మహతి విచలితురాలైంది. ఒక్కొక్క మనిషి ఈ భూమికి ఎంత భారంగా పుడతారు! వీడు, రాణా చదువు సరిగ్గా చదువుకోలేదు. సరైన వుద్యోగం లేదు. ఇప్పటికీ జీవితంలో స్థిరపడలేదు. ఎవరు కనిపిస్తే వాళ్లని పదీ పరకా అడిగి బతికేస్తున్నాడు. ఇప్పుడు వాడు గీతని దేనికి సతాయిస్తున్నాడు? డబ్బుకోసమా? అదే ఐతే గీత ఇంత బాధపడదు. అందరికీ చెప్పి ఎంతోకొంత సర్దుతుంది. సమస్య అక్కడ ఆగి వుండదు.
“వాడు వెళ్ళాక చాలాసేపు ఏడ్చాను. ఆ మాటలకి, నాతో కలిసి పెరిగినవాడి సంస్కారం ఇలా వున్నందుకు, వాడి దృష్టి నామీద వున్నందుకు, వాసు తనకి అన్ననికూడా ఆలోచించని వాడి మూర్ఖత్వానికి అన్నిటికీ ఏడ్చాను”
“ఇంత జరిగితే వాడి భార్యకి వైద్యమదీ ఎందుకు చేయించావు గీతా?”
“వాళ్ళు మాకు బాగా తెలిసినవాళ్ళు. వీడు మాయమాటలు చెప్పి ఆమెని పెళ్ళిచేసుకున్నాడు. చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. కవలల్తో. ఇక్కడ ఆమెకి జరగట్లేదని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి ఏమీ లేదు. చాలా బీదవాళ్ళు మహీ! నేను, నీలిమ, రమ, లత- మా అందర్లాగా ఆ పిల్లకూడా మన కుటుంబానికి మెట్టి వచ్చి వచ్చింది. తెలిసి తెలిసి వూరుకోలేకపోయాను”
“ఆ అమ్మాయి మళ్ళీ మన మధ్యకి రాలేదు. వాళ్ళిద్దరూకూడా సఖ్యతగా వున్నట్టు లేరు”
“మన బాధలూ, కోపాలూ మరొకరికి చేసే సాయాన్ని ప్రభావితం చెయ్యకూడదుకదా?”
“అప్పుడెప్పుడో జరిగిపోయినవన్నీ చెప్తున్నావు” అంది మహతి.
“ఎప్పుడు జరిగినా వాటి ప్రభావం లేకుండా వుండదుకదా?”
“తర్వాతేం జరిగింది? మీ నిశ్చితార్ధానికిగానీ, పెళ్ళికిగానీ వాడు రాలేదు”
“పెళ్లయ్యాక మా ఆఫీసుకి వచ్చాడు”
“ఆ<” అంది మహతి వులిక్కిపడి.
“వాసూవాళ్ళూ కట్నం వద్దన్నారని మామ్మ సంతోషపడింది.
కట్నం వద్దనడం మంచితనానికి కొలమానమా- అని అడిగాను నేను. అదికాదట. వాసు మంచివాడట. అంటే ఏమిటో అర్థమవ్వలేదు. వాసుతో మాట్లాడద్దని కోప్పడ్డ అత్త ఇప్పుడీ సంబంధానికి ఎందుకు వప్పుకున్నట్టు? పెళ్ళికి అమ్మ తన బంగారం నాకు పెట్టేసింది. మయూ పుట్టినప్పుడు నాన్న స్థలం ఇచ్చారు. మా అమ్మమ్మ పోయినప్పుడు అమ్మకి వాటాగా వచ్చిన పొలం అరెకరం నా పేర్న పెడితే తీసుకున్నాను. ఇచ్చినవన్నీ. నిర్లజ్జగా. మహీ! ఇప్పుడు ఆలోచిస్తే ఎంతో సిగ్గనిపిస్తుంది. కానీ పెళ్ళి అనేదానికి పునాది డబ్బే అనిపించిన రోజులవి. నాన్న నాకోసం అందర్లాగే అన్నీ చెయ్యగలరని మీ అందరికీ తెలియాలని అనిపించిన రోజులవి. రాణా మాటలు నామీద అంత ప్రభావాన్ని చూపించాయి”
“పెద్దవాళ్ళు పిల్లలకి పెట్టుకోరే?”
“అందరి విషయం వేరు. నాన్న విషయం వేరు. అవన్నీ వుంటే అమ్మానాన్నల జీవితం మరింత హుందాగా వుండేదికదా?”
“నీకు ఇచ్చారుకాబట్టి అవి అలా వున్నాయి. బాధ్యతల్లో యిరుక్కుని వున్న మనిషిదగ్గిర ఆస్తులు నిలవ్వు గీతూ!”
“…మా మామయ్యా, నాన్నా కలిసి వెళ్లి తాంబూలాలిచ్చి వచ్చారు. ముహూర్తాలు పెట్టుకునేరోజు అందర్నీ పిలిచారు నాన్న. రాణా తప్ప అందరూ వచ్చారు. ఎందుకు రాలేదని మామూలుగా అడుగుతారుకదా, అలా అరుణత్త అడిగితే,
వరసపెట్టి మీ మూడిళ్ళవాళ్లనీ అడిగాడు అన్నయ్య. గీతని చేసుకొమ్మని. నా కొడుకుని వదిలేసాడు. కోపం రాదా- అందట వాళ్ళమ్మ.
అలా ఏమీ లేదే. వాసుకి లక్ష్మి అడిగింది. గీతా చేసుకుంటానంది. ఆ విషయం చెప్పడానికి వెళ్తే ప్రమీల మరోలా అర్థంచేసుకుంది. పెద్దపిల్లలు వాళ్ళిద్దరూ వుండగా ప్రహీకి ఎందుకు అడుగుతాడు- అరుణత్త సర్దిచెప్పింది. కానీ ఆవిడైతే కోపంగానే వుంది. అలాంటి కోపాలకి వేరే కారణాలూ బాధలూ వుంటాయని అప్పుడు నాకు తెలీదు. వాడు రాకపోవడంతో తేలిగ్గా ఫీలయ్యాను.
పెళ్ళికికూడా రాణా రాలేదు. సుధీర్ వచ్చాడు. సుమతికూడా నామీద చాలా కోపంగా వుంది. గుంపులో కలిసి మీతో తిరగడంతప్ప ప్రత్యేకించి ఎందులోకీ రాలేదు. నేనేదో తప్పుచేసినట్టు నన్ను దూరం నెట్టేసారు వాళ్ళు ముగ్గురూ. పెళ్ళి జరుగుతున్న వుద్వేగంలో అప్పుడంత తెలీలేదుగానీ, తర్వాత చాలా బాధపడ్డాను” ఆగింది గీత.
“…”
“పెళ్ళయాక ఒక చిన్నస్వర్గంలోంచీ మరో పెద్దస్వర్గంలోకి అడుగుపెట్టినట్టనిపించింది. పెద్దవాళ్ళంతా కలిసి నా పెళ్ళిఖర్చులకోసం నాన్నకి డబ్బు ఇవ్వబోయారు. నాన్న తీసుకోలేదు.
నేను దానికి పెళ్ళికూడా చెయ్యలేనని అనుకుంటుంది. మీరు ఇవ్వాలనుకున్నదేదో దానికే యివ్వండి. నా స్థాయికి తగ్గట్టు నేను పెళ్ళి చేస్తాను- అన్నారట. ఎంత గొప్పమనిషే, ఆయన! ఆ డబ్బుతో అరుణత్త నాకు ఏమేమి అవసరమౌతాయో అవన్నీ కొంది. ఆఫీసుకి కట్టుకోవడానికి నాలుగు తేలికపాటిచీరలు, చెప్పులు, హేండ్‍బేగు, చక్కగా సర్దుకోవడానికి లంచిబాక్సులు, వంట తేలిగ్గా అవడానికి పెద్దకుక్కరుతోసహా సారిసామానంతా కొంది. నన్ను దగ్గిర కూర్చోబెట్టుకుని ఎన్నో విషయాలు చెప్పింది. ఇంకెన్నో విషయాలు నేర్పించింది. ఎవర్ని ఎలా చూడాలో, గౌరవించాలో అన్నీ సునిశితంగా వివరించింది.
ఇప్పటిదాకా నువ్వు అమ్మచాటు పిల్లవి. ఏవేనా పొరపాట్లు చేసినా అవి చిన్నచిన్నవి. ఎవర్నీ పెద్దగా బాధపెట్టవు. పెట్టినా తాత్కాలికం. కానీ ఇప్పుడు నువ్వు అనుభవించేది నిజమైన జీవితం. నీ జీవితం. నువ్వు, వాసు, ఈ అందరు కుటుంబసభ్యులు, వాళ్లందరిమీదా నువ్వు చేసేవాటి ప్రభావం పడుతుంది. ఆ తర్వాత నీకు బుజ్జిబుజ్జి పిల్లలు పుడతారు. వాళ్లు నిన్ను చూస్తూ అన్నీ నేర్చుకుంటారు. నీ వొళ్ళోంచేగా, వాళ్లకి బయటికి దారి తెలిసేది? ఎంత తొణక్కుండా వుంటే అంత సుఖంగా వుంటావు. ఆలోచన, వివేచన పెంచుకోవాలి. తొందరపాటుతనం, దురుసుతనం వదిలిపెట్టాలి- అంది.
చిన్నప్పట్నుంచీ నేనుకూడా చెప్తునే వున్నాను పిన్నీ- అన్నాడు వాసు నవ్వుతూ.
అప్పుడే అనేసుకున్నావేమిట్రా, ఇది నీ భార్యౌతుందని- అంది తనూ నవ్వి. వాసు సిగ్గుపడ్డాడు.
సిగ్గుపడతావేంటి పిల్లగా, చెప్పు. పెళ్ళి జరుగుతుందో లేదోనని తిండీతిప్పలూ మానేసి ఎంత బెంగపడిపోయావో- అంది వాళ్ళ మామ్మ భోళాగా నవ్వుతూ. అతను మరింత సిగ్గుపడిపోయాడు.
నన్ను వంటరిగా కూర్చోబెట్టుకుని అరుణత్త మరికొన్ని విషయాలు చెప్పింది.
మనింట్లో మగపిల్లలంతా సంస్కారం వున్నవాళ్ళేగానీ, ఒకొక్కసారి తెలీకుండానే పొరపాట్లు జరిగిపోతుంటాయి. మగపిల్లలకి భార్యపట్ల పొసెసివ్‍నెస్ చాలా వుంటుంది. వాసు మంచిపిల్లాడే. ఐతే వాడికిప్పుడు నువ్వు భార్యవి. అది గుర్తుంచుకో. ఎవరికీ చనువు ఇవ్వకు. నీకు ఎవరివల్లనేనా ఇబ్బందికలిగితే నాతో చెప్పు. నందకిషోరో, రవో చూసుకుంటారు. ముఖ్యంగా రాణాతో జాగ్రత్తగా వుండు- అంది. వాడు నాతో అన్నమాటలు చెప్పాలా, వద్దా? నాలో ఆలోచన. చెప్పలేకపోయాను. సంకోచం కలిగింది.
వాసూవాళ్ల మామ్మకూడా నన్నొక్కదాన్నీ కూర్చోబెట్టుకుని చాలా మాట్లాడింది.
“పిల్లా! మీ అత్త యిక్కడ యిన్ని కష్టాలు పడుతోంది. మళ్ళీ యింకోదాన్ని యీ యింటికి యిస్తారని ఎవ్వరం అనుకోలేదు. వాసుకి ఎంత యిష్టమైనా అడగడానికి ఎంతో ఆలోచించింది లక్ష్మి. దాన్ని జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. ఎప్పుడూ గొడవపడొద్దు. వాసు దానికి కొడుకయ్యాకే నీ మొగుడయ్యాడని మర్చిపోవద్దు. తులసమ్మ బాధ్యత మీదే. నీకులాగే మంచి సంబంధం చూసి సాగనంపాలి” అంది. అంత పెద్దావిడా కళ్లనీళ్ళు పెట్టుకుంది. చిన్నపిల్లని దగ్గరకి తీసుకున్నట్టు నన్ను దగ్గరకి తీసుకుంది. మనసులో నాటుకుపోయాయి ఆవిడ మాటలు”
“ఊ< నీ మనసు దుక్కి దున్ని పదునుమీదుంచిన పొలం. అందరిమాటలూ అందులో నాటుకుపోయి మొలకలెత్తి మహావృక్షాలైపోతాయి” అంది మహతి నవ్వుతూ.
“కావచ్చు మహీ! నా ఆలోచనల్లో నేను చాలా చిక్కుకుపోతుంటాను” అంది గీత.
“అన్నీ చెప్పేవాడు అతిగా ఆలోచించడం తప్పని ఎప్పుడూ చెప్పలేదా, వాసు?”
“తనకి తెలీదుగా? పదింటికల్లా తనకి నిద్రొచ్చేస్తుంది. నేను పక్కనే కళ్ళుమూసుకుని పడుక్కుంటానుగానీ, ఆ తర్వాత గంటో రెండుగంటలో నిద్రపట్టేదాకా నాకీ ఆలోచనలన్నీ సాగుతాయి. ఒక్కోసారి తెల్లారేదాకాకూడా”
“ఓసినీ!” అంది మహతి. విస్మయంగా చూసింది. గీత పట్టించుకోనట్టు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది.
“ప్రమీలత్త అప్పటికి కాస్త అలకలో వుంది. అందుకని తను నేరుగా కలగజేసుకోలేదు. సంధ్యత్త అలక మరోతీరు. కుసుమపిన్ని, బాబాయ్ ఇక్కడికి బానే వస్తారు. వాసూ వాళ్ళ మామ్మ. వాసు ఆవిడ వెంట వుండి అన్నీ చూసుకుంటాడు. మామ్మామనవలకి పెద్ద అనుబంధం. ఇక ఆవిడ కూతుళ్ళు, మనవరాళ్ళు. హడావిడంతా వీళ్ళదే. వీళ్ళందరి ప్రేమలో తడిసి ముద్దైపోయాను. అత్తని రాణా తగిలించిన రంగుటద్దాల్లోంచీ చాలా పరీక్షగా చూసాను. ఆవిడకూడా సంతోషంగానే వుంది. పెళ్ళితంతంతా అయ్యేసరికి ఆ అద్దాలు మంచుపొరల్లా కరిగిపోయాయి.
మహీ! ఒక మనిషిని ఇంతమంది ప్రేమిస్తారా, ప్రేమించగలరా అని ఇప్పుడు గుర్తొస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో! ప్రేమతో ప్రపంచాన్ని శాసించగలిగినప్పుడు ద్వేషం అనే మార్గాన్నీ, కుళ్ళునీ, కుత్సితాన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాం మనం? నన్ను నిరంతరం బాధించే ప్రశ్నలివి. నాకు ప్రేమంటే చాలా యిష్టం. నేను కలిసిన అందరినీ ఒకలానే చూసాను. కానీ మీకు నేనిచ్చిన ప్రేమలో స్థిరంగా నాకు తిరిగి వచ్చినది చాలా తక్కువ. ఇంకోమార్గంలోకూడా ప్రేమని పంచాను. మయూఖ్ విహంగ్‍ల స్కూల్లో పిల్లలకి పంచాను. వాళ్ల తల్లిదండ్రులతో అనుబంధం పెంచుకున్నాను. అక్కడ నేను యిచ్చినదానికి వందలవేల రెట్లు తిరిగొచ్చింది. మిమ్మల్ని నేను ప్రేమించిన విధానంలోనే ఏదో లోపం వుందేమో!” అంది గీత.
“లేదు గీతా! నీమాటంటే ఇప్పటికీ అందరికీ గురే. నువ్వు ప్రేమ అన్నది రూపురేఖలు మార్చుకుంది అంతే. కుటుంబాలు, వాటి నిర్వహణ, మధ్యలో వచ్చి చేరాయి అందరికీను. అవి అనివార్యంకదా? ఈ బాధ్యతల్లోంచీ బయటపడ్డాక అందరూ అవంతీపురంవైపే చూస్తారు. గుర్తు తెచ్చుకో, నువ్వు చెప్పావని నాకోసం అందరూ వంతులువేసుకుని వచ్చారు. చంటిపిల్లని తీసుకుని సుమతికూడా వచ్చింది. అదో మహరాణీ. అప్పట్లో మీకు మాటలుకూడా లేవు. ఐనా వచ్చింది అది. ఇప్పుడీ పెళ్ళి చూడు, దీంతోపాటు ఎన్ని పెళ్ళిళ్ళు కుదురుస్తావో! నువ్వు మన కుటుంబానికి పెద్ద ఎసెట్టన్నాడు సుమతి భర్త” అంది మహతి.
గీత దు:ఖంయొక్క మూలం దొరకట్లేదు. చెప్పే విషయాలు, పడుతున్న బాధ పొంతన లేకుండా వున్నాయి. తను యౌవనంలో వుండి, చుట్టూ వున్నవాళ్ళు నడివయసులోనూ ప్రారంభవృద్ధాప్యంలోనూ వుండగా చూసిన గీత ఇప్పుడీ చుట్టూ వున్న ముసలివాళ్ళని చూసి బెంగపడుతోందా అనికూడా అనిపించింది. కొన్నాళ్ళు ఎటేనా తిరిగి వస్తే తేరుకుంటుందేమో! అసలు మాధవ్ బాధ్యత వదిలిపెట్టి ఏమీ కానట్టు అలా ఎలా వుండగలుగుతున్నాడు? కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చి వుండచ్చుకదా? మళ్ళీ అప్పుడు ఆస్తిలెక్కలొస్తాయేమో! అవొక్కటేనా, మనుషులమధ్య వుండేవి?
మేఘన పెళ్లిచేసి, తనిక్కడికి వస్తే ఈ సమస్యకి కొంత పరిష్కారం దొరకచ్చు.
రాణా దీన్నెందుకు బాధపెడుతున్నాడు? వాసుకి తెలీదా? తెలిసీ ఎలా వూరుకుంటున్నాడు? సుధీర్ విషయంలో చులకనగా ఒక మాట అన్నాడు. ఈ విషయంలోనూ అలాగే అని వుంటాడా? గీత పడుతుందా? పడి వూరుకుంటుందా? సర్దుకుపోతుందా? గీత మనస్తత్వం అలాంటిది కాదు. అలా మారిందంటే ఎంత సంఘర్షణపడివుంటుందో! ఆమె ఆలోచనలు అలా సాగుతునే వున్నాయి. గీత స్వరం మళ్ళీ వినిపించింది.
“పదహార్రోజుల పండగ అయ్యి, హడావిడంతా తగ్గాక ఆఫీసులో చేరాను. ఇప్పట్లా క్యుబికల్స్ కాకుండా హాల్లో పెద్దపెద్ద టేబుళ్ళు వుండేవి మాకు. వాటి వెనకకూర్చుని పని చేసుకుంటాం. ముందువైపుని మాకోసం ఎవరేనా వస్తే కూర్చుందుకు ఒకటో రెండో కుర్చీలుంటాయి. ఈ కుర్చీలు ఎక్కువ వుండవు. ఎవరి సీటుముందు అవసరమైతే అక్కడికి సబ్‍స్టాఫ్ తెచ్చి వేస్తాడు. నాముందు కుర్చీ వుంది. ఖాళీగా వుంది. రాణా వచ్చి కూర్చున్నాడు. తలొంచుకుని పని చేసుకుంటున్న నేను ఎవరో అనుకుని తలెత్తితే వీడు! ఆరోజు అంతమాట అని మళ్ళీ ఎందుకొచ్చాడు? ఐనా ఇక్కడేం పని, ఇంటికి వెళ్ళక? నాలో అసహనం”
“ఎందుకొచ్చాడు?” అడిగింది మహతి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.