సంగమం 7 by S Sridevi

  1. సంగమం 1 by S Sridevi
  2. సంగమం 2 by S Sridevi
  3. సంగమం 3 by S Sridevi
  4. సంగమం 4 by S Sridevi
  5. సంగమం 5 by S Sridevi
  6. సంగమం 6 by S Sridev
  7. సంగమం 7 by S Sridevi
  8. సంగమం 8 by S Sridevi
  9. సంగమం 10 by S Sridevi
  10. సంగమం 11 by S Sridevi

“లేవండి. లేచి స్నానం చేసి కాస్తేదైనా తినండి” అంది మృదువుగా. ఆవిడ లేచి కూర్చుంది. ఏడ్చేడ్చి ఎర్రగా ఉబ్బి ఉన్నాయి ఆవిడ కళ్ళు. వడిలిన ఆవిడ బుగ్గలమీంచీ ఇంకా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. చచ్చిపోయిన చిన్న కొడుకుని తలుచుకుని ఏడుస్తోంది. ఇదే ఇంట్లో అతని పెళ్లి జరిగింది. ఆ వేడుకలన్నీ గుర్తొస్తుంటే దుఃఖం ఆగటంలేదు. ఏడుస్తూనే జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పింది.
” పదిమంది పిల్లల్ని కన్నతల్లి మీరు. ఓ కొడుకు పోయినా ఇంకా తొమ్మండుగురు ఉన్నారు. వాళ్లని చూసుకుని బతకగలరు. నాకున్న ఒక్క పిల్లనీ నానుంచి దూరం చేసి మీ కొడుకు జ్ఞాపకార్థం అని వుంచేసుకున్నారు. నా కూతుర్ని నాకు ఇమ్మని వచ్చి బతిమాలుకుంటే మామగారు లోపలికి కూడా రానివ్వలేదు. మీ పెద్దబ్బాయి అన్నరాని మాటలన్నీ అని అవమానించి పంపించారు. ఎందుకిదంతా చేశారు? నామీద కోపంతో కాదంటున్నారు మీరు. మరైతే ఆస్తి కోసమా? పిల్లని నాకు ఇస్తే శ్రీధర్‍గారి ఆస్తి నాకు అప్పజెప్పాల్సి ఉంటుందనా? నేనంత మానాభిమానాలు లేని మనిషిలా కనిపించానా? ఏడాదైనా కాపురం చేయని వ్యక్తి ఆస్తిని మరొకరి భార్య స్థానంలో ఉండి ఆశిస్తానని ఎలా అనుకున్నారు? అదే మీ భయమైతే ఎగ్రిమెంటు రాసుకునేవాళ్ళం కదా? ఆనాడు కోర్టుకెళితే నా కూతురు నాకు దక్కేది. కానీ డబ్బు కోసం దాన్ని ఏం చేస్తారోననే భయంతో ఆ పని చెయ్యలేదు. ఎక్కడో ఒకచోట అది సుఖంగా ఉంటే చాలనుకున్నాను. అయినా నామీద మీకు కక్ష తీరలేదా? నేనేమీ నీతి నియమాలకీ, ధర్మానికీ చెడలేదు. భార్య పోయిన మగవాడు చేసుకున్నట్టే రెండోపెళ్లి చేసుకున్నాను. మగవాడి విషయంలో తప్పు కానిది నా విషయంలో ఎలా తప్పౌతుంది? ఎందుకు? నా కూతుర్ని ఎందుకు శిక్షించారు?” ఆవేదనగా అడిగింది కిరణ్మయి.
” ఇలా జరుగుతుందని మేము మాత్రం అనుకున్నామా?” అంది వర్ధనమ్మ.
” ఇలాంటి వ్యవహారాలు ఇలాగే ముగుస్తాయి. అబద్దమాడి విషయమంతా దాచిపెట్టి పీటలదాకా తీసుకురాగలిగారు అతన్ని. ఆ తర్వాత? అంతకన్నా అన్నీ తెలిసిన మా తమ్ముడికి ఇచ్చి ఉంటే దాని బతుకది బతికేది కదా? చదువు లేక, పీటలమీద పెళ్లి చెడిపోయిన అపఖ్యాతి మీదవేసుకుని వచ్చిన ఈ పిల్లకి నేనే దారి చూపించను?” కిరణ్మయి కూడా ఏడ్చింది.
” దాని కట్నం డబ్బు దాని దగ్గరే ఉంది. ఇంత ఆశ్రయం ఇస్తే ఏదో ఒకలా బతుకుతుంది” అంది వర్ధనమ్మ.
సున్నితమైన భావాలన్నీ క్షణంలో తుడిచిపెట్టుకుపోయి, కిరణ్మయికి ఆవిడని చూస్తే అసహ్యం వేసింది. వయస్సు మీరిన నిస్సహాయతతో ఈవిడలో ఈ సాత్వికత వచ్చిందేగానీ మనిషి నైజగుణం ఏమీ మారలేదు.
” నేనేమో పెళ్లి మీద పెళ్లి చేసుకున్నాను. నా కూతుర్ని మాత్రం మొగుడూ ముద్దులూ లేకుండా ముక్కు మూసుకుని కాలక్షేపం చెయ్యమని సలహా ఇమ్మంటారా? చాల్లెండి” అంది చిరాగ్గా.
తనున్న పరిస్థితికి తనకే జాలి వేసింది కిరణ్మయికి. ఆనాడు బలవంతంగా శాంతిని తననుంచి వేరుచేసినా వీళ్ళకే చెల్లింది, ఇప్పుడిలా అస్తవ్యస్తం చేసి తీసుకొచ్చి వదిలినా వీళ్ళకే చెల్లింది. ఏం చేయగలదు తను? పంతానికి నాకక్కర్లేదు పొమ్మనడానికి శాంతి మరెవరో కాదు, తన కన్నకూతురు. ఒకదారి చూపించాల్సిన బాధ్యత తనకి ఉంది. ఇంకా నయం! నిస్పృహతో ఏ పిచ్చిపనో చేయకముందే తీసుకొచ్చారు.
ఆమెనలా చూస్తుంటే వర్ధనమ్మకి జాలి వేసింది. తన బతుకేదో తను బతుకుతున్న ఈమెని అడకత్తెరలో పెట్టి నొక్కటంలేదుకదా? అనుకుంది. శాంతి విషయంలో తాము వేసినవన్నీ తప్పటడుగులేననిపించాయి. ఇది కూడా మరో తప్పటడుగే అవుతుందా? తీసుకొచ్చి వదిలిపెట్టాలని వచ్చిందిగానీ వయసులో ఉన్న పిల్లని పరాయిమగవాడి ఇంట్లో ఎలా వదిలిపెడుతుంది? మగవాడి మనసు ఎంత చంచలంగా ఉంటుందో తన భర్త, పెద్దకొడుకులే నిదర్శనం. భగవంతుడా! ఇప్పుడేది దారి? నిస్సహాయంగా అనుకుంది.
పిల్లల జీవితాలని అందంగా రచించే కళ తల్లితండ్రులకే వస్తుంది. పైవాళ్లెవరు అందులో చేయిపెట్టినా అస్తవ్యస్తమవుతుంది. అందుకే ప్రపంచంలోని ఇంతమంది అనాథల జీవితాలు ఇన్ని అనాధాశ్రమాలున్నా అస్తవ్యస్తంగానే ఉన్నాయి.
ఆవిడ మౌనం కిరణ్మయికి దుస్సహంగా ఉంది. అంతలోకే వివేకం తెచ్చుకుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఈ ముసలావిడ్ని ఎన్నిమాటలన్నా లాభం లేదు. జరగాల్సినదానిగురించి ఆలోచించాలి. బరువుగా నిట్టూర్చింది.
” ఏదో ఒకటి తినండి” మరోసారి అని లోపలికెళ్ళింది. శ్రీను హాల్లోనూ, మానస శాంతి పక్కనీ నిద్రపోతున్నారు. మధు, రాధ టీవీ చూస్తున్నారు. టీవీ ముందే కూర్చున్నా రాధ ముఖం గంభీరంగా ఉంది. కిరణ్మయికి ఈ ముగ్గురు పిల్లలూ కాకుండా మరో కూతురు ఉందని, మొదటి వివాహంవలన పుట్టిన కూతురు కాబట్టి వాళ్లు పెంచుకుంటున్నారని తెలుసు రాధకి. ఆ అమ్మాయిని శ్రీకాంత్‍కి ఇవ్వాలనుకున్నారని, కానీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో పెళ్లి జరగలేదని కూడా చూచాయగా తెలుసు. ఇప్పుడా విషయం గురించి పదే పదే అంటుంటే శాంతితో చెప్పినంత తేలిగ్గా తీసిపారేయలేకపోతోంది. ఎక్కడో అసంతృప్తి… ఏదో అనిశ్చతి. ఏం జరగబోతోంది శాంతి విషయంలో? కిరణ్మయి ఆమెని తనతో తీసుకు వెళ్తుందా లేక ఇక్కడ ఉంచి వెళుతుందా? ఇక్కడే ఉంటే తమకు తామిద్దరి స్థానాలూ ఏమిటి?
ఆమె ముఖంలో ఈ భావాలన్నీ చదవగలిగింది కిరణ్మయి. ఆమె చెయ్యి పట్టుకుని మృదువుగా లేవదీసి అక్కడినుంచీ తీసుకెళ్ళింది. ఎందుకోననుకుంది రాధ. ఇద్దరూ పెరట్లో పారిజాతం చెట్టుకింద చప్టా మీద కూర్చున్నారు.
” బాధపడుతున్నావు కదూ?” సున్నితంగా అడిగింది కిరణ్మయి. ఆమెకెలా తెలిసిందాని ఆశ్చర్యపోయింది రాధ. అయినా బయటపడకుండా ” ఎందుకలా అనుకుంటున్నారు? బాధ ఎందుకు?” అని అడిగింది.
” ఆపాటి గ్రహించలేనా? ఈవేళ శ్రీకాంత్ శాంతిల ప్రస్తావన పదే పదే వచ్చింది. వాళ్ల పెళ్లి జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న ఆలోచనని జయించలేకపోయాను. అది నిన్నెంత బాధ పడుతుందోనని అనుకోలేదు. మళ్లీ ఇంకోసారి ఆ ప్రస్తావన రాదు” అంది కిరణ్మయి.
విప్పారిన నేత్రాలతో విస్మయంగా చూసింది రాధ.” మీరు ప్రతిదీ ఇంతగా గమనిస్తారా?” అడిగింది.
” నువ్వేం పైపిల్లవి కాదు కదా? భవిష్యత్తులో ఎప్పుడేనా శాంతి ఎదురుపడితే శ్రీకాంత్ దాన్ని చేసుకోలేకపోయానని ఎప్పుడూ అనుకోకుండా ఉండాలనే ఎంచెంచి నిన్ను చేసుకున్నాం. మనసులో ఏమీ పెట్టుకోకు రాధా!”
ఆమె అంత హామీ ఇచ్చాక రాధ మనసు మబ్బులు విడ్డ ఆకాశంలా ప్రశాంతంగా మారింది. శాంతి విషయం? ఎలా అడగాలో తెలియలేదు.
” వదినామరదళ్ళు తీరిగ్గా ఇక్కడ కూర్చున్నారు. యుద్ధకాండ ముగిసిందా?” గోపాలకృష్ణ గొంతు విని ఇద్దరూ తల తిప్పారు.
” సినిమాకి వెళ్ళారా?” వెంటనే అడిగింది కిరణ్మయి.
” మేము ఉండి ఏం చేయాలి? ఆ ముసలావిడతో దెబ్బలాడ్డానికి ఇంతమందిమి కావాలా?” అని, ” ఇంతకీ శాంతి ఏది?” కుతూహలంగా అడిగాడు.
” పడుకుంది. ఈ గొడవలతో బాగా నలిగింది. అదీకాక పొద్దుటి నుంచి ప్రయాణం. అలిసిపోయింది”
” జోకొట్టి మరీ పడుకోబెట్టింది వదిన” పరిహాసంగా అంది రాధ.
” ఆవిడతో దెబ్బలాడటం దేనికి? శాంతిని తీసుకొచ్చింది. వచ్చిన పనైపోయింది. తిరుగు రైల్లో పంపేయాలిసింది. ఎప్పుడో జరిగిపోయినదానికి ఇప్పుడు ఘర్షణ పడటం ఎందుకు? దానివల్ల నీకు కంఠశోష తప్పించి ఇంకేం వరుగుతుంది?” గోపాలకృష్ణ భార్యని కోప్పడ్డాడు.
” పీటలమీద పెళ్లి చెడిపోయిందని దాన్ని తీసుకొచ్చేసరికి నాకు చాలా బాధేసింది. పద్దెనిమిదేళ్ళకీ ఇరవయ్యేళ్లకీ ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు? నా దగ్గరే ఉంటే చక్కగా చదివించి ఉద్యోగంలో పెట్టి మన కుటుంబాన్ని గురించి అవగాహన ఉన్న సహృదయుడిని అల్లుడిగా తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు చూడండి. దాని రెక్కలు కత్తిరించేసి ఎగరటం చేతకాని అసమర్థురాలిని చేసి నా దగ్గరికి తీసుకువచ్చారు. దాన్ని కన్నతల్లిని నేను… ఆఖరి మార్గాంతరం అయ్యాను” బాధ తట్టుకోలేక ఏడ్చేసింది కిరణ్మయి.
” కిరణ్! ఏమిటిది?” మందలింపుగా అన్నాడు గోపాలకృష్ణ.” శాంతికి పెళ్లైపోయిందని తెలిసాక నేను కూడా షాక్ అయ్యాను. నేను ఎత్తుకుని ఆడించిన ఆ రెండేళ్ల పిల్ల రూపమే నాకు గుర్తుందేమో, చేతుల నిండా గాజులు, ఆ అలంకరణలో చూసి చాలా అప్సెట్ అయ్యాను. ఈ వయసు పిల్లలు బిఎస్సినో ఎమ్మెస్సీనో చదువుతూ చుడీదార్లలో తూనీగల్లా ఉంటారు. శాంతేమిటి, ఇంత ఎదిగిపోయిందనిపించి బాధ కలిగింది”
వాళ్ళిద్దరి మాటల్నీ ఆశ్చర్యంగా వింది రాధ. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే… అన్యోన్య దాంపత్యం అంటే ఇదేనా? కిరణ్మయి మాత్రం? రాగానే శాంతిని దగ్గరకు తీసుకుని, జరిగిన అన్యాయానికి వర్ధనమ్మతో హోరాహోరీ దెబ్బలాడి, బాధపెట్టానని తనని సముదాయించి, భర్తతో అతనికి చెందని సమస్యని కూడా పంచుకుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ఆరాధన కలిగింది. అసూయలు, కలతలు, కష్టాలు ఉంటే ఉండొచ్చుగాక… అవే జీవితం కాకూడదని అర్థమైంది.