సంగమం 22 by S Sridevi

  1. సంగమం 12 by S Sridevi
  2. సంగమం 13 by S Sridevi
  3. సంగమం 14 by S Sridevi
  4. సంగమం 15 by S Sridevi
  5. సంగమం 16 by S Sridev
  6. సంగమం 17 by S Sridevi
  7. సంగమం 18 by S Sridevi
  8. సంగమం 20 by S Sridevi
  9. సంగమం 21 by S Sridevi
  10. సంగమం 22 by S Sridevi

అతను చెప్పిన మాటల్ని పాఠం విన్నంత శ్రద్ధగా వింది కిరణ్మయి. నిజమే! తనే చాలా సంయమనం చూపించాలి. మనసులు విరిగినా, విద్వేషాలు పెరిగినా ఇలాంటప్పుడే. అందులోనూ శాంతి అన్ని విధాలా దెబ్బతిని ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తనలో తను అనుకుంది.
చందూకి ఫోన్ చేసి శాంతి వచ్చినట్టు చెప్పింది. ఆ సమయానికి శాంతికూడా అక్కడే ఉంది. చందూ పెద్దగా ఉత్సాహం చూపించలేదు.” వీలు చూసుకుని వస్తాం” అని చెప్పి పెట్టేసాడు. కిరణ్మయి చిన్నగా నిట్టూర్చింది.
“చందూ కూతుళ్ళకి సంబంధాలు కుదరటంలేదు. అప్పుడేదో తెలిసీ తెలియనితనంలో అభ్యుదయం, ఆదర్శం అంటూ చేసాము. ఈరోజుని దాని పర్యవసానం మాపిల్లలు అనుభవిస్తున్నారంటుంది ఉదయ. ఏది ఏమైనా జరిగిపోయినదాన్ని వెనక్కి తిప్ప లేము. తవ్వుకోవడంవలన అనవసర మనస్తాపాలు తప్ప” అంది బాధపడుతూ.
శాంతి తల్లికేసి సూటిగా చూసింది. రెండోపెళ్లి చేసుకుని తల్లి సుఖపడి ఉంటుందా అనుకుంటే అలాంటిదేమీ ఉండదనిపించింది.
“నాకూ బెంగగానే అనిపిస్తుంది శాంతీ! నీ విషయంలో ఇలా అయిందా, మధు, మనోలకి ఏం జరుగుతుందో తెలియడం లేదు. నేను పెళ్లిమీద పెళ్లి చేసుకుని మిమ్మల్ని ఇలాగే ఉండిపొమ్మని ఎలా అనగలను? చాలా బాధనిపిస్తుంది” అంది కిరణ్మయి.
“అంటే ఆడవాళ్లు ఎప్పటికీ ఏడుస్తూనే ఉండాలా, అమ్మా? ఏదైనా పోగొట్టుకుంటే దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండాలేగానీ ఆ బాధనుంచి బయటకు వచ్చి సంతోషాన్ని వెతుక్కోకూడదా? మాకు నువ్వుగా చేసిన అన్యాయం ఏముంది? ఏ తల్లిదండ్రులు మాత్రం ఇంతకన్నా చేస్తారు? నువ్వు నాన్నని తలుచుకుని ఏడుస్తూ ఉంటే అంతా సానుభూతితో నన్ను చేరదీసేవారు. అలా ఎంతకాలం? నీ దుఃఖపు పునాదులమీద మాకు సుఖాలా? వద్దు. ఏం జరుగుతుందో చూద్దాం. నాదంటే వేరు. మధూవాళ్ళూ చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తే నాలా ఎందుకుంటారు?” శాంతే తల్లిని ఓదార్చింది.
కిరణ్మయి తడికళ్ళతో నవ్వింది.
” నేను అలా చేశానని నీకు కోపం లేదా?” అడిగింది.
” ఎందుకు కోపం?” ఎదురు అడిగింది శాంతి.
కిరణ్మయికి ఎంతో ఓదార్పుగా అనిపించింది, శాంతి ప్రవర్తన, మాటలతో. తను ఓడిపోకూడదు. ఈ నలుగురు పిల్లల్ని ప్రయోజకుల్ని చేసేదాకా పోరాడాల్సిందే. తనని ఒక ఓటమికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోకూడదు… బలంగా అనుకుంది. చందూ కూతుళ్ళకే సంబంధాలు రానిది తన కూతుళ్లకు మాత్రం వస్తాయా అనిపించింది మళ్లీ వెంటనే.
గోపాలకృష్ణ అంటాడు, “వాళ్ల ఎప్రోచ్ తప్పు. సాంప్రదాయాన్ని వదిలిపెట్టి మనం ఒక అడుగు దూరం జరిగినప్పుడు అది మనల్ని వదిలి ఇంకో నాలుగడుగులు దూరం జరుగుతుంది. మనని మన కుటుంబాలలో కలుపుకోరు. కలుపుకోనిచోట వెతుక్కుని వాళ్లతో వద్దనిపించుకుని బాధపడడం దేనికి? మనప్పుడు ఎంత విశాలంగా ఆలోచించారో ఇప్పుడు కూడా అలాగే ఎందుకు ఉండలేకపోతున్నారు? పిల్లల్ని బాగా చదివించి ఉద్యోగాల్లో పెడితే అప్పుడు ప్రాథమ్యాలు మారుతాయి. వాళ్లకి డిగ్రీలప్పట్నుంచే సంబంధాలు వెతికి అవి కుదరక న్యూనతాభావాన్ని వాళ్లలో నింపుతున్నారు” అని.
అతను అనేది నిజమే. సాంప్రదాయం అనే చట్రంలోంచీ ఇవతలికి వచ్చిన కుటుంబం తమది. తమ జీవనశైలి దానికి తగ్గట్టే ఉండాలి. ఒడిదుడుకులేవీ రానంతవరకూ ఎవరూ మార్పుని కోరుకోరు. మారటానికి ఇష్టపడని మనుషుల్ని మనం తెచ్చిన మార్పు సరైనదేనని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి? వాళ్లకి హృదయ వైశాల్యం లేదని బాధపడడం దేనికి? ఆ సంకుచితత్వంతో పోరాడటం ఎందుకు?
కరుణ గురించి కూడా శాంతికి చెప్పింది కిరణ్మయి.” పెళ్లవగానే మళ్లీ పుట్టింటికి పంపించమని దెబ్బలాడి తీసుకెళ్లిపోయారు వాళ్లు. అలాగే దాన్ని ఎప్పుడూ పంపలేదు. తాతమ్మ పోయినప్పుడు, అమ్మమ్మ, తాతయ్యలు పోయినప్పుడు ఇలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోయింది వాళ్ల అత్తగారు. ఆ కొద్దినిమిషాలలో అది చనిపోయినవాళ్ళని కళ్లారా చూసుకుందో లేక బతికున్న మమ్మల్ని కంటికొనలతో చూసుకునే తృప్తిపడిందో తెలీదు. మా ఇద్దరికీ సంవత్సరన్నర తేడా. ఒక ప్రాణంలా బతికాము. అలాంటిది దాన్ని చూసి యేళ్లు గడిచిపోయాయి. అది ఎన్ని మమకారాలని చంపుకుందో! చైతన్య నేను చేసిన పనిని సమర్థించాడు సరే, వాళ్ళ అమ్మకి మాత్రం ఎంతమాత్రం సర్దిచెప్పలేకపోయాడు. ఆవిడ కోపం ఎందుకో, ఎవరిమీదో నాకు తెలీదు. నేను వితంతువుగానే కాలం గడుపుతుంటే వాళ్లకు వచ్చే లాభమేమిటో తెలీదు. ఇలాంటి మనుషులమధ్య చందూ పిల్లలకి సంబంధాలు వెతికితే ఎందుకు కుదురుతాయి?” అంది కిరణ్మయి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ.
“పిన్ని ఫోటో ఉందామ్మా?” అడిగింది శాంతి. కిరణ్మయి పెళ్లికి ముందటి కరుణ ఫోటో చూపించింది. ఆ రాత్రంతా శాంతికి కలతనిద్రే అయింది. అందులోనే కలలు. ఆ కలలన్నీ కరుణ చుట్టే.

శాంతికి తల్లి దగ్గర చాలా బాగుంది. ఒకరినొకరు మన్నించుకోవడం, ఎదుటివారు బాధపడతారేమోనని జాగ్రత్తగా ప్రవర్తించడం, తల్లీ, గోపాలకృష్ణా పిల్లలపట్ల కనబర్చే శ్రద్ధ, జాగ్రత్త అదే సమయానికి వాళ్లకు ఇచ్చే స్వేచ్ఛ… అన్నీ బాగున్నాయి. తనని వాళ్లు తమలో ఒకదానిగా కలుపుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుకూడా అర్థం అవుతున్నాయి. కానీ ఆమెకే ఒక విధమైన ఇబ్బంది. అదేమిటో అర్థం కావడం లేదు.
వరంగల్లో చాలాచోట్ల తిరిగింది శాంతి. కిరణ్మయికి నోవా, గోపాలకృష్ణకి బైకు ఉన్నాయి. నోవా మధు కూడా నేర్చుకుంది.
తల్లి దాని మీద వెళ్తుంటే ఆశ్చర్యంగా చూసింది శాంతి.
” నువ్వూ నేర్చుకుంటావటే?” అడిగింది కిరణ్మయి.
” నాకా? ఎందుకు? నేను ఎక్కడికి వెళ్లాలి?” తడబడుతూ అడిగింది శాంతి.
” ఎందుకేమిటి? ఈ రోజుల్లో అన్నీ రావాలి. డ్రైవింగ్ వస్తే టైము మన చేతుల్లో ఉంటుంది. ఒక్కదానివీ ఇంట్లో కూర్చోకుండా లైబ్రరీకి వెళ్లి రావచ్చు. కాలేజీలోనో ఇన్స్టిట్యూట్‍లోనో చేరావనుకో, ఎలా వెళ్తావు?” అని శాంతి ముందు కూర్చోబెట్టుకుని ఎలా డ్రైవ్ చేయాలో నేర్పించి రెండురౌండ్లు తిప్పింది కిరణ్మయి.
సిడిప్లేయర్లో ఇష్టమైన పాటలు వినడం, టీవీలో రకరకాల చానల్స్‌లో వచ్చే సినిమాలు చూడటం, అవెన్‍లో కేక్ తయారుచేయడం… అన్నీ వింతలే శాంతికి. మనుషులు ఇంత విరామంగా …ఇంత సంతోషంగా గడపగలుగుతారా? అని విస్మయచకితురాలైంది.
అస్తమానూ శాంతి సినిమాలే చూస్తుంటే ఒకరోజు గోపాలకృష్ణ అన్నాడు,” ఎప్పుడూ సినిమాలే కాదు, ఇంకా మంచిమంచి ప్రోగ్రామ్స్ వస్తుంటాయి” అని డిస్కవరీ చానల్ పెట్టాడు. శాంతికి అదీ ఆశ్చర్యమే.
శ్రీనూ మానసా కార్టూన్ ఫిలిమ్స్ పెడతారు. మధు క్రికెట్ వస్తే వదలదు. శ్రీను క్రికెట్ గురించి తనకు తెలిసిందంతా శాంతికి చెప్పేసాడు. రోజురోజూ అప్‍డేట్స్‌కూడా ఇస్తుంటాడు. ఇప్పుడిప్పుడే పాపులర్ అయిన ధోనీ వాడి ఫేవరెట్ క్రికెటర్. గదినిండా అతని ఫోటోలే. నిన్న మొన్నటిదాకా సచిన్‍వి ఉండేవి. ఇంట్లో ఇంత వైవిధ్యం. అందులోనే మళ్లీ సయోధ్య.
తల్లి నిత్యచైతన్యస్రవంతిలా కనిపిస్తుంది శాంతి కళ్ళకి. ఏ పనీ చేసినట్లుగానీ, అలసిపోయినట్టుగానీ కనిపించదు. అయినా అన్నీ వేళకి సిద్ధంగా ఉంటాయి. ఇల్లంతా తీర్చిదిద్దినట్లు వుంటుంది.
తమ పెరట్లో మల్లెచెట్టు ఎండిపోవడం, తను దానికి పాదుచేసి నీళ్లుపోసి సంరక్షిస్తే చిగురుపెట్టడం గుర్తొస్తోంది శాంతికి తల్లిని చూస్తుంటే. గోపాలకృష్ణపట్ల అపరిమితమైన గౌరవం కలిగింది. తనుకూడా ఇక్కడే ఉండిపోయి ఉంటే ఎంత బాగుండేది! మంచిఉద్యోగం చేసేది. మనసుకు నచ్చినవాడిని చేసుకునేది.
పెద్దనాన్నావాళ్లు తనను తీసుకెళ్లి ఏం చేశారు? అటూఇటూకాని వానాకాలం చదువు చెప్పించి అబద్ధాలతో పెళ్లి జరిపించారు. తన తల్లి ఎంచుకున్న మార్గానికి గమ్యం పల్లెటూర్లో ఉండదు. ఇలాంటి పట్నవాసాలలో ఉంటుంది. పెద్దవూర్లలోనైతే ఒకరి గురించి ఒకరికి పట్టదు. పల్లెటూర్లలో ప్రతిదీ వింతే. తనని చూసేవారు. ఏం సాధించాలని తనని తీసుకెళ్ళాడు పెద్దనాన్న? తల్లీబిడ్డలని వేరుచెయ్యడానికి ఆయనెవరు? కిరణ్మయిని శూలాల్లా గుచ్చి గుచ్చి వేధించిన ప్రశ్నలు శాంతినికూడా వేధించసాగాయి.
మరోవైపుని ప్రతిచిన్న కదలికకీ చేదుజ్ఞాపకాలని గుర్తుచేస్తూ మెడలో గలగలలాడే మంగళసూత్రాలు! తన మెడకి నిష్ప్రయోజనంగా గుదిబండల్లా వేలాడుతున్నాయనిపించింది. వాటిని చేతిలోకి తీసుకుని చూసింది. అతని తిరస్కారం గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఒకచేత్తో సూత్రాలగొలుసు పట్టుకుని మరోచేత్తో కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటున్న ఆమెని చూసింది కిరణ్మయి.
” ఏంటి శాంతీ?” దగ్గరగా వచ్చి ప్రేమగా అడిగింది. శాంతి ఉలిక్కిపడింది. గొలుసు వదిలేసి తలదించుకుంది.
“నాకు చెప్పమ్మా!” బ్రతిమాలింది కిరణ్మయి. కూతురి సమస్య ఏ విధంగా పరిష్కరించాలో తెలియడం లేదు. తామే ఒకదారి చూపించడం వేరు. ఒక దారిలో సగం ముందుకెళ్ళినదాన్ని వెనక్కి తీసుకువచ్చి ఇంకో దారిలోకి పంపడం వేరు.
శాంతి అంది,” ఇవి నా మెడలో ఎందుకున్నాయో, నేను చేసిన ఏ తప్పుకి ఈ శిక్షపడిందో అర్థంకావడంలేదమ్మా!”
కిరణ్మయి చలించిపోయింది. ఈ విషయం తమ మధ్య ప్రస్తావనకు రావడం ఇదే మొదటిసారి.
“నీకు వాటిని ఉంచుకోవడం ఇష్టం లేకపోతే తీసేయి శాంతీ! నిన్ను కాదనుకున్న మనిషిని పదేపదే గుర్తుచేసే ఆ జ్ఞాపకాలని సచేతనంగా ఉంచుకోవడం ఎందుకు?” అంది.
“వీటిని తీసేసినంతమాత్రాన ఆ జ్ఞాపకాలు చెరిగిపోతాయా?”
“మేం వెళ్లి అతన్ని కలిసి మాట్లాడతాం శాంతీ!”
శాంతి శుష్కహాసం చేసింది.” భాస్కర్ చాలా మొండివాడు. పెళ్లి చెడిపోయినరోజు రాత్రి నేను పిలిపించి మాట్లాడాను” ఎవరికీ చెప్పని రహస్యాన్ని తల్లికి చెప్పింది.