సంగమం 33 by S Sridevi

  1. సంగమం 23 by S Sridevi
  2. సంగమం 25 by S Sridevi
  3. సంగమం 26 by S Sridevi
  4. సంగమం27 by S Sridevi
  5. సంగమం 28 by S Sridevi
  6. సంగమం 29 – by S Sridevi
  7. సంగమం 31 by S Sridevi
  8. సంగమం 32 by S Sridevi
  9. సంగమం 33 by S Sridevi
  10. సంగమం 34 by S Sridevi
  11. సంగమం 35 by S Sridevi

“ఎంత గమ్మత్తుగా ఉంది శాంతీ, నిన్నిలా చూడటం. నీగురించి విన్నానుగానీ ఎప్పుడూ చూడలేదు” అన్నాడతను.
“ఎలా చూస్తారు? నన్ను చిన్నప్పుడే మా నాన్నవైపువాళ్లు తీసుకెళ్లిపోయారు. ఆ విషయం తెలియడానికేనా మీకూ అమ్మావాళ్లకీ రాకపోకలు లేవు” అంది.
అతను నవ్వాడు,” మీ పిన్నిలోనే లేదు, మిమ్మల్నందర్నీ చూడాలని” అభియోగం చేశాడు.” మా అమ్మ ఉన్నప్పుడు సరే, ఆవిడకి ఇష్టం లేని పని ఎందుకు చెయ్యాలనుకున్నాను. ఆవిడ పోయి చాలా ఏళ్లయింది. ఒక్కసారి కూడా అడగలేదు తను, పుట్టింటికి వెళ్తానని”
“నేనడుగుతున్నాను, ఈ ఆదివారం మా ఇంటికి పంపిస్తారా?” అడిగింది శాంతి.
“తప్పకుండాను” అన్నాడతను. తనకి మీటింగ్సేవో ఉండడంతో కరుణతో కలిసి రావడం కుదరదనీ సాయంత్రం వచ్చి కాసేపు ఉండి ఇద్దరం కలిసి తిరిగి వెళ్తామనీ చెప్పాడు. ఆరోజుకి అక్కడే వుండి వెళ్లారు శాంతి, భాస్కర్, వాళ్ళబాబు. మళ్లీ ఆదివారం కరుణని భాస్కర్ వచ్చి తీసుకెళ్తాడని చెప్పింది శాంతి.
శాంతి కొడుకుని ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుంది కరుణ. వాళ్లు వెళుతుంటే వదల్లేక వదిలింది వాడిని. ముగ్గురికీ బట్టలు పెట్టింది.
“ఇవన్నీ ఎందుకు పిన్నీ!” అని శాంతి వారించబోతే, “ఎప్పుడో రెండేళ్లప్పుడు చూశాను నిన్ను. పెద్దయ్యాక ఇదే మొదటిసారి నిన్ను చూడటం. కాదనకు. కిరణ్‍ని చూసినట్టే ఉంది నిన్ను చూస్తుంటే” అంది. అంతకన్నా ఎక్కువగా ఏమీ అడగలేదు. ఏమీ మాట్లాడలేదు. ఉద్వేగాలని చంపుకోవడానికి అలవాటుపడి పిన్ని మాటలు మర్చిపోయిందేమో అనిపించింది శాంతికి.
ఇంటికెళ్లగానే కిరణ్మయికి ఫోన్ చేసి చెప్పింది, “నీకో సర్ప్రైజమ్మా! ఆదివారం నువ్వూ గోపాలకృష్ణగారూ మా ఇంటికి రండి” అంది సంతోషంతో.
“ఏమిటే అది?” అడిగింది కిరణ్మయి.
“నువ్వొచ్చి చూద్దువుగాని”
“తల్లీ, చంపకే. సస్పెన్స్ భరించే శక్తి లేదు” బతిమాలింది కిరణ్మయి.
శాంతి నవ్వి, కరుణ విషయం చెప్పింది.“ఆదివారం పిన్ని మా ఇంటికి వస్తుంది ”అంది.
“చేతూ ఏమైనా అంటాడేమోనే దాన్ని” అంది కిరణ్మయి భయంగా. అది చైతన్యమీద అపనమ్మకం కాదు, ఎన్నో సంవత్సరాలుగా అలవాటైపోయిన భయం.
“ఇంకా చేతూయేనా అమ్మా, ఆయన? పెద్దవాడయ్యాడు. తల నెరిసింది. చాదస్తం కూడా వచ్చింది. తప్పంతా పిన్నిమీదకి తోసేసాడు. నాకైతే కోపం వచ్చిందనుకో. కానీ ఏం చేస్తాం? పిన్నిని మనలో కలుపుకోవడం ముఖ్యం. తనని చూస్తే బాధ కలిగింది. నవ్వటం, మాట్లాడటం మర్చిపోయినట్లుంది. అంతగా బాధపెట్టేవారామ్మా?” ఆర్తిగా అడిగింది శాంతి.
“వాళ్లు మంచివాళ్లే శాంతీ! దాన్ని బాగా చూసుకున్నారు. కానీ బంధాలు చంపుకోవడం చాలా కష్టమైన విషయం. బెంగపెట్టుకుని, జ్వరం తెచ్చుకుని ప్రాణంమీదికి తెచ్చుకునేదట. పెళ్ళప్పటికి అది చాలా చిన్నదికదా? అయినా వాళ్లు పంపలేదు. ఆతర్వాత దానంతట అదే మనసు సరిచేసుకుంది. పెళ్లయిన కొత్తలో ఈ ప్రేమలవీ చాలా బలంగా ఉంటాయి. తర్వాత అవే బలహీనపడతాయి. అది అర్థం చేసుకోలేదు వాళ్లు. విరాగిలా బతికిందట అది. ఆడవాళ్ళ మనసుని అర్థం చేసుకోవడం మగవాళ్ళకే కాదు, సాటి ఆడవాళ్ళకికూడా సాధ్యం కాదు” అంది కిరణ్మయి.
“నువ్వైతే రామ్మా!” అని చెప్పి పెట్టేసింది శాంతి.
ఆ ఆదివారంనాడు తను వెళ్లి కరుణని తీసుకొచ్చాడు భాస్కర్. ఆమె వస్తూ వాళ్ల బాబుకి ఎన్నో తీసుకొచ్చింది. ఈ ఆదివారంకోసం ఎంతో ఎదురు చూస్తున్నట్టుంది, ముందే షాపింగ్ చేసి ఉంచుకుంది . కిరణ్మయి చేసుకున్న పెళ్లి కారణంగా ఎవరెవరు ఎన్ని అకారణ కష్టాలు పడ్డారో భాస్కర్ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. రాజేశ్వరి కిరణ్మయిని కలవాల్సి వస్తుందని అదిష్టం లేక కొడుకు ఇంటికే రాదు. వాళ్లే ఆవిడ దగ్గరికి వెళ్తారు.
“పాతకాలంవాళ్లం. ఈ విషయాలని మీరు తీసుకున్నంత తేలిగ్గా మేము తీసుకోలేము. మా చాదస్తాలని అర్థం చేసుకోమ్మా!” అంది ఆవిడ శాంతితో మొదటిసారి భాస్కర్ తీసుకొచ్చినప్పుడు. అలా చెప్పమని భర్త నిర్దేశించాడు. మళ్లీ ఆయనే కొడుకుతో అన్నాడు. “
వాళ్ళిచ్చిన కట్నం డబ్బులు తిరిగిచ్చేసావు. ఇప్పుడు వీళ్లేమైనా ఇస్తారా? అంతా హుళక్కేనా? ఆదర్శవంతులు కదా?” అడిగాడు నిర్మొహమాటంగా. శాంతి తన దగ్గరున్న డబ్బు తీసిచ్చింది. తల్లి తనకి ఫ్లాట్ కొన్న విషయం చెప్పింది.
“మీ అమ్మ నీకు ఫ్లాట్ కొనిస్తే మాకు అందులో కలిసివచ్చేదేమిటి?” అనేసాడు ఉదాసీనంగా.
భాస్కర్ నిస్సహాయంగా చూశాడు.
“ఎంత హింస పెడుతున్నారు ఈ అమ్మాయిని అంతా కలిసి!” కుంచించుకుపోయాడు. శాంతి ముందు తలెత్తుకు తిరగడానికి ఎన్నో ఏళ్లు ఎదురుచూశాడు. ఇప్పుడు మళ్లీ పాతాళానికి కృంగిపోయినట్టయింది.
శాంతి బాధ అది కాదు. కిరణ్మయి ఇచ్చిన ఫ్లాట్ పనికొచ్చింది కానీ ఆమె పనికిరాలేదు. అదే తల్లితో అంటే,” వాళ్ల బంధాలు, అవసరాలు నీతో శాంతీ! వాళ్లకీ నాకూ ఎలాంటి సంబంధం లేదు. ఎదుటివాళ్ళవలన మనం బాధపెడుతున్నప్పుడుకూడా వాళ్ల కోణాన్నే వాళ్లు చూస్తున్నారుగానీ, మరోకోణంనుంచి చూసి దీన్ని నివారించొచ్చని అనుకోవట్లేదు. నువ్వుకూడా అదే అలవాటు చేసుకో. ఒకళ్ళని బాధపెట్టమని నేను అనను. నీ కోణంనుంచి నీకు సంతోషాన్ని ఇచ్చేవి వదులుకోకు. అందరం ఒకే దగ్గర ఉండాలని ఫ్లోర్ అంతా కొన్నాము. మిగిలిన పిల్లలకి ఇచ్చినట్టే నీకూ ఇచ్చాను” అంది కిరణ్మయి. తల్లీకూతుళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణ భాస్కర్‍కి తెలియకపోయినా తన ఇంట్లో జరిగిన విషయాలు వాళ్లమధ్య తప్పకుండా చర్చకి వస్తాయనీ ఆ చర్చ ఇలాగే ఉంటుందని అతని ఊహ. వాస్తవానికి అతి దగ్గరగా ఉన్న ఊహ.
సింధు శాంతితో చాలా ప్రేమగా ఉంటుంది. తనతో బ్యాంకులో పనిచేసే అతని సంబంధం చెప్తే కాదనకుండా చేసుకుంది. ఇదంతా భాస్కర్ మనసులో కదిలింది క్షణంపాటు. ముఖ్యంగా కరుణని చూస్తుంటే. ఆమెని ఇంట్లో దింపి తను బయట పని చూసుకుని వస్తానని వెళ్లిపోయాడు.
“రా పిన్నీ!” ప్రేమగా ఆహ్వానించింది శాంతి.” అమ్మని రమ్మన్నాను. వస్తుంది” అంది.
“బాబాయ్‍కి ఇష్టంలేని పని ఎందుకమ్మా చెయ్యడం? మమకారాలవీ చంపుకుని ఇన్నేళ్లు గడిపేశాను. ఇంకా కొన్నేళ్లుకూడా ఇలాగే గడిపేయగలగడానికి అలవాటు పడిపోయాను” అంది కరుణ.
“బాబాయ్‍వాళ్ళు నీమీద పెట్టిన ఆంక్షలు న్యాయమైనవేనా, పిన్నీ?” కోపంగా అడిగింది శాంతి.
“మా అమ్మ మళ్ళీపెళ్లి చేసుకుంటే మనం ఎందుకు త్యాగాలు చేయాలి? జీవితం ఆవిడది. ఆవిడకి నచ్చినట్టు గడుపుతుంది. అయినా, మొన్న నేనంటే తనేమన్నారు? నీలోనే వాళ్లని కలుసుకోవాలనే కోరిక లేదనేసారు. నిజంగా అమ్మని చూడాలని నీకు లేదా పిన్నీ? చెప్పు. అలాగైతే రావద్దని ఇప్పుడే చెప్పేస్తాను”
కరుణ కన్నీళ్లతో నవ్వింది.” కిరణ్ నేనూ ఒక్క ప్రాణంలా బతికాము. దాన్ని చూడాలని ఎందుకు ఉండదు? … అత్తయ్య నాకు అమ్మ లేని లోటు కనిపించకుండా చూసింది. బావకూడా చాలా ప్రేమగా ఉంటాడు. కిరణ్ జీవితంలో మళ్లీ నిలదొక్కుకోవాలంటే మా ఇంట్లోని అందరం ఎంతో కొంత త్యాగం చేయాలని నాన్న అన్నారు. అందుకే నేనెప్పుడూ నోరు మెదపలేదు” అంది.
“అవన్నీ అయిపోయాయి పిన్నీ! ఆ తరాలవాళ్ళు తరలిపోయారు. ఇంకా మనం త్యాగాలు చేయడంలో అర్థం లేదు” అంది శాంతి. కరుణ నవ్వింది. శాంతి కొడుక్కి తను తెచ్చిన బట్టలు తొడిగింది. వాడికి బొమ్మలు ఇచ్చి ఎలా ఆడాలో నేర్పింది.
“చిన్నమ్మమ్మనిరా, నీకు నేను” అని వాడితో అమ్మమ్మా అని పిలిపించుకుంది. శాంతి చిన్నతనాన్ని వాడిలో చూసుకుంది.
కిరణ్మయి వచ్చింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరిలో ఎంత సంతోషమో! ఎన్ని కబుర్లో! కిరణ్మయి పిల్లల అందరి గురించీ పేరుపేరునా అడిగి తెలుసుకుంది కరుణ.
“అందరూ సెటిలయ్యారు. మానసగురించే నా దిగులు. అదికూడా పెళ్లి చేసుకుంటే బావుణ్ణనిపిస్తోంది. కానీ అతన్ని మర్చిపోవడానికి కొంత వ్యవధి కావాలంది” అంది కిరణ్మయి.
“అంత చదువు చదివి అంత తెచ్చుకుంటూ అమెరికాలో ఉన్న పిల్ల గురించి దిగులుపడతావేమిటక్కా? అది సరేననాలేగానీ ఎంతమంది పోటీపడతారో చేసుకోవడానికి”
సాయంత్రందాకా ఒకటే కబుర్లు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పిల్లల గురించి, పిల్లల చదువులు, పెళ్లిళ్ల గురించి.
సాయంత్రం కరుణని తీసుకెళ్లడానికి చైతన్య వచ్చాడు. కిరణ్మయిని చూసి ఆశ్చర్యపడ్డాడు. చిన్నప్పుడు తామంతా ఒక దగ్గర ఉన్నప్పుడు కలిసి ఆడుకున్న ఆటలు, చెప్పుకున్న కబుర్లు గుర్తొచ్చి ఆప్యాయత పొంగిపొర్లింది.
“బావున్నావా కిరణ్? మొత్తానికి శాంతి భలే ఆర్గనైజ్ చేసిందిలే! కలుసుకోవద్దనేంలేదుగానీ ఉద్యోగం ఒత్తిడిలో సోషల్‍రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. అంతే!… మీవారు కూడా వస్తున్నారా?” అని అడిగాడు తమ మధ్య ఏమీ జరగనట్టే. ఇంతకాలం అతన్ని అడక్కపోవడం తనదే తప్పనిపించింది కరుణకి. తను అడిగినవేవీ అతను కాదనలేదు. అతని తల్లి తనమీద పెట్టిన ఆంక్షలకి బదలాయింపుగా ఎంతో ప్రేమ చూపించేవాడు.
“అమ్మ పాతకాలపుది కిరణ్. నాన్న పోయేప్పటికి నేను బాగా చిన్నవాడిని. ఎంతో కష్టపడి నన్ను పెంచింది. ఆవిడ మాట కాదని బాధపెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. ఆవిడకి నువ్వొక ఛాలెంజ్‍లా అనిపించావు. ఆవిడకే కాదు, మన కుటుంబంలో ఉన్న గంగాభాగీరథీ సమానురాళ్ళందరికీకూడా. తామంతా చప్పిడి తిని ఏదో ఒకలా సర్దుకుపోవడంలేదా, నువ్వు ఎందుకలా చెయ్యాలనే ప్రశ్నతోపాటు నీకు జరిగినట్టు తమకెందుకు జరగలేదనే ఆక్రోశం… బేసిగ్గా ఆవిడలో కనిపించేవి. నీ విషయంలో జరిగింది తప్పనే నమ్మకం… తప్పుకి శిక్ష పడలేదన్న కోపం… శిక్ష పడలేదుకాబట్టి తప్పు కాదని అనేస్తారన్న భయం… ఇలా చాలా సంఘర్షణ ఆవిడలో చూశాను. ఆవిడని ఇంకా బాధపెట్టడం నాకు ఇష్టం లేకపోయింది”
“కొన్ని పనులు అనివార్యంగానో అనుకోకుండానో చేస్తాము. చేసేటప్పుడు మనము ఊహించుకునే ఫలితాలు వేరు. వాస్తవంలోకి వచ్చేసరికి అంతా తారుమారుగా ఉంటుంది. నా కారణంగా నా చిట్టితల్లులిద్దరూ కష్టాలు పడ్డారు” అంది కిరణ్మయి కరుణనీ, శాంతినీ చెరో చేత్తోటీ దగ్గరికి తీసుకుని.
గోపాలకృష్ణనీ, మధువాళ్ళనీ రమ్మని ఫోన్ చేసింది కిరణ్మయి. గంటకల్లా అందరూ వచ్చారు. భాస్కర్‍కూడా తిరిగొచ్చాడు. ఒక చక్కటి సాయంత్రం ఆహ్లాదంగా గడిచిపోయింది. మానస స్టేట్స్‌లో ఉంటుందని తెలిసి, బీటెక్ పూర్తిచేయబోతున్న వాళ్ల అబ్బాయికి అక్కడ ఏమైనా అవకాశాలు దొరుకుతాయేమో చూడమని అడిగాడు చైతన్య గోపాలకృష్ణని.
“నేను అడగడం దేనికి? మీరే దాంతో మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళకి రాత్రి. మనకన్నా పదిగంటలు వెనక ఉంటారు. వాళ్ల టైం చూసుకుని ఫోన్ చేయండి. నేనూ చేసి చెప్తాను” అని మానస ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

కేశవశర్మ చనిపోయాడు. గోపాలకృష్ణ ఒక్కడే వెళ్ళాడు. డబ్బు కారణంగా చనిపోయిన జ్యోతి, పాప గుర్తొచ్చారు అతనికి. అది పాతజ్వాలే. కొత్తగా రగులుకుంది. కర్మంటూ ఏమీ చెయ్యలేదు. దహనం జరిపించి మిగతావి చూసుకోమని బ్రాహ్మడికి డబ్బిచ్చి వచ్చేసాడు. నరసమ్మగారు అలా వెళ్ళిపోతున్న అతన్ని చూసి ఏడ్చింది.
ఏం కొడుకు! తల్లిదండ్రులని ఈ వయసులోకూడా ఇంత క్షోభ పెడుతున్నాడనుకున్నారు చాలామంది. ఆ మాటల్ని అతను పట్టించుకోలేదు. అతని గుండెకు అయిన గాయాలుముందు ఆ మాటలు చేసిన గాయాలు చాలా చిన్నవి.
ఎందర్ని కోల్పోయాడు తను! తలుచుకుంటే అదంతా గతజన్మలాగా అనిపిస్తుంది. ఆ జన్మకీ పొందిన అనుభవాలకీ సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు? వీళ్ళేకదా? గుండె చిక్కబట్టినట్టయింది.
….