సంగమం 8 by S Sridevi

  1. సంగమం 1 by S Sridevi
  2. సంగమం 2 by S Sridevi
  3. సంగమం 3 by S Sridevi
  4. సంగమం 4 by S Sridevi
  5. సంగమం 5 by S Sridevi
  6. సంగమం 6 by S Sridev
  7. సంగమం 7 by S Sridevi
  8. సంగమం 8 by S Sridevi
  9. సంగమం 10 by S Sridevi
  10. సంగమం 11 by S Sridevi

ఆ రాత్రి అందరూ నిద్రపోయారుగానీ కిరణ్మయికి మాత్రం కాళరాత్రైంది. ఎప్పుడో జరిగిపోయిన పెళ్లి… దాని తాలూకు జ్ఞాపకాలు… ఇన్నేళ్లుగా అణచుకున్న భావోద్వేగాలు…అన్నీ పెనుతుఫానులా చెలరేగాయి.

కిరణ్మయి…గోపాలకృష్ణ అపురూపంగా మలుచుకున్న అందాలబొమ్మ. ఇప్పుడంటే ఆమె నడివయసులో వుందిగానీ అతని జీవితంలో అడుగుపెట్టినప్పటికి పాతికేళ్ళుకూడా లేవు.
ఆ యింటి నాలుగ్గోడల్లో ఒక చరిత్ర నిక్షిప్తమై వుంది. ఒక కెరటం ఎగిసిపడటం వుంది. అది విరిగిపడటంకూడా వుంది. ఒక స్త్రీ ఆనందడోలికల్లో వూగుతూ అందులోంచీ జారిపడి ఘోరమైన అవమాన పరాజయాల్ని ఎదుర్కొని మళ్ళీ లేవటం వుంది.

బియ్యెస్సీ రెండవ సంవత్సరం చదువుతుంటే కిరణ్మయికి శ్రీధర్‍తో పెళ్లయింది. చదువు మధ్యలో పెళ్లి చేయడానికి ఆమె తండ్రి గోపాల్రావు ఏమాత్రం సంకోచించలేదు. ఆడపిల్లని చదివిస్తూనే, మా పిల్ల చదివి ఏం చేయాలి? ఉద్యోగం చేయాలా? ఊళ్ళేలాలా? ఉద్యోగం చేయాల్సిన కర్మ దానికి ఏమిటి? అనే తరానికి చెందినవాడు ఆయన. చదివిస్తూనే పద్ధెనిమిదేళ్ళు నిండాయని కూతురికి సంబంధాలు వెతకసాగాడు. ఆయన తమ్ముడి అల్లుడి స్నేహితుడు శ్రీధర్. పెళ్లిచూపుల్లో కిరణ్మయిని చూశాక ఇంక అంతే! ఆమెను తప్పించి ఇంకెవర్నీ చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడట. ఒకరికోసం ఒకరు పుట్టినట్టు కొంతమంది జంటలు అలాగే తారసపడతారు.
అప్పటికి అతను మెడిసిన్ మూడో ఏడు చదువుతున్నాడు. కిరణ్మయి రూపురేఖలు, గోపాల్రావు స్థితిగతులు చూసి అతడి ఇంట్లోకూడా సుముఖత వ్యక్తపరిచారు.
కిరణ్మయి ఏడ్చింది-” నాకిప్పుడే పెళ్లేంటి నాన్నా? బియ్యెస్సీయేనా చదవనివ్వండి ” అని గొడవచేసింది.
” మంచి సంబంధం. వదులుకుంటే మళ్లీ ఇలాంటిది రాదు. వాళ్ళు ఇష్టపడితే పెళ్లయ్యాక చదువుకో. ఇంకా అతను కూడా చదువులోనే ఉన్నాడు కాబట్టి అప్పుడే కాపురానికి తీసుకెళ్ళరనుకుంటా. వాళ్లు ఒప్పుకుంటే ఇక్కడే ఉండి ఆ డిగ్రీ ఏదో పూర్తి చేద్దువుగాని”” అన్నాడు ఆమెతో గోపాల్రావు.
అలాగే వాళ్ళని అడిగితే శ్రీధర్ తండ్రి నవ్వి, “”మంచిదే. అలాగే కానివ్వండి. మా కుటుంబంలోకెల్లా పెద్ద చదువులు చదివింది మా శ్రీధర్ ఒక్కడే. వాడికి చదువులో తీసిపోని పిల్లని చేద్దామనుకున్నాం. ఆ కోరిక ఇలా తీరుతుంది. మీ దగ్గరే ఉంచుకుని డిగ్రీ పూర్తి చేయించండి. మధ్యలో వచ్చి వెళుతుంటుంది” అన్నాడు.
పెళ్లి చాలా ఆర్బాటంగా జరిగిపోయింది. పెళ్లప్పుడు యానాళ్ళకీ, వ్రతాలకీ, నోములకీ తప్ప కిరణ్మయి అత్తగారి ఊరు వెళ్ళలేదు. శ్రీధర్ వైజాగ్‍లో ఉండి చదువుకునేవాడు. సెలవుల్లో, పండగలకీ అత్తవారింటికి వచ్చి నాలుగైదు రోజులుండి వెళ్లేవాడు. కిరణ్మయిలో కొత్త ఉత్సాహం కదను తొక్కుతుండేది. స్నేహితులతో తిరిగేది వేరు, అతనితో తిరిగేది వేరు. అతను వస్తున్నాడంటే ఉల్లాసంతో తుళ్ళితుళ్ళిపడేది. అన్నావదినలు ఏడిపించేవారు. చెల్లెలు వేళాకోళం చేసేది.
గోపాల్రావు నలుగురు సంతానంలో పెద్దకొడుకు చంద్రశేఖర్. లెక్చరరు. పెళ్లయింది. తరువాతది కిరణ్మయి. ఆమె తర్వాత కరుణ. ఆఖరి సంతానం శ్రీకాంత్. పెళ్లయ్యాక కూడా కిరణ్మయి పుట్టింట్లోనే ఉండి చదువుకోవడం అదొక వేడుకగా ఉండేది తప్ప ఎవరికీ భారంగానూ, అదనపు బాధ్యతగానూ అనిపించేది కాదు. కట్నాలు కానుకలకోసం పిల్లనిచ్చుకున్నవాళ్లని పీడించే సంస్కృతి కిరణ్మయి అత్తవారింట్లో లేదు.
కిరణ్మయికి…
అదొక అందమైన కల. అతను ఉన్నంతసేపు అతనితో కబుర్లు. వెళ్ళిపోగానే అతని తలపులు సువాసనలతో వచ్చి వాలి ఉత్తరాలు ఆమెని మైమరపించి ఊహాలోకాల్లో విహరింపచేసేవి. ప్రపంచమంతా ప్రేమమయమే అనిపించేది. అయితే అదంతా అపరిపక్వ ప్రేమ. శృంగారమే తప్ప బాధ్యత తెలీదు. పరస్పర ఆకర్షణేగానీ దాంపత్య ప్రేమకు ఇంకా పునాది పడలేదు. అయితేనేం, అతనికి తను, తనకు అతను అనే భావన కిరణ్మయిలో బలంగా ఉండేది.
ఇంతలో ప్రెగ్నెంటని తెలిసింది.
ఆ సంవత్సరం నవంబర్లో వాళ్ల పెళ్లిరోజు. శ్రీధర్ దసరా పండక్కి వచ్చాడు. పెళ్లిరోజుని అరకులోయలో చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే కిరణ్మయి సిగ్గుపడుతూ చెప్పింది నాలుగోనెలని.
” ఏమిటీ!??” అంతెత్తుకు ఎగిరిపడ్డాడతను.” నేను ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోలేదా?” అడిగాడు ఆశ్చర్యంగా.
” అమ్మ వద్దంది. ఇద్దరు పిల్లలవగానే ఆపరేషన్ చేయించుకోవచ్చునంది. అదే మంచిదట”
” అప్పుడే పిల్లలా? నేను ఇంకా ఎమ్మెస్ చెయ్యాలి. ప్రాక్టీస్ పెట్టాలి. నిన్ను తీసుకెళ్లాలి. అప్పుడైతే బాగుండేది” నిరుత్సాహంగా అన్నాడు. అయినా లోపల్లోపల సంతోషమే ఉంది. అది అంతర్లోకం.
” మీరు ఇన్ని కలలు కంటున్నారని నాకేం తెలుసు?” సిగ్గుపడుతూనే దబాయించింది కిరణ్మయి.
అప్పుడే తండ్రి కాబోతున్నాడంటే సిగ్గుసిగ్గుగా అనిపించింది శ్రీధర్‍కి. పెళ్లయ్యాక తామిద్దరికీ మాత్రమే పరిమితమనుకున్న ఒక శారీరక చర్య బహిర్గతమైనట్టు ఇబ్బందిగా అనిపించింది. ఆ సిగ్గుతో వారం ఉండాలని వచ్చినవాడు పండగ వెళ్లిన మర్నాడే వెళ్ళిపోయాడు. ఆ వెళ్లటమే కిరణ్మయిపట్ల శాపమైంది. శ్రీధర్ ఎక్కిన రైలుకి యాక్సిడెంట్ అయింది. అతని ఒక కాలు పూర్తిగా నలిగిపోయింది. తీసేసారు. అవిటిగా బతికే ధైర్యం లేక హాస్పిటల్లో ఉన్నప్పుడే విషం తీసుకున్నాడు.
కిరణ్మయి కుప్పకూలిపోయింది.
శ్రీధర్ ఇంట్లో అందరూ కిరణ్మయినీ, ఆమె కడుపులో పెరుగుతున్న ప్రాణినీ దూషించారు. వాళ్ల దుఃఖం వాళ్లది. సంతోషంగా ఉన్నప్పుడు మనుషులంతా మంచిగానే ఉంటారు. తట్టుకోలేని కష్టం వచ్చి తాకినప్పుడు అల్లాడిపోయి అసలు రూపాన్ని బయటపెడతారు.
కిరణ్మయి సంసారసౌధం పేకమేడలా కూలిపోయింది. ఆమె జీవనదీపం వుఫ్‍మని ఊదేసినట్టు ఆరిపోయింది. శాంతి పుట్టేదాకా ఏం తిన్నదో, ఎలా ఉన్నదో. పక్కలో పసిపాప కదలిక కూడా ఆమెలో చైతన్యం తీసుకురాలేదు. నాలుగురోజులదాకా పాపని చూడటానికికూడా ఇష్టపడలేదు.
” అతని జ్ఞాపకంగా దేవుడు ఇచ్చిన వరమమ్మా, ఇది. తల్లివి నువ్వే కాదంటే ఎలా? తండ్రెలాగా లేడు” అని నాయనమ్మ పాపని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టింది.
” ఎంత నష్టజాతకురాలో! భూమ్మీద పడకుండానే తండ్రిని మింగింది!” గొణుక్కుంది కిరణ్మయి తల్లి . అందరికీ ఆ పసిదానిమీద ఉదాసీనతే. బోర్లాపడిందని బొబ్బట్లు లేవు, అడుగులు వేసిందని అరిసెలు లేవు, గడప దాటిందని గారెలు లేవు. తాతమ్మ సంరక్షణలో ఏదో పెరిగిందంతే.
ఈలోగా పేలాల్సిన డైనమైట్లు పేలాయి. పదకొండవ రోజు వెళ్ళాక శ్రీధర్ తల్లిదండ్రులు వచ్చారు. జరగాల్సిందంతా జరిపించాలని వాళ్ళ వాదన.
” ఇంకా ఏం మిగిలిందండీ? అతను పోతూపోతూ మా కిరణ్‍లో జీవాన్ని తనతో తీసుకెళ్లిపోయాడు. వట్టి గాజుబొమ్మ మాకు మిగిలింది. దాన్ని ఎలా ఉండనివ్వండి” కిరణ్మయి తల్లి లక్ష్మీదేవి కన్నీటితో చేతులు జోడించింది.
” ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పాటిస్తున్నారు? పల్లెటూర్లో ఉండడంతో మీకు తప్పనిపిస్తోంది. దాని వయసెంతని? దానికి ఈ శిక్షేమిటి? తన వయసువాళ్లంతా హాయిగా తిరుగుతుంటే వద్దంటున్నా వినకుండా పెళ్లి చేసి గొంతు కోసాము” కిరణ్మయి అన్న చంద్రశేఖర్ ఆవేదనగా అన్నాడు.
” చదువు మధ్యలో పెళ్లి చేసి మేము ఒక తప్పు చేశాము. చెయ్యని తప్పుకు శిక్షించి మీరు దానిపట్ల మరో తప్పు చేయకండి” అని గోపాల్రావు తువ్వాలులో ముఖం దాచుకుని భోరుమన్నాడు.
” ఆ బొట్టూ గాజులే కదమ్మా అడ్డు? దానికి ఇంత హంగామా ఎందుకు? నేను తీసేస్తాను” అంది కిరణ్మయి నాయనమ్మ మనవరాలిని దగ్గరగా తీసుకుంటూ.
వాళ్లు ఎవరి మాటా లెక్కచేయలేదు. సాంప్రదాయం మంట కలిసి పోకుండా కిరణ్మయిని తీసుకెళ్లి చెయ్యదలుచుకున్నదంతా జరిపించి మళ్లీ పుట్టింట్లో వదిలిపెట్టారు. అదంతా కూడా మళ్లీ పెళ్లి జరిగినంత ఆర్బాటంగా జరిగింది. వాళ్లు మనుషులా? రాక్షసులా? పరాయితల్లి కన్న బిడ్డమీద అంత అధికారం ఎక్కడిది? ఎవరిమీద కక్ష ఇది? దేవుడిమీదా? అని అందరూ తిట్టుకున్నారు తిరిగొచ్చాక. సాంప్రదాయమని మళ్లీ సర్దుకున్నారు. మనసు సరిపెట్టుకున్నారు.
అటు తర్వాత నెల మాసికాలు, త్రిపక్షాలు, త్రైమాసికాలు అంటూ సంవత్సరీకాలు అయ్యేదాకా ఆ ఇంటికీ ఈ ఇంటికీ మధ్యని గిలకలా తిరిగింది కిరణ్మయి. ఉండిపొమ్మని వాళ్లు అనేవాళ్ళు కాదు. మా కొడుకే పోయాక నువ్వెంత, నీ లెక్కెంత అన్నట్టు బెట్టుసరిగా ఉండేవారు. పెద్దతోటికోడలు సావిత్రి సూటిపోటి మాటలు అనేది. వర్ధనమ్మ నష్టజాతకురాలని తిట్టేది. ఆ ఇంట్లో ఉండాలన్న భావనగానీ అది తన ఇల్లేనన్న మమకారంగానీ ఆమెకి ఎప్పుడూ కలగలేదు. శాంతిని తీసుకురాకపోతే తీసుకురాలేదని తిట్టేవారు. వెంటపెట్టుకుని వెళితే ఆ పిల్లను కూడా అలాగే చూసేవారు. పసిపిల్ల అనికూడా ముద్దుచేసేవారుకాదు.