“ఇంకా నయం, ఆమాటేదో అతనిముందు అనలేదు. సుమతిని వదిలేసి మళ్ళీ నా తాళం పట్టించారు. కానీ, సుడిగాలా, సెలయేరా ఏమిటే, ఆ మనిషి? ఇప్పటికీ అదే తీరు. సుమతి చాలా అదృష్టవంతురాలు” అంది గీత. “మహీ! మనసుకి గుచ్చుకోని వత్తైన పరిమళంలాంటి పరిహాసం ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. అలాంటి సువాసనలకి మనిల్లు ఒక పూదోటే అనుకో. కానీ, ఆ మధ్యలో సుధీర్. రాణాతో అయిందనుకుంటే వీడు. పెళ్లంతా ముభావంగానే వున్నాడు. వాళ్లవాళ్ళంతా వాడిని కాసుకోవడం” అంది విసుగ్గా.
“రోడ్ నాట్ టేకెన్” వాసు అనడం గుర్తొచ్చింది మహతికి.
“సుధీర్‍కూడా వాసులాగే నీగురించి అనుకున్నాడేమో!” అంది నెమ్మదిగా.
గీత వింతగా చూసింది. “ఐతే? తనకి నేను నచ్చితే సరిపోయిందా? నాకూ తను నచ్చాలికదా? ఏకపక్షనిర్ణయం సరిపోదు. ఒకవైపునించీ వుండే యిష్టం ప్రేమవదు. అది రెండోవైపునికూడా అలాంటి యిష్టాన్ని ట్రిగ్గర్ చెయ్యగలగాలి. అప్పుడూ, ప్రేమయేది. వాసు గీతని ఇష్టపడుతున్నాడు, మీకిష్టమైతే ఇద్దరికీ పెళ్ళిచేద్దాం అని అడిగింది లక్ష్మత్త. మరి ప్రమీలత్త? సుధీర్‍కి చదువు చెప్పించి అల్లుడిని చేసుకొమ్మంది. అలా అడుగుతుందని సుధీర్‍కి తెలీకుండా వుండదుకదా? ఆవిడని ఆపవచ్చుకదా? ఆపలేదు. మరింక యిందులో ప్రేమ ఎక్కడినుంచీ వచ్చింది? లేని ప్రేమగురించి కోపాలు, అలకలు దేనికి? మేం కాదంటామని అనుకోలేదేమో, కోపాలొచ్చాయి. నాన్నని ఏమీ అనలేరుకాబట్టి ఆ కోపమంతా నామీద చూపెట్టారు. పదేళ్ళు వీళ్ళు ఆ కోపాలు సాగించుకున్నారు. ఫోన్లు లేవు, రాకపోకల్లేవు. పెళ్ళిళ్ళకీ బారసాలలకీ కలుసుకోవడమే. చుట్టాల్లా పొడిపొడిగా మాట్లాడుకోవడమే తప్ప, అభిమానాలేం మిగిలాయి? మహీ! నరకమే, అది. అప్పటిదాకా ఒక్క ప్రాణంగా తిరిగినవాళ్ళమధ్యనుంచీ తప్పుచేసినదాన్లా దూరం జరగడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా? పెళ్ళితో మీ అందరి జీవితాల్లోకీ కొత్తకొత్త మనుషులూ, బంధువులూ వచ్చి చేరారుగానీ, నాకు అలాంటి మార్పేమీ లేదు. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ వున్నది మీరే. మీ అమ్మ పోయినప్పుడు సుధీర్ నాతో ఫోన్లో మాట్లాడాక అప్పుడు సుమతి, సుమంత్ మళ్ళీ మొదట్లోలా మాట్లాడ్డం మొదలుపెట్టారు. అప్పటికి నేను ఆ దూరానికి అలవాటుపడ్డాను” అంది.
సుమతి చెప్పిన మిగతా విషయాలు చెప్పి, ఆమెని మరింత యిబ్బందిపెట్టాలనుకోలేదు మహతి. తను ఏవేవో చెప్పడం కాదు, ఆమెని మాట్లాడించాలి. ఎన్నెన్ని విషయాలకి బాధపడుతోందో, ఎంత బాధ మనసులో పోగుపడిందో, అందులో ఆత్మహత్య చేసుకునేంత వివరం ఏం వుందో, దాన్ని బైటికి తియ్యాలి.
“మా పెళ్ళితో మనింట్లో మొదలైన పెళ్ళిళ్ళ సీజన్ సుమతి పెళ్ళితో స్థిరపడింది. వీళ్ళందరూ మెడికోలూ, డాక్టర్లూ కావడంతో నేల యీనినట్టు పెళ్ళికి వచ్చినవాళ్ళంతా డాక్టర్లూ, సిస్టర్లే. ప్రొఫెసర్లు, ప్రొఫెషనల్స్, క్లాస్‍మేట్స్, అనేకమంది. వాళ్లందరికీ ప్రత్యేకమైన మర్యాదలు జరిగాయి. సుధీర్‍వాళ్ల స్థాయి మారినట్టుకూడా అనిపించింది. అప్పుడే సుమంత్ లతని మనకి పరిచయం చేశాడు. నాకు ప్రత్యేకంగా తీసుకొచ్చి చూపించాడు. ఏదో చెప్పాలనుకున్నాడుగానీ చెప్పలేకపోయాడు.
తర్వాత మాట్లాడతాలే- అంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాతకూడా తనేమీ పెద్దగా చెప్పలేదుగానీ, నాకే అర్థమైంది. అటు సుధీర్ పెళ్ళి చేసుకోనని కూర్చున్నాడు. ఇటు వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో వున్నారు. సుధీర్‍కి నేనేమైనా చెప్పి వప్పిస్తానేమోనని సుమంత్ ఆలోచనకావచ్చు. ఈ పెద్దరికాలు, పెత్తనాలు చిన్నప్పట్నుంచీ నామీద వున్నాయికదా, అందుకు. కానీ నేను పట్టించుకోలేదు”
“…”
“పెళ్ళి చేసుకొమ్మని సుధీర్‍కి అందరూ చెప్పడం అయింది. తను వినట్లేదట. వాళ్ళమ్మానాన్నలతో సరిగ్గా వుండట్లేదనికూడా తెలిసింది. మరో నాలుగేళ్లకి నాకే చిరాకేసింది, ఇంకా శాలువాకోసం వెతుక్కుంటున్న ఆ దేవదాసుని చూస్తే. అప్పటికి మన బేచిలో అందరి పెళ్ళిళ్ళూ అయ్యాయి. వీళ్ళిద్దరే మిగిలారు. సుధీర్ని పట్టుకుని అడిగేసాను. నువ్వూ పెళ్ళి చేసుకోవచ్చుకదరా- అని. నేనలా సూటిగా అడుగుతానని అనుకుని వుండడు. కంగుతిన్నాడు. వెంటనే సర్దుకున్నాడు. మీరంతా మహామేథావులుకదా, లోలోపలి స్వయంపాకాలేవీ పైకి కనపడనివ్వరు.
చేసుకోవాలంటావా- అన్నాడు.
అదేం ప్రశ్న? చేసుకోక ఏం చేస్తావు? అందరూ చేసుకుంటున్నారు. నువ్వూ చేసుకో. నామీద కోపం వుంటే పెళ్ళి మానుకోనక్కర్లేదుకదా? చేసేస్తే నాక్కూడా ఒక బాధ్యత తీరిపోతుంది- అన్నాను కొంచెం తిక్కగా.
చివరిమాటలకి పడీపడీ నవ్వాడు. చాలారోజులతర్వాత ఆ నవ్వు. మబ్బులు విడిచిన చంద్రుడిలా వుంది ముఖం.
కాక? పెళ్ళి సాంబారాలు చేర్చడం, పెళ్ళిఖర్చుల లెక్కలు, ఈ సీనియర్లందర్నీ వరసతప్పకుండా నిలబెట్టడం-అన్నాను.
ఔను. అన్నీ నువ్వే చూస్తున్నావటగా? చాలా ప్లాన్‍డ్‍గా చేస్తున్నావని చెప్పాడులే, రవి మామయ్య. పెద్దదానివైపోయావు- అన్నాడు అదే నవ్వుతో.
అక్కడ సుమంత్ హాహాకారాలు చేస్తున్నాడు- అన్నాను.
అదేమిటి- ఆశ్చర్యంగా అడిగాడు. చెప్పాను.
నీమీద కోపం దేనికే? ఇంకా టైముందని అనుకుంటున్నాను. జాబ్‍లో సెటిలై, అమ్మావాళ్ళకోసం ఇల్లేదేనా తీసుకుంటే బావుంటుందని ఆగాను. నాన్న అద్దె యింట్లో సర్దుకోవడం చూడలేకపోతున్నాను. పెళ్ళి చేసుకుంటే ఇల్లు కొనడం వెంటనే కుదరదుకదా- మామూలుగా అన్నాడు. కావచ్చు.
ఇంట్లో వుండట్లేదు గీతా! హాస్పిటల్ క్వార్టర్స్‌లో వుంటున్నాను. చాలా బిజీగా వుంటున్నాను. సుమంత్‍కూడా నాతో ఏం చెప్పలేదు- అన్నాడు.
నీకు కాకుండా తనెలా చేసుకుంటాడు? నువ్విలా పెళ్ళే చేసుకోనని కూర్చుంటే అవతలి అమ్మాయికి ఏం చెప్తాడు- అడిగాను. అంతకన్నా నేను వాదించలేదు. అతని వ్యక్తిగత విషయం. వాళ్ళింటి విషయం. ఏమనుకున్నాడో, ఏం ఆలోచించుకున్నాడో మొత్తానికి ఆఖర్న పెళ్ళికి వప్పుకున్నాడు”
“వద్దనుకున్న చదువూ చదివాడు. అమెరికా లాక్కెళ్ళింది వదిన” అంది మహతి. కొద్దిసేపు ఆగింది గీత. మేఘన వచ్చింది.
“టీ ఇక్కడికి తేనా? అక్కడికొస్తారా?” అడిగింది.
“అమ్మావాళ్ళూ ఏం చేస్తున్నారే?” అడిగింది గీత.
“పెద్దవాళ్ళు ముగ్గురూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మామయ్య హరితో కలిసి బైటికి వెళ్ళాడు. ఇందిరేమో మొహం ముడుచుకునే వుంది. నేను హాయిగా టీవీ చూస్తున్నాను” అంది మేఘన.
“భలే వుంది పిల్ల!” అంది గీత.
“మేముకూడా చిన్నప్పటి విషయాలు గుర్తుచేసుకుంటున్నాం. టీ ఇక్కడికే తేపో” అంది మహతి. ’
“ఇదీవేళ నన్ను వదిలేలా లేదు. ఒకటే వాగిస్తోంది” అంది గీత.
మేఘన వెళ్లిపోయింది. టీ తీసుకుని తులసి వచ్చింది. ఆమె ముఖం బరువుగా వుంది.
“అలా వున్నావేమే?” అడిగింది గీత.
“ఎలా వున్నాను? బాగానే వున్నాను. ఇప్పుడే నిద్ర లేచాను” అంది తులసి తడబడి.
“బంధాలు తెంచుకోవడం అంత తేలికకాదు. తీసుకున్న నిర్ణయానికి బాధపడుతున్నావా? ఈ బాధ నాకు అనుభవమేకదా?” మహతి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని వేళ్ళు సవరిస్తూ అడిగింది.
“మనని పట్టి వుంచిన బంధాలన్నీ చివరిదాకా అదే సాంద్రతతో వుంటాయనేం లేదు మహీ! ముఖ్యంగా ఇలా కలుపుకున్నవి. బాధనిపించినా కొన్నిటినుంచీ విడివడటమే మంచిది. క్రమేపీ అలవాటు పడిపోతాం. కొన్నాళ్ళు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను. పిల్లలగురించే దిగులు. వాళ్ళింకా చిన్నవాళ్ళు. స్థిరపడలేదనేదొక్కటే సమస్య. ఐనా వదిన వుందనే ధైర్యం వుండేది మొన్నమొన్నటిదాకా. తనే ఇలా చేసిందంటే కాళ్లకింద నేల కదిలినట్టైంది” అంది తులసి.
“మేఘన పెళ్ళిచేసేసి నేనూ ఇక్కడికే వచ్చేస్తానులేవే. అది వెళ్ళిపోయాక ఇంక అక్కడ నాకేం వుంటుంది?” అంది మహతి. మళ్ళీ కాసేపు పడుకుంటానని వెళ్ళిపోయింది తులసి.
“అతను అలా ఎలా చెయ్యగలిగాడు గీతా? నాకీ విషయాల్లో ఎప్పుడూ ఆశ్చర్యమే. శృంగారం తప్ప ఆడామగా మధ్య మరేదీ వుండటానికి అవకాశంలేదా? వయసులో వున్నప్పుడుసరే, పెద్దవాళ్ళం ఔతున్నాకూడానా? మగవాళ్లని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? వాళ్ళకి కావల్సింది మనమే యివ్వలేక, మనసూ, మమతా అంటూ సెంటిమెంటల్ ట్రాష్ మాట్లాడుతున్నామా?” అడిగింది మహతి.
“దీన్ని బాధపెట్టడం యిష్టంలేక దూరం జరిగినా అతను తులసికే కట్టుబడి వున్నాడు. దీనికే మొహం తిరిగిపోయింది. దూరం పెట్టింది. నీలాగే ఆలోచించింది. నువ్వనేకాదు, ఆచరించగల అవకాశం, సమర్ధించేవాళ్ళూ వుంటే ఎవరేనా ఇలానే ఆలోచిస్తారు. అతనికి కావల్సింది దీనికి వద్దు. ఈ వద్దూ-కాదులమధ్య వాళ్ళ విడాకులు జరిగిపోయాయి.
ఎంతకాలం మల్లెపూలు సింగారించుకుని వుండగలం మనసులు వాడిపోయాక కూడా- అని అడిగింది.
నిజమే, అకారణంగా ఒకొక్కసారి మనసులు వాడిపోతాయి” అంది గీత. ఆమె ముఖంలో విషాదం తాండవించింది.
“ఇరవయ్యేళ్ళ పిల్ల మహీ! దారుణంగా చచ్చిపోయింది” తనే అంది అసందర్భంగా. ఒక భయమో, వేదనో, అలాంటి- అర్థంకాని మరెన్నో భావాల మిశ్రమమో తెలీని సంచలనం ఆమె ముఖంలో కదిలింది. మహతికి ఏమీ అర్థమవలేదు. భయం మాత్రం స్పష్టంగా తెలిసింది.
“ఎవరే?” అని అడుగుతునే వుంది, గీత లేచి నిలబడింది.
“వెళ్దాం పద. అన్నీ ఒక్కరోజే ఎందుకు?” అని హాల్లోకి దారితీసింది. మహతికి అనుసరించక తప్పలేదు.
వీళ్ళు వెళ్ళేసరికి అక్కడి పరిస్థితి ఇంచుమించు మేఘన చెప్పినట్టే వుంది. లక్ష్మీ, యశోదా ఏవో మాట్లాడుకుంటున్నారు. రామారావు వినీవిననట్టు వింటున్నాడు. ఆయనకి ఈమధ్య వినికిడీ, చూపూ తగ్గాయి. అందుకని పెద్దగా ఎందులోనూ తలదూర్చకుండా తటస్థంగానే వుంటున్నాడు. తులసిమాత్రం పడుక్కుని వుంది. వెళ్ళి యశోదావాళ్ళ పక్కని కూర్చుంది మహతి.
“మా బతుకులు మావని అన్నీ తెంచేసుకుని ముందుకి వెళ్తున్నప్పుడు ఇంకా ఈ మమకారాలు దేనికి?” అంది లక్ష్మి కోడల్ని చూసి.
“మనసులో ప్రతిమనిషికీ ఒక్కో అర వుంటుందనీ, అందులో మళ్ళీ రహస్యపు అరలు వుంటాయనీ నువ్వేకదా, అప్పుడెప్పుడో చెప్పావు?” అడిగింది గీత.
“అన్నీ తెలిసిన పండితురాలివి, నీకు నేనెప్పుడు చెప్పానూ?” సాగదీసింది లక్ష్మి.
“తులసికి జ్వరం వచ్చిందే! ఇందాకానే భారంగా అనిపించింది. టీకూడా వద్దని పడుక్కుంది” అంది యశోద.
“వద్దనుకున్నా వదలని మమకారాలు చాలా వుంటాయి. బంధాలు ఎలా బలహీనపడతాయో, బాధలూ అలానే బలహీనపడతాయి. టైం పడుతుంది” అంది మహతి. గీత తులసి పడుక్కున్న దగ్గిరకి వెళ్ళింది. కూతురు పక్కకి వెళ్ళింది చూసి అడిగింది యశోద, “ఏమంటోందే?” అని.
“ఎప్పటెప్పటి విషయాలో మాట్లాడిందత్తా! మనింట్లో జరిగినవే. గుర్తుచేసుకుని చెప్పింది. చివర్లోమాత్రం ఎవరో అమ్మాయిగురించి అని, ఆపేసింది. నీకు తెలుసా, ఆ అమ్మాయెవరో?” ఎదురు అడిగింది మహతి.
“ఖర్మ. ప్రపంచంలో ఎవ్వరికీ అక్కర్లేనివన్నీ వీళ్ళిద్దరికే కావాలి. లేనింటి పిల్లలందర్నీ పోగుచేసి చదువులు చెప్పిస్తారు. ఇది పడీపడీ ఆఫీసుకెళ్ళి సంపాదించుకొచ్చిమరీ వాళ్ళ ఫీజులవీ కట్టేది. ఎంతొస్తోందో, ఎంత ఖర్చుపెడుతున్నారో లెక్కాపత్రం ఏమైనా వున్నాయో లేదో ఎవరికీ తెలీదు. ఖర్మ. ఏసీబీవాళ్ళ దృష్టిలోకూడా పడ్డారు. అక్కడితో ఆగారా? ఆ పిల్లల కష్టాలూ సుఖాలూ వీళ్ళవే. వాళ్ళని కన్న అమ్మానాన్నలు వుంటారుకదా? వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకు?” తన ధోరణిలో తను చెప్పుకుపోయింది యశోద.
అక్కడ గదిలో తులసి నుదురు పట్టి చూసింది గీత. వేడిగా వుంది.
“టేబ్లెట్ వేసుకున్నావా, తులసీ?” అడిగింది.
“వేసుకున్నాను వదినా! పొద్దుటికి తగ్గిపోతుందిలే! కాసిన్ని పాలు యివ్వు. తాగేసి పడుక్కుంటాను. అన్నం తినను” జవాబిచ్చిందామె. గీత పాలు తెచ్చి యిచ్చింది. తాగేసి పడుక్కుంది తులసి. బెడ్‍షీట్ కప్పి, తలుపు దగ్గిరకి వేసి ఇవతలికి వచ్చింది గీత.
“నన్నేనా, అంటున్నది? తిడుతున్నావా, పొగుడుతున్నావా?” తల్లిమాటలు సగం విని, అడిగింది.
“తిట్టో, పొగడ్తో తెలీకుండా వున్నావేం?” అందావిడ.
వాళ్ల వాగ్వివాదం ఇంకా నడిచేదేగానీ వాసు, హరి బైటినుంచీ రావటంతో ఆగిపోయింది. వాసు అతన్ని వెంటేసుకుని తిరగడం ఏమిటో అర్థమవ్వలేదు మహతికి. వీళ్ళిద్దరికీ రానురాను మతులు పోతున్నట్టున్నాయి! అనుకుంది. చాలా సంవత్సరాలక్రితం ఆమెకోసం ముంబై వెళ్ళినప్పుడు గురుమూర్తి ఇలానే కొడుకులకోసం బెంగపడి మాధవ్‍ని వెంటబెట్టుకుని వూరంతా తిరిగాడు. ఇప్పుడు వాసు. ఈమధ్యలో ఇంకా ఎందరున్నారో! ఈ నాన్నలూ అమ్మలూ శూన్యమైపోయిన వాకిళ్ళలోంచీ ఇవతలికి నడిచి వచ్చి, ప్రేమభిక్ష యాచిస్తున్నవారు!
గీత చెప్పిన ఆ పిల్ల ఎవరు? వీళ్ళకేంటి సంబంధం? వెంటనే మరో ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు ఎవర్నీ అడిగే అవకాశం లేకుండానే భోజనాలు, మిగతా కార్యక్రమాలూ అయ్యాయి. హరి పిలిస్తే ఇందిర వచ్చి అన్నానికి కూర్చుంది.
“ఇంకొక ఆంటీ వుంటారు, ఆవిడ రాలేదే?” హరి మేఘనని అడిగాడు.
“తులసి పిన్నా? తనకి కొద్దిగా జ్వరం. పడుక్కుంది” జవాబిచ్చింది మేఘన.
మనిషికొక రకం వంట. ఎంత యిస్తోందో గీత, వంటాయన శ్రద్ధగానే చేస్తున్నాడు. విసుక్కోవట్లేదు. రామారావుకి బీపీతోపాటు షుగరుకూడా వుంది. రొట్టెలు నమలలేడు. మిలెట్స్ వేయించి పిండి చేసి కాచిన జావ తాగుతాడు. లక్ష్మికి మిల్లెట్స్ అరగవు. అన్నం మెత్తగా వండితే తింటుంది. పక్కింట్లో రుక్మిణమ్మావాళ్ళకీ అంతే. మహతీ, మేఘనా ముంబైలో వుండటంతో రొట్టెలకి బాగా అలవాటుపడ్డారు. మిగతావాళ్లకి మామూలు వంట. పెద్దగా మాట్లాడుకోకుండానే భోజనాలయ్యాయి. ఇంట్లోని ఒక మనిషి వొంట్లో బాలేకుండా వుండటంలోని తేడా తెలుస్తోంది. భోజనాలయ్యాక ఎవరితోటీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయింది ఇందిర. వెనకే హరీ మేఘనా వెళ్ళారు. చెల్లెలి ప్రవర్తనలోని తప్పు తెలుస్తోంది హరికి. ఒకవైపు తల్లిలేకపోవడం, మరోవైపు తండ్రి హాస్పిటల్లో వుండటం, ఇంకోపక్కన తామిద్దరూ వచ్చి తెలీనిచోట వుండటం ఇంకా ఎన్నో అంశాలు బాధపెడుతున్నాయి ఎదిగీ ఎదగని వయసులో వున్న ఆ పిల్లని. ఎలా వోదార్చాలో, ఇక్కడున్నందుకు ఎవర్నీ నొప్పించకుండా మామూలుగా వుండాలని మరెలా నచ్చచెప్పాలో తెలీడం లేదు హరికి.
“ఇలా విడిగా గదుల్లో పడుక్కోవడం మాకు అలవాటు లేదు. అందరం ఒకదగ్గిరే మాట్లాడుకుంటూ పడుక్కుంటాం. నేనూ వాళ్లదగ్గిరకి వెళ్తాను” కొద్దిసేపు వాళ్ళ దగ్గిర వున్నాక దిండు పట్టుకుని లేచింది మేఘన. ఆమె చెయ్యిపట్టుకుని ఆపాడు హరి.
“కోపం వచ్చిందా, అక్కా?” అడిగాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.