో వుండకుండా జారిపోతున్నవాళ్ళూ, పొత్తిళ్లలోనూ, అమ్మల బొజ్జల్లోనూ వున్నవాళ్ళూ కొత్తటీమ్‍గా తయారౌతూ వుంటే తమాషాగా వుంది. యూయస్ వెళ్ళే ఆలోచన వుందిగాబట్టి అక్కడికెళ్ళాక కనచ్చనే ఆలోచనలో వున్నారు సుధీర్, రమ. లత విషయం ఇంకా తెలిదు.
“ఏమే గీతా! వీడెక్కడా కామందులా లేడుగానీ సైకిలుషాపుకి పంపించి పంపుకొట్టించమ్మా!” అన్నాడు పెళ్ళున నవ్వుతూ.
“వాడినిటివ్వు మామయ్యా! ఇందాకట్నుంచీ ఇద్దరూ ఒక్కలా వాడి తాళం పట్టిస్తున్నారు” చురచుర చూస్తూ ఆయనదగ్గిరకి వెళ్ళింది ఆమె.
“ఓసి…ఓసి… ఎంత కోపమే!” నవ్వాపకుండా అన్నాడు.
“బర్త్ వెయిటూ అదీ బానే వున్నాడట. హెల్త్ ఇష్యూస్ కూడా ఏవీ లేవు. మళ్ళీ వళ్ళుచేస్తాడు మామయ్యగారూ!” అంది రమ గీత కోపం చూసి నవ్వుతూ. సుధీర్ తలూపాడు. పిల్లాడికోసం చెయ్యిచాపాడు. రమ తీసుకొచ్చి యిచ్చింది.
“పొలం ఎక్కడ కొన్నారే?” చెయ్యిపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంటూ అడిగింది ప్రమీల. గీత చెప్పింది.
“డబ్బెక్కడిదే?” అడిగాడు గురుమూర్తి ఆరాగా.
“సేవింగ్సన్నీ తీసేసాం మామయ్యా! అత్తా! జీపీఎఫ్‍లోంచీ లోను తీసుకోడానికి ఆరోగ్యకారణాలని అబద్ధం రాయాల్సి వచ్చింది. నాకేదోగా వుంది” అంది చిన్నబుచ్చుకుని. ప్రమీల నవ్వింది.
“ఎప్పుడో మాంధాతలనాడు రాసిపెట్టుకున్న రూల్స్. ప్రతీదీ ముక్కుసూటిగా వెళ్ళాలనుకుంటే కుదరదే. లౌక్యంగా పని నడిపించుకోవాలి. మంచిపనే చేస్తున్నారు. పిల్లలు పెద్దౌతే మళ్ళీ ఏవి కొనాలన్నా కుదరదు. బోల్డంత ఖర్చుంటుంది” వోదార్పుగా అంది. తలూపి, ఇంకెవరో పిలిస్తే వెళ్ళింది గీత.
“ఆవగింజ మోకాల్న విరుస్తుందట. ప్రహ్లాద్‍గాడి భార్య అందామధ్యనోసారి” అన్నాడు గురుమూర్తి.
“మీరు ఆడాళ్ల కబుర్లుకూడా వింటున్నారేంటి రిటైరయ్యాక?” అడిగింది ప్రమీల.
“మేం వినాలనే, వినేలా మాట్లాడుకుంటారుకదా?” అన్నాడాయన.
“రాములాగే పొదుపరి. అవసరంలేనిదే గిజామన్నా ఒక్కపైసకూడా ఖర్చుపెట్టదు. దీనిదగ్గిర కాకపోతే ఆ అన్నవాళ్లదగ్గిర పోగుపడుతుందా, డబ్బు? బారసాల బానే చేస్తున్నారుగా? వీళ్ళదేట ఖర్చంతా. పెద్దాడికికూడా అలాగే పెట్టుకున్నారుగానీ, రాముకి అలాంటివి నచ్చద్దూ? మయూ పేరుమీద అకౌంటు తెరిచి ప్రతినెలా కొంచెంకొంచెం వేస్తున్నాడట. వాడికి ఐదో అరో నిండగానే ఆ డబ్బూ చేతికొస్తుంది. వీళ్ళు మళ్ళీ ఏదో వింత చేస్తారు. మనం చూసి ఆశ్చర్యపోవడమే” అంది ప్రమీల. అని, “వీళ్ళింట్లోకూడా గొడవలు మొదలౌతున్నాయి. మాధవ్‍కి ఇల్లొదిలేసి, మీరెళ్ళి గీత స్థలంలో కట్టుకోండని అన్నాడట పద్మ భర్త. లక్ష్మి పద్మని దులిపేసిందట”
“అదేమిటే? లంకంత ఇల్లు. లక్ష్మికి ఉన్నది ఇద్దరు కొడుకులు. అందులో ఒకడు, అందునా పెద్దకొడుకు వేరే వెళ్ళడమేమిటి? ఎక్కడా వినం” ఆశ్చర్యంగా అన్నాడు.
“చాలా మతలబులు వున్నాయి. ఇది పచ్చగా విరగబుసిన చెట్టులా వుంది. అంతా స్వంతవాళ్ళమేకాబట్టి బడబడ మాట్లాడుతుంది. నీలిమ దీన్ని ఓర్చడం లేదు. వాళ్ళు ముగ్గురక్కచెల్లెళ్లదీ వేరే తీరు. అదికాక అసలు కారణం ఇంకోటి వుంది. పద్మభర్తకి రియల్ ఎస్టేట్లోకి దిగాలని వుంది. ఫ్రెండ్సున్నారు. నాలుగైదువందలగజాల పాతయిల్లు కళ్ళముందు కనిపిస్తుంటే చేతులు దురదలెత్తిపోతున్నాయి. అదలాగే వుంటే ఏ వ్యాపారం జరగదు. ఎవరికీ లాభాలుండవు. నెమ్మదిగా వాసుని దూరం జరిపి, మాధవ్‍ని మచ్చికచేసుకుంటే ఇంటిని డెవలప్‍మెంటుదాకా తీసుకెళ్ళచ్చని ఆలోచనేదో వున్నట్టుంది. వాడు భోళాశంకరుడు. మెతకమనిషి. ఇందులో వాడికి జరిగే నష్టం ఏమీ వుండదుగానీ, కొంత వ్యాపారం జరుగుతుంది. బైటివాళ్ళో నలుగురు లాభపడతారు” లోగొంతుకతో అంది.
“వాసు ఏమంటున్నాడు?”
“వెళ్ళనని కచ్చితంగా చెప్పేసాడట”
“బాగా చెప్పాడు. తప్పుకదే, వాడినలా అనడం? ఐనా దిట్టంగా వున్న ఇల్లు పడగొట్టుకుని అపార్టుమెంటు కట్టుకోవడమేమిటి? కుదిర్తే ఇది ఇలాగే వుంచుకుని వేరే కొనుక్కోవాలి. అదిసరే, అంత వీళ్ళ బాగుకోరేవాడైతే ఆ చెప్పేదేదో వాసుకే జెప్పచ్చుకదా అతను, ఇల్లొదిలేసి వెళ్లమనే బదులు?” అన్నాడాయన.
“వాడికి సలహాలిచ్చేవాళ్ళు వేరే వున్నారు. రాము, త్రిమూర్తులు, గీత పాత ఆఫీసరు. ఇల్లు పడగొట్టడానికి వాళ్ళెవరూ అస్సలు వప్పుకోరు. పడగొడితే మళ్ళీ ఇలాంటి ఇల్లు కట్టగలరా? ఇప్పుడు కాదుగానీ, వీలుచూసుకుని మాధవ్‍ని పిలిచి హెచ్చరించండి, రియల్ ఎస్టేట్‍వాళ్ళ మాయలో పడద్దని” అంది ప్రమీల.
వాళ్ళింట్లోనూ చిన్నగా చీలికలు వస్తున్నాయి. రమ కుటుంబంలో ఇమిడిపోయిందిగానీ, లత యిబ్బంది పడుతోంది. విశాలమైన ఇంట్లో ఒక్క ఆడపిల్లగా అన్ని సౌకర్యాలతోనూ పెరిగిన పిల్ల మూడు బెడ్రూమ్స్ ఫ్లాట్‍లో తమ మూడు జంటలూ, మధ్యలో వచ్చిపోతుండే సుమతికీ మధ్య ఇరుకిరుగ్గా వున్నట్టు ఫీలౌతోంది. సాంప్రదాయమో, సుమంత్‍మీది ప్రేమో, సర్దుకునే ప్రయత్నం చేస్తోందిగానీ, ఆమె తల్లిదండ్రులుమాత్రం కూతురు కష్టపడిపోతోందని గాభరాయెత్తిపోతున్నారు. ఎవరూ బయటికి అనట్లేదు. ఐనా వ్యక్తమౌతోంది. వాళ్ళింటికి వచ్చి వుండండని సూచనప్రాయంగా సుమంత్‍తో అన్నారు. అతను అర్థం కానట్టు వూరుకున్నాడు. బాహాటంగా అడిగితే కాదనలేకపోవచ్చు. కాదంటే గొడవలౌతాయి.
అరుణ యింట్లో మరొక రకం. మాధురిది అన్నిట్లోనూ చొరబడిపోయే తత్వం. ప్రహ్లాద్ ప్రతీదీ తనకి చెప్పి చెయ్యాలంటుందట. తమందరూ చాలా క్రమశిక్షణతో, పొదుపుగా బతికి, పిల్లలకి బాధ్యతలు పంచకుండా వుండేసరికి వాళ్ళకి కష్టమనేది తెలీకుండా వుంటోంది. మాటపంతాలూ, అత్తమామల వునికి ఇవే పెద్దసమస్యలుగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లల్ని కని ఏవో కష్టాలు అనుభవించేసినట్టు అనుకుంటారుగానీ, నిజానికి మగపిల్లవాడితో వుండేది జీవితకాలపు సమస్య. విడదీసుకోవడానికి వీల్లేకుండా ఎన్నో ముళ్ళు. అన్నిటికీ మించినది కొడుకన్న వ్యామోహం.
వసంత్ ఇంట్లో గొడవేంటో! మొదట్లో మానస తిరగబడి జవాబిచ్చేదట. వసంత్ ఎలా నచ్చజెప్పాడోమరి! రాజశేఖరం ఏమన్నా చెవిటిదాన్లా వుపేక్ష వహిస్తోందట. పిల్లలు పట్టించుకోకుండానూ, విలువివ్వకుండానూ వుంటే ఇంక ఆ పెద్దరికం దేనికి? అటు రాణా బాధ్యత తెలీకుండా తయారయ్యాడు. గీత ముందుపడి అందర్నీ కూడగట్టకపోతే యమున బతికిబట్టకట్టేది కాదేమో! ప్రమీల ఆలోచనలన్నీ తిరిగితిరిగి గీతదగ్గిరకి వచ్చి ఆగాయి. దానికి ఈ ఇంట్లోవాళ్ళంటే ఎందుకంత ప్రేమ? మళ్ళీ చిన్నపిల్లలాగే వుంటుంది. సుమతిలా తెలివితక్కువమాటలూ మాట్లాడుతుంది. అలుగుతుంది. దెబ్బలాడుతుంది. వాసుకే సరేమో అది!
రిటైర్మెంటు డబ్బు, పెన్షను, బాధ్యతలు తీరటం, పిల్లలు ప్రయోజకులవటం పెద్దవాళ్ళ జీవితాల్లోనూ, కొత్తగా వచ్చిన పే కమిషను గీతావాసుల జీవితాల్లోనూ మార్పులు తెచ్చాయి. ఆర్థికవిధానాల్లో గవర్నమెంటు పాలసీలు మారాయి. దానికితోడు ఎలక్టానిక్ యుగం ఆరంభంలో వుండి, సమాజంలో ఏవో మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందులా కాకుండా చేతుల్లో కాస్తంత డబ్బు ఆడుతోంది. విహీకి కానుకలు బాగా వచ్చాయి. వాసు ఆడపిల్లలందరికీ మంగళహారతి భారీగా వేసాడు. వాళ్లంతా లెక్కలుపెట్టుకుని పంచుకున్నారు. చిన్నవాళ్ళు ముగ్గురికీకూడా ఇవ్వబోయారు, మరదళ్ళైనా.
“మాకేం అక్కర్లేదు. మాకూ అన్నలున్నారు. అప్పుడు మేం ముగ్గురమే పంచుకుంటాం” అంది శేఖర్ కూతురు వీణ మూతిముడుచుకుని.
“అరేయ్, నువ్వు పెళ్ళిచేసుకోరా! మాకూ డబ్బులొస్తాయి” అంది పల్లవి కృష్ణతో.
“నీకు మంగళహారతి కట్నాలివ్వడానికి నేను పెళ్ళిచేసుకోవాలా? ఏం తెలివేబాబూ? డబ్బులు కావాలని నేరుగా అడగచ్చుకదా” అన్నాడు కృష్ణ. అతనిది బీటెక్ ఐపోయింది. ఉద్యోగంకూడా వచ్చింది. వెళ్ళి చేరటంవుంది.
“రేపు మీ అందర్నీ సినిమాకి తీసుకెళ్ళి, ఐస్‍క్రీం కూడా తినిపిస్తాడులేవే” బుజ్జగించింది గీత.
“వాళ్ళేనా? మేమూ వెళ్తాం సినిమాకి. మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో, ఇలా అందరం కలవటం. మాకూ తీసుకోరా” అంది సుమతి.
“అందరికీ తలో విజిలు, హీరో ఎంట్రీకి కాగితంముక్కలు విసుర్తారే, అవికూడా కావాలి” అంది రవళి.
“దేనికే?” అన్నాడు కృష్ణ హడిలిపోయి.
“హీరోయిన్ తలవెంట్రుకో, పైట అంచో ఎంట్రీ యిచ్చినప్పుడు మేం కూడా విజిళ్ళేసి కాగితంముక్కలు ఎగరేస్తాం” అంది సుమతి. లత, రమ నవారు. ఇద్దరికీ ఇలాంటి అల్లర్లు అలవాటే.
“వీళ్ళంతా చాలా అడ్వాన్సైపోయారు. నువ్వేం మేనేజి చేస్తావుగానీ, మాకూ టికెట్లు తియ్యరా” అన్నాడు సుమంత్.
“ఒక బాక్సంతా చేసెయ్యరా! అందరం కలిసి వెళ్దాం” అన్నాడు ప్రహ్లాద్.
“సీనియర్స్‌నికూడా పట్టుకుపోదాం. అంతా రిటైరయ్యారుకదా?” అన్నాడు సుమంత్. అంతా గోలగోలగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు పెరిగిపోతున్నారు. మర్నాడు మార్నింగ్‍షోకి రెండుబాక్సులూ బుక్‍చేసుకోవడానికి నిర్ణయమైంది. తెలిసిన థియేటరే. సిన్మాహాలు ఓనరు రవి క్లాస్‍మేట్. షరతులు వర్తిస్తాయి. ఆడవాళ్ళు ఒకదాంట్లోనూ, మగవాళ్ళు మరొకదాంట్లోనూ కూర్చోవాలి. ఆడైనా, మగైనా పిల్లలంతా మగవాళ్ళే. సినిమా మొదలైనప్పట్నుంచీ ఆరారగా స్నాక్సూ, కూల్‍డ్రింకులూ సప్లై వుండాలి. గబగబ చెప్పేసారు రవళీ, సుమతీ.
“ఏకేవీ. ఎవరి ఖర్చులు వాళ్లవి” అంది సుమతి. మొదట్నుంచీ అలవాటైన పద్దతి అదే.
అంత సంతోషం మధ్యా దు:ఖాన్ని మనసునిండా నింపుకుని బయటపడకుండా తిరుగుతున్న వ్యక్తులు ఇద్దరు. నీలిమ చాలా వెల్తిపడుతోంది. అందరిమధ్యకీ రావడానికి అవమానపడుతోంది. మాధవ్‍కికూడా ఒక్కపిల్లో పిల్లవాడో పుట్టి వుంటే బావుణ్ణని అందరికీ అనిపించింది. ఆ భావం ఎవరి చూపుల్లో కనిపించినా ఆమె తట్టుకోలేకపోతోంది. ఇద్దరు కొలీగ్స్ కుటుంబాలతో వస్తే వాళ్లకి ఆమెని పరిచయం చేసాడు మాధవ్. అక్కడ మాట్లాడుతూ, మర్యాదలు చూస్తూ దూరదూరంగా వుండిపోయింది.
సంధ్య భర్త రాలేదు. వస్తాడు వస్తాడందిగానీ, అతను రాడని అందరికీ అర్థమైంది. ఆమె నిశ్శబ్దంగా ఒకవార కూర్చుంది. బాధపడ్డం లేదు. బాధపడటం ఎప్పుడో మానేసింది. ఏ ఫంక్షనుకి పిలిచినా వస్తుంది. ఎందులోనూ కలగజేసుకోకుండా, ఏదీ తనకి పట్టనట్టు కూర్చుంటుంది. రవి వచ్చి దగ్గర కూర్చున్నాడు. అతని మనసులో చెప్పలేని బాధ సుళ్ళు తిరుగుతోంది. అది తిరిగి తీసుకోలేని తప్పు చేసినప్పటి పశ్చాత్తాపంలాంటిది. ఆమె చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు. విడిపించుకుంది. బారసాల పీటలమీంచీ లేచి, అందర్నీ భోజనాలకి పంపించి వాసుకూడా వచ్చాడు.
“పిన్నీ! నాకుగానీ, గీతకిగానీ నీమీద ఎలాంటి కోపం లేదు. ఆరోజు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ వుండిపో” అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
“పోనీ, పెద్దాడిదగ్గిరకి వచ్చెయ్. మాకున్నదే నీకూ పెడతాడు. ఆ పిల్లనీ, మనవల్నీకూడా తెచ్చేసుకో. తండ్రిదగ్గిరుండి చేసుకునే వుద్యోగం ఏదో ఇక్కడుండి చేసుకుంటుంది” అంది విజ్జెమ్మ.
“పెళ్ళికిముందే నా కొడుకుని వల్లో వేసుకున్నది నాకేమౌతుందే? ఆ పిల్ల నా కోడలూ కాదు. వాళ్ళు నాకు మనవలూ కాదు” ఛర్రుమంది సంధ్య. “నేనెవరింటికీ రాను. నాకు తిండి పెట్టాల్సిన బాధ్యత నీ అల్లుడికి ఇంకా గుర్తుందిలే” ఆమె మనసు రాయిలా కఠినంగా వుంది. లోలోపలి వూట దాన్ని మెత్తబరచగలదేమోగానీ పైపైనుంచీ వచ్చిన ఓదార్పుమాటలు కాదు.
వీళ్ల మాటలు సాగుతూ వున్నాయి, పద్మ గీతని పిలిచి అంది, “వ్యవసాయం మనింట్లో ఎవరూ చెయ్యలేదు. ఆ పొలమ్మీద అంత డబ్బు పోసే బదులు, మీ నాన్న నీకిచ్చిన స్థలం ఖాళీగా పడుంది. అందులో రెండుగదులు కట్టుకోవచ్చుకదే?” అని. గీత జవాబిచ్చేలోగా ప్రహ్లాద్ వెళ్ళిపోయాడు ఆమధ్యలోకి. వియ్యంకులిద్దరూ అది తమకి సంబంధం లేని విషయమన్నట్టు దూరంగా వెళ్ళారు.
“అలా అనచ్చా పిన్నీ? వాసు బాధపడడా? డెవలపయే కాలనీలో మనంకూడా ఇల్లు కడితే వుపయోగం వుంటుందిగానీ, క్రిక్కిరిసిపోయిన యిళ్ళమధ్య కడితే స్థలంమీద ఇంకాస్త పెట్టినట్టవదా? లక్షలో ఇల్లంటే ఏ రెండుగదులో వెయ్యగలుగుతారు. అందులో ఎవరొచ్చి వుంటారు? అద్దేం వస్తుంది? రాని అద్దెకోసం పెట్టుబడి ఎవరేనా పెడతారా?” అన్నాడు.
“అదికాదురా! అద్దెలకోసం ఇళ్ళు కట్టం. వీళ్ళే వెళ్ళి వుండాలి. మొదట రెండుగదులు వేసుకుంటే తరవాత వీలునిబట్టి పెంచుకోవచ్చు. మేమంతా అలా కట్టుకున్నవాళ్ళమే. కొన్నాళ్ళు ఒక్కగదిలో కాపురం వున్నాం మేమైతే” అంది పద్మ. ఆమెకూడా వాసు చెప్పే మేథావివర్గంలోని మనిషే. ఎంత తెలివితక్కువగానేనా మాట్లాడగలదు.
“వాసుకేం ఖర్మే, అలా ఓ గదిలోనూ రెండుగదుల్లోనూ కాపురం వుండటానికి? మాయింటికి మహారాజు వాడు. అవన్నీ నీ కొడుక్కి చెప్పుకో పో” అంత దూరాన్నించీ ఆ మాటల్ని విని దగ్గిరగా వస్తూ అంది లక్ష్మి .
“నాకున్నది ఒకడే కొడుకు. వున్నదేదో వాడికే వెళ్తుంది. మరి నీకు? ఇద్దరు. పెద్దాడు ఇలా ఆస్తులమీద ఆస్తులు పోగేస్తున్నాడు. ఉన్నది ఒక్క యిల్లు. అందులోకూడా వాటా యిస్తే చిన్నాడేమైపోవాలి? ఇద్దరూ నీ పిల్లలేకదా?” అంది పద్మ. ఆమెమీద భర్త వత్తిడి బాగా వుంది. ఆయన్ని కుటుంబరావు సన్నసన్నగా ఎగేస్తున్నాడు. పద్మ ఆ మాటలంటున్నప్పుడు గీత ప్రహ్లాద్ వెనక కుర్చీకి ఆనుకుని నిలబడింది. అప్పుడు చూసింది మాధురి ఇద్దరిలో కనిపించే స్పష్టమైన పోలికలని. అదీకాక ప్రహ్లాద్ గీతకన్నా సుకుమారంగా వున్నాడు. పద్మ చెప్పడం అయింది. గీతకి మనసుకి లోతుగా ఎక్కడో గుచ్చుకుంది. కోపంగా వెళ్ళబోయింది.
“ఓయ్, వదినమ్మా! ఇప్పుడెళ్ళి వాసుకి మోసెయ్యకు. మేం ఇక్కడ మాట్లాడుతున్నాం. తెలిస్తే వాడు బాధపడతాడు” అన్నాడు ప్రహ్లాద్.
“నేను బాధపడితే పర్వాలేదుగానీ వాసు బాధపడకూడదా? అదేం వుండదు. సంతోషపడ్డా, బాధపడ్డా ఇద్దరం కలిసే పడతాం” అంది గీత అడుగు ముందుకేసి. ఐపోయింది వదినగారి పిలుపులోని మర్యాద.
“ఇక్కడికి రావే బాబూ, ముందు నువ్వు” అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కొచ్చి కుర్చీలో కుదేశాడు ప్రహ్లాద్.
“అరేయ్, అరేయ్, అదేమైనా ఇదివరకట్లా చిన్నపిల్లనుకుంటున్నావా? ఇద్దరు పిల్లల తల్లి. బాలింత. వళ్ళు అదురుతుంది” కంగారుగా కేకలేసింది లక్ష్మి. తప్పుచేసినట్టు అతని ముఖం పాలిపోయింది. “సారీ! గీతా! ” అన్నాడు నొచ్చుకుని.
“పర్వాలేదు ప్రహీ!” అంది గీత.
“అత్తా! ఈ విషయం మొదటిసారి వచ్చినప్పుడు వసంత్ మాయింటికొచ్చి సారీ చెప్పాడు.
నువ్వెందుకు బాధపడుతున్నావు, మనపైన పెద్దవాళ్ళు చాలామంది వున్నారు వాళ్ళు చూసుకుంటారు- అన్నాను. మళ్ళీ ఇప్పటిదాకా ఎవరూ అనలేదంటే ఎవరో ఒకళ్ళు సర్దిచెప్పి వుంటారనుకున్నాను. ఇవాళ మళ్ళీ నువ్వు ఎత్తావు. అంటే ఇదింకా నడుస్తునే వుందన్నమాట. ఇప్పుడింక విను. మేము ఆ యిల్లు వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళేది లేదు. నేను ఆ యింట్లో మూడోతరం కోడల్ని. నాకిద్దరు కొడుకులు. నా కోడళ్ళుకూడా అదే యిల్లు మెట్టాలని అనుకుంటున్నాను. నా కోరికని నా పిల్లకికూడా నేర్పిస్తాను. ఇల్లు ఇప్పటికైతే దృఢంగా వుంది. ఒకవేళ లోపలి ఇటుక గుల్లబారి, మళ్ళీ కట్టుకోవలసిన అవసరం వస్తే, అవే పునాదులమీద మళ్ళీ కట్టుకుంటాంగానీ స్ట్రక్చరు మార్చం. మాధవ్‍నికూడా పలకరించి చూడు. తనూ ఇదే అంటాడు. ఇంక ఆస్తులంటావా, ఎవరి సంపాదనలూ, ఖర్చులూ, దాపరికాలనిబట్టి సమకూరుతాయి” అంది స్థిరంగా. ఆమాటలకి పద్మ ఖంగుతింది.
“మీకంటే రెండు జీతాలుకదే?” అంది కాస్త తేరుకుని.
“ఇద్దరం పనిచేస్తున్నాం కాబట్టి” అంది గీత.
“అందరికీ వుద్యోగాలు రావద్దే?”
“కదా? మరి అలాంటప్పుడు వాళ్ళ అదృష్టాలతో మాకెందుకు ముడిపెడుతున్నావు? మాకు వున్నదీ లేదు, వాళ్లకి లేనిదీ లేదు. మాధవ్‍వాళ్ళు పొలం వద్దనుకున్నారు. కొనలేదు. మేం కొని బైటపడ్డాం. అంతేనా?” అని లేచి, పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. లక్ష్మి వెనకే వెళ్ళింది. ఈ సందర్భంలో పద్మ అలా అనడం ఆవిడకి బాధని కలిగించింది. గీతని చూసి పద్మ అసూయపడుతోందని అర్థమైంది. ఖర్మ! దీంతో పద్మకి పోలికేమిటి? ఓ వయసువాళ్ళూ కాదు, సరిసాటివాళ్ళూ కాదు. తలపట్టుకుంది.
“తాతముత్తాతలు ఇచ్చిన యిల్లు వదిలి వెళ్ళిపొమ్మంటే ఎవరూ తేలిగ్గా తీసుకోరు పిన్నీ! వాసు చాలా సున్నితం. వాడికి కోపంకూడా ఎక్కువే. వాడికి కౌంటర్‍బేలన్సు సుధీర్. సుధీర్ ఇప్పుడు ప్రాక్టీసు, వుద్యోగం, అమెరికా వెళ్ళే ప్రయత్నాలల్లో తలమునకలుగా వున్నాడు. పెళ్ళికూడా అయింది. ఈ విషయాల్లో తలదూర్చే టైముండదు. రాణా విషయంలో ఏం జరిగిందో మీకు తెలీదా? వాసూ, రవిమామయ్యా కలిసి అనుకుంటే రాణాని దార్లో పెట్టకపోదురా? వదిలేసాడు. గాలికి తిరుగుతున్నాడు రాణా. ఇంకోసారి ఇలా మాట్లాడద్దు. అన్నదమ్ములిద్దరూ ఒక ప్రాణంలా బతికారు ఇప్పటిదాకా. వాళ్లని విడగొట్టకు ఇలాంటి మాటలతో. మాధవ్ మీచేత అనిపిస్తున్నాడనుకుంటున్నాడు వాసు” అన్నాడు ప్రహ్లాద్.
“మాధవ్‍కి అంత తెలివి వుంటే బానే వుండేది” అతని చివరిమాటలకి జవాబుగా అంది పద్మ.
“వాడిమీద కొత్తగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకిద్దరికీ? పిన్నీ! తెలుసుకోలేనంత తెలివితక్కువవాళ్ళం కాదు. వాళ్ల యింటిమీద మనకి కలలుండకూడదు. ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తేనే అందరికీ బావుంటుంది” పైకి మామూలుగానే వున్నా ప్రహ్లాద్ గొంతులో కాస్త కాఠిన్యం తొంగిచూసింది. పద్మ చిన్నబుచ్చుకుంది.
మాధురి మొత్తం సంభాషణ వింది. ఇతనేమిటి, వాసుని వెనకేసుకుని వస్తాడు, గీతని బతిమాలతాడు? వాళ్ళతనికి కజిన్స్ మాత్రమే. నీలిమ తనకి స్వంత చెల్లెలు. తోడల్లుడుకాబట్టి మాధవ్ ఇంకా దగ్గిర. చేతనైతే వాసుని వప్పించాలి. గీత నోరుమూయించాలి. అంతేగానీ, ఈవిడ్ని బెదిరిస్తాడేంటి? ఇందులో ప్రహ్లాద్‍కి అర్థమైందేమిటి? అది తనకెందుకు చెప్పలేదు?
గీతమాటల్ని మననం చేసుకుంది. ఎంత గర్వం ఆమెకి! ప్రేమించి చేసుకుందనా? ఇద్దరు పిల్లలనా? ఇద్దరూ మగపిల్లలనా? నీలిమకి పిల్లల్లేరనా? సొంతసంపాదన వుందనా? ఆ యిల్లు వదిలిపెట్టేది లేదని ఎంత నిర్మొహమాటంగా చెప్పింది! అంతంత ప్రేమలున్నాయని చెప్పుకుంటారు, మాధవ్‍కోసం ఆ పాతకొంప వదులుకోలేదా? కనీసం పౌరుషం లేదా, వెళ్ళమంటుంటే ఇల్లు పట్టుకుని వేలాడటానికి? పంతమా? అందరి అండా వుందనా? ఉక్రోషంతో రగిలిపోయింది. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం ఆమెది. ఇప్పటిదాకా అలా ఎవర్నీ సాధించి నెగ్గే అవకాశం ఎప్పుడూ దొరకలేదు. తనలో తను రగిలిపోయేది. పెత్తండ్రిపినతండ్రిఅత్తల పిల్లల్తో సమానఫాయిదాలో చుట్టరికాలు సాగలేదు. వీళ్ళ చెయ్యి కొంచెం కింద వుండేది. ఇప్పుడిక సాధించడానికి టార్గెట్‍లా గీత దొరికింది. మనుషుల ఈ మనస్తత్వాలేవీ ఐదునిముషాల పరిచయంలోనూ పదినిముషాల పెళ్ళిచూపుల్లోనూ బయటపడవు. పరిచయాలు, పెళ్ళిచూపులు, ఒక నిర్దుష్టమైన కాలక్షేపం, ఇచ్చిపుచ్చుకోవటాలు, పెళ్ళి అనే అంశాలవెనక దాక్కుంటాయి. తర్వాత బయటపడటానికి అవకాశాలని వెతుక్కుంటాయి.
వచ్చిన అతిథుల్లో బయటివాళ్ళు చాలామంది పేరుపెట్టెయ్యగానే భోజనాలు చేసి వెళ్ళిపోయారు. సాయంత్రం తొట్లో పెట్టే కార్యక్రమానికి రామారావు కుటుంబం, కొందరు అతిముఖ్యమైనవాళ్ళు మాత్రమే మిగిలారు. లక్ష్మి ఇంటి చుట్టుపక్కలవాళ్ళు పేరంటానికి వచ్చారు. ఎప్పుడో దశాబ్దాలనాడు తాత పడుక్కున్న వుయ్యాలని విహంగ్ వేడుకగా అధిష్టించాడు. పిల్లవాడికి చేస్తున్న చదివింపులనీ, ఇంటికి వచ్చినవాళ్ళకి జరుగుతున్న మర్యాదలనీ ఒకమూలనుంచీ డేగకళ్లతో గమనిస్తున్నాడు కుటుంబరావు. ఆయనది మొదట్నుంచీ కింది చెయ్యే తప్ప పెట్టుమనస్తత్వం కాదు.
“వీళ్ళ జమీందారీ పోకళ్ళు మండిపోను. వచ్చేవాళ్ళు వస్తారు, వాళ్ల తాహతుకీ వీళ్ళతో వుండే మొహమాటానికీ తగ్గట్టు పెడతారు. అంతకంతా తిరిగి పెట్టగలమా? ఇంటికొచ్చినవాళ్ళందరికీ చీరలూ సారెలూ ఏమిటి? ఇలాగైతే ఈ కుటుంబం నిలబడుతుందీ? ఇలా దానధర్మాలు చేసి నామరూపాల్లేకుండా కొట్టుకుపోయినవాళ్లని ఎందర్ని చూడలేదు?” అని గిజగిజలాడిపోయాడు. పక్కని భార్యేనా కూతుళ్ళేనా వుంటే బైటికే అంటున్నాడు. భార్యైతే ఎవరేనా విన్నారేమోనని భయపడుతూ చుట్టూ చూస్తోంది. కూతుళ్ళుమాత్రం విషంలా ఆమాటల్ని మనసుల్లోకి ఎక్కించుకుంటున్నారు. ఆయన లెక్కలో ఖర్చు వియ్యపురాలిది, రాబడి గీతది. గీత, నీలిమకి ప్రత్యర్థిలా బరిలో నిలబడి కనిపిస్తోంది.
రాత్రౌతుంటే త్రిమూర్తులి మనవడు మాధవరావు భార్యనీ, పిల్లల్నీ తీసుకుని వచ్చాడు. ముగ్గురు పిల్లలతనికి. వాళ్ళ చిన్నకొడుకు విజయ్‍కి ఏడాది. మాధవరావు మాధవ్ క్లాస్‍మేటు. ఇద్దరి పేర్లూ ఒకటే కావటంతో మాస్టర్లు తికమకపడేవారు. వీళ్ళు కాక అమ్మాయిల్లో ఒకరు, అబ్బాయిల్లో ఒకరు వెంకటరమణ అనే పేరుగలవారు వుండేవారు. ఒకళ్ళని పిలిస్తే ఆ యిద్దరో, ఈ యిద్దరో లేచి నిలబడేవారు. ఆడ వెంకటరమణా, మగ వెంకటరమణా అని వాళ్ళనీ, పొట్టి మాధవ్, పొడుగు మాధవ్ అని వీళ్ళనీ పిలిచేవారు. మాధవరావుకన్నా మాధవ్ ఎత్తుతక్కువ. ఇద్దరు మాధవ్‍లూ ఒకరినొకరు చూసుకుని, ఆ విషయాలు గుర్తుతెచ్చుకుని నవ్వుకున్నారు. ఎప్పుడు కలిసినా వాళ్లకి ముందు గుర్తొచ్చేవి అవే.
అతిథుల్ని చూసి ఇంట్లో అందరూ హడావిడిపడుతుంటే కుటుంబరావు ఆరా తీసాడు.
“తాతయ్య సరుకు పనిమీద నార్త్ వెళ్ళారు గీతా! రావటానికి నెలేనా పట్టచ్చు. వచ్చాక ఈ కొత్తమనవడిని చూసుకోవటానికి వస్తారు” అన్నాడు మాధవరావు. త్రిమూర్తులు ఇంట్లోంచీ ఎంతో ముఖ్యమైనవారింటికి తప్ప వెళ్ళరు. వాళ్ళకి వూపిరిసలపనన్ని వ్యవహారాలు. త్రిమూర్తులు అనేక మార్గాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాడు. ఎక్కడికైనా తీరికచేసుకుని వెళ్ళాల్సిందేతప్ప తీరిగ్గా వెళ్ళడం వుండదు అతనింట్లో ఎవరికీను. అలాంటిది ఆయన ఎక్కడో వుండి, వెళ్లమని ప్రత్యేకంగా ఫోన్‍చేసి చెప్తే వచ్చారు మాధవరావు, రోహిణి. త్రిమూర్తులు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన గీతని కుతూహలంగా చూసింది రోహిణి. ముదురునీలంరంగు పట్టుచీరలో తెల్లగా కాస్త లావుగా ఐనా వుంగరాలజుత్తుతో అందంగా వున్న రోహిణిని గీతకూడా అలానే చూసింది. తర్వాతికాలంలో అనేక సందర్భాల్లో కలుసుకున్నా ఇద్దరిమధ్యా పెద్దగా స్నేహం పెరగలేదు. ఎవరి సర్కిల్స్‌లోంచీ వాళ్ళు బయటికి రాలేకపోవడం మొదటికారణం కావచ్చు. భోజనాలవీ చెయ్యలేదు వాళ్ళు. బలవంతంమీద ఫలహారాలు తిన్నారు. అటూయిటూ పెట్టుపోతలయ్యాయి. వస్తామని చెప్పి లేచారు.
వాళ్లని సాగనంపి ఇంట్లోకి వచ్చింది లక్ష్మి. రాత్రి భోజనాలయ్యాయి. మర్నాడు సినిమాహాల్లో కలుద్దామని చెప్పుకుని అందరూ వెళ్ళిపోయారు.
“ఇక్కడ వండించేస్తాను. మళ్ళీ మీ యిళ్ళలో వంటలవీ పెట్టుకోకండి. మార్నింగ్‍షో చూసి తిరిగివెళ్ళి వండుకునేసరికి ఆలస్యమౌతుంది” అంది లక్ష్మి.
“అందరం తలోటీ వండి తెచ్చేస్తాంలేవే” అంది అరుణ. “అల్లుళ్ళున్నారుకదే? కాస్త పాతబడనీ” అంది లక్ష్మి.
కుటుంబరావూ, భార్యాకూడా బయల్దేరుతుంటే ఆపేసింది. “తొందరేమీ లేదుగా? రెండురోజులు వుండి వెళ్ళండి” అంది. నీలిమకూడా అంది. నిజానికి ఇక్కడే వుండి, జరిగేవన్నీ ఇంకా చూడాలని కుటుంబరావుకే వుంది. అందుకే మరోసారి అనిపించుకోలేదు.
“బారసాలకి రెండురోజులు భోజనాలా? ఒక్క పురిటికి ముగ్గురు బైటిమనుషులు నెలలతరబడి కూర్చుని తినడమా? ధర్మసత్రం కాదుకదా మీ యిల్లు? మాధురీ, మానసా కనలేదా? ఈ అమ్మాయొక్కర్తేనా? ఐనా రెండో పురుడు అత్తవారింట్లో పొయ్యాలని ఏ శాస్త్రం చెప్పింది? అన్నగారికి ఖర్చు తప్పించాలనుకుందేమో మీ అత్తగారు! ఈ విషయం ఇక్కడితో ఐపోయిందా? రేపు అక్కావాళ్ళ విషయంలో ఏం చేస్తారో నేను చూస్తానుకదా? నీలిమా! ఇలాగైతే కొంప కొల్లేరౌతుంది. నువ్వు నడుం బిగించి దారికి తీసుకురాకపోతే ఈ యిల్లుకూడా మిగలదు, చెప్తున్నాను” అన్నాడు కుటుంబరావు కూతురిని పక్కకి తీసుకెళ్ళి. మాధవ్ పదివేలిచ్చిన విషయం చెప్పింది నీలిమ.
“ఇస్తున్నట్టు నాకు తెలీదు. ఇచ్చేసాక చెప్పారు. అదో పెద్ద డ్రామాలే” అంది.
“మీ దగ్గిర్నుంచీ పదివేలు పట్టించారా? తిరిగొస్తాయీ? చెయ్యిదాటిన డబ్బూ, గోడకి వేసిన సున్నం ఒకటే. మీ ఆయన వట్టి అమాయకుడు. ఏదీ తెలీదు. నువ్వుకూడా ఇలా వుంటే ఎలానే? గొడవచెయ్యద్దూ, ఎందుకిచ్చావని? వాళ్ళిద్దరిగురించీ నాకే బెంగా లేదు. మానసకూడా వాళ్ళ మామని బానే అదుపులో పెట్టింది. నీగురించే నాకు బెంగ” అన్నాడు. అప్పటిదాకా భర్తకి ఎలాంటి మద్దతూ పలకని ఆయన భార్యకూడా ఈ పదివేలమాట విని కొంచెం ఆయనవైపు తూగింది.
“ఏమో నాన్నా! నామాట ఎవరూ వినరు, పట్టించుకోరు. నువ్వన్నావు ఇంటిపెత్తనం చేతిలోకి తీసుకొమ్మని. ఇక్కడ పెత్తనమంటే యింటెడు చాకిరీ, పైసపోతే ప్రాణంపోతుందన్నట్టు దేవులాడుకుంటూ బతకడం. అవి నాకెందుకూ, మా తోటికోడలినే చేసుకోనిమ్మని వదిలేసాను. ఆమె మాటే చెల్లుతుంది అన్నిటికీ. మాయింట్లో రోజూ కత్తిమీద సాములాగే వుంటుంది. వంట ఆవిడిష్టం, వడ్డన ఆవిడిష్టం. ఏం తినాలో, ఎలా వుండాలో ఆవిడే చెప్తుంది. ఆవిడేం చేసినా మా అత్తగారు మాట్లాడదు. మీ అల్లుడూ అంతే. పొద్దున్నే లేచి ముందు ఇంతన్నం వుడకేసి పడేస్తుంది. అన్నాలు తిని ఆఫీసుకెళ్ళడం నేనిక్కడే చూస్తున్నాను. టిఫెను తిని బాక్సుల్లో అన్నాలు పెట్టుకునేవాళ్ళం మనింట్లో. వీళ్ళలా కాదు. పదింటికి భోజనం చేసి బాక్సుల్లో టిఫెను తీసికెళ్తారు. నా టైమొచ్చేసరికి అన్నీ మిగుళ్ళే. చల్లారిపోయి వుంటాయి. అలా కాదన్నానని నా వంట నన్ను వండుకొమ్మన్నారు. అదీ అయింది కొన్నాళ్ళు” అంది నీలిమ కన్నీళ్ళు పెట్టుకుని. ఎప్పటెప్పటి విషయాలో గుర్తుతెచ్చుకుని చెప్పింది. మనసులో ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన అసంతృప్తిని పొరలుపొరలుగా విడదీసి పరిచింది. తండ్రితో ఇంత చొరవగా ఇంతకుముందెప్పుడూ మాట్లాడలేదు. ఆయన ముగ్గురాడపిల్లలని ప్రపంచభారం అంతా తనే మోస్తున్నట్టు బాధపడి వూరికే పిల్లల్ని కసురుకునేవాడు. ఇది కొత్త సామరస్యం.
“అంత పదింటికి అన్నమేం దిగుతుందే?” ఆశ్చర్యంగా అడిగాడు. ఈ వివరాలన్నీ పూసగుచ్చినట్టు భార్య తెలుసుకుని తనకి చెప్పాలని అనుకుంటాడు. అంత గుచ్చిగుచ్చి అడగటం ఆవిడకి రాదు. చాలా విషయాలు వుపేక్షించదగ్గవనిపిస్తుంది. ఏ యింటికి తగ్గ పద్ధతులు ఆయింట్లో వుంటాయి. అవి బైటినుంచీ వచ్చేవాళ్ళకోసం ఒక్కసారిగా మారవు. అలాంటి విషయాల్లో మగవాళ్ళు తలదూర్చినప్పుడు హుందాతనం లోపిస్తుంది. మాధవ్ రావడంతో సంభాషణ ఆగిపోయింది.
“ఇక్కడ కూర్చున్నారేంటి? లోపల అందరూ వున్నారు. పదండి. నీలూ! మనగదిలోకి తీసుకెళ్ళచ్చుకదా? ఇద్దరూ కాస్త విశ్రాంతి తీసుకునేవారు” అన్నాడు. అంతా కలిసి లోపలికి వెళ్ళారు.
అందరూ అలిసిపోయి వుండటంతో తొందరగా నిద్రలు పట్టేసాయి. మర్నాడు లేచి కాఫీఫలహారాలు కానిచ్చుకుని సినిమా ప్రయాణానికి తయారయ్యారు. విజ్జెమ్మ, సక్కూబాయి గీతకి తోడుగా వుంటామన్నారు. లక్ష్మి, యశోద తాముకూడా ఆగిపోతామన్నారు.
“ఇంతోటి ఒక్క పిల్లాడికి ఇంతమంది కాపలానా?” అని కోప్పడి యిద్దరూ వాళ్ళని పంపించారు. నిజానికి సక్కూబాయినికూడా వెళ్ళమనే అంది విజ్జెమ్మ. ఆవిడ తనకి సినిమాలు చూసే అలవాటు లేదంది.
“పోనీ నువ్వెళ్ళచ్చుగా అత్తా! ” అని ఆవిడంటే విజ్జెమ్మ తనకి సినిమాలు నచ్చవనేసింది.
“ఏముందమ్మా, ఆ సినిమాల్లో? ఆడామగా అలా తోటలమ్మటా దొడ్లమ్మటా పాటలు పాడుకుంటూ తిరగడం, లేదంటే కంటికి కడివెడేసిచొప్పున ఆడాళ్ళు కన్నీళ్ళు కార్చడం. కష్టాలొస్తే పదిమంది తలోచెయ్యీ అందించి ఆ మనిషిని బైటపడెయ్యద్దూ? తలో రాయీ విసిరినట్టు చూపిస్తారు. నాకన్నా, నీకన్నా పెద్ద కష్టాలు పడ్డవాళ్ళున్నారా? మనం కన్నీళ్ళు తుడుచుకుని వాటిల్లోంచీ ఇవతలికి రాలేదూ? మనకి మనవాళ్ళు సాయాలు చెయ్యలేదూ? అలాంటివి చూపించాలి. అప్పుడు జనానికి సాటివారికి సాయంచెయ్యాలని తెలుస్తుంది. ఏడ్చేడ్చి చివర్లో మగాళ్ళ కాళ్ళమీద పడితే ఏమొచ్చు?” అంది.
“వదిన రావట్లేదా?” అడిగాడు మాధవ్ అక్కడికొచ్చి. వాళ్ళ సంభాషణ ఆగింది.
“అదెలా వస్తుందిరా?” అందావిడ.
“తనని వదిలేసి మేమంతా వెళ్ళామని పిల్లిశాపాలు పెడుతుంది. ఈవిడ శాపాలకి బండి టైర్లో గాలి దిగిపోవడమో, పంక్చరవడమో జరుగుతుంది” అన్నాడు మాధవ్. అతను మాటకి ముందూ, మాట తర్వాతా నవ్వుతునే వుంటాడు.
“పోనీ నేనూ వుండిపోనా?” అడిగాడు వాసు గీతని.
“కుసుమ పిన్నిని గుర్తుచేసుకో. ఇంకో పుష్కరకాలందాకా తనకి టైంపాస్” అంది గీత.
“అయ్యబాబోయ్! నిజమే” అన్నాడు వాసు.
అందరూ తయారయ్యారు. వాసు రెండోమేనత్త కృష్ణవేణి. ఆవిడా, పిల్లలూ, అల్లుళ్ళూ, మనవలూ, తులసీ, భర్తా, కుటుంబరావూ, ఆయన భార్య, యశోద, లక్ష్మి, రామారావు, ఇలా చాలామందే అయారు. అందర్నీ ఆటోల్లో ఎక్కించి, రామారావుని వాసూ, నీలిమని మాధవ్, వెనక ఎక్కించుకుని బైకులమీద బయల్దేరారు. అల్లుడి వెనక బైకెక్కి వెళ్తున్న రామారావుని చూసి కుటుంబరావుకి అసూయలాంటిది కలిగింది. తనని ఏ అల్లుడూ అలా ఎక్కించుకోడు. ఎవరికివాళ్ళే భార్యల్ని ఎక్కించుకుని వెళ్తారు. తామిద్దరినీ ఆటోలో కుదేస్తారు. కమలాక్షి, లక్ష్మి, యశోద ఒకదాంట్లో ఎక్కారు. కమలాక్షి ముభావంగా వుంది. జరుగుతున్నదంతా చూస్తుంటే అప్పుచేసి పప్పుకూడు తింటున్నట్టు అనిపించింది. లక్ష్మి కుటుంబంమీద వున్న విలువ తగ్గింది.
లక్ష్మి కుటుంబం సినిమాహాలుకి వెళ్ళేసరికి దాదాపుగా అందరూ వచ్చేసి వున్నారు. హాలు ఆవరణంతా స్టూడెంట్స్‌తో నిండి వుంది. వీళ్ళు రెండు బాక్సులూ బుక్‍చేసుకోగానే రాజావారి కాలేజి విద్యార్థులకీ పూర్వవిద్యార్థులకీ అని బోర్డు పెట్టేసి లోకల్‍గా వున్న స్నేహితులకి ఫోన్లుకూడా చేసి మిగిలిన టికెట్లు అమ్మేసుకున్నాడు హాలు ఓనరు. ఎంతో డబ్బా టాకీసులో, వారంక్రితం రిలీజైన సినిమాకూడా హౌస్‍ఫుల్లైపోయింది. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుండటం అవంతీపురంలో అలవాటే. ముందుగా అనుకున్నట్టే చెరోబాక్సులోకీ వెళ్ళడానికి ఆడా మగా విడిపోయారు.
“గీత లేకుండా ఇంతమందిమి ఇలా బైటకి రావడం ఇదే మొదటిసారికదూ!” అంది మహతి నాలుగడుగులు వేసాక.
“అదొస్తే ఇంత సైలెంటుగా వుండేదికాదు. అందర్నీ హోరెత్తించేసేది” అంది రవళి.
“మమ్మల్ని వదిలేసి మీరంతా చక్కా వెళ్ళిపోయేవారు. అప్పుడెప్పుడూ మీకు అనిపించలేదేం?” దెప్పింది ప్రవల్లిక.
వెళ్ళి సీట్లలో సర్దుకుని కూర్చున్నారు. ముగ్గురక్కచెల్లెళ్ళూ పక్కపక్కని కూర్చున్నారు. ఎవరి కంఫర్ట్ జోన్, స్నేహబృందం వాళ్ళదన్న ఆలోచనతో ఎప్పుడూ వాళ్లకి అలాగే సీట్లు వదిలేస్తారు అందరూ. కళ్లసౌంజ్ఞలతోటే వాళ్ళమధ్య మాటలు నడిచిపోతున్నాయి. గీత లేకపోవడం నీలిమకీ మాధురికీ థ్రిల్‍గా అనిపించింది. ఆ విషయం ఇంకా ఇద్దరికీ అర్థం కాలేదుగానీ వాళ్ల ప్రపంచంకూడా ఆమెచుట్టే తిరుగుతోంది. మానస అంతగా పట్టించుకోలేదు. ఇందరితో కలిసి రావడం, ఎటు తలతిప్పినా అంతా తెలిసినవాళ్ళే వుండటం గమ్మత్తనిపిస్తోంది ఆమెకి. ముఖ్యంగా పెళ్ళికి ముందు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా భయంగా వుండేది. అందులోనూ వీళ్ళు బొమ్మల్లా చాలా బావుంటారు. మగపిల్లలు ఏడిపించేవారు. ఏదో ఒకటి అనేవారు. తండ్రికి చెప్పుకోవడానికి వుండేది కాదు. చెప్పినా,
“వాళ్ళు నిన్నే అన్నారని నీకెలా తెలుసు? నువ్వు అటుకేసి చూడకపోతే వాళ్ళు నిన్ను చూస్తున్నారని నీకెలా తెలుస్తుంది? కాలేజి లేనప్పుడు బుద్ధిగా ఇంట్లో కూర్చోక సినిమాలకీ షాపులకీ ఎందుకు? ఆ శింగార్ కుంకం పెట్టుకోకపోతే కాలేజికి రానివ్వరా? రబ్బర్‍బేండ్లు లేకపోతే జడేసుకోవడం రాదా? లాగితే తెగిపోయే రబ్బర్‍బేండ్లమీద డబ్బెందుకు తగలేస్తారు? రిబ్బన్లు పెట్టుకోవచ్చుకదా?” అని నానా ప్రశ్నలూ వేసేవాడు. నిజానికి చుట్టూ వున్నవాళ్లతో గొడవపెట్టుకోవాలని ఏ మగవాళ్లకీ వుండదు. అంత ధైర్యం వీళ్ళకి లేక భార్యల్నీ, చెల్లెళ్ళనీ, కూతుళ్లనీ అదుపుచెయ్యాలని చూస్తారు. ఆడవారిని అణిచిపెట్టేది ఇంట్లోని మగవాళ్లనుకుంటారుగానీ కాదు, బైటిమగవారివలన వుండే భయం వారిచేత అలా చేయిస్తుంది. బయటివారికి సంస్కారం వుండి, ప్రతియింట్లోని స్త్రీనీ గౌరవిస్తే ఈ అణచివేత చాలావరకూ తగ్గుతుంది. ఒకరో ఇద్దరో మిగిలిపోతే వారిని సంస్కరించడం తేలిక. స్త్రీవాదులుకూడా ఈ మూలకారణం వదిలేసి, ఇంట్లోవాళ్ళని తప్పుబడతారు.
పెళ్ళికిముందులాకాక ఎక్కడికేనా ధైర్యంగా వెళ్లగలుగుతోంది మానస. నువ్వేం తప్పు చేసావన్న యక్షప్రశ్నలు ఆగాయి. ఏదేనా వుంటే వసంత్‍కి చెప్తుంది. అతను తనుగా పరిష్కరిస్తాడు, లేదంటే ఎలా ఎదుర్కోవాలో చెప్తాడు.
మగవాళ్లవైపు బాక్స్ వచ్చేవాళ్ళూ వెళ్ళేవాళ్లతో హడావిడిగా వుంది. ఎవరెవరో వచ్చి వీళ్లని పలకరిస్తున్నారు. వీళ్ళు బైటికెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. వసంత్‍ని ఫ్రెండ్సొచ్చి తీసుకెళ్ళారు. సుమంత్ నాలుగుసార్లు బైటికి వెళ్ళి వచ్చాడు. ఎవరూ అక్కడ డాక్టర్లలా, ఇంజనీర్లలా, వుద్యోగస్తుల్లా వుండట్లేదు. ఓ పదేళ్ళో ఐదేళ్ళో కాలంలో వెనక్కి ప్రయాణం చేసినట్టున్నారు.
“తమాషా చూడండి” అంది కుసుమ వున్నట్టుండి. ఏమిటోననుకున్నారు అందరూ. వాసు లేచి నిలబడ్డాడు. “అదుగో, హీరోగారు లేచారు. ఇంటికెళ్ళి హీరోయిన్ని పట్టుకొస్తారు” అంది నవ్వుతూ. ఆమెకూడా మాధవ్‍లా గలగల నవ్వుతూ మాట్లాడే మనిషి.
“నిజంగానే?” అంది పద్మ ఆశ్చర్యంగా.
“అది రాకపోతే ఎవరికీ తోచదు. వీళ్ళందరి బుర్రల ఫ్యూజులూ దానిదగ్గిర వుంటాయి” అంది కుసుమ.
“నిజమేనండీ” అంది పక్కనున్న లత చిన్నగా. సుమతి తన పక్కని లేకపోవడంతో. ఆమె పెదాలమీద చిరునవ్వు. ” సుమంత్‍కన్నా నేను కాస్త పెద్దకదా, అందుకు వాళ్ళవాళ్ళు వప్పుకుంటారో లేదోననే భయం వుండేది. అదీకాక వాళ్ళన్నయ్యగారికి ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళే చేసుకోనన్నారట. ఎటూ తోచని పరిస్థితి. మా పెళ్ళికి రికమెండేషన్ చేస్తుందని సుమంత్ నన్ను వెంటేసుకుని గీత చుట్టూ తిరిగేవాడు. ఈ అమ్మాయేం చేస్తుంది, అనుకునేదాన్ని నేను. వెళ్ళి బావగారితో మాట్లాడేసి పెళ్ళికి వప్పించిందట. ముందసలు మాకు లైన్ క్లియరైంది”
“మా సుమంత్‍లో ఏం నచ్చింది నీకు?” కుసుమ ప్రశ్నలో కనీకనిపించని అల్లరి. లత సిగ్గుపడింది.
“బావుంటారు, సరదాగా మాట్లాడతారు”
“నువ్వు మీరంటున్నావేంటి? వాడుకదా, అనాల్సింది?” కుసుమ మనసులోని అల్లరి పెదాలమీదికి వచ్చి చేరినట్టు చిరునవ్వు.
“పీటలమీంచీ లేచాక ఎవరు ఎవరి కాళ్ళకి దణ్ణం పెట్టాలో తెలీక ఇప్పటికే ఇద్దరూ తికమకపడుతున్నారు. మళ్ళీ ఇదోటా?” అంది రమ.
“ఓయ్, నువ్వుకూడానా?” అలిగింది లత. రమ నవ్వింది. ఈ ఇద్దరూ సమవుజ్జీలు. గీత, నీలిమల్లా కాదు.
కుసుమ అన్నట్టుగానే వాసు హాల్లోంచీ ఇవతలికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి, గీతని కాసేపు తనతో తీసికెళ్తానంటే విజ్జెమ్మ సరేనంది. పిల్లలు అడిగింది ఆవిడ ఎప్పుడూ కాదనలేదు. ఎలాగో ఒకలా సర్దుబాటు చేసేది. ఇప్పుడూ అంతే. గీతని వదిలేసి వెళ్తున్నామని మాధవ్ అననే అన్నాడు. అందరూ వెళ్ళి తనొక్కర్తీ వుండిపోయిందని గీతకీ అనిపించిందేమో! చిన్నబుచ్చుకుందేమో! ఒకమాటు వెళ్ళొచ్చేస్తే పోయేదేమీ లేదనిపించింది.
“పోన్లే , వెళ్తే వెళ్ళుగానీ, తలనొప్పొస్తుందేమో, బొమ్మ చూడకు. ఇంటర్వెల్‍దాకాకూడా వద్దు. కాసేపు కూర్చుని వచ్చెయ్. హాలు రవి ఫ్రెండుదేగా? గేటు తియ్యమంటే తీస్తారు. వీణ్ణి మేం చూసుకుంటాం. ఇప్పుడేగా, పాలు తాగింది? ఏడవడు. మరేం పర్వాలేదు. నడికట్టు ఇప్పేస్తే నడవగలవా? కళ్ళు తిరుగుతాయేమోరా! జాగ్రత్త. బండిమీదొద్దు. వాసూ! ఆటోలో తీసుకెళ్ళు” ఇన్ని జాగ్రత్తలు చెప్పి పంపింది విజ్జెమ్మ.
“ఈ అమ్మాయీ మీకు బంధువులమ్మాయేనా?” పక్కనున్న లక్ష్మిని అడిగింది నీలిమ తల్లి. కుసుమ ఆవిడకి రవి భార్యగా మాత్రమే గుర్తు.
“మా పెద్దమేనమామ కూతురు. చిన్నతమ్ముడికి చేసుకున్నాం” చెప్పింది లక్ష్మి.
“మీ మేనమామలెవరూ బారసాలకి వచ్చినట్టు లేరు?”
“రాలేదు” పొడిగా జవాబిచ్చింది లక్ష్మి. రెండోవైపుకి తలతిప్పితే పక్కనున్న ప్రమీల ఇంకేదో అడిగింది. ఎవరో ఒకరు మాట్లాడుతునే వున్నారు. ఐదునిముషాలైంది. హాలు తలుపులు వేసేసారు. స్లైడ్లు పడుతున్నాయి. అందరూ తెరమీద దృష్టిపెట్టారు. మాటలు ఆగాయి. ఒకవిధమైన నిశ్శబ్దం పరుచుకుంది. కొద్దిసేపే. ఇటువైపు హాలు తలుపు తెరుచుకుంది. గీత, వాసు వస్తున్నారు.
“హీరోయినొచ్చింది. వెయ్యండే ఈలలూ” అంది కుసుమ పెద్దగా. అట్నుంచీ సుమంత్ నవ్వు గట్టిగా వినిపించింది.
“ఈయనదంతా అట్టహాసం. ఇక్కడ నవ్వితే వూరవతలదాకా వినిపిస్తుంది” అంది లత.
వెంటనే కంయిమని పల్లవి ఈల వూదింది. ఆ తర్వాత వరసపెట్టి ఇట్నించీ ఈలలు, అట్నించీ నవ్వుల్తో హాలు దద్దిరిల్లిపోయింది. కిందని బాల్కనీలోంచీకూడా ఈలలు మొదలవ్వడంతో భయపడిపోయింది నీలిమ. వీళ్ళు ఎందుకేస్తున్నారో తెలీక కొందరూ, వీళ్ళు వేస్తున్నారని మరికొందరూ వెయ్యసాగారు. నెమ్మదిగా సద్దుమణిగింది.
“భయపడకు. రాము బావతో మొదలెట్టి, వీణదాకా అందరూ రాజావారి స్కూల్లోనూ కాలేజిలోనూ చదువుకున్నవాళ్ళే. సినిమాహాలు ఓనరు రవి క్లాస్‍మేటు. అన్ని టికెట్లు మనం కొనగానే మిగిలినవి ఫ్రెండ్సందరికీ ఫోన్లు చేసి మరీ అమ్మేసాట్ట. ఈ హాల్లో ఇలాంటివి మామూలే. పెళ్ళిళ్ళసీజన్లోనైతే ఇంకా జరుగుతాయి. వియ్యాలవారి కయ్యాలలాళ్టి సినిమాలు అడిగి వేయించుకుంటారు. అదో సరదా. అంతా చిన్నప్పట్నుంచీ ఒకళ్ళకొకళ్ళు తెలిసినవాళ్ళు. ఇక్కడే పుట్టి పెరిగినవాళ్ళు” నీలిమకి ధైర్యం చెప్పింది పక్కనే వున్న కుసుమ. మాధురికిమాత్రం వళ్ళు భగ్గుమనిపోయింది. తాము ముగ్గురూ చాలా అందంగా వుంటారని పేరు. అది చూసేకదా, వీళ్ళు కట్నాలు లేకుండా చేసుకున్నది? చేసుకున్నంతదాకానే ఆ మురిపెం. తర్వాత తమకి ఒక్క ప్రశంసా లేదు. మట్టగిడసలా వుండే ఈ గీత హీరోయినా? ఈమెకోసమా, యీలలూ హడావిడీను? ముందే అనుకున్నారా, ఈమెనిలా తీసుకొచ్చి హడావిడి చెయ్యాలని? ఒక్కళ్ళుకూడా బైటపడలేదు. ప్రహ్లాద్, మాధవ్, వసంత్‍కూడా వున్నారా, ఈ కుట్రలో? ఆమె రాదనుకుని సంతోషపడ్డారు తాము ముగ్గురూ. ఇదేంటి, ఇక్కడికికూడా తయారైపోయింది? పెద్దవాళ్ళు ఎవరూ ఏమీ అనరా, అప్పుడే సినిమాకి బయల్దేరినందుకు? చిరచిరలాడిపోయింది ఆమెకి. పక్కకి తిరిగి చూసింది. నీలిమ పరిస్థితికూడా అలానే వుంది.
గీత వచ్చి చివరిసీట్లో కూర్చుంది. పలకరింపులు, నవ్వులు, పరిహాసాలు, మాటలు కలగాపులగంగా సాగుతున్నాయి. సినిమా ఎవరూ చూడట్లేదు. దాని దారిన అది నడుస్తోంది. పదినుముషాలుకూడా వుండలేకపోయింది గీత. ఆ కాసేపటికే ఆమెకి దిగులుగా అనిపించింది. అంత చిన్నపిల్లాడిని వదిలేసి రావడం తప్పేమో! వాడికి ఆకలేస్తోందేమో! ఏడుస్తున్నాడేమో! బెదిరిపోయింది. ముందురోజటి పద్మ మాటలు, వాటిని ఇంకా వాసుకి చెప్పని వైనంకూడా తోడై మనసుని కలబారుస్తున్నాయి.
“నేనింక వెళ్ళిపోతాను. వాసు వచ్చి పంపమంటే మామ్మ సరేనంది. అందర్నీ పలకరించి వెంటనే వచ్చెయ్యమంది”అని చప్పుని లేచి నిలబడింది. అక్కడ వాసుకూడా ఇవతలికి వచ్చి నిలబడ్డాడు.
“వాణ్ణొదిలిపెట్టి వచ్చినందుకు భయపడిపోయింది. భయం దేనికి? అమ్మమ్మ వుందిగా?” అంది మహతి. ఆమెకి వింతగా అనిపించింది. గీత కొత్తకోణంలోంచీ కనిపించింది.
“రేప్పొద్దున్న నువ్వూ అంతేలేవే!” అంది అరుణ. మహతికి ఇబ్బందిగా అనిపించింది.
“నువ్వు రాకుండా వెళ్ళడం మాకెవరికీ నచ్చలేదు. మహీ మొదలెట్టింది. అందరూ అందుకున్నారు. అందుకే వచ్చాను” అన్నాడు వాసు దార్లో.
“ఏమో బావా! వాడేడుస్తున్నాడనిపించింది. ఉండలేకపోయాను” అంది. అంటుంటేనే కళ్ళలోంచి నీళ్ళు జారిపడ్డాయి. మహతిలాగే వాసుకికూడా వింతగానే అనిపించింది. మయూఖ్ పుట్టినప్పటికన్నా గీతలో కనిపిస్తున్న పరిణతి అతన్ని చకితుణ్ణి చేసింది. చిన్ననాటి తన నేస్తం పెరిగి పెద్దైపోతోందన్న వూహ తమాషాగా అనిపించింది. ఎంత పెద్దైపోతుంది? తనకన్నానా? తనలో తనకి ఏ మార్పూ తెలీడంలేదు. కానీ గీతమాత్రం పెళ్ళిచేసుకుని, ఇద్దరు పిల్లలనిచ్చి, తన జీవితమంతా విస్తరిస్తోంది. ఆ ఆలోచనతోటే ఆమెపట్ల ప్రేమ, మమకారం, అలాంటి ఇంకెన్నో భావాలు చెలరేగాయి అతన్లో.
“అంత వెంటనే ఏడవడు. వాడికి యింకా ఏం తెలీదు. ఐనా వెళ్ళిపోతున్నాంకదా?” అన్నాడు ఓదార్పుగా. మరో ఐదునిముషాలకల్లా ఇల్లు చేరుకున్నారు. గీత గబగబ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళేదాకా ఆగి, అతను వెళ్ళిపోయాడు.
“ఏడ్చాడా?” ఆరాటంగా అడిగింది.
“ఎందుకేడుస్తాడే? బొజ్జనిండా పాలు తాగి నిద్రపోతున్నాడు. రాత్రికికదా, నిన్ను నిద్రపోనివ్వకుండా వాడి అల్లరి? ఇంకాసేపు వుండకపోయావా?” అడిగింది విజ్జెమ్మ.
“ఏమో! మామ్మా! వుండాలనిపించలేదు” అంది గీత. ఆవిడ భుజంమీద తలపెట్టుకుని ఏడ్చేసింది. ఆవిడ కంగారుపడింది.
“ఏమైంది గీతా? ఏం జరిగింది? ఎవరేనా ఏమైనా అన్నారా? అలా అనేవాళ్లెవరు మనింట్లో? ముందా ఏడుపు ఆపి చెప్పు. ఏడిస్తే తలనెప్పెడుతుంది” అంది. సక్కూబాయికూడా వచ్చి దగ్గర కూర్చుంది.
“ఏమైందే? చెప్పకుండా ఏడిస్తే మాకు కంగారుపుడుతోంది. నిన్న బారసాల బాగానే చేసుకున్నారుకదా? పొద్దునదాకా బానే వుంటివి?” అడిగింది.
“నన్ను అంతా వేరేగా చూస్తున్నారు. పద్మత్త మమ్మల్ని యింట్లోంచీ వెళ్ళిపొమ్మంటోంది. అదేంటంటే మేము ఆస్తులమీద ఆస్తులు పోగేస్తున్నామట. మాధవ్‍కి ఏమీ లేదట. ఇక్కడ్నుంచీ మేము వెళ్ళి నాన్న యిచ్చినచోట్లో యిల్లుకట్టుకుని వుండాలట” అంది. విజ్జెమ్మకి నోట మాట రాలేదు చాలాసేపు. ఇక్కడి పరిస్థితి చూస్తోంది. నీలిమ ఏవో పుల్లలు పెడుతోందనుకుందిగానీ, ఆ పెడుతున్నది పద్మ అనుకోలేదు ఆవిడ. సక్కూబాయి పరిస్థితీ అలానే వుంది. కానీ విజ్జెమ్మ ఎదురుగా ఆవిడ కూతుర్ని ఏమనగలదు? ముందుగా తేరుకున్నది విజ్జెమ్మే.
“మీరెందుకు వెళ్తారు గీతా? దాని మతిలేని మాటలు పట్టుకుని నువ్వేడుస్తున్నావా? లక్ష్మి ఏమీ అనలేదూ?” అడిగింది.
“అత్త బాగానే కోప్పడింది”
“మీరు వెళ్ళిపోయినంతమాత్రాన ఇల్లు మాధవ్‍ది ఐపోదు. ఇది మా తాత కట్టించిన యిల్లు. మాకు పుట్టిల్లు. మేమున్నాం ఇంకా. మేం వచ్చిపోతుంటాం. మా తమ్ముడూ మరదలూ వున్నారు. వాళ్ళెక్కడికి పోతారు? ఇంట్లో తులసికికూడా పాలుంటుంది. అదెందుకు వూరుకుంటుంది? చదువుకుని వుద్యోగం చేస్తున్నావేమో, నీకివన్నీ తెలీవా? జవాబుచెప్పలేవా? ఎవరో ఏదో అన్నారని ఏడవటానికి చిన్నపిల్లవా? నీకు పాతికేళ్ళు లేవూ?” అంది సక్కూబాయి, విజ్జెమ్మ అలా అన్నాక.
గీత కళ్ళు తుడుచుకుని, తనేమందో చెప్పింది.
“బాగానే చెప్పావు. మరింక ఏడుపు దేనికి? అలా ఏడవకూడదు. ఏడుస్తున్నవాళ్లని ఇంకాస్త ఏడిపించబుద్ధౌతుంది. గీతా! గట్టిగా వుండాలి. అప్పుడే సంపాదించుకున్నవి నిలబడతాయి. ఇక్కడ లేనివాళ్ళెవరూ లేరు. ఎవరికి వుండేవి వాళ్ళకే వున్నాయి. మాధవ్‍కేం తక్కువ? వాడిచేత ఖర్చే పెట్టనివ్వడుకదా, అన్నగారు? ఏం చేస్తున్నాడు జీతం పైసలు? మామగారికిస్తున్నాడా? ఇంకోమారు ఎవరి నోటంటేనా వానికేమీ లేదంటే ఇదేమాట అడగాలి. నువ్వే అడగాలి. అనేసి ఎక్కడ పుట్టిన మాటల్ని అక్కడే తుంచేసెయ్యాలి. ఆడవాళ్ళమధ్య వచ్చినమాటలు మగవాళ్లదాకా పోనివ్వద్దు. అంత పెద్ద గొడవైతే వాళ్ళకే తెలుస్తాయి. నువ్వు వాసుకేమీ చెప్పద్దు. అన్నదమ్ములమధ్య గొడవ పెట్టినదానివౌతావు. వాళ్ళిద్దరికీ ఎలా తెలియాలో అలానే తెలుస్తాయి. లే… లేచి మొహం కడుక్కో. అందరూ వచ్చే టైమైంది. నువ్వు తినేసి కూర్చో. మళ్ళీ వాడు లేస్తాడు” అంది. భర్త చిన్నతనాన్నే పోవడంతో ఇలాంటివి ఎన్నో పడిందావిడ. గొడవలన్నీ అయాక తేటబారిన కుటుంబాన్ని చూసి తులసిని యిచ్చారు వీళ్ళు. ఈ గీతని చూస్తే తెల్లటివన్నీ పాలు, నల్లటివన్నీ నీళ్ళు అని నమ్ముతుంది. అందరూ తనవాళ్ళే అనుకుంటుంది. ఒక మనిషిని “మన” అనుకోవడానికి ఎవరి లెక్కలు వాళ్లకే వుంటాయి. ఏ లెక్కలూ లేకుండా నిర్మోహంగా అనుకుంటే అది దెబ్బతీస్తుంది. దీనికి తెలివి మప్పాలి… అనుకుంది. లేకుంటే వాసుని ఇబ్బందిలో పడేస్తుంది. ఇంతలో విజ్జెమ్మ అందుకుంది.
“మీ నాన్నకీ రవికీ ఎందుకు మాటల్లేవని ఎప్పుడూ నువ్వు అడుగుతుంటావుకదా? తాతయ్య చచ్చిపోయినప్పుడు వాడికి ఏడాది. అన్నీ ఐపోయాయనుకుంటుంటే పుట్టాడు. స్కూల్‍ఫైనలుదాకా మిగతావాళ్లలాగే చదివాడు. పచ్చగా మగ్గిన మామిడిపండులా వుండేవాడు. మీలో ముగ్గురికి వాడి పోలికలొచ్చాయి. సుమంత్, మాధవ్, రాణాలకి. చదువులో చురుగ్గా వుండేవాడు. వాడిమీద మా పెద్దతమ్ముడి దృష్టిపడింది. తీసుకెళ్ళి పై చదువులు చెప్పించి అల్లుడిని చేసుకుంటానన్నాడు. ఆరోజుల్లో అందరికీ గంపెడేసిమంది పిల్లలుండేవారు. మేనమామలు చదివించి పిల్లనివ్వడం, పెద్దనాన్న చిన్నాన్నలు చేరదియ్యడం ఇలాంటివి చాలానే జరిగేవి. అప్పట్లో రాజావారి కాలేజీలో బియ్యే అంటే చాలా గొప్ప. మగపిల్లల మెడమీద ఎప్పుడూ కత్తి వేలాడుతూ వుండేది. ఎనిమిది, స్కూల్‍ఫైనలు, పియ్యూసీ ఇలా ఏక్కడో ఒకచోట ఆగిపోయి సంపాదనలు వెతుక్కోవలసిన పరిస్థితి. మీ అత్తలని చదివించడమంటే అందరూ ఎదిగిపోయి వున్నారు. పెళ్ళిళ్ళు చెయ్యాలికదమ్మా? ఒకొక్కళ్ళకీ చేసి వూపిరిపీల్చుకుందుకు వాళ్ళని చదువులో పెట్టాడు మీ నాన్న. అదీ వానాకాలం చదువులా వెళ్ళినప్పుడు వెళ్ళి, లేనప్పుడు లేకా ఎలాగో పట్టా తెచ్చుకుని వచ్చారు. ఒక్క ప్రమీలే, దానికే ఎందుకు తోచిందో లేక వాళ్ళాయనే అన్నాడో వుద్యోగంలో చేరింది.
సరే, రవిని పెద్దచదువదీ చదివిస్తానని తీసుకెళ్ళాడా, వీడు ఇంజనీరు చదువుతానన్నాడు. ఆయన గొప్పగా ఫీజులవీ కట్టి చేర్పించాడు. కూతురికి ఇంజనీరు అల్లుడొస్తాడని కలలు కన్నాడు. మా మరదలు సన్నసన్నగా ఎగేసింది-
మొత్తం ఫీజులు మనం ఎక్కడ కట్టగలం? ఆ డబ్బు కట్నంగా ఇస్తే అంతకంతా చదువుకుని, ఆస్తిపాస్తులున్న అల్లుడే వస్తాడు- అని.
మీ తాత ఎప్పుడో రాసిన విల్లు సంపాదించారు. ఇల్లు మీ నాన్నకీ, ఇంటిపక్కనీ, వెనకా వున్న స్థలం మిగిలిన యిద్దరు మగపిల్లలకీ అని రాసాడాయన. రాయడం మంచిదైంది. లేకపోతే మీనాన్నకి నిలవనీడకూడా వుంచేవారు కాదు. తనవాటా తనకి పంచిస్తే అమ్ముకుని చదువుకుంటానని రవిచేత చెప్పించారు. వాడు మనింటి పిల్లాడిలా కాకుండా వాళ్ళ పిల్లాడిలా మాట్లాడాడు.
నాకున్న తెలివికి ఇంజనీరింగు చదవాలని ఎంతో కోరిక. నువ్వు పట్టించుకోలేదు. ఇక్కడే వుంటే నీలాగే ఏ గుమస్తానో అయ్యేవాడిని. పావలాకీ బేడకీ లెక్కలు వేసుకుంటూ బతకాల్సి వచ్చేది. కుసుమని నాకిచ్చేవారు కాదు. నువ్వు నీ బాధ్యతనుంచీ తప్పించుకుంటే, మేనమామకాబట్టి ఆయన చేరదీసి చదివించి పిల్లనిస్తున్నాడు- అన్నాడు.
మీ నాన్నకూడా నీలాగే వెలతెలబోయాడు. ఎలాగోలా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసాడు, ఆ చేసినవేవీ గొప్ప సంబంధాలు కావుగాబట్టి తమ్ముళ్ళిద్దరూ అంది వస్తే ఆడపిల్లల మంచీచెడు చూసుకుంటూ అందరూ ఒకచోటే వుంటారనుకున్నాడు. మా తమ్ముడూవాళ్ళూ అదే విషయాన్ని మరోలా ఆలోచించారు. ఇక్కడుంటే బాధ్యతలన్నీ చుట్టుకుంటాయని వాళ్లకి అనిపించింది. కుసుమ ఒక్కర్తే కూతురు. తెగతెంపులు చేసి తీసుకుపోదామని వాళ్ళ ఆలోచన. ఆ చారెడు స్థలం వదులుకోవచ్చుకదా? అప్పట్లో స్థలాలకి ధరేం వుంది? మూడువేలో నాలుగువేలో. అమ్మితే ఎవరో బైటివాడు, ఎలాంటివాడో తెలీనివాడు వచ్చి పొరుగున కూర్చుంటాడు. ఇంట్లో నిండా ఆడపిల్లలు. వెల కట్టించి వాడిచేతిలో పెట్టి పంపాడు మీ నాన్న. డబ్బెక్కడిదనుకున్నావు? లక్ష్మి సగం, మీ అమ్మమ్మ సగం సర్దారు. మళ్ళీ వడ్డీపైసలతో ఎవరిది వాళ్లకి తిరిగిచ్చేసాడు. అది వేరేవిషయం. నిండా ఖర్చులు. అందరికీ పెళ్ళిళ్ళయాయి. పురుళ్ళు, బారసాలలు. ఇల్లంతా ఎలా వుందంటే అలా వుంది. పొద్దున్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని బయటికి వెళ్తే ఎక్కడెక్కడో ఏవేవో చేసి జీతంమీద మరో నాలుగుపైసలు తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు మీ నాన్న. మీ అమ్మ చుట్టుపక్కలవాళ్ళ బట్టలు కుట్టేది. బంగారుతల్లే అది. నేను ఏ పూర్వజన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే ఈరోజుని అది నా కుటుంబంలో సగభాగమై నోరు మెదపకుండా నిభాయించుకుని వచ్చింది.
కానీ రాము అమ్మమ్మని ఆరోజుని అడిగిందీ, ఆరోజునించీ ఈరోజుదాకా వాడిని బాధిస్తున్నదీ ఒకటే ప్రశ్న-
నేనూ నీకు మనవడినే, నన్నూ నువ్వు ఎత్తి పెంచావుకదా, ఎందుకీ తేడా- అని.
గీతూ! ఎవరు ఎవరి మనసుకి దగ్గిరౌతారో తెలీదు. పుట్టినప్పట్నుంచీ వున్న లెక్కలన్నీ ఒక్కసారి మారిపోతాయి. మాధవ్ నీకు మరిదవడంకన్నా పెద్దచుట్టరికం వసంత్‍కి తోడల్లుడవడం. మనింట్లో మీ అత్తలందరూ ఎలా సఖ్యతగా వుంటారో వీళ్ళు ముగ్గురాడపిల్లలూ అలానే వుండాలనుకుంటారు. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ బంధం బలపడుతున్నప్పుడు మరికొన్ని బంధాలు విచ్చుకుపోవటం తప్పదు. అది కాలమే నిర్ణయిస్తుంది. నువ్వు గట్టిగా వుండాలి. మీ పెట్టుపోతలకి ఆశపడే స్థితిలో ఎవరూ లేరు. అసూయపడటం తప్పించి.
శేఖర్‍కూడా రవిలాగే చేసాడు. ఇల్లు కొనుక్కుంటాను డబ్బుకావాలన్నాడు. వాడి టయానికి ధరలూ పెరిగాయి. మీ నాన్నదగ్గిర అంత డబ్బూ లేకపోయింది. మన పక్కవాళ్ళు, వీడూ సగం సగం తీసుకున్నారు. పిందె రాలిపోయిందనుకున్నాడు మీ నాన్న వీడి విషయంలో. కానీ పెద్దవాళ్ల తప్పుల్ని పిల్లలు క్షమించలేరు. మా తమ్ముడితో కలిసి చేసినదానికి వాడు రవికి మళ్ళీ దగ్గిరవలేకపోయాడు. అదొక ఓటమికదూ, వాడికి? పచ్చగా పందిరి వేస్తే కాసిన కాపులోంచీ జాతికాయని ఏరుకుని తెంపుకుపోవటం?” అంది విజ్జెమ్మ.
గీత విభ్రాంతిగా వింది. “నాన్న అంత బాధపడ్డారా?” అంది ఆశ్చర్యంగా.
“ఔనమ్మా! చాలా బాధపడ్డాడు. మామయ్య చదివించాడుగాబట్టి ఈరోజుని ఇలా వున్నానంటాడు రవి. కుసుమ మంచిది. పెళ్లప్పటికి దాని వయసెంతని? పద్ధెనిమిది. వాడు చదువుతుండగానే చేసేసారు. వెళ్లకపోతే మా అమ్మ బాధపడుతుందని వెళ్ళాను. కానీ ఆవిడా మా తమ్ముడిలానే మాట్లాడింది. రవిని వుద్ధరించినట్టు చెప్పుకుంది. అప్పటిదాకా నాది పెద్ద సంసారమని బియ్యం పంపేది. ఇకమీదట పంపవద్దని చెప్పేసి వచ్చాను. గీతూ! మనుషులందరికీ తెలివితేటలు వుంటాయి. అవకాశాలు అందరికీ దొరకవు. పరిస్థితులు వాళ్ళని మాయలా కప్పేసి వుంటాయి. దాన్ని చీల్చుకుని బయటికి రావడమంటే నిన్ను నువ్వు కొంత వదులుకోవడం. కొన్ని బంధాలు తెంచుకోవడం. వాడికి వుద్యోగం వచ్చి, మామ ప్రాపకంలోంచీ బైటికి అడుగుపెట్టాక, కుసుమకీ కాస్త వయసొచ్చి నెమ్మదిగా పరిస్థితులని అర్థంచేసుకుని వాడిని చాలా మార్చింది. దానికి రామూ అంటే చాలా ప్రేమ. ఇప్పుడు సుమతి తిరుగుతుందే, వాడి చెయ్యిపట్టుకుని, అలా తిరిగేది ఈ గొడవలు రాకముందు. ఎంతమందిని ఎత్తిమోసిన చెయ్యమ్మా, అది? ఎంత ప్రేమని పంచిన గుండె వాడిది? రవి విషయంలో కరుడుగట్టిపోయింది” కళ్ళు తుడుచుకుందావిడ.
“గీతా! మామ్మ ఇవన్నీ ఎందుకు చెప్తోందనుకున్నావు? మనుషులంటే ప్రేమలేకాదు, స్వార్థాలుకూడా వుంటాయి. ఎవరిది వాళ్ళు చూసుకున్నప్పుడు అది స్వార్థమనికూడా అనిపించదు. మనకి నష్టం జరిగినప్పుడే అర్థమౌతుంది. అలా జరక్కుండా ముందే జాగ్రత్తగా వుండాలి. దాన్నే తెలివంటారు. ఎవ్వరిమాటలూ మీరు లెక్కచెయ్యద్దు. మీ నాన్నంటే మాకు చాలా గౌరవం. నా తమ్ముని కుటుంబాన్ని నిలబెట్టాడు. ఇంకెంత చేస్తానని విసుక్కోకుండా అక్కుని జేర్చుకున్నాడు. మగపిల్లల్ని దారితప్పకుండా చూసాడు. మేం ముగ్గురం ఆడవాళ్ళం. మగదక్షత లేదు. ఈ పెద్దమనిషి, నా తమ్ముడు ఇల్లొదిలేసి వెళ్ళిపోయాడు. మేమే ఐతే ఏమీ చెయ్యలేకపోదుము. విన్నావుకదా, అన్నీ మనసులో పెట్టుకో. ఇక లే. అన్నం తిందువు” అంది సక్కూబాయి. గీత లేవబోయేంతట్లో పిల్లవాడు లేచేసాడు. ముందు బద్ధకంగా కదిలి, వళ్ళు విరుచుకుని, అత్యంత ప్రజ్ఞావంతుడిలా కొన్ని అవశిష్టాలని ఏకకాలంలో కానిచ్చుకుని ఇంటిపైకప్పు ఎగరగొట్టే కార్యక్రమం మొదలుపెట్టాడు. వాడి ఆకలి తీర్చి, గీత భోజనం చేసేసరికి సినిమా అయి అందరూ తిరిగొచ్చారు. అందరూ అంటే? మనుషులూ, వారి చుట్టూ వుండే భావావరణం సృష్టించే ప్రకంపనాలు.
భోజనాలయ్యాయి. ముందు మగవాళ్ళూ, పిల్లలూ, తర్వాత ఆడవాళ్ళూ తిన్నారు. విజ్జెమ్మ, లక్ష్మి, యశోద, నీలిమ ఆఖరికి వుండిపోయారు. కూతురూ వియ్యపురాలూ వుండిపోయారని తనూ ఆగింది నీలిమ తల్లి. వీళ్ళు తిని, వంటిల్లు సర్దుతుంటే గీత వచ్చింది.
“నిన్న ఆఖర్న ఎవరో వచ్చారు చూడు, వాళ్ళు విహీ చేతిలో డబ్బులు పెట్టారు. నీకివ్వడం మర్చిపోయాను”అంది.
“నీ దగ్గిరే వుంచు. వాడికొచ్చిన చదివింపులన్నీ ఈ డబ్బాలో పెట్టాను. కాసేపయాక వీలు చూసుకుని ఎవరెవరు ఏం పెట్టారో పద్దుపుస్తకంలో రాసేద్దువుగాని. మళ్ళీ మర్చిపోతాం” అంది లక్ష్మి. గీత మళ్ళీ తనగదిలోకి వెళ్ళిపోయింది.
భోజనాలైన వెంటనే చాలామంది వెళ్ళిపోయారు. వాసు చిన్నమేనత్త, ఆవిడ కుటుంబం, తులసి, భర్త, అత్తమామలు కలిసి బయల్దేరారు. వాళ్లతోపాటు వాసు పెద్దమేనత్తకూడా ప్రయాణమైంది. వాళ్ళ సామాన్లవీ తీసుకుని, బస్సెక్కించి రావటానికి బయల్దేరారు వాసూ, మాధవ్. వాళ్లందరినీ పంపించి తల్లిదండ్రులు కూర్చున్నదగ్గరికి వచ్చింది నీలిమ.