ఝరి – 54 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. మహతికి అతనితో తన పెళ్ళైనప్పటి రోజులు గుర్తొస్తుంటాయి. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన.


“పిల్లలకి పెళ్ళిళ్ళు చేసాం. వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు. మీకెందుకు తాపత్రయం? ” అంటుంది ఆయన భార్య, కమలాక్షి.
“అదికాదే! నీలిమ బావగారికి బోల్డంత వుంది. మేనమామ పెడతాడు. భార్యకికూడా వుద్యోగం. లోన్లొస్తాయి. ఇంకోచోట యిల్లుకొనుక్కుని వెళ్ళచ్చుగా? ఈ యిల్లు పట్టుకుని వేలాడటం దేనికి? తమ్ముడికి వదిలెయ్యచ్చుగా? వాళ్ళక్కడ అద్దెలకి పోస్తుంటే వీళ్ళు ఇంత యిల్లూ అనుభవిస్తున్నారు” అన్నాడు.
“ఎవరికి వుండేవి వాళ్ళకి వుంటాయి. చాలడానికి ఎక్కడ? ఎక్కువ వున్నాయని ఇళ్ళూ వాకిళ్ళూ ఎవరు వదులుకుంటారు? అలా వుండటాన్ని అదృష్టం అనుకుంటారు. పెళ్ళిళ్ళు చేసాక ఆడపిల్లల బతుకుల్లో తలదూర్చకూడదు. మానస చెప్పింది అదేకదా? అక్కడ పెత్తనాలు చేసేవాళ్ళు వేరేవుంటారు. మనమాట ఎవరు వింటారు? ఎందుకు వింటారు? ఆస్తులు వాళ్లవి, వాటికి సంబంధించిన నిర్ణయాలుకూడా వాళ్లవే వుంటాయి. చూసిచూసి బైటివాళ్ళకి పెత్తనం ఎందుకిస్తారు? వీళ్లని వేరే వెళ్లమని ఎవరేనా అన్నారా? మీ కూతురు ఇమడలేకపోయింది. అల్లుడి కాళ్ళకింద అగ్గిపోసింది. ఎటూ చెప్పలేక ట్రాన్స్‌పర్ చేయించుకున్నాడు. తెలివైనదైతే ఆమధ్యలో తనూ నిలదొక్కుకోవాలి. పెళ్లై కొత్తగా వెళ్లేచోటు పుట్టింటిలా ఎందుకుంటుంది? సర్దుకోవాలి. సర్దుకుంటూనే పరిస్థితులని సానుకూలంగా మార్చుకోవాలి” అంటుంది. ఆవిడకి భర్త చెప్పే మాటలు విసుగు. ఆవిడ వినదని కూతుళ్ళకి చెప్తాడు. వాళ్ళు ఆ ఆలోచనలకి పిల్లలని పుట్టిస్తారు. ఇప్పుడు పుట్టినవి అలాంటివే.
బేధాలనేవి రాకూడదు. వస్తే చూసే ప్రతిదృశ్యం మారిపోతుంది. మామాఅల్లుళ్ళు మాట్లాడుకుంటారనుకున్నాడు వాసు. తనేమీ మారలేదని నిరూపించుకోవలసిన అవసరం మాధవ్‍ది. “అందరం నడవలో పడుక్కుందాంరా వాసూ! మనం కబుర్లు చెప్పుకుని చాలాకాలమైంది. మా
ఎన్‍క్లోజర్లుంటే గదుల్లోనేగా, మగ్గేది? మళ్ళీ మాకు పొద్దున్నే రైలు” అన్నాడు. వాసు నవ్వి, మంచాలు తెచ్చి వెయ్యడం మొదలుపెట్టాడు.
“మేంకూడా మీ దగ్గరే” అన్నారు వాసు పిల్లలు. వాళ్ళతో తన కొడుకు లేకపోవటం మాధవ్‍కి బాధనిపించింది. వీళ్ళకి తమ్ముడు, ఈ యింట్లో వాడూ ఒకడు. కాని ఎక్కడో పెరుగుతున్నాడు! చుట్టపుచూపుగా వస్తూ, చుట్టంగా మారిపోయాడు. గుండెలు పిండేసినట్టైంది.
మాధవ్, వాసు మంచాలూ, పరుపులూ తెస్తుంటే వాళ్ళు దిళ్ళూ, దుప్పట్లూ తెచ్చారు. ఐదు నవారుమంచాలు తెచ్చి వరసగా వేసినా యింకా చాలాచోటు మిగిలింది ఆ గదిలో. అన్నదమ్ములు, పిల్లలు మాట్లాడుకుంటుంటే ఆయన ఎత్తైన పైకప్పుకేసి చూస్తూ పడుక్కున్నాడు. మూడు మూడుతరాలని చూసి కూడా పటిష్ఠంగా వున్న, విశాలమైన ఆ యిల్లు నీలిమకి దఖలైతే బావుంటుందన్న కల నెమ్మదిగా ఆయన్ని నిద్రలోకి జార్చింది. అంతలోనే వాసు మాటలకి ఠక్కుమని మెలకువ వచ్చేసింది.
“జీతం ఏం చేస్తున్నావురా? కిడ్డీబేంకు కొనుక్కుని అందులో దాచుకుంటున్నావా?” అడిగాడు వాసు, తమ్ముడిని. మాధవ్ నవ్వేసాడు ఆ మాటలకి. చెప్పేస్తాడా ఏమిటని కంగారుపడ్డాడు కుటుంబరావు.
“నువ్వు చెప్పినట్టే జీపీయఫ్‍లోనూ, పీపీఎఫ్‍లోనూ వేస్తున్నాను. మిగిలింది బేంకులో వుంది. ఈమధ్య నీలిమ ఏదో బంగారం కొనుక్కుంది” అన్నాడు మాధవ్. ఇతను యిలా చెప్పేస్తున్నాడేమిటి? సర్దమని అడుగుతాడేమో, వాసు? కలవరపడిపోయాడాయన.
“విను, ఒకటో రెండో స్థలాలు తీసుకో. కట్టుకుని వుండేలా ఒకటి కొనుక్కుని, సిటీకి కాస్తదూరంలో రెండోది కొనుక్కుంటే ధరలు పెరిగినప్పుడు అదీ, పంకజ్‍కి మేమిచ్చినదీ అమ్మేసి యిల్లు కట్టుకోవచ్చు. ఇకమీదట ఆ పనిమీదే వుండు. పీపీయఫ్ వాడి చదువుకి వదిలెయ్. ఇదివరకూ ఎవరిదగ్గరా డబ్బు పెద్దగా వుండేదికాదు. ఈ కొనుగోళ్లవీ ఎక్కువగా జరిగేవి కాదు. ఇప్పుడలాకాదు. రిటైరయ్యేవాళ్లకి బాగానే వస్తున్నాయి. చిన్న కుటుంబాలయ్యేసరికి బాధ్యతలు తీరి వచ్చిందంతా మిగుల్తోంది. డబల్ ఇన్‍కం గ్రూపుకూడా బాగా పెరిగారు. పిల్లలు బైటికి వెళ్ళి సంపాదించి పంపిస్తున్నారు. సుధీర్నీ, కృష్ణనీ మనం చూస్తున్నాంకదరా? వాళ్ళ మిగులు డబ్బంతా ఇళ్ళమీదా, స్థలాలమిదా పెడుతున్నారు. భూమికి డిమాండు బాగా పెరిగింది. నిన్న కొనాలనుకుని వదిలేసిన స్థలం ఇవ్వాళ కొనడానికి అందడం లేదు” అన్నాడు వాసు.
“ఔన్రా! నాకూ అనిపించింది. ముంబైలో వున్నాను. ఇక్కడికి రావాలని వుందనుకో, ట్రాన్స్‌ఫర్ ఇవ్వకపోతే? ఎప్పుడు ఎక్కడ వుంటానో తెలీదుకదా? అందుకే ఏదీ అనుకోలేకపోతున్నాను” అన్నాడు మాధవ్.
“ఆయన నిద్రపోతున్నాడు. పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం” అంటూ లేచి వెళ్ళాడు వాసు. మాధవ్ అనుసరించాడు. వాళ్ళు చెప్పుకునేవి తనకి వినపడవని బాధపడ్డాడు కుటుంబరావు. వినాల్సిందైతే విన్నాడు. గుండె మండిపోయింది.
అన్నదమ్ములు మహతి విషయం మాట్లాడుకున్నారు. ఇద్దరికీ చాలా బాధనిపించింది. కాసేపటికి మాటలు ఆగాయి. కానీ వాసు అలానే కూర్చున్నాడు. తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని.
“ఏమిట్రా, వాసూ?” అడిగాడు మాధవ్.
“గీత…” అన్నాడు వాసు.
“వదినకేమైంది?” కంగారుపడ్డాడు మాధవ్.
“ఏమీ లేదుగానీ, మేంకూడా మీ అందర్లా ఈ వూరు వదిలేసి కొన్నాళ్ళేనా దూరం వెళ్ళాల్సిందేమో! మనింట్లోనూ, వాళ్ళింట్లోనూ అందరూ పెద్దవాళ్ళు. నేను వెళ్ళిపోతే ఎలా అనుకున్నాను. గీత మరీ అటాచిమెంట్సు పెంచేసుకుంది. మీ అందర్నీ మిస్సౌతోంది. హరిచందన్నికూడా తను మర్చిపోదు. పైకి నవ్వుతూ బానే తిరుగుతుందిగానీ రెండు పొరలుగా వుంటోంది తన అంతరంగం. ఆ లోపలి పొరలోంచీ వచ్చే దు:ఖపుచెమ్మ ఒకొక్కసారి తెలిసిపోతోంది. వాళ్ళ అమ్మమ్మా తాతయ్యలు పోయారు. ఇటు మన మామ్మ, నాన్న పోయారు. వీళ్లందరిగురించి ఆలోచిస్తుంది. పైకి తేలదు. అదంతా లోలోపలి వ్యవహారం. ఈమధ్య డ్రైవింగ్ నేర్చుకుంటాను, కారు కొనమంది. ఇంత హఠాత్తుగా ఎందుకు అడిగిందో అర్థమవ్వలేదు.
సుమతి కారు నడుపుతూ తిరుగుతోందికదూ, దీనికీ అనిపించిందేమో- అంది అమ్మ. అప్పటికి నాకు అర్థమైంది. కారు కొనడం సమస్య కాదు. కానీ సుమతిని దూరం చేసుకోలేకపోతోంది. మహీగురించి బాధపడుతోంది. సుధీర్, రాణా, సుమంత్ వీళ్లందరిగురించీకూడా ఆలోచిస్తుందనుకుంటాను. కానీ వాళ్ళ ఆలోచనల్లో తనుండదు. అదీ గొప్ప విషాదం”
మాధవ్ నిట్టూర్చాడు. “పిల్లలు చాలామందే అయారుకదూ?” అడిగాడు. వాసు తలూపాడు.
“అంత డబ్బు ఎక్కడ్నుంచీ వస్తోంది? చాలుతోందా, అసలు మీకు?”
“ఖర్చులేమున్నాయి?”
“అరేయ్, చిన్నప్పుడు స్నేహితులే ప్రాణం అన్నట్టు తిరుగుతాం. ఒకొక్కడూ వాళ్ల నాన్నలకి ట్రాన్స్‌ఫర్లై వెళ్ళిపోతుంటే బాధపడతాం. కొత్త స్నేహితులు చేరతారు. కొత్తసంతోషాలని యిస్తారు. ఒకప్పుడు ప్రాణం అని తిరిగినవాళ్ళు మళ్ళీ ఎదురుపడ్డా, మామూలు పరిచయస్తుల్లా పలకరించుకుని వూరుకుంటాం. మనం అవలా? భార్యా, పిల్లలూ, కుటుంబం అనేవి ప్రథమస్థానంలోకి వచ్చేస్తాయి. సుమతేనా అంతే, నేనేనా అంతే. దేవుడి దయవల్ల మనకి బాధలు సమస్యలూ ఏవీ లేవు. మామయ్య కూతురవడాన్న మరీ ఆయనలా ముసలమ్మ వైరాగ్యాలు చూపిస్తే కుదరదని ఆవిడకి అర్థమయ్యేలా చెప్పు. పిల్లలని వెంకటలక్ష్మికి అప్పజెప్పి కొన్నాళ్ళు ఎటేనా తిరిగిరండి ఇద్దరూను ” అన్నాడు మాధవ్. వాసు నవ్వాడు. సమస్య వుందనికాదుగానీ, తమ్ముడితో పంచుకుంటే బరువు తగ్గినట్టైంది వాసుకి.
మర్నాడు పొద్దున్నే మాధవ్ తల్లిని తీసుకుని బయల్దేరాడు. వాసు, నీలిమ తండ్రి కుటుంబరావు, స్టేషనుకి వెళ్ళారు దింపడానికి. అట్నుంచీ ఆయన యింటికి వెళ్ళిపోతే వాసు తిరిగొచ్చాడు. మాధవ్ తిరిగొచ్చిన రెండురోజులకి కూతుర్ని తిడుతూ నారాయణ రాసిన వుత్తరం వచ్చింది. దాన్ని మాధవ్ చేతికిచ్చింది మహతి.
“మిమ్మల్ని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోమంటాడేంటే మీ బావ? మహాఘటికుడు. అంత పెద్ద యిల్లూ తనుంచేసుకుని, మిమ్మల్ని పొమ్మంటాడేమో!” అని నీలిమకి ఫోన్ చేసి లబలబలాడాడు కుటుంబరావు. ఇంటికి చేరగానే ఆయన చేసిన మొదటిపని అది.
“ఇంట్లో వాటా వాళ్ళు వదులుకోనప్పుడు మేం మాత్రం వదులుకుంటామా?” అంది నీలిమ. అప్పటికే అమె మనసులో ఒక ఆలోచన మొలకెత్తింది.


తనవి కాని సమస్యలు ప్రత్యక్షంగా కొంతా, పరోక్షంగా కొంతా ప్రభావితం చెయ్యగా, తనదైన జీవితాన్ని దార్లో పెట్టుకుందుకు విడాకులకోర్టులో నిలబడింది మహతి. లీగల్ సెపరేషన్ పీరియడ్ అయాక పరస్పరాంగీకారంతో విడిపోయారు. మేఘన కస్టడీ ఆమెకే ఇచ్చారు. అప్పటికి ఆమెకి డాటా ఎంట్రీ వర్కులో బాగా చెయ్యి తిరిగింది. డీటీపీ వర్కుకూడా నేర్చుకుంది. అందరూ కలిసి కొనిచ్చిన కంప్యూటరు పెట్టుకుని యింట్లోనే పనిచేసుకుంటోంది. నారాయణ రిటైరవ్వగానే ఆమె దగ్గిరకి వచ్చేసాడు. అదంత తేలికైన వ్యవహారంలా అనిపించలేదు ఆయనకి. సమూలమైన మార్పు. మలివయసులో. మంచికే వచ్చింది. సెకండ్‍హేండులో ఇంకో కంప్యూటరు కొనుక్కుని డీటీపీసెంటరు పెట్టాడు. కూతురితో సమానంగా తనూ టైప్ చేసేవాడు. ఇద్దరూ కలిసి దాదాపు ఇరవైగంటలు చేసేవారు. సంపాదన బానే వుండేది.
తమందరి జీవితాల్లో అనివార్యంగా వచ్చిన ఈ మార్పు నిర్మలని చాలా బాధపెట్టింది. డబ్బొచ్చే ఒక వ్యాపకం చేతిలో వుండటంతో నారాయణకి ఇది రెండో కెరీర్‍లా అనిపించి తొందరగానే సర్దుకున్నాడు. ఐనవాళ్ళందరికి దూరంగా వుండటం… తనలోకి తను కుదించుకుపోతున్నట్టు బయటి ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి కంప్యూటర్‍కీ, దాంట్లో అక్షరాలనీ పదాలనీ సృష్టిస్తూ, వాటిని పేజీలమీద పోగుచేయటానికీ పరిమితమై విరాగిలా మిగిలిపోయిన మహతిని చూస్తుంటే ఆమెకి గుండెకోతగా వుంటుంది. మొదట్నుంచీ మహతిని తను భయపడుతూ, భయపెడుతూ పెంచింది.
“నీకీ సమస్య వుంది. పెళ్లయాక ఎలా దారితీస్తుందో!” అన్న సూచన ఇవ్వకుండా మూతముక్కిడి చేసి, పెళ్ళి చేసి, కాపురం నిలబెట్టాలని చూసింది. అంతకన్నా, కూతురి యిష్టానికి ప్రాధాన్యత యిచ్చి, ఆమె పెళ్ళి వాయిదా వేసి, రవళికి చేసి, తనంతట తను చేసుకుంటాననేదాకా ఆగి వుంటే బావుండేది. చేసుకోకపోయినా సమస్య వుండేది కాదు. తన మనసులో ఈ ఆలోచన లోలోపల వున్నా, లోకానికి భిన్నంగా వెళ్ళడానికి భయం, భర్తకి అర్థమయ్యేలా చెప్పి వప్పించలేని అసక్తత.
మధ్యమధ్యలో నరేంద్ర మేఘనని చూడటానికి వస్తాడు.
నరేంద్రది హక్కు. నెలకోసారి పిల్లని చూసుకోవచ్చు. వీలునుబట్టి వస్తాడు. కట్నం, పెళ్ళిఖర్చులూ వెనక్కి తీసుకున్నాక మరొక్క పైస అతన్నుంచీ ఆశించలేదు మహతి. విజ్జెమ్మ వున్నప్పుడు కొద్దిగా ఏదో మేఘన వుయ్యాల్లో పెట్టబోతే, “చూడాలని వుంటే వచ్చి చూడమను. అంతేగానీ, డబ్బు ఇవ్వద్దని చెప్పు అమ్మమ్మా! నాకు ముట్టేవి ముట్టాయి” అంది మహతి.
అతనింక ఆ ప్రయత్నం చెయ్యలేదు. నిజానికి కూతురి పుట్టుకగురించి అతనికి బాగా గిల్ట్ వుంది. ఈ ప్రయత్నాలు చెయ్యకుండా విడిపోయి వుంటే బావుండేదన్న ఆలోచన అతన్ని స్థిమితంగా వుండనివ్వదు. విజ్జెమ్మకి అతను రావడంలో ఎలాంటి ఆక్షేపణా లేదు. అతని కూతుర్ని అతను చూసుకోకుండా ఆపడం జరగనిపని అని తెలుసు. కోర్టు ఆర్డరుకూడా వున్నాక. ఆవిడ వెళ్ళి, తల్లిదండ్రులు వచ్చాక నరేంద్ర రాకపోకలు కొంచెం సమస్యగా మారాయి. కాళ్ళుకడిగి కన్యాదానం చేసి, ఇంటిమనిషిగా గుర్తించిన వ్యక్తిని పరాయివాడిలా చూడటం ఎలానో అర్థమవదు నిర్మలకి.
“పిల్లని మనం చూసుకోలేమా? అతనెందుకు రావటం?” అని మండిపడతాడు నారాయణ.
స్వేచ్ఛ అనే రెండక్షరాల పదం ఒకరిది ఒకరు కబ్జా చేసినప్పుడు తలెత్తే అసంబద్ధతలలో ఇదొకటి. నారాయణ కూతురి నిర్ణయాలు తనే తీసుకోబోతాడు. అతను వచ్చే సమయానికి వాళ్ళిద్దర్నీ ఎటో ఒకవైపు పంపేస్తుంది మహతి.
మనుషులు కలుస్తూ విడిపోతూ వుంటారు. ప్రతికలయికా శాశ్వతమైన బంధానికి దారితీయదు. కలిసాక విడిపోవటం సహజం. శాశ్వతబంధమే విడిపోయింది మహతి విషయంలో. విడిపోయినవాళ్ళు మళ్ళీ కలవడం మాత్రం చాలా అరుదు. రామ్మోహన్ మహతిని మళ్ళీ కలవడం అలాంటి అరుదైన విషయాల్లో ఒకటి.
అతను ఆ సంవత్సరం జైపూర్లో జరిగే బుక్ ఫెస్టివల్లో తన పుస్తకాన్ని విడుదల చెయ్యాలనుకున్నాడు. ప్రచురణసంస్థలు ముందుకొచ్చి ప్రచురించే పుస్తకాల విషయంలో ఎలాంటి సమస్యా వుండదు. గ్రంథచౌర్యం, కాపీరైట్ సమస్యల్లాంటివి వాళ్ళు పరిష్కరించుకోగలరు. కానీ స్వీయప్రచురణ చేసేప్పుడు చాలా జాగ్రత్తపడాలి. రామ్మోహన్ మొత్తం నవల చేత్తో రాసి నాలుగైదుచోట్ల కొన్నికొన్ని పేజీలు డీటీపీ చేయిస్తాడు. ఫాంటు, మిగిలిన వివరాలన్నీ తనే చెప్తాడు. అది మొత్తం మరోచోట కలిపించి సీడీలో వేసుకుని ప్రింటరుకి ఇస్తాడు. ఈవరసలో అతనికి నారాయణ పరిచయమయ్యాడు.
ఇద్దరూ తెలుగువాళ్ళు. మూలాలు తెలుసుకుంటే అవంతీపురం దగ్గిర తేలారు.