ఝరి – 51 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“ఓరోజు ఆఫీసునించీ వచ్చేసరికి గొడవ. ఆరోజు వసంత్ యింటికి వెళ్ళి అట్నుంచీ బైటకెళ్ళి భోజనం చెయ్యాలనుకున్నాం. వాసుని అడిగితే ఆఫీసులో పనుందని లేటౌతుందన్నాడు. గీతకి అసలు ఆ విషయం తెలీదు. మామూలుగా వంట చేసేసింది. అమ్మ తులసి దగ్గిరకి వెళ్ళింది. ఆ అదును చూసి నీలిమ నోరు జారింది.
తిండికి మొహం వాచినట్టు ఆఫీసునుంచీ రాగానే ఓ కుంభం వండి పారేస్తుంది- అని ఇంకేదో చులకనగా అంది”
“అంతమాట అందిరా? నోట్లో నాలుకే లేనట్టు వుంటుంది? ముగ్గురాడపిల్లల పెళ్ళిళ్ళు చేసాడు వాళ్ళ నాన్న. మనింట్లో కట్నాలవీ లేవుకాబట్టి తేలిగ్గా బైటపడ్డాడుగానీ లేకపోతే పుస్తీపూసా అమ్ముకోవలసిన పరిస్థితి”
“… వాసు విన్నాడు ఆమాటలు. ఆఫీసులో కరెంటుపోయిందట. ఇంక పని సాగదని వచ్చేసాడు. వాడికి సాధారణంగా కోపం రాదు. వస్తే ప్రళయమే.
చూడమ్మాయ్, మేం అన్నం తినే బతుకుతాం. మా తమ్ముడు కూడా అన్నమే తింటాడు. మీయింట్లో గాలి తినే అలవాటేమో! నువ్వు కావాలంటే అన్నం మానెయ్ కానీ వాడిని మాడబెట్టకు- అని నీలిమని కోప్పడి,
ఇకనుంచీ మనకి మాత్రమే చెయ్యి. వాళ్ళకి కావాలంటే వాళ్ళు వండుకుంటారు. లేకపోతే మానేస్తారు. వాళ్ళిష్టం- అని గీతకి చెప్పేసాడు. భోజనాలు చేసేసి, మిగిలినవి పనామెని తనే పిలుచుకొచ్చి యిచ్చేసాడు. వాసు కోప్పడ్డాడని ఏడుస్తూ పడుక్కుంది నీలిమ. ఈ గొడవకి అటు మేం బైటికీ వెళ్ళలేదు. ఇటు ఇంట్లోనూ తిండి లేదు. అమ్మ తులసిదగ్గిర్నుంచీ వచ్చేసరికి అదీ రెండువంటల కథ. తర్వాత నెలకి ట్రాన్స్‌ఫరైంది. ఈలోగా మొహం చెల్లక నీలిమ పుట్టింటికి వెళ్ళికూర్చుంది” అన్నాడు. ఇంకా పెద్ద గొడవలయ్యాయి. అవి చెప్పలేదు మాధవ్. చెప్పడానికి సిగ్గనిపించింది.
“నువ్వెలా వూరుకున్నావురా, నీలిమ గీతని అలా అంటుంటే?”
“అక్కచెల్లెళ్ళు వాళ్ళు ముగ్గురికి ముగ్గురే. వినరు సుమా! చెప్పినకొద్దీ యింకా గొడవ. వాళ్ళమ్మకూడా నీలిమనే కోప్పడుతుంది. పెళ్ళంటూ చేసుకున్నాక తెంపుకు పోలేముకదే?” అని, కొద్దిగా ఆగాడు.
సుమతి అతను తర్వాతేం చెప్తాడోనని కుతూహలంగా చూసింది.
“ఒక మనిషిని ప్రేమించడమంటే వాళ్ళలో వున్న మంచినిమాత్రమే ప్రేమించడం కాదు. వాళ్లలో మనకి అనువుగాలేని విషయాలకి కొంత రాజీపడి, చెడు అనిపించినవాటిని సరిచెయ్యాలి. అప్పటికీ యిప్పటికీ నీలిమ చాలా మారింది. పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలందరికీ కొద్దోగొప్పో అభద్రత వుంటుంది. కోడలంటే కూడలి అని అర్థం. ఆ పదాన్ని మనిషికి ఎందుకు, ఎప్పుడు వర్తింపచేసారో తెలీదు. పెళ్ళితో ఆడపిల్ల ఒక కూడలిలోకి వచ్చి చేరుతుంది. అక్కడ అప్పటికే ఇంకొంతమంది కోడళ్ళు, రెండుమూడు తరాలకి చెందినవాళ్ళు వచ్చి చేరి వుంటారు. వాళ్లంతా చేరి ఒక ఇంటిని ఆధారంగా చేసుకుని, కుటుంబాన్ని నడుపుతుంటారు. వాళ్లతో కలిసిపోయి నడవాలి. స్థూలంగా చెప్పాలంటే దీని పేరు సాంప్రదాయం. దాన్ని పాటించాలా వద్దా అనే విషయంలో వుండే స్వేఛ్ఛ చాలా తక్కువ. తనొచ్చిన యీ యిల్లు తన పుట్టింటిలా మారిపోవడం సాధ్యం కాదన్న విషయం నీలిమకి అర్థం కాదు. మార్చెయ్యాలన్న నిరంతర ప్రయత్నం”
“…”
“అందులోనూ మనది ఇంత పెద్ద కుటుంబం. ఇవికాక గీత పుట్టింటి చుట్టరికాలన్నీ మాకు అనివార్యమైనవి. గీత మేనమామలు తులసినీ గీతని చేసినట్టే ముద్దుచేస్తారు. అమ్మని గౌరవిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చేస్తే అత్తకీ, గీతకీ సౌఖ్యమో అవన్నీ నిస్సంకోచంగా చేస్తారు. నీలిమ ఈమధ్యలో ఇమడలేదు. పరాయిదాన్నని అనుకుంటుంది. ఐతే నా ప్రశ్న ఒక్కటే. తను మారటం అంటే అందర్నీ కలుపుకుపోవటం. నేను మారటమంటే బంధాలని తెంచుకోవడం. ఈ క్రాస్‍రోడ్స్‌లో వున్నాం. ఏది మర్చిపోగలను సుమా?”
“…”
“మీయింట్లో చాక్లెట్లు, బిస్కెట్లు దొరికేవి. ప్రహ్లాద్ వాళ్ళ నాన్న జోక్స్ వేసి నవ్విస్తునే, నవ్వుతూనే అల్లరిచేస్తే మందలించి దార్లో పెట్టేవారు. జెండర్ అవే‍ర్‍నెస్ లేని వయసునించీ, ఎవరేమిటో తెలుస్తున్నప్పట్నుంచీ వెంటవెంట వుండి అన్నీ చెప్తూ నడిపించాడు రవిమామ. ఐస్‍ప్రూట్ బండివెనక సైకిల్ వేసుకుని వెళ్ళి, వాడిని దొరకబట్టి ఇంటికి తీసుకొచ్చి మనందరికీ తలోటీ కొనిచ్చేవాడు రాణావాళ్ళ నాన్న. ఆఖరికి మహీవాళ్ళ నాన్న తిట్లనీ, వసంత్ వాళ్ళ నాన్నతో ఆడిన గల్లీక్రికెట్‍నీకూడా సమంగా ఆస్వాదించాం. వీళ్ళంతా మనకి బిల్డింగ్ బ్లాక్స్. పరాయివాళ్ళు, మనకేమీ కారని ఎలా అనుకోగలం?” అన్నాడు.
సుమతి ఓదార్పుగా అతని చేతిని పట్టుకుంది. మనుషులు పెద్దవాళ్ళవడం వలన అవగాహన పెరిగి, చిన్నప్పటి పొరపాట్లు మళ్ళీ చేయ్యకుండా వుండాలి. బాధ్యత పెరగాలి. సంతోషానికి మూలాలు ఎక్కడుంటాయో తెలియాలి. కానీ బాధలు పెరగటమేమిటి? ఎక్కడుంది లోపం? ప్రహ్లాద్ యింట్లో అత్తాకోడళ్ళకి పడదు. మొదటితరం అక్కచెల్లెళ్ళు ఆరుగురూ పెద్ద గొప్పగా ఏమీ పెరగలేదు. సర్దుకుంటూ, సామాన్యమైన జీవితాలే గడిపారు. గొడవలు పెట్టుకునే మనస్తత్వం ఎవరికీ లేదు. అరుణ పిన్ని చాలా సుకుమారం. బాబాయ్ పిన్నిని చాలా గొప్పగా చూస్తాడు. భార్యాభర్తలంటే ఇలానే వుండాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. భరించలేకపోవడం ప్రహ్లాద్‍ని కాదు. అతను వాళ్ళ కొడుకు. భరించలేకపోవడం మాధురిని. ఆమె, వాళ్ళని. వేరుపెట్టేసారు. వసంత్ విషయంలోనూ అంతే జరిగింది. మానస కట్నం తేలేదని పిన్నికీ బాబాయికీ కోపం. తమింట్లో పరిస్థితి వేరు. తన పెళ్ళి, మిగిలిన ఖర్చులు, అప్పులకోసం యిల్లు అమ్మేసారు అమ్మానాన్నలు. సుధీర్ వుద్యోగంలో చేరాక కొంత డబ్బు దాచి ఇస్తే దానిమీద రిటైర్‍మెంటు బెనిఫిట్స్‌లోంచీ కలుపుకుని ఫ్లాట్ తీసుకున్నారు. కొన్నాళ్ళు సుమంత్ వాళ్ళతోనే వుండేవాడు. ప్రాక్టీసు పెరగడంతో ఇంటికీ, ప్రాక్టిసుకీ, లాబ్‍కీ కలిపి తీసుకున్నాడు. వాళ్ళ అత్తమామలు కొంత సర్దారు. కారణాలు ఏవైనా ఒక్కో యిల్లూ రెండేసి, మూడేసిగా చీలిపోయింది. అనుబంధాల్లో సాంద్రత తగ్గింది. ఫంక్షన్స్‌కి అదో ఫార్మాలిటీగా కలుసుకుని విడిపోవటమేతప్ప, మనసు యిప్పి మాట్లాడుకోవడం తగ్గింది. తనుమాత్రం? ఒక కకూన్‍లో వుండినట్టు వుండిపోలేదూ?
“నువ్వేంట్రా, మహతి భర్తని కొట్టడానికి వెళ్ళావట? రవళి చెప్పింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగే మాధవ్‍కి అంత కోపం రావటం వింతనిపించిందీ అని అది ఒకటే నవ్వు” అడిగింది మాటమార్చి.
“గొడవలు ఎన్నున్నా కొట్టేస్తాడేమిటే, దాన్ని? గీత వెనక్కి లాగిందిగానీ లేకపోతే దెబ్బలు తినటంలోని బాధా అవమానం ఏమిటో రుచిచూపించేవాడిని” కోపంగా అడిగాడు.
“ఇంక వాళ్లంతేనా? విడిపోవటం ఒక్కటేనా దారి?” సుమతి గొంతులో బాధ ధ్వనించింది.
“రాత్రివేళ యిల్లొదిలిపెట్టి వచ్చేసి, ఒక రాత్రంతా చంటిపిల్లని పెట్టుకుని ప్రయాణం చేసిన మనిషిని మళ్ళీ అక్కడికి పంపిస్తామా? అలా పంపిస్తే దాన్ని తిరిగి కళ్ళచూస్తామా? ఆరోజు అది మాయింటికి వచ్చినప్పటి వాలకం, ఏడ్చిన ఏడుపు నా జన్మలో మర్చిపోను. అది యింకోమాట ఏమందో తెలుసా? నా దగ్గిరకి రావాలని ముంబై రాలేదట. ఆగి వున్న రైలు ముంబైది కాబట్టి ఇక్కడికి వచ్చిందట. లేకపోతే డిల్లీయో, కలకత్తాయో వెళ్ళిపోదామనుకుందట ఒక్కర్తీ ఆడపిల్లని తీసుకుని. అబ్బ! తలుచుకుంటేనే భయం వేస్తుంది. రాత్రంతా అది మరే పిచ్చిపనీ చెయ్యకుండా ఒకాయన కాసుకున్నాడట. ఆయన గట్టిగా నిలదీసాడట, ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ మీకెవరేనా వున్నారా, లేకపోతే తిరిగి తీసుకెళ్ళి మీవాళ్ళకి అప్పజెప్తానని. అప్పుడింక తప్పనిసరై నా పేరు చెప్పిందట. నా ఫోన్ నెంబరుకూడా తనదగ్గిర లేదు. అడ్రెసూ తెలీదు. గీతకి చేసి నాకు చెప్పమందట” అన్నాడు. అతని గొంతులో ధ్వనించిన బాధని ఆమె పూర్తిగా ఆస్వాదించింది. గుండె బరువెక్కింది.
చాలాసేపు మాట్లాడుకోవడంతో ఇద్దరూ అలసిపోయారు. మనసులో వున్నవన్నీ బైటికి రావటంవలన తేలిగాకూడా వుంది. మాధవ్ మనసులో వున్న చిన్న అనుమానం తప్ప. తుషార నిద్రపోతోంది. మాధవ్‍తో మాట్లాడుతూ వున్నప్పుడే ఆ పిల్లకి పాలుపట్టడం, పడుకోబెట్టడం అన్నీ అయ్యాయి.
“ఇది లేస్తే నన్ను పడుకోనివ్వదు. కాసేపు పడుకుంటాను. నువ్వూ పడుక్కోరా! ఇన్ని డబ్బులూ పోసి ఫస్ట్‌క్లాస్ టికెట్టు కొనుక్కున్నది కూర్చుని వెళ్ళడానికా?” అంది సుమతి. పడకకి వుపక్రమించింది.
“నువ్వు పడుక్కోవే. పిల్ల లేస్తే నేను చూసుకుంటాను” అని పేపరు తీసుకుని కూర్చున్నాడు మాధవ్.
మర్నాడు వీళ్ళు స్టేషన్లో దిగేసరికి కారు రెడీగా వుంది. ఇంటికి వెళ్ళారు. పెద్ద యిల్లు. ముందువైపు క్లినిక్, పక్కనుంచీ ఇంట్లోకి దారి. అది సుమతి ప్రపంచం. అప్పటికే ఆమె భర్త బిజీగా వున్నాడు.
“మనిద్దరికీ కాఫీ తెస్తాను” అని లోపలికి వెళ్ళింది సుమతి. వంటమనిషికి పురమాయింపులు చేసి వచ్చేలోగా మాధవ్ దృష్టి హాల్లో ఒకమూలకి వున్న పెద్ద ఫ్రిజిమీద నిలిచింది. ఒక్కక్షణం ఆలోచించి డోర్ తెరిచాడు. కూల్‍డ్రింక్సు, కొన్ని ఏవో మందులు…తను అనుకున్నవేవీ లేవు. వెనకనుంచీ వచ్చి, వీపుమీద ఒక్కటి చరిచింది సుమతి. సరిగ్గా అప్పుడే వీళ్ళొచ్చారని తెలిసి వీలుచేసుకుని లోపలికి వచ్చాడు సుమతి భర్త, జో.
“అదేమిటి, అంత దెబ్బకొట్టావు అతన్ని?” కంగారుగా అడిగాడు.
“చాక్లెట్లకోసం వెతుక్కుంటున్నట్టున్నాడు” అని విరగబడి నవ్వింది సుమతి. “నువ్వు వెతుకుతున్న వస్తువులు మాయింట్లో వుండవురా! ఒకవేళ వున్నా యిలా హాల్లో ఫ్రిజిలో పెట్టుకోరు. బెడ్‍రూమ్‍లో దాచుకుంటారు. అక్కడకూడా వెతుక్కుని రా!” అంది ఇంకా నవ్వుతూనే.
“ఏమిటి?” అయోమయంగా అడిగాడతను.
“నాకు ఇక్కడ టైంపాస్ ఎలా ఔతుందని అడిగాడు. అన్నీ చెప్పి, పార్టీలగురించి కూడా చెప్పాను. అప్పటికే వీడిని మిస్ చేసినందుకు దు:ఖంతో కూడిన ఆనందభాష్పాలు వచ్చేసాయి. వీడు దాన్ని మరోలా అర్థం చేసుకుని, ఇంతదూరం నావెంట వచ్చాడు” అంది ఇంకా నవ్వుతునే.
“దు:ఖంతోకూడిన ఆనందభాష్పాలా? విరోధాభాసలు ఇలా వుండవమ్మా!” అన్నాడు మాధవ్. “ఎలా భరిస్తున్నారు బావా, దీన్ని? చిన్నప్పుడైతే మా అందరి వీపులూ పగలగొట్టేసేది. ఇంకా ఆ అలవాటు పోలేదంటే…” అని నవ్వుతూ సందిగ్ధంగా ఆగాడు.
“మీరు తనకి అన్నా, తమ్ముడా?” అని అడిగాడు జోగేశ్వర్రావు. అన్నైతే మర్యాద యివ్వాలి, తమ్ముడైతే ఓ ఆట ఆడుకోవచ్చని.
“వాసు, సుధీర్ తప్పించి మిగతావాళ్ళంతా నాకు తమ్ముళ్ళే. మీకేం సందేహం అక్కర్లేదు” అని హామీ యిచ్చింది సుమతి. ఆ హామీ దేనికో అర్థం కాలేదు మాధవ్‍కి. భార్యాభర్తలిద్దరూ ముఖాలు చూసుకుని నవ్వుకున్నారు.
ఒక్కర్తినీ పంపడం దేనికని వచ్చాననబోయి ఆగాడు మాధవ్. అది అర్థం లేనిమాట. “నాకిక్కడ కొద్దిగా పనుంది. నిజానికైతే వచ్చే నెల రావాలి. కంపెనీ వుందని సుమతితో వచ్చేసాను” అన్నాడు. అతను సంతోషించినట్టు తలూపాడు. తుషార తండ్రిమీదికి దూకింది. అతను ఎత్తుకుని ముద్దుచేసి తిరిగిచ్చేసాడు. నానీ వచ్చి తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి.
సుమతి ప్రపంచాన్ని చూసాడు మాధవ్. పుస్తకాలు, బొమ్మలు, భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడానికి కస్టమైజ్ చేయించుకున్న వుయ్యాల, పుస్తకాలు చదువుకోవడానికి ఆమె సృష్టించుకున్న కార్నర్‍స్పేసెస్… వంటరితనం అనుకోకపోతే ఇమిడిపోవటానికి అందమైన వాతావరణం. ముంబై వచ్చినప్పుడు ఆమెలో వున్న బెంగ, తిరిగొస్తున్నప్పుడు ఆమె రైల్లో చూపించిన దు:ఖం అవేవీ యిప్పుడు లేవు. తుళ్ళిపడుతున్న ఆనందపు తరంగంలా వుంది. సమూహంలోంచీ విడివడి వచ్చాక కొంత దు:ఖంతోపాటు చాలా సంతోషం వుంటుంది. నెమ్మదిగా ఆ దు:ఖపు స్థానాన్ని ఈ సంతోషం ఆక్రమించుకుంటూ వెళ్ళి పూర్తి ఆనందంగా మారిపొతుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణమైన కుటుంబానికి ఆలంబన ఔతాడు. తనుకూడా సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకోవాలి. విడిపోవటం అనివార్యమైనచోట కొత్తసంతోషాలు పుట్టడంకూడా అనివార్యం కావాలి.

1 వాసు, గీత – భార్యాభర్తలు, మేనత్తమేనమామ పిల్లలు. మయూఖ్, విహంగ్ గీతావాసుల పిల్లలు. రామారావు గీత తండ్రి.
2 ప్రమీల – రామారావు పెద్ద చెల్లెలు. సుధీర్, సుమతి, సుమంత్ ఆమె పిల్లలు. భర్త గురుమూర్తి.
రమ – సుధీర్ భార్య. వ్యాస్, హాస్ వాళ్ళ పిల్లలు. సరళ ఆమె తల్లి. సుమతి భర్త జోగేశ్వర్రావు.
3 లక్ష్మి – రామారావు రెండో చెల్లెలు. వాసు, మాధవ్, తులసి ఆవిడ పిల్లలు. నీలిమ మాధవ్ భార్య. పంకజ్ కొడుకు.
4 నిర్మల – రామారావు మూడో చెల్లెలు. నారాయణ ఆమె భర్త. మహతి, రవళి ఆమె కూతుళ్ళు.
నరేంద్ర, మహతి భర్త, మేఘన కూతురు. విజయ నరేంద్ర రెండో భార్య. హరి, ఇందిర ఆమె పిల్లలు.