ఝరి 101-110 by S Sridevi

  1. ఝరి 101-110 by S Sridevi
  2. ఝరి 111-120 by S Sridevi
  3. ఝరి 121-130 by S Sridevi
  4. ఝరి 131-140 by S Sridevi
  5. ఝరి 141-150 by S Sridevi
  6. ఝరి 151-160 by S Sridevi

(భోజనాలైన వెంటనే చాలామంది వెళ్ళిపోయారు. వాసు చిన్నమేనత్త, ఆవిడ కుటుంబం, తులసి, భర్త, అత్తమామలు కలిసి బయల్దేరారు. వాళ్లతోపాటు వాసు పెద్దమేనత్తకూడా ప్రయాణమైంది. వాళ్ళ సామాన్లవీ తీసుకుని, బస్సెక్కించి రావటానికి బయల్దేరారు వాసూ, మాధవ్. వాళ్లందరినీ పంపించి తల్లిదండ్రులు కూర్చున్నదగ్గరికి వచ్చింది నీలిమ.)
“ఈ మందంతా ఎవరే?” కూతురిగదిలో పడుక్కున్న కుటుంబరావు అడిగాడు కాస్త వెటకారంగా.
“దీని ఆడబడుచు తులసి లేదూ, ఆ అమ్మాయి అత్తగారూ, ఆవిడ తోటికోడలూ, తోటికోడలి చెల్లెలూ, కుటుంబం” అంది నీలిమ తల్లి.
“ఈ ఫంక్షనుకి వాళ్ళంతా దేనికి? వాళ్లకీ జరిగాయా, రాచమర్యాదలు?” కాస్త కోపంగా అడిగాడు.
తండ్రి కోపం చూసి నీలిమ నవ్వింది. “అమ్మకి సరిగ్గా చెప్పడం రాలేదు నాన్నా! మా అత్తగారికి ఇద్దరు ఆడబడుచులు. అందులో పెద్దావిడ, అంటే మా యింట్లో వచ్చి వుందే, ఆవిడ తోటికోడలి కొడుక్కి ఇచ్చి చేసారు తులసిని. ఇంకొకావిడ మా అత్తగారి రెండో ఆడబడుచు” వివరించింది.
“ఐతేమాత్రం? అన్నిచోట్లకీ తగుదునమ్మా అని ఈ బోడక్కలంతా బయల్దేరతారేమిటి, ఓమూల కూర్చోక? అన్నిటికీ ఆ పెద్దావిడ్ని ముందు నిలబెడతారేమిటే, ఇందరు పునిస్త్రీలుండి? అశుభంకాదూ?” అంటూ మోటుపదాలు వాడాడు ఆయన ఆ ముగ్గురిగురించి. అలాంటివాటిని మామూలుమాటల్లా వినడానికి అలవాటుపడిపోయారు ఆడవాళ్ళు చాలామంది. కమలాక్షికి మనసుకి చురుక్కుమనిపించినా ఏమీ చెయ్యలేక వూరుకుంటుంది. అలా అనద్దని చెప్పినా అనడం తప్పని ఆయన వప్పుకోడు. కనీసం మనసులోకూడా అనుకోడు. నరనరాల్లో జీర్ణించుకుపోయిన అహంభావం అది. నీలిమ అలాంటి మాటల్ని వింటూ పెరిగిందికాబట్టి వాటిని తండ్రి మాటలుగానే తీసుకుంది.
“ఏం చేస్తున్నాడేంటి తులసి భర్త?” అడిగాడు.
“ఈవెనింగ్ కాలేజిలో ఇంజనీరింగు చదివి వసంత్ చేసే డిపార్టుమెంటులోనే చేస్తున్నాడట. ఏయీ ప్రమోషను వస్తుందనుకుంటున్నారు. పెళ్ళికిముందు అస్సలు చదివేది కాదట ఈ పిల్ల. చదువు రావట్లేదని చిన్నవయసులోనే పెళ్ళిచేసేసారు. ఓ కొడుకుకూడాను. ఇప్పుడు భర్త చెవులు మెలేసి కూర్చోబెట్టి చదివిస్తే ఇంటరు పూర్తి చేసిందట. బియ్యేకికూడా కూర్చోబెడదామనుకుంటున్నారు” భర్త మాటలతో మనసుకి కలిగిన బాధని అణచుకుందుకు కాస్త ఎక్కువే చెప్పింది ఆయన భార్య.
“ఇంట్లో యింట్లోనే ముడిపెట్టారన్నమాట. కట్నం ఏపాటి ఇచ్చారు?” అడిగాడు.
“బాగానే ఇచ్చారు. ఇద్దరన్నదమ్ములమీద అపురూపంగా పెరిగిన పిల్ల. ఉంది, ఇచ్చుకోరా?” అంది.
“ముగ్గురుకూతుళ్ళల్లో ఒక్కదానిక్కూడా కట్నం యివ్వకుండా చేసాను చూడు, అదీ మనగొప్పా, మన పిల్లల గొప్పాను” అన్నాడు గర్వంగా. ఆవిడ మాట్లాడలేదు. “ఎంత ఆడపిల్ల అపురూపమైతేమాత్రం, మగపిల్లల్ని దోచి పెట్టేస్తారేమిటి?” అని కొనసాగించాడు.
తులసీవాళ్ళూ వెళ్ళిన దృశ్యం నీలిమతల్లి కళ్ళముందు కదిలింది. తులసి మామగారు మనవణ్ణి ఎత్తుకున్నాడు. వాసు, మాధవ్ చెరో బేగూ తీసుకుని, తులసి భర్త, చిన్నావిడ అల్లుళ్ళు, మిగతా అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళారు. తల్లి, ఇద్దరు వదినలు, అమ్మమ్మ, అరుణ, యశోద ఇందరూ వీధిదాకా వెళ్ళి సాగనంపారు ఆ పిల్లని. బారసాల కట్నం, తొలిసారి స్వంతంగా ఆస్తి కొంటున్నందుకు కానుకలూ భారీగా యిచ్చాడు వాసు. ఆవిడ ఆలోచన అక్కడ అస్థిమితంగా ఆగింది, మాధవ్ ఇచ్చిన పదివేలు గుర్తొచ్చి. ఆలోచనలు కూతుళ్ళవైపుకి మళ్ళాయి. కట్నం అడగందే చాలని బరువు దింపుకున్నట్టు దింపుకున్నారు తాము. పెద్దకూతురు నోరుపెట్టుకుని బతికేస్తోంది. బంధాలు పెంచుకోవలసినచోట చాణక్యనీతి నెరుపుతోంది. నీలిమ విషయం ఇలా. ఇంకా పిల్లల్లేరు. అల్లుడే డాక్టర్లదగ్గిరకి తీసుకెళ్తున్నాడు. అది తమ బాధ్యతకదా? భర్తకి పట్టదు. ముట్టుకుంటే అంటుకుంటుందని భయం. చిన్నది మానస. వాళ్ళింట్లో కట్నంకోసం గొడవలు పడుతుంటే నిర్లజ్జగా వదిలేసారు. ఈ అన్నిటిలో తమగొప్పతనం ఎక్కడుంది, అల్లుళ్ళ మంచితనం తప్ప?
“పెద్దాయన సైన్యంకూడా పెద్దదే. ఇద్దరు కొడుకులూ, కూతురూ. కూతురొక్కర్తీ తప్ప అందరూ డాక్టర్లు. బాగా చదువుకున్న కుటుంబం. ఆయన భార్యకూడా వుద్యోగం చేసింది. అలాంటివాళ్లతో స్నేహం చెయ్యాలి నువ్వు. అలాంటివాళ్ళింటికి వెళ్ళాలి, వాళ్ళని మీయింటికి రమ్మనాలి. ఐనా వాళ్ళేంటే, ఈ గీతని చూసి మురిసిపోతారు? పిల్లల మొహం ఎరగనట్టు వీడిని ఎత్తుకుని సంతోషపడతారు? వాళ్ళ మనవడు వాళ్ళకే వున్నాడుకదా?పండులా వున్నాడు?” అన్నాడు.
“మీ తోటికోడలేం చదివిందే?” అడిగాడు కూతుర్ని. నీలిమ వెంటనే జవాబివ్వలేదు. “గుమస్తా వుద్యోగంకదా, టెంతో ఇంటరో అయుంటుందిలే. పుట్టింట్లో ఏమీ లేదటకదా? ఇంతమంది తిళ్ళూ పెళ్ళిళ్ళూను. అంతా ఆడసంత. ఏం వుంటాయి? చదువు మానిపించి వుద్యోగంలో పెట్టి వుంటారు. పెద్ద అందమూ లేదు. ఆ వుద్యోగం చూసి చేసుకున్నాడేమో మీ బావ? ఎంతైనా తెలివిగలవాడు! ఇంకెవరూ ఆ పిల్లని తన్నుకుపోకుండా ప్రేమని పేరుపెట్టినట్టున్నారు” అన్నాడు ఆయనే.
“అదేంలేదు నాన్నా! ఇక్కడ రాజావారి కాలేజీ అని వుందట. అందులో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషను. అందరూ డిగ్రీదాకా అక్కడే చదివారట. గీతా బానే చదివింది. పెళ్ళప్పటికి డిగ్రీ చదివిందట. మా బావగారు అప్పటికే పొలిటికల్ సైన్సులో ఎమ్మే చేసారు. మళ్ళీ ఇద్దరూ కలిసి ఇంగ్లీషు లిటరేచర్లో చేసారు” నెమ్మదిగా, అయిష్టంగా అంది నీలిమ.
“మీయింట్లో ఎవర్నడిగినా బియ్యేలూ ఎమ్మేలూ అంటున్నారు, ఎవర్నేనా పట్టారేంటి, ఇంత డబ్బు పారేస్తే ఓ సర్టిఫికెట్టు కాగితం చేతిలో పడేయ్యడానికి? నువ్వూ ఓ ఎమ్మేపట్టా తెచ్చుకోకూడదూ?” అన్నాడు. ఆయన అలానే మాట్లాడతాడు. అలా మాట్లాడ్డం మాత్రమే వచ్చును. దానివలన ఎదుటివారు గాయపడి విషయాన్నో పోరాటాన్నో వదిలేస్తే అలా వదిలేసినదాన్ని వుచ్చిష్టం అనుకోడు. విజయమనుకుంటాడు.
“ఈ ఇంటిసంగతి ఏమంటున్నారే? విషయం మీ అత్తకి తెలిసిందా? ఇది మీకు వదిలేస్తే బావుంటుందికదా? నిన్న పద్మన్నావిడ అడుగుతుంటే ప్రహ్లాద్ అడ్డుపడ్డాడు. వాసుమీదా, గీతమీదా ఇంత ప్రేమేమిటి అతనికి? ఉండాల్సింది మీమీదకదా? ఏదేదో వాగిందట గీత. వట్టి లేకీమనిషిలా వుంది. పెద్దవాళ్ళు అడిగినప్పుడు సరేననో, అలాగే చేద్దామనో అనచ్చుకదా? మీ అత్తగారుందికదా, నిర్ణయాలు తీసుకోవడానికి? అంతా పెద్దకొడుక్కీ కూతురికీ దోచి పెడితే మీరేం కావాలి? ఆ విషయం ఆవిడకి తెలీదా? తెలీకపోతే చెప్పడానికి ఎందరు లేరు? నిన్న ఆవిడ , పద్మ చెప్పబోయింది అదేకదా? ఈ పిల్ల పెత్తనమేమిటి? చిన్నవుద్యోగాలవాళ్ళు అలానే వుంటారు. నేలమీద బియ్యంగింజ రాలిపడితే నోటితో ఏరుకుంటారు. ఆఫీసుల్లోకూడా ఎవరు పైస విదుల్చుతారా అని చూస్తారు. ఇల్లు వదిలిపెట్టకండి. పెద్దగా భవంతిలా వుంది. మీ ఆయన పెద్ద ఆఫీసరు. అతని హోదాకి సరిపోతుంది. అతని స్నేహితులు, ఆఫీసువాళ్ళు వచ్చి వెళ్తుంటారు. దర్జాగా వుంటుంది. వసంత్, ప్రహ్లాద్ వచ్చి వెళ్ళడానికీ బావుంటుంది. వీళ్ళెందుకే, ఈ యింట్లో దిష్టిపిడతల్లాగ? వీళ్ళెళ్ళిపోతే మీ అత్తనీ మామనీ నువ్వు చూసుకోలేవా? అల్లుళ్ళు ముగ్గురివీ పెద్ద చదువులూ, హోదాలూ. వాళ్ళని ఇప్పుడెళ్ళిన మందలో కలవకుండా చూసుకోండి” అన్నాడు. ఆయన తను బతికిన బతుకుని గీతకీ వాసుకీ ఆపాదించాడు. పైసకోసం ఆయన కరవని గడ్డి లేదు. దణ్ణం పెట్టని మనిషి లేడు. అణువణువులో లేకీతనం నింపుకున్న మనిషి.
ఆయన ఈ మాటలంటుంటే మయూఖ్ వచ్చాడు-
“పిన్నీ! నిన్ను మామ్మ రమ్మంటోంది” అన్నాడు. చెప్పేసి వెళ్ళిపోయాడు.
నీలిమ లేస్తూ, “నువ్వూ రామ్మా!” అంది.
“నేనెందుకే? ఆవిడ రమ్మన్నది నిన్ను” అంది నీలిమ తల్లి.
“వెళ్ళు. అందరూ అన్నిట్లో దూరిపోతున్నారు, నీ కుతురింట్లో నీకు మొహమాటమేంటి?” అన్నాడు కుటుంబరావు.
తల్లీకూతుళ్ళు కలిసే వెళ్ళారు. ఈ గదిలోంచీ ఆ గదిలోకి వెళ్ళేమధ్యలో కూతుర్ని ఆపి లోగొంతుతో అందావిడ. “నాన్న మాటలు పట్టించుకోకు నీలూ! అనవసరంగా గొడవలు తెచ్చిపెట్టుకోకు. ఎవరంతటివాళ్ళు వాళ్ళు. మీదగ్గిర బారసాలకి డబ్బు తీసుకున్నారంటే నాకూ బాధగానే వుంది. కానీ నిదానంగా ఆలోచిద్దాం. ఇందాకా సినిమాహాల్లో చూసావా, ఎంత ఆర్భాటం చేసారో? నలభై యాభైమందిమి వెళ్ళాం. ఈ పిల్ల ఒక్కర్తీ రాకపోతే పోయేదేమీ లేదు. పైగా బాలింతరాలు. ఐనా పిలిచి అట్టహాసం చేసారు. వాసు పెద్దకొడుకు. పెద్దకొడుకుని ఎవరూ దూరం పెట్టరు. మీ ఆయనది పెద్ద వుద్యోగమైతే వాళ్లవి రెండు వుద్యోగాలు. పైగా ఆస్తులు కూడబెడుతున్నారు. వాళ్లనేమైనా అంటే గొడవలౌతాయి”
అప్పటికే తండ్రి మాటలు తలకెక్కేసిన నీలిమ ఆవిడ్ని కొంచెం వింతగా చూసింది. ఏమీ జవాబివ్వలేదు. ఇద్దరూ ముందుకి నడిచారు. అంతా గీత గదిలో కూర్చుని వున్నారు. మిగతావాళ్ళంతా వెళ్ళిపోయారుగానీ అరుణ మిగిలింది. లక్ష్మి ఆపింది. బారసాలలో వచ్చిన చదివింపులన్నీ అక్కడున్నాయి. గీత డబ్బు కవర్లు తెరుస్తోంది.
“రా! నీలిమా! అక్క, అత్త చెప్తూ వుంటారు, ఈ పుస్తకంలో రాసెయ్. నీకూ తెలుస్తుంది” అంది లక్ష్మి. చదివింపులు పుస్తకంలో రాసుకోవడమేమిటో అర్థం కాలేదు నీలిమకీ ఆమె తల్లికీకూడా. నీలిమకైతే లేకీగాకూడా అనిపించింది.
“మొదట్లో మనిళ్ళలో ఫంక్షన్లకి బయట్నుంచీ పెద్దగా ఎవర్నీ పిలిచేవాళ్లం కాదు. మన కుటుంబాలవాళ్లమే వుండేవాళ్ళం. అందరం కలిసి వుపయోగపడే వస్తువేదో చదివింపు చేసేవాళ్ళం. ఇంతమంది రావటం, ఇన్నిన్ని పెట్టుబడులూ వుండేవి కాదు. నిన్న చూడు, తీర్థప్రజలా వచ్చారు. అందరికీ వుద్యోగాలు. మూడువైపుల్నించీ స్టాఫంతా వచ్చారు. మామయ్యగారి ఫ్రెండ్సు, మా అన్నయ్య ఫ్రెండ్సు వచ్చారు. వాసూవాళ్ళంతా పెద్దవాళ్ళయ్యారు. ఇక్కడే పుట్టిపెరిగారు, వాళ్ళ స్నేహితులు, పరిచయస్తులు, మొహమాటాలు, మన యింటి చుట్టుపక్కలవాళ్ళు వచ్చారు. ఇచ్చారని తీసేసుకుంటే సరిపోదుకదా? వాళ్ళిళ్ళలో వేడుకలకి మళ్ళీ మనం తిరిగి అంతకంతా పెట్టద్దూ? ఒకళ్ళూ ఇద్దరూ ఐతే గుర్తుపెట్టుకుంటాం. ఇంతమంది ఏమిచ్చారో ఎలా గుర్తుంటుంది? తిరిగి పెట్టలేదనుకో, కోపాలొస్తాయి. ఎందుకు వాళ్ళకి కోపం వచ్చిందో మనకి తెలీకుండానే సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే గుర్తున్నంతవరకూ పుస్తకంలో రాసేస్తే మర్చిపోం” అంది లక్ష్మి నీలిమ కళ్ళలో కదిలిన ప్రశ్నకి జవాబుగా. నీలిమ జవాబేమీ చెప్పలేదుగానీ ఆమె తల్లిమాత్రం వుక్కిరిబిక్కిరైంది ఆ వివరణకి. తమింట్లో సరిగ్గా ఇదే జరుగుతుంది.
మీకుంది, పెట్టారు. మాకు లేదు, పెట్టలేం- అంటాడు భర్త. చీరపెట్టే దగ్గిర జాకెట్టుముక్కతోటీ, వంద పెట్టాల్సినచోట పదితోటీ సరిపెడతాడు. అతని అన్నదమ్ములకీ, మిగతా బంధువులకీ కోపాలొస్తాయి. తమని చులకనగా చూస్తారు. మళ్ళీ మర్యాదలు సరిగ్గా చెయ్యలేదని వాళ్ళతో దెబ్బలాడతాడు. మనం పెట్టేదాంతో వాళ్ళు మేడలూ మిద్దెలూ కడతారా అని ఎద్దేవా చేస్తాడు. మేడలూ మిద్దెలూ కట్టరు. అవతలిమనిషి హుందాతనాన్ని అంచనావేస్తారు. ఇవేవీ పైకి అనుకుని, వప్పందాల్లా చేసుకునే విషయాలు కావు. లోగుట్టుగా జరిగిపోతాయి. పెట్టుపోతలనేవి బంతాటలాంటివి. అందరికీమధ్య తిరుగుతూ వుంటాయి. ఎవరి స్వంతం కావు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని లెక్కలు వేస్తున్నారని ఎవరికీ తెలీదు. కానీ ఏ లోపం జరక్కుండా జాగ్రత్తపడటంతో అనీ దివ్యంగా జరుగుతాయి. చిన్న అసంతృప్తికూడా లేకుండా జరిగింది ముందురోజటి వేడుక.
డబ్బులెక్కలయ్యాయి. ఇతర వస్తువులు, బంగారం, వెండీకూడా చూసుకున్నారు.
నీలిమ తల్లి ముఖంలోకి చూసిచూడనట్టు చూసింది- చూసావా, మేమిచ్చిన డబ్బుమాటే ఎత్తట్లేదని దాని అర్థం. ఆవిడకూడా అర్థమైందన్నట్టు చిన్నగా తలూపింది.
“ఏమిటో, బట్టలుకూడా చాలామంది పెట్టారు. ఈమధ్యని ఇదో ఫాషనైపోయింది. ప్రతిదానికీ బట్టలు పెట్టేస్తున్నారు. అన్నేసి చీరలు ఏం చేసుకుంటాం? వాళ్ళు మనకి పెట్టా, తిరిగి మనం వాళ్లకి పెట్టాను” అంది అరుణ.
“గీతా! మీకిద్దరికీ నచ్చినవేవో రెండేసి చీరలు పక్కని పెట్టుకోండి. మిగిలినవి ఎవరెవరింటికి పంపించాలో చూసి పంపిద్దాం. ఇంకా రెండు పెళ్ళిళ్ళున్నాయి మనింట్లో” అంది లక్ష్మి.
“పీటలమీద కట్టుకున్న చీర బావుందత్తా! అది చాలు నాకు” అంది గీత.
“దానికేవీ ఇవ్వకండి వదినా! అన్నీ ఆ పెట్టెల్లోకి తోసేస్తుంది. మళ్ళీ బైటికి రావు” అంది యశోద.
“అబ్బా! వంటిమీద కట్టుకునే ఒక్క చీరకోసం వందచీరలు చుట్టూ పెట్టుకోవడం నాకు చిరాకమ్మా! రెండువారాలకి సరిపడ్డవి పైన వుంచుకుని కొత్తచీరలన్నీ వాటిల్లో పెడుతున్నాను. పండగొచ్చినప్పుడు ఒక్కోటి తీసుకుని కట్టుకుని, పాతది ఒకటి లోపల పెట్టేస్తున్నాను. మామ్మా, నువ్వూ కట్టుకునే చీరల్లా ఈ చీరలు చిరగవు. చిరాకేస్తోంది. నేనింక ఈ పిచ్చిచీరలు కట్టుకోను. నూలువే కొనుక్కుంటాను” అంది గీత.
“ఇద్దరు పిల్లలు పుట్టేసరికి అప్పుడే ముసలమ్మవైపోయావేంటే?” అంది లక్ష్మి వేళాకోళంగా.
“కాదత్తా! మా ఆఫీసులో మణి లేదూ, నిన్న ఫంక్షనుకికూడా వచ్చింది, తనన్నీ నేతచీరలు కడుతుంది. గంజిపెట్టి ఇస్త్రీ చేసుకుంటుంది. స్టిఫ్‍గా చాలా బావుంటాయి తన చీరలు” అంది గీత.
“ఆ అమ్మాయి నీకన్నా బాగా పెద్దది గీతూ! ఇప్పట్నుంచీ నేతచీరలొద్దుగానీ, ప్రింటెడ్ కాటన్స్ తీసుకో. నువ్వన్నట్టు మెత్తగా బావుంటాయి” అంది యశోద. ఎప్పుడూ ఇది కావాలని అడగదు గీత. ఏ చీర కొంటే అదే కట్టుకుంటుంది. అలాంటిది నోరుతెరిచి ఒక కోరిక కోరిందంటే తీర్చక మానదు. “త్రిమూర్తులుగారి కొట్లో వుంటాయి. ఆఫీసుకెళ్ళేముందు ఓ రెండుచీరలు కొనుక్కో. డబ్బులిస్తాను. నాకు తెచ్చిస్తే అంచులు కుట్టి ఫాలు వేసిస్తాను” అంది.
“నువ్వొద్దులేమ్మా! కృష్ణ వాడి మొదటి జీతం నాకే ఇస్తానని నా అకౌంటు నెంబరు రాసుకున్నాడు. అప్పుడు కొనుక్కుంటాలే” గీత జవాబు.
“ఎంతే వాడి జీతం?” అరుణ ఆరా తీసింది.
“కంప్యూటరు వుద్యోగంకదత్తా, మొదటినెల ఇరవైవేలేనా చేతికి వస్తుందన్నాడు. మాలాగ స్కేల్సూ అవీ వుండవు. పేకేజిట. ఏడాదిజీతం లెక్కకట్టి చెప్తారట”
ఆ జవాబు విని నీలిమకీ ఆమె తల్లికీ మిడిగుడ్లే పడ్డాయి.
“వాసూ, మాధవ్ అలానే యిచ్చారు తులసికి” అంది లక్ష్మి.
“ఒకళ్ళు మొదలుపెడితే అందరూ అదే వరస” అంది అరుణ.
“అన్నదమ్ములు లేరుకదూ, మా పిల్లలకి ఇవేం తెలీవు” కొంచెం చిన్నబుచ్చుకుని అంది నీలిమ తల్లి.
“దాందేముందిలెండి. అదో సరదా. అంతే” లక్ష్మి సర్దిచెప్పింది.
“నీకో విషయం చెప్పాలన్నాను” అంది గీత లక్ష్మికేసి చూసి.
“అన్నావుగానీ, చెప్పలేదుగా?” అంది లక్ష్మి. దిండుకిందనుంచీ వందరుపాయలకట్ట తీసి పట్టుకుంది గీత.
“ఇవెక్కడివే?” అడిగింది లక్ష్మి ఆశ్చర్యంగా.
“మాధవ్ వద్దంటుంటే ఇచ్చాడు. ఎంత చెప్పినా వినలేదు. అప్పటికే లెక్కలన్నీ ఐపోయాయి. పొలం రిజిస్ట్రేషనుకి కావల్సింది పక్కని పెట్టి, ఈ ఫంక్షనుకి ఏమేం కొనాలో రాసేసుకున్నాం. ఫంక్షనయ్యాక నీతో చెప్పి తిరిగి ఇచ్చేద్దామనుకున్నాం” అంది తలదించుకుని. నీలిమకీ ఆమెతల్లికీ వళ్ళంతా చెవులయ్యాయి.
“తిరిగిచ్చేస్తే పరాయివాడిని చేసారని వాడు బాధపడడూ? ఇంట్లో వేడుకకదా? అందులోనూ పొలంకూడాకూడా కొన్నారు. ఇబ్బందిపడతారని యిచ్చాడు. అన్నదమ్ములన్నాక ఇచ్చిపుచ్చుకోరే? నేనూ మీ నాన్నకి ఇచ్చాను. తప్పులేదమ్మా! తన డబ్బు వేడుక్కి కలిసిందని సంతోషపడతాడు. లేదా, బాబాయ్ ఇచ్చాడని వాడి పేర్న వెయ్యండి. రేపు వాడికి కొడుకో కూతురో పుట్టినప్పుడు అంతకంతా ఇవ్వండి. అదొక్కటేనా? మీరిద్దరూ ఇళ్ళూవాకిళ్ళూ కట్టుకుంటారు. ఇలాగే వుండిపోరుకదా? ఒకళ్ళకొకళ్ళు సాయంచేసుకుంటూ వుండాలి” అంది లక్ష్మి.
“అంతేనా?” అంది గీత.
“నీకు దాపరికాలు బానే వచ్చునుకదే, దాచిపెట్టు” అంది అరుణ. అని, “సరేగానీ గీతూ, మామయ్యా, ప్రహీవాళ్ళంతా కిందామీదా ఐపోతున్నారు. పొలంకొనడానికి అంత డబ్బెక్కడిదే?” మాటమార్చింది. వియ్యపురాలికి తెలియాలని, కావాలనే ఆ ప్రశ్న అడిగింది. వీళ్ళు అనీఅననట్టు అంటున్న మాటలు వినీవినిపించనట్టు ఆమె చెవినపడ్డాయి. గీతచేత లెక్కలన్నీ చెప్పించింది.
“లక్ష్మిమీద ఖర్చులన్నీ వదిలేసి ఎవరిజీతాలు వాళ్ళు దాచేసుకుంటున్నారా?” అడిగింది.
ఆ లెక్కలూ చెప్పింది గీత. ఏడాదికి సరిపడేలా బియ్యం, కందిపప్పూ, సబ్బులూ, సర్ఫులూలాంటివన్నీ ఒక్కసారే కొనేస్తాడట వాసు. ఆర్నెల్లకోసారి ఇరవై కేజీల నూనెడబ్బా కొంటాడట. మిగిలిన ఖర్చులు లక్ష్మి చూసుకుంటుంది. గీత జీతం వాడట్లేదు. వాసు జీతం సగానికిపైన ఇంటికి ఖర్చుపెడుతున్నాడు. ఇవన్నీ ఆలోచించుకునే ఇచ్చినట్టున్నాడు మాధవ్ ఆ డబ్బు. కొన్నిళ్ళలో పైసపైసా లెక్కపెట్టుకుని వంతులు, వాటాలు వేసుకుంటారు అన్నదమ్ములు. వాసుకి తమ్ముడు అపురూపం. డబ్బడగడు. ఖర్చు పంచడు. ఏదేనా సందర్భంలో తను అడిగితే మొహమాటపడకుండా ఇవన్నీ చెప్పాలనే శిక్షణకూడా యిచ్చింది అరుణ, గీతకి. మాధురి ఆమె కోడలవటంచేత కొన్నికొన్ని విషయాలు తెలుస్తుంటాయి.
“మరి మీ ఖర్చులేమిటే, నీలిమా?” అడిగింది అరుణ. తెల్లమొహం వేసిందామె. అప్పుడర్థమైంది నీలిమతల్లికి- తనకి తెలియాలనే అరుణ గీతచేత ఇవన్నీ చెప్పించిందని. చాలా చిన్నతనంగా అనిపించింది. వాళ్ళ యింటి వ్యవహారాల్లో తలదూర్చాలనుకోవడం ఎంత తప్పో అర్థమైంది.
“నీ తోటిపిల్ల చక్కగా అన్నీ చూసుకుంటోంది. నువ్వూ అలా వుండద్దే?” అని కూతుర్ని కోప్పడింది.
“మరీ మా గీత అంత తెలివైనదేం కాదులెండి వదినా! వట్టి బెదురుగొడ్డు. అడగ్గానే ఎలా చెప్పేసిందో చూసారా? నీలిమ నోరిప్పిందీ? ఆ తెలివి దీనికెక్కడిది? వీళ్ళు పదకొండుమంది, ఎలీట్‍ లెవెన్ అని పేరుపెట్టుకుని గుంపుగా తిరుగుతూ మమల్ని నమ్మించాలని ప్రయత్నం చేసేవారు. అందరూ సత్తెకాలపు సత్తెమ్మలూ సత్తెయ్యలే” అంది అరుణ నవ్వుతూ. ఆ నవ్వు లక్ష్మినీ యశోదనీకూడా అంటుకుంది. గీత కోపంగా చూసింది.
“ఏమిటో చెప్తే నేనూ నవ్వుతానుకదా?” అంది విజ్జెమ్మ.
“వీళ్లకి వీళ్ళు మహామేథావులమని చెప్పుకుంటారుకదమ్మా?” అంది అరుణ.
“అబ్బా! మేథావులే, ఏకంగా?” అందావిడ తనూ నవ్వుతూ.
“ఇదిక్కడ ఇలా. వాడు వసంత్ కాంట్రాక్టర్లతో నిత్యం గొడవలు పడుతూ వుంటాడట. మరిదిగారొచ్చి నందకిషోర్‍కి చెప్పి బాధపడ్డారు” అంది అరుణ.
“లోకం బాలేదు అరుణా! తినద్దంటే వూరుకునేవాడెవరు? కక్షకట్టి వీడినేమైనా చేస్తారని భయం అతనికి” అంది లక్ష్మి.
“ఈ బ్లాకూ, వైటూ నావల్ల కావట్లేదు. ప్రాక్టీసు వదిలేసి, టీచింగ్ వైపు వెళ్తానంటున్నాడు ప్రహీ” ప్రహ్లాద్‍గురించి చెప్పింది అరుణ. “పిల్లలని చిన్నప్పట్నుంచీ బుద్ధిగా పెంచి, ఒక్కసారి ప్రపంచానికి అనువుగా మారాలంటే ఎలా మారతారే?” అంది.
“మాధవ్‍కూడా అలానే బాధపడుతున్నారు” అంది నీలిమ కలగజేసుకుని.
“కలిసి పెరిగినవాళ్ళుకదూ, వీళ్ళంతా ఒక్కలాగే ఆలోచిస్తారు” అంది లక్ష్మి.
“నాన్న ఫ్రెండ్సంతా రిటైరైపోయారు అత్తా! ఎవరెవరో కొత్తవాళ్ళు వచ్చారు. వాళ్ళు అంత ఫెయిర్‍గా వుండరు. నేను కొన్ని ఫైల్స్ పెడితే అవసరంలేని కొరీలు వేసి తిప్పి పంపిస్తారు. అదంతా డబ్బుల వ్యవహారం అని అర్థమౌతునే వుంటుంది. ఆ ఫైలు దగ్గరపెట్టుకుని, సంబంధించినవాళ్ళని తిప్పించి తిప్పించి డబ్బిచ్చి చేయించుకునే స్టేజికి తేవాలని నా పైవాళ్ళ ఆలోచన. అర్థంకానట్టు వూరుకుంటాను. ఏరోజు వచ్చిన కరెంట్స్ ఆరోజే పెట్టేసి డైరీలో రాస్తాను. దాంతో గిజగిజలాడిపోతారు. నేను పట్టించుకోను.
మీకేంటి, రెండు జీతాలు, స్వంతిల్లు, పిల్లాడుకూడా ప్లస్- అంటారు.
నేను వుద్యోగం చెయ్యటమనేది అదృష్టమేమీ కాదు. చదువవ్వగానే ప్రయత్నాలు మొదలుపెట్టాను. పెళ్ళయ్యాకకూడా నేను వుద్యోగం చెయ్యడాన్ని ఇంట్లో అందరూ ప్రోత్సహించారు. మీ భార్యగానీ, మీరుగానీ ప్రయత్నాలు చేసారా? ఇంటికీ, స్థలానికీ ఎలాంటి విలువా లేని టైములో మాపెద్దవాళ్ళు ఇల్లుండాలని ఆలోచించుకున్నారు. అదికూడా అదృష్టం కాదు. ముందు ఆలోచన. అలాంటి ఆలోచన మీ పెద్దవాళ్ళు చెయ్యలేదేమో! మీరు చెయ్యండి-
అని వాళ్లకి జవాబిస్తాను. నాకు పొగరనుకుంటారు.
నా పని నాది. జీతం తీసుకుంటున్నాను. చేస్తాను. మిగతావాటితో నాకు సంబంధం లేదు. ఫైలు పంపించాక మీ యిష్టం- అని మా పై ఆఫీసరుకి స్పష్టంగా చెప్పేసాను. బావకూడా అలానే వుండమన్నాడు. చెయ్యలేకపోతే వుద్యోగం మానెయ్‍గానీ ఇలాంటివాటిల్లో రాజీ పడద్దన్నాడు” అంది గీత.
ఆమె పైకి కనిపించినంత తెలివితక్కువది కాదని అర్థమైంది నీలిమ తల్లికి. నలుగుర్లోకి వెళ్ళి వుద్యోగం చేస్తూ ప్రతికూలంగా వుండేచోటకూడా తనమాట నెగ్గించుకుంటోందని గ్రహించింది. తండ్రి చెప్పినమాటలు మనసులోంచీ తుడిచెయ్యమని మరోసారి కూతురికి గట్టిగా చెప్పాలనుకుంది.
“చూస్తుండగా ఎంత పెద్దవాళ్ళైపోయారే, వీళ్ళంతా!” అంది అరుణ.
“ఇంకో ఇద్దరున్నారు పెళ్ళికి. రవళికీ వల్లికీ ఐపోతే కొన్నాళ్ళు మనం వూపిరిపీల్చుకోవచ్చు. వీణకి ఇంకా టైముంది” అంది లక్ష్మి. వీణంటే శేఖర్ కూతురు. వాళ్ళదో కథ. శేఖర్ భార్య లీల వీళ్ళెవరితోటీ పెద్దగా కలవదు.
“మనదాకా వచ్చేసరికి ఏదీ మిగల్లేదు. రెక్కల కష్టం తప్ప” అంటుంది.
“ఏమన్నా వుంటేకదా, మిగలడానికి? మనకొచ్చేదేదో తెచ్చుకునే వచ్చాను”’అంటాడు శేఖర్.
“ఏమీ లేకుండానే ఆరుగురు ఆడపిల్లల పెళ్ళిచేసారా, మీ అన్నయ్య? ఇల్లు అమ్మలేదు. మీ వదిన బంగారం కదపలేదు. ఎలా చేసారు మరి? అప్పటికి మీరు చిన్నవాళ్ళు. ఇంటిపెద్దగా బాధ్యత తీసుకున్నందుకు లెక్కలన్నీ అప్పజెప్పాలికదా?” అనేది ఆమె ప్రశ్న. వదినగార్లముందు అనదు.
“ఎంత మింగేసారో! ఎంత మిగుల్చుకున్నారో! గీతకి ఎలా పెట్టుకున్నారో కళ్ళారా మనమే చూసాం. ఒకమాటు కూర్చుని లెక్కలన్నీ తేల్చుకుందామని మీరెందుకు అడగరు? మీ అమ్మతో అంటే ఎవో కాకుల్లెక్కలు చెప్పారు” భర్తని గూటిస్తూ వుంటుంది. అతను బాగా మెతకమనిషి. ఆమె సందేహాలు తీర్చలేడు, అలాగని ఆమె నోటిని అదుపులో వుంచలేడు. కూతురికి రామారావు స్థలం ఇవ్వడమనేది పద్మకిలాగే ఆమెకీ మింగుడుపడని విషయం.
“రవళికి కుదిరినట్టే వుంది. వల్లిదే సమస్యైపోతోంది. అది బాగా పొడవుకదూ, ఆరడుగులకి తక్కువుంటే చేసుకోనని మొండికేసుకుని కూర్చుంది. మంచి సంబంధాలు రెండు చేతిమీద వున్నాయి. ఇద్దరూ దీనికన్నా ఎత్తేగానీ ఇదే వినట్లేదు” అంది అరుణ.
“అలా వదిలెయ్యద్దు అరుణా! నయాన్నో భయాన్నో చెప్పండి. లేకపోతే ఎవరిచేతైనా చెప్పించండి. పేరు బాలేదని సుమతికూడా అలానే గొడవచేసింది. ఆఖరికి వాళ్ళ నాన్న గట్టిగా కోప్పడితే వింది. జోగేశ్వర్రావు చక్కనైన మనిషి. ఎలాంటి భేషజం లేకుండా మనమధ్యని కలిసిపోయాడు. అంతకన్నా ఏం కావాలి చెప్పు? మనపిల్ల సుఖంగా వుండాలి” అంది విజ్జెమ్మ.
“జోగేశ్వర్రావా? విందంటే అది మీదపడి రక్కేస్తుంది. పెళ్ళికిముందు అందరిచేతా పదేసిసార్లు అనిపించింది. జో జో అనాలని హుకుం జారీచేసింది అతన్నలాగే పిలవాలని” యశోద నవ్వుతూ అంది.
“విహీని బల్లీ నల్లీ అంది” కోపంగా కంప్లెయింటు చేసింది గీత.
“నువ్వేం తక్కువా? నాలుగుతిట్లు కనిపెట్టుకుని వుంచుకో, అవకాశం వచ్చినప్పుడు తిడుదువు” అంది లక్ష్మి. కొద్దిసేపు ఎవరూ మాట్లాడకుండా వుండిపోయారు.
“అత్తా! ఇంకో గ్లాసుడు పాలు ఎక్కువ పోయించుకోవాలి మనం” అంది గీత వున్నట్టుండి.
“గ్లాసుడూ, కప్పుడూ పాలెవరూ పొయ్యరు. పావులీటరా, అర్ధపావా చెప్పు. దేనికి?” అడిగింది లక్ష్మి.
“మయూని స్కూల్లో వేద్దామనుకుంటున్నాంకదా? మనింట్లో పెద్దవంటలకి వస్తుందే వెంకటలక్ష్మి, ఆవిడ కూతుర్ని భర్త వదిలేసాడు. ఇద్దరు పిల్లలు ఆమెకి. అందులో ఒకడికి ఈ సంవత్సరంనుంచీ మేం ఫీజులు కట్టి చదివిద్దామనుకుంటున్నాం. వాడిని పొద్దున్నే స్కూల్లో వాళ్ళవాళ్ళెవరో తీసుకెళ్ళి దింపుతారు. ఇంక అప్పట్నుంచీ మయూతోటే వుంటాడు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పాలు, టిఫెను, ఆటలు, హోంవర్కు, చదువు అన్నీ ఇక్కడే. రాత్రి ఏడింటికల్లా అన్నం పెట్టేస్తే వాళ్ళ అమ్మొచ్చి తీసుకెళ్ళిపోతుంది” అంది గీత.
“వాసూ వాళ్ళ తాత వున్నప్పుడు ఇద్దరు వారాలపిల్లలుండేవాళ్ళు. మళ్ళీ మీరు మొదలుపెడతారా?” అంది లక్ష్మి.
తర్వాత వాళ్ల సంభాషణ పిల్లల చిన్నతనాలమీదికి మళ్ళిపోయింది. నచ్చిన పుస్తకాన్ని చదువుతున్నట్టో, చదివినదాన్ని మరోసారి మననం చేసుకుంటున్నట్టో వున్నాయి ఆ కబుర్లు. లెక్కలన్నీ అప్పజెప్పేసి, చెప్పేవన్నీ చెప్పేసి, అనేవన్నీ అనేసి నిశ్చింతగా కూర్చుని వాళ్ళ కబుర్లు వింటూ కూర్చున్న గీతనీ, ఆమె మొహంలోని నిర్మలత్వాన్నీ రెప్పార్పకుండా చూసింది కమలాక్షి. అత్తాకోడళ్ళమనో, వదినామరదళ్ళమనో అరమరికలు లేకుండా నవ్వుతూ మాట్లాడుకుంటున్న మిగిలిన నలుగురు ఆడవాళ్ళూ ఆవిడ స్మృతిపథంలోంచీ తొలగిపోలేదు. అలాంటి నవ్వు తనెప్పుడూ నవ్వలేదన్న స్పృహ కలిగింది.
“ఐతే ఆ పదివేలూ మీ మొహంమీద ఆడించేసి దాచేసుకున్నారన్నమాట. ఇంత తెలివితక్కువదానివేంటే నువ్వు? మన డబ్బు వాళ్ళు దాచి, మళ్ళీ దీనికి పిల్లలు పుట్టినప్పుడు ఇవ్వడమేమిటి? నాలుగూ దులిపి వెనక్కి తీసుకోవద్దూ?” అన్నాడు కుటుంబరావుమాత్రం ఆరోజు రాత్రి. బంధాలు తుంచుకోవడమా, పెంచుకోవడమా అన్న పాయింటుమీద నిలబడ్డ డబ్బుని వెనక్కి తీసుకోకూడదన్న స్పృహ ఆవిడకి కలిగింది. నీలిమకిమాత్రం తండ్రిమాటలు నచ్చాయి.


బారసాల హడావిడంతా అయి, మామూలు జీవితంలోకి వచ్చారు. విజ్జెమ్మ వెళ్ళిపోయింది. కృష్ణకి బెంగుళూర్లో పోస్టింగిచ్చారు. మెన్స్ హాస్టల్లో చేరాడుగానీ సర్దుకోలేకపోతున్నాడు. తిండీ అదీ కుదరట్లేదు. రామారావూ, యశోదా మధ్యమధ్యలో వెళ్ళి చూసి వస్తున్నారు. శేఖర్ అత్తగారిది అక్కడే. కొన్నాళ్ళు ఇల్లొదిలిపెట్టి వుండటానికీ, మిగతా మార్పులకీ అలవాటుపడేదాకా దగ్గర పెట్టుకోవచ్చు.
“మా అమ్మెక్కడ చెయ్యగలదు?” అనేసింది శేఖర్ భార్య.
ఇప్పుడిక ఏదేనా ఫ్లాట్‍లో తెలిసిన పిల్లలెవరేనా వుంటే వెతికి వాళ్ళతో జతకలిపి వుంచడమో, తామే ఫ్లాట్ తీసుకుని, అందులో వుండటానికి పిల్లల్ని వెతకడమో చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారు. ఐటీ వుద్యోగాలు కొత్త. ఇప్పుడిప్పుడే మొదలౌతున్నాయి. ఉద్యోగంలో చేరిన పిల్లల్ని చేరినవాళ్ళని చేరినట్టు అమెరికా పంపించేస్తున్నాయి చాలావరకూ పెద్దకంపెనీలు. కృష్ణ విషయంలో అదొక ప్రతిపాదనకూడా వుంది. పుట్టినప్పట్నుంచీ ఒకే వూళ్ళో, ఒకే యింట్లో, పెరిగినప్పట్నుంచీ ఒకే ఆఫీసులో, ఒకే వుద్యోగంలో వున్న రామారావుకి ఈ వెళ్ళిరావటం, వెళ్ళినచోట నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా వుంది. మనవడిని పెట్టుకుని తనుంటానంది విజ్జెమ్మ. ఆ చర్చలు బాగా సాగుతున్నాయి వాళ్ళింట్లో.
విహీకి మూడోనెల వెళ్తుంటే ఆఫీసులో జాయినైంది గీత. ఇంకో నెల సెలవు అడిగితే ఆఫీసులో ఇవ్వలేదు. జాయినయ్యి మళ్ళీ పెట్టుకొమ్మన్నాడు ఆఫీసరు. కోల్డ్‌వారు‌లాంటిది నడుస్తోంది ఆఫీసులో. లంచిలో ఇంటికి వచ్చి పిల్లాడిని చూసుకుని వెళ్తోంది. సాధారణంగా వాసు తీసుకొచ్చి తీసుకెళ్తాడు. ఒక్కోసారి అతనికి కుదరకపోతే తనే ఆటోలో వచ్చి వెళ్తుంది.
శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేసి, మయూఖ్‍ని స్కూల్లో వేసారు. సందుచివరే స్కూలు. పొద్దున్నే చద్దెన్నం పెట్టి పంపిస్తుంది గీత. చుట్టుపక్కల ఇళ్ళలోని పెద్దపిల్లలు వస్తే వాళ్లతో కలిసి వెళ్ళిపోతాడు. స్కూలు స్కూలని ఎలాంటి ఆర్భాటం లేదు. వెళ్లనని ఏడుపులూ, అల్లరీ లేవు. టైమైపోతోంది, బస్సు, ఆటో వెళ్ళిపోతాయన్న ఆదుర్దా లేదు. ఆడుతూపాడుతూ వెళ్తున్నాడు.
వాడికేనా టిఫెన్ పెట్టి పంపచ్చుకదా? వుసూరుమనిపిస్తుంది నీలిమకి.
జాయినయ్యేముందు లక్ష్మిని తరచితరచి అడిగింది.
“అత్తా! నువ్వు చూసుకోగలవా? మయూకి తోడు వెంకటలక్ష్మి మనవడుకూడా వున్నాడు. ముగ్గురు పిల్లలు మరి! విహీకోసం ఎవర్నేనా పెట్టమంటావా? లేకపోతే అమ్మదగ్గిర వదిలిపెట్టి వెళ్ళనా?” అని.
“ఏముందే చూసుకోవడానికి? వాళ్ళిద్దరి లోకం వాళ్లది. ఇద్దరూ బుద్ధిమంతులే. వీడింకా చిన్నేకదే? పాకడం వచ్చాక అప్పుడుకదా, అల్లరి మొదలయ్యేది? అప్పుడు చూద్దాంలే” అంది లక్ష్మి.
“ఇద్దరం వున్నాంకదక్కా, చూసుకుంటాం” అంది నీలిమకూడా.
విహీకి అందరూ ఆఫీసుకి వెళ్ళాక స్నానం చేయిస్తుంది లక్ష్మి. వంటినిండా నూనె పట్టించి, నలుగు పెట్టి, రెండు పెద్దబకెట్ల వేడినీళ్ళు పోస్తుంది. ఒక్కోసారి స్నానంవేళకి రుక్మిణమ్మ వస్తుంది. వాడు పెద్దగొంతుతో కంయ్‍కంయ్‍మంటే అంతకన్నా పెద్దగొంతుతో అదిలిస్తుంది. స్వంతిళ్ళుండి రెండుమూడుతరాలుగా అవే యిళ్ళలో వుంటున్నవాళ్ళమధ్య స్నేహానికి దశాబ్దాల వయసు వుంటుంది. రుక్మిణమ్మ లక్ష్మికన్నా కొద్దిగా పెద్దది. ఏడెనిమిదేళ్ళ తేడాలో ఇద్దరూ పెళ్ళిళ్ళై కాపురాలకి వచ్చారు. చదువుకున్నదని లక్ష్మిని చూస్తే చాలా ఇష్టం ఆమెకి. భర్త సరిగ్గా చూడడని జాలి, ప్రేమ. ఇద్దరికీ సయోధ్య కలిసింది. కష్టం, సుఖం పంచుకోవడం, అవసరమైనప్పుడు చేబదుళ్ళు తీసుకోవటం, యిచ్చిపుచ్చుకోవడాలు, ఇంకా ఎన్నో వాళ్లమధ్య జరిగాయి. ఆవిడకి నలుగురు పిల్లలు. బాగా చిన్నప్పుడే పెళ్లైంది. వెంటవెంటనే పిల్లలు. అందుకని పిల్లలంతా వాసుకన్నా పెద్దవాళ్ళు. మగపిల్లలు వుద్యోగాలతోటీ, ఆడపిల్లలు పెళ్ళిళ్ళయీ ఎక్కడెక్కడో వున్నారు. ఇక్కడికొచ్చినప్పుడు వీళ్ళింట్లో కాసేపేనా గడపకుండా వుండరు. గమ్మత్తేమిటంటే వాసు కజిన్స్‌మధ్యకి వాళ్ళు చొరబడరు. రుక్మిణమ్మా అంతే. హద్దుని దాటదు. నీలిమకి అలా అనిపించదు. ఎంత స్నేహమైతేమాత్రం మరీ యింత స్వతంత్రమేమిటనుకుంటుంది. పైకి అనిపించే విషయం అది. మనసులో పొడకట్టకుండా వున్నది ఆత్మన్యూనత. పిల్లల్లేరని. వాళ్ళు లోలోపల తనని హేళనచేస్తున్నారేమోనని.
తరుచు యశోద వస్తుంది. ఆవిడ వచ్చినప్పుడు నీలిమ గదిలోంచీ పెద్దగా ఇవతలికి రాదు. పలకరించేసి మంచినీళ్ళో, కాఫీయో యిచ్చి వెళ్ళిపోతుంది.
ఎవరూ రానిరోజున లక్ష్మి వెంటవెంట వుండి అన్నీ చూసుకోవడం, విహీని ఎత్తుకుని ఆడించడం నీలిమ చేస్తుంది. స్నానం చేసిన పిల్లాడిని పొడిబట్టలో చుట్టి అందిస్తుంది లక్ష్మి. ఆ వెచ్చదనం, వాడి వంటినుంచీ వచ్చే నూనె, నలుగు, సబ్బూ కలిసిన వాసన, వళ్ళు తుడిచేలోగా పాలకోసం వాడు ఇంటి కప్పెగిరేలా ఏడవటం, పాలసీసా నోట్లో పెట్టగానే మళ్ళీ లాక్కుంటారేమోనన్నట్టు గబగబ తాగడం, సగం తాగుతునే నిద్రలోకి జారిపోవడం, నిద్రపోతున్న పిల్లాడి బుగ్గమీద తట్టితట్టి ఆ పాలు పూర్తిచేయించడం. వాడి శైశవమాధుర్యం ఒక మత్తులా కమ్మేస్తోంది ఆమెని. వాడి ప్రతిచర్యా పారవశ్యాన్ని కలిగిస్తోంది. అంతలోనే చిన్న వులిక్కిపాటు.
వాడిని ఎత్తుకుని అటూయిటూ తిరుగుతున్నప్పుడు ఏవో గొంతుకలు తనని పరిహాసం చేస్తున్నట్టనిపిస్తుంది.
“పాపం, ఈ అమ్మాయికి పిల్లలంటే చాలా యిష్టం. కానీ పుట్టలేదు. అందుకే వాళ్ల పిల్లలనీ వీళ్ల పిల్లల్నీ ఎత్తుకుని మురిసిపోతోంది” ఎవరో అంటున్న భావన కలిగి వొళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ఉన్నపళంగా విహీని దించేసి తమ గదిలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మి నిట్టూర్చుతుంది.
బోర్లాపడటం, పాకడం, కూర్చోవడం అన్నీ తొందరతొందరగా వచ్చేసాయి వాడికి. చాపమీద పడుక్కోబెడితే వుండడు. ఏదో మూలకి పాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఏ మంచంకిందో పెత్తనం చేస్తాడు. ఏదేనా కనిపిస్తే నోట్లో పెట్టేసుకుంటాడు. నోరు గట్టిగా బిగించేసుకుంటాడు. చూపుడువేలితో బలవంతంగా తెరిచి నోట్లో వున్నదేదో తీస్తుంది లక్ష్మి. గోలగోలగా ఏడుస్తాడు. ఉంటే చిన్న కాగితంముక్కో, ఆకో, మరోటో ఎంత జాగ్రత్తగా తుడిచినా, గాలికి కొట్టుకొస్తాయి. ఒక్కోసారి నోట్లో ఏదీ వుండదు.
“భడవకానా! మీ అమ్మని మంచనిపిస్తున్నావు” అంటుంది మురిపెంగా.
అప్పటిదాకా వాడిపట్ల ప్రసన్నంగా వున్న నీలిమ మనసులో విముఖత కలుగుతుంది. తనని ఇంత మురిపిస్తున్న ఈ విహీ గీత ప్రతిరూపంకదా? మాధవ్‍కూడా వీడు పుట్టినప్పుడు అదే అన్నాడు. ఎత్తుకోవాలని ముందుకి వచ్చిన చేతులు మధ్యలో ఆగిపోతాయి. ఆమె పడుతున్న సంఘర్షణ లక్ష్మికి పూర్తిగా కాకపోయినా కొంతవరకూ అర్థమౌతోంది. నోట్లోంచీ వచ్చే ప్రతిమాటకీ పెడర్థం తీసుకుంటే ఏం చెయ్యగలదు తను? మనవల్ని పెంచే క్రమంలో అమ్మమ్మలకీ మామ్మలకీ వాళ్ళ పిల్లల చిన్నతనం గుర్తురాకుండా ఎలా వుంటుంది? మయూ పూర్తిగా వాసు పోలిక. విహీ తల్లిపోలిక పిల్లాడు.
మాధవ్ ఆఫీసునించీ రాగానే బట్టలు మార్చేసుకుని వాడిని తమగదిలోకి తెచ్చేసుకుంటాడు. మంచంమధ్యలో పడుకోబెట్టి వాడి ఆట తదేకంగా చూస్తూ వుండిపోతాడు.
“పాపం. వీడికి పొలం, మెళ్ళోకి గొలుసులూ, చేతులకి మురుగులు, కాళ్ళకి కడియాలూ అన్నీ వున్నాయిగానీ వేసుకుందుకు సొంతచొక్కా ఒక్కటికూడా లేదు. వాళ్లమ్మ అన్నీ దాచేసి వాళ్లవీ వీళ్ళవీ వేస్తుంది” అంది నీలిమ ఓరోజు విహీని ముద్దుచేస్తూ.
పడీపడీ నవ్వాడు నవ్వాడు మాధవ్. “నువ్వు కొని తొడగవే” అన్నాడు.
“నేనెందుకు కొనిస్తాను? ఆవిడ డబ్బులు గట్టివీ, నావి ఓటివీనా?” అంది.
“నువ్వు కొంటానన్నా కొననివ్వదు. పిల్లల బట్టల్తో గీత చాలా ఆడుతుంది. తను బొమ్మలు బాగా వేస్తుంది. షర్టు బొమ్మ వేసి, పాతఫొటోల్లో చూసి, దానికి మొహాలనీ, కాళ్ళూచేతుల్నీ తగిలిస్తుంది. మయూ చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసాం” అన్నాడు మాధవ్. అంటూండగానే అతన్లో ఏదో ఆలోచన చురుక్కుమంది. తామందరూ పెరిగారు, పెద్దయ్యారు. జీవితాల్లోకి కొత్తదనం వచ్చింది. గీత పాతజ్ఞాపకాలలో అలాగే మిగిలిపోతోందా అని. మర్నాడు ఆఫీసునించీ వస్తూ ఆరురంగుల్లో వున్న చిన్నచిన్న జుబ్బాలున్న పేకెట్టు తనే కొనుక్కొచ్చి గీతకి ఇచ్చాడు.
“వీడికింక రోజూ కొత్తబట్టలు వెయ్యి వదినా! మనందరి బట్టలూ వెయ్యడం మయూతో ఆపేద్దాం. సుధీర్, వాసుల్లాగ వాడు మనకీ తర్వాతితరానికీ లింకు. అందుకు వేసాం. వీడికి అక్కర్లేదు” అన్నాడు.
“అంతేనా? మళ్ళీ ఎందుకు కొన్నావు? బారసాలకి వచ్చినవే చాలా వున్నాయి” అందామె.
“ఉంటే వుండనీ. పర్వాలేదు. అవీయివీకూడా వెయ్యి” అన్నాడు.


రోజులు అలాగే గడిచిపోతే బాగానే వుండేది. కానీ కాలప్రవాహం సాఫీగా వుండదు. ఎన్నో సంఘటనలు అందులో కొట్టుకొస్తూ వుంటాయి. కొన్ని నలకల్లా కొట్టుకుపోతాయి. ఇంకొన్ని అడ్డంపడి జ్ఞాపకాలతీరానికి కొట్టుకొస్తాయి. విహీని ఎత్తుకుని తిరుగుతుంది నీలిమ. తనని చూడగానే నవ్వులు నవ్వడం, ఎత్తుకొమ్మని చేతులందించడం, ఎత్తుకోకుండా అటూ యిటూ వెళ్తుంటే గునవడం, ఎత్తుకుంటే కేరింతలు కొట్టడం, ఇంకా ఎన్నో చేష్టలు వాడితో అనుబంధాన్ని పెంచుతున్నాయి. తండ్రి ఫోనుచేసినప్పుడు ఒకసారి వాడినెత్తుకునే వెళ్ళింది. కిటికీలోంచీ ఊగుతూ కనిపిస్తున్న మొక్కని చూసి గట్టిగా కేరింతలు కొడుతున్నాడు విహీ. కుటుంబరావుకి ఆ కేకలు వినిపించాయి.
“వాడిని ఎత్తుకుని తిరుగుతున్నావేంటే, నువ్వు? పిల్లాడిని నీకొదిలేసి వుద్యోగానికి పోతోందా నీ తోడికోడలు? ఐనా ఆడాళ్ళు అంత పడీపడీ ఆఫీసుకెళ్ళి చేసేదేం వుంటుంది? షోగ్గా చీరలు సింగారించి అక్కడికెళ్ళి నాలుగు వగలూ, నవ్వులూ రువ్వితే చాలు, పరిగెత్తుకొచ్చి పనులన్నీ చక్కబెట్టేవాళ్ళు కోకొల్లలు. ఈ పిల్ల అంత పరిగెత్తడం దేనికి? ఇంకొన్నాళ్ళు సెలవు పెట్టుకుంటే పోయేదేం వుంది? జీతం పోతుందని భయమా? మీ అత్తేం చేస్తోంది? పిల్లాడిని నీకు చేరిక చేస్తున్నారేమో! రేప్పొద్దున్న పెంపకం, దత్తతా అంటారేమో! నల్లకొక్కిరాయిలా వుంటాడు వెధవ. వీడినే పెంచుకోవాలీ? అంతగా పెంచుకోవాలంటే మాధురీ మానసల పిల్లల్లేరే?” అన్నాడు. నీలిమ చేతిలోంచి రిసీవరు జారిపోయింది. తనకింక పిల్లలు పుట్టరని తండ్రి నిర్ధారించుకున్నాడా? ఆయనొక్కడేనా, అందరునా? ఎవరూ బైటికి అనట్లేదా? ఎప్పుడో ఆ నిజం భళ్ళుమని బైటపడిపోతుందా? విహీని అక్కడికక్కడే దింపేసి, రిసీవరు పెట్టేసి వెళ్ళి గదిలో మంచానికి అడ్డంపడింది.
ఉన్నపళంగా దింపేసరికి విహీ ఏడుపందుకున్నాడు. ఎందుకేడుస్తున్నాడోనని లక్ష్మి వచ్చింది. వాడు నేలమీద వున్నాడు. అప్పటిదాకా వాడినెత్తుకుని తిరిగిన నీలిమ లేదు. సరదాపడుతోందని పిల్లాడిని ఇస్తోంది. తను చూసుకోలేకా కాదు, తనకి చేతకాకా కాదు. అసలేం జరిగిందని ఇలా వదిలేసి వెళ్ళింది? ఆమెకి చాలా కోపం వచ్చింది. చాలాసేపటికి గదిలోంచీ ఇవతలికి వచ్చిన నీలిమ ముఖం ఎర్రగా వుబ్బి వుండటంచూసి, ఆమె భృకుటి ముడిపడింది.
జరిగిన విషయాలు ఒకటొకటీ కలిపితే ఏదో జరిగిందని అర్థమైంది. ఎక్కడినుంచీ ఫోను? ఎవరు చేస్తారు? తండ్రో, అక్కచెల్లెళ్ళో. మాధవ్, లేకపోతే తులసి. ఇంకెవరు చేస్తారు? ఏడిపించేలాంటి మాటలెందుకు అంటారు? తనకి తెలీకుండా, తమ వెనుక ఏదో జరుగుతోందని అర్థమైంది.
“ఏమైందే?” అని అడిగింది.
“ఏమీ లేదత్తయ్యా!” నీలిమ తలదించుకుంది. విహీకోసం చేతులు చాపితే లక్ష్మి యివ్వలేదు.
“ఆడుకుంటున్న పిల్లాడిని ఎత్తుకోవడం దేనికి? మళ్ళీ వున్నపళంగా దింపేసి ఏడిపించడం దేనికి? నువ్వెళ్ళి నీ పని చూసుకో” అంది కోపంగా.
జరగబోయేవాటికి ఆ సంఘటన నాంది. ఉత్పాతాలకి నాందీప్రస్తావన చాలా సాధారణంగా జరిగిపోతుంది. చేతిలోంచీ పరిస్థితి తప్పిపోయాకే వాటి తీవ్రత తెలుస్తుంది.


సుధీర్ యూయస్ వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు అందరం కలుద్దాం అన్నాడతను. అతని వుద్దేశం ఎలీట్ లెవెన్ అందరూ కలవాలని. దానికన్నా ముఖ్యం గీతని ఆఖరిసారి చూడాలని. సుమతి అన్ని కుటుంబాలవాళ్లనీ ఇంతికి భోజనాలకి పిలిస్తే బావుంటుందంది. ప్రమీల, గురుమూర్తి సరేనన్నారు. కొడుకు యూయస్ వెళ్ళడం వాళ్ళకి గొప్పగా వుంది. అందరితోటీ కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకున్నారు. మిగిలిన ఎనిమిది కుటుంబాలనీ, వియ్యాలవారి మూడు కుటుంబాలనీ పిలిచారు. ఎలాగా ముంబైనుంచే వీళ్ళు వెళ్ళేదికాబట్టి రమ తల్లిదండ్రులు రాలేదు. మిగిలివాళ్ళు చాలావరకూ వచ్చారు.
గీతకి ఆఫీసులో లేటైంది. ఆఫీసయ్యాక నేరుగా అటే వస్తానంది. లక్ష్మి పిల్లల్నీ, నీలిమనీ తీసుకుని వెళ్తే వాసు, మాధవ్, గీత ఆఫీసులనుంచి నేరుగా వచ్చారు. గీత రాగానే మయూ ఎక్కడో ఆడుకుంటున్నవాడల్లా వచ్చి చుట్టుకుపోయాడు. వాడిని ముద్దుచేసి పంపించి, లక్ష్మిదగ్గరున్న విహీకోసం చేతులు జాపింది. వాడు తల్లిమీదికి వురికాడు. ఇంకెవరో వాడికోసం చెయ్యి చాపారు. తల తిప్పేసుకున్నాడు.
“తల్లిని చూసాడంటే ఇంకెవరూ వాడికి ఆనరు” నవ్వుతూ మురిపెంగా అంది లక్ష్మి. సుధీర్ ఎందుకో వులిక్కిపడ్డట్టై తల తిప్పి గీతకేసి చూసాడు.
వొళ్ళో ఎక్కి తొక్కుతూ, పెద్దగా కేరింతలు కొడుతూ, జుత్తు రెండు గుప్పిళ్ళతోటీ పట్టుకుని తన సంతోషాన్ని ప్రదర్శిస్తూ వుంటే ఆమె నవ్వుతోంది. జుత్తు విడిపించుకుంటోంది. మరోధ్యాస లేదు. ప్రపంచాన్ని మర్చిపోయినట్టుంది. ఆమె ఎవరో పరాయిమనిషిలా అనిపిస్తుంటే తామిద్దరిమధ్యా వున్న దూరం ఏదో పూర్తిగా అర్థమైనట్టు అతని ముఖం పాలిపోయింది. అతను గీతని చూస్తుంటే రమ అతనిముఖంలోకి చూడసాగింది. సుమతి గమనించింది.
“ఏమిట్రా, అలా చూస్తున్నావు?” అంది. అతను చప్పుని తేరుకున్నాడు.
“ఎంత మారిపోయారే వీళ్ళంతా? గీత, సమీర, తులసీను. నాకన్నా ఐదేళ్ళూ పదేళ్ళూ చిన్నవాళ్ళు. వీళ్ళు పిల్లల్నెత్తుకుని ఆడిస్తుంటే తమాషాగా వుంది” అన్నాడు నవ్వడానికి విఫలప్రయత్నం చేస్తూ.
“ఏరా? నేను నీకన్నా చిన్నకాదా? వాళ్ళేనా? నన్ను చూస్తే ఆశ్చర్యం వెయ్యదేం” దెప్పింది.
“నువ్వా? అసలు నాకు చెల్లెల్లా ఎప్పుడున్నావే? ఎప్పుడూ మా వీపులు పగలగొట్టీడమేకదా?” అన్నాడు. మాటలో ఏదో తేడా. స్టామరింగ్‍లాంటిది. రమకి తెలీదు. అతనంతే అనుకుంటోంది.
ఎలా వుండేవాడు వీడు! ఎలా తయారయ్యాడు! సుమతికి గుండె పిండేసినట్టైంది. తలతిప్పి గీతకేసి చూసింది. ఆమె ఇంకా కొడుకు ప్రపంచంలోనే వుంది. అంటించే నిప్పంతా అంటించేసి ఏమీ పట్టనట్టు కూర్చుంది!!! సుధీర్ ఎప్పటికేనా మామూలుగా ఔతాడా? మనసులో సన్నటి జ్వాలలా వున్న కోపం ప్రజ్వరిల్లింది.
“వదిన యింక పూర్తిగా బ్రహ్మరాక్షసైపోయినట్టేకదరా?” వసంత్ నవ్వుతూ అన్నాడు పక్కనున్న వాసుతో. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సుమతి పెద్దదైనప్పుడు తాము అనుకున్న మాటలు గుర్తుతెచ్చుకుని. వాసుకూడా పెద్దగా నవ్వాడు. గీత తన ప్రపంచంలోంచీ ఇవతలికొచ్చింది. ఆ మాటలూ వింది.
“అరేయ్, నా సంగతేమోగానీ, ఇంజనీరుగారు పరమకర్కోటకుడని మీ ఆఫీసులో అనుకుంటున్నారట” అంది వసంత్‍కేసి చూసి. వసంత్ తండ్రి రాజశేఖరం విన్నాడు ఆమాటల్ని.
గీతకెలా తెలుసు? ఈ విషయాలుకూడా వీళ్ళు మాట్లాడుకుంటారా? వీళ్ళమధ్య దాపరికాలంటూ వుండవా? వసంత్ చెప్పాడా? లేక మానసా? ఏమని సలహా యిస్తుంది గీత? మడికట్టుకుని కూర్చోమంటుందా? వాళ్ళకేం? ఇల్లూ ఆస్తులూ వున్నాయి. తను నూటయిరవైగజాల్లో కట్టిన యిల్లు తప్ప ఇంకేదీ లేదు వసంత్‍కి. అందులోకూడా సమీరకి వాటా యివ్వాలేమో! ఆడపిల్లలకి ఆస్తిహక్కులు ఇచ్చారుకాబట్టి. ప్రహ్లాద్‍కీ అంతే. వాళ్లది మరీ ఫ్లాట్. మాధవేనా అన్నతోటీ, చెల్లెలితోటీ ఆ యింటిని పంచుకోవాలి. వీళ్ళు ముగ్గురూ ఇప్పుడు తోడల్లుళ్ళు. మాధవ్ మంచి పొజిషన్లో వున్నాడు. పోస్టు మంచిది. పిలిచి డబ్బు చేతిలో పెడతారు. వసంత్‍కీ అంతే. ఐనా ఇద్దరూ పైస ముట్టుకోరు. ఆ కారణాన్న పనిచేసేచోట గొడవలు. ప్రహ్లాద్ టీచింగ్‍వైపు వెళ్తానంటున్నాడట.
ఆమధ్యనెప్పుడో గీత ఆఫీసుకి ఫ్రెండుని కలవడానికి వెళ్ళాడు. ఆ ఫ్రెండు ఒకటే గోల.
“గీత మీ బంధువులమ్మాయేటకద రాజశేఖర్! కాస్తంత చెప్పరాదా? తను తినదు, ఒకళ్లకి తినే వీలు ఇవ్వదు. వాళ్ళకేం? కడుపు నిండిన బేరం. మధ్యలో మేం మట్టికొట్టుకుపోతున్నాం” అని. ఏం చెప్తాడు గీతకేనా, వాసుకేనా? ఈ గుంపందరికీ వాళ్ళిద్దరూ లీడర్లు. కట్నం తీసుకోలేదు వాసు. కానీ మామ యిచ్చిన బంగారం, స్థలం తీసుకున్నాడు. అవి వద్దనలేదు. అప్పుడు ఆదర్శాలు అడ్డు రాలేదు. జీతంపైన పైస ముట్టడు. మరి షేర్లలో సంపాదిస్తాడు. ఫ్రెండ్సు చేసే వ్యాపారాల్లోకూడా కొంతమొత్తాలు పెట్టాడట. పైసని పది పైసలు చేసే తెలివి వుందట. అది అనైతికం కాదా?
“ఆ షేర్లేవో నాకూ నేర్పించరా! నేనూ పెడతాను” అన్నాడు ఒకసారి.
“గవర్నమెంట్ వుద్యోగస్తులు ట్రేడింగ్ చెయ్యకూడదు బాబాయ్. కమలాకర్‍గారు వున్నప్పుడు ఇద్దరం కలిసి ఆయన తమ్ముడి పేరుమీద చేసేవాళ్ళం. ఆయన వెళ్ళిపోయాక మానేసాను. ఉన్నవన్నీకూడా తీసేసి నా డబ్బు నాకిచ్చేసారు. ఇప్పుడింక మ్యుచువల్ ఫండ్స్‌లో పెడుతున్నాను. బేంకు వడ్డీలకన్నా బాగా వస్తుంది” వివరించాడు వాసు.
“మీరు రిటైరయ్యారు కాబట్టి షేర్స్‌లో పెట్టచ్చు” అని కూర్చోబెట్టి చాలా వివరంగా చెప్పాడు. అర్థం కావడానికి తన తెలివి సరిపోలేదు.
“పోనీ ఎక్కడ ఎలా పెట్టాలో చెప్పరా, నేను పెడుతుంటాను” అన్నాడు.
“అలా వద్దు బాబాయ్! మార్కెట్‍ ఎప్పుడెలా వుంటుందో ఎవరం వూహించలేం. ఎవరి అడుగులూ, తప్పటడుగులూ వాళ్ళవే. మాధవ్ డబ్బు కొన్నిమాట్లు పెట్టాను. నా డబ్బు పోతే నాకు బాధొక్కటే వుంటుంది. వాడిది పోతే జవాబుదారీకూడా వుంటుంది. అందుకే వాడి పెళ్లయాక ఇంక పెట్టడం మానేసాను” అన్నాడు. వసంత్‍కూడా దాన్ని బలపరిచాడు. అప్పట్నుంచే వాసుపట్ల కొంత విముఖత మొదలైంది. ఎవరికీ సహకరించడనో, నిక్కచ్చిగా వుంటాడనో, ఏదో అసౌకర్యం మొదలైంది.
తనది తను బాగానే చూసుకుంటున్నాడు. వీళ్ళకిమాత్రం నీతులు. చిన్నప్పుడు పిల్లలకి ఏవో మంచీ చెడూ చెప్పి పెంచుతాం. అలాగని లౌక్యం తెలీకపోతే ఎలా? అందరికీ వాసులా సంపాదించుకోవాలని వుండదా? వీళ్ళు డబ్బులు పోగేస్తుంటే మిగతావాళ్ళు చూస్తూ కూర్చోవాలా? అతని ప్రభావంలోంచీ వీళ్లని తప్పించాలి. ముందు మాధవ్‍ని దూరం చెయ్యాలి. ఈ ముగ్గురినీ కలపాలి. ఒక దగ్గిర చేర్చాలి. అంటే ఆ యిల్లు విచ్చుకోవాలి. అందులో ఎవరూ నష్టపోయేది వుండదు. ఒక యిల్లున్నచోట పదో పదిహేనో ఫ్లాట్లు పడతాయి. వీళ్ళకే సగం ఫ్లాట్సొస్తాయి. అన్నదమ్ములిద్దరూ చెరో రెండూ తీసుకోవచ్చు. ఆయన ఆలోచనలు అలా సాగుతూ కాళ్లదగ్గిర మెత్తటి స్పర్శ తగిలి ఆగాయి. విహీ. ఎప్పుడు దింపిందో గీత, పాకుతూ వచ్చి కాళ్లని పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్రయత్నంగా వంగుని లేవదీసి వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.
“నీకు నేను తాతనని ఎవరు చెప్పార్రా?” ముద్దుచేస్తూ అడిగాడు.
“వాడికి తెలుసు బాబాయ్! తెల్లమీసాలవాళ్లందరూ తాతయ్యలూ, నల్లమీసాలవాళ్ళంతా బాబాయ్‍లూ అని” అని నవ్వింది ఎక్కడినుంచో రవళి.
“మామయ్యలు రవళీ?” కేకేసాడు జో.
“టీవీటవర్లు బావా! ఒకళ్ళని ఒకళ్ళు మించిపోతున్నారు” ఆమె తగ్గలేదు. నవ్వులతో అక్కడంతా హోరెత్తిపోయింది.
పద్మతో రాజశేఖరానికి పెళ్లయ్యేసరికి వాసు పుట్టేసాడు. సుధీర్‍తో కలిసి తిరిగేవాడు. గీతమాత్రం కళ్ళెదుటే పుట్టి పెరిగింది. ప్రేమ ప్రేమే. సాధ్యం కానివో, చెయ్యకూడనివో చెయ్యాలకున్నప్పుడు ఆలోచనల్లోకి కుట్రలూ, కుతంత్రాలు ప్రవేశించి ఆ ప్రేమ కొంచెం వన్నెతగ్గుతుంది. అది నేరానికి ప్రేరేపించకుండా ఈ మోహాలు అడ్డుపడతాయి.
ఆయన అంత అపేక్షగా గీత కొడుకుని ఎత్తుకుంటాడనుకోలేదు మాధురి. విదిలించేస్తాడనో, వుపేక్షిస్తాడనో అనుకుంది, తెల్లబోయి చూసింది. అందరూ అందరు పిల్లల్నీ ఎత్తుకున్నారు. పాకుతూనో, తప్పటడుగులు వేస్తూనో దగ్గిరకొచ్చిన ఏ పిల్లనీ, పిల్లాడినీ వుపేక్షించలేదు. కానీ దృష్టి గీతమీదే వుండటంతో విహీని ఎవరు ఎత్తుకున్నా మాధురికి అదొక ఆశ్చర్యం.
పదిమంది వున్నప్పుడు ఒక్కచోట కదలకుండా కూర్చోరు. ఇటూ, అటూ చోట్లుమారుతూ వున్నప్పుడు లత, రమకూడా వచ్చి దగ్గర కూర్చుని గీతతో మాట్లాడారు. తమకన్నా ముందు పెళ్ళై, ఎమ్మే చదివి వుద్యోగం చేస్తోన్న ఆమెంటే వాళ్ళకి గౌరవం. సినిమాహాలు సంఘటననుంచీ లతకి వాసంటే వున్న బెరుకు పోయి అతనితో హాస్యాలుకూడా చేస్తుంది. అతనుకూడా అభిమానంగా మాట్లాడతాడు.


సుధీర్, రమ యూయస్ వెళ్ళిపోయాక రవళికీ, ప్రవల్లికకీ నెలరోజుల తేడాలో పెళ్ళిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. సుధీర్ లేని లోటు రెండు పెళ్ళిళ్లలోనూ అందరికీ బాగా తెలిసింది. ప్రవల్లిక పెళ్ళి ఏర్పాట్లు గీత చూడటం మాధురి జీర్ణించుకోలేకపోయింది. అదీకాక అత్తగారుసరే, మామగారుకూడా తనతోకన్నా, గీతతో ఎక్కువ చనువుగా, ప్రేమగా వుండటాన్ని తట్టుకోలేకపోతోంది. ’
“మనింట్లో పెళ్ళికి ఆమె పెత్తనం చెయ్యడమేమిటి? మీరూ నేనూ చూసుకోలేమా? మా నాన్న ముగ్గురాడపిల్లల పెళ్ళి చేసి వున్నాడు. ఆయన పనికిరాడా?” అంది ప్రహ్లాద్‍తో.
“పెత్తనమేం వుంటుంది? యాక్షన్ ప్లాన్ యిస్తుంది. స్పర్థలు రాకుండా ఎవరి పని వాళ్ళు చేసేసి తప్పుకుంటారు. ఇన్ని పెళ్ళిళ్ళు జరిగాయికదా, డెకర్స్, వంటవాళ్ళూ, పురోహితుడూ అంతా వాళ్ళ ఫోన్ నెంబర్లతో తన చేతిలో వుంటారు. రమ్మంటే ఇంటికి వస్తారు. వాళ్ళొచ్చినప్పుడు ఆ పని అప్పజెప్పినవాళ్లనికూడా రమ్మంటుంది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. అంతా ఆఫీసు పని జరిగినట్టు జరిగిపోతుంది” అన్నాడతను.
“ఏం, ఆ ఫోన్ నెంబర్లు మీరడిగితే ఇవ్వదా? మనమే మాట్లాడుకోవచ్చుకదా?” అంది.
“నావల్లకాదు తల్లీ! కావాలంటే నీకు తెచ్చిస్తాను నువ్వు చూసుకో”
“నాన్‍కోపరేషనా?” ఎర్రగా చూస్తూ అడిగింది.
“అలాంటిదేమీ లేదు. సాఫీగా సాగుతున్నదాన్ని ఎవరూ మధ్యలో వేలుపెట్టి కెలకరు. పెద్దవాళ్లెవరికీ లేని అభ్యంతరాలు మనకెందుకు? పెళ్ళంటే చిన్నవిషయం కాదు. మెగా ఈవెంటు. గొడవల్లేకుండా ఆహ్లాదంగా, అలిసిపోకుండా జరగాలి. ఆ సూత్రం ఏదో కనిపెట్టింది తను. లేకపోతే ఇంతమంది పెద్దవాళ్లతో తొడతొక్కిడిగా వుంటుంది. అందర్నీ కూర్చోబెట్టి మర్యాదలు చెయ్యాలి. ఎవరూ ఎవరి మాటా వినరు. ఏ పనీ ఎత్తుకోరు. కోపాలు, ఎడమొహం పెడమొహాలూ మొదలౌతాయి” అన్నాడు. ఆ విషయాన్ని అక్కడితో వదల్లేదు మాధురి. నాలుగైదుసార్లు అంది ప్రహ్లాద్‍తో. అరుణతోకూడా అంది, ఐతే కాస్త సున్నితంగా. గీతమీద అభియోగం చేస్తున్నట్టు కాకుండా.
అరుణకి ఆమె మనస్తత్వం అప్పటికే గ్రహింపుకి వచ్చిందికాబట్టి బాగానే అర్థంచేసుకుంది. వియ్యంకుడు పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేసాడో చూసింది. ప్రహ్లాద్ కూతురి బారసాలకి అన్ని కుటుంబాలవాళ్ళూ వస్తే తిండి పెట్టి, వసతి చూపించి మర్యాద చెయ్యడానికి గిజగిజలాడిపోయాడు. వసంత్ కూతురి బారసాలకి తాము ముగ్గురు వియ్యాలవారినీ తప్ప ఇంకెవర్నీ పిలవలేదు. అక్కడ నామకరణం చేయించి ఇక్కడ తొట్లో పెట్టుకుని అందర్నీ పిలుచుకుంది పద్మ. మొదటిది తమింట్లో జరిగిన పెళ్ళి. ముగ్గురూ ఆడపిల్లలు, ఇంకా పెళ్ళికి ఇద్దరున్నారని తాము ఎందుకూ బెట్టుచెయ్యలేదు. కొంత ఖర్చూ మోసారు. మిగిలిన యిద్దరాడపిల్లల్నీ ఇక్కడే ఇచ్చి చేసాక మనుషుల మనస్తత్వాలు బైటపడుతున్నాయి. అదేదో తమ గొప్పతనం, తండ్రి తెలివీ అనుకుంటోంది మాధురి. నీలిమ గీతతో పోటీకి పోతుందట. గొడవపడుతుందట. గీతతో వీళ్ళకి పోలికెందుకు? పోటీ ఎందుకు? దాని తెలివిముందు వీళ్ళు దేనికి పనికొస్తారు? పదిపెళ్ళిళ్ళు దాని చేతిమీద జరిగాయి. ఎక్కడా తడబడకుండా చేయించింది. తన అన్నే గుర్తొస్తాడు ఆ వ్యవహారశైలి చూస్తుంటే. ఎక్కడా తొణక్కుండా, ఎవర్నీ నొప్పించకుండా అందర్నీ కలుపుకుంటూ వెళ్తుంది.
ప్రమీల భర్తకి తను పెద్దల్లుడినని అహం. నిర్మల భర్త వూరికే గొడవపడుతుంటాడు. మొదటాయన వెంటవెంట తిరిగి కావల్సినవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది గీత. సుమతితోకలిసి గారాలుపోతూ నడిపించుకుంటుంది. మూడోఆయన ఎవరిమీదేనా అరుస్తుంటే “రా మామయ్యా! కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అని చెయ్యి పట్టుకుని అక్కడినుంచీ తీసుకొచ్చేస్తుంది. ఆ చొరవ ఇంకెవరికి వున్నాయి? మహీకీ రవళికీకూడా లొంగడు ఆ పెద్దమనిషి.
అత్తాకోడళ్లమధ్య ముడి బిగుసుకోకముందు నందకిషోరే అడిగేసాడు.
“పెళ్ళిపెద్దగారిని ఎప్పుడు రమ్మందాం?” అని.
“అన్నీ రాసుకుని అదే వస్తుంది. కానీ మీ కోడలు చూసుకుంటానంటోంది” అంది అరుణ.
“చూసుకొమ్మను. అది అన్నీ రాసుకుని తెస్తుంది, ఆ కాగితం తీసుకుని మిగతావి తను చూసుకుంటే సరి. ముగ్గురక్కచెల్లెళ్ళున్నారుకదా? వాళ్ళ పతిదేవుళ్ళున్నారు. తలోవైపుకీ పరుగులు పెట్టి అన్నీ కానిచ్చండి. గీతమాత్రం ఎంతకని చూస్తుంది?” అన్నాడు తమాషాగా. అందులో తమాషా ఏమిటో మాధురికి అర్థమవ్వలేదు.
“సరిపోయింది. మనింట్లో వరసగా ఫంక్షన్లు. ఇంకా పెళ్ళికి పిల్లలున్నారు, పనులు వాళ్ళకే ఇస్తామనే ఆశతో వంటవాళ్ళూ, మంటపం అలంకారం చేసేవాళ్ళూ, టెంటుహౌసువాళ్ళూ ఇంటికొచ్చి మాట్లాడుకుని వెళ్తున్నారు. పురోహితుడు కాకితో కబురంపితే వస్తానంటాడు. కంసాలి ఎప్పట్నుంచో చేస్తున్నాడు. నమ్మకస్తుడు. మేరేజిహాలతను పెళ్ళిళ్లసీజను రాగానే, మీయింట్లో యీ ఏడాది ఏవేనా వుంటే చెప్పండి, రెండుమూడు డేట్లకి హాలు బ్లాక్ చేసి పెడతానంటాడు. త్రిమూర్తులుగారేమో హోల్‍సేల్ ధరలకి బట్టలిస్తాడు. ఇంకా ఎన్ని? ఇవన్నీ వదులుకుని వూరిమీదపడి వెతుక్కుంటామా ఏంటి?” అంది అరుణ.
మాధురి అప్పటికైతే మాట్లాడలేదుగానీ, ఆనక తండ్రితో అంటే, “వీళ్ళంతా యింత తెలివితక్కువవాళ్ళేంటే? పదో పరకో మిగుల్చుకుంటున్నట్టుంది ఆ పిల్ల. అందుకే అన్ని వ్యవహారాల్లోనూ తగుదునమ్మా అని దూరిపోతుంది. లేకపోతే ఇంతంత డబ్బు వాళ్ళకెక్కడినుంచీ వస్తుంది? చేసేవి గుమస్తా వుద్యోగాలేగా? నీలిమతో అంటేనూ, ఆమె డబ్బు పెత్తనం తీసుకోదంది. పిచ్చిమొహమా, డబ్బు అలా నేరుగా తీసేసుకుంటారేమిటి? మేరేజిహాలూ అవీ బుక్ చేసుకుంటారా? వాళ్ళు తీసుకొచ్చి కమిషన్లు యిస్తారు. సర్లే, ఆ పెళ్ళిమంటపం అద్దెంతో తెలుసుకుని చెప్పు, నేను వెళ్ళి కనుక్కుని కూపీలాగుతాను, ఎంత మిగుల్చుకుంటోందో. అప్పుడేనా వీళ్లందరికీ కళ్ళు తెరుచుకుంటాయేమో! అందరికీ తెలుసేమో! మేనకోడలన్న ముద్దుచేత వూరుకుంటున్నారేమో! ఐనా తెలుసుకుంటే మీ జాగ్రత్తకి పనికొస్తుంది” అన్నాడు.
అలాంటి విషయాల్లో నిజానిజాలు ఎప్పటికీ బైటపడవు. నిర్ధారించుకోవడానికీ, కాదనడానికీ ఎలాంటి అవకాశాలూ వుండవు. కొందరు మనుషులు వేసుకునే అంచనాలు అవే నిజాలుగా చలామణీ ఐపోతాయి. గీత వెనక అలాంటి అంచనాలు కొన్ని నీడల్లా అనుసరిస్తున్నాయి.
“ఔను ఎవరో వంటలక్క మనవణ్ణి పెంచుకుంటోదటకదా? వాడిని వాళ్ళ పిల్లాడితో సమానంగా చూసుకుంటున్నారట? ఏం ఖర్మమే ఇది? డిగ్నిటీ అన్నది లేదు ఎక్కడాను. ఇల్లు అయ్యవారి నట్టింట్లా చేస్తోంది ఆ గీత. ఎలా భరిస్తున్నావు?” అన్నాడు నీలిమతో. పెళ్ళిలో సందు చూసుకుని. మనిషికి ప్రేమలాగే ద్వేషించడానికికూడా మనుషులుండాలి. అందరికీ కాదు, కొందరికి. ఆ కొందర్లో కుటుంబరావు, మాధురీ వుంటారు. సహవియ్యంకుడైన రామారావుమీద మొదలైన అసూయ ఆయన గీతమీదికి మళ్ళించుకుంటే గీతతో అకారణంగా పుట్టించుకున్న పోటీ మాధురి ద్వేషానికి కారణమైంది.


వల్లి పెళ్ళైపోయింది. సాఫీగా. తండ్రీకూతుళ్ళు భూతద్దం వేసినట్టు ఎంత వెతికినా గీత ఎక్కడా చిక్కలేదు. పైగా ఎలీటు లెవెను అందరూ కలిసి ఇచ్చిన కానుకే కాకుండా చుడీబజారునుంచీ ఖరీదైన గాజులసెట్టు విడిగా తెచ్చి ఇచ్చింది. వల్లికి ఫాషన్లెక్కువ. గాజులు చూసుకుని సంతోషపడిపోయింది. పెళ్ళికూతుర్ని చేసినప్పుడు అన్నిగాజులతోపాటు అవీ వేసుకుంది. అందరికీ చాలా నచ్చాయి.
పెళ్ళిలో అక్కచెల్లెళ్ళు ముగ్గురూ కలిసి తిరిగారు. గీతని దడికట్టినట్టు దూరంపెట్టారు. ఆమెకూడా తనకి విలువివ్వనిచోటికి వెళ్లలేదు. విహీని ఎత్తుకుని, మయూని వెంటబెట్టుకుని, వాసుపక్కన నిలబడి, వచ్చినవాళ్ళని పలకరిస్తూ దూరంగానే వుండిపోయింది. కానీ, మొదటిసారి వంటరితనం అనుభవంలోకి వచ్చింది. పరాయితనం తెలిసింది. వెల్తి మనసులోకి చొరబడింది. దు:ఖపు కెరటాలేవో దూరాన్నుంచీ ఒకదాన్నొకటీ తరుముకుంటూ వస్తున్నట్టనిపించింది. కళ్ళు తడయ్యాయి. వాసుతప్ప ఇంకెవరూ తనకి మిగిలిలేనట్టు అతనికి అతుక్కుపోయింది.
గీత అలా దూరదూరంగా తిరుగుతుంటే అరుణ మనసు తరుక్కుపోయింది. పిలిచినా, వచ్చి అడిగినదేదో ఇచ్చి వెళ్ళిందిగానీ, పెళ్ళివేదికమీద వుండలేదు. “వీడన్నీ లాగేస్తాడత్తా!” అంది విహీని చూపించి. అది నిజంకాదని అరుణకి తెలుసు. ఎంతమంది లేరు, వాడిని పట్టుకోవడానికి? మయూ చిన్నప్పుడు అందర్లోకీ తనొక్కడే తండ్రవడంతో వాడిని ఎత్తుకుని తిరగడానికి సిగ్గుపడేవాడు వాసు. ఇప్పుడలా కాదు. విహీని వదలకుండా ఎత్తుకుని తిరుగుతున్నాడు.


వల్లి పెళ్ళి తర్వాత నీలిమలో మళ్ళీ మార్పొచ్చింది. విహీ పుట్టాక గీతతో ఏర్పడిన సయోధ్య పూర్తిగా చెదిరింది. తండ్రి, అక్క చెప్పిన విషయాలు, అన్నమాటలు, ఆమెమీద బాగా ప్రభావం చూపించాయి. ముభావంగా వుంటోంది. గీత, లక్ష్మి పట్టించుకోలేదు. నిముషానికి ఒకలా వుండేవాళ్లని ఎవరుమాత్రం సీరియస్‍గా తీసుకుంటారు? అదికూడా ఆమెని బాధించింది.
ఆమెతో నేరుగా ఎవరూ చెప్పలేదుగానీ మానసకి నాలుగోనెలని బైటపడింది. మాటల్లో తెలిసింది. సమీరకి మూడోనెలట. పద్మ ఆమెని అడుగుకింద పెట్టనివ్వట్లేదు. నీలిమకి గుండెలనిండా అసహనం పేరుకుపోతోంది. డాక్టర్ని కలుస్తున్నారు. మాధవ్‍లో ఎలాంటి లోపం లేదని కచ్చితంగా చెప్పాడు. స్పెర్మ్ కౌంటు, మొబిలైజేషన్ అన్నీ బాగానే వున్నాయట. అంటే తనలోనే లోపం వున్నట్టా? అనేది నీలిమ ప్రశ్న. కాదట. మరెందుకు పుట్టట్లేదు పిల్లలు? ఇంకో డాక్టర్ని కలిస్తే? అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడితే? ఎవరు చేస్తారు ఆ పని? తండ్రి పట్టించుకోవడంలేదు. తల్లికూడా ఏమీ మాట్లాడదు. మాధవ్ చేస్తాడా? వేలూ లక్షల్లో ఖర్చుపెడతారా వాళ్ళు? లేక వదిలిపెట్టేస్తారా తనని? విడాకులిచ్చి ఇంకో పెళ్ళి చేసుకుంటాడా మాధవ్? అతని ప్రేమంతా కలిపితే ఇంతేనా? ఈ కుటుంబంలో వున్నట్టు తనింట్లో ప్రేమ ఎందుకు లేదు? బరువు దింపుకుని వదిలించుకున్నట్టు వదిలించుకున్నారు తమని. డబ్బులేకనా? గీత యింట్లోనూ డబ్బులేదట. కానీ ఆమెని ప్రాణంలా చూసుకుంటాడు ఆమె తండ్రి. ఎవరికివాళ్ళే ఆమెని ఇష్టపడతారు. తమింట్లో అలా వుండదు. అందరికీ తమ కుటుంబమంటే చిన్నచూపే. తండ్రివైపు, తల్లివైపు అందరితోనూ తండ్రి గొడవపడతాడు. వాళ్ళు గౌరవించరు. గీత కుటుంబం అలా, తన కుటుంబం ఇలా ఎందుకున్నాయి?
ఆమె ఆలోచనలు దారీతెన్నూ లేకుండా సాగుతుంటాయి. ఏమీ చెయ్యకుండా అలా మంచంమీద పడుకుని ఆలోచిస్తూ వుంటుంది. ఒక్కోసారి ఏడుస్తుంది. చచ్చిపోవాలనే ఆలోచనకూడా కలుగుతోంది. గీతని చూసి చిర్రుబుర్రుమంటోంది. ఆమె వాసు వెంటవెంట తిరగడాన్నికూడా ఓర్చలేకపోతోంది. కొత్తగా పెళ్ళైనవాళ్ళలా అలా కొంగుకి కట్టుకుని తిరగడమేమిటి? ఎవరేనా మయూని ముద్దుచేసినా విహీని ఎత్తుకున్నా భగ్గుమనిపోతోంది. తనకి చెందాల్సినదేదో లాక్కుని గీతకి ఇచ్చేసినట్టు అందరిమీదా అక్కసుగా వుంది.
లక్ష్మి గమనిస్తోంది.
“గీతూ! నీలిమ చాలా బాధపడుతోంది. ఎందుకిలా జరిగిందో తెలీడంలేదు. మందులదారి మందులదే ఔతోంది, ఫలితం కనిపించట్లేదు. అది ఒకమాట అన్నా ఓర్చుకోమ్మా! మాట పెంచకుండా పక్కకి తప్పుకుని వెళ్ళిపో. నేను తర్వాత మందలిస్తాను. గొడవలు పెట్టుకోకండి” అని గీతకి చెప్పింది. రుక్మిణమ్మ వుందక్కడ. వల్లి పెళ్ళి విశేషాలు అడగాలని వచ్చింది.
“దీనికి చెప్తావేమే? మనకి కష్టం వచ్చిందని ఎదుటివాళ్లని అంటే వాళ్ళెందుకు వూరుకుంటారు? నోరు అదుపులో వుంచుకొమ్మని చిన్నదానికే చెప్పు” అంది కోపంగా.
“పోనీలే అత్తా! నా చెల్లెల్లాంటిదేకదా? ” అంది గీత నెమ్మదిగా.
“ఎంత అమాయకురాలివే గీతా, నువ్వు? అనేదాకా రానిచ్చుకోవద్దు. ఆ తర్వాత పరిస్థితి చెయ్యిదాటుతుంది. ఇవన్నీ అనుభవించినదాన్ని. అలుసిస్తే నెత్తికెక్కేవాళ్ళే అందరూను. కాలం కలిసిరాక తగ్గి వున్నట్టు కనిపిస్తారు. నీలిమ నువ్వనుకున్నంత అమాయకురాలేం కాదు” అంది రుక్మిణమ్మ. గీత నవ్వి వూరుకుంది. తెలీదా, తనకి ఆ విషయం?
“నాగదోషం వుందేమో ఒకసారి చూపించుకుని శాంతి చేయించుకోండి మాధవ్! పూజారిగారితో మాట్లాడి, ఏర్పాట్లు చూడమంటే చూస్తాను. మామయ్య అలా కావడంతో అత్త పూజలన్నీ వదిలేసింది. అందుకే నేను చెప్తున్నాను. మానసకూడా మళ్ళీ తల్లి అవబోతోంది. సుమతి దగ్గర్నుంచీ వల్లిదాకా అందరూ వరసగా వున్నారు. ఎవరేనా తల్లి కాబోతున్నారన్న వార్త వినగానే నీలిమ డిస్టర్బౌతోంది. విహీఅప్పుడే గమనించాను. ఏదేనా వ్యాపకం వుంటే డైవర్టౌతుంది. ఈ ఆలోచనలు తగ్గుతాయి. మయూ స్కూల్లో టెంపరరీ వేకెన్సీ వుంది. తనని తీసుకుని నువ్వెళ్ళి అడిగితే ఇస్తారు. తనకీ కాస్త మార్పుగా వుంటుంది” తర్వాత మాధవ్ ఒక్కడూ వున్నప్పుడు చెప్పింది. అతను తలూపాడు.
“వెయ్యికీ రెండువేలకీ చెయ్యడానికి నాకేం ఖర్మ? పెద్ద గెజెటెడాఫీసరు మీరు. మీకు చిన్నతనంగా వుండదూ? ఇలాంటి ఆలోచనలు వస్తాయేం? మయూ స్కూలంటే? మీ వదిన చెప్పిందా?” అని కడిగేసింది నీలిమ అతను అడిగితే.
“కాలక్షేపం ఔతుందికద నీలూ?” అన్నాడు.
“ఏం? నాకింక పిల్లలు పుట్టరని అందరూ కలిసి తీర్మానించేసారా?”
“ఎవరంటారే, అలాంటి మాటలు? పుట్టరని డాక్టర్లేం చెప్పలేదుకదా?”
“ఏమో!” అంది తిక్కగా. అతనింక తర్కించలేదు. ఏమైందని మళ్ళీ గీతా అడగలేదు. అది ఆమె మనస్తత్వం. నాగదోషం విషయం పక్కని పడింది. అతనికి పెద్దగా ఆ విషయాలు తెలివు.
కృష్ణకి జ్వరం వచ్చింది. ఇంక వెళ్ళి అక్కడ వుండాల్సిన సమయం వచ్చిందని రామారావుకీ యశోదకీ అర్థమైంది. విజ్జెమ్మని శేఖర్ యింట్లో వదిలిపెట్టి భార్యాభర్తలు కృష్ణ దగ్గిరకి వెళ్ళారు. ఇంటితాళాలు గీతకి అప్పజెప్పారు, మధ్యలో వెళ్ళి ఇల్లు చూసుకుని, తుడిపించమని. ఆమెకి మరింత దిగులేసింది. రోజులు మరింత ముందుకు సాగాయి.
అందరిళ్ళూ కొత్త అతిథులకోసం ఆయత్తమౌతున్నాయి. లత, రమ, వల్లి, రవళి శుభవార్తలు పంచుకున్నారు. మహతి యింట్లో గొడవలు మొదలయ్యాయి. డాక్టరుకి చూపించడానికి తీసుకొచ్చారు నిర్మలా, నారాయణా. వాళ్ళకి వున్న అక్కర తన తల్లిదండ్రులకి లేనందుకు బాధపడింది నీలిమ. ఒకరోజంతా ఏడ్చింది. వల్లికి ఐదునెలలదాకా బెడ్‍రెస్టు చెప్పింది డాక్టరు. మంచిరోజు చూసుకుని తీసుకొచ్చింది అరుణ. ఎప్పుడూ తనతో గొడవపడుతూ, రోజూ గంటేనా అద్దంముందు కూర్చుని రకరకాల అలంకారాలు చేసుకుంటూ, స్నేహితులని వెంటేసుకుని తిరిగే చెల్లెలు అలా మంచం దిగకుండా వుండటం చూసి తల్లడిల్లిపోయాడు ప్రహ్లాద్. అతన్ని అలా చూసి వళ్ళుమండుతోంది మాధురికి. ఇతనికేనా చెల్లెలున్నది? ఏ ఆడపిల్లేనా ప్రాణాలకి తెగించే కంటుంది. తనూ పిల్లని కన్నది. వల్లిది కాస్త సమస్యకావచ్చు. అప్పుడు లేని ముద్దూ, కలవరం ఇప్పుడెందుకొచ్చింది? అత్తగారు చూసుకోదా? అని చిరచిర్లాడుతుంది.
“ఏమీ అవదురా! ఈ రెండుమూడునెలలూ జాగ్రత్తగా వుంటే చక్కటి పాపాయిని ఎత్తుకుంటుంది” అంది అరుణ, మనసులో కాస్త భయంగా వున్నా, పైకిమాత్రం నవ్వుతూ. తల్లిని దగ్గిరకి పిలుచుకుంది. నిర్మల యింటికీ, యీ యింటికీ మధ్య తిరుగుతోందావిడ. రవళినికూడా చూసి వచ్చింది. రవళికి అత్తమామల తోడుంది. తొమ్మిదోనెల వచ్చేదాకా చేసి, అప్పుడు లీవు పెట్టి వస్తానంది ఆమె. శ్రీమంతంకూడా అప్పుడేననుకున్నారు. తొమ్మిదోనెల్లో శ్రీమంతం చేసుకోవడం వాళ్ళ సాంప్రదాయమట. గీత వచ్చి ప్రవల్లికని చూసి వెళ్ళింది. కేసెట్లూ, పుస్తకాలూ కావాలంటే తెచ్చి యిచ్చింది. మహతిని రెండుమూడురోజులకోసారి కలుస్తోంది. నీలిమ ఇలాంటి పలకరింపులకి దూరంగా వుంటుంది. ఏదేనా తేడా వస్తే తనని తప్పుపడతారేమోనని భయం. ఈ భయాలన్నీ ఆమే సృష్టించుకుని పోగుచేసుకుంటోంది.
“సీమంతం చేసుకుని సూడిదలిచ్చి మానసని మీరు తీసుకెళ్ళండి, మా సమీరని మేం తీసుకొచ్చుకుంటాం” అంది పద్మ కుటుంబరావు దంపతులతో. అదే అవకాశంకోసం చూస్తున్న ఆయన, “అదేమిటి? రెండోపురుడు అత్తగారింట్లోకదా, జరగాల్సింది?” అన్నాడు.
“ఎవరు చెప్పారు?” అడిగింది పద్మ. కమలాక్షి ఆమె గొంతులోని తీవ్రతకి కొంచెం జంకింది. ఆయనేం తగ్గలేదు.
“అది ఆనవాయితీ అని మీ అన్నయ్యగారమ్మాయికి మీ అక్కగారింట్లోనే పోసారుకదా?” అన్నాడు వాదనకి దిగుతూ.
“అది మా అక్కయ్యిల్లు, ఆ పిల్ల ఆవిడ కోడలు. పైగా మేనకోడలు. మాకు మా అన్నయ్యతో ఎన్నో వుంటాయి. గీతతో మీ పిల్లలకి పోలికేంటి? ఇది నా యిల్లు. నా పద్ధతులు నడుస్తాయి. మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి, మా పిల్ల మాయింటికొస్తుంది. అంతగా మీరు తీసుకెళ్ళద్దనుకుంటే మా వసంత్ ఇంట్లో వుండి కానిచ్చుకుని వెళ్ళండి. ఏం చేస్తాం? ఇంకో దండగమారి ఖర్చనుకుంటాం” అంది స్పష్టంగా. గొడవ పెద్దదౌతుందని భయపడింది కమలాక్షి. భర్తకి సర్దిచెప్పి, ఆయన్ని అక్కడినుంచీ తీసుకెళ్ళిపోయింది. వసంత్ ఇంట్లో వాళ్ళ మకాం. తనకేదో పెద్ద ద్రోహం జరిగిపోయినట్టు రుసరుసలాడాడాయన.
“మాట నిలకడలేని మనుషులు. రెండోపురుడు అత్తారింట్లో పొయ్యడం సాంప్రదాయం అని చెప్పినప్పుడు దాన్ని పాటించాలా, వద్దా? ఆ రామారావుకి ఖర్చుతప్పించాలని చూసింది నీలిమ అత్త. మరి నేనలాంటివాడిని కాదా? పైగా నాకు ముగ్గురు. ఒకళ్ళూ ఇద్దరూ కూడా కాదు” అన్నాడు.
“వాళ్లలో వాళ్ళు ఎలాగేనా సర్దుబాటు చేసుకుంటారు. మనకెందుకు చేస్తారు?” అంది కమలాక్షి విసుగ్గా.
“అదేమరి! నేను పైవాడినైనట్టే నా కూతుళ్ళూ పైవాళ్ళే ఔతారు. మన జాగ్రత్తలో మనం వుండాలనేది” అన్నాడు. ఆయన మాటలని ఎటేనా తిప్పగలడు.
ఇలాంటివి కూతుళ్ళతోనే మాట్లాడతాడు. అల్లుళ్ళదగ్గిర మళ్ళీ బైటపడడు. కూతుళ్ళే భర్తలని అదుపులో వుంచుకుని, అన్నీ సాధించుకోవాలని కోరిక. పైకి చెప్పని ఇంకో కోరికకూడా వుంది. తన సౌకర్యాలుకూడా వాళ్ళు చూడాలని. అల్లుళ్ళందరూ మంచి పొజిషన్స్‌లో వున్నారుకాబట్టి, వాళ్ళకి తెలీకుండా పదో పరకో తనకి పంపాలని. తనకిమాత్రం సరదాలుండవా? అల్లుళ్ళు వాళ్ళవాళ్లకి చేసుకుంటుంటే కూతుళ్ళు తమకి చెయ్యద్దా, ఆడపిల్లల్ని కన్నంతమాత్రాన అన్నిటికీ తగ్గివుండాలా అని ప్రశ్నించుకుంటాడు. గవర్నమెంటు వుద్యోగాలు చేసే అల్లుళ్ళిద్దరూ పైపైస ఒక్కటికూడా ముట్టరు. కడిగి నెల తిరిగితే వచ్చేది జీతంరాళ్ళేతప్ప మరో ఆదాయంలేదు. పెద్దల్లుడు ప్రహ్లాద్, కంపెనీల అకౌంట్లు మేనిప్యులేట్ చెయ్యడం ఇష్టంలేక ప్రాక్టీసు మానేస్తానంటున్నాడు. ముగ్గురికి ముగ్గురూ తలుచుకుంటే ఎంతేనా సంపాదించుకోవచ్చు. ఆ పని చెయ్యరు. వీళ్ళకి వాసు మాట వేదంట. ఆ విషయమూ బైటికి వచ్చింది. మానస మామ పడే అసంతృప్తిలో బైటపడింది. ఒకందుకు ఆయనా, ఇంకొకందుకు తనూ వాసుని ఈ ముగ్గురికీ దూరం చెయ్యాలనుకుంటున్నారు.
తండ్రి చేస్తున్న గొడవ చూసి, మానసకి మనసు చివుక్కుమనిపించింది. ఏమిటీయన? ఇలా ప్రవర్తిస్తే అత్తారిళ్లలో ఆడపిల్లలని మాటలంటారనికూడా అర్థం చేసుకోడా? కట్నకానుకలివ్వలేదు. పెళ్ళిళ్ళు తూతూమంత్రంగా అయిందనిపించారు. మాధురికీ తనకే పిల్లలు. ఇంకా నీలిమకి లేనే లేరు. మూడు పురుళ్లకే ఇంత హంగామా చేస్తాడు! అక్కడికీ వసంత్ పుష్కలంగా డబ్బిచ్చే పంపిస్తాడు, పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా. వాళ్ళకి పంపేది తగ్గిందని అతని తండ్రి మాటలంటాడు. తనుకూడా ప్రైవేటుస్కూల్లో చెయ్యడం మొదలెట్టింది, చేతిఖర్చులకేనా వుంటాయని.
“నువ్వు హాస్పిటల్లో చేరితే ఇంటికీ హాస్పిటలుకీ ఎవరు తిరుగుతారు మానసా? పాపకూడా వుంది. డెలివరీ అంటే ముగ్గురు నలుగురు పెద్దవాళ్ళుండి చూసుకుంటారు మాయిళ్ళలో. మేం మగపిల్లలం అందరం అందుబాటులో వుంటాం. మీయింటికంటే ఎవరొస్తారు? లక్ష్మి ఆమ్మావాళ్ళింట్లో వుండండి. డెలివరీ అయాక మీ యింటికో, ఇక్కడికో రావచ్చు. మాట్లాడనా ఆమ్మతో?” అడిగాడు వసంత్. వాళ్ళుండేది ప్రాజెక్టు సైట్లో. క్వార్టర్స్‌లో. పెద్దగా వైద్యసదుపాయాలు వుండవు.
“వద్దండీ! అక్కనీ బావగారినీ అలాంటి మాటలని, మళ్ళీ మన అవసరానికి వాళ్ళింటికే ఎలా వెళ్తాం?” అంది మానస.
“దాన్నీ దీన్నీ ముడిపెట్టే మనుషులు కాదు వాళ్ళిద్దరూ” అన్నాడతను.
“ఎవరింట్లోనూ వద్దు. మా యింటికే వెళ్తాను. ఎలా చూసుకోవాలి, ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం. ఇప్పటికి ఒకసారి అయిందికదా?” అంది. డెలివరీకి ఒకళ్ళింటికి వెళ్లడం మానసకి పెద్దయిష్టంగా అనిపించలేదు. అలాంటివి వాళ్ళకి తెలీదు. అలా అందరితోనూ పనులు కానిచ్చుకోవాలనుకుంటేమాత్రం, అందరితోనూ మర్యాదగా, మన్ననగా వుండాలని గ్రహించింది.
“నీలిమని రమ్మంటాను. తప్పదుమరి!” అంది కమలాక్షి.
“అది బాధపడుతోందమ్మా! మొన్న వల్లి పెళ్ళిలోనే చాలా నిరుత్సాహంగా కనిపించింది. బలవంతంగా తిరిగింది” అంది మానస.
“పోనీ మాధురిని రమ్మందాం” అన్నాడు కుటుంబరావు.
“వల్లికి అలా వుంటే ఆవిడెలా వస్తుందండీ?” విసుక్కున్నాడు వసంత్. మామగారిని చూస్తుంటే ఈమధ్య చిరాగ్గా అనిపిస్తోంది. సమస్యలు సృష్టించడంతప్ప పరిష్కరించడం రాదు. తన తండ్రి వెనక నిలబడి గీతావాసులమీద ఎగేస్తున్నాడనికూడా చూచాయగా తెలుస్తోంది.
“ఇంకోమాటు ఆలోచించు మానసా! లక్ష్మి ఆమ్మావాళ్ళింట్లోనైతే ఆమ్మేకాక నీలిమ, గీత తోడుంటారు. ఇలాంటి అవసరాలు మా యిళ్ళలో ఇలానే జరుపుకుంటాం. ఇహ కాదనుకుంటే నీలిమని రమ్మని అడగండి” అనేసి వెళ్ళిపోయాడు వసంత్.
అతనూ వెళ్లగానే మొదలుపెట్టాడు కుటుంబరావు.
“ఏమీ ఆ ముసలమ్మ వుందికదా, ఆవిడ్ని పంపకూడదూ? ఎక్కడ ఏది వున్నా తయారైపోతుంది, మనతో రావడానికేం? మర్యాదలు అందుకోవడానికి వస్తుందీ? మనవడి భార్యేనా మానస, పైపిల్లా? ఒక్కొక్క పురిటికి పదేసిమంది చేరిపోయి దిమ్మచెక్కల్లా కూర్చుని తింటారు. ఎవరో ఒకరు మనతో రావడానికేం? అసలా గీతని అనాలి. ఆమె ఎంత చెప్తే అంత మొగుడికి. ఆ యింటిగురించి అతనికేమీ పట్టింపు లేదు. తనే దయ్యంలా ఆ యిల్లు పట్టుకుని కూర్చుంది. ఆ పిల్ల వుండటంచేతేకదూ, ఇది వాళ్ళింటికి వెళ్లడానికి ఇబ్బందిపడుతోంది? అదే నీలిమ యిల్లనుకుంటే స్వతంత్రంగా వుండేది” అన్నాడు.
“మనకి అవసరాలున్నాయనీ, ఆస్తుల్లేవనీ ఎవరూ వాళ్ళకున్నవి వదిలేసుకుని పోరు నాన్నా! అసలు విషయం వదిలేసి ఐమూలగోల పట్టుకుంటారేంటి? పెళ్ళై నాలుగేళ్ళు కావస్తున్నా నీలిమకి ఇంకా పిల్లల్లేరు. ఈ విషయమై వాళ్ళింట్లో గొడవలు పడుతున్నారేమో, దీన్నేమైనా అంటున్నారేమో, పైకి చెప్పుకోలేకపోతోందేమో ఆలోచించండి. అంతేగానీ తోచిందల్లా మాట్లాడితే ఎవరూ వూరుకోరు. అనేవేవో అనేసి మీరిద్దరూ బానే వెళ్ళిపోతారు. తర్వాత ఆ అన్నవాటికి జవాబులు చెప్పుకోవలసింది మేము. వాసుబావతో అలా అన్నందుకు వసంత్ వాళ్ళ నాన్నతో చాలా గొడవపడ్డాడు. గీతమీద ఈగకూడా వాలనివ్వరు వీళ్ళెవరూను. వసంత్ వాళ్ళమ్మ దగ్గిర ఇప్పుడీ అన్నమాటలే అని చూడండి, జీడిపోస్తుంది. లోలోపలి గొడవలు ఎన్నున్నా, వాళ్ళూవాళ్ళూ ఒకటి. మన స్థానం మనం తెల్సుకుని వుండటం మంచిది” అంది మానస. ఇద్దరికీ మాటల్లేవని తెలిసి మాధురి ఒక సందర్భంలో గీతగురించి సుమతిదగ్గిర ఏదో చులకనగా అనబోయింది. “గీతా? ఇద్దరు పిల్లలన్నమాటేగానీ దానికి పెద్దగా ఏమీ తెలీదు. వాసు, పెద్దవాళ్ళు వెనకుండి చూసుకుంటారు. నీకేదైనా సమస్య వుంటే లక్ష్మిపిన్నితోనో అరుణపిన్నితోనో చెప్పు” అంటూ ఘాటుగా పెట్టింది సుమతి.
“అంత గొడవపడటానికేం వుంది? వాళ్లనేం ఇల్లొదిలేసి వెళ్ళి ఏ రోడ్డుమీదో వుండమనలేదు. ఇంటిస్థలం వుంది, అందులో కట్టుకుని వుండమన్నారు. అందరూ ఒక్కచోట పడి కొట్టుకునేకంటే ఎవరిళ్ళు వాళ్ళు కట్టుకుని వెళ్తే తప్పేంటి?”
“మీరెవరు, వాళ్ళకి చెప్పడానికి?”
“నేనెవర్నా? మర్చిపోయావేంటి పెళ్లవగానే?” అరిచాడు. “మూడిళ్ళకి వియ్యంకుడిని. పడీపడీ చేసుకున్నారు మిమ్మల్ని. పెద్దాయనకి ఇప్పటికి సరైన వుద్యోగం, సంపాదనా లేవు. కట్నం వద్దన్నాడని మురిసిముక్కలైపోయి ఇచ్చాం. అప్పుడే వాళ్ళ యింటిగురించి ఏదోఒకటి అనుకుని వప్పందం చేసుకుందామంటే అంతా కలిసి నా నోరు మూయించి పెళ్ళిజరిపించారు. రెండోఆయనకి స్వంతానికి యిల్లు లేదు. పిల్లలకోసం తెగ యిదైపోతున్నారు. దేనికే, పిల్లలు? కడిగి ఆ జీతంరాళ్ళతో ఏం పెడతాడట వాళ్ళకి? ఎలా పెంచి పెద్దచేస్తాడట? మీ ఆయనేనా అంతే. ఏమున్నాయే, మీ ముగ్గురికీను? ఆ గీతని చూడండి. అప్పుడే ఇద్దరు పిల్లలకీ చెరో ఆస్తీ సంపాదించేసింది. పైగా మగపిల్లలు. రెండుచేతులా సంపాదించి మూటలు కడుతున్నారు, మూటలు. మీకేమైనా అర్థమౌతోందా?” అన్నాడు.
“ఎవరికి వుండేవి వాళ్లకి వుంటాయి నాన్నా! ఎవరి అదృష్టాలు వాళ్ళవి” విసుగ్గా అంది మానస.
“ఊళ్ళోవాళ్లందర్నీ చేరదీసి చదువులు చెప్పిస్తున్నారు. ఇంట్లో స్వంతతమ్ముడిమీద లేని దయ వూళ్ళోవాళ్లమీద కారిపోతోంది. ఉన్నదంతా వాళ్ళే మింగెయ్యాలనుకోకూడదు. ఆ యిల్లు వదులుకుంటే వాళ్ళకేమైనా తరిగిపోతుందా? ఐనాగానీ మానసా, మీకెవరికీ నాగురించీ అమ్మగురించీ లేదేమిటే? ఇప్పుడంటేసరే, తింటున్నాం, తిరుగుతున్నాం. రేపు ముసలితనాలొస్తాయి, ఎక్కడ వుంటారు, ఎలా బతుకుతారని ఆలోచించద్దా? వాళ్ళిల్లేమైనా మనం లాక్కుంటున్నామా? అదేమైనా నాకు దఖలౌతుందా? పాతకొంపేకదా? కూలగొట్టి పదో పదిహేనో ఫ్లాట్లు కడితే, మీ ముగ్గురూ ఒకచోటికి చేరితే మా నెత్తిన ఓ కప్పు వుంటుందనికదా, తాపత్రయం? ఆ వాసుకీ ఏడ్చుకోనక్కర్లేకుండా ఒకటో రెండో వాటాలు ముడతాయికదా? ఇందులో ఎవ్వరికీ నష్టం వుండదనే మీ మామా మొత్తుకుంటున్నాడు”
“వాళ్ల విషయాల్లో దూరితే వాళ్ళెందుకు వూరుకుంటారు? మాధురిని బావ అననే అన్నాట్ట, గీతకి అదుందీ, ఇదుందీ అని ఏడవడంకాదు, నువ్వూ మీ నాన్ననడిగి తెచ్చుకో, వుద్యోగం తెచ్చుకుని చూపించు- అని”
“అన్నాడూ? నలుగుర్లో పెట్టి కడిగేస్తాను. పెళ్లప్పుడు కట్నాలూ కానుకలూ అక్కర్లేదని ఇప్పుడు యిళ్ళూ స్థలాలూ కావాలంటే వూరుకుంటారా? ఇచ్చే స్తోమతే వుంటే ఇలాంటి తలకిమాసిన సంబంధాలకి ఎందుకు వెళ్తాను?”
మానసకి తండ్రితో ఇంకా మాట్లాడాలంటే చీదరగా అనిపించింది.
“ఏం మాట్లాడతారమ్మా, యీయన?” తల్లితో అని, “స్తోమత లేకే ఈ సంబంధాలకి వచ్చానని వప్పుకున్నారుకదా? అది మీకు గుర్తుంటే చాలు. మా ముగ్గుర్లో ఎవ్వరం మాకేదో తక్కువైందని అనుకోవట్లేదు. ఇక మీరూ అమ్మా అంటారా, మా బతుకులు మమ్మల్ని బతకనిచ్చి, మీ మర్యాదమీరు నిలబెట్టుకుంటేనేకదా, ఏదేనా చెయ్యగలిగేది?” అంది విసురుగా. అంతకంటే విసురుగా బైటికి వెళ్ళిపోయాడు కుటుంబరావు.
చెప్పలేనంత దు:ఖం వచ్చింది ఆమెకి. నిస్సహాయత. రెండుచేతుల్లో ముఖం దాచుకుని డైనింగ్‍టేబుల్‍ముందు కూలబడింది.
ఆడపిల్లలకి పెళ్ళిచేసాక అత్తవారింట్లో నిలదొక్కుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఇస్తునే వుండాలి. అందులో విఫలమైతే వూతం ఇవ్వాలి. భర్త ఒక్కడూ మంచివాడైనంతమాత్రాన సరిపోదు. తనమూలంగా వసంత్ తల్లిదండ్రులతో ఎంత పోరాడుతున్నాడు! ఐనా అతను తనని ఒక్కమాటకూడా అనడు. అమ్మావాళ్ళకీ ఎదురుచెప్పకు, నేనున్నానుగా అనేగానీ, నీవల్లే ఇదంతా అని ఎప్పుడూ అనలేదు. అంత మంచిమనిషి! గీతన్నా, వాసన్నా అతనికి చాలా యిష్టం. బాల్యస్నేహితులు. అప్పటెప్పటివో విషయాలు చెప్పి నవ్విస్తాడు. చిన్నప్పుడంతా వాసు, సుధీర్ ఈ పిల్లలగుంపుని మైండ్ చేసేవాళ్ళట. తను వాసుతో చాలాసార్లు మాట్లాడింది. సరదాగా వుంటాడు. అభిమానంగా మాట్లాడతాడు. గీతకూడా అంతే. సుమతి అందనేకాదు, ఆమెకి భేషజం తెలీదు. సమీర అత్తవారింటినుంచీ రాగానే బేగు ఇంట్లో విసిరేసి గీతా అంటూ వెళ్ళిపోతుంది. తనూ వెళ్ళింది సమీర వెంట ఒకటిరెండుసార్లు. సమీరకే కాదు, పల్లవిదాకా పిల్లలందరికీ ఆమె పెద్ద ఆకర్షణ. ఎన్నో విషయాలు చెప్తుంది. అన్నీ అతిసూక్ష్మంగా అడిగి తెలుసుకుంటుంది. ఆమెని చూసాకేకదూ, వసంత్‍తో అరమరికలు చెరుపుకున్నది తను? ఇద్దరు మనుషులు ఒకరికి ఒకరు కొనసాగింపులా, ఒకే రేఖలో ఇమిడిపోయి వుండటాన్ని నేర్చుకున్నది?
తనకి ఆమెతో కలవాలనే వుంటుంది. వసంత్‍కూడా అదే చెప్తాడు. మాధురికీ, నీలిమకీ యిష్టం వుండదని ఆగిపోతుంది. వల్లి పెళ్ళిలో మాధురి ఆమెని ఏదో అంది. ఆమె చిన్నబుచ్చుకుని స్టేజిమీంచీ దిగిపోయింది. వెళ్ళి ఆడియెన్స్‌లో కూర్చుంది. ఆమె వెళ్ళగానే ఒక్కొక్కరుగా మిగిలినవాళ్ళంతా వెళ్ళిపోయారు. స్టేజంతా ఖాళీ. అంత కట్టు వుంది వాళ్లలో.
“స్టేజిమీది ఫోటోల్లోనూ వీడియోలోనూ మీరెవరూ లేకపోవడమేమిటే?” అని పీటలమీంచీ లేచాక వల్లి గొడవచేసింది. ఎంత బుజ్జగించిందో, గీత! ఆ తర్వాత ఎన్ని ఫోటోలు తీసుకున్నారో వాళ్ళంతా కలిసి. అలాంటి ప్రేమ, అనునయం తనెప్పుడూ చూడలేదు. వాళ్లందరిమధ్యా వున్నదీ, తనకి లేనిదీ ప్రేమ. తండ్రి, మామగారు తగ్గేలా లేరు. ఏం జరుగుతుందో! ఎవరు దెబ్బతింటారో!
“మానసా! ఏడవకు. ఊరుకో. ఇలాంటప్పుడు ఏడవకూడదు. మీ నాన్నగురించి తెలిసిందేకదా? నిజంగా అదృష్టవంతులంకాబట్టే ఇంతంత మంచి సంబంధాలు దొరికాయి. అది గుర్తించి కాస్త తగ్గివుంటే మంచిది. ఎవరు చెప్పాలి ఈ మనిషికి? మీ పెళ్ళిళ్లయేదాకా వాళ్లవాళ్ళతోటీ మావాళ్ళతోటీ దెబ్బలాడారు. ఈరోజున ఎవరేనా విలువిస్తున్నారూ? లేదు. ఇప్పుడూ అంతే జరుగుతుంది. ఎవరు ఎలా బుద్ధిచెప్పాలో వాళ్ళే అలా చెప్తారు. ముందు ఈ సమస్యలోంచీ ఎలా బైటపడాలో ఆలోచిద్దాం” అని బుజ్జగించింది కమలాక్షి కూతుర్ని.
“వాళ్ళింట్లో వద్దమ్మా! ఇంతంత ద్వేషం మనసుల్లో పెట్టుకుని, పైకి ప్రేమ ఎలా నటించగలం? అలా నటిస్తే వాళ్ళకి తెలీదా? నీలిమకే నచ్చజెప్పి తీసుకురా! మనింటికి వెళ్దాం. ఆ ఒక్కరోజూ కాస్త హడావిడౌతుంది. డెలివరీ అయ్యి, ఇంటికి వచ్చామంటే ఇంకే సమస్యా వుండదు. నా ఖర్చులు నేను పెట్టుకుంటాను. మీరేమీ పెట్టక్కర్లేదు” అంది మానస. ఆవిడ నిట్టూర్చింది.
ఆ మర్నాడు లక్ష్మి యింటికి బయల్దేరారు భార్యాభర్తలు. వీళ్ళు వెళ్ళేసరికి గీత ఆఫీసుకి బయల్దేరుతోంది. వాసు సందు మొదట్లో బైకు ఆపుకుని వున్నాడు. విహీ తల్లిని వదలకుండా ఏడుస్తున్నాడు.
“కొత్తకొత్త విద్యలు చాలా వస్తున్నాయి వీడికి” అని లక్ష్మి నవ్వుతోంది. గీతా నవ్వుతోంది. నిష్కల్మషమైన ఆ నవ్వులు కమలాక్షికి గుండెల్లో ఎక్కడో గుచ్చుకున్నాయి. అలా ఇద్దరు మనుషులు మనసారా నవ్వుకోవడానికి ఎంత పెట్టిపుట్టాలనిపించింది. నెమ్మదిగా మరిపించి పక్కకి తీసుకెళ్ళింది లక్ష్మి. గీత వెళ్ళిపోయింది.
“రోజూ వీడితో ఇదో గొడవ. చెప్పులు బైట పడేసుకుని, పెరట్లోంచీ వెళ్తుంది. బండి చప్పుడు గుర్తుపట్టేస్తాడని సందుచివర నిలబడతాడు వీళ్ళ నాన్న. ఐనా కనిపెట్టేస్తాడు. ఆఖరికి ఆఫీసుచీరకూడా పొద్దున్నే కట్టేసుకుని నలిగినా పర్వాలేదని అలానే వెళ్ళిపోతోందది. ఎవరు బైటికి వెళ్లినా వాళ్లతో వెళ్ళిపోతానంటాడు. ఒకళ్ళం డ్యూటీ వేసుకుని వీడిని పక్కకి తీసుకెళ్తూ వుండాలి.” అంది లక్ష్మి మనవడిని ముద్దుచేసి, వియ్యాలవారిని పలకరించి లోపలికి తీసుకెళ్తూ.
“పెద్దాడైపోయాడు” అంది కమలాక్షి పిల్లాడికోసం చేతులు చాపి. వాడు వెళ్లలేదు.
“కొత్తవాళ్ల దగ్గిరకి వెళ్ళట్లేదు” అంది లక్ష్మి. నీలిమ తల్లిగొంతు విని ఇవతలికి వచ్చింది. ఆమెకి అర్థమైంది, వాళ్ళెందుకు వచ్చారో! పాతాళంలోకి కృంగిపోయినట్టైంది. పైపై పలకరింపులు అయాయి. మాధవ్‍కూడా వచ్చి కూర్చున్నాడు.
“మానసని డెలివరీకి తీసుకెళ్తున్నాం. నీలిమని సాయంగా పంపిస్తారేమోనని అడగటానికి వచ్చాం” అంది కమలాక్షి.
“మీయింట్లోమాత్రం ఎవరున్నారు? నీలిమ అక్కడికి వచ్చేబదులు మానసనే ఇక్కడికి తీసుకురండి. ఇదేం పరాయిల్లు కాదుకదా? అందరం వుంటాం” అన్నాడు మాధవ్.
“వసంత్‍కూడా అదే అన్నాడు. కానీ మానసే రానంది. మీ అన్నయ్యా, వదినా వుంటారని సిగ్గుపడింది” అన్నాడు కుటుంబరావు. ఆంతకన్నా తన అయిష్టాన్ని ఎలా చెప్పాలో తెలీక.
“మా అన్నయ్యా వదినా మాయింట్లో వుండక ఎక్కడికి పోతారండీ? వాళ్ళుంటే తను సిగ్గుపడ్డమేమిటి?” మాధవ్‍కూడా విసుగుని దాచుకోలేదు. వసంత్‍లాగే.
“అయ్యో! ఈయనకి మాట్లాడ్డం సరిగ్గా రాదు. మీ అన్నయ్యకూడా తనకి బావగారుకదూ, అతనిముందు తిరగడానికి సిగ్గుపడింది” కంగారుగా సర్దిచెప్పింది కమలాక్షి.
“మీ యిష్టం. నీలిమ వస్తానంటే తీసుకెళ్ళండి. ఈమధ్య తనకీ వంట్లో అంత బాగుండట్లేదు. తరుచూ తలనొప్పని గొడవచేస్తోంది” అనేసి, ఆఫీసుకి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల రాక నీలిమకి ఏమాత్రం సంతోషాన్ని కలిగించలేదు. విహీ పుట్టినప్పుడు తను వూహించుకున్నట్టే అన్నీ జరగడం ఆమెకి తీవ్రమైన బాధని కలిగించింది. దానికన్నా ముఖ్యంగా తల్లితండ్రుల్లో ఇద్దరూ తన బాధని గుర్తించి ఎలాంటి సాంత్వనా ఇవ్వకపోవటం మరింత దు:ఖాన్ని కలిగించింది. వాళ్లతో ముభావంగానే వుంది. కమలాక్షి అర్థం చేసుకుంది. కుటుంబరావు పట్టించుకోలేదు.
ఆపూటకి భోజనాలవీ అయ్యాయి. విశ్రాంతికూడా తీసుకున్నారు. విహీ కాసేపు పడుక్కుని లేచి ఆటలు మొదలుపెట్టాడు. మాటలింకా రాలేదు. భావాలు తరుముకుని వస్తున్నాయి. పువ్వుని చూసినా, బొమ్మని చూసినా, కదిలే చీమని చూసినా ఏదో చెప్పాలనుకుని పెద్దపెద్ద కేకలు పెడుతున్నాడు.
“అబ్బ! వీడొకడు!” పైకి వినీవినిపించనట్టు విసుక్కుంది నీలిమ తల్లిదండ్రులతో తమగదిలో కూర్చుని వున్నప్పుడు. కమలాక్షి వింతగా చూసింది.
“ఇంక మయూ వున్నాడా? వాడితోపాటు మరో యిద్దరికి చదువుచెప్పిస్తున్నారు వీళ్ళు. మధ్యాహ్నం వాళ్ళ భోజనాలు ఇక్కడే. అదేమిటో! సాయంత్రం స్కూలయ్యీ ఇక్కడికే వస్తారు. వాడూ, ఫ్రెండ్సూ, ఆటలూ, అల్లరీతో’ విసుగెత్తిపోతోంది. ఈయనకేమో ఆఫీసులో ఎప్పటికీ తెమలదు. ఈగదిలో ఒక్కదాన్నీ మగ్గిపోతుంటాను. లేకపోతే టీవీముందు కూర్చోవాలి. ఎంతసేపని టీవీ చూస్తాను?” అంది.
“పిల్లలు కాకపోతే పెద్దాళ్ళు అల్లరిచేస్తారా, నీలూ? లేచి బైట తిరిగితే నిన్నొద్దన్నవాళ్లెవరు? ఏదో ఒక కాలక్షేపం చేసుకోవాలి. మానస దగ్గర్లో వున్న స్కూల్లో చేస్తోంది. నువ్వూ అలా ఏదేనా వుద్యోగంలో చేరు” అందావిడ. భర్త కాస్తంత అటోయిటో వెళ్తే కూతురితో చాలా మాట్లాడాలనుంది. వాళ్ళేం మాట్లాడుకుంటారో వినాలనే ఆయన కదలకుండా అక్కడే కూర్చున్నాడు. ఆడవాళ్లనుంచీ బలవంతంగా లాక్కోబడేదీ, దొంగిలించబడేది వాళ్ళ స్పేస్.
“ప్రైవేటుస్కూళ్ళలో వుద్యోగాలేం బావుంటాయమ్మా? గౌరవం వుండదు. నాకు నచ్చవు. ఇంకెక్కడికి వెళ్లను? ఎవరికి వాళ్లకే పిల్లలు, హడావిడి. మాధురి అత్తవారితో కలిసుంటుంది. వాళ్ళింటికి వెళ్తే ఫ్రీగా వుండదు. మానస దాని పిల్లతో అది ఎప్పుడూ బిజీ. ఈయన పొద్దున్న వెళ్తే రాత్రైతేగానీ రారు” అంది కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా.
“వంటా అదీ నువ్వే చెయ్యచ్చుకదే?” అడిగింది కమలాక్షి.
“ఆ< ఆవిడకి వేడివేడిగా వండి వడ్డిస్తాను!! నాకేం పట్టింది? పొద్దున్నసరే, వాళ్ళ వేళకి తినేసి వెళ్తారు. రాత్రేనా మాకోసం ఆగచ్చుకదా? ఏడయ్యేసరికి తినేసి కూర్చుంటారు. నేను ఈయనకోసం అలా ఎదురుచూస్తూ వుంటాను. విసుగొచ్చేస్తోందమ్మా!” అంది ఏడ్చేస్తూ.
లక్ష్మి మనవడిని ఎత్తుకుని వచ్చింది.
“రోజంతా అక్కగారికి మనవడి డ్యూటీయే అనుకుంటాను” అన్నాడు కుటుంబరావు కొంచెం వెటకారంగా. అతనికి హాస్యంలా అనిపించిందిగానీ, లక్ష్మికి బాగానే అర్థమైంది.
“అందుకు ఎంత పెట్టిపుట్టాలండీ!” అంది తొణక్కుండా. నీలిమ ముఖం వాడిపోయింది. లక్ష్మి గమనించింది.
“నీలిమా! నీకేం వయసు మించిపోలేదు. డాక్టరుకూడా పుడతారనే చెప్తోందికదా? చూద్దాం. రోజంతా గదిలో బంధించుకుని కూర్చుంటే బాధ తగ్గుతుందా? ఏదో ఒక కాలక్షేపం చేసుకోవాలి. మయూ, వాడి ఫ్రెండ్సూ స్కూల్నించీ వస్తారు. ముగ్గురికి ముగ్గురూ తెలివైన పిల్లలు. వాళ్లని చదివించి హోంవర్కు చేయించు. గీత, వాసు షటిల్ ఆడతారు. వాడు గ్రౌండుకి వెళ్తున్నాడు. దీనికి పిల్లల్తో కుదరక వెళ్ళట్లేదు. ఇంట్లో మీయిద్దరూ ఆడుకోవచ్చుకదమ్మా? కేరంబోర్డుంది. ఆడపిల్లలు ఆడుకుంటారని పెరటి అరుగునిండా అష్టాచెమ్మాదగ్గిర్నుంచీ ఎన్నో ఆటలు గీయించాం. రోజంతా మనింటికి ఎవరో ఒకళ్ళు వస్తునే వుంటారు. వాళ్లతో ఆడచ్చు, కబుర్లు చెప్పచ్చు. నువ్వు ఇవతలికే రావు. మాటలకి రావు, వంటలోకి రావు, పనిలో చెయ్యి వెయ్యవు. పనిమనిషుండి, ఇంకో ముగ్గురు మనుషులకి పనేం వుంటుందని నేనూ అడగట్లేదుగానీ, ఏమీ చెయ్యకపోతే రోజెలా గడుస్తుంది? గడవకనేకదా, ఈ అనారోగ్యాలు?” అంది నీలిమతో సూటిగా. ఈ విషయాలు చెప్పాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది లక్ష్మి. నీలిమ తలదించుకుంది. ఎత్తిచూపించినట్టు ఆవిడ అలా అనడం నచ్చలేదు ఆమెకి. లక్ష్మీ ఇంకేమీ అనలేదు. తల్లిదండ్రులముందు అనదల్చుకున్నది అనేస్తే వాళ్ళు మంచీచెడూ చెప్తారు. వాళ్ళు చెప్పి సరిదిద్దకపోయినా, వాళ్ళు చెప్పింది ఆమె వినకపోయినా మరోమాటు చెప్పడం అనేది దండగ. మొదట్నుంచీ ఆ కుటుంబంలో ఒక వొరవడి నడుస్తోంది. వాళ్ళదార్లోకి రాకుండా పక్కలకి తప్పుకుని నడిచేవాళ్లని వదిలేసి ముందుకి వెళ్ళడమే. అలాగని వాళ్లని పూర్తిగా వదిలిపెట్టరు. అందుకు వుదాహరణ లక్ష్మి భర్తే.
వియ్యపురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు. విహీని కింద దింపితే వాడు ఇల్లంతా చక్కబెట్టి వస్తుంటే లక్ష్మి వాడి వెంటవెళ్తూ, హాల్లోనూ, ఇంకోగదిలోనూ వాడిని గమనిస్తూ కూర్చుంటోంది. ఆవిడ వెంట కమలాక్షి హాల్లోకి వచ్చింది.
“ఏమంటుందే, యీవిడ? నీ బాధేమిటో తెలిదూ? తెలీనట్టు నటన కాకపోతే” అన్నాడు కుటుంబరావు కూతురితో. “నువ్వూ అలానే వుండు. ఇది నీ యిల్లు కానప్పుడు నువ్వెందుకు చెయ్యాలి? ఏమీ చెయ్యకు. శుభ్రంగా తిని కూర్చో. అంతే. వాళ్ళకే తెలిసి రావాలి”
నీలిమ తండ్రికి తలూపి హాల్లోకి వెళ్ళి తల్లిపక్కని కూర్చుంది. మయూఖ్, స్నేహితులు వచ్చారు. విహీ వాళ్ళమీదికి ఎగబడిపోయాడు. పెద్దపెద్ద కేకల్తో అన్నకి ఏదో చెప్పాలని వాడి ప్రయత్నం. మయూ వాడిని వళ్ళోకూర్చోబెట్టుకున్నాడు కొద్దిసేపు. మిగిలిన ఇద్దరు పిల్లలూ వాడిదగ్గిర చేరి ఆడారు.
“అరేయ్, తొందరగా తయారైపోయి హోంవర్కులవి చేసేసుకోండి. క్రికెట్టు ఆడుకుందాం. మళ్ళీ అరగంటలో వస్తాను” అని చెప్పేసి వెళ్ళాడు వీళ్ళని దింపిన అబ్బాయి. అప్పట్నుంచీ వాళ్ళ పరుగు. లక్ష్మి వాళ్లతో సమానంగా పరిగెట్టింది. బట్టలు మార్పించడం, టిఫెను, పాలు ఇవ్వడం, హోంవర్కు చేయించడం. క్రికెట్టు ఆశతో వాళ్ళే చకచక తయారైపోయారు. నీలిమ చేసీచెయ్యనట్టు పనిచేస్తూ అత్తగారి వెంట తిరిగింది.
“మామ్మగారూ! నేను రాసేసానండీ!” అన్నాడు వాళ్ళలో ఒకడు.
“మామ్మగారు! నేనూ రాసేశాను” అంటూ వచ్చాడు మయూ. లక్ష్మి విరగబడి నవ్వింది. “నువ్వలా అనక్కర్లేదురా! మనింట్లో పిల్లాడివేకదా?” అని. వాళ్ళు వెళ్తుంటే విహీ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు.
“ఒరేయ్, విహీ! నిన్ను నేను ఎత్తుకోలేనురా! నీకేమో నడవడం రాదు. కొంచెం పెద్దయ్యాక వద్దువుగాని” అని మయూ వాడిని వోదార్చాడు. లక్ష్మి ఏమార్చడానికి వాడిని పక్కకి తీసుకెళ్తే ముగ్గురూ వాళ్ళ ప్లాస్టిక్ బేట్లు తీసుకుని వెళ్ళిపోయారు.
ఒక భిన్నమైన ప్రపంచాన్ని చూస్తోంది కమలాక్షి ఇక్కడ. కాలం ఎక్కడా ఆగడంలేదు. ఒకవిధమైన వేగంతో పరుగెడుతోంది. విహీ బారసాలలో తనెదురుగానే అంది గీత, ఒక పిల్లాడికి చదువు చెప్పించాలనుకుంటున్నామని. ఇప్పుడు ఇద్దరు పిల్లలయారు. పిల్లలేమీ లేకీగా లేరు. కడిగిన ముత్యాల్లా వున్నారు. చురుగ్గా వున్నారు. పద్ధతిగా వున్నారు. బాగా చదువుతున్నారు. వీళ్ళూ యింటిపిల్లల్లా చూసుకుంటున్నారు. గీతతో ద్వేషంసరే, వీళ్ళనెందుకు ఇష్టపడలేకపోతోంది నీలిమ?
కాసేపటికి గీత, వాసు వచ్చారు. బైకు ఆగిన శబ్దానికి విహీ లోపలెక్కడ్నుంచో వచ్చేసాడు. మూడు చక్రాలబండి తోసుకుంటూనో, పడుతూ లేస్తూనో చాలా స్పీడుగా వచ్చేస్తాడు. వాసు వాడిని ఎత్తుకుంటే గీత లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని, ఇద్దరికీ టీ చేసుకుని, పళ్ళాల్లో కారప్పూస పోసుకుని వచ్చింది. అక్కడినుంచీ అరగంటసేపు కబుర్లు సాగాయి. వాసు బయటికి వెళ్ళిపోయాడు. మధ్యలో నీలిమ లేచి అక్కడినుంచీ వెళ్ళిపోయింది. తనుండాలో అక్కర్లేదో అర్థంకాలేదు కమలాక్షికి. ఆరయ్యేసరికి విహీని ఆటల్లో పెట్టి, తను స్నానం చేసి, తులసికోటలో సంధ్యదీపం పెట్టి, వంటలోకి వెళ్ళిపోయింది గీత. ఈమధ్యలో గోడమీంచీ రుక్మిణమ్మతో పలకరింపులుకూడా అయ్యాయి.
“నువ్వూ వెళ్ళి ఏదో ఒకటి చేయచ్చుకదమ్మా?” అంది గదిలోకి వచ్చి, పడుక్కుని వున్న నీలిమతో కమలాక్షి.
“ఆవిడ్ని వండుకోనీ. మనందరికీ మళ్ళీ ఏదేనా చేస్తాను. ఇప్పుడే చేస్తే చల్లారిపోతాయి” అందామె అనాసక్తిగా.
“ఆఫీసరు భార్య. దానికేం ఖర్మే, వంటనీ, పనులనీ పుణుక్కోవడానికి? వంటలక్కని పెట్టి చేయించుకోగలదు” అన్నాడు కుటుంబరావు. కమలాక్షి వంటింట్లోకి వెళ్ళేసరికి సగం వంటైపోయింది.
“నేనేమైనా చెయ్యనా, గీతా?” అభిమానపడుతూ అడిగింది. నవ్వి వూరుకుంది గీత.
“అత్తా! ఎలక్ట్రిక్ రైస్‍కుక్కరట. బియ్యం కడిగేసి అందులో పోసి, స్విచ్చి వేసేస్తే వుడుకుతుందట. తినేదాకా వేడిగా వుంటుందట. మనకీ కొనమన్నాను. బావ సరేనన్నాడు. రెండుంటే మంచిదేమో! ఒకదాంట్లో అన్నం, ఇంకోదాంట్లో పులుసో, పప్పుచారో వుడుకుతూ వుంటే బైట కూర చేసుకుంటే సరిపోతుంది” అంది వున్నట్టుండి లక్ష్మితో.
“రవిదగ్గిర ఉన్నట్టుంది. ముందొకటి కొనుక్కుంటే, దాని వాడకం చూసి ఇంకోటి కొనచ్చు” అందావిడ.
ఇంకేమీ మాటలు సాగలేదు. ఏడయ్యేసరికి పిల్లలు ముగ్గురికీ మళ్ళీ బట్టలు మార్పించి, కాళ్ళూ చేతులూ కడిగించి, భోజనాలు పెట్టేసి, వాళ్ళు తింటూ వుంటే హోంవర్కు చెక్ చేసి, తిళ్లవగానే ఎవరి పిల్లలనీ, వస్తువులనీ వాళ్లకి అప్పజెప్పి మయూతో లోపలికి వచ్చింది గీత. అప్పటికి వీహీ భోజనంకూడా ఐపోయింది. భర్తకి కంచంలో పెట్టి గదిలోకి ఇచ్చేసింది లక్ష్మి. వాసు రాగానే, కమలాక్షినీ, కుటుంబరావునీ అడిగింది గీత, “మీరూ తినేస్తారా?” అని.
“ఇప్పుడే భోజనాలేమిటమ్మా?” ఫెళ్ళుని నవ్వాడాయన. “పదకొండైతేగానీ మా ఆత్మారాముడు పలకడు” అన్నాడు.
“మరైతే నీలిమా! నువ్వు చూసుకో” అనేసి వెళ్ళిపోయింది.
“ఏమిటే, ఈ పిల్ల పరుగు? అక్కడికి తనొక్కర్తే వుద్యోగం చేస్తున్నట్టు?” అన్నాడాయన. మరోమాటు వియ్యపురాలిని అడిగింది లక్ష్మి. వాళ్ళు ఇప్పుడే తినమని చెప్పడంతో తన మామూలువేళకి వాసూ గీతలతో కలిసి తినేసింది. ముగ్గురూ వెళ్ళి హాల్లో కూర్చుని కబుర్లలో పడ్డారు. మాటలు, పరిహాసాలు, పిల్లల అల్లరి, కబుర్లతో హోరెత్తిపోతోంది యిల్లు. నీలిమ గదిలోనే వుంది. తనూ ఎందుకు వెళ్ళి కూర్చోదు? పనంటేసరే, తప్పించుకుంటోంది, అందరిమధ్యనీ కూర్చుని కబుర్లు చెప్పడానికేం? కబుర్లుచెప్పడానికికూడా ఎవరేనా బొట్టుపెట్టి పిలుస్తారా? మాధవ్ ఎప్పుడొస్తాడు? అతనికి ఇంతపనేంటి? అనిపించింది కమలాక్షికి.
మాధవ్ వచ్చాడు. అతని వెనకే అటెండరు వచ్చి, ఫైల్సు కట్ట తెచ్చి టేబుల్‍మీద పెట్టి వెళ్ళాడు.
“నీలూ! ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టవే. విహీకి అందితే చింపుతాడు” అన్నాడు. నీలిమ వచ్చి, అతనికి మంచినీళ్ళు ఇచ్చి, ఫైల్స్ కట్ట లోపలికి తీసుకెళ్ళింది.
వస్తూనే నేరుగా గదిలోకి వెళ్ళకుండా కొద్దిసేపు వీళ్ళతో కూర్చుంటాడు. అది నీలిమకి కోపం. అతనికి బాధ్యత పెరిగింది. ఉద్యోగం అతన్ని నెమ్మదిగా తనలోపలికి పీల్చేసుకుంటోంది. డబ్బు చేతులుమారేచోట పనులన్నీ తేలిగ్గా జరిగిపోతాయి. ఏదేనా తేడా వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుని సర్దుబాటు చేసుకుంటారు. ఇతనిది ప్రతీదీ జాగ్రత్తగా చూసుకోవలసిన పరిస్థితి. లేకపోతే ఎవరు ఎక్కడ ఇరికిస్తారోనని భయం. ఆ వత్తిడి అతనిమీద బాగా వుంది. కొద్దిసేపు ఇలా కూర్చుని మాట్లాడితే మనసు తేలికపడుతుంది అతనికి. ఒక్కోసారి రూల్‍పొజిషన్సవీకూడా చర్చించుకుంటారు.
“అతనికోసం గదిలో ఒక్కర్తివీ కూర్చుని ఎదురుచూడ్డంకన్నా, హాల్లోనే కూర్చుని రాగానే లోపలికి తీసుకురావచ్చుకదా?”’ అంది కమలాక్షి.
“పోమ్మా! నాకు విసుగు. ఐనా మొగుడూపెళ్ళాలు వాళ్ళ గదిలో కూర్చుని మాట్లాడుకోకుండా హాల్లో సోదేమిటి? మా అత్తగారేనా చెప్పదు” అంది నీలిమ.
వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ నలుగురూ భోజనాలు చేసారు. గిన్నెలు సర్ది, స్టవ్, వంటిల్లు కడిగి ముగ్గుపెట్టింది నీలిమ. ఆమె ఆ పనులు చేస్తున్నప్పుడు మామూలుగానైతే మాధవ్ అక్కడే కూర్చుని మాట్లాడతాడు. ఆమె సర్దుతుంటే తనో చెయ్యి వేస్తాడు. పనయ్యాక ఇద్దరూ కలిసి ఇవతలికి వస్తారు. గీతా, లక్ష్మీ ఆ టైం వాళ్ళకి వదిలేస్తారు. అదొక అరుదైన ఏకాంతసమయం. అతనికి నీలిమ తినిపించినా, అతను ఆమెని ముద్దుచేసినా. పిల్లలు పుడితే అలాంటివి యింక కుదరవు. అందుకే ఎవరూ వంటింటిచాయలకికూడా రారు. ఇప్పుడు అత్తగారు వుందని తినేసి వెళ్ళిపోయాడు మాధవ్.
“చూడు, సోది చెప్పుకుంటూ కూర్చున్నారుగానీ, గిరిగీసుకున్నట్టు ఇద్దర్లో ఒక్కరేనా లోపలికి వచ్చి దీనికి సాయం చేసారూ?” అన్నాడు కుటుంబరావు. ఆడారికబుర్లనిపించింది కమలాక్షికి.
రోజంతా వంటరిగా వుండి రకరకాల అసంతృప్తులని పోగుచేసుకుంటుంది నీలిమ. మానసకోసం పుట్టింటికి వెళ్ళడం ఆమెకి అయిష్టంగా వుంది. కానీ తప్పదు. పోనీ ఇక్కడికే రప్పిస్తే? రానందట. డెలివరీ ఎక్కడని కాదు, అసలా విషయమే అసహనాన్ని కలిగిస్తోంది. ఆపైన తండ్రి నొక్కుతున్న సన్నాయినొక్కులు, తల్లి చేస్తున్న హితబోధలు, అత్తగారు ఎత్తిచూపించడం, రోజంతా తనెలా వుందోనని మాధవ్‍కి పట్టింపు లేకపోవడం అన్నీ కలిసి మంచికీ చెడుకీ మధ్యని ఆమెని వూగిస్తున్నాయి.
మాధవ్‍కి ఆమెగురించి నిజంగానే పట్టింపు లేదా? ఉంది. కానీ ఆమెకి తనైతే నిరంతర కాలక్షేపం కాలేడు. ఏ మనిషీ మరోమనిషికి అలా కాలక్షేపం చెయ్యలేరు. చాలా చెప్పాడు ఆమెకి. పీజీకి కట్టమన్నాడు. గీతా వాసూ కలిసి చదువుతున్నారని తెలిసి ఇద్దరం కలిసి చేద్దామంది. అతనికి మరో పీజీకన్నా డిపార్టుమెంటల్ బుక్స్ ముఖ్యం. అదే అన్నాడు. ఆమె చదివే ప్రయత్నం మానేసింది. ఏదేనా జాబ్ వెతుక్కోమన్నాడు. ఆమెకి ఇష్టంలేకపోయింది.
“మా నాన్నకి భక్తీ పూజలూ అంతే. ఏదీ పట్టించుకోరు. నువ్వే చూస్తున్నావుకదా? అలాగని అమ్మేం దిగులుపడి కూర్చోదు. మాతోటీ, వాళ్ళ అక్కచెల్లెళ్లతోటీ కేరమ్స్ ఆడుతుంది. చెస్ వచ్చు. పుస్తకాలు చదువుతుంది. వీళ్లంతా పట్టుదలగా ఇంగ్లీషు నవలలు చదవడం మొదలుపెట్టారు. గీతైతే వాసు ఆడే ఆటలన్నీ నేర్చుకుంది. ఒక్క ఫుట్‍బాల్‍ని తన్నుకుంటూ గంటో రెండుగంటలో గడిపేస్తారు యిద్దరూ. మొక్కల పని చేస్తుంది. పెయింటింగ్ వేస్తుంది. నువ్వూ ఏదేనా మొదలుపెట్టు” అంటే,
“మీ అమ్మగారితో నాకు పోలికేంటి? మీ అన్నయ్యావదినలమధ్యకి నేనెలా వెళ్తాను?” అనే రెండు ప్రశ్నలతో కొట్టిపారేసింది.
గీతతోపాటు స్కూలుకి వెళ్తూ, పరిచయాలు పెంచుకుని, ఆమెనీ కొన్ని యాక్టివిటీస్ ఎత్తుకొమ్మన్నాడు. అదీ ఆమెకి నచ్చలేదు.
“ఆవిడ వెంట నేను వెళ్ళను. తీసుకెళ్ళాక ఇంక నన్ను పట్టించుకోదు. తనేకాదు, ఎవరూ నాకేసి చూడనుకూడా చూడరు. నువ్వెక్కడికేనా తీసుకెళ్ళు, వస్తాను” అంది.
రెండుమూడుమాట్లు ఆఫీసర్స్ క్లబ్‍కి వెంటపెట్టుకుని వెళ్ళాడు. అక్కడ మధ్యతరగతి వాతావరణం వుండదు. మధ్యతరగతివాళ్ళుకూడా గొప్ప నటిస్తారు. అతనికి నచ్చదు. నీలిమకి నచ్చింది. ఫాసినేటింగ్‍గా అనిపించింది. అలాంటిచోట ఫ్రెండ్సుని వెతుక్కోమని నీలిమని వంటరిగా వదిలిపెట్టలేకపోయాడు. క్రమంగా అతనికి ఆఫీసు బాధ్యతలు పెరగడం, ఆమె దేన్నీ నచ్చుకోకపోవటం అనే అంశాలలోకి చేరుకున్నారు. ఇప్పుడిక అసహనం పెరిగిపోతోంది ఆమెలో. అతన్తో దేనికో ఒకదానికి దెబ్బలాడుతుంది. అలుగుతుంది. ఆరోజూ అలానే గడిచింది.
తెల్లారి సన్నగా మాటలు, నవ్వులు వినిపిస్తుంటే లేచి ఇవతలికి వచ్చింది కమలాక్షి. మాటలు లక్ష్మిగదిలోంచీ. ఆవిడ, గీత పక్కపక్కని పడుక్కుని కబుర్లుచెప్పుకుంటున్నారు. అలకిడికి తలతిప్పి, ఆవిడ్ని చూసి, లేచి కూర్చుంది గీత. లక్ష్మికూడా సర్దుకుని కూర్చుంది.
“రండి పిన్నీ!” అంది గీత. ఆవిడ వెళ్ళి కూర్చుంది.
“కాఫీ పెడతాను. వాసు లేచేస్తాడు” అని మంచం దిగింది గీత.
“ఈ అమ్మాయి మీకు బాగా చేరికనుకుంటాను” అంది కమలాక్షి.
లక్ష్మి నిండుగా నవ్వింది. “పిల్లలంతా ఇక్కడ ఆడిపాడి పెరిగినవాళ్ళేనండీ! వీళ్ళ స్కూలు ఇక్కడికి దగ్గిర. స్కూలవ్వగానే పొలోమంటూ వచ్చేసేవారు. అప్పుడింతంత పాలూ అవీ ఎక్కడివి? ఈపూటకి ఆపూట ఇంతంత అన్నాలే. పప్పుచెక్కలో, కారప్పూసో చేద్దామన్నా ఒకళ్ళూ యిద్దరూ కాదు. అంతమంది. రెండో బాక్సు తెచ్చుకునేవారు. అదిక్కడ తినేసి ఇంక ఆటలు మొదలెట్టేవారు. మా అత్తగారికికూడా పిల్లలంటే చాలా యిష్టంగా వుండేది. ఇప్పుడంతా పెద్దవాళ్ళయారుగానీ చిన్నప్పటి చనువులు ఎక్కడికి పోతాయి? ఇది కోడలైందిగాబట్టి ఇంకాస్త దగ్గిర. అంతే” అంది.
గీత కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చి, తమగదిలోకి వెళ్ళిపోయింది.
దినచర్య సాఫీగా సాగిపోతుండగా వంటటైముకి వచ్చి గొడవ వేసుకుంది నీలిమ.
“పొద్దున్నపొద్దున్నే వంట మొదలుపెట్టారా? మీమానానికి మీరు నచ్చినవేవో వండుకుని తినేసి వెళ్ళిపోతారు. మిగుళ్ళూ తగుళ్ళూ తినలేక నేను చచ్చిపోతున్నాను. ఐనా మా అమ్మావాళ్ళూ వచ్చి వున్నారు. వాళ్లకేం ఖర్మండీ చల్లారిపోయినవి తినడానికి? ఏం వండమంటావని నన్ను ఒకమాట అడిగి, మీ పని మొదలుపెట్టచ్చుకదా?” అంది విసురుగా. గీత చేస్తున్న పని ఆపి ఆమెకేసి సూటిగా చూసింది.
“నిన్నడిగి నేను వండాలా?” అడిగింది నింపాదిగా. “నేను వండినవి తినమని నీకెప్పుడూ చెప్పలేదు. తినేవేళకి ఎవరేనా వస్తారని కొంచెం ఎక్కువ వండుతాను. వద్దైతే తినకు. ఈవేళ్టికి మిగిలినవి మూతపెట్టుకుని రాత్రికి తింటాం. ఇకపై వండను. నీకు కావల్సినట్టు నువ్వు చేసుకో” అంది. నీలిమ కంగుతింది. ముఖం ఎర్రబడింది.
“ఏం వండుతాను? వంటింటి అజమాయిషీ అంతా మీది. ఏవి ఎక్కడున్నాయోకూడా నాకు తెలీదు. గంటసేపు వెతుక్కుంటేగానీ ఏదీ దొరకదు. అందరిళ్ళలోనూ ఇడ్లీపిండీ, దోసెలపిండీ వుంటాయి. నా ఖర్మానికి మనింట్లో అలాంటివేం కనిపించవు” అంది దురుసుగా.
“వంటిల్లూ ఇక్కడే వుంటుంది, నువ్వూ ఇక్కడే వుంటావు. రోజంతా వుండనిది నేను. నిన్ననగా పిన్నీ బాబాయ్ వచ్చారు. వాళ్ళ అలవాట్లేంటో, ఏం తింటారో నీకు తెలియాలి. అరబస్తా మినప్పప్పు కొనిపడేసారు బావ. నానబెట్టుకుని మిక్సీ ఎందుకు పట్టుకోలేదు?” నిలదీసింది గీత.
నీలిమ దబదబ అడుగులేస్తూ తమగదిలోకి వెళ్ళిపోయింది. మాధవ్‍తో ఏం చెప్పిందో, అతను బైటికి వచ్చాడు.
“ఏంటొదినా! ప్రతీదీ నీ మాటమీదే జరగాలంటే ఎలా? నీలిమ అమ్మానాన్నా వచ్చారు. ఏవో చేసి పెట్టాలనుకుంటుంది. ఐనా తనని పరాయిదాన్లా ఎంతకాలం చూస్తారు? ఇంత పొద్దున్నే ఆ వంట అవసరమా? వాళ్ళకేం కావాలో చూసాక చేసుకోవచ్చుకదా? కాస్త మన మర్యాదా నిలబడుతుంది” అన్నాడు. ఫైలేదో సగం చూస్తూ వచ్చాడు, చేతిలో పెన్నుకూడా వుంది. అతనలా కలగజేసుకుంటాడని గీత వూహించలేదేమో, తెల్లబోయి చూసింది. కళ్ళలో షాక్, అపనమ్మకం. ఆమె మొహంలో కదిలిన భావాలు చూసి అతను చకితుడయ్యాడు.
పలచటి కన్నీటిపొర కదిలింది ఆమె కళ్లలో. వెంటనే రెండు బర్నర్లూ కట్టేసి, “చేసుకొమ్మను” అంది, అక్కడినుంచీ వెళ్ళిపోయింది. పిలుస్తున్నా వినిపించుకోలేదు. లక్ష్మి కలగజేసుకుంది.
“తెల్లారి లేవగానే తిండిగురించి ఈ గొడవేంటి మాధవ్ అసహ్యంగా? వాళ్లదివాళ్ళు తింటున్నారుగానీ మరెవరిదీ తినట్లేదు. ఎవరికేం కావాలో వాళ్ళు వండుకోవచ్చుకదా? మొదట్లో అలానే చేసిందికదా, నీలిమ? పొద్దున్న ఐదుగంటలకి లేస్తారు భార్యాభర్తలు. పదింటికల్లా ఆకలి వెయ్యదా? ఆ కంచంలో పెట్టుకునే అన్నంకోసం అది కష్టపడుతుంది. ముందురోజునుంచీ ఏర్పాట్లు చేసుకుంటుంది. నీ భార్య ఏం చేస్తోంది? మంచం దిగి గదిలోంచీ ఇవతలికి రావటానికే ఏడు. టిఫెన్లు కావాలని మంచంమీద పడుక్కుని కలలుగంటే ఆకాశంలోంచీ వూడిపడవు. ఏం కావాలో ముందురోజు చూసుకోవాలి. నువ్వూ మీ ఆవిడా నిలబెట్టిన వంటవాళ్ళెవరూ లేరు. ఇంకోసారి వాళ్ళ తిండిగురించి మాట్లాడావంటే నీలిమా, కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను. ఒక్క పనికూడా చెయ్యడం మానేసి, అది వండిపెడితే తిని పేర్లు పెడుతున్నావు” అంది కోపంగా.
నీలిమ విసవిస వెళ్ళిపోయింది.
ఏం చెయ్యాలో తోచక మాధవ్ అలాగే నిలబడ్డాడు. “గీతని అంటావేంట్రా, నువ్వు? దాని తప్పేం వుంది? దానివేళకి అది వండుకుని వెళ్తోంది. తల్లీతండ్రీ వచ్చినప్పుడు పొద్దున్నే లేచి వాళ్లకేం కావాల్లో చూసుకోనక్కర్లేదా నీలిమ? కాఫీలు గీతే చూసుకుంది. పైనుంచీ తన పని మానుకుని టిఫెన్లు చేసి అందివ్వాలా? బుద్ధున్నమాటేనా అది? అసలు వంటింటిగొడవల్లోకి నువ్వు రావడమేమిటి? గీత మొహంలోకి చూసే అన్నావా, ఆ మాటలు? పుట్టాక పెరిగాక ఎప్పుడూ తల్లినీ తండ్రిని వదిలిపెట్టి వున్నది లేదు. బెంగతో సగమైంది. అలాంటిదాన్ని అంటావా? భార్యని వూరికే వెనకేసుకుని రావడం కాదు, ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. లేకపోతే పట్టించుకోకుండా వదిలెయ్యాలి. ఇప్పుడీ గొడవంతా తెలిస్తే, వాసు వూరుకుంటాడా? అన్నదమ్ములిద్దరూ ఇకపైని కత్తులు నూరుకుంటూ తిరుగుతారా?” అడిగింది లక్ష్మి. తల్లి మాటలకి అతనికి తన తప్పు పూర్తిగా అర్థమైంది.
గీతని వెతుక్కుంటూ వెళ్ళాడు. పెరట్లో ఒక్కర్తే కూర్చుని వుంది.
“గీతూ! సారీనే. ఏదో ఫైలు చూసుకుంటుంటే నీలిమ వచ్చేసి కలగాపులగంగా చెప్పేసరికి తొందరపడ్డాను. ఇలాంటివి సీరియస్‍గా తీసుకోకూడదు. ఇంతమందిమి వున్నచోట ఒకొక్కసారి పొరపాట్లు జరుగుతాయి” అన్నాడు.
“పర్వాలేదు” పొడిగా అంది.
“ఒక్కదానివీ ఇక్కడెందుకు? పద, లోపలికి. ఆఫీసుకి టైమవట్లేదా?” అడిగాడు.
“ఇవాళ వెళ్లట్లేదు. లీవు పెడతాను”
మాధవ్‍కి ఇంకేం మాట్లాడాలో తెలీలేదు. లోపలికి వెళ్ళి తల్లికి చెప్పాడు, “సారీ చెప్పి లోపలికి రమ్మన్నాను. రాదట. నెత్తిమీద నీళ్ళకుండ పెట్టుకుని కూర్చుని వుంది. నువ్వెళ్ళి పిలువు” అన్నాడు. లక్ష్మి కొడుక్కేసి తీక్ష్ణంగా చూసి గీత దగ్గరకి వెళ్ళింది. ఆమె ఏదో ఆలోచనలో వుంది.
“ఇక్కడ కూర్చున్నావేమే? లోపలికి పద” అంది మృదువుగా.
“మాధవ్ నన్ను తప్పు పట్టాడత్తా!” అంది ఇంకా దిగ్భ్రమలోంచీ తేరుకోనట్టు.
“వాడిని నేను మందలించాను. తప్పు తెలుసుకుని వచ్చి సారీ చెప్పాడుకదమ్మా? వాడి అత్తమామలు వచ్చి వున్నారు. నీలిమ చెప్పింది సరిగ్గా వినక తొందర్లో ఏదో అన్నాడు. దానికింత బాధపడతారా?”
“అప్పుడు సుమతి. ఇప్పుడు వీడు. నాదా, తప్పు?” గీత కళ్ళు నీటిచెలమలయ్యాయి. లక్ష్మికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఈ పిల్ల యీ బంధాల్లో ఇంతగా చుట్టుకుపోయి వుందేమిటి? ఎలా బైటపడుతుంది, ఇలాంటి ఆలోచనల్లోంచీ? అర్థమవలేదు.
“గీతూ! అలా బాధపడకూడదే! నువ్వూ ఏదో ఒకటి అనేసి అక్కడితో వదిలేసెయ్యాలి. పదిమంది మనుషులున్నచోట ఇలాంటివి జరుగుతాయి. వాళ్ళముందు దాన్నేం అనలేక చిన్నప్పట్నుంచీ వున్న చనువుతో నీతో అలా అనేసాడు. అదికూడా అమ్మానాన్నలు వచ్చారని కాస్త ఎక్కువ చేస్తోంది. సరేగానీ, ముందుకు లోపలికి పద. నిన్నిలా చూసిందంటే రుక్కమ్మ వదిలిపెట్టదు. అసలే ఆవలిస్తే పేగులు లెక్కపెడుతుంది. మాధవ్‍కి తలంటుతుంది. మళ్ళీ అదో గొడవ” అని చెయ్యిపట్టుకుని లేవదీసింది. ముందు లక్ష్మీ, వెనక గీతా వస్తుంటే వంటింటి గుమ్మందగ్గిర ఎదురొచ్చింది కమలాక్షి. అప్పటికి వాళ్లగదిలో గొడవపడ్డం అయింది. కూతురుచేసిన గొడవకి ఆవిడ నిశ్చేష్టురాలే అయింది.
“అదేంటి నీలూ, ఇలా చేస్తున్నావు? మేమేదో దగ్గరుండి అనిపిస్తున్నామని మీ అత్తగారు అనుకోదూ? పనిలో సాయం చెయ్యకపోగా నువ్వు గీతని అనడమేమిటి? మాధవ్‍ని ఎగెయ్యటమేమిటి? ఇలాగే వుంటున్నావా, రోజూను? ఇది దేనికి దారితీస్తుందో?” అంది కలవరంగా.
“దీన్నంటావేం? దీనిదా, తప్పు? ఇంటి పెత్తనం అంతా తనదే ఐనప్పుడు పెద్దకోడలు ఇంటికొచ్చినవాళ్లకి మర్యాదలు చూసుకోనక్కర్లేదూ? ఆమాట అడిగిందని వంట మధ్యలో వదిలేసి పోతుందా ఆ పిల్ల? వాళ్ళు వండుకుని తినేసి దీనికి కడుపునిండా తిండికూడా పెట్టకుండా మాడుస్తున్నారట. ఎక్కడేనా విన్నామా అలాంటిది? మనం వచ్చాంకాబట్టి ఈ విషయం బైటపడింది. ఆ పదివేలదగ్గర్నుంచీ మొదలుపెట్టి నువ్వే ఎదురు కడిగెయ్యలేవూ? అందరూ నోళ్ళు మూసుకుని పడుంటారు” అన్నాడు కుటుంబరావు. భార్యాభర్తలది ఒక్కమాటైతే మంచైనా చెడైనా సాగుబాటౌతుంది. కుటుంబరావులో వున్న కల్మషం కమలాక్షిలో లేదు. అదీకాక ముగ్గురూ ఆడపిల్లలని ఇటు భర్తనుంచీ, ఆయన బంధువులనుంచీ ఎన్నో మాటలుపడి, అటు అరాకొరా జీతంతో సర్దుకుని బతికి, ఎంతో ప్రయాసపడి పిల్లల్ని పెంచి పెద్దచేసింది. పెళ్ళిళ్ళయాయి. వాళ్ల బతుకులు వాళ్ళు బతుకుతుంటే తనవరకూ తను ప్రశాంతగా వుండాలనుకుంటోంది. ఆడవాళ్ల ఆకాంక్షలకి ఎలాంటి విలువా వుండదని పదేపదే నిరూపించే నిరర్ధకపు మనిషి ఆవిడ భర్త.
“అన్నిటికీ అలా పెడర్థాలు తీయకండి. అతనెంత పెద్ద ఆఫీసరైనా ఆవిడకి కొడుకయ్యాకే దీనికి మొగుడు. దీనికిక్కడ ఏ లోటూ లేదు. ఇంట్లో వండినవి తినాలి, లేకపోతే వండుకోవాలి. నీకేం కావాలని అడిగి ఎవరూ కూర్చోబెట్టి చేసిపెట్టరు. అక్కడికి గీత మంచిదే. ప్రతిదానికీ వంతులుపోవట్లేదు. మీ వదినగారేం చేసేది? మనం కలిసున్నది మూడేళ్ళు. ఆ కొద్దిరోజులూ పూచికపుల్లనికూడా మేం యిద్దరం కలిసి మోసాం. పిల్లలని వాళ్ళ కాపురాలు వాళ్లని చేసుకోనివ్వండి. అదేకదా, మానసకూడా అన్నది?” అని, ఇవతలికి వచ్చింది. ఆ రావటం లక్ష్మిని వెతుక్కుంటూ. కనిపించగానే చప్పుని ఆవిడ చెయ్యి పట్టుకుంది.
“వదినగారూ! నీలిమ చిన్నపిల్ల. దానికన్నా చిన్నవాళ్ళందరికీ పిల్లలు పుడుతూ తనకి అవకపోయేసరికి వుక్రోషంలో ఏదో అనేసింది. నేను మందలించి చెప్పాను. మాతో వస్తుందికదా, ఇంకాకూడా చెప్తాను. కాస్త పెద్దమనసు చేసుకోండి. గీతా! నువ్వుకూడా. నీ చెల్లెలనుకో” అంది.
“గీతకూడా చిన్నదేనండీ! మీ అమ్మాయి కోపతాపాలు సహించి సర్దుకుపోయేంత వయసు దానికీ లేదు. రక్తం పంచుకుని పుట్టిన అక్కచెల్లెళ్ళు ముగ్గురూ మూడిళ్ళు మెట్టారు. కలిసి బతకడం, కష్టసుఖాలు పంచుకోవడం పుట్టింటిగడపదాటాక సరి. పెళ్ళితో వచ్చిన తోబుట్టువులు తోటికోడళ్ళు. దీనికి నీలిమమీద ఎలాంటి కంప్లెయింటూ లేదు. ఏ పనీ చెయ్యకపోయినా అడగదు. తలొంచుకుని తనపని తను చేసుకునిపోయే పిల్లమీద ద్వేషం మంచిదికాదని మీ అమ్మాయికి చెప్పండి. మాయింట్లో ఒకటికి రెండుసార్లు చెప్పడాలూ, మందలించడాలూ వుండవు. మంచీ చెడూ గ్రహించి మారాల్సిందీ, మారకపోతే వచ్చే సమస్యలు ఎదుర్కోవలసింది వాళ్ళే. పెళ్లై నాలుగేళ్లైనా ఇంకా పరాయిమనిషిలా వుండటం తనకంత మంచిది కాదు” అంది లక్ష్మి. కమలాక్షి తల దించుకుంది. గీత వాళ్ళిద్దరినీ దాటుకుని వెళ్ళిపోయింది.
“నీలిమా!” అని పిలిచింది లక్ష్మి. ఆమె వచ్చింది. ఆవిడ గొంతులోని కాఠిన్యం ఆమెని కొంచెం భయపెట్టింది.
“గీత పని చెడగొట్టి వెళ్లగొట్టావు. ఆ వంటేదో పూర్తిచేసి, టిఫెనుగురించి ఆలోచించు. వాసు వచ్చే వేళైంది. వాడు ఆకలికి ఆగలేడు” అంది.
“ఆలస్యమైంది కదండీ, ఉప్మా కలిపేస్తాను ఇవాళ్టికి” అంది నీలిమ నెమ్మదిగా.
“మాధవ్ ఉప్మా తినడు. నూకలో పురుగులుంటాయని వాడికి అసహ్యం. ఎంత శుభ్రం చేసినా వాడికి భయమే. నీకు తెలిదా ఆ విషయం? అదొక్కటేకాదు, బియ్యంకూడా ఒకటికి రెండుసార్లు చూడాలి. ఏదేనా కనిపించిందంటే కంచంలో చెయ్యికడుక్కుని లేచేస్తాడు వాడు. ఇంకెప్పుడు తెలుస్తాయి నీకీ విషయాలు? ఎప్పుడేనా అక్కపక్కని వచ్చి నిలబడితేకదా?” నిలదీసి అడిగింది.
“పెళ్లైనకొత్తలో వుప్మా నచ్చదని చెప్పారుగానీ ఎందుకో చెప్పలేదు”
“గోధుమపిండి తీసుకుని పూరీలు మొదలుపెట్టు. అ పిండికూడా ఓమాటు జల్లించి చూసి, వాడు. అందరికీ తలో అరడజనూ రావాలి. ముందు మయూకి రెండు వత్తిచ్చేస్తే అవీ, కాస్త పెరుగన్నం తినేసి స్కూలుకెళ్ళిపోతాడు” అని అక్కడినుంచి కదిలింది. కమలాక్షి కూతురికి సాయంగా వుండిపోయింది. అప్పటికే అన్నం వండేసింది గీత. పప్పు కుక్కరు ఎక్కించి కూరగాయలు తరుగుతుంటే గొడవ మొదలైంది.
“ముందు ఇంత అన్నం వండి పడేస్తుంది. అది చూస్తేనే నాకు చిరాకు” అన్నంగిన్నె చూస్తూ అంది నీలిమ చిన్నగొంతుతో.
“బైటికెళ్ళే మనుషులు నలుగురున్నప్పుడు అలానే వండుకుంటారు. మిగతా వంటంతా అవకపోయినా ఏదో ఒకటి వేసుకుని తినేస్తారని. బియ్యంలో చారెడు పెసరపప్పూ, చెంచాడు నెయ్యీ, చిటికెడు వుప్పూ వేసి వండితే దేవుడికి నైవేద్యంకూడా పెట్టచ్చు. ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. పద్ధతిగా చేసుకుంటోంది. నువ్వే ఇలా తయారయ్యావు” అంది తల్లి కోపంగా. నీలిమ మాట్లాడలేదు. తల్లి పిండి జల్లించి తడిపి మర్దిస్తుంటే ఆమె మిగిలిన వంట పూర్తి చేసింది. గీత లోపల్నుంచి వచ్చింది.
“మీరు చెయ్యడమేమిటి? ఇటివ్వండి” అంటూ కమలాక్షి చేతిలో పని అందుకుంది.
“రోజూ వంట నువ్వే చేస్తావుకదు గీతా? ఈ రెండురోజులూ నన్ను చేసిపెట్టనీ” ఆవిడ అన్నా వినలేదు. చకచక పూరీలు వత్తేసి అక్కడ పెట్టి, ఉడికించిన దుంపలు పొట్టు తీసిచ్చి వెళ్ళిపోయింది. ఆమె చురుకూ, చేతి ఒడుపూ చూసి చకితురాలైందావిడ. కాసేపటికి వాసు బయటినుంచీ వచ్చాడు. అతను స్నానంచేసి వంటింట్లోకి వచ్చేసరికి మాధవ్, కుటుంబరావుతో కలిసి డైనింగ్‍టేబుల్ ముందు కూర్చుని వున్నాడు. గీత జరిగిన గొడవగురించి చెప్తుందేమోనని మాధవ్‍కి కాస్త కంగారుగా వుంది. అలా చెప్పే అలవాటు ఆమెకి లేదని తెలిసినప్పటికీకూడా. రోజూకి భిన్నంగా నీలిమని వంటింట్లో చూసి స్వల్పంగా ఆశ్చర్యం కలిగింది వాసుకి. నీలిమ వుండటం ఒక్కటేకాదు, అక్కడ గీత లేకపోవటం అతని ఆశ్చర్యానికి అసలు కారణం. ఏదో జరిగివుంటుందని గ్రహించాడు.
“ఈవేళ పూరీలు చేసాను బావగారూ!” అంటూ ప్లేటు తెచ్చి అతనిముందు పెట్టింది.
“ఏంటో స్పెషల్?” అడిగాడు వాసు నవ్వుతూ.
“టిఫెను చేసుకోవడానికి ప్రత్యేకం ఏముంటుంది?” అంది ముభావంగా.
తండ్రిమాటలు బాగా ఎక్కాయి నీలిమకి. ఒక వున్మత్తతలా వుంది ఆమెకి. పైకి గౌరవించినట్టు కనిపిస్తుందిగానీ, వాసు వుద్యోగం చిన్నదని అతనిమీద పెద్దగౌరవం లేదు. అతనలా చనువుగా మాట్లాడినప్పుడు కొంచెం అసహనంగా వుంటుంది. అందునా ప్రహ్లాద్, వసంత్‍లవికూడా మంచి పొజిషన్స్ కావడం, వీళ్ళేకాకుండా, అటు సుధీర్, సుమంత్, జో డాక్టర్లు కావడం తేడాని యింకా పట్టి చూపించినట్టుంటుంది. ఎందుకు, వీళ్లంతా అతనికి అంత గౌరవం యిస్తారనేది అర్థమవదు. అతనుకూడా ఆ తేడా తెలుసుకుని తన హద్దులో తనెందుకు వుండడనేది మరో ప్రశ్న. చాలా మధ్యతరగతి కుటుంబాల్లో కోడళ్ళదగ్గిర మామగార్లకీ, బావగార్లకీ గౌరవం తగ్గేది ఇలాంటి కారణాన్నే. తండ్రి పైకొచ్చిన కొడుకుని చూసి అది తన ప్రయాసకి దక్కిన ఫలితం అనుకుంటాడు. పెద్దకొడుకు అవకాశాలు కలిసితాక సర్దుకుపోతాడు. పెళ్లయేదాకా చిన్నకొడుక్కి అందులో తప్పేం కనిపించదు. కోడలొచ్చాక తేడాలు తెలుస్తాయి. వాసు అప్పుడున్న పరిస్థితులనిబట్టి ఉన్నచోటే వుద్యోగం వెతుక్కుని వుండిపోయాడు. పెళ్లయాక గీతదికూడా యిక్కడే వుద్యోగం కావడంతో ఇంకో ఆలోచన చెయ్యలేదు. అప్పుడు అనివార్యంగా మారిన సర్దుబాటు తన విలువని లెక్కవేసి తగ్గిస్తుందనుకోలేదు.
మయూని స్కూలుకి పంపించి లక్ష్మి వచ్చింది.
“గీతేది?” అడిగాడు తల్లిని.
“ఇవ్వాళ ఆఫీసుకి వెళ్ళదట. చిన్నాడిని ఆడించుకుంటూ గదిలో కూర్చుంది” జవాబిచ్చింది లక్ష్మి.
“గీతా!” అని కేకేసాడు వాసు. ఆమె విహీని ఎత్తుకుని వచ్చింది. వాడు తటాలున టేబుల్‍మీదికి వంగి, అందుబాటులో వున్న కంచంలో చెయ్యిపెట్టబోయాడు. వాడి చేతికి ఒక పూరీ ఇచ్చి, కింద కూర్చోబెట్టిందామె.
“మీ పానెల్ సెక్రెటరీ గ్రౌండులో కలిసాడు. నీ లీవుగురించి అతనికి చెప్పాను. మీ ఆఫీసరుతో వచ్చి మాట్లాడతానన్నాడు. ఇప్పుడు వెళ్ళి, సాయంత్రం రిలీవై వచ్చేద్దువుగాని. సీయల్ వద్దు” అన్నాడు.
జరిగిన గొడవ మర్చిపోయి మాధవ్ కళ్ళెగరేసాడు.
“నేనుకూడా లీవు, ఎల్టీసీ పెడతాను. మాదగ్గిర ఒక్కరోజులో ఐపోతుంది. బెంగుళూరు వెళ్దాం” అన్నాడు. గీత ముఖం విప్పారింది.
“బెర్తులు వున్నాయట. స్టేషన్లో అడిగి వచ్చాను. బట్టలవీ సర్దేసి వుంచు. రేపు బయల్దేరదాం” అన్నాడు.
“తూచ్… తొండి. ఆఫీసులో లీవు ఇవ్వకపోతే యూనియన్ సెక్రెటరీని పంపిస్తే ఎలారా?” వాళ్ళు మాట్లాడుకోవడం అయాక అన్నాడు మాధవ్.
“కంచంనిండా అన్నీ సర్ది తినడానికి ముందుపెట్టినట్టు ఆర్జితసెలవు, సగంజీతపుసెలవు, అసాధారణసెలవు అంటూ రకరకాలు రూల్స్‌లోనూ లీవు అకౌంటులోనూ నింపేసి, తీరా అడిగేసరికి ఆఫీసరు ఇస్తేనేగానీ వాడుకోవడానికి లేదనే రూల్ చూపిస్తే ఏం చేస్తార్రా, ఎవరేనా? బెంగుళూరు వెళ్ళడానికి తను నెలరోజులకిందట లీవు పెడితే పెండింగ్ రిమార్కు రాసి ఫైలు పక్కని పెట్టాడు వాళ్ళ ఆఫీసరు. మామయ్యని చూసి చాలారోజులైందికదూ, బెంగపడుతోంది. ఓమాటు వెళ్ళి చూసి వచ్చేస్తే సరిపోతుందని. లీవువేకెన్సీల్లో పనిచేసేందుకు స్టాఫ్‍ని అడిగి తెచ్చుకోవడం మీ బాధ్యత కాదా? ” అన్నాడు వాసు.
“తిప్పితిప్పి మామీదకి తోస్తావేంరా? మేం బ్రిటిషువాళ్ళ పవర్‍పట్టాలం” మాధవ్ పెద్దగా నవ్వాడు.
“ఆడవాళ్ళు వుద్యోగాలు చెయ్యడం వచ్చాక లీవులకి ఇబ్బందౌతోందిగానీ మొదట్లో ఏ సమస్యా వుండేదికాదు. మా ఆఫీసులోనే చూసేవాడిని, పురుడని ఒకళ్ళూ, పిల్లాడికి జ్వరమని ఒకళ్ళూ, పండగని ఒకళ్ళూ అలా లీవుచీటీలు పట్టుకుని ఆఫీసరుముందు వరసకట్టేవాళ్ళు. ఏ ఆఫీసరుమాత్రం ఎందరికని ఇవ్వగలడు? పోనీ పనేమైనా చేస్తారా అంటే ఐదవ్వడం భయం, బేగు భుజానికి తగిలించుకుని లేస్తారు. నీగురించి కాదమ్మాయ్, సాధారణంగా జరిగేవీ నేను నా సర్వీసులో చూసినవీ చెప్తున్నాను” కుటుంబరావు కలగజేసుకున్నాడు. బైటివాళ్ళు అలా మాట్లాడితే అది వేరేవిషయంకానీ, ఇంట్లోమనిషే అలా అనేసరికి గీతకి చివుక్కుమనిపించింది.
“లీవులు వాడుకోవడానికేగదండీ బాబాయ్‍గారూ, ఇచ్చేది?” అడిగింది.
“సరెండరు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది వుండదుగా, గీతా?. ఐనా ఇంత వయసొచ్చి పెళ్లై పిల్లలుకూడా పుట్టాక ఇంకా అమ్మానాన్నలకోసం బెంగేమిటి? ఇలాంటివాటికికూడా లీవులివ్వాలంటే కష్టంకాదూ?” అన్నాడు కుటుంబరావు. వాసు ఆయన్ని సూటిగా చూసాడు. ఆయన చూపు కలవనివ్వలేదు.
“ఏడాదికి పదిహేనురోజులు సరెండర్ చేస్తాము, రిటైర్మెంటునాటికి ఎనిమిది నెలలు అంటే సంవత్సరానికి ఏడెనిమిదిరోజులు పోగుచేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలే వుంటుంది. అదికూడా ఇవ్వకపోతే ఎలా? చాలామంది సగంజీతంలీవు వాడుకోకుండా అలానే వదిలేస్తారు. అదంతా గవర్నమెంటుకి మిగులేకదా?” అంది గీత.
“ఆడవాళ్ళమీద నాకెలాంటి కంప్లెయింటూ లేదు మామయ్యగారూ! ఐదింటికి వెళ్ళిపోవడంకోసం రోజంతా సీట్లోంచీ లేవకుండా చేస్తారు. లీవు ఇచ్చినా తిరిగొచ్చి వాళ్ళపని వాళ్ళు చేసుకుంటారు. మగవారితోటే సమస్యల్లా. సీట్లో వుండకుండా బైటిపనులమీద తిరుగుతారు. పనులుకూడా అలానే వుంటాయి. పిల్లల స్కూలుఫీజులు కట్టడం, బస్‍పాసులు, కరెంటు బిల్లు, గేస్ బుక్ చేసుకోవడం ఇవన్నీ ఆఫీసు పనివేళల్లోనే ఔతాయి. అందుకే చూసీచూడనట్టు వదిలేస్తాను. పన్లోపనిగా వేరే వ్యవహారాలూ చూసుకుని నెమ్మదిగా లంచి చేసి వస్తారు. ఆఫీసైపోయినా కూర్చుంటారు. నాకు రోజూ అందుకే లేటయ్యేది” మాధవ్ అన్నాడు.
“ఆడవారిమీద నువ్వు చూపించిన కన్సర్న్‌కి థాంక్స్ మాధవ్” అంది గీత పొడిగా. అబ్బో! ఈవిడకింకా కోపం తగ్గనట్టుంది-అనుకున్నాడతను. కానీ ఆమె మనసులో తన స్థానం మారిపోయిందని గ్రహించలేకపోయాడు.
“వాళ్లందరి గొడవా దేనికిగానీ, నీకెందుకమ్మాయ్, వుద్యోగం? హాయిగా మా పిల్లల్లాగ ఇంట్లో కూర్చుని పెద్దవాళ్ళనీ పిల్లల్నీ చూసుకోక? వాసు రెండుచేతులా సంపాదిస్తున్నాడు. ఆస్తులున్నాయి. నువ్వొదిలేస్తే అవసరం వున్నవాళ్లకి దొరుకుతుంది” అనేసాడు కుటుంబరావు. ఆయనకి మనసులో ఒక దుగ్ధ వుంది. రామారావుకి వచ్చిన ఆలోచన తనకెందుకు రాలేదు, ముగ్గురు కూతుళ్ళనీ వుద్యోగాల్లో పెట్టి వుంటే ఎంత బావుండేదని.
గీత నవ్వేసింది. “అలా అవసరం వున్నవాళ్లని వెతికి యివ్వరండీ! అప్లై చేసుకున్నవారిలో అర్హతనిబట్టి ఇస్తారు. ఐనా చేరిపోయాను. ఇరవయ్యేళ్ళు చేసి పెన్షను తీసుకుని మానేస్తాను” అంది. వాసు సాలోచనగా చూసాడు. కుటుంబరావు ఫెయిర్‍గా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. గీతకూడా మామూలుగా లేదు. తను లేని టైంలో ఏదేనా జరిగిందా? అలాంటివి అతను నేరుగా అడగడు. ఆమె సూటిగా చెప్పదు. ఆమె ప్రవర్తన చూసి గ్రహిస్తాడు. మనసుకి గుచ్చుకున్న ఒకటీ అరా మాటల్ని పైకి అంటుంది. వాటినుంచీ గ్రహిస్తాడు.
“ఆఫీసయ్యాక మాదగ్గిర డబ్బులెక్కలుంటాయి. ఆఫీసరు, సూపర్నెంటూ పంచుకుంటారు. మీకు అలాంటివేం వుండవా?” అడిగాడు కుటుంబరావు గీతమీంచీ మాధవ్‍మీదికి దృష్టి మళ్ళించి. అదేదో మామూలు విషయంలా. సూటిగా. మాధవ్ ముఖం ఎర్రబడింది.
“అలాంటివి మాయింట్లో అలవాటు లేదండీ! పెంచినంతవరకూ మా నాన్న, మా మామయ్య మమ్మల్ని చాలా పద్ధతిగా పెంచారు” అని తినడం ముగించి లేచాడు. గెజెటెడ్ ఆఫీసరు. శుభ్రంగా నాలుగు పైసలు సంపాదించుకోక ఇదేమిటో కుటుంబరావుకి అర్థమవ్వలేదు.
“సర్లేగానీ, మీరిద్దరూకూడా రాకూడదూ?” వాసు తమ్ముడిని ఆపి, అడిగాడు.
“మానస డెలివరీకి వుందిరా! సాయానికని నీలిమని తీసుకెళ్లడానికి వచ్చారు. ఆ హడావిడంతా అయాక వెళ్తాం” అన్నాడు మాధవ్. అన్యాపదేశంగా వాళ్ళ నిర్ణయం, తన నిర్ణయం చెప్పేసాడు.
“నువ్వు రావచ్చుగా?” అడిగింది గీత లక్ష్మిని.
“మా అక్కచెల్లెళ్లందరం కలిసి వెళ్లాలనుకున్నాం” లక్ష్మి జవాబిచ్చింది.
“అబ్బో!” అంది గీత వెక్కిరింతగా.
“ఇప్పుడు నీతో వచ్చేవాళ్ళెవరమ్మా? అందరిళ్ళలోనూ ళొళొళ్ళాయిలేకదా?” అన్నాడు వాసు. వెళ్తున్నవాడల్లా ఆగి, నవ్వేసి వెళ్ళాడు మాధవ్. నీలిమకి చురుక్కుమంది. అన్న అలా అంటుంటే ఇతనికి చిన్నతనం లేదా? కావాలనే అన్నాడా వాసు? తనకి వుండే బాధ ఇతనికెందుకు లేదు? జవాబులేని ప్రశ్నలివి ఆమెకి.
“ఇప్పుడు కాదులేరా! ఉన్నపళంగా పరిగెత్తమంటే ఎలా కుదుర్తుంది? ఎవరింట్లో ఏ అవసరం వుంటుందో?” వాసుతో అని,
“నువ్వూ తినెయ్. ఆఫీసుకి లేటౌతుంది” అంది లక్ష్మి గీతతో. వాసు నీలిమ పెట్టిన ఆరు పూరీలూ తినేసి, కొంచెం అన్నం పెట్టించుకుని పప్పు, పెరుగుతో తిని లేచాడు. గీతా అలానే తింది. ఇంతంత తిళ్ళు తినే మనుషుల్ని పల్చగా రెండు దోసెలో, ఇడ్లీలో పెట్టి పంపాలనుకుందా నీలిమ అని కమలాక్షి విస్తుపోయింది.