సంగమం 12 by S Sridevi

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

“ఆలోచించు కిరణ్! నువ్వు మాకు ఏదో బరువనీ లేక నీమీద నమ్మకంలేక బలవంతం చేస్తున్నామనీ అనుకోవద్దు. ద్వితీయం చేసుకోవాలంటే మగవాడుకూడా ఇలాగే సంఘర్షణ పడతాడు. చివరికి చేసుకుంటాడు. అతనికి కూడా చేసుకోవాలనుకోవడానికీ వద్దనుకోవడానికీ ఇలాంటివే కారణాలుంటాయి. నీకు నువ్వే ఆలోచించుకో” అంది ఉదయ నిర్ణయం వైపుగా ఆమెని నెట్టి, మళ్లీ నిర్ణయాన్ని ఆమెకే వదిలిపెట్టి.
ఇంట్లోవాళ్ళు కిరణ్మయిని బలవంతం ఏమీ పెట్టలేదు. ఆలోచించుకోమన్నారు. ఆమెతో ఆఖరిగా ఆ విషయం మాట్లాడింది నాయనమ్మ. ఆవిడ అంది,” ఆడది కూడా మనిషే. మగవాడికిలాగే ఆమెకి కూడా రక్తమాంసాలు ఉంటాయి. అవి ఉన్నాయి కాబట్టి కోరికలు కూడా ఉంటాయి. కోరికలంటే కామం ఒక్కటేనని అనుకోకు. తనకు ఒక ఇల్లు ఉండాలనీ, తన బ్రతుకు తను బ్రతకాలనీ, అందరిలాగే నవ్వుతూ తిరగాలనీ ఉంటుంది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే స్త్రీని పోయినవాళ్లతో మనంకూడా పోతామా అని ధైర్యం చెప్పి మళ్లీ తల్లి కావడానికి సంసిద్ధురాలిని చేస్తారు. ఆ సమస్య కేవలం ఆమెకి మాత్రమే పరిమితం. భర్త పోయిన స్త్రీ విషయంలో అలా కాదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆమె పిల్లలు అనాధలై సమాజానికి బరువౌతారేమోనని భయం ఉంటుంది. చనిపోయినవాడి ఆస్తి లావాదేవీలు ఉంటాయి. అందుకే ఆమెని అణిచేస్తారు. తల్లీ! ఇవి జగన్నాథ రథ చక్రాలు. కదలాలంటే కొందరు వాటి కింద పడి నలిగిపోవాలి. ఇప్పుడు రోజులు మారాయంటున్నారు. మగవాడి ఆలోచన కూడా ఉదారమైందని చెప్తున్నారు. అతడు శాంతి బాధ్యత తీసుకుంటానంటున్నాడు. ఒకవేళ తర్వాత మారిపోతే మీ అమ్మ చెప్పిన మార్గం ఉండనే ఉంది. నాకు తెలిసి పరిస్థితులు ఇంతగా కలిసిరావడం ఎప్పుడూ చూడలేదు. ఎరగను. పాపపుపనేమోనని ఒకవైపు మనసు పీకుతున్నా మరోవైపు నీ ముఖం చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నాన్నే ఒప్పుకున్నాక, అన్నయ్య ముందుపడ్డాక ఇంకా ఆలోచన దేనికి? వాళ్ళు చెప్పినట్టు చెయ్యి” అందావిడ.
కిరణ్మయి ఆవిడ ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చింది. ” శ్రీధర్ చచ్చిపోకుండా ఉంటే ఈ సమస్యలేవీ ఉండేవి కాదు. ఏం చేయాలో, ఎటు నిర్ణయించుకోవాలో, నాన్న నాకిచ్చిన ఈ స్వేచ్ఛని వాడుకోవాలో వద్దో తెలియడం లేదు. చచ్చిపోవాలనిపిస్తోంది నానమ్మా!” అంది.
ఆవిడ కదిలిపోయింది.” అలాంటి మాట ఎప్పుడూ అనకు. నీమీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాం. రోజులేవో మారుతాయని ఆశగా ఎదురుచూస్తూ జీవితపు చరమాంకాన్ని చేరుకున్నదాన్ని. నాకు నలభయ్యళ్లేప్పుడు తాతయ్య పోయారు. అప్పటినుంచీ ఒంటరిపోరాటం చేశాను. నాదగ్గర ఉన్న ఆస్తిమీద, నామీద చాలామంది దృష్టి ఉండేది. నన్ను లొంగదీసుకుంటే నా ఆస్తి వాళ్ల ఆధీనంలోకి వస్తుందనుకునేవారు. అందరూ బంధువులే. అయినవాళ్లే. అంత వయసు ఉన్నప్పుడే నేను కష్టాలు పడ్డాను. మరి నువ్వు? పసిదానివి. ఎంత పోరాటం చేయాలి? కొంచెం మోటుగా అనిపించినా ఒక మాట చెప్తాను. ఒకరి భార్యవనిపించుకుంటే నీవైపు ఎవరూ చూడరు” అంది.
ఎవరెంతగా ప్రోత్సహించినా కిరణ్మయి తనుగా ఒక నిర్ణయానికి రాలేకపోయింది. ఇంట్లోవాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని కాదని మాత్రం అనలేదు.
ఆ వేసవిలో కరుణ పెళ్లి నిశ్చయమైంది. అది కిరణ్మయికోసమే. ముందుగా కిరణ్మయికి ద్వితీయం చేస్తే ఏ గొడవలు వస్తాయోనని కరుణ పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు.
” చూడమ్మా! ఒక అల్పాయుష్కుడికి ఇచ్చి చేసి అక్క జీవితం నాశనం చేశాను. మళ్లీ సవ్యం చెయ్యడానికి ఒక అవకాశం గోపాలకృష్ణ రూపాన్న వచ్చింది. అది అందుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. నీకు ఇప్పుడే చెయ్యొద్దనుకున్నాను. కానీ తప్పట్లేదు. అక్కకి జరిగినట్టే నీకూ జరుగుతుందనిమాత్రం భయపడకు. అందులో అర్థం లేదు. అందరి తలరాతలూ ఒక్కలా ఉండవు” అని కరుణకి నచ్చజెప్పాడు గోపాల్రావు.
“నాన్నగారూ! మీ మాటకి నేను ఎదురు చెప్పను. కానీ ఒక్క విషయం… అక్క చదువయ్యి ఏదైనా ఉద్యోగంలో చేరేదాకా ఆగచ్చు కదా? అప్పటిదాకా గోపాలకృష్ణగారు ఉండరా?” అంది కరుణ.
” అన్నయ్య చెప్పేంతవరకూ నా ఆలోచన అక్కని వాళ్ళింటికి పంపించేద్దామనో లేదా చదివించి వుద్యోగంలో పెడదామనో అంతే. అన్నయ్య ఈతరం మనిషిలా ఆలోచించాడు. వాడి ఆలోచన నాకు నచ్చింది. వెంటనే ఒప్పేసుకున్నాను”
“కిరణ్ చాలా చిన్నది నాన్నా! ఇప్పటికే ఒక సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంది. ఈ పెళ్లివలన ఏవైనా సమస్యలు ఎదురైతే అది తట్టుకోగలదా?”
” మొదట అతను కూడా ఒప్పుకోలేదు. తనకి మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదన్నాడు. మరో అమ్మాయిని చేసుకుని ఆమె ఆలోచనలతో సమన్వయపడేంత శక్తి తనకి లేదని చెప్పాడు. ఒకటికి రెండుసార్లు అడిగాక, కొంతకాలంగా కిరణ్‍ని చూసాడు, దాని మనస్తత్వం తెలుసుగాబట్టి సమాధానపడ్డాడు.అతన్ని మనంకూడా చూసాము. సాత్వికుడు”
“నాకెందుకో భయంవేస్తోంది నాన్నా! ” అంది కరుణ.
గోపాల్రావు ముఖం మ్లానమైంది. తను చేయబోయే పనివలన బంధువులనుంచీ తిరస్కారాలు వస్తాయి. దానికి సిద్ధపడ్డాడు. శ్రీధర్ తల్లిదండ్రులు గొడవచేస్తారేమో! దానికీ సిద్ధమే. శాంతి బాధ్యతకూడా తమదే. కానీ… ఇంత చేసాక కిరణ్ సుఖపడుతుందా?
ఎంత విచిత్రమైన పరిస్థితి! మొదటిసారి చేసినప్పుడు ఏ భయాలూ లేవు. ఎంతో సంతోషంగా…వేడుకగా … జరిగింది. ఇప్పుడు, ఈ జరగబోయేది కిరణ్మయి తలరాత మారుస్తుందనే ఆశ ఉన్నా నీడలా భయం దాన్ని వెంటాడుతోంది.
” దానికి ఇదొక అవకాశం కరుణా! ఇంకో నాలుగైదేళ్లాగి వేరే సంబంధం చూసినా కూడా ఈ భయాలు మనని వదలవు. అడిగితే గోపాలకృష్ణ ఆగుతాడేమో! కానీ అతనికి కిరణ్ జీవితం చక్కబడాలన్న ఆకాంక్ష బలంగా ఉంది. దాన్ని బాగుచేయడంలో తను కూడా బాగుపడుతున్నాడు. అందుకని ఈ తొందర” అది కూతురికి నచ్చజెప్పినట్లు కాక తనకి తనే చెప్పుకుంటున్నట్లుగా ఉంది.

ఇలా ఒకటికి రెండుసార్లు నిర్ణయానికీ వెనక్కి తీసుకోవడానికీ మధ్య ఊగిసలాడి ఆఖరికి అందరూ మనసులకు సర్దిచెప్పుకుని కరుణ భయాలన్నీ తీర్చి, ఆమె సంతోషంగా ఒప్పుకున్నాకే కామేశ్వరికి చెప్పారు.
చిన్నప్పటినుంచీ అనుకుంటున్న సంబంధమే. గోపాల్రావుకి చెల్లెలి వరస అవుతుంది కామేశ్వరి. కొంతకాలం పక్కపక్క ఇళ్లలో కూడా ఉన్నారు. అలా ఉన్నప్పుడే ఈ సంబంధం అనుకోవడం జరిగింది. ఆవిడ కొడుకు చైతన్య. ఎమ్మెస్సీ పాసై బ్యాంకులో చేస్తున్నాడు. ఇంకా మంచి ఉద్యోగంకోసం చూస్తున్నాడు. ఇప్పుడప్పుడే కరుణ పెళ్లి ఆలోచన లేదన్న గోపాల్రావే తనంతట తను అడిగేసరికి ఆవిడ ఎంతో సంతోషపడింది. గోపాల్రావు కుటుంబంతో వియ్యం అందటం వాళ్లకి చాలా గొప్ప విషయం.
” ఇంకా కరుణ చదువనీ, చైతన్యకి మంచి ఉద్యోగం రావాలనీ, అదనీ ఇదనీ ఆలస్యం చేస్తారనుకున్నాను. ఒక్కడే కొడుకు. కోడలు వస్తే నాకు కాలక్షేపం. అందులోనూ తెలిసిన పిల్ల” అంది. పెళ్లి క్లుప్తంగా చేద్దామంటే ఆవిడ ఒప్పుకోలేదు.
” కష్టాలూ బాధలూ ఎప్పుడూ ఉండేవే. వస్తుంటాయి. వెళ్తుంటాయి. వాటిని కొద్ది సేపైనా మర్చిపోవడానికి ఈ వేడుకలు. పెద్దవాళ్లేమీ తెలివితక్కువగా నిర్ణయించలేదు. మా ఇంట్లో ఇదే ఆఖరి పెళ్లి. ఘనంగా జరిపించి తీరాలి” అంది కచ్చితంగా. గోపాల్రావుకి తప్పలేదు. వాస్తవం కూడా అంతే. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి అనుభవాలూ, అనుభూతులూ వాళ్ళవి.
పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగానే చుట్టాల తాకిడి మొదలైంది. కిరణ్మయి గది వదిలి ఇవతలకి రావడం లేదు. ఎవరెవరో వచ్చి పలకరించి వెళ్తున్నారు. వాళ్లు చూపించే సానుభూతిని ఆమె భరించలేకపోతోంది.
జరుగుతున్న పెళ్లి పనులు చూస్తుంటే ఆమె అంతరాంతరాలలో ఎక్కడో చిన్న కదలిక. చిన్నదేగానీ గడిచే జీవితపు క్షణక్షణంలో, చుట్టూ వున్న మనిషుల రక్తపు అణువణువులో వేళ్ళూనుకుపోయి విస్తరించుకున్న సాంప్రదాయమనే మహావృక్షాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయగలంత మౌలికమైన కదలిక అది. విప్లవమూ వచ్చింది, విధ్వంసమూ జరిగింది. ఏ పర్యవసానమూ ఏకపక్షంగానో నిక్కచ్చైన రుజుత్వంతోనో వుండదు.
ఇదే ఇల్లు. ఇదే మనుషులు. అప్పుడు తన పెళ్లికి వచ్చారు. దీర్ఘ సుమంగళీభవ అని తననీ శతాయుష్మాన్ భవ అని అతన్నీ దీవించారు. వాళ్ల ఆశీర్వాదాలతో నిమిత్తం లేకుండా జరగవలసిన అనర్థం ఏదో జరిగింది. ఇప్పుడు కరుణ పెళ్లి. దానికోసం వస్తున్నారు. వేడుకలు చేస్తున్నారు. ఆశీర్వదిస్తారు. వెళ్తారు. దాని రాత రాత ఎలా ఉందో! అన్నీ భగవంతుడే నిర్ణయించేటప్పుడు ఈ తతంగాలన్నీ ఎందుకో? మన చేతుల్లో ఏదీ లేనప్పుడు అన్నీ మనమే చేస్తున్నామనే ఈ భ్రమలెందుకు? భేషజాలు ఎందుకు?
ఆమె మనసులో ఆలోచనలు కల్లోలసముద్రంలో అలల్లా కదులుతున్నాయి. వద్దనుకున్నా గుర్తొస్తున్నాయి తన పెళ్లి వేడుకలు. గోపాలకృష్ణతో గడపబోయే కాలం ఆమె ఆలోచనల్లోకి రావడంలేదు. శ్రీధర్‍తో పంచుకున్న అనుభూతులే శాశ్వతం అనిపిస్తున్నాయి.
పెళ్లికింకా రెండు రోజులుందనగా గోపాల్రావు ముందు గదిలో వుండి కిరణ్మయిని పిలిపించాడు. ఎందుకోనని వెళ్తోందామె.
“అలా తిరగబోకమ్మా! అందరికీ ఎదురు రాకు” అందొకావిడ. ఛెళ్ళుమని చరిచినట్టైంది కిరణ్మయికి. దెబ్బతిన్నట్టు తలెత్తి ఆవిడకేసి చూసింది. అత్త వరస. ఆవిడ కళ్ళలో కన్నీటి పొర.
” ఇలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. నీ పెళ్ళప్పుడు పూలజడ నేనేకదూ! చక్కటి జంటని ఎంతో ముచ్చట పడ్డాను. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు” ఇంకా ఏదో అంటోందావిడ.
” నాన్న ఎందుకో రమ్మన్నారు. వెళ్తున్నాను” అనేసి అక్కడినుంచి తప్పించుకుని ముందు గదిలో తండ్రి కూర్చున్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ…
తను ఎదుర్కోవలసిన వాస్తవంలా గోపాలకృష్ణ ఉన్నాడు. అతని ముందుకు వెళ్లాలంటే ఆమెకి సంకోచంగా అనిపించింది. అతనదేం పట్టించుకోలేదు. పెళ్లి ప్రస్తావన వచ్చాక వాళ్లు కలుసుకోవడం మొదటిసారి.
” రా కిరణ్! కూర్చో. నీతో మాట్లాడాలి” అన్నాడు. కిరణ్మయి కూర్చోలేదు. అలాగే గుమ్మానికి ఆనుకుని నిలబడింది.” మా కాలేజీనుంచి
ఎక్స్‌కర్షన్‍కి వెళ్తున్నాము. నువ్వు కూడా రా. రాత్రికి ప్రయాణం” అన్నాడు.
కిరణ్మయి జవాబు ఇవ్వకుండా తండ్రి కేసి చూసింది. గోపాల్రావుకి ఆమెను చూస్తుంటే జాలేసింది. ఇంట్లో జరుగుతున్నవి ఏవీ ఆయన దృష్టిని దాటి పోవడంలేదు.” వెళ్ళు తల్లీ! నీక్కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కరుణ పెళ్లి అనుకున్నప్పట్నుంచీ జరుగుతున్నవన్నీ నేను చూస్తున్నాను. కానీ ఏం చెయ్యను? అశక్తుణ్ణి. మనం ఎంత ముందుకెళ్ళినా మన చుట్టాలంతా అలా ఉండాలని లేదుగా? ఇక్కడే ఉంటే నిన్ను ఇంకా బాధపెడతారు. నీకు కావలసిన డబ్బు ఇస్తాను. చందూ వచ్చి రైలెక్కిస్తాడు. తిరిగి వచ్చేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడికి సర్దుకుంటారు” అన్నాడు.
కిరణ్మయి తల ఊపి అక్కడినుంచీ వెళ్ళిపోయింది. అయితే ఆమె మనసులో ఒక ప్రశ్న. ఈ ముందుకు వెళ్లని బంధువుల్లో కామేశ్వరి, చైతన్య కూడా ఉన్నారా?
కిరణ్మయిని అలా పంపిస్తున్నారన్న వార్త పెళ్లింట్లో చాలా సంచలనాన్ని రేపింది.
” ఒక్కర్తీ ఆ గదిలో ఏడుస్తూ కూర్చుంటే జయకరం కాదు. వెళ్లటమే మంచిది. అదీకాక దాని వయసు ఎంతని? ఇక్కడే వుండి చెల్లెలి పెళ్లి చూడకూడంటే బాధపడుతుంది. రెండోయేడు. పందిట్లో ఒకవార కూర్చోబెడదామన్నా కుదరదు” అని చర్చించుకుని కిరణ్మయి ప్రయాణానికి ఇప్పటి కాలానుగుణంగా కొన్ని సర్దుబాట్లు చేసి సరేనన్నారు.
అనుకున్న విధంగా రాత్రి పదకొండుగంటలకి చందూ కిరణ్మయిని తీసుకుని బయల్దేరాడు. శాంతిని తనతో తీసుకెళ్ళాలనుకుంది.
“పెళ్లి పెళ్లని అదంత సరదా పడుతోంది. ఇంతమంది చుట్టాలూవాళ్ళూ వచ్చారు. దాన్ని వుంచెయ్. తీసుకెళ్లకు” అంది లక్ష్మీదేవి.
నిజమే! తనంటే విధివంచితురాలు. వేడుకల్లో స్థానం లేదు. దానికేం? అనుకుంది కిరణ్మయి. అక్కడే ఆమె సరిదిద్దుకోలేని పొరపాటు జరిగింది.
కారు బయల్దేరింది. దార్లో విడిదింటి సందుమలుపు దగ్గర ఆగింది. ఎందుకోననుకుంది కిరణ్మయి. చైతన్య వచ్చి ఎక్కి కూర్చున్నాడు.
“కరుణ నాకు అన్ని విషయాలూ వివరంగా చెప్పింది కిరణ్. నువ్వు ఇలాగే వుండాలని నేను కోరుకోవటం లేదు. మామయ్యా బావావాళ్ళంతా తీసుకున్న నిర్ణయం సరైనది. దాని ప్రభావం కరుణమీద ఎంతమాత్రం వుండదు. అమ్మ పాతకాలపుదికాబట్టి కొన్ని సమస్యలు రావచ్చు. వాటంతట అవే సర్దుకుపోతాయి” అన్నాడు కిరణ్మయి చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలేస్తూ. ఎంతమంది నిండుమనసుతో తను మళ్లీ నిలబడాలని కోరుకుంటున్నారు! ఆమెకి హాయిగా అనిపించింది. మనసులోంచీ బరువు కొంత దిగినట్టైంది.
కరుణకే సమస్య లేకపోతే …అన్నయ్య పిల్లలు బాగా చిన్నవాళ్ళు…అప్పటికి ఇంకా మార్పు వస్తుందేమో! మనసు ఇంకా తేలికపడింది. లోలోపలి సంకోచాలు నెమ్మదిగా కరిగిపోయాయి.