“పెళ్ళాం పోతే ఇంకొకర్తి వస్తుంది. కట్నం తెస్తుంది. ఆ రోగిష్ఠిది ఇప్పుడు బతికేం ఉద్ధరించాలి? కొత్తపెళ్ళాం వస్తే అన్ని కోపాలూ అవే సర్దుకుంటాయి” నిర్లక్ష్యంగా అన్నాడు. ఆయనకి జ్యోతి ఆరోగ్యపరిస్థితి పట్ల పూర్తి అవగాహన ఉందని అర్థమైంది. నాకు ఆ క్షణాన కలిగినది అసహ్యం కాదు, కోపం కాదు… అవేవీ కాని ఒక వింత భావన. అవును! భార్య బతికుండగానే మరోపెళ్లి చేసుకుని ఆమె కళ్లెదుటే కాపురం పెట్టిన మనిషి… అంతకంటే సంస్కారవంతంగా ఎలా మాట్లాడగలుగుతాడు?
ఇటువంటి మనిషిని వెనకేసుకొచ్చి జ్యోతి అన్నదమ్ములు నన్ను దుయ్యబడుతున్నారు! జంధ్యం తెంపేసి అక్కడినుంచి వచ్చేసాను. అన్ని బంధాలూ తెగిపోయినట్టనిపించింది.
కొద్దిరోజులు ఎడతెరిపి లేకుండా పగలూ రాత్రీ అనే భేదం లేకుండా ఏ పని దొరికితే అది చేశాను… డబ్బు కోసం. సంపాదించగలిగింది చాలా తక్కువ. వ్యవస్థీకృత సమాజంలో ఉన్నన్ని అవకాశాలు అవ్యవస్థలో ఉండవు. దోపిడీ ఉంటుంది. ఎంతోస్తే అంత కాగితంలో చుట్టి జ్యోతి ఇంట్లోకి విసిరేవాడిని. వాటిని వాళ్ళు చూసారా, జ్యోతికి వాడుతున్నారా… ఏది తెలీదు. మంచిచెడ్డలు, ఉచ్ఛనీచాలు ఏవీ ఆలోచనలోకి రాని స్థితి.
ఒకరోజు వార్త వచ్చింది, అనుకున్నదే… జరగకూడదని కోరుకున్నదే… జ్యోతి సెరిబ్రల్ హెమరేజ్‍తో చనిపోయిందని. రోగం ఏమిటో తెలుసు. ఎలాంటి వైద్యం చేయించాలో తెలుసు. అందరి దగ్గరా డబ్బు ఉంది. అందరూ ఆప్తులే. కానీ ఎవరికీ తనిప్పుడు అక్కర్లేదు. వైద్యం చేయించగల పరిస్థితి నాకు లేదు. అసమర్థుడైన నేను ఆమెకి విలువలేకుండా చేశాను. ఆ తర్వాత రెండు రోజులకే పాపాయి చనిపోయింది.
తెగిన గాలిపటంలా రోడ్డుమీదపడ్డాను. సంపాదించి మిగల్చాల్సిన అవసరం కూడా లేదు. తినటం, తాగడం… ఆ కసితోనే ఎప్పుడు రాశానో, ఏం రాశానో పరీక్షలు రాశాను.
అలా తాడూ బొంగరం లేనట్టు తిరుగుతున్నరోజుల్లోనే మళ్లీ చందూ కలిశాడు.
” ఏమిట్రా ఇది?” నా పరిస్థితికి చలించిపోతూ అడిగాడు. నా మనసులో బాధనంతా వాడితో చెప్పుకోవాలనిపించింది. ఒకదాన్ని ఒకటి తరుముకొస్తూ ఎన్నో ఉద్వేగాలు. ఆఖరికి అందరూ నాగురించి నిర్ణయించినది… తండ్రితో సత్సంబంధాలు నిలుపుకుని ఆస్తిని చేజిక్కించుకోలేని, భార్యాపిల్లల్ని పోషించుకోలేని, భార్యకి వైద్యం చేయించలేక చంపుకున్న అసమర్థుడినని. .. అదే చెప్పి చేతుల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చేశాను. అతను సుదీర్ఘంగా నిశ్వసించాడు.
నీ గురించి చెప్పాడు.” నువ్వు మగవాడివి కాబట్టి బాధపడుతున్నానని చెప్పి కుటుంబబంధాలనుంచీ విడివడి బతుకగలుగుతున్నావు. కిరణ్ ఆడపిల్ల. తన వునికి ఎక్కడో తనకే తెలియడం లేదు. పెళ్లయిందికాబట్టి అత్తగారింటికి వెళ్లాలా, బావ లేడుకాబట్టి తనకక్కడ ఎలాంటి స్థానం ఉంటుందీ, ఎలాగూ బావ లేడుకాబట్టి ఇక్కడే ఉండిపోయి మళ్లీ చదువుకుని ఏ ఉద్యోగమో వెతుక్కుని పాపని పెంచి పెద్ద చెయ్యాలా, అదొక్కటే తన జీవితగమ్యమా, తనకి ఇంకేమీ మిగిలిలేవా అనే ఎన్నో ప్రశ్నలతో మా అందరివంతు దు:ఖాన్నీ తనే మోస్తూ తిరుగుతోంది. ఒక్కసారి దాన్ని చూడు. కన్నీటికడలిలో దాగి ఉన్న బడబానలంలా కనిపిస్తుంది. ఒక బాధ కలగడంకన్నా దాన్ని బయటికి వ్యక్తపరిచి వదలగొట్టుకునేందుకు మార్గం లేకపోవడం ఇంకా బాధాకరం” అన్నాడు. తను నీకోసం ఎంత పరితపించాడో నాకోసంకూడా అంతే నిజాయితీగా బాధపడ్డాడు.
అప్పటివరకూ పీజీ రిజల్ట్స్ నేను చూసుకోలేదు. సెకండ్‍క్లాస్‍లో పాస్ అయ్యానని తనే చెప్పి వాళ్ళ కాలేజీలో పార్ట్‌టైం పోస్టుంటే ఇప్పించాడు. మీ ఇంటికి తీసుకెళ్లి నిన్ను పరిచయం చేసాడు. నిన్ను మళ్ళీ మనుషుల్లో వేసే బాధ్యత నామీద ఉంచాడు, అల్లరిచేస్తున్న పిల్లవాడికి తమ్ముడు అల్లరిచేయకుండా చూసుకోమని బాధ్యత అప్పగించినట్టు. వాడు ఇదంతా స్నేహధర్మంగా చేశాడు. అది ఇలాంటి తీసుకుంది”
…
గోపాలకృష్ణ చెప్పడం పూర్తిచేశాడు. కిరణ్మయి మనసు అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. కాలాతీతవ్యక్తులు నవలలో శ్రీదేవిగారు అనిపించినట్టు అతను పుట్టుకతోటే సగం మనిషి. మిగిలిన సగభాగంలో చాలావరకు మంచితనం ఉంది. దాన్ని ఆధారం చేసుకునే అతను బతుకుతున్నాడు. అతడు తనకి ఆధారాన్ని ఇవ్వలేడు. ఒక సహచరుడు కాగలడు. కష్టాలకీ సుఖాలకీ స్పందించగలడు. అతని తల్లికి అలా జరిగకుండా ఉండాల్సింది. కనీసం అలా జరిగిందని అతనికి తెలియకుండా ఉండాల్సింది. తెలిసాకేనా కనీసం అతన్ని సానుభూతితో చూసి జన్మనిచ్చిన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తులనుంచి దూరం జరిగి బతకాలనుకున్న అతని తపనని అర్థం చేసుకుని సహకరించవలసింది. కనీసం అతని బతుకు అతన్ని బతకనివ్వాల్సింది. ఈ కనీసన్యాయాలలో ఏ ఒక్కటీ అతనికి జరగలేదు.
తన ముందు జీవితం ఎలా ఉండబోతుందో చూచాయగా అర్థమైంది కిరణ్మయికి .
ఇష్టాయిష్టాల తులన జరుగుతున్నప్పుడు మౌనాన్ని మించిన తులాదండం ఇంకొకటి లేదు. ఇద్దరిమధ్యా కొంతకాలం విస్తారమైన మౌనం పరుచుకుంది. తర్వాత అది కరిగింది.
అతనికి తగినట్టుగా తను మారింది కిరణ్మయి. అతన్ని కొంత మార్చింది. కాలానికి గమనం ఎంత సహజమో జీవితానికి మార్పు కూడా అంత సహజం. కొత్తగా పుట్టుకొచ్చిన పిల్లలు పాత బాధలన్నీ మరుగుకి తోశాయి. కొత్త గాయాలు, ఓదార్పులు, కొత్త సమస్యలు, కొత్త పరిష్కారాలు వాటి స్థానాన్ని ఆక్రమించుకున్నాయి.
…
“అదేంటి? సెలవు మధ్యలోనే జాయిన్ అయిపోయావు? పెళ్లి బాగా జరిగిందా? పార్టీ ఎప్పుడు ఇస్తావు?” అని ప్రశ్నలతో ముంచెత్తిన సహోద్యోగులకి-
” పెళ్లి క్యాన్సిల్ అయింది” అని ముక్తసరిగా జవాబిచ్చాడు భాస్కర్. అదో పెద్ద సంచలనమైంది. అందరిలో చర్చనీయాంశమైంది.
ఒక్కొక్కరూ వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. అది అతని వ్యక్తిగతమేమో, చెప్పడం ఇష్టం లేదేమో అనుకోవట్లేదు. సానుభూతి పేరిట కుతూహలం ప్రకటిస్తున్నారు.
” ఎరేంజ్‍మెంట్స్ అయ్యాక క్యాన్సిలయిందా? మొదటె కాన్సిలయిందా?” అన్న ప్రశ్నతో మొదలైన పరంపర కొంతదూరందాకా నిరాటంకంగా సాగిపోయేది.
“ఎందుకు? ఇస్తామన్న కట్నం ఇవ్వలేదా?”
” అదేం లేదు”
” మర్యాదలు సరిగ్గా చెయ్యలేదా?”
” అలాంటిదేం కాదు”
” మరి ? పెళ్లికూతుర్లో ఏదైనా లోపం… దాచిపెట్టారా?”
” కాదు”
“మరేంటి? ఆమె క్యారెక్టర్ మంచిది కాదా? ఏదైనా లవ్ ఎఫైర్… ఈ రోజుల్లో అలాంటిది సాధారణమైపోయింది. పెళ్లి దాకా లాక్కొచ్చి… ఆడపిల్లలు పీటలమీదికి రాకుండా పారిపోతున్నారు”
ఏ సంభాషణేనా అక్కడిదాకా వచ్చి ప్రశ్నార్థకంగా నిలిచిపోతోంది. అమాయకమైన శాంతి మొహం గుర్తుకొచ్చి అతనా నింద వెయ్యలేకపోయాడు. మరి ఎందుకని పెళ్లి ఆగిపోయింది? ఈ ప్రశ్నకు అతను ఖచ్చితమైన జవాబు చెప్పలేకపోతున్నాడు.
పెళ్లికూతురు తల్లిది రెండోపెళ్లట- అని చెప్తే ఎంత అసంబద్ధంగా ఉంటుంది? నీది ఇంత సంకుచిత మనస్తత్వమా? అని మొహం మీదే అడిగేస్తారు. దానికి తనే సమాధానపడలేకపోతున్నాడు. ఎవరికైనా ఏం చెప్తాడు? ఈ రకమైన బాధని అనుభవిస్తేగానీ తెలీదు.
భాస్కర్ వెనక రకరకాలుగా గుసగుసలుపోతున్నారు. ఆగిపోయిన అతని పెళ్లి గురించి అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. అక్కడ ఉండలేక ట్రాన్స్ఫర్‍కి పెట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి శాంతిపట్ల కొంత సానుభూతి కూడా కలిగింది. మగవాడైన తనకే ఇలా ఉంటే ఆమె ఇంకెంత అవస్థపడుతోందో! ఎంతమంది ఎన్ని రకాలుగా గుచ్చి గుచ్చి వేధిస్తున్నారో!
అమ్మాయి కొంచెం తెగింపూ, మొండితనం ఉన్నదిలాగానే ఉంది. ఆరోజు ఎంత ధైర్యంగా తనకి కబురు పెట్టింది! మరొకరైతే జరిగినదానికి ఏడుస్తూ కూర్చునేవారు. ఏదైనా అఘాయిత్యం చేసేవారు. ఈమె అలాంటిదికాదుకాబట్టి సమస్య లేదు. విడాకుల పేపర్లు సంతకం పెట్టి తిప్పి పంపించమన్నాడు తను! ఎందుకని పంపలేదో! ఇంకా తన పట్ల వాళ్లకి ఆశలున్నాయా? తామిద్దరూ కలవడం ఎలా సాధ్యం?ఉ<హు<…. సాధ్యపడదు. ఎక్కడో అస్పష్టంగా గోచరిస్తూ అభద్రతాభావం. దాన్ని వ్యక్తం కానివ్వకుండా మభ్యపరుస్తూ ఏరి కూర్చుకున్న సందేహాలు! అయ్యీ కాని పెళ్లిలాగే అతని మనసులో ఎన్నో సందేహాలు ఊగిసలాడుతున్నాయి.
భాస్కర్‍కి ట్రాన్స్ఫర్ అయిన కొత్తచోటకూడా మనుషులున్నారు. వారికీ కుతూహలం ఉంది. ఇతరుల అంతరంగాల్లోకి తొంగి చూడాలన్న
పీపింగ్‍టామ్ మనస్తత్వం ఉంది. పెళ్లివిషయం ఒక్కటే తప్పించి తన గురించిన వివరాలన్నీ చెప్పాడు భాస్కర్. అప్పటికప్పుడే అతన్నొక పెళ్లికొడుకుగా అంచనా వేసుకుని ఏకపక్షంగా సంబంధాలు ముడిపెట్టేసుకున్నారు కొందరు. అతనికి వీళ్లందరికీ దూరంగా పారిపోవాలని ఉంది. భౌతికమైనదే కాకుండా ఆంతరంగికమైనదికూడా అయిన ఏకాంతం కావాలనిపిస్తోంది. కొన్నాళ్లు లీవ్ పెట్టి ఎటైనా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు.
మనిషికీ మనిషికీ కనిపించని ముడి ఉంటుంది. ఒకసారి పరిచయమయ్యాక అంతరంగిక స్పర్శ ఏర్పడ్డాక ఆ వ్యక్తుల కదలికలు మళ్లీ కలుసుకునే దిశగానే సాగుతుంటాయి. దాన్ని కాకతాళీయం అనవచ్చు. గోపాలకృష్ణతో పరిచయమైంది. అతని సాత్వికత, ఔచిత్యపు హద్దులు దాటని మనస్తత్వం భాస్కర్‍ని ఆకర్షించాయి.
భాస్కర్ ఇక్కడికి ట్రాన్స్ఫర్‍మీద రావడం, రెక్కలు విరిగిన పక్షిలా శాంతి తల్లి దగ్గరికి చేరటం ఇంచుమించు ఒకేసారి జరిగాయి. శాంతికోసం సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది కిరణ్మయి. కూతురికి బెరుకు, సంకోచం పోవడానికి గోపాలకృష్ణతోటీ, మిగిలిన పిల్లలతోటీ కలిపి ఊరంతా చూపించింది. షాపింగ్‍కి తీసుకెళ్లి చీరలు కొంది.
మధుకి మల్లే చుడీదార్లు తీసుకుంటానంటే శాంతి ఒప్పుకోలేదు.
” నాకు అలవాటు లేదు. ఇప్పుడు వేసుకుంటే నాకే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది” అని తిరస్కరించింది.
తల్లి తనకోసం ధారాళంగా డబ్బు ఖర్చు చేస్తుంటే మొహమాటంగా అనిపించి, ” వాళ్లు తిప్పిచ్చేసిన డబ్బు నాపేరుమీదే వేశాడు పెద్దనాన్న” అంది.
“అది అలాగే ఉండనీ. ముందుముందు ఎందుకైనా పనికొస్తుంది” అంది కిరణ్మయి. శాంతి తమతో కలవలేకపోవటం ఆమెకి ముల్లు గుచ్చుకున్నట్టు కలుక్కుమంటోంది. గోపాలకృష్ణ దగ్గర బాధపడింది.
అతను చిన్నగా నవ్వి, “ఇదేమీ తెలుగుసినిమా కాదు. తప్పిపోయిన కొడుకు పాతికేళ్లకి తిరిగి వచ్చి అమ్మా అని కౌగలించుకున్నట్టు శాంతికూడా చెయ్యడానికి. మనకి భిన్నమైన వాతావరణంలో పెరిగింది. వాళ్లు నీగురించి ద్వేషాన్ని రంగరించిపోశారు. అదీకాక పెద్దవాళ్ల ప్రేమ, అదుపు లేకుండా స్వతంత్రంగా పెరిగింది. తను పెరిగిన పరిస్థితుల్లో సున్నితంగా ఉండటానికీ అవతలివాళ్ళు బాధపడతారేమోనని ఆలోచించుకోవడానికీ అవకాశం ఉండి ఉండదు. నువ్వే ఆ అమ్మాయిని అర్థం చేసుకుని తనలో మనపట్ల సదవగాహన కలిగేలా చెయ్యాలి” అన్నాడు.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.