గాలిమనిషి by S Sridevi

“ఓయ్, గాలిమనిషీ!”
అప్రయత్నంగా అనేసాను. చుట్టూ ఎవరూ లేరు. మాల్‍లో నేను, నాకు దూరంగా అతనూ. దూరాన్నించీకూడా అతనికి నా పిలుపు వినిపించింది. చప్పుని తలతిప్పి చూసాడు. నన్ను గుర్తించాక అతనికళ్లలో సంభ్రమం. అతనితో నా పెళ్ళి ప్రతిపాదనని నాన్న నిర్ద్వంద్వంగా కాదనేసిన తర్వాత ఇరవయ్యేళ్లకి మళ్ళీ అతన్ని చూడటం.
“సుప్రభా! నువ్వేనా? బావున్నావా?” అడుగుతూ నా దగ్గరికి వచ్చాడు. పెద్దగా మార్పేమీ లేదు మనిషిలో. అప్పట్లో ఎలా వున్నాడో, ఇప్పుడూ అలానే వున్నాడు. పోతే వయసు పెరిగినట్టు తెలుస్తోంది. అది ఎవరికేనా అనివార్యం.
నన్నూ, నా చేతుల్లో వున్న బేగ్‍లూ మార్చిమార్చి చూస్తూ, “మారావా? నువ్వే ఇదా?” అడిగాడు చిన్నగా నవ్వి. అతనలా ఎందుకు అన్నాడో నాకు తెలుసు.
“మారలేదేమో! బయటపడ్డానేమో!” అన్నాను.
“ఐతే మీ నాన్నగారి అంచనా సరైనదే” అన్నాడు నా చేతిలోని బేగ్స్ అందుకుని.
“నీకెందుకు ఈ బరువులు? గాలిమనిషివి” అన్నాను కినుకగా.
అతనీమాటు పెద్దగా నవ్వేసాడు.
“అనుకున్నవీ, విసురుకున్నవీ మాటలు చాలు. పద మాయింటికి వెళ్దాం” అన్నాడు ముందుకి దారితీస్తూ. మళ్ళీ ఆగి, “షాపింగ్ అయిందా? ఇంకా కొనేవి వున్నాయా? అలాగైతే నేను కాసేపు ఎక్కడేనా కూర్చుంటాను. నీ పనయ్యాక కలుసుకుందాం” అన్నాడు.
“మావారు వూళ్ళో లేరు. ఒక్కదానికీ తోచక ఇలా వచ్చాను. అంతే. మీరుండేది ఎక్కడ?” అడిగాను తనతో నడుస్తూ. చెప్పాడు.
“నాకారుంది వెళ్దాం” అన్నాను తను కేబ్ బుక్ చెయ్యబోతుంటే ఆపి.
అరగంట పట్టింది వాళ్ళిల్లు చేరడానికి. నేను డ్రైవ్ చేస్తుంటే తను పక్కసీట్లో కూర్చుని చాలా విషయాలు చెప్పాడు. అలాగే నాగురించి అడిగి తెలుసుకున్నాడు. నాగురించి చెప్పడానికి పెద్దగా ఏమీ వుండదు. అందరిలాంటి జీవితమే. డబ్బు సంపాదించుకోవడం, ఇంకా ఇంకా సంపాదించుకోవడం, సంపాదించిన డబ్బుని ఆస్థులుగానూ, సరదాలుగానూ, సౌఖ్యాలుగానూ మారకం చేసుకోవడం… అంతే. అతనలా కాదు. విలక్షణమైన జీవితం. ఉండటానికి యిల్లూ, నడపడానికీ కారూ ఏవీ అక్కర్లేదతనికి.
పెళ్లైందట.
“ఇద్దరు పిల్లలు. పాప మెడిసిన్, బాబు న్యూక్లియార్ సైన్సెస్‍లో మాస్టర్స్ చేస్తున్నారు” అని చెప్పాడు. బాగానే చదివిస్తున్నాడు పిల్లల్ని.
“నీగురించి చెప్పు” అన్నాడు.
“తెలుసుగా, శాయి ఇంజనీరు. కొన్నాళ్ళు బైట వుండి వచ్చాము. ముంబైలో చాలాకాలం వుద్యోగం చేసాడు. ఇక్కడ ప్రాపర్టీస్ వున్నాయి. వాళ్ల నాన్నగారు పెద్దవారయ్యారు. అందుకని ఇక్కడికి వచ్చేశాం. నీకులాగే ఇద్దరు పిల్లలు. ఇంజనీర్లు. యూయస్ వెళ్ళే ప్రయత్నంలో వున్నారు” అన్నాను.
“గుడ్” అన్నాడు ప్రశంసగా. అతని ముఖంలోకి చూసాను. అసూయగానీ వుందా?
“మీ ఆవిడ?” అడిగాను.
“చూస్తావుగా?” అన్నాడు.
గమ్యం చేరుకున్నాము. అవంతీస్ అబోడ్ అపార్ట్‌మెంట్స్. విలాసవంతమైన ఫ్లాట్స్. ఇందులో వుంటున్నారా? స్వంత ఫ్లాటా? కొన్నాడా? ప్రశ్నలతో సతమతమయాను. అతని భార్య ఇందు. బెల్ నొక్కగానే వచ్చి తీసింది. ఇంచుమించు నా వయసే వుంటుంది. పెళ్ళిప్రస్తావనదాకా వచ్చి వెనక్కి వెళ్ళిన స్నేహితుడిభార్య కాబట్టి చాలా కుతూహలంగా చూసాను. తెల్లగా కొంచెం బొద్దుగా వుంది. బావుంది. ఇద్దరికీ పరిచయం చేసాడు. నాపేరు చెప్పగానే, నేనెవరో తెలిసినట్టుగా మారాయి ఆమె ముఖకవళికలు. నాగురించి చెప్పాడా? సందిగ్ధంగా అతని ముఖంలోకి చూసాను.
“మీరిద్దరూ మాట్లాడుకుంటూ వుండండి. నేను పదినిముషాల్లో వస్తాను” అని అతను బైటికి వెళ్ళాడు. చెప్పినట్టు మరీ పదినిముషాలేం కాదుగానీ, అరగంట పట్టింది అతను రావడానికి. ఖరీదైన సామగ్రీతో ఇల్లంతా విలాసవంతంగా వుంది. అతని అభిరుచి అదికాదే! మారాడా?
దాచుకోవలసిన రహస్యాలుగానీ, బైటపడకుండా వుంచాల్సిన విషయాలుగానీ ప్రత్యేకించి ఏవీ లేకపోవడంతో మా సంభాషణ మామూలుగానే నడిచింది. కాఫీ కలుపుకుని వచ్చింది. తాగుతూ కూర్చున్నాం కబుర్లకి.
“ఎన్ని రాష్ట్రాలు తిరిగారు ఇప్పటిదాకా?” అడిగాను నవ్వుతూ. ఏడాదికో రాష్ట్రంలో వుండాలనేది అతని కోరిక. అప్పటికింకా విదేశాల్లో వుండటం అతని ఆలోచనల్లోకి రాలేదు. వస్తే రాష్ట్రానికో ఏడాది సరిపోయేదికాదు.
“పదిహేను. పిల్లలు పుట్టినప్పుడు రెండుసార్లు బ్రేక్ పడింది” తనూ నవ్వుతూనే చెప్పింది.
“మీరిద్దరూ పెళ్ళిదాకా వచ్చి ఆగిపోయారటకదా?” కుతుహలంగా అడిగింది.
“తను చెప్పాడా?” అడిగాను. తలూపింది. అసూయేమీ కనిపించలేదు. ప్రసన్నంగానే వింది.
“మా నాన్నగారికి తన కోరికలు, ఆశయాలు అర్థరహితంగా అనిపించాయి. స్థిరత్వం లేదని వద్దన్నారు. సంపాదన లేకుండా పెద్దలిచ్చిన ఆస్థిని కరిగిస్తూ దేశాలుపట్టుకుని తిరుగుతూ బతకడమనేదాన్ని ఒక జీవనశైలిగా ఆయన ఆమోదించలేకపోయారు. అది జీవితంలో అన్నీ సాధించాక చెయ్యాల్సిన పనని ఆయనకి బలమైన నమ్మకం. అతని జీవనశైలి నాకు భిన్నంగా వుండటంతో కలిగిన కుతూహలమే తప్ప ఇద్దరినీ జీవితకాలంపాటు కలిపి వుంచగలంత బలమైన బంధం మామధ్య లేదని వివరించారు. నాకు ఆయన వివరణ సరైనదని అనిపించింది. తనకి సారీ చెప్పి దూరం జరిగిపోయాను” అన్నాను.
“ఈ సంబంధం బంధువులద్వారా వచ్చింది. అమ్మ వద్దంది. మా ఫాదర్‍కి నచ్చింది.
అటు వాళ్ళకీ ఆస్థి వుంది, ఇటు మనకీ వుంది. గడిపినంతకాలం సరదాగా గడుపుతారు. ఎల్లకాలం అలానే వుండిపోరుకదా- అన్నారు. పెళ్ళిచూపులయాక ఇద్దరం చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నాం. అప్పటికి నాకు జీవితమంటే చదువుకోవడం, పెళ్ళిచేసుకోవడం, పిల్లలని కనడం, ఇల్లూవాకిలీ ఏర్పరుచుకోవడం, అమ్మానాన్నలిచ్చినదానికి మరింత పోగుచెయ్యడం… ఇవే. ఇంతకు భిన్నమైన ఆలోచనలుంటాయని అనుకోలేదు. దేశమంతా తిరుగుతూ గడపడం తనకి ఇష్టమని తను చెప్పినప్పుడు నాకు థ్రి‍ల్‍గా అనిపించింది” ఇందు చెప్పింది.
“నేనూ అలాగే థ్రిల్లయాను అతను చెప్తుంటే” అన్నాను.
“కొత్తప్రదేశాలకి వెళ్ళి బాధ్యతల్లేకుండా గడపడం సరదాగానే వుంటుందికదా, ఆ వయసులో? ఆపైన అన్నీ చూసుకోవడానికి నాన్న వున్నారన్న భరోసాతో పెళ్ళికి సరేనన్నాను. నేను సుఖంగా వున్నానా అంటే వున్నాననే చెప్పాలి. ప్రతీది తను చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఫుల్లీ ఫర్నిష్‍డ్ ఫ్లాట్ అద్దెకి తీసుకుంటాం. పదకొండునెలల కాంట్రాక్ట్‌మీద. సూట్‍కేసుతో వచ్చి, మళ్ళీ కాంట్రాక్ట్ అవగానే ఇల్లు నడపడంకోసం కొనుక్కున్నవన్నీ పనివాళ్లకి ఇచ్చేసి సూట్‍కేసుతో వెళ్ళిపోతాం. ఇక్కడున్న ఏవీ మావి కావు. మాకు ఏ అనుబంధం వేటితోటీ వుండదనుకున్నప్పుడు ఒక్కోసారి ఏదో దిగులుగా అనిపిస్తుంది. పదోతరగతిదాకా పిల్లల్నికూడా మాతోపాటు తిప్పాం. ఇంటర్నించీ హాస్టల్స్‌కి వెళ్ళారు”
“బాగానే చదువుతున్నారని చెప్పాడు” అన్నాను.
ఆమె తలూపింది.
“అడక్కూడదేమో! కానీ అడుగుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. జాబ్… సంపాదన… పెద్దవాళ్ళిచ్చింది కూర్చుని ఖర్చుచేస్తే ఎంతకాలం వస్తుంది?” సంకోచంగా అడిగాను.
“మేమెవ్వరం ఇబ్బందిపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులనుంచీ వచ్చింది మూడుకోట్లు. ఒకటి నాకు, ఒకటి పిల్లలకి, మిగిలింది మా ఖర్చులకి. అవసరాలని కుదించేసుకున్నాక ఖర్చులూ తగ్గిపోతాయి. ట్రావెలోగ్స్ రాస్తారు. పుస్తకాలుగా వచ్చాయి. కొద్దిగా రాయల్టీ వస్తుంది. నడిచిపోతోంది” అంది. తనమాటల్లో కొద్దిగా అసంతృప్తి వుంది.
చాలాసేపు వాళ్ళగురించి చెప్పాక, “జీవితంలో ఏ గోల్ లేకుండా బతకడమంటే… ఎలాంటి బంధాలూ లేకుండా వుండటమంటే ఏ ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్నట్టుగా అనిపిస్తుంది” అంది చివరికి.
అతనొచ్చాడు. నాకు పెట్టడానికి చీర, స్వీట్స్ తీసుకుని వచ్చాడు.
“ఇదేమిటి? నీకిలాంటివేం వుండవుగా?” అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ.
“మీకిద్దరికీ వుంటాయికదా?” అన్నాడు.
నవ్వేసాను. ఇందుకూడా నవ్వింది. భోజనానికి వుండమంది. ఇంకొంచెం అన్నం వండుకుని వున్న ఆధరవులతో సర్దుకుని తినేసాం. బొట్టు పెట్టి చీర, జాకెట్‍ముక్క, స్వీట్స్, పళ్ళు ఇచ్చింది.
“ఇద్దరు కలిసి మాయింటికి రండి” ఆహ్వానించాను. తలూపింది.
ఇందుతో నా చూపులు కలుసుకున్నాయి. అతన్ని వద్దనుకుని నేనూ, చేసుకుని ఆమే సంతోషంగానే వున్నాం. కానీ… ఆమెకి అతను నిరంతర సంఘర్షణ. నాకు? అప్పుడప్పుడు మనసులో కదిలే జ్ఞాపకం మాత్రమే. మర్చిపోవాలంటే మర్చిపోవచ్చు. మనసులో మోస్తూ తిరగక్కర్లేదు. అతనుమాత్రం అతనే.