ఝరి – 59 by S Sridevi

  1. ఝరి – 46 by S Sridevi
  2. ఝరి – 47 by S Sridevi
  3. ఝరి – 48 by S Sridevi
  4. ఝరి – 49 by S Sridevi
  5. ఝరి – 50 by S Sridevi
  6. ఝరి – 51 by S Sridevi
  7. ఝరి – 52 by S Sridevi
  8. ఝరి – 53 by S Sridevi
  9. ఝరి – 54 by S Sridevi
  10. ఝరి – 55 by S Sridevi
  11. ఝరి – 56 by S Sridevi
  12. ఝరి – 57 by S Sridevi
  13. ఝరి – 58 by S Sridevi
  14. ఝరి – 59 by S Sridevi

జరిగిన కథ-వాసు, గీత భార్యాభర్తలు. గీత ఆత్మహత్యకి ప్రయత్నం చేసి బైటపడుతుంది. తులసికి కేన్సరొచ్చి తగ్గుతుంది. భర్తతో విడిపోవాలనుకుంటుంది. అతనికి విడాకులు ఇష్టం వుండదు. గీతకి ఎవరో ఫోన్‍చేసి బెదిరిస్తారు. ఆ ఫోన్ సుధీర్‍ చేసాడేమోననే అనుమానం వస్తుంది వాసుకి. మహతి భర్తతో విడాకులు తీసుకుంటుంది. మేఘన ఆమె కూతురు. తల్లి దగ్గిరే వుంటుంది. తండ్రికి యాక్సిడెంటైతే చూడటానికి వస్తుంది. మహతితో విడాకులయ్యాక నరేంద్ర మరో పెళ్ళి చేసుకుంటాడు. ఆమెవలన ఇద్దరు పిల్లలు. ఆమె చనిపోతుంది. అతనికి యాక్సిడెంటైతే సాయానికి హాస్పిటల్‍కి వెళ్తుంది మహతి. రాత్రి అతనికి అటెండెంటుగా వుంటుంది. పిల్లలని వాసు తనింటికి తీసుకెళ్తాడు. నరేంద్రతో విడిపోయాక ఆమె ముంబైలో వుండిపోతుంది. ఆమె తల్లి చనిపోతుంది.
గీత గతం. చదువయ్యి, చిన్నవయసులోనే వుద్యోగంలో చేరుతుంది. ఇంట్లో ఆమెకి పెళ్ళి చెయ్యాలనుకుంటారు. తండ్రి అడిగితే సూచనాప్రాయంగా వాసు పేరు చెప్తుంది. ఆమెని తనింటికి తీసుకెళ్ళి సుధీర్ని చేసుకొమ్మని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు రవి. గీతావాసులకి చాలామంది కజిన్స్. చిన్నతనంలో వాళ్లంతా ఒకే స్కూల్లో చదువుకుంటారు. రామారావు యశోద ప్రమీల ఇంటికి వెళ్ళి పెళ్ళివిషయం చెప్పి, ఆహ్వానించి వస్తారు. సుధీర్ గీతని ఇష్టపడతాడు. ఆమెని చేసుకోలేకపోతున్నందుకు బాధపడతాడు.
వెంకట్రావు, విశాల అనే భార్యాభర్తలు అప్పులబాధ తట్టుకోలేక వురివేసుకుని చనిపోతారు. వాళ్ళ కూతురు అమృత. అమృత అవంతీ ఎస్టేట్స్‌లో మాధవరావు ప్రాపకంలో వుంటుంది. పోలీసుస్టేషన్‍కి పిలిచి బెదిరిస్తారు అమృతని. విజయ్, శ్యామ్మోహన్ అండగా నిలబడతారు. తనకి అమృత అంటే ఇష్టమని ప్రసూనకి చెప్తాడు. ఆ విషయం చెప్పి రోహిణిని హెచ్చరిస్తుంది ప్రసూన. అమృత ఆస్తుల లెక్కలు జరుగుతుంటాయి.


“అందులో ఒకాయన కొడుకు అమెరికాలో వున్నాడు. అతనక్కడ ఇల్లు కట్టాడు. డబ్బు కావాలని తండ్రికి ఇండెంటు పెడితే ఈయన పొలం బేరానికి పెట్టాడు. ఎలాంటి అవసరం లేకపోయినా రెండోఆయనకూడా అమ్ముతున్నాడు. కాస్త ప్రోబ్ చేస్తే తెలిసింది, వాళ్ళు అమ్ముతున్నది పిత్రార్జితమని. వెంకట్రావుకి అందులో వాటా వుంటుంది. ఆ విషయం వాళ్ళకీ తెలుసు. తొందరతొందరగా అమ్మేసి డబ్బుచేసుకుందామని చూస్తున్నారు. వాళ్లది ఆరెకరాలు పిత్రార్జితం, నాలుగెకరాలు తండ్రి స్వార్జితం. ఈ ఆరెకరాలూ అమ్మడానికి లేదు, ఎంత వేలిముద్రలు వేయించుకున్నాకూడా”
“ఇంత అన్యాయమా?” మాధవరావుకి కోపం వచ్చింది. ఇప్పటిదాకా అమృత ఎలా వుందోకూడా వాళ్ళు తెలుసుకోలేదు. తమ్ముడి అంత్యక్రియలకికూడా రాలేదు. పట్టనట్టు వదిలేసారు పిల్లని.
“డబ్బుముందు ఏవీ వుండవు. మానవత్వం, మన్నూ మశానం అని ఇందులోకి దిగావుచూడు… “
“కాదురా! ఆడపిల్లని చూసిచూసి వదిలెయ్యలేకపోయాను. ఇప్పుడా పొలంవిషయంలో ఏమీ చెయ్యలేమా? ఎంతుంటుంది, దాని విలువ?”
“సిటీకి దగ్గర్లో కాబట్టి ఎకరం కోటేనా చేస్తుంది. అంటే రెండెకరాలూ రెండుకోట్లు. బేరాలు నడుస్తున్నాయి. బేరం ఖరారయ్యాక ఫోన్ చేసి చెప్పమని అక్కడి సర్పంచికి చెప్పి వచ్చాను. ఆయన వీళ్ళకి ఎగనెస్ట్ పార్టీ. ఐనా నా జగ్రత్తలో నేనున్నాననుకో. డబ్బులు చేతులుమారే టైముకి వెళ్ళి అడ్డంపడటమే”
“చెక్కులైతే?”
“అంతా బ్లాకే. ఎకరంపాతికలక్షలుంటే రెండుకో, మూడుకో రాయించుకుంటున్నారు”
కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“గవర్నమెంటు వుద్యోగం, మూడుకోట్ల ఆస్థి వుండి ఈ గతి పట్టించుకున్నారేమిట్రా?”
“ప్రతివాడికీ శక్తిని మించిన ఆశ పట్టుకుంది. సంపద సృష్టించడం అనే మంత్రం జపిస్తున్నారు. మరోవైపు అంతంత ఆస్తులు లేకపోతే రేపు బతకలేమేమోనన్న భయంతో వణికిపోతున్నారు. మూడుకోట్లున్నవాడు ముప్పైకోట్లుండాలనుకుంటున్నాడు. అరేయ్, మాధవా! నెలకి కోటి ఆదాయం వున్నా, మొత్తం కుటుంబానికి తిండిమీద ఖర్చుపెట్టేది పాతికవేలమించి వుండదు. అందరూ తినే తిండి తినకపోవడం, అందరికీ అందుబాట్లో వున్న కారు వద్దనుకోవడం, పక్కింట్లోవాళ్ళ ఫంక్షనుకికూడా కొత్తపట్టుచీర కొనుక్కోవడం, అన్న యింట్లో ఫంక్షనుకి కొత్తనగ కొనుక్కోవడం. ఎన్నిరకాల పిచ్చో! పుట్టినరోజులు, ఆడపిల్లలకి చీర, మగపిల్లాడికి ధోవతి కట్టించడం, వీటన్నిటికీ ఆర్భాటాలు, లక్షలు తగలెయ్యటాలు, ఆ లక్షలకోసం పగలు రాత్రీ తేడా తెలీకుండా వుద్యోగాలకి అంటుకుపోవడం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. అవంతీపురం బళ్ళో చదువుకున్నాం అందరం. ఆడుతూ పాడుతున్నట్టు చదువైపోయింది. ఒక్క పిల్లకో పిల్లాడికో చదువు చెప్పించాలనుకుంటే కోటి కావాలట. మాయింట్లో మనవడికోసం లెక్కలు. వెంకడు మొదట్నుంచీ తెలివితక్కువవాడే. ఆవిడ నడిపించింది. ఇదుగో, ఇలాగేననుకుంటా” అన్నాడు శ్యామ్మోహన్ కాస్త ఆవేశంగా.
“…”
“చీటీలు నడిపించారు. ఆ డబ్బు వడ్డీలకి తిప్పారు. తీసుకున్నవాళ్ళు మొహం చాటేసారు. చీటీలు కట్టినవాళ్ళు వూరుకోరుకదా? ఎక్కువ వడ్డీలిస్తామని పెట్టుబడులు పెట్టించి వాటిని చీటీలవాళ్ళకి యిచ్చారు. డబ్బు పెట్టినవాళ్ళకి యివ్వడంకోసం వడ్డీలకి తెచ్చారు. ఈ నష్టాలన్నిటిలోంచీ ఒక్క వూపులో బైటపడాలని షేర్లలో పెట్టారు. అదీ ఎవరి సలహా తీసుకోకుండా. రహస్యంగా. రాత్రికిరాత్రి లాభాలు వచ్చేస్తాయి, ఎవరికీ తెలీకుండా కవర్ చేసెయ్యొచ్చని. అలా వచ్చేసేట్టైతే అందరూ ఈపాటికి కోటీశ్వరులై కూర్చునేవారుకదా? రోజువారీ వ్యవహారాలు నడపడానికి డబ్బన్నది చేతిలో లేకుండా అయాక కొంతవరకూ నష్టాలకి అమ్మి షేర్లడబ్బు వెనక్కి తీసుకున్నారు. అది చాలక ఆఫీసు డబ్బు వాడటం మొదలుపెట్టాడు. అది బైటపడేసరికి పరువుకి భయపడి ప్రాణాలు తీసుకున్నారు”
ఇద్దరూ మళ్ళీ మౌనం వహించారు.
తను ఏదో ఒకటి చెయ్యాల్సింది కొడుకు విషయంలోనా, అమృత విషయంలోనా అనేది అర్థమవలేదు మాధవరావుకి. అమృత విషయంలో విజయ్ చాలా పట్టుదలగా వున్నాడన్నది శ్యామ్మోహన్‍కి అర్థమైంది. పరువు, మర్యాద అనేవి పక్కని పెట్టి ఈ లావాదేవీల్లోంచీ ఆ పిల్లని బైటపడేస్తే దిగినందుకు పని సార్ధకమౌతుంది.
“వెంకట్రావు యిల్లు కోటికి పైన చేస్తుంది మాధవా! మిగిలిన షేర్లు ఐనకాడికి వదిలించుకోవచ్చు. మార్కెట్ రేటుకి ఇల్లు ఎవరేనా కొనగలిగితే ఓ కొలిక్కి వస్తుంది. ఈ గొడవంతా సద్దుమణిగాక ఇల్లు మళ్ళీ అమ్మెయ్యచ్చు” సాలోచనగా అన్నాడు.
“విజయ్ దగ్గిర అంత డబ్బు లేదు. నేను ఇంకో కొడుక్కీ, కూతురికీ జవాబు చెప్పుకోవలసి వుంటుంది. తాతయ్య కొంటారని అనుకోను. ఎందుకంటే ఆయన మా అందరికీ జవాబు చెప్పాలి” అన్నాడు మాధవరావు ముక్తసరిగా.
అదే జరుగుతుందనిపించింది శ్యామ్మోహన్‍కి. ఎవరో ఒకరు కొంటారు. ఇప్పుడు తెగించి పెట్టుబడి పెడితే పెద్దలాభాలు రాకపోయినా, నష్టంమాత్రం వుండదు. వెంకట్రావు చచ్చిపోయింది డబ్బులేక కాదు, డబ్బు ఆడక. పీల్చుకునేగాలిలాగా, డబ్బాడక. లిక్విడ్ కేష్ లేక.


హాస్పిటల్‍నుంచీ పిల్లలు ముగ్గురూ బాగా ఆలస్యంగా వచ్చారు. ఎదురుచూస్తూ కూర్చున్నారు మహతి, తులసి, గీత. పెద్దవాళ్ళందరి భోజనాలూ అయ్యాయి. వీళ్ళొస్తే అందరూ కలిసి తినచ్చని చూస్తున్నారు.
“మళ్ళీ హాస్పిటల్‍కిగానీ వెళ్ళారా? దారిలో ఏదేనా సమస్య వచ్చిందా? ఏం వున్నా ఫోన్ చెయ్యచ్చుకదా?” పరిపరివిధాల పోయాయి అందరి ఆలోచనలు. మహతి రెండుసార్లు కాల్ చేసినా వెంటనే కట్‍చేసేసింది మేఘన.
“ఆఫీసు కాల్‍మీద వుందేమోనే!” అంది తులసి.
మొత్తానికీ వచ్చారు. మేఘన, ఇందిర ఎవరికివాళ్ళు ముఖాలు మాడ్చుకుని వున్నారు. వస్తూనే అన్నతో కలిసి వాళ్లకని కేటాయించిన గదిలోకి వెళ్ళి కూర్చుంది ఇందిర.
“ఈ పిల్ల భలే అదరగండంగా వుందే! ఓ మాట లేదు, పలుకు లేదు. ఎక్కడా చిన్నపిల్లా, చిన్నందం లేవు” అంది తులసి.
“మీరు మాకేమౌతారని అడిగింది నన్ను. తండ్రి హాస్పిటల్లో వుంటే వదిలెయ్యలేక తీసుకొచ్చాం. నాలుగురోజులు వుండి వెళ్ళిపోయేదానికి ఈ ఆరాలెందుకు? చిరాకేసింది. పిల్లలకి స్నేహమూ, సహాయం చేసే బుద్ధీ లేకుండా పోతున్నాయి. ముదినాపసానుల్లా ప్రతిదానికీ అర్థాలూ, లోతులూ వెతకడమే” అంది మహతి.
వచ్చింది వచ్చినట్టు తల్లి వళ్ళో పడి ఏడవటం మొదలుపెట్టింది మేఘన. అందరూ తెల్లబోయారు ఆ పరిణామానికి.
“ఏమైందే, మేఘనా? ఏం జరిగిందే? ఇంత ఆలస్యం ఎందుకైంది? డాక్టరేమైనా చెప్పాడా? నాన్నకి తగ్గిపోతుందమ్మా! వాసు మామయ్య డాక్టర్తో మాట్లాడాడుగా?” ఆ పిల్ల వీపుమీద ఓదార్పుగా రాస్తూ అడిగింది మహతి. ఏడుపు వుధృతి తగ్గడానికి కొన్ని నిముషాలు పట్టింది మేఘనకి.
“మనం నాన్నకి ఏమీ కామా, అమ్మా?” తలెత్తి దూరం జరిగి తల్లి మొహంలోకి చూస్తూ అడిగింది.
“ఏమౌతారే? ఎత్తేస్తే ఏడుచెక్కలు, దిగేస్తే దిమ్మచెక్కలు. మీ అమ్మని పెట్టాల్సిన బాధలన్నీ పెట్టి, విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. ఇంకో యిద్దరు పిల్లలుకూడా పుట్టారు. ఏమైనా కాస్త వుంటే నీమీద వుంటుందిగానీ, మీ అమ్మమీద ఎందుకుంటుంది? నీమీదేనా, బాధ్యతంతా మీద వేసుకుని ఇది పెంచితే తనొచ్చి చిటికెలు వేసి వెళ్ళే పాత్రకాబట్టి ఆకాస్త ప్రేమాను” వెంటనే అంది గీత.
“అసలేం జరిగింది మేఘనా?” అడిగింది తులసి.
ఆమె చెప్పింది. స్కూలుకెళ్ళి ఇందిరని తీసుకుని ఇంటికెళ్దామనుకుంటే ఆ పిల్ల మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్దామని పంతం పట్టిందట.
“అది చాలా మొండిది. అస్సలు చెప్పినమాట వినదు. సరేనని వెళ్ళాం పిన్నీ! వెళ్ళగానే నాన్న బెడ్‍దగ్గిరకి వెళ్ళిపోయింది. నాన్న కాన్షస్‍గానే వున్నారు. నేను ఆఫీసునించీ కాల్ వస్తే మొబైల్ తీసుకుని పక్కకి వెళ్ళాను. జస్ట్ వన్‍మినిట్ కాల్ నాది. మళ్ళీ వచ్చేసరికి నాన్నతో అంటోంది,
వాళ్ళెవరో నాకు అర్థమైంది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళట నాన్నా! అమ్మ చెప్పింది. అన్నా, నేనూ వాళ్ళింట్లో వుండం. మనింటికి వెళ్ళిపోతాం-అని.
నాన్న విన్నారు. అలా అనడం తప్పనికూడా చెప్పలేదు. నన్ను చూసి మాట మార్చేసారు” అంది. మళ్ళీ కళ్లనిండా నీళ్ళు నిండాయి.
మహతి మనసంతా అల్లకల్లోలమైంది. అలా ఎలా చెయ్యగలిగాడు? పొద్దున్నే చూసింది, ఆ యిద్దరు పిల్లలూ చనువుగా అతని దగ్గిరకి వెళ్తే మేఘన దూరంగా నిలబడివుండటం. ఈపాటి ప్రేమకేనా, కూతురు, కూతురని ముంబై పరిగెత్తుకొచ్చేవాడు! తల్లి వున్నప్పుడు అలా చెప్పిందేమో, ఇప్పుడేనా, ఇతనేనా, ఈ పరిస్థితుల్లోనేనా ఇందిరకి తప్పని చెప్పుకోవాలికదా? ఐనా మేఘనకూడా తన కూతురేనని పిల్లలతో స్పష్టంగా చెప్పకుండా ఎందుకు వుండిపోయాడు? అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయింది.
“ఈ విషయాలన్నీ అన్నాలు తిన్నాక మాట్లాడుకుందాం మేఘనా! నీతో చాలా చెప్పాలి. ఇప్పటికే చాలా వేళైపోయింది. మీరు వచ్చాక తినచ్చని మేమూ కూర్చున్నాం” అని చెయ్యిపట్టి లేవదీసింది గీత.
“తలంటుతుంది. ఓమాటు అత్తచేత తలంటించుకున్నావనుకో, ఈ తిక్కలన్నీ పోతాయి” అని నవ్వింది తులసి.
“అంటే?” అడిగింది మేఘన అర్థంకాక, ఏదో అందనిమాత్రం గ్రహించి ముక్కూమొహం ఎర్రబడగా.
“మా కోడ్ భాషలే. అంతంత తెలుగు నీకు అర్థంకాదు”
“అబ్బ వూరుకోవే తులసీ! దాంతో సమానంగాను. ఏదో పొరపాటు జరిగి వుంటుంది. అతనేదో చెప్పేలోగా ఇది వెళ్ళేసరికి కంగారుపడి మాట మార్చేసి వుంటాడు. తర్వాత ఆ పిల్లకి చెప్పుకుంటాడేమో!” విసుక్కుంది గీత. మేఘన కాళ్ళూ, చేతులూ, మొహం కడుక్కుని వచ్చేసరికి కంచాల్లో అన్నీ పెడుతోంది గీత.
“నీ చుట్టాలనికూడా పిలుచుకు రా!” అంది మహతి.
“నేనా?!” ఎర్రగా చూసింది మేఘన.
“లేకపోతే నేనా?” ఎదురు అడిగింది ఆమె.
“ఓయ్, పిల్లలూ! అన్నాలకి రండి. ఇంక మేం ఆకలికి వుండలేం” అని వున్నచోటినుంచే కేక పెట్టింది గీత. అందరూ బైట మాట్లాడుకుంటూ వుంటే తామిద్దరూ గదిలో బంధించుకుని వుండటం హరికి నచ్చలేదు. లేవబోయాడు.
“నువ్వెళ్ళు. నేను తినను” అంది, ఇందిర. ఆపిల్ల భయాలు ఆపిల్లవి. తల్లితో కూర్చుని టీవీ సీరియల్స్ బాగా చూసేది. ఆపైన సవతిమాత్సర్యంతో ఆవిడ చెప్పిన మాటలు మనసులో నాటుకున్నాయి.
ఇందిరకన్నా హరి మూడేళ్ళు పెద్దవాడు. కొంచెం పరిణతి వుంది. తండ్రికి రెండుసార్లు పెళ్ళైందనీ, మేఘన తమకి అక్కనీ, తండ్రికి ఆ పిల్లపట్లకూడా ప్రేమ వుందనీ గ్రహించాడు. కొన్నాళ్ళు ఆయన ముంబై వెళ్ళి చూసి వచ్చేవాడు. అలా వెళ్ళడం తల్లికి ఏమాత్రం ఇష్టం వుండేదికాదు. ఆమెనే రప్పించమంది. అదీ అయిష్టంగా. తండ్రిని నిలవరించలేక. ఆ అయిష్టాన్ని స్పష్టంగా చూపించేది. మేఘనని గెస్ట్‌రూం దాటి లోపలికి రానిచ్చేదికాదు. డైనింగ్ టేబుల్‍మీద అన్నం పెడితే తినేసి మళ్ళీ వెళ్ళి గదిలో కూర్చోమనేది. తండ్రి బైటికి తీసుకెళ్ళేవాడు. తిప్పుకొచ్చేవాడు. ఏమీ కొననివ్వకుండా కాపలాగా తననీ చెల్లినీ పంపేది. ఏం మాట్లాడుకున్నారో విని చెప్పమనేది. ఏడాదికో ఆర్నెల్లకో ఒకసారి వచ్చి రెండురోజులుండి వెళ్ళేది మేఘన. తన ఖర్చులు తను పెట్టుకునేది. కేవలం తండ్రిని చూడటానికి వచ్చినట్టుగా వచ్చేది. దూరదూరంగానే వుండేది. అలాంటిది తమకోసం ఇంత చేస్తుందనుకోలేదు.
అదీకాక సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఇంతమంది మనుషులమధ్య తిరగడం అతనికి తమాషాగా వుంది. తండ్రినీ మేనమామనీ తప్ప మరో మగమనిషిని దగ్గరగా చూడని అతనికి వాసు చాలా నచ్చాడు. ఆ యింట్లో మేఘనకి వున్న ప్రాధాన్యత, వాళ్ళు తమని ఎలాంటి ఆంక్షలూ పెట్టకుండా ఇల్లంతా తిరగనివ్వడం చూసాక తమింట్లో ఆమెని ఎలా చూసింది గుర్తొచ్చి కొంచెం చిన్నతనంగా అనిపించింది. హాస్పిటల్లో ఇందిర అన్నమాటలుకూడా ఇబ్బందిని కలిగించాయి. మామూలుగానైతే మేఘన వచ్చి వాళ్ళిద్దరినీ భోజనానికి తీసుకెళ్ళేది. ఇప్పుడలా జరగలేదంటే ఆ మాటలు విని వుండాలి. వినే వుంటుంది. హాస్పిటల్లోనే ఆమె ప్రవర్తనలో మార్పొచ్చింది. ఇంట్లో చెప్పిందేమో!