ఝరి – 49 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“సరిగ్గా మూడురోజులే నీలూ! రెండువైపులా ప్రయాణం, అమ్మని తీసుకుని రావడం… అంతే. మహీ, అమ్మమ్మా, ఇక్కడికి వచ్చేస్తారు. మేనేజి చెయ్యగలవుకదూ? ఏ అవసరం వచ్చినా దేశపాండేకి ఫోన్ చెయ్యి… ఎంత? మూడురోజులు… చూసుకోగలవుకదూ? ” అని తెగ జాగ్రత్తలు చెప్తూ వుంటే-
“ఏమిట్రా, నీ చాదస్తం? నాన్నా, మీరు పెళ్ళిళ్ళు చేసుకోకముందునించీకూడా మేం బతికే వున్నాం. స్వతంత్రంగా పనులు చేసుకున్నాం” అంది సుమతి విస్తుబోయి.
“ఇద్దరు పసిపిల్లలూ, ఒక పెద్దావిడా కదే?” అన్నాడు మాధవ్.
“మహతికూడా వుంటుందికదరా?”
మహతికి ఎందుకో ఇంక అక్కడ వుండాలనిపించలేదు. మాధవ్ నీలిమపట్ల చూపిస్తున్న ప్రేమా, జాగ్రత్తా కలవరపెడుతున్నాయి. ఇలాంటి ప్రేమా, అనునయం తనకీ నరేంద్రకీ మధ్య పెద్దగా ఎప్పుడూ లేవు. ఇంట్లో అతని తల్లిది పెత్తనం. డైరెక్షను అతని అక్కది. తమది చాలా పరిమితమైన స్పేస్. రెండేళ్ళు కనురెప్పలమీద నిలిచి కరిగిపోయిన స్వప్నంలా గడిచిపోయాయి. ఆ తర్వాత…? మసగ్గా వుండే బెడ్‍లాంప్ వెలుతుర్లో కాంక్షతో నిండిన అతని కళ్ళు… ఆశించినది దొరక్క అతని కోపం… అది మనసులో పెట్టుకుని తెల్లారి లేచినదగ్గర్నుంచీ సూటిపోటిమాటలనడం, పిల్లిమీదా ఎలకమీదా పెట్టి తిట్టడం… ఆఖరికి కొట్టడం… కళ్లలో పల్చటి కన్నీటి పొర కదిలింది.
“అమ్మమ్మ ఒక్కర్తే వుంది. నేను వెళ్తున్నాను” అని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసింది.
“ఏమైందే? అక్కడేమైనా అనుకున్నారా?” ఇంటికి వచ్చి, మంచానికి అడ్డంపడి, కళ్ళమీద మోచెయ్యి ఆనించుకుని కన్నీళ్ళు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే విజ్జెమ్మ అడిగింది. అదేం లేదన్నట్టు మహతి తల అడ్డంగా వూపింది. ఆవిడ వెళ్ళి వాకిలి తలుపు పెట్టేసి వచ్చింది.
“మరింక ఈ ఏడుపు దేనికి? వెళ్ళి ముందు మొహం కడుక్కుని రా! వాళ్లెవరొచ్చినా బావుండదు” అంటే లేచి బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చింది.
“చూడు, నువ్వు అడుగుపెట్టింది ముళ్ళదారిలో. వంటరితనం, చుట్టూ వున్నవాళ్ళు నవ్వుతూ తిరుగుతుంటే మనసులో కలుక్కుమనటం, నేనెందుకిలా అని ప్రశ్నించుకోవడం, జవాబు దొరక్క అసహనం, కోపం… ఇవన్నీ కాళ్లకింది పల్లేరుకాయలు. వాటిని నవ్వుతూ తీసెయ్యగలగాలి. నువ్విలా ఏడవటం ఎవరేనా చూసారనుకో, వాళ్లని చూసి అసూయపడుతోందంటారు. నీ బాధ ఎవరికీ అర్థం కాదు. అక్కర్లేదుకూడా. నీ కళ్ళలోంచీ కారే కన్నీళ్ళకిమాత్రం అర్థాలు తీస్తారు. నువ్వో వుంగరం చేతిలో పెట్టి, నాలుగు మంచిమాటలు అనేసరికి మురుసుకుంటోంది నీలిమ… తనే అంటుంది”
“మాధవ్ పైవాడా అమ్మమ్మా! వాళ్ళిద్దర్నీ చూస్తే సరదాగానే వుంటుంది. అసూయదేనికి? ఎవరి ప్రాప్తం వాళ్లది. ఎందుకో ఒక్కసారి నిస్సత్తువగా అనిపించింది” అంది మహతి.
“నేను చెప్పిందీ అదే. నీకింకా ఈ ప్రపంచం ఏమీ తెలీదు. ఎంత బాధైనా మనసులోనే దాచుకుని నవ్వుతూ తిరగడం నేర్చుకో. మరీ అవతలివాళ్ళు ఇబ్బందిపెడితే చురకపెట్టడం కూడా రావాలి. అది గీతని ఎంత రాచి రాపాడిందో తెలుసా? అక్కచెల్లెళ్ళు ముగ్గురూ ముగ్గురే. వాళ్లమ్మ మంచిదే పాపం. వీళ్ళే ఇలా. ఇటు దీన్ని అదుపుచెయ్యలేక అటు గీత కన్నీళ్ళు చూడలేక మాధవ్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని ఇక్కడికి వచ్చేసాడు. గొడవలేమిటంటే ఏమీ లేవు. వడ్లగింజలో బియ్యపుగింజ. అది ఏం చేసినా దీనికి నచ్చదు. చిన్నప్పట్నుంచీ అది మనింట్లో ముద్దుకదూ? దాని మాటలకీ పనులకీ సంతోషపడేవాళ్ళే అందరూను. ఈ పిల్ల ఓర్చలేదు. అది తిండిపుష్ఠిగల మనిషి. దీనికి వెటకారం. సుమతి మాత్రం? నాకు నువ్వెంతో అదీ అంతేకదా? కాస్త సిరి అందుకునేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. గీతకి లేనిదేమిటి, వీళ్ళకి వున్నదేమిటి? రెండిళ్లకి మహారాణీ అది. ఇంటిని ఆనుకుని వున్న ఆరుసెంట్ల స్థలం దానికి రాసాడు మామయ్య. పొలాలు కొన్నారు. రెండు జీతాలు. ఉన్న వూళ్ళో ఇద్దరికీ వుద్యోగాలు. చక్కగా ఇద్దరు పిల్లలు. రాజభోగం అనుభవిస్తోంది అది” అంది అక్కసుగా. ఆవిడకి మనవరాలంటే గీతే. మిగిలినవాళ్ళు ఆమె తర్వాతే.
“అదేం లేదు అమ్మమ్మా! సుమ ఏమీ మారలేదు. సుధీర్ని కాదందని గీత విషయంలో కొంచెం కోపం అంతే. నిన్న చాలాసేపు నచ్చజెప్పాను. నాది తప్పే. ఇలా బైటపడకూడదు. నీలిమతో జాగ్రత్తగానే వుంటాను” అంది మహతి.
కాసేపటికి సుమతి వచ్చింది.
“అదేంటే అలా వచ్చేసావు?” అడిగింది, కూతుర్ని కింద దింపి. ఆ పిల్ల మేఘనతో కలబడింది. “దీని అఘాయిత్యం కూలా!” అని విజ్జెమ్మ నవ్వసాగింది. మహతి ఇద్దర్నీ విడదీసింది.


సుదీర్ఘమైన ఏకాంతం మాధవ్‍కి, సుమతితో. అడగాల్సినవీ, మాట్లాడాల్సినవీ ఎన్నో వున్నాయి అతనికి. కూపేకాబట్టి ఇద్దరే వున్నారు. తుషారని సీటుమీద దింపాక నిమ్మళంగా కూర్చుంది సుమతి.
“ఇప్పుడు చెప్పవే, అసలు గీతతో గొడవేంటి మీకు? వాళ్ల పెళ్ళై పదేళ్ళైంది. సుధీర్ పెళ్ళికూడా అయింది. ఇద్దరికీ పిల్లలు. ఇంకా అదే కోపాన్ని చూపిస్తున్నారా?” అడిగాడు.
“ఆ విషయం తేల్చుకోవడానికే ఇంత ఖర్చుపెట్టుకుని నాతో వస్తున్నావా? గీత చెప్పిందా?” అడిగింది సుమతి.
“ఖర్చేమీ లేదు. ఎల్టీసీ పెట్టాను. గవర్నమెంటు ఇచ్చేస్తుంది. నిన్నొక్కదాన్నీ పంపడం యిష్టంలేక వస్తున్నాను. అలాగే అమ్మనికూడా తీసుకురావాలి. ఇద్దరమే వున్నాంకాబట్టి అడిగాను. దిగెయ్యమంటే దిగేస్తాను”
“నిన్నరాత్రంతా మహీ ఇదే చెప్పింది నాకు. ఇప్పుడు నీ వాయింపా?”
“వద్దైతే. చెప్పకు. అలా కోపాలు చూపించుకుంటూ అమ్మమ్మలూ, అవ్వలూ, తాతమ్మలూ ఐపోండి. మనమధ్య కోపాలేమిటి సుమా, ఎప్పుడో జరిగిపోయినవాటికి?”
“కోపమని నేను చెప్పానా? ? మా అమ్మ అనవసరంగా బ్లేమైందని బాధ తప్పిస్తే?”
“కౌంటర్ బ్లేమ్ గీతమీదకూడా పడిందికదా?”
“నిజంకాదా?”
“ఏ నిజం?”
“రవిమామ యింట్లో గీత ఏం చెప్పింది? మేం ఎక్కువ కట్నం అడుగుతామంది. వాళ్ళ నాన్న ఇవ్వలేడని చెప్పింది. తన పెళ్ళికోసం ఇల్లమ్మడం యిష్టం లేదంది. ఇవన్నీ అయాకకదా, వాసుని చేసుకుంటానన్నది? వాడంటే ప్రేమ వున్నదైతే మొదటే ఆ విషయం చెప్పాలి. వాసుని తప్ప ఇంకెవర్నీ చేసుకోనని తెగేసి చెప్పాలి”
“రవిమామకీ గీతావాళ్ల నాన్నకీ పడదు. ఆ విషయం నీకూ తెలుసు. పెద్దమామయ్యమీద అటాక్‍తో ఆయన ఆట మొదలుపెట్టివుంటాడు. గీత వాళ్ళ నాన్నమీద ఈగకూడా వాలనివ్వదు. అది డిఫెన్స్‌తో ఆట పూర్తిచేసింది. అప్పటికే వాళ్ళ నాన్నకి చెప్పిందట వాసు విషయం. రవిమామకీ చెప్పింది. మాకింకా తెలీదు. ఇక్కడ మాయింట్లో వాసుని పెళ్ళిచేసుకొమ్మంటే వాడు గీతని చేసుకుంటానన్నాడు. తనని సుధీర్‍కి ఇస్తారన్న అనుమానం మాకూ వుండేది. అలా జరిగితే నువ్వింక ఆ విషయం మర్చిపోవాలన్న కండిషన్ పెట్టి అమ్మ మామయ్యని అడిగింది. ఈ మొత్తంలో గీత తప్పేమిటో నాకు అర్థమవట్లేదు”
“అమ్మ సుధీర్ని చదివించమందనేకదా, గీత అలాంటి నిర్ణయం తీసుకుంది? అదేదో మామయ్యద్వారా బైటికి వచ్చివుంటే బావుండేది. పెద్దవాడుకదా, ఆయన చెప్తే అమ్మా, నాన్నా అంత బాధపడేవారు కాదు”
“ఏ విషయాన్నేనా మొదటిసారి చెప్పినప్పుడు మాత్రమే సంకోచాలూ, తడబడటాలూ, టైమింగ్ చూసుకోవటాలూ వుంటాయి. ఆ తర్వాత అది అన్ని విషయాల్లాగే మామూలుదైపోతుంది”
“అంటే?”
“మాయింట్లో గొడవలు నీకు కొంతవరకేనా తెలుసనుకుంటాను. మానాన్న మొదట్లో బానే వున్నా తర్వాత భక్తిలోపడి యిల్లూ అదీ పట్టించుకోవడం మానేసారు. ఒకసారి యిల్లొదిలిపెట్టి వెళ్లిపోయారు. త్రిమూర్తులుగారి సాయంతో మామయ్య ఆయన్ని వెతికించి తీసుకొచ్చాడు. ఆ సమయంలో మామయ్య మాయింటికి తరుచుగా వచ్చేవాడు. ఆయనతో గీతకూడా వచ్చేది. తను వాసు వెంటవెంట తిరిగేది. చిన్నతనంకాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కొంచెం పెద్దవాళ్లమయ్యాకకూడా గీత మాయింటికి వచ్చేది. వాసుగదిలో కూర్చుని ఇద్దరూ మాట్లాడుకునేవారు. వాడలా మంచంమీద మఠం వేసుకుని కూర్చుని వుంటే ఇది మంచానికి ఎదురుగా వున్న పెద్ద కిటికీలో మోకాళ్ళమీద తలాన్చుకుని ముడుచుకుని కూర్చుని వుండేది. ఏం మాట్లాడుకునేవారో తెలీదు. ఇద్దరే అలా గదిలో కూర్చోకూడదు, ఇవతలికి వచ్చి అందరిమధ్యనా కూర్చుని మాట్లాడుకోండి అని అమ్మ చూసి ఒకటిరెండుసార్లు కోప్పడింది. అది వాళ్లకి ఎలా అర్థమైందో, వాళ్ళిద్దరూ ఏమనుకున్నారోగానీ, మాటలు మానేసారు. చాలారోజుల తర్వాత వాసు దగ్గిర గీత ఫోటో చూసాను. ఇంటరు ఎగ్జామ్స్‌కోసం తీయించుకున్న ఫోటో. పర్సులో రహస్యంగా దాచుకున్నాడు. వాళ్ళు బాహాటంగా చెప్పుకోలేదుగానీ, నిజంగా వాళ్లమధ్య హాస్యాలూ, పరిహాసాలూ వుంటే మనకి ఎంత ఇబ్బందిగా వుండేది? ఇంత ఆరోగ్యకరమైన స్నేహం సాధ్యపడేదా?”
సుమతి ఆలోచనలో పడింది. నిజమే. చాలా కట్టుదిట్టాల్లో పెరిగారు తామంతా. ముఖ్యంగా గీతకి చెడ్డపేరు రాకుండా వుండేందుకు. వాసుతో ఒక్కర్తీ కూర్చుని మాట్లాడటం గురించి ఇప్పుడే తెలిసింది. సుధీర్‍తో అలా ఎప్పుడూ మాట్లాడలేదు. మరి వాడలా ఎలా అనుకున్నాడు? వాడిగురించి మాధవ్‍కి ఎలా చెప్తుంది? మహతికి చెప్పడమే తప్పు. పెదవి దాటిన రహస్యం పృథ్వి దాటుతుందంటారు. మహతి దగ్గిరే ఆపాలి దాన్ని. గీతతో సంబంధాలు పునరుద్ధరించుకోవడమంటే సుధీర్ని బాధపెట్టడమే. గీతని వాసుతో చూసి తట్టుకోలేడు వాడు. మానుతున్న గాయాన్ని రేపినట్టౌతుంది. తప్పనిసరై కలుసుకున్నరోజుల్లో నరకాన్ని చూసాడు. ఎంత అశాంతిగా వుండేవాడో, ఎన్ని కన్నీళ్ళని వొంపుకునేవాడో తనకి తెలుసు. “చిన్నప్పట్నుంచీ తెలిసిన పిల్లని, నేను ఆశలు పెంచుకున్నదాన్ని, పరాయిదాన్లా, తమ్ముడి భార్యగా, మర్యాదగా ఎలా చూడను?” అని తల్లడిల్లేవాడు.
“అదే యింట్లో వున్న మరో మనిషిని నేను. నాకూ మరదలేకదా? నాతో ఎప్పుడూ చనువుగా వుండలేదు తను. మిగిలినవాళ్లలాగే నన్నూ చూసేది. సుమా! తను చాలా బాధపడుతోంది. జరిగినవాటిపట్ల అపరాథభావన తనలో కనిపించింది నాకు. చాలా సున్నితమైన విషయం యిది. నలుగుర్లో చర్చించి తనది తప్పులేదని చెప్పి వప్పించేలాంటిది కాదు. ఎవరికివాళ్లం అర్థం చేసుకోవాలి” అన్నాడు మాధవ్.
“కొన్నికొన్ని విషయాలు పైకి కనిపించినంత సాధారణంగా వుండవురా. వాటిలో చాలా సంక్లిష్టత వుంటుంది. కొంత గోప్యంగా వుంటేనే మంచిది” అంది సుమతి నర్మగర్భంగా. “మేమెవ్వరం గీతని తక్కువ చేసి చూసింది ఎప్పుడూ లేదు. ఎప్పటికీ అది మనిళ్ళకి మహరాణీయే. పెద్దమామయ్య వారసురాలే. ఏవో సోషల్ యాక్టివిటీస్‍లో వుందికదా? పన్నెండుమంది పిల్లల్ని జెనరల్ చెకప్‍కోసం బావ దగ్గిరకి తీసుకొచ్చింది. మయూఖ్ చదివే స్కూల్లో చదువుతున్న పేదపిల్లలట. ఫీజు ఇస్తానంది. బావ కోప్పడి, వద్దన్నారు. వాళ్లకి చెకప్ జరుగుతున్నప్పుడు తను లోపలికి వచ్చి కూర్చుంది. ఒక్కమాట ఎవరమేనా అంటే మీదపడి రక్కేసినంత పనిచేసేది. పరాయిదాన్లా హాలు దాటి రాలేదు. పొడిపొడిమాటలు మాట్లాడింది. ఎందుకురా, దానికంత పొగరు? దాని పద్ధతిలో అది దెబ్బలాడెయ్యచ్చుకదా? ఎదురుపడితే చాలు, సుమంతైతే దాన్ని రెచ్చగొట్టడానికి వదినా అని పిలిచి వస్తాడు. అది పలుకుతుంది. పేద్ద… డిస్టెన్స్ మెయింటెన్ చేస్తోంది… డిస్టెన్స్…” అంది తనే మళ్ళీ. ఆమె మాటలు ఎంత సాదాగా వున్నా, వాటి వెనుక యింకేదో వుందనిపించింది మాధవ్‍కి. ఆ విషయం అతను గ్రహించాలనే సుమతి కోరికకూడా.
“బేగులో డబ్బులు పెట్టుకుని బయల్దేరిందంటే ఇంకో డాక్టరు దొరకడంటే, తనకి? అందరు పిల్లలని తీసుకుని ఇంతదూరం రావాలా? నిన్ను చూడాలనిపించి వచ్చి వుంటుంది” అన్నాడు. సుమతి తలదించుకుంది. కళ్ళు తడయ్యాయి. పొగమంచు కప్పేసినట్టున్న వుదయపు దృశ్యాలు నెమ్మదినెమ్మదిగా మంచు విడి కనిపిస్తున్నట్టు అన్నీ తెలుస్తున్నాయి. కానీ కాళ్లకి అడ్డుపడే బంధాలు అలానే వున్నాయి. అస్పష్టతకీ, దృశ్యమానతకీ పెద్ద తేడా కనిపించలేదు.


1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.