ఊహ తెలిశాక మొదటిసారి తల్లిని చూడటానికి వెళ్తున్న శాంతిలో కొంత కుతూహలం తప్పించి మరేమీ లేదు. తను ఇప్పటి ఈ పరిస్థితిలో ఉండటానికి తల్లే కారణమని అంతర్గతంగా కొంచెం కోపం ఉంది. పసితనంలోనే తన బాధ్యత వదిలించుకున్న ఆవిడని కలవక తప్పని పరిస్థితి కల్పించిన భాస్కర్ పట్ల మరికాస్త ఎక్కువే కోపం ఉంది. ఇన్నేళ్లు పెరిగిన ఇల్లు వదిలి వెళుతున్నందుకు మనసులో ఎక్కడో కలుక్కుమంది.
సావిత్రి కొడుకుతో వెళ్లేముందు మాటవరసకి ఒక్కమాటంది,” చేరాక కార్డు రాసి పడేయి” అని. ఆవిడెంత ఉదాసీనంగా అందో శాంతికూడా అంతే ఉదాసీనంగా తలూపింది. అంతే! అక్కడితో ఆమెకి వాళ్లతో ఉన్న అనుబంధం సరి.
వెళ్లేచోట తనకి స్థానం ఉంటుందా? ఉండదా? ఈ ఒక్క సందేహం మాత్రం అన్నిటినీ అధిగమించి ఆమె మనస్థితిని అదుపులోకి తీసుకుంది. నిజమే! వాళ్లు తనని రానివ్వకపోతే ఏం చేయాలి? ఉండమనకపోతే ఎక్కడికి వెళ్లాలి? ఈ ప్రశ్నలకి జవాబులు నాయనమ్మ మొహంలో వెతుక్కుందిగానీ దొరకలేదు.
నిజానికి వర్ధనమ్మకి కూడా శాంతికక్కడ ఆశ్రయం దొరక్కపోతే ఏం చేయాలో తెలీదు. దేవుడి మీద భారం వేసి ఊరుకుంది. తల్లీపిల్లల్ని వేరుచేసినదానికి పర్యవసానం ఇలా కనిపిస్తుంటే భవిష్యత్తులో ఇలా జరుగుతుందేమోనని ఆరోజున ఎందుకు ఊహించలేకపోయానని కుమిలిపోతోంది.
శాంతి తాతగారిల్లు తేలిగ్గానే దొరికింది. అయితే, ఆయన, ఆయన భార్య లేరిప్పుడు. చనిపోయి చాలా కాలమైంది. వాళ్లకిద్దరు కొడుకులు. పెద్దతను లక్నోలో ఉంటాడు. రెండోవాడు శ్రీకాంత్. అతడూ, అతని భార్యే ఇప్పుడా ఇంట్లో ఉండేది. శ్రీకాంతే వీళ్ళకి తలుపు తీశాడు. పచ్చగా పండిన నిమ్మపండులా ఉన్న అతనిమించీ చూపు తిప్పుకోలేకపోయింది వర్ధనమ్మ. ఆవిడ కళ్ళలో ఏదో బాధ కదలాడింది. శ్రీకాంత్ ఆవిడ్ని పోల్చుకున్నాడు. పోలికలనుబట్టి శాంతినీ గుర్తుపట్టాడు. హఠాత్తుగా వీళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు.
” నమస్కారం. రండి. బావున్నారా? ఇది శాంతి కదూ? ఏడు మల్లెలెత్తు మీ రాకుమారిని ఇంత దూరం తీసుకొచ్చారేంటి? అసలు మీరేంటి? మా ఇంటికి రావడమేంటి?” అతనెంత మామూలుగా అందామనుకున్నా కోపం దాగలేదు.
శాంతిని పుట్టగానే అతనికి చేసుకోవాలనుకున్నారు. ఆ విషయాన్నతను మర్చిపోలేదు. శాంతి కోసం అక్క కళ్ళల్లో నిరంతరం తొంగిచూసే దిగులు ఆ విషయాన్నలాగే పట్టి ఉంచింది. ఉద్యోగం రాగానే అతని తల్లిదండ్రులు మధ్యవర్తిని పంపారు. ఈశ్వర్రావు ఒప్పుకోలేదు. వెళ్లినవాళ్ళని అవమానించి పంపేశాడు.
అక్కకోసం… కేవలం ఆమె సంతోషంకోసం జరిగిన
గొడవలన్నీ పక్కకి పెట్టి వాళ్లు తమకి చేసిన అవకాశాలన్నీ మర్చిపోయి తనుగా వెళ్లి ఈశ్వర్రావుని అడిగాడు. ఆ పిల్ల ఎలా ఉంటుందో అతనికి తెలియదు. రూపసో కాదో తెలీదు. చదువుకుందో లేదో తెలీదు. తన పక్కని నిలబడ్డానికి అర్హురాలౌనో కాదో తెలీదు. అవన్నీ అప్రధానం అనుకున్నాడు. విడిపోయిన తల్లీ కూతుళ్ళని కలపడమే ముఖ్యమైనదిగా భావించాడు. శాస్త్రీయంగా తప్పే అయినా కొన్ని అనుబంధాలని నిలబెట్టుకోవడానికో పునరుద్ధరించడానికో మేనరికపు సంబంధాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకున్నవాళ్ళుకూడా చేసుకుంటూనే ఉన్నారు. కొట్టినట్టే చెప్పాడు ఈశ్వర్రావు, ” ఒకసారి ఆ ఇంటి పిల్లని తెచ్చుకుని నలుగురిలో నవ్వులపాలయ్యాము. నీతీ జాతీ లేని మీ ఇంటికి పిల్లనిచ్చి మరోసారి అవమానం పొందలేము” అని.
శ్రీకాంత్ తలవంచుకుని వచ్చేసాడు. ఆరోజుని వర్ధనమ్మ అక్కడే ఉంది. కొడుకు శ్రీకాంత్ ని కాదని పొరపాటు చేశాడనిపించింది. అప్పుడు అతనికి ఎదురు చెప్పలేక ఊరుకుంది. మాట పంతానికి కట్టుబడిపోయికూడా ఊరుకుంది. జరిగింది తప్పని ఇప్పుడు ఇంకా బలంగా అనిపించింది. కానీ, ఏం లాభం? తప్పో వప్పో జరిగిపోయింది. దాన్నెవరూ మార్చలేరు.
ఆ అవమానం శ్రీకాంత్ గుండె రగిల్చింది. ఆశగా ఎదురు వచ్చిన అక్కతో అన్నాడు,” అది వాళ్ల పిల్ల. దాన్ని గురించి నువ్వేడవడం దండగ. ఆ గూటిలో చిలక ఆగూటి పలుకులే పలుకుతుందన్నట్టు నన్ను చూడ్డానికి కూడా రాలేదు. అంతఃపురకాంతలా గదిలోనే ఉండిపోయింది”.
ఈనాటికీ అతని మనసులో ఆ గాయం పచ్చిగానే ఉంది.
బావున్నారాని శ్రీకాంత్ అడగ్గానే వర్ధనమ్మకి అసమర్థతతో కూడిన కోపం పొంగుకొచ్చింది.” ఏం బాగులే నాయనా! మీరూ మీరూ బాధ్యతలు దులుపుకుని బాగానే ఉన్నారు. ఎటొచ్చీ సమస్యలూ తలవంపులూ మాకే. మా శ్రీధర్ జ్ఞాపకంగా దీన్ని పెంచుకుని పెళ్లి చేసి పంపిద్దమాని తీసుకెళ్ళాం. మీ అక్క చరిత్ర తెలిసి పెళ్ళికొడుకు పీటలమించీ లేచి వెళ్ళిపోయాడు” అంది.
శ్రీకాంత్ నివ్వెరపోయాడు. శాంతికి పెళ్లా? అది ఆగిపోయిందా? అపనమ్మకంగా చూసాడు. మెడలో బంగారు గొలుసుతో చిక్కుపడి ఉన్న పసుపుతాడు, చేతుల నిండా ఎరుపు ,ఆకుపచ్చ మట్టి గాజులతో విరబూసిన లతలా ఉన్న శాంతి జీవితంలో అప్పుడే అపశృతి మొదలా? కోపంతో అతని ముఖం ఎరుపెక్కింది.
” మా అక్కయ్యమీది కోపం తనమీద తీర్చుకుని ఆ గొప్పతనం మాకు చూపెట్టాలని వచ్చారా? అక్కకి తెలీకుండా పెళ్లి చేయడానికి మీరెవరసలు?” కొట్టినట్టే అడిగాడు.
అతని గొంతులో తీవ్రతకి శాంతి బెదిరిపోయింది.
” చెయ్యక? తీసుకెళ్లిన పిల్లని అలాగే ఉంచెయ్యమంటావా? మామూలు సంబంధం కాదు. అతడు లెక్చరరు. లక్ష కట్నం. తల్లి సంగతి దాచిపెడితేనే కుదిరింది. విషయం బయటపడింది. వాళ్లు తిరిగిపోయారు'” వర్ధనమ్మ ఏ మాత్రం జంకకుండా జవాబిచ్చింది.
ఆవిడతో మాట్లాడడం వ్యర్థమనిపించింది శ్రీకాంత్ కి. ఏడుస్తున్న రెండేళ్ల శాంతిని బరబరా రెక్క పుచ్చుకుని లాక్కెళ్లినప్పటి ఆవిడ రూపం ఇంకా అతని కళ్ళకి కట్టినట్టుంది. మనుషులేం మారలేదు… తిరస్కారంగా అనుకున్నాడు.
” శాంతీ! నువ్వు లోపలికి పద. అత్తని పరిచయం చేస్తాను” ఆవిడ ఏదో అనేలోపు శాంతిని లోపలికి తీసుకెళ్లి రాధకి పరిచయం చేసి మళ్లీ వచ్చాడు.
” మీరు నాకేమీ చెప్పకండి. మా అక్కయ్య వరంగల్లో ఉంటుంది. తనకి ఫోన్ చేస్తాను. రెండు మూడు గంటల్లో ఇక్కడ ఉంటుంది. తనతో తేల్చుకోండి” నిర్మొహమాటంగా అన్నాడు వర్ధనమ్మ ఇంకా ఏదో చెప్పబోతుంటే. ఆవిడ ఇంకేమీ మాట్లాడలేదు. లోపలినుంచీ రాధ ట్రేలో మంచినీళ్లూ కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది.
” అక్కయ్యవాళ్లూ వస్తారు. వంటకి ఏర్పాట్లు చూడు” అన్నాడు శ్రీకాంత్ .
” కాఫీ తీసుకోండి” అతనికి జవాబుగా తల ఊపి అంది రాధ వర్ధనమ్మతో.
ఆవిడ వద్దంది. శ్రీకాంత్ సెల్ తెచ్చుకుని కూర్చున్నాడు. చాలాసేపటికిగానీ కిరణ్మయి నెంబర్ కలవలేదు. పరిస్థితి క్లుప్తంగా చెప్పి వెంటనే రమ్మన్నాడు.
” ఆవిడ ఏవేవో చెప్తోందిగానీ నువ్వు వచ్చాక మాట్లాడకుందామన్నాను” అన్నాడు.
” శాంతి ఇప్పుడక్కడ ఉందా?” ఆతృతగా అడిగింది కిరణ్మయి.
” మాట్లాడతావా?” అని అడిగి-
” శాంతీ!” అని పిలిచాడు. ఆమె వచ్చింది.
” అమ్మ… మాట్లాడుతోంది” ఫోను ఆమెకిస్తూ చెప్పాడు. ఆమె అందుకుందిగానీ ఏం మాట్లాడాలో తోచలేదు. ఒక పెద్ద సుడిగాలేదో తనని చుట్టుముట్టినట్టు ఉక్కిరిబిక్కిరైంది.తల్లి చెప్పినవన్నీ మౌనంగా విని ఫోన్ పెట్టేసింది. కూతుర్ని చూడాలన్న ఆరాటం కిరణ్మయి మాటల్లో ఎంతో వ్యక్తమైనా చిత్రంగా శాంతిలో అలాంటి భావనేమీ కలగలేదు.
” స్నానం చేసి వస్తావా? వేణ్ణీళ్లు పెట్టనా?” అడిగింది రాధ. చన్నీళ్ళే చేస్తానంది శాంతి. స్నానం ముగించి వచ్చేసరికి వేడివేడి ఉప్మా ప్లేట్ లో పెట్టి అందించింది రాధ.
” తొందరగా వంట చేసేస్తాను. తిందువుగాని. ఎప్పుడు తిన్నావు ఏమో!” అంది.
” అంత తొందరేం లేదులే అత్తయ్యా! ” అంది శాంతి ఇబ్బంది పడుతూ. వచ్చాక అదే మొదటిసారి ఆమె మాట్లాడటం.
” అచ్చం వదిన గొంతులాగే ఉంది శాంతీ, నీ గొంతు కూడా” అంది రాధ ఆశ్చర్యంగా. శాంతి నవ్వింది.
ఉప్మా ఇవ్వబోతే వర్ధనమ్మ వద్దంది.
” వాళ్ల మొండితనాలంతే” శ్రీకాంత్ చిరచిర్లాడాడు. పెద్దావిడ ఏమైనా అనుకుంటుందని రాధ భయపడింది. ఆవిడ నిస్త్రాణగా సోఫాలోనే కొంగు పరచుకుని పడుకుంది.
రాధ వంట మొదలు పెట్టింది. శాంతి అక్కడే కూర్చుని ఏవో కబుర్లు చెబుతూ కూరలు తరగబోయింది.
” వద్దు. నేను చేసుకుంటాను. ఎంత పని?” రాధ వారించింది.
” ఇద్దరం చెరో పనీ చేస్తే తొందరగా అయిపోతుంది” అంది శాంతి.
శ్రీకాంత్ వాళ్ల దగ్గరికి వచ్చాడు. ” ఈపాటికి అక్కయ్యావాళ్ళూ బయలుదేరే ఉంటారు” అన్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.