సంగమం 29 – by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

శాంతికి ఉద్యోగం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని భాస్కర్‍ని భోజనానికి పిలిచింది కిరణ్మయి. అతను వచ్చాడు. వెళ్తూ శాంతిని తనతో రమ్మని ఆహ్వానించాడు. ఆమె వెళ్లిపోయింది. చాలా నిశ్శబ్దంగా వాళ్ల సంసారిక జీవితం మొదలైంది. సింధు మరొకతన్ని పెళ్లి చేసుకుంది. పెట్టుపోతల ప్రస్తావన లేకుండా నిరాడంబరంగా జరిగిపోయింది వాళ్ల పెళ్లి.
శాంతిని తల్లి దగ్గర వదిలిపెట్టాక మరో ఐదేళ్లు బతికింది వర్ధనమ్మ. ఇద్దరు కొడుకులు కళ్ళ ముందే చనిపోవడం, చివరిదాకా తనేం చేసినా వెన్నంటి ఉంటూ, తన భారాన్ని మోస్తాడనుకున్న భర్త మధ్యలోనే చనిపోవడం ఆవిడ గుండెలమీద ఎప్పటికీ మానని గాయాన్ని చేశాయి. శాంతి విషయంలో జరిగిందికూడా ఆమెని చాలా బాధించింది. ఎలా ఉందో అది? ఎలా బతుకుతోందో? ఏదైనా దారి దొరికిందో? లేక ఇక్కడి చాకిరీ అక్కడ చేస్తూ బతుకుతుందో! వాళ్లు దాన్ని ఎలా చూస్తున్నారో! తన కొడుకు కన్నబిడ్డ… శాంతి గురించి ఏ విషయం తెలియక అశాంతితో కొట్టుకుపోయేది. అదే అనారోగ్యంగా మారింది. మంచం పట్టేసింది.
సావిత్రి కొడుకుల దగ్గర ఉంటోంది. మరో తోటికోడలు పుట్టింటి ఆస్తి కలిసొస్తే భర్తని తీసుకుని అక్కడికే వెళ్లిపోయింది. కిరణ్మయి చూస్తే అలాగ. తనొక్కదానికే పట్టిందా ముసలామె బాధ్యత? అని గిజగిజలాడిపోయింది కమలాకర్ భార్య. ఆమె బాధ పడలేక వదినగారిని పిలిపించాడతను. సావిత్రి వచ్చింది కానీ వర్ధనమ్మది వచ్చే ప్రాణం, పోయే ప్రాణంగా ఉంది. కూతుళ్లు, మనవలంతా వచ్చి చూసి వెళ్లారు. కొంచెం అపస్మారకం రాగానే కలవరింతలు మొదలయ్యాయి. కొడుకులనీ భర్తనీ తలుచుకుని ఏడ్చి ఆఖరికి శాంతిని కలవరించడం మొదలుపెట్టింది. అందరూ ముఖాలు చూసుకున్నారు. డాక్టరు వచ్చి చూసి చెప్పేసాడు, ఇంకెన్నో రోజులు బతకదని.
“శాంతిని ఓమాటు పిలిపించండి. ఆవిడ ఎత్తుకొని పెంచిన పిల్ల” అంది సావిత్రి.
“దాని బతుకేదో బతుకుతోంది. ఇప్పుడది ఎందుకొదినా? లేనిపోని తలనొప్పి” విసుక్కున్నాడు కమలాకర్.
“అది రానిదే, దాన్ని చూడనిదే ఆవిడ ప్రాణం పోదు. నేను ఇక్కడ ఎన్నాళ్లో ఉండలేను. మీ ఆవిడ కష్టపడిపోతోందంటే వచ్చాను. నేను వెళ్తాను. మళ్లీ అవసరమైతే వస్తాను” అంది ఆమె.
“అవును. ఎవరికీ పట్టనిది మాకే పట్టింది… ఈ ఊరినీ ఇంటిని పట్టుకుని వెళ్లాడడం. మేమూ ఎక్కడికో ఒక చోటికి పోతాం” అని దెబ్బలాడింది కమలాకర్ భార్య.
“కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందంటారు. మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారో ఎవరికి తెలియని భాగవతం?” అంది సావిత్రి. అక్కడ కమలాకర్‍కి మరో కుటుంబం ఉంది. ఆ ఊరు వదిలి అతను రాడు.
“శాంతి బ్యాంకులో ఉద్యోగం చేస్తోందట. భాస్కర్ దాన్ని తీసుకెళ్లాడు. వాళ్లకో కొడుకు. వాళ్ళ విషయాలు కొద్దిగా తెలిసాయి” అంది సావిత్రి కమలాకర్‍తో. ఆశ్చర్యంగా చూశారు కమలాకర్ దంపతులు. జీర్ణించుకోలేకపోయారు చాలాసేపటిదాకా.


మధ్యాహ్నంవేళ కౌంటర్ క్లోజ్ అవ్వడానికి కొద్దిగా ముందు శాంతికి ఫోనొచ్చింది. రాజేశ్వరి చేసింది. ” మీ నాయనమ్మకి సీరియస్‍గా ఉందటే శాంతీ! నీ గురించి వివరాలు తెలియక మాకు ఫోన్ చేసి చెప్పారు. ల్యాండ్ లైన్ కదూ, మీ పెళ్లప్పటి నెంబరు మారలేదు. దానికి చేశారు. నీకు చెప్పమన్నారు. కుదిరితే ఓమాటు వెళ్ళిరామ్మా! ఇలాంటప్పుడు కోపాలూ అలకలూ పనికిరావు” అంది.
“అలాగే అత్తయ్యా! వెళ్తాను” అని పెట్టేసింది శాంతి. మళ్లీ వచ్చి సీట్లో కూర్చుందిగానీ మనసంతా వికలమైంది. ఎత్తుకున్నా తిట్టినా కొట్టినా చిన్నతనంనుంచీ ఇక్కడికి వచ్చేదాకా తనకి ఆవిడే. అలాంటి బామ్మని ఇన్నాళ్లూ తను పట్టించుకోలేదు. పంజరంలోంచి బయటపడ్డ చిలుక ఆ పంజరాన్ని మర్చిపోయినట్టు తను ఆ ఇంటిగురించీ అక్కడి మనుషులగురించీ వదిలేసింది. వాళ్లూ తనని మర్చిపోయారనుకుంది. తల్లితో తనకు ఉన్న బంధాన్ని సంకెళ్లనుకుందిగానీ బంధాలన్నీ సంకెళ్లే. ఏవీ తెగిపడవు. మనిషికి పూర్తి స్వేచ్ఛనివ్వవు.
ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి. లంచి చెయ్యాలనిపించలేదు. ఎందుకని కొలీగ్స్ అడిగితే విషయం చెప్పింది.
ఎకౌంట్ టేలీ చేసి ఇచ్చేసి సెలవు పెట్టి ఇంటికి వచ్చింది. ముందు భాస్కర్‍కి చెప్పింది. అతను ఆమె మనసు అర్థం చేసుకున్నాడు.
“వెళ్లాలనిపిస్తే వెళ్ళు” అన్నాడు. టికెట్లు రిజర్వు చేసాడు. కొడుకుని తీసుకుని బయలుదేరింది. కిరణ్మయి భయపడింది. వాళ్లు ఏమైనా చేస్తారేమోననే భయం ఆమెది.
“అలా చేయాలనుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవారమ్మా! నీ చర్యని ఎలా ప్రతిఘటించాలో తెలియక అప్పుడలా చేశారుగానీ వాళ్లూ మనలాంటివాళ్ళే” అంది శాంతి.
“నీకు తోకలా వాడు ఎందుకు? వాడిని వుంచేసి వెళ్ళు. తిరుగు రైల్లో వచ్చేయ్. ఉండకు” అంది కిరణ్మయి ఇంకా భయం వదలక.
“బామ్మకి చూపిస్తానమ్మా!” శాంతి అనేసరికి ఇంకేమీ అనలేకపోయింది.


శాంతి వెళ్లేసరికి ఇల్లంతా మనుషులతో నిండిపోయి ఉంది. ఒకసారి చూసి వెళ్లినవాళ్లంతా మళ్లీ వచ్చారు. శాంతి ఆటో దిగేసరికి సావిత్రి వాకిట్లోనే ఉంది. ఎవరూ పూర్తిగా చెడ్డవాళ్ళు కాదు. భర్త ప్రవర్తనతో అశాంతిగా ఉండేది ఆమె. ఆపైన మీద వచ్చి పడిందనిపించిన శాంతి బాధ్యత కొంత ఒత్తిడి కలిగించేది. ఇప్పుడు అవేవీ లేవు. మనసు ప్రశాంతంగా ఉంది.
చేతిలో బాబుతో దిగుతున్న ఆమెను చూసేసరికి ఏదో మమకారం కదిలింది. శ్రీధర్ గుర్తొచ్చాడు. తన పెళ్లప్పటికి అతనికి పదేళ్లు. చురుగ్గా ఉండేవాడుగానీ ఊరికే సిగ్గుపడేవాడు. తనని మొదటిసారి చూపించినప్పుడు కూడా సిగ్గుపడిపోయాడు. ఆ తర్వాత కొత్త తీరి వదినా వదినా అంటూ వదలకుండా తిరిగేవాడు. అవన్నీ మనసులో కదులుతుంటే బాబుకోసం అప్రయత్నంగా చేతులు చాపింది. వాడు తల తిప్పేసుకున్నాడు.
“వెళ్ళాక ఒక్క ఉత్తరం కూడా రాయలేదేమే? అంత కానివాళ్ళమైపోయామా?” అడిగింది సావిత్రి. శాంతి నవ్వి ఊరుకుంది.
“ఎలా ఉంది బామ్మకి?” అడిగింది.
“ఆవిడకి నీ దిగులే. నిన్నే కలవరిస్తోంది” అంటూ లోపలికి వెళ్లమన్నట్టు చేత్తో సూచించింది సావిత్రి.
శాంతి లోపలికెళ్లి వర్ధనమ్మ పడుకున్న మంచంమీద చోటుచేసుకుని కూర్చుంది. తను ఆఖరిసారి చూసినప్పటి మనిషి కాదు. బాగా కుదించుకుపోయి ఒక పసిపిల్లంత ఉంది. పైకప్పుకేసి చూస్తోంది. అలా ఆవిడని చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి.
” బామ్మా!” నెమ్మదిగా పిలిచింది.” నేను, శాంతిని” అంది.
గాజుగోళీల్లా నిస్తేజంగా ఉన్న ఆవిడ కళ్ళు గుప్పుమని వెలిగాయి. శాంతికేసి తల తిప్పి చూసింది.
“ఇదిగో, నా కొడుకు. కార్తికేయ వీడి పేరు” కొడుకుని ఎత్తి ఆవిడకి చూపిస్తూ అంది. ఆవిడ చేతులు కదిలాయిగానీ వాడిని ఎత్తుకోలేనట్టు వాలిపోయాయి. కొడుకు చేతిని ఆవిడ చేతికి అందించింది. గట్టిగా పట్టుకుంది ఆవిడ. అలా పట్టుకునే కొద్దిసేపటికి మగతలోకి జారుకుంది.
అప్పటికి శాంతి వచ్చిన వార్త ఇల్లంతా తెలిసిపోయింది.
“నెలరోజులనుంచీ ఇలాగే ఉంది శాంతీ! “అంది కమలాకర్ భార్య. శాంతి అక్కడినుంచి లేచి నడవలోకి వచ్చింది. అక్కడున్నవాళ్లంతా కుతూహలంగా చూశారు. ఎవరూ పలకరించలేదు.
“కాళ్ళూ చేతులూ మొహం కడుక్కుని రా! అన్నం తిందువుగాని. ఏవేళ అయిందో బయలుదేరి” అంది సావిత్రి. అబ్బో ఎంత ప్రేమో అన్నట్టు చూసింది కమలాకర్ భార్య. అంతమందిని ఒక దగ్గర చూసేసరికి కొత్త చేసి ఏడుస్తున్నాడు కార్తికేయ. మరోసారి ఎత్తుకోవాలని ప్రయత్నించింది సావిత్రి. వాడు వెళ్లలేదు. వాడినలా ఎత్తుకునే రెండో చేత్తో శుభ్రపడి వచ్చి వాడిని వళ్ళోవేసుకుని భోజనానికి కూర్చుంది శాంతి. తింటుంటే కమలాకర్ వచ్చాడు.
“ఏమే, శాంతీ! ఏమిటి విశేషాలు? భాస్కర్ నిన్ను తీసుకెళ్లాడటకదా? మేము అంత బతిమాలినా తీసుకెళ్లనివాడు మారేడంటే ఏం మంత్రం వేసింది మీ అమ్మ? అసలు నీకుకూడా అక్కడ ఎవడినో తగిలిస్తుందనుకున్నాను” అని వంకరగా మాట్లాడాడు.
ఆమె చురుగ్గా కళ్ళెత్తి చూసింది. ఇక్కడినుంచి వెళ్లకముందు కూడా తల్లి గురించి అలాగే మాట్లాడుకునేవారు. అప్పుడంటే ఆమె గురించి తెలియదు కాబట్టి తనకేమీ అనిపించేది కాదు. విని ఊరుకునేది. ఇప్పుడు బాధ తెలుస్తోంది.
“నీ కొడుకా? ఏం పేరు పెట్టారు?” అడిగాడు తనే మళ్లీ. శాంతి చెప్పింది.
“మీ నాన్న పేరు పెట్టకపోయారా? కనీసం గుర్తు చేసుకున్నట్టైనా ఉండేది” అంది కమలాకర్ భార్య.
“కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినట్టు ఉంటేనే బాగుంటుంది పెద్దమ్మా!” శాంతి జవాబిచ్చింది.
తర్వాత ఏవేవో మాట్లాడుకున్నారు. కిరణ్మయి విషయాలు గుచ్చిగుచ్చి అడిగారు. ఇంకా పిల్లలా మీ అమ్మకి? ఎంతమంది? ఏం చదువుతున్నారు? చదువు వస్తోందా? అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా? ఆ పిల్లలకి సంబంధాలు వస్తున్నాయా? పెళ్ళిళ్ళయాయా? గోపాలకృష్ణకి ఇంకో కుటుంబం ఉందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అవి వాళ్లుగా అడుగుతున్నవి కాదు. సమాజం తరఫున నిలబడి అడుగుతున్న ప్రశ్నలు. స్త్రీ ఒకసారి జరిగిన పెళ్లినీ దాని అనుభవాలనీ మర్చిపోయి మరో మగవాడి జీవితంలో ఎలా ఇమిడిపోగలదు? అక్కడ ఆమె సురక్షితంగా ఉంటుందా? ఆమె జీవనగతి ఎలా ఉంటుంది? ఇవన్నీ వట్టి ప్రశ్నలు కావు. శోధన. మగవాడికీ ఈ సర్దుబాటుసమస్యలన్నీ వుంటాయి. కానీ అతన్ని ఎవరూ అడగరు. అక్కడకూడా సవిత్తల్లి ఎలాంటిది? బాగా చూస్తోందా అని స్త్రీనే టార్గెట్ చేస్తారు.
శాంతి అన్నిటికీ జవాబులు చెప్పింది. ఇష్టపడి చెప్పడం కాదు, తల్లి జీవితం ఎలా వుందో వాళ్ళకి తెలియాలని చెప్పింది.
“నిన్ను మీ అమ్మ సరిగ్గా చూసుకుంటుందా? ఆ పిల్లలు?” సావిత్రి ఆరా తీసింది.
“అంతా ఒక కుటుంబంలా ఉంటాం పెద్దమ్మా! అందరికీ ఒక దగ్గరే ఇళ్ళు కొన్నారు. నన్ను వేరుగా చూడరు”
“నీకుకూడా కొందా, మీ అమ్మ? ఆవిడ పిల్లలు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే పెద్దతనంలో వాళ్ళని చూసుకుంటూ ఉంటావని కొనుంటుందిలే. ఎంతైనా ముందుచూపుగలది” ఎద్దేవా చేశాడు కమలాకర్.
“అలాంటి తల్లికి సేవ చేస్తే తప్పేం లేదు. ఇంతకాలానికి ఒకరి దయాధర్మాలమీద ఆధారపడకుండా నా బతుకు నేను బతికేలా చేసింది. ఎంత చేస్తే ఆమె రుణం తీరుతుంది? అయినా పెద్దనాన్నా, నువ్వు బామ్మకి చేస్తే లేని ఆక్షేపణ నేను మా అమ్మకి చేస్తే ఎందుకు?” అడిగింది శాంతి.
“ఔనే శాంతీ! నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎంత కష్టపడ్డా రాజుకి సరైనది దొరకనేలేదు” కమలాకర్ భార్య అడిగింది. అందులో కొంచెం అసూయ కూడా ఉంది.
“అసలు వాడేడి? ఇప్పటిదాకా కనిపించలేదు” అడిగింది శాంతి.
“ముంబైలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. సెలవులు దొరకవు వాడికి. మొన్ననే వచ్చి బామ్మని చూసి వెళ్ళాడు… ఇంతకీ అక్షరం ముక్క రానిదానివి నీకీ ఉద్యోగం ఎలా వచ్చింది? ఎవరిని పట్టారు?”
“నేను అక్కడికి వెళ్ళాక ఒక నెలో రెండు నెల్లో ఖాళీగా ఉన్నాను. అంతే. అప్పటినుంచి చదువు చదువని తోమి వదిలిపెట్టింది అమ్మ. గోపాలకృష్ణగారుకూడా ఏదో ఒకటి చెప్తూనే ఉండేవారు. కోచింగ్ సెంటర్లో చేర్పించారు. బాగా కష్టపడితే వచ్చిందిలే పెద్దమ్మా! దొడ్డిదారిలో అన్నీ జరగవు. జరుగుతాయన్న భ్రమలో మనం ప్రయత్నలోపం చేసుకుంటున్నాము” గోపాలకృష్ణ పేరు అక్కడ తేవద్దనుకుందిగానీ తన ఈ ఉన్నతిలో ఆయనకి భాగం ఇవ్వకపోవడం అన్యాయం అనిపించింది.