సంగమం 5 by S Sridevi

  1. సంగమం 1 by S Sridevi
  2. సంగమం 2 by S Sridevi
  3. సంగమం 3 by S Sridevi
  4. సంగమం 4 by S Sridevi
  5. సంగమం 5 by S Sridevi
  6. సంగమం 6 by S Sridev
  7. సంగమం 7 by S Sridevi
  8. సంగమం 8 by S Sridevi
  9. సంగమం 10 by S Sridevi
  10. సంగమం 11 by S Sridevi

శాంతికి ఎన్నో సందేహాలు! ఎవరెవరు వస్తున్నారు? తల్లిని చేసుకున్నాయన కూడా వస్తాడా? తల్లినంటే సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మా అంటుంది. ఆయన్నేమని పిలవాలి? ఆయన తనని వాళ్లతో తీసుకెళ్లడానికి ఇష్టపడతాడా? వాళ్లకి ఇంకా పిల్లలా?
“వరంగల్ పెద్దవూరా మావయ్యా?” అనడిగింది.
” పెద్దదే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ ఉన్నాయి. రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇంకొకటి తయారవుతోంది. తెలంగాణా ప్రాంతంలో హైదరాబాద్ తర్వాత పెద్దది అదే. అక్కయ్యా బావా అక్కడ లెక్చరర్స్. వాళ్లకి ముగ్గురు పిల్లలు. వాళ్లు కూడా వస్తున్నారు. నువ్వే చూద్దువుగాని” అన్నాడు. శాంతి మాట్లాడలేదు. ఏదో ఇబ్బందిగా అనిపిస్తోంది.
” మాకెవరికీ చెప్పకుండా ఈ పెళ్లేమిటి? అసలు గొడవ ఎందుకు వచ్చింది?” అడిగాడు.
” వీళ్లేమో అమ్మ చచ్చిపోయిందని అబద్ధం చెప్పారు. తీరా సూత్రధారణ అయిన కాసేపటికే అసలు విషయం తెలిసిపోయింది.”
” అక్కయ్య చనిపోయిందని చెప్పారా? ఎంత రాక్షసత్వం?” శ్రీకాంత్ ముఖం కోపంతో ఎర్రబడింది.
” అతనికీ అదే కోపం, అబద్ధం ఎందుకు చెప్పాలని” అంది శాంతి. శ్రీకాంత్ కి భాస్కర్ మంచివాడిలాగే తోచాడు. తామొకసారి వెళ్ళి మాట్లాడి తమ వైపు వాదన కూడా వినిపిస్తే అర్థం చేసుకుంటాడనిపించింది.
” వాళ్లకిచ్చిన కట్నం డబ్బు తిరిగి ఇచ్చేశారు. పెద్దనాన్నావాళ్లూ వెళ్తే ఏ సంగతీ చెప్తానని మూడోరోజున జవాబుగా విడాకులు కాగితాలు పంపించాడు. దాంతో పెద్దనాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఫస్ట్ స్ట్రోక్ కే పోయాడు” పరిస్థితులు వివరించింది శాంతి.
” అప్పుడు నీకూ, మీ బామ్మకీ అమ్మ గుర్తొచ్చిందా? ” శ్రీకాంత్ కాస్త వ్యంగ్యంగా అన్నాడు.
” పోనీ అమ్మకి నేనెప్పుడైనా గుర్తొచ్చానా?” శాంతి తిరిగి అడిగింది. ఆ గొంతులో పదుతుంది. అతను సర్దుకున్నాడు.
” నువ్వే చూద్దువుగాని” తమాషాగా భుజాలెగరేశాడు.
తను కొత్త వ్యక్తి అనిగానీ తన రాక ఏ సమస్యల్ని సృష్టిస్తుందోననిగానీ ఆలోచించకుండా వాళ్లు తనతో ఫ్రీగా వుండటం శాంతికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమెలో యేళ్ళతలబడి నిద్రాణమైపోయిన చైతన్యమేదో నెమ్మదిగా వూపిరి పీల్చుకుని కదలడం మొదలుపెట్టింది. తల్లిపట్ల కొంత అభిమానం కూడా మొదలైంది . ఆవిడేదో ప్రశాంతంగా బతుకుతోంది. తన రాకవల్ల ఏం గొడవలు వస్తాయోనని భయం వేసింది. అక్కడ ఈశ్వర్రావు ఇంట్లో ఇక్కడికి వెళ్తానని అన్నప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడు మొదలయ్యాయి.
“మామయ్యా! ” సంకోచంగా పిలిచింది. సందిగ్ధంగా ఆగిపోయింది. ఏంటన్నట్టు చూశాడతను.
” నేనిప్పుడు అక్కడికి… అంటే వాళ్ల మధ్యకి ఎందుకు? నాలాంటి వాళ్లకి ఏవో ఆశ్రమాలు ఉంటాయంట కదా చేర్పించకూడదూ?” తలవంచుకుని అడిగింది.
” శాంతీ!” శ్రీకాంత్ కదిలిపోయాడు. అసలామె అలా ఆలోచిస్తోందని కూడా ఊహించలేదు. వెంటనే ఏమనడానికీ మాటలు దొరకలేదు. తనకన్నా నాలుగైదేళ్లు చిన్నదైన శాంతిని చూస్తుంటే రాధకి కూడా జాలివేసింది. ఈ కుటుంబంలో గొడవలు ఆమెకి కొంతవరకు తెలుసు. తల్లి ఒద్దికలో అపురూపంగా పెరగవలసిన వ్యక్తికి ఎన్ని సమస్యలు! గోపాలకృష్ణ… అంటే కిరణ్మయి భర్త …. ఎంత మంచివాడేనా కావచ్చు. ఒకప్పుడు శాంతితో సహా కిరణ్మయిని స్వీకరించడానికి ముందుకి వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు శాంతిని తీసుకెళ్లడానికి వప్పుకుంటాడో, వప్పుకోడో? అప్పుడీమెకి దారి?
” అవే మాటలు శాంతీ? అలా ఎందుకాలోచిస్తున్నావు? నీకోసం మీ అమ్మ ఏడవని రోజు లేదు. నిన్ను తలుచుకోని క్షణం లేదు. గోపాలకృష్ణగారు చాలా మంచివారు. నువ్వేమీ మనసులో పెట్టుకోకు” అంది పైకి. తన మాటలు తనకే వెలితిగా అనిపించాయి.
” శాంతీ! మీవాళ్లు నీకేమి చెప్పారో నాకైతే తెలీదు. బావ నీ బాధ్యతతోసహా అక్కని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు” అన్నాడు శ్రీకాంత్.
” అదప్పటి మాట” అంది శాంతి.
” సరే, నువ్వన్నట్టే జరిగితే నీకు మేము వున్నాము. నిన్ను చదివించి ఏదో ఒక ఉద్యోగంలో నిలబెట్టే బాధ్యత నాది. సరేనా?”
” నాకైతే అర్థం కాదు మామయ్యా! నా బాధ్యత మీ అందరికీ ఒక సమస్యగా తయారైందేమిటి?”
” ఎక్కడివాళ్ళు అక్కడే ఉంటే ఏ గొడవలూ రావు. మీ నాన్న ఉంటే ఆ సంగతి వేరే. ఇక్కడుండి మా మధ్యని యిమిడిపోవలసిన దానివి… నిన్ను తీసుకెళ్ళి అక్కడ అతకని చోట అతికించాలి అని చూశారు. దాంతో వచ్చిన సమస్యలు ఇవన్నీ. అంతేగానీ నువ్వు సమస్య కాదు, ఎవరికీ ఎప్పుడూ కూడా” స్పష్టంగా అన్నాడు.
ఈ పిల్ల… తన భార్య కావలసినదీ… ఈ ఇంటినీ, తన హృదయసామ్రాజ్యాన్నీ తిరుగులేకుండా యేలవలసినదీ… ఇప్పుడింత దయనీయమైన స్థితిలో ఉందనే భావన అతని గుండెల్లో ముల్లులా కలుక్కుమంటుంది.
” ఏం చదువుకున్నావు శాంతీ?” రాధ మాట మార్చింది.
“ఇంటరు పాసయ్యాను”
“ఇంకేం? ఏ గ్రూపు?””
“”ఆర్ట్స్””
“”అతను?””
“”లెక్చరర్”” అని చెప్పి సంభాషణ ఇంకా ముందుకు పోకుండా ఆపడానికి లేచి నిల్చుంది శాంతి.” బామ్మ ఏం చేస్తోందో చూసొస్తాను” అంటూ ముందుగదిలోకి వెళ్ళింది.
ఇప్పుడే ఇంటిముందు టాక్సీ ఆగింది.
సోఫాలో పడుకున్నదల్లా చప్పుని లేచికూర్చుంది వర్ధనమ్మ. శాంతి కుతూహలంగా చూసింది.
ముందు గోపాలకృష్ణ, వెనక కిరణ్మయి, వాళ్ళ వెనక బిలబిల్లాడుతూ పిల్లలు ముగ్గురూ దిగారు.
ఆమేనా, తన తల్లి? ఎంత అందంగా ఎంత బాగుందో! తెల్లగా ఎత్తుగా దృఢంగా ఉంది. నాచు రంగు జరీచీర, జాకెట్టు, నుదుట కుంకుమతో హుందాగా ఉంది. ముఖం చాలా ప్రశాంతంగా ఉంది. పెదవులమీద చిరునవ్వు తళుక్కుమంటోంది.
గోపాలకృష్ణ అంటే ఆయనేనా? వాళ్ళిద్దర్నీ చూస్తుంటే ఎలాంటి అసహ్యం కలగలేదేంటి? శ్రీకాంత్- రాధల్లా, తాను- భాస్కర్లలా, పెద్దమ్మ – పెద్దనాన్నల్లా… తను చూసిన ఇంకెందరో జంటల్లాగే వీళ్ళూ ఉన్నారు.
” ఏంటే శాంతీ, అలా చూస్తున్నావు?” ప్రేమగా దగ్గరికి తీసుకుంది కిరణ్మయి. తన దగ్గర్నుంచి దూరమైన పసిపిల్ల గుర్తుకొచ్చి గుండె బరువెక్కింది. శాంతిని ముద్దులతో ముంచెత్తాలనీ ఆర్తిగా గుండెలకి హత్తుకోవాలనీ ఇంకా ఏమేమో అనిపించింది కానీ ఏం చేయటానికైనా ఆమె అప్పటి పసిపిల్ల కాదు. పైగా చేతులకి గలగలమంటున్న గాజులు, మెడలో శబ్దం చేస్తున్న మంగళసూత్రాలు… కిరణ్మయికి ఇబ్బంది కలిగించాయి. ఎప్పుడయింది పెళ్లి? తనకి కనీసం తెలియజేయకుండా ఎందుకు చేశారు? ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఇంత హఠాత్తుగా సంతోషంగానో, వాళ్ల ప్రజ్ఞ చూపించుకోవాలనో పంపితే శాంతి భర్తతో రావాలికానీ ఈ రావడమేమిటి? సూటిగా వర్ధనమ్మకేసి చూసింది.
ఒకప్పుడు తన కొడుకు చిటికెన వేలు పట్టుకుని తనింటికి నడిచివచ్చిన ముగ్ధ ఈరోజుని నడివయస్కురాలయింది. జీవితంలో విలువైనవన్నీ పోగొట్టుకునికూడా తిరిగి సంపాదించుకుంది. ఇల్లు, సంసారం, పిల్లలు అన్నీ ఏర్పరుచుకుంది. కానీ తన కొడుకు? తిరిగిరాని తీరాలకి వెళ్ళిపోయాడు. ఆవిడ ఆక్రోశించింది. కిరణ్మయి చూపులని ఎదుర్కోలేకపోయింది.
” నీ కూతుర్ని నీకప్పగించాలని వచ్చాను” మాటలు పేర్చుకుని అంది.
” నా కూతుర్ని నాకప్పగించడమేమిటి, దొంగ సొత్తు అప్పగించినట్టు?” హేళనగా అడిగింది కిరణ్మయి. ఎంత దాచుకుందామన్నా కోపం దాగడం లేదు.
ఇక్కడికి రాకముందు వర్ధనమ్మ కిరణ్మయి గురించి రకరకాలుగా ఊహించుకుంది. ఆమె చేసుకున్న రెండోపెళ్లిని ఆవిడెప్పుడూ శాస్త్రసమ్మతమైనదిగా, మామూలు పెళ్లిగా గుర్తించలేదు. అది వుంచుకోవడమేనని ఆవిడ అభిప్రాయం. అదీకాక ఆ రెండో పెళ్లి చేసుకున్నవాడికి మరో సంసారం ఉంటుందనీ, అతను ఈమెని హింసిస్తూ ఉంటాడనీ ఊహించుకుని సంతృప్తిపడేది. అవన్నీ తలకిందులయ్యేసరికి కసిగా ఉంది. అందునా నిండైన భారీ విగ్రహంతో సంస్కారమూర్తిలా గోపాలకృష్ణ కనిపిస్తుండేసరికి అసూయతో జ్వలించిపోయింది.
శాంతి జీవితం ఇలా కావడానికి కిరణ్మయిదే తప్పంతా అని వాదించి వప్పించడానికి నిర్ణయించుకుంది. అందుకే అంది-” పసిదాన్ని… దాని ఖర్మానికి వదిలేసి అతనితో వూళ్ళు పట్టుకు వెళ్లిపోయావు. పెళ్లవకుండానే దాన్నలా వదిలేశారు. ఆ పెళ్లేదో అయ్యాక ఇంకేం చూస్తారని, నా కొడుకు అంశతో పుట్టిన పిల్ల మీకు అడ్డం దేనికని తీసుకెళ్ళాను. అంతేగానీ నీ మీద కోపంతో, సాధించాలన్న పంతంతో ఆ పని చెయ్యలేదు. వేలెడంత పిల్లని ఇంతదాన్ని చేశాం. పెళ్లి చేసి బాధ్యత కూడా తీర్చుకుందామనుకున్నాం.”
” ఏ పంతం ,పట్టుదలా లేకపోతే మా తమ్ముడికి ఎందుకు ఇవ్వలేదు? నాతో అప్పుడు ఏం చెప్పారు మీరు?” కిరణ్మయి విసురుగా అడిగింది.
శాంతి తుళ్ళిపడింది. తనని శ్రీకాంత్‍కా? ఆ విషయం తెలిసి మామయ్య అంత ఫ్రీగా తనతో ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అత్తయ్య మాత్రం? అంత అభిమానం ఎలా చూపించగలిగింది? ఛ…ఛ… అన్నీ అసంబద్ధమైనవే జరుగుతున్నాయేమిటి? లేచి లోపలికి వెళ్లిపోయింది. ఆమెను చూసి రాధ నవ్వింది… కొంచెం ఇబ్బందిగా కూడా.