అలా ఎందుకనుకోవాలి? మనం గనుక తీసుకురాకపోతే దీని పరిస్థితి ఇంకెంత హీనంగా ఉండేదో? ఇలాంటి పెళ్లిళ్లూ, ఉంచుకోవడాలగురించి ఎన్ని వినలేదు?” వెంటనే అంది సావిత్రి. భర్త తనని తను తక్కువ చేసుకోవటం ఆమెకు నచ్చలేదు.
” వాళ్లు కట్నం డబ్బు తిప్పి యిచ్చేస్తామన్నారు. అది నీ పేర వేస్తాను. అదే నీకు ఆధారం” అన్నాడు ఈశ్వరరావు. అలా అంటుంటే గొంతు వణికింది.
” మీరంతా ఉండగా నాకేం భయం పెదనాన్నా!” ఇంకేమనాలో తోచని శాంతి అంది.
మదమాత్సర్యాలే బలమనుకునే వ్యక్తికి పశ్చాత్తాపంతో పతనం మొదలవుతుంది. ఈశ్వర్రావు బలం అనుకుని నమ్మినది కూడా వీగిపోయింది. ఆ నమ్మకంతోనే ఆయన ఎన్నో చేశాడు . ముఖ్యంగా ఇంటి వ్యవహారాలలో . శాంతి విషయంలో.
మనిషికి స్వర్గం, నరకం అంటూ ఎక్కడా ఉండవు. చివరి రోజుల్లో అతను అంతర్ముఖుడౌతాడు. అనుభవాలని మథనం చేసుకుంటాడు. వాటి సారమే స్వర్గనరకాలు. మనసే అన్నిటినీ చూపిస్తుంది. అలాంటి నరకాన్ని చూస్తున్నాడాయన.
…
కారిడార్లో నిలబడి నక్షత్రాలు లెక్కబెడుతున్నాడు భాస్కర్. లెక్క సరిపోవడం లేదు. మధ్యలో కొత్తవి పుట్టుకొస్తున్నాయి. అతని మానసిక స్థితి కూడా అలాగే ఉంది. దారీతెన్నూ లేకుండా ఆలోచనలు సాగుతున్నాయి. కొత్తకొత్తవి పుట్టుకొస్తున్నాయి.
” అన్నయ్యా! వదిన గుర్తొస్తుందా?” దగ్గర్లో చెల్లెలి గొంతు.
” వదినా? ఏ వదిన” కలవరంగా అడిగాడు.
” సగం వదిన” సింధు నవ్వింది.
” అదేం భాష?” తేరుకుని తను కూడా నవ్వుతూ అడిగాడు.
” సగం సగం పెళ్లిళ్లు చేసుకుంటే సగం చుట్టాలే అవుతారు” అంది. ఇద్దరి మధ్యా కొద్దిసేపు నిశ్శబ్దం చోటుచేసుకుంది. దాన్ని అతి కష్టమ్మీద ఛేదిస్తూ అన్నాడు భాస్కర్ .”నేను తనని చాలా నిజాయితీగా ప్రేమించాను. అలాంటప్పుడు అదే నిజాయితీ వాళ్లలో ఉండక్కర్లేదూ? కనీసం తనలో?”
“తనేం చేసింది?”
” పెళ్లిచూపులు అయ్యాక తనతో ఒంటరిగా మాట్లాడాను. అప్పుడు చెప్పచ్చుగా?”
” ఏమని? మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది… అనా? ఆ సమయంలో మాట్లాడుకోవలసినవి అవే విషయాలా? నాకు తెలీదులే. అందుకని అడుగుతున్నాను. ఒకవేళ అలా అడిగితేమాత్రం నువ్వు చేసుకునే వాడివేనా?”
“నేను చేసుకోనేమోనని భయపడి మోసం చేయడం తప్పు కాదా?”
“సరే …అవన్నీ వదిలెయ్. నీకు తనంటే ప్రేమేగా?” సూటిగా అడిగింది సింధు.
“ఇప్పుడు మాత్రం లేదు” స్పష్టంగా అన్నాడు భాస్కర్. సింధు చకితురాలయింది ఇంత తేలికైనదా ప్రేమంటే? ఒక చిన్న స్పర్థకీ మరో చిన్న గొడవకీ తేలిపోయేంత తేలికైనదా? అపనమ్మకంగా అనుకుంది.
ఎవరి పెళ్లిలోనో శాంతిని చూసి ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ఆమెనే చేసుకుంటానని పంతం పట్టి పెళ్ళిదాకా వచ్చిన అతను పీటలమీదనించి లేచి వచ్చేసాడు. అతనిది చపలచిత్తం అనుకోవాలో లేక అతని మనసు అంతగా విరిగిపోయిందనుకోవాలో అర్థం కాలేదు. కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకడం లేదు. అతను పైకి చెప్తున్నది కాకుండా లోపల ఇంకేదో కూడా ఉండి ఉండొచ్చనిపించింది. అది అంతర్గత భయమో , మరేదో కావచ్చు. అది ఒక నిర్దుష్టమైన రూపుదిద్దుకునేదాకా అతనేమీ నిర్ణయించుకోలేకపోవచ్చు. అలాంటి స్థితిలో ఏం చెప్పినా వినిపించుకోడు. చాలాసేపు అక్కడే ఉండి అతనింకేం మాట్లాడకపోవడంతో అక్కడినుంచీ వెళ్ళింది.
అసలే ఆలోచనల కొలిమిలో కాగుతున్న భాస్కర్ మస్తిష్కం సింధు మాటలతో మరింత వేడెక్కింది. ఆమె ప్రత్యేకంగా అన్నదేమీ లేదు. చల్లబడుతున్న కుంపటిని ఒకసారి విసిరి వెళ్ళింది.
తమ పెళ్లికి దారితీసిన పరిస్థితులు… అది పూర్తవకుండానే విచ్ఛిన్నం కావడం వరసగా గుర్తొచ్చాయి. స్నేహితుడి పెళ్లిలో చూశాడు శాంతిని. పనులతో సతమతమవుతూ మామూలు చీర కట్టుకుని హడావిడిగా తిరుగుతుంటే తన చూపులు ఆమె వెన్నంటే సాగి పోయాయి. గుంపులు గుంపులుగా తిరుగుతున్న అమ్మాయిలుగానీ అల్లరిచేస్తూ పెళ్ళికొడుకుని ఆట పట్టిస్తున్న అబ్బాయిలుగానీ ఆమెని చూడటం లేదు. ఆమె ఉనికిని పట్టించుకోవడం లేదు. కానీ అన్ని చోట్లా… అన్ని పనుల్లోనూ… ఆమే ఉంది.
” ఎవర్రా ఆ అమ్మాయి? ” ఉండబట్టలేక పెళ్ళికొడుకుని నేరుగా అడిగేసాడు.
” తనా? శాంతి” అన్నాడతను మామూలుగా అదంత పట్టించుకోదగ్గ విషయం కాదన్నట్టు.
” ఎవరంటే?” విసుక్కున్నాడు తను. పక్కనున్న పెళ్ళికూతురు చిన్నగా నవ్వి పెదాలకి చెయ్యి అడ్డం ఉంచుకుంది.
“మా బాబాయ్ కూతురు. తల్లీ, తండ్రీ ఇద్దరూ లేరు. మా పెదనాన్నగారింట్లో ఉంటుంది” అయిష్టంగా వచ్చింది జవాబు. ఇంకేమీ అడగలేక ఊరుకున్నాడు.
ప్రేమ ఎప్పుడు, ఎందుకు, ఎవరిమీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అంత అనిశ్చితంగా పుట్టే ప్రేమే మనిషి జీవితాన్ని శాసిస్తుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. శాంతిని చూశాక అప్పటిదాకా ఏదో సుషుప్తిలో ఉండి ఒక్కసారి జాగృతిలోకి వచ్చినట్టైంది భాస్కర్ కి.
కళ్ళు తెరిచినా మూసినా ఆమే. మనసు నిండా ఆమే. అతని ఆలాపన ఆమె గుండెల్ని తాకిందో లేదో.
పెళ్లినుంచి వచ్చేశాక శాంతి ఆలోచనలు మరీ ఎక్కువయ్యాయి భాస్కర్ లో. ఈ మార్పుని ముందుగా గుర్తించింది సింధు.
” అన్నయ్యా! ఎవరా అమ్మాయి?” అమాయకంగా అడిగింది.
” శాంతి “పరధ్యానంగా జవాబిచ్చాడు . నవ్వేసింది. అతను దొరికిపోయాడు. అన్నీ వివరంగా చెప్పక తప్పలేదు. తల్లిదండ్రులతో తనే ప్రస్తావించింది ఆ విషయం.
“తల్లిదండ్రులు లేక ఎవరింట్లోనో బ్రతుకుతున్న పిల్లని చేసుకోవడమేమిట్రా? నీకేం కర్మని?”” తల్లి గొడవ చేసింది. ముద్దు ముచ్చట్లు జరగవని ఏడ్చింది .
” ఈ వయసులో ఆకర్షణ ఇలాగే ఉంటుంది. అది శాశ్వతం కాదు. ఒక్కసారి చేసుకుని జీవితాంతం అనుభవించేది పెళ్లి. నువ్వు చేసుకునే పెళ్లి యొక్క పర్యవసానం నువ్వొక్కడివే కాదు, నీ పిల్లలు ,వాళ్ళ పిల్లలు ఇలా అనువంశికంగా అనుభవిస్తారు. దానికి ఆకర్షణ పునాది కాకూడదు. నా మాట విను .తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాధలా బతుకుతున్న దురదృష్టవంతురాలిని చేసుకోవాల్సిన అవసరం నీకేంటి?” తండ్రిని నచ్చజెప్పబోయాడు.
భాస్కర్ వినలేదు.
చేసేది లేక కబురుపంపారు. పెళ్లిచూపులు, మాటలు ,నిశ్చితార్థం …అన్నీ చకచక జరిగిపోయాయి.
“తల్లిదండ్రులులేని పిల్లని ఏ లోటూ చేయము. కట్నం కూడా ఇస్తాము. మా తమ్ముడు మెడిసిన్ చదువుతూ యాక్సిడెంట్లో చనిపోయాడు. దీన్ని ప్రసవించి వాడి భార్య కూడా చనిపోయింది” అంటూ కుటుంబపరిస్థితులు చెప్పాడు ఈశ్వర్రావు.
అక్కడితో భాస్కర్ తండ్రి కట్నం రాదని లోపల్లోపల పడుతున్న గుంజాటన కూడా తీరిపోయింది. ఆయన మనసు శాంతిపట్ల ప్రసన్నమైంది. కట్నం తీసుకోవడంలోని తప్పొప్పుల వితరణ కాదుగానీ తల్లిదండ్రులు శాంతిని మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి సంసిద్ధులయ్యారనేది భాస్కర్ సంతోషించిన విషయం.
పెళ్లిరోజు …
పక్కన శాంతిని చూస్తుంటే అతని మనసు పరవశించిపోయింది. మల్లెపువ్వులా వికసించింది. మధురోహల పరిమళాలు వెదజల్లింది. జరుగుతున్న తతంగాలన్నీ విసుగు పుట్టిస్తున్నాయి. తనతో ఏకాంతం కోసం ఇంకా ఎంతసేపు నిరీక్షణ?
సరిగ్గా అప్పుడే అపశృతి మొదలయింది. ఊహల్లో విహరిస్తున్న భాస్కర్ ని వాస్తవంలోకి తీసుకొస్తూ అతని చిన్నాన్న దగ్గరకు వచ్చి,” ఒక్క నిమిషం ఇలా రారా!” అని పిలుచుకెళ్ళాడు.
వెళ్లేసరికి అతనివాళ్లంతా తర్జనభర్జన పడుతున్నారు.
” వద్దువద్దంటే విన్నావుకాదు. దరిద్రపు సంబంధం. శాంతి తల్లి బతికే ఉందట. ఎవరితోటో పోయిందట “అంది తల్లి అతన్ని చూసి ఏడుస్తూ.
స్థాణువైపోయాడు భాస్కర్. అబద్ధం ఆడి… మోసం చేసి… పెళ్ళికి ఒప్పించారు. అందుకే అప్పుడు పెళ్లిలో శాంతి గురించి అడిగినప్పుడు మోహన్ నిరాసక్తత చూపించాడు. తన తెలివితక్కువతనానికి నవ్వుకుంటున్నాడేమో! స్నేహితుడైవుండికూడా ఎందుకు ఇలా చేసాడు? ఆ విషయం ఎందుకు దాచాడు? రక్తం ఉడికిపోయింది.
దిక్కులేని పిల్లంటే పోనీ పాపం అనుకున్నాం. కట్నకానుకలు ఇస్తామంటే ఆయనది మంచిమనసనుకున్నాం. ఇలా ఇంత మోసం చేస్తారనుకోలేదు . ఆడవాళ్ళు రెండోపెళ్లి చేసుకోవడం ఎక్కడా వినలేదు. పెళ్లే చేసుకుందో చేసుకుందని చెప్పుకుంటున్నారో! అన్నీ సవ్యంగా ఉంటేనే ఆడవాళ్ళకి పెళ్లిళ్లు ఇవ్వడం లేదు. అలాంటిది భర్తపోయినదాన్ని, పిల్ల తల్లిని చేసుకునేవాళ్ళవరు? అదీ ఆ రోజుల్లో? ఎలాంటి బతుకు బతుకుతోందో? కూతుర్ని చూసుకోవడానికి వస్తుంటుందేమో? ఆవిడే పెడుతోందేమో, యీ పెళ్లి ఖర్చు?ఛీ.. .ఛీ…ఎంత పరువు తక్కువ, అలాంటి తల్లికి పుట్టిన పిల్ల మనింటి కోడలంటే?” తల్లి మాటలు వచ్చి కంకర్రాళ్ళలా మనసుని తాకుతుంటే రెండు చేతులతోటీ తల పట్టుకున్నాడు భాస్కర్.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.