మానసకి అమెరికాలో ఉండే పరిచయస్తులద్వారా ఒక సంబంధం వచ్చింది. అతనుకూడా అక్కడే ఉద్యోగం చేస్తాడు. అతనికి మొదట మానస స్టేచర్ నచ్చింది. స్టేచర్ అంటే ఆత్మవిశ్వాసానికీ దృక్పథానికీ సిగ్నేచర్ స్టేట్మెంట్‍లాంటిది. వ్యక్తిత్వానికి ప్రతిబింబం అని కూడా చెప్పవచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమెగురించీ, ఆమె కుటుంబాన్నిగురించి తెలుసుకున్నాడు. బహుళవివాహాలు సామాన్యమైన అమెరికన్ సొసైటీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న అతనికి కిరణ్మయి ద్వితీయం చేసుకోవడంలో వింతేమీ కనిపించలేదు. అదీకాక మన సమాజంలో పెళ్లిళ్లు కుటుంబప్రాధాన్యతనుంచీ వ్యక్తిప్రాధాన్యతకి మారుతున్నాయి. అతనికి మానసలో కాదనాల్సిన అంశం ఏదీ కనిపించలేదు.
మానసకికూడా అతను నచ్చాడు. ఇద్దరూ అరమరికలు లేకుండా అన్ని విషయాలూ మాట్లాడుకున్నారు. అతను జెస్సీ అనే అమ్మాయితో బ్రేకప్ చేసుకున్న విషయం చెప్పాడు. తను, బబ్లూతో మూవ్ ఆన్ అయిన విషయం మానస చెప్పింది.
“ఇదంతా యౌవనంలో భాగమేమో. చూడగానే మనసు పారేసుకోవడం, ఆ తర్వాత లోతుగా చూసుకుని విబేధించుకుని విడిపోవడం” అని నవ్వాడతను. మానస తలూపింది.
“మా పేరెంట్స్ తో మాట్లాడండి” అంది ఆమోదముద్రకి సూచనగా.
అటూ, ఇటూ తల్లిదండ్రులు మాట్లాడుకున్నారు. సంబంధం స్థిరపడిపోయింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. ఇంక వారం రోజులు ఉందనగా మానస ఇండియా వచ్చింది.
తన వృత్తిపరంగా ఎంతోమంది యువతీయువకుల్ని నిత్యం చూస్తుంటుంది కిరణ్మయి. యౌవనోద్వేగాలు, ఆకర్షణలు, ప్రేమలు, పెళ్ళికి దారితీయని ఎన్నోకథలని చూసింది. అవి దారితీసిన విషాదాలగురించి వింది, చూసింది. పిల్లలతో ఇవన్నీ ఆచితూచి మాట్లాడి విశ్లేషించి చెప్పింది. వాళ్ళతో చెప్పకుండా, ఈ విషయాలు మాట్లాడకుండా వాళ్ళచేత యౌవనమనే మహాప్రవాహాన్ని దాటించడం కష్టమని ఆమెకి తెలుసు.
“ఇంతకుముందు యువతీయువకులు ఒకరికొకరు ఎంత నచ్చినా ఒకరితో ఒకరు భేటీపడి ఆ యిష్టాన్ని ప్రేమగా మార్చుకోగలిగే అవకాశాలు చాలా తక్కువగా వుండేవి. అలా ఏర్పడిన తొలియిష్టాలనే ప్రేమ అనుకుని, పెళ్ళిచేసుకుని భంగపడిన జంటలు ఎందరో వుండేవారు” అంది. ఒక్కొక్కసారి పరిపక్వత లేనప్పుడు తొందరపడిపోయి, ప్రేమ బలపడ్డంకన్నా ముందే దాన్ని పెద్ద ప్రమాదంలా మార్చుకోవడం జరిగేదట.
“ఏది చేసినా కేవలం మనకోసమే కాకుండా మన తర్వాతి తరంకోసంకూడా ఆలోచించాలి. అవసరమైతే కొంత త్యాగం చేయ్యాలి. ప్రేమ, పెళ్ళి ఇవేవీ పిల్లలు పుట్టడానికి వుండక్కర్లేదు. పిల్లలు ఒక భౌతికచర్యద్వారా పుట్టేస్తారు. ఆ పిల్లకి సపోర్ట్‌సిస్టం ఏమిటనే పెద్దప్రశ్న మన మెడమీద కత్తిలా వేలాడుతుండాలి. శాంతి విషయంలో నువ్వెందుకు ఆలోచించలేదనే ప్రశ్నని నేను ఎన్నోకోణాలలోంచీ ఎంతోమందినుంచీ ఎదుర్కొన్నాను. నా జవాబు ఎవరికీ అక్కర్లేకపోయింది. అడిగేవాళ్ళు ఒక మూస తయారుచేసుకున్నారు. నా జవాబు అందులో ఇమడలేదుకాబట్టి వాళ్ళు తిరస్కరించారు. నన్ను ప్రశ్నించడానికి ఇంకా బలమైన మూస తయారుచేసుకున్నారు. అంతేతప్ప కొత్తగా వస్తున్న మార్పులకి అనుగుణంగా దాన్ని మార్చలేదు. వీటన్నిటివెనుకా వుండేది ఒకటే. ఆ పిల్లలపట్ల బాధ్యతకన్నా భయం. ఉండాల్సిన భయమేకదా?” అంది ఇంకా వివరంగా చెప్తూ.
పెళ్లికి చందూ ఒక్కడే వచ్చాడు. ఉదయగానీ పిల్లలుగానీ రాలేదు. శ్రీకాంత్ రాధా వచ్చారు. వాళ్లకి ఒక కూతురు. శాంతి కొడుకుకన్నా కొద్దిరోజులు పెద్ద. అందరికన్నా పెద్దవాడు మధు కొడుకు. కరుణ, చైతన్య ,పిల్లలు వచ్చారు. కొత్త బంధుత్వాలు అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. అంతకాలం తర్వాత కరుణని చూసినందుకు చందూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎప్పటెప్పటి మమకారాలో పొంగిపొర్లాయి.
“ఎన్నేళ్లైందమ్మా , నిన్ను చూసి?” అన్నాడు చెల్లెలిని ప్రేమగా దగ్గరికి తీసుకుని. తల్లికి నచ్చచెప్పలేని తన అసమర్థతకీ ఆవిడ పోయాకకూడా దూరంగా ఉన్నందుకూ చైతన్య కొంచెం సిగ్గుపడ్డాడు. శాంతి ముందర దబాయించినట్టు దబాయించలేకపోయాడు.
శ్రీకాంత్‍ని తన కొడుకుచేత తాతా అని పిలిపించింది శాంతి.
“ఆయన్ని తాతని చేస్తే చేసావు, నన్ను మాత్రం నాయనమ్మని చెయ్యకు శాంతీ! తన మీసాల్లో తెల్ల వెంట్రుకలున్నాయి. నా తల ఇంకా నెరవలేదు” రాధ నవ్వుతూ బతిమాలింది.
ఆమెకి శాంతిని చూస్తే ఎప్పుడూ వింతే. ఎప్పుడు చూసినా కొత్త ఫ్రేమ్‍లో కనిపిస్తుంది. మొదటిసారి తమ ఇంటికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! ఉద్యోగిగా, గృహిణిగా, బాబుకి తల్లిగా ఎంత ఎదిగింది! భాస్కర్‍ని తన కనుసన్నల్లో నిలబెట్టింది. ఏ ఆడపిల్లా పుట్టుకతో అబల కాదు. అబలగా తయారుచేయబడుతుందనే విషయానికి ఒక సజీవతార్కాణంలా అనిపిస్తుంది.
అందర్నీ అలా ఒక దగ్గర చూసుకుంటుంటే కిరణ్మయికి చాలా సంతోషంగా అనిపించింది. అందులో కూడా ఒక వెలితి.
“నా ముగ్గురు కూతుళ్ళకీకూడా పెళ్లిళ్లైనట్టే అన్నయ్యా! నువ్వెప్పుడు శుభవార్త చెప్తావా అని ఎదురుచూస్తున్నాను” అంది చందూతో. ఉదయ ఆ కారణంగానే రాలేదని ఆమెకు తెలుసు. ఆ విషయాన్ని గురించి అతనితో వివరంగా మాట్లాడాలనుకుంది. అందరూ సందడిగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ మధ్యనుంచీ అతని చెయ్యి పట్టుకుని ఇవతలికి తీసుకెళ్లింది. ఇద్దరూ సిటౌవుట్లో కూర్చున్నారు. అతనికీ పరిస్థితి ఇబ్బందిగా అనిపిస్తోంది.
కిరణ్మయి అన్నది నిజం. ఆమె కూతుళ్లందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. తన కూతుళ్ళకి సంబంధాలు దొరకడం లేదు. అదే మాట అంటే-
“ఎవరు పడితే వాళ్లకి పిల్లల్నివ్వలేము కదా? అలాగని మొగుళ్లని వెతుక్కోమని కిరణ్‍లాగా దేశంమీద వదిలేయలేము” అనేసింది ఉదయ. పెళ్లికి బయలుదేరి వచ్చే ముందుదాకా అదే గొడవ.
“అన్నయ్యా! సాంప్రదాయం అనీ చట్రాన్ని దాటి మనం అందరం ఇవతలికి వచ్చాము. మళ్లీ దాంట్లో ఇమడటం కష్టం. ఇది మన కుటుంబానికే పరిమితమైన సమస్య. ఇప్పుడు అందరూ పిల్లలని సోషల్‍గా తిరగనిస్తున్నారు. హద్దుల్ని మనమే నిర్ణయిస్తాం. వాళ్లకి టార్గెట్స్‌నీ మనమే వుంచుతాం. రోల్‍మోడల్స్‌నీ మనమే సెట్ చేస్తాం. మన ఆలోచనల పరిధిలోనే వాళ్లు ఉండేటప్పుడు నలుగురిలోకీ వెళ్ళనిస్తే తప్పేమిటి?” సూటిగా అడిగింది కిరణ్మయి.
“ఉదయ వినదమ్మా” అన్నాడు చందూ.” బాధపడతావని ఇంతకు ముందెప్పుడూ నీతో చెప్పలేదు. నీ పెళ్లి తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా మార్పు వచ్చింది. పైకి కలిసిపోయినట్టే ఉండేవారు కానీ లోలోపల ఏదో జరిగింది. మేనత్త ఇలా చేసింది కాబట్టి పిల్లలని చాలా కట్టుదిట్టాలలో పెంచాలని ఉదయకి బాగా బ్రెయిన్‍వాష్ చేశారు. అదే కాకుండా వాళ్ళవైపు సంబంధాలు కలుపుకోలేదు. దూరం పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే తను పశ్చాత్తాపపడుతోంది. అలాంటి స్థితికి తనని తీసుకొచ్చారు. ఉదయ ఇదివరకటి మనిషి కాదు” బాధపడుతూ చెప్పాడు.
కిరణ్మయి గట్టిగా నిశ్వసించింది.
“నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది. నేను ఈరోజున ఇలా ఉన్నానంటే దానికి నువ్వూ వదినేకదా కారణం? నేను ఒక్కదాన్నే పిల్లాపాపలతో సంతోషంగా ఉంటే సరిపోతుందా? నీ కూతుళు అలా ఉండిపోతే నాకు బాగుంటుందా? వదినతో నువ్వు గట్టిగా మాట్లాడు”
“…”
“మేము భాస్కర్ని మా పిల్లలకి రోల్‍మోడల్‍గా చూపించాము. అలాంటివాడయితే సుఖపడతారని అన్యాపదేశంగా చెప్పాము. అతను శాంతిని బాధపెట్టాడు, నిన్నూ నాన్ననీ అవమానించాడు, అలాంటివాడు మంచివాడు ఎలా అవుతాడని అడిగింది మధు. అతనికి మాగురించి తెలియకముందు ఇవన్నీ జరిగాయి. తెలిసాక తను తప్పు సరిదిద్దుకున్నాడు. గొప్పవిషయమేకదా అన్నాను. అది ఒప్పుకుంది. ప్రహ్లాదతో దాని పెళ్లి జరిగింది”
“వాళ్ళిద్దరూ కూడా గొడవలు పడ్డారు కదా?” చందూ గుర్తుచేశాడు.
“ఒకరికొకరు అలవాటుపడే ముందు జరిగే గొడవలవి. మా ఇంట్లో అనేసరికి ఏ విషయాన్నైనా ఒక ప్రత్యేక దృష్టితో చూస్తారు. పెళ్లివరకూ మనిషిలోని మంచివైపు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత అంతరంగాలలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది నిజరూపం. దానికి అలవాటుపడడానికే ఏ భార్యాభర్తలేనా పెళ్లయిన కొత్తలో సంఘర్షిస్తారు. మధు విషయంలో అదే జరిగింది. తర్వాత ప్రహ్లాద దృక్పథం అర్థమైంది. అలా జరగాలని నేను కోరుకోకపోయినా శాంతి జీవితం అప్పట్లో ఒడిదుడుకుల్లో పడటమనేది నా పెళ్లి యొక్క పర్యవసానం. అతను దాన్నే చెప్పాలని ప్రయత్నించాడు. అది అపార్థం చేసుకుంది. తర్వాత సర్దుకున్నారు. మేమెప్పుడూ ఒకసారి ఏర్పడిన బంధాన్ని నిలుపుకునే దిశగానే పిల్లలని ప్రోత్సహించాం తప్ప తెగ్గొట్టుకునే దిశగా మాత్రం కాదు”
“…”
“చివరిది మానస. అది వేదవతి కొడుకుని ఇష్టపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అలాగని వాళ్లేం చదువు పాడుచేసుకోలేదు. నాలుగేళ్లపాటు నిగ్రహించుకుని ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాక వాళ్ళ ప్రేమను ప్రకటించారు. మా ముందుకు వచ్చారు. అప్పుడు తెలిసింది, వాళ్ళిద్దరికీ ఎవరెవరో”
“వేదవతి ఎవరు?”
“శ్రీధర్ చెల్లెలు”
“అతనెవరో తెలియగానే పెళ్లి వద్దనుకుని ఇద్దరూ విడిపోయారు. అనుకోకుండా ఈ సంబంధం వచ్చింది. వాళ్ల సంబంధాలు వాళ్లే వెతుక్కున్నారని వదిన అంటుంది. అదే మామూలు పరిస్థితుల్లోనైతే పిల్లలు బుద్ధిమంతులు, వెతుక్కుంటూ వచ్చాయి సంబంధాలని అనరా? పరిస్థితులనుబట్టి అన్వయించుకోవడాలు మారాయి. అంతే” అంది కిరణ్మయి.
ఆక్షేపించాలని అనటమేగానీ కిరణ్ పిల్లలకి ఏం తక్కువ? మంచి చదువులు చదివారు. ఎవరికి వాళ్లకే ఉద్యోగాలూ సంపాదనలూ ఉన్నాయి. వెతుక్కుంటూ సంబంధాలు వచ్చాయి. ఎందుకూ పనికిరాదనుకున్న శాంతినికూడా ప్రయోజకురాలిని చేసి నిలబెట్టింది. భాస్కర్ సొంత కొడుకులా వాళ్ల కుటుంబంలో కలిసిపోయాడు. ఈ అన్నిటివెనకా ఒకనాడు తన సంకల్పం వుంది. ఉదయ సహకారం వుంది. కిరణ్మయీ గోపాలకృష్ణలు విజయకేతనాన్ని ఎగరవేసారు. కానీ వాళ్ల విజయంలో తమకి అందవలసిన పాలు తమకి అందలేదు. తాము దూరం జరిగిపోయారు. అది స్వయంకృతం. ఇవన్నీ చెప్పినా ఉదయ వినదు.
ఆమె తల్లీ, అన్నదమ్ములూ ఏవో సంబంధాలు చెబుతారు. ఎంతో కష్టపడి తెచ్చేమంటారు. ఉదయ పెళ్లిచూపుల్లో కూతుర్ని కూర్చోబెడుతుంది. అవతలివాళ్ళు సగం తెలుసుకునీ ఇంకో సగం ఊహించుకునీ వస్తారు. వంశం, కుటుంబచరిత్రా అని లెక్కలు వేస్తారు. సాంప్రదాయమైన కుటుంబం కాదని ఎదురుగా అనలేక మొహం చాటేస్తారు. తను లక్నో ఉండటంచేత, కిరణ్‍తో ఉదయ ఉదాసీనంగా ఉండటంచేత వాళ్ల పెత్తనం తప్పడం లేదు. మ్యారేజ్ బ్యూరోల్లో ప్రొఫైల్ పెట్టినా టెక్నికల్ ఎడ్యుకేషన్, సరైన ఉద్యోగం లేని కారణాన్న మంచి సంబంధాలు రావట్లేదు.
అతన్నలా ఆలోచనల్లో నిమగ్నమై ఉండటం చూస్తుంటే చాలా బాధనిపించింది కిరణ్మయికి. సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహాచక్రవర్తిలా అనిపించాడు.
“పిల్లల చదువుల దగ్గర్నుంచీకూడా మీరు ఏవీ సరైన నిర్ణయాలు తీసుకోలేదు. నేను ఏదైనా చెప్పబోయినా వదినకి నచ్చడం లేదు. అదీకాక ఆవిడ తన పేరెంట్స్‌మీద ఎక్కువగా ఆధారపడేది. అందుకే నేను ఎడంగా ఉంటున్నాను. ఆపైన ఇంట్లో పిల్లలు పెళ్లిళ్లూ ఆ గొడవలతో ఇంకాస్త ఎడం పెరిగింది. తనని ఆఖరిసారి చూడటం మధు పెళ్లిలోనే. ప్యాచప్ చేసుకుంటాలే. అయినా, మన ఇంట్లో పెళ్లికి వదినా పిల్లలూ రాకపోతే ఎలా? తనతో నేను మాట్లాడుతానుండు” అంది కిరణ్మయి బాధపడుతూ.
వెంటనే ఉదయకి ఫోన్ చేసింది.
“ఏంటి వదినా? మీరు రావట్లేదట? అన్నయ్య చెప్పాడు” ఆరాటంగా అడిగింది.
“అన్నయ్య వచ్చారుకదా కిరణ్?” అంది ఉదయ.
“అయితే మాత్రం? మీరు ముగ్గురూ రారా? ఇంటికి పెద్దదానివి, నువ్వు రాకుండా శుభకార్యం ఎలా చేస్తాము? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, వెంటనే బయలుదేరి రండి. పెళ్లికి ఇంక ఎన్నోరోజులు లేనేలేదు. హైదరాబాద్‍దాకా వస్తే అక్కడినుంచి ఎవరో ఒకరు తీసుకొస్తారు… పిల్లలందరికీ కలిపి చీరలూ బ్లౌజులూ రెడీ చేయించి పెట్టాను. ఏమీ తెచ్చుకోనక్కర్లేదు. ప్లీజ్ వదినా, వచ్చేయండి”
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్పోస్ట్మాస్టర్గా వరంగల్లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.