మనసు లోపల లీలగా తోచిన సంగతే ఐనా ఇంత స్పష్టంగా వెల్లడయాక సిగ్గుతోటీ అవమానంతోటీ కృంగిపోయింది కిరణ్మయి. అతనిముందు తలెత్తుకోలేకపోయింది.అతనుకూడా ఆమెని సూటిగా చూడలేకపోయాడు. ఏమిటి ఈ లోకం? కాస్త చనువుగా మాట్లాడుకోగానే పెడర్ధాలు తియ్యడమేనా? ఇంతమంది మనుషులమధ్య, సంస్కారంగల కుటుంబంలో తమమధ్య అలాంటివి జరిగే అవకాశం వుంటుందా? అంత కక్కుర్తి దేనికోసం పడాలి? తన విషయంలో సరే, అతనుగానీ కోరుకుంటే మరో పెళ్లి చేసుకోలేడా? ఇలా కక్కుర్తి పడాలా? అసహ్యంగా అనిపించింది. ఏది ఏమైనా తమ మధ్య ఇన్నాళ్లూ పారదర్శకంగా వున్న స్నేహం ఇప్పుడు కలుషితమైపోయింది.
” భార్యాపిల్లల్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న నాకు మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆదరించారు. ఒకేలా దెబ్బతిన్నవాళ్లం కాబట్టి కిరణ్మయిపట్ల కాస్త ఎక్కువే ఆసక్తి చూపించిన మాట వాస్తవం. నా చనువుని అపార్థం చేసుకోకండి. నాకు ఆమెపట్ల వేరే ఎలాంటి భావమూ లేదు” తల వంచుకుని గోపాల్రావు దంపతులతో అన్నాడు గోపాలకృష్ణ.
“అదేంమాట ?మేము నిన్ను తప్పు పడతామా?” గోపాల్రావు నొచ్చుకున్నాడు. లక్ష్మీదేవి ఉదాసీనంగా ఊరుకుంది.
“మీరు మంచివాళ్ళు కాబట్టి” ఆయనతో అని , కిరణ్మయికేసి తిరిగి,” క్షమించు కిరణ్. ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కృంగి కృశించి పోతున్న నువ్వు నాకు ఒక ఛాలెంజ్‍గా అనిపించావు. చందూ నాకు అప్పగించిన బాధ్యతకూడా అదే .అంతవరకే ఆలోచించానుగానీ ఇంకా లోతుగా ఆలోచించలేదు” ప్రత్యేకించి చెప్పాడు.
కిరణ్మయి ఏం మాట్లాడుతుంది? మరోభావం లేకుండా మగవాడితో మాట్లాడితేనే తప్పు పట్టే సమాజంలో పుట్టినందుకు చాలా బాధపడింది ఎంత ఓదార్పునిచ్చాడు యితను? ఎంత నైతికబలాన్ని తనలో నింపాడు? అవన్నీ తను పొంది అతనికి మాత్రం అవమానాల్ని మిగిలించింది .తల వాలిపోయింది. గుండెల్లో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది. మనసులో వేదన తిరుగుతోంది. కళ్ళలో కన్నీరు సుళ్ళు తిరుగుతోంది. కన్నీటిని తుడుచుకోవడానికి చెయ్యికూడా కదపలేదు. కొయ్యబొమ్మలా బిగుసుకుపోయింది.
వెళ్తానని లేచాడు.
“భోజనం చేసి వెళ్ళండి” అంది ఉదయ.
” మరోసారి వస్తాను” అన్నాడు. అతని కళ్ళు శాంతికోసం ఇల్లంతా వెతకడం కిరణ్మయి దృష్టిని దాటిపోలేదు. అతను నోరు తెరిచి అడగలేదు, ఆమె పెదవి విప్పి చెప్పలేదు.
అతను వెళ్లగానే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకుంది.
చదువు మధ్యలో ఆపి పెళ్లి చేసినప్పుడు రానంత దుఃఖం… ఆ పెళ్లిని అర్ధమధ్యాంతరం చేసి శ్రీధర్ చనిపోయినప్పుడు రానంత దుఃఖం… అత్తమామలు దౌర్జన్యంగా పదవరోజు జరిపినప్పుడు కూడా రాని దుఃఖం ఉప్పెనలా ఇప్పుడొచ్చి ముంచెత్తింది. ఆ ఉప్పెనలో ఆమెకి జీవితం పట్ల ఇంకా ఏమూలో మిగిలి ఉన్న మమకారం, భ్రమలు, ఆశలు అన్నీ సమూలంగా తుడిచిపెట్టుకుపోయాయి.
…
ఈ సంఘటన మీద గోపాలరావు ఇంట్లో చాలా చర్చలు జరిగాయి. అయితే ఇదంతా కిరణ్మయి పరోక్షంలోనే.
” ఎంతకాలం కిరణ్‍ని మనదగ్గర ఉంచుకుంటాం? నాయనమ్మని తోడిచ్చి అక్కడికి పంపిస్తాను” అన్నాడు గోపాల్రావు.
” అక్కడికి వెళితే ఏముంది నాన్నా? దాన్ని చదివించరు. ఉద్యోగం చేయనివ్వరు. ఇంటిల్లిపాదికీ జీతం బత్తెం లేని పరిచారికగా మారిపోతుంది” అన్నాడు చందూ ఆవేశంగా.
” మరేం చేద్దాం రా? దాని జీవితం ఆ ఇంటితో ముడిపడి ఉంది. శ్రీధర్ ఆస్తి వాళ్ల చేతుల్లో ఉంది. అలాంటప్పుడు కిరణ్ బాధ్యత, శాంతి బాధ్యత వాళ్లదే కదా? “
” కిరణ్ మనకి బరువా, నాన్నా?” చందూ చాలా బాధపడ్డాడు. ” దాని వయసు ఎంతని? ఏం అనుభవించిందని? ఇంకా ఎంతో జీవితం ముందుంది! దాని తప్పుల్నీ, బాధల్నీ మనమంటే అర్థం చేసుకుని మనసులో దాచుకుంటాం. వాళ్లు అలా ఎందుకు ఉంటారు? అక్కడికి పంపించటం మంచిపని కాదు” అన్నాడు.
” నీ మనసులో ఏముందో చెప్పరా?” అంది లక్ష్మీదేవి. ఆవిడకి కూడా కూతుర్ని అక్కడికి పంపించటం ఇష్టం లేదు. శ్రీధర్ ఉంటే ఆ విషయం వేరు. అతనే లేడు. భర్తను కోల్పోయి పసిపాపతో వెళ్లి వాళ్లమీద ఆధారపడితే ఆ బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో వూహకి అందనిది కాదు.
” కిరణ్ చదువుకుని ఉద్యోగం చేస్తే దాని కూతురిని అది చూసుకోగలదు. ఆ అవకాశాన్ని మనం దూరం చేయకూడదు. వాళ్లు ఇచ్చే ఆస్తి అంటారా, దానికి వీళ్ళిద్దరికీ హక్కు ఎప్పుడూ ఉంటుంది. వాళ్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాం” అన్నాడు.
” ఏమీ లేకుండానే ఇంత రాద్ధాంతం జరిగింది. పరువు గల ఇల్లు. ఇలాంటి పుకార్లు మనల్ని బజార్న పడేస్తాయి. కిరణే కాకుండా మనింట్లో ఇంకా నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆవేశం పనికిరాదు” అన్నాడు గోపాల్రావు.
” ఎవరి జీవితం వాళ్లదే. తక్కినవాళ్ల కోసం కిరణ్ జీవితం బలి ఇవ్వకండి. మీరు కొంచెం విశాలంగా ఆలోచించగలిగితే కిరణ్‍కి ఇంకా మంచి జీవితం కూడా ఇవ్వగలము”
గోపాల్రావు సాలోచనగా చూశాడు. ఎవరిలోనూ ఆవేశం లేదు. ఆవేదన మాత్రం ఉంది. అది ఆలోచనల్ని పదును పెడుతోంది.
” ఎంతోమంది ఆడపిల్లలకి మళ్లీ పెళ్లి చేస్తున్నారు నాన్నా! మీకు అభ్యంతరం లేకపోతే కిరణ్‍కి కూడా మనం ఇంకో పెళ్లి చెయ్యొచ్చు. గోపాలకృష్ణ చాలా మంచివాడు. అతన్ని మనం అడగొచ్చు. ఇద్దరికీ ఇష్టం అయితే పెళ్లి చేయటంలో తప్పేమీ లేదు. కిరణ్‍కి మళ్లీ పెళ్లి చేయాలన్న విషయం నా మనసులో ఎప్పటినుంచో ఉంది. అది చదువుకుని ఉద్యోగం వెతుక్కున్నాక నా ఆలోచన చెప్పాలనుకున్నాను. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడింక వేరే ఎవర్నో బదులు గోపాలకృష్ణనే అడిగితే బావుంటుందని నాకనిపిస్తోంది” అన్నాడు చందూ.
దానిలోని సాధ్యాసాధ్యాలు చర్చించుకున్నాక …ఎంతో తర్జనభర్జనపడ్డాక… వారం రోజులకి చందూ కిరణ్మయి గదిలోకి ప్రత్యేకంగా వచ్చి ఆ విషయం ప్రస్తావించినప్పుడు ఆమె తెల్లబోయింది.
” మీ ఉద్దేశ్యం ఏమిటసలు? నాకు మళ్లీ పెళ్లేమిటి? ఇప్పటిదాకా అయిన గొడవ చాలదా?” ఉద్రేకంగా అడిగింది. టెన్షన్ని తట్టుకోలేనట్లు నుదిటి మీద నరాలు తపతప కొట్టుకున్నాయి.” అన్నయ్యా! నా ప్రవర్తనలో మీకు అలాంటి భావం కనిపించిందా? గోపాలకృష్ణగారితో నేనెప్పుడేనా హద్దు మీది ప్రవర్తించినట్టనిపించిందా? నాకలాంటి ఉద్దేశ్యం లేదన్నయ్యా” అని తట్టుకోలేక ఏడ్చేసింది.
చందూ బాధపడ్డాడు ఆమె అలా అర్థం చేసుకున్నందుకు.” కిరణ్! మీ ఇద్దరిలో ఎవరికి చెడు తలపు ఉన్నా ఇలాంటి వ్యవహారాలు గోప్యంగా ఉండిపోతాయి. బయట పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. మీ ఇద్దరికీ అలాంటి భావనంటూ లేదు కాబట్టే ఇంత అల్లరి అయింది. మా అందరికీ మీ ఇద్దరిమీదా పూర్తి విశ్వాసం ఉంది” అన్నాడు.
” కానీ అన్నయ్యా! అతని దోవన అతను వెళ్ళిపోయాడు. ఈ గొడవ ఇంతటితో సమసిపోయింది. మళ్లీ తవ్వుకోవడం తలకెత్తుకోవడం దేనికి? నాకు రెండోపెళ్లి ఏంటి? దానివలన ఎన్ని సమస్యలు తలెత్తుతాయి? ఎంతమంది తిరస్కారాలు, దూషణలు ఎదుర్కోవాలి? కామేశ్వరత్తయ్య మన గడప తొక్కుతుందా? కరుణని చైతన్యకి చేసుకుంటుందా? నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ల పెళ్లిళ్లు ఎలా చేస్తావు? అన్నిటికీ మించి శాంతి. దాన్ని ఏం చేయాలి? దాని భవిష్యత్తు ఏమిటి? ఎప్పటికీ అది రెండేళ్ల పిల్లగానే ఉండిపోదు. మీకు నామీద ఎంత ప్రేమేనా ఉండొచ్చుగానీ దాన్ని వ్యక్తపరిచే పద్ధతి ఇది కాదు. దయచేసి నన్నిలా వదిలిపెట్టండి. చదువయ్యి నా కాళ్ళమీద నేను నిలబడేదాకా సహకరించండి. అది చాలు” అంది.
అతను తనని చేసుకోవడానికి సుముఖత చూపాడా? ఎప్పుడు? మొదటినుంచి అతనికి ఈ ఉద్దేశ్యం ఉందా? లేక ఇంత గొడవ జరిగింది కాబట్టి జాలితో సరేనన్నాడా? అతను, తను… శ్రీధర్ స్థానంలోకి అతను… మనసంతా చేదు తిన్నట్టైంది.
శ్రీధర్ తనని అల్లుకుపోవడం, ఆ తమకం, ప్రేమ, అల్లరి. .. గుర్తొచ్చాయి. అతని స్థానంలో ఇతను! ఆ ఆలోచనే భరించరానిదిగా ఉంది. అసహ్యంగా అనిపించింది.” నాకు ఇష్టం లేదు” స్థిరంగా అంది.
” కిరణ్! ఈరోజుని నీకు మేమంతా ఉన్నాం అన్న నిశ్చింత ఉంది. మేమంతా నీ తోటి ప్రయాణికులం మాత్రమే. శాంతికూడా అంతే. మా గమ్యాలు మావి. ఏ పాయింట్ దగ్గరేనా నిన్ను వదిలేసి వెళ్లిపోతాం. అప్పుడు నీకు మిగిలేదేమిటి? అనంతమైన శూన్యం. ఎడతెగని ఒంటరితనం. ఎంత గడిస్తేనమ్మా, నీ జీవితం ముగిసేది? నువ్వేమీ తప్పు పని చేయబోవడం లేదు. నీ బాధ్యతల్ని విస్మరిస్తే తప్పు. ఒకరికి ద్రోహం చేస్తే తప్పు. ఆ రెండూ నువ్వు చెయ్యడంలేదు. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవడంలో సంకోచం వద్దు. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. ఇలాంటి వ్యక్తి నీకు తారసపడటం నిజంగా నీ అదృష్టం. శాంతి బాధ్యతను కూడా అతను తీసుకుంటానన్నాడు. కాకపోయినా అది మనందరి మధ్యనీ పెరుగుతుంది” అనేక విధాల చెప్పి వెళ్ళాడు చందూ.
” రేప్పొద్దున్న మీకు పిల్లలు కలిగి అతని మనసు మారితే మేమంతా లేమా? శాంతి నా కోడలు. శ్రీకాంత్‍కి చేసుకుంటాను. అమ్మకి అక్కర్లేని అనాధలా కాకుండా నా కోడలి హోదాలో ఇదే ఇంట్లో తిరుగుతుంది” అంది లక్ష్మీదేవి.
ఉదయ కిరణ్మయి మనసు మూలమూలల్నీ తడిమింది. కోనకోనల్నీ వెతికింది.” నీకు గోపాలకృష్ణ అంటే ఎక్కడైనా కొంచెమంత అభిమానం లేకుండా ఉండదు. నువ్వు అతన్ని ద్వేషించావా? అసహ్యించుకున్నావా?” అడిగింది తామిద్దరి ఉన్నప్పుడు. లేదన్నట్టు కిరణ్మయి తలూపింది.
” మరి అతన్ని చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? ఇంట్లో పెద్దవాళ్లెవరికీ లేని ఆక్షేపణ నీకెందుకు?”
గోపాలకృష్ణ అంటే కిరణ్మయికి ప్రత్యేకంగా ఇష్టమనిగానీ అఇష్టమనిగానీ ఏమీ లేవు. ఒక్కటి మాత్రం నిజం. అతని సమక్షంలో ఆమెకు ఎంతో హాయిగా ఉంటుంది. ప్రశాంతత దొరుకుతుంది. అతను చెప్పే వేదాంతం ఆమెలోని భావశూన్యాన్ని పూడుస్తుంది. శాంతిపట్ల అతను చూపే అభిమానం ఆమెకి నిశ్చింతనిస్తుంది. అయితే ఇవన్నీ కలిపినంత మాత్రాన అతనిపట్ల ప్రేమ అవ్వదు. ఇవేవీ లేకుండా తను బ్రతకలేదా? వీటి కోసం అతనితో ఒక జీవితకాలపు ఒప్పందం చేసుకోవాలా? తరతరాలుగా ఆమె రక్తంలో జీర్ణమైపోయిన సంప్రదాయానికీ, వీళ్లు చూపిస్తున్న ప్రలోభానికీ మధ్య సంఘర్షణ మొదలైంది.
తన భావాలన్నీ వదినకి చెప్పింది కిరణ్మయి. ఉదయ సుదీర్ఘంగా నిశ్వసించింది.
” వయసులో ఉన్న అందమైన ఆడపిల్లవి నువ్వు. సమాజం నిన్నిలా నీతిగా బతకనివ్వదు కిరణ్! ఎన్నో ఆశలూ, ప్రలోభాలూ చూపించి నిన్ను బురదలోకి లాగాలని చూస్తుంది. ఎదిరించి బ్రతకగలిగే స్థయిర్యం ఉందా నీకు?” అని అడిగింది.
అలాంటి సన్నివేశంలోనూ నవ్వొచ్చింది కిరణ్మయికి ఆ మాటలతో.” బావుంది వదినా! నువ్వు చెప్పేది. నాలాంటి అమ్మాయిల్ని వెతుక్కుని బురదలోకి లాగడమేనా, అందరికీ పని?” నవ్వి అడిగింది.
” అందరూ కాదు. కొందరు. ఒకరు ఇద్దరో. అంతే. వాళ్ళ వెనక ఇంకొందరు ఉంటారు.ఏమీ లేకుండానే మొన్న కాలేజీలో అంత గొడవ అయింది. దాని వెనక ఎవరో ఉండి ఉంటారు. వాళ్లకి ఏదో ఒక ఆశింపు ఉండకుండా ఉండదు. మీ అన్నయ్యమీద… లేదా గోపాలకృష్ణగారిమీద… అసూయో, ద్వేషమో… ఏదో ఒకటి. దానికి ఏమంటావు?
” మీరు నమ్ముతున్నారా వదినా?”
” మేము నమ్మితే ఎంత? నమ్మకపోతే ఎంత?”
” చదువుకున్నదానివి. నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే ఎలా?”
” చదువుకున్నవాళ్ళు ఉండేచోటే మొన్న గొడవ జరిగింది కదా? లోకసహజం కిరణ్! నలుగుర్లోకీ వెళ్ళు. అందరూ నిన్ను ఆ దృష్టితోనే చూస్తారు. మాకు ఓ చాన్స్ ఇవ్వకపోతుందా, భర్త ఎలాగా లేడు- అనుకుంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఆ గోపాలకృష్ణకి మేము ఎందులో తీసిపోయాం అని పళ్ళు నూరతారు. అతననే కాదు, నువ్వు ఇంకెవరితో మాట్లాడినా అంతే”
” వదినా!!”
” బాధపెడితే లాభం లేదు. అలా అన్నవాళ్ళ నోరు మూయించాలి. నా జీవితం నాదని నిష్కర్షగా చెప్పగలగాలి”
“…”
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.