“మాకు ప్రాప్తం ఉంటే పుట్టక మానరు. ప్రాప్తంలో లేనిదానికోసం నేను ప్రాకులాడను. నా తల్లిని మీరిద్దరూ కలిసి ఏం చేశారో నాకు తెలుసు. ఈ ఇంటిచరిత్రలోకి మరో శ్రీలక్ష్మి రానక్కర్లేదు” అన్నాను కటువుగా. నాకా విషయం తెలిసిందని అర్థం కావడానికి ఆవిడకి కొంత వ్యవధి పట్టింది. కానీ ఇదివరకు వచ్చినట్టు పూనకాలేవీ రాలేదు. కారణం ఆవిడమీద ఇప్పుడు ఎలాంటి ఒత్తిడీ లేదు. తప్పు చేశానన్న భయం, నాన్నకు తెలిస్తే ఏమవుతుందోనన్న సంకోచం లేవు. అందుకని నిబ్బరంగానే ఉంది. కొంత తెలతెలబోవడం సహజంగానే జరిగింది.
అప్పుడే బయటినుంచి వచ్చిన నాన్న ఆమాటల్ని విన్నాడు. ఉన్నమాట అనేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. అహం తీవ్రంగా దెబ్బతింది. ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టేశాడు. నేనూ తగ్గలేదు. ఇంక ఆ ఇంట్లో నేను ఉండలేననిపించింది. నా తల్లికి రక్షణ ఇవ్వలేనిచోట నా భార్యమాత్రం సురక్షితంగా ఉంటుందా? వాళ్లు తెగించిన మనుషులు.. పాపపుణ్యాలు, నీతి నియమాలు, న్యాయాన్యాయాల విచక్షణ లేనివాళ్లు.
జ్యోతిని తీసుకుని ఇంట్లోంచి కట్టుబట్టలతో వచ్చేసాను. నరసమ్మగారు నన్ను ఆపమని నాన్నని బతిమాలింది.
“చిన్నవాడు, లోకానుభవంలేనివాడు. వాళ్లూ వీళ్లూ చెప్పినవేవో మనసులో పెట్టుకుని అన్నమాటలు పట్టుకుని ఇంట్లోంచి పంపించేసుకుంటామా?” అని నన్ను హోల్డ్ చేయడానికి ప్రయత్నించింది.
“వెళ్ళనీ! ఎలా బతుకుతాడో చూస్తాను” అన్నాడు నాన్న. అమ్మగురించి నేనలా అనటం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. తప్పుచేసి పట్టుబడిన వ్యక్తి ఆ తప్పును ఒప్పుకోడానికి ఎదురుతిరుగుతాడే, అలా ప్రవర్తించాడు.
నాకు మరింత అసహ్యత కలిగింది.
…
ఎమ్మే ఫైనల్ రాసిన పిల్లలు కొందరు రూమ్ తీసుకుని ఉంటున్నారు. వాళ్లలో చందూ ఒకడు. మా ఇద్దరికీ డిగ్రీనుంచి స్నేహం ఉంది.
వాళ్ళ గది- స్టవ్, చాప, దిండు, వంటపాత్రల్లాంటి చిన్న చిన్న సామాగ్రితోసహా మాకు ఇచ్చారు. నేను ఇంట్లో ఎందుకు గొడవపడ్డానో అంత వివరంగా చెప్పలేదుగానీ గొడవలయిన విషయంమాత్రం స్పష్టంగా చెప్పాను.
చందూ విడిచిపెట్టలేదు. నేనూ తన దగ్గర ఏదీ దాచలేదు. తను దిగ్భ్రాంతుడయ్యాడు.
ఒక్క గదిలో చాలీచాలని సామాన్లతో మా కాపురం మొదలైంది. జ్యోతి చాలా తెలివైనదని మరోసారి రుజువైంది. ఉన్నవాటిలోనే అన్నీ సర్ది వంట చేసింది. ఇద్దరం పీటలు లేకుండా కింద కూర్చుని మొదటిభోజనం చేసాము. ఒకరిని చూస్తుంటే ఇంకొకరికి బాధగా ఉంది. ఎవరం బయటపడలేదు. నాలో ఒక భావన ఉంది. ఆ ఇంట్లో ఉన్న సిరిసంపద నాకు చెందినది కాదు. వాటి విలువ నా తల్లి ప్రాణం. వాటిమీద నాకు ఎలాంటి మమకారం లేదు. కానీ జ్యోతి? ఆ ఇంటితో, ఆస్తిపాస్తులతో అనుసమ్ధానించుకుని వున్న నన్ను పెళ్లిచేసుకుంది. పదిమంది పిల్లల మధ్యే అయినా పద్ధతిగా పెరిగింది. ఇటు వాళ్ళింట్లోనూ అటు మాఇంట్లోనూ చేతికింద ఎందరో పనివాళ్లు. ఏ పనీ ప్రత్యేకించి కష్టపడి చెయ్యక్కర్లేదు. అలాంటిది ఇక్కడ అన్ని పనులూ తనే చేసుకోవాలి.
…
సంగతి తెలిసి జ్యోతి తల్లిదండ్రులు వచ్చారు. కూతుర్ని అలా చూసి వాళ్ల హృదయాలు క్షోభించిపోయాయి.
“ఈ గదేమిటి? ఈ కాపురమేమిటి? చాలీచాలకుండా ఈ బతకడం ఏమిటి?” అని జ్యోతిని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు పెట్టింది తన తల్లి.
ఇక జ్యోతి తండ్రి…
” అసలు గొడవేమిటో చెప్పండి. మీ నాన్నగారితో మేం వెళ్లి మాట్లాడతాం” అంటాడు.
మాలో మాకు ఎన్ని గొడవలున్నా మరొకరితో అవి చెప్పుకునేవి కాదు. చెప్పమన్న అనుమతి నానుంచీ లేదు కాబట్టి జ్యోతి కూడా చెప్పలేదు. మాకు ఇంకా పిల్లలు పుట్టకపోవడమే గొడవకి మూల కారణమని కొంత సంభాషణ తర్వాత వాళ్లే గ్రహించారు. వాళ్ల కూతురిపట్ల నాకు అంత ప్రేమ ఉన్నందుకు లోలోపల సంతోషించారుగానీ బయటికి నన్నే మందలించారు.
” పెద్దవాళ్లకి ఇలాంటి విషయాల్లో ఆత్రుత ఉంటుంది. గొడవపడడంవల్ల పరిష్కారాలు దొరకవు. నాతో తీసుకెళ్లి సంతానగౌరి వ్రతం చేయిస్తాను. మాకు తెలిసిన సాధువు ఒకాయన ఉన్నాడు. చాలా మహిమగలవాడు. ఆయన దగ్గరికి వెళ్తే తాయత్తు కడతాడు. దేనికైనా టైం రావాలి. మనం ఊరికే హైరానాపడితే అవుతుందా?” అంది జ్యోతి తల్లి కొంత మందగింపుగానూ, కొంత ఓదార్పుగానూ. నాకేకాదు, అందులో నర్సమ్మగారికీ అందులోని మందలింపు చెందుతుంది.
” ఈ గొడవలు తగ్గేదాకా అమ్మాయిని మేము తీసుకెళ్తాము. ఒక్క గదిలో ఇద్దరూ వండుకు తింటూ ఎలా ఉంటారు? మగవాళ్ళు ఉండటం వేరు, ఏకంగా కాపురం పెట్టడం వేరు” అంది.
” కష్టమో సుఖమో, నాకు ఇక్కడే బాగుందమ్మా! నాకోసం అతను తనవాళ్లతో దెబ్బలాడి వస్తే నా సౌఖ్యాలకోసం నేను మీ దగ్గరికి రావాలా? అలా నాకు బావుండదు. నేను రాను” అంది జ్యోతి. వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. నేనుకూడా చెప్పాను. తను ఒప్పుకోలేదు.
కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనిచ్చి, జ్యోతి చేతికి కొంత డబ్బిచ్చి వెళ్లారు వాళ్లు.
కొన్నాళ్ళు నాన్నతో రాయబారాలు, మంతనాలు జరిగాయి. నేను వాళ్లకి ఏం చెప్పానో, మాఇంటి విషయాలు ఎంతవరకు చెప్పానో నాన్నకి తెలియదు. గుమ్మడికాయలదొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తనని తాను సమర్ధించుకునే ప్రయత్నాలలో పడ్డాడు.
” నన్ను కాదని వెళ్ళాడు. వచ్చి నా కాళ్ళమీద పడేదాకా రానివ్వను”” అన్నాడట. అదీ తెలిసింది నాకు. పెద్దాయన అలా అనడం అమానుషంగా అనిపించింది వాళ్లకి.” పిల్లలు తప్పులు చేస్తారు. మనం కడుపులో పెట్టుకుని వాళ్లని కాయాలి. అంత కర్కోటకత్వం ఏమిటి?” అన్నారు.
జ్యోతి అన్నదమ్ములు కలగజేసుకున్నారు.” ఒక్కకొడుకు బావా నువ్వు. వాళ్లు ముసలివాళ్లు. ఎంతకాలం బతుకుతారు! ఆస్తంతా ఆయన స్వార్జితం. పంతానికి పోయి ఎవరికైనా రాసేస్తే ఏం చేస్తావు? మీ అమ్మానాన్నలే కదా? అంత పంతం నీకూ మంచిదికాదు. కొంతకాలం ఓర్చుకోలేవా? మా చెల్లికి అన్యాయంచేస్తే మేంమాత్రం చూస్తూ ఊరుకుంటామా? నీకు అండగా నిలబడమా? నాలుక చివరి మాటగా క్షమించమని అడిగేసి ఇంటికి వెళ్ళిపో” అన్నారు. నేను వినలేదు. వాళ్లకీ బాగా కోపాలు వచ్చాయి. అలా ఇంకొంత కాలం గడిచింది.
ఇంతలో జ్యోతి ప్రెగ్నెంట్. మామధ్య గొడవలు సమసిపోయినట్టే అందరూ అనుకున్నారు. బయటికి కనిపించే గొడవ తీరిపోయిందిగానీ నాలోపలి గొడవ ఇంకా అలాగే ఉంది. ఆ ఇంటికి తిరిగి వెళ్లడానికి నా మనసు సహకరించడం లేదు. ఇంకొన్ని రోజులు గడిచాయి.
“కేశవమూర్తిగారి పరపతి చూసి పిల్లనిచ్చాంగానీ ఎర్రఏగానీ విలువ చేయని నిన్ను చూసి కాదు” అనుకునే స్థాయికి దిగజారాయి జ్యోతి కుటుంబంతో నా సంబంధాలు. కొద్దికొద్దిగా సంపాదిస్తున్నాను. చాలాచోట్ల ఉద్యోగాలకి పెట్టుకున్నాను. అటెండెన్స్ మేనేజ్ చేస్తూనే దొరికిన ఉద్యోగమల్లా చేస్తున్నాను. జ్యోతి నాతో సంతోషంగానే ఉంది. ఇరుపక్షాలవాళ్ళూ మమ్మల్ని అలా వదిలేసి ఉంటే జీవితాలు సాఫీగా సాగిపోవనుకుంటా.
…
జ్యోతి తండ్రి చనిపోయాడు ఆయనకి మొదటే గుండెపోటు ఉంది. షుగరు, బీపీ ఉన్నాయి. సరైన వైద్యం చేయించుకోకుండా కషాయాలు, పసర్లు తాగి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడు. ఆయుర్వేదాన్ని ఆయుర్వేదంలాగే చూడాలి. అరకొర తెలిసిన వైద్యంగా కాదు. అదొక జీవనశైలి.
వెళ్ళకూడదన్న నిషేధం లేదు కాబట్టి మేము కూడా చావుకి వెళ్ళాము. మమ్మల్ని జ్యోతి అన్నదమ్ములు సమంగా చూడకపోవటం స్పష్టంగా తెలిసింది. నా విలువ మానాన్ననిబట్టే అని తెలియజెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. డబ్బులేని మేము వాళ్లమీద ఎక్కడ ఆధారపడిపోతామోనని భయపడ్డట్టు కనిపించారు.
నాన్న, నరసమ్మగారూ వచ్చారు. గర్భవతి అయిన జ్యోతిని ఆవిడ ఎంతో అపురూపంగా చూసుకుంది. అయితే తన జీవితంలో సాధ్యపడనిది మరొకరికి సాధ్యపడ్డందుకు ఒక గాయంకూడా ఆ కళ్ళలోనూ చూపుల్లోనూ కనిపించింది. ఒకనాడు నా తల్లిని కూడా ఆవిడ అలాంటి చూపులే చూసి ఉంటుందన్న భావన కలిగింది.
” జరిగిన గొడవ చాలు. ఇంక ఇంటికి వచ్చేయండి. నేను నాన్నకి నచ్చజెప్తాను” అంది నాతో ఎవరూ లేనప్పుడు.
“వద్దు. మీనీడకూడా మామీద పడటానికి వీల్లేదు. మా బతుకు మేం బ్రతకగలము” కరుకుగా అన్నాను. ఆవిడ చిన్నబుచ్చుకుంది. ఆవిడ నా కన్నతల్లి అయ్యి, అదే తప్పుని మరొకరిపట్ల చేసి ఉంటే నా తల్లనే మమకారంతో క్షమించగలిగేవాడినేమో! కానీ తప్పు జరిగిందే నా తల్లిపట్ల. వాళ్లతో ఎలా కలిసిపోను?
తన అన్నదమ్ములు మమ్మల్ని చూసిన విధానం జ్యోతిని తీవ్రంగా గాయపరిచింది.
“ఆస్తులతోటేనా అన్నయ్యా, మనిషికి విలువ? వాళ్లదగ్గరికి వెళ్లకపోవడానికి ఆయన కారణాలేవో ఆయనకి ఉన్నాయి. బయటికి చెప్పలేకపోతున్నారు. అది ఎందుకు అర్థం చేసుకోరు? అయినా మేమేం మిమ్మల్ని పెట్టమని అడగలేదు. మేమేదో కష్టాలు పడిపోతున్నామని మీకు చెప్పుకోలేదు. నాన్న చావు భోజనమే మీ ఇంట్లో నేను చేసే ఆఖరి భోజనం. మళ్లీ మీ గడప తొక్కను” అంది పట్టుదలగా. ఆ సందర్భంలో ఎటూ మాట్లాడలేక జ్యోతి తల్లి ఏడుస్తూ ఉండిపోయింది. మిగిలిన ఆడపిల్లలుకూడా ఏమీ అనలేదు. పన్నెండోరోజుని బంధువులు అందరితోపాటు మేము కూడా వచ్చేసాము. జ్యోతి తన గాయంనుంచీ తేరుకోలేకపోయింది.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.