ఝరి 202 by S Sridevi

  1. ఝరి 200 by S Sridevi
  2. ఝరి 202 by S Sridevi
  3. ఝరి 203 by S Sridevi

“కోపం తగ్గిందా గీతూ?” అడిగాడు వాసు, హడావిడంతా చల్లారాక. రాణాతో కలిసి కార్లో వచ్చిందంటేనే పెద్ద ప్రళయం ముంచుకురాబోతోందని అతనికి తెలుసు.
“ఒళ్ళింకా మండుతోంది” అందామె.
“అల్లరి యింక చాలు. రాణా చచ్చి వూరుకుంటాడు. ఇప్పటికే సగం చచ్చాడు. ఏడుపొక్కటే తక్కువ. ఇలాకూడా ఎవర్నేనా ఏడిపించవచ్చని తెలుసుకున్నాను” అన్నాడు పెద్దగా నవ్వి.
“యమున తెలివైనదే. పర్వాలేదు. ఆమె దార్లోకి వాడు వెళ్ళాల్సిందే. లేకపోతే ఎవరిదారి వాళ్లది” అంది గీత.
“ఆ షాపేదో రాణా పేరుమీద పెడితే బావుండేదికదే? సంధ్యకూడా అదే అంది” అంది లక్ష్మి మరో సందర్భంలో ఆక్షేపణగా.
“మరోసారి మునిగేవాడు. తల్లికీ, పిల్లలకీ ఇంకో ఆశ మిగలకుండా” ఠపీమని అంది గీత.
“మగవాడు రికామీగా తిరుగుతుంటే ఇది సంపాదించి ఇంటిని పోషిస్తుందా? అసలే వాళ్ల కాపురం అంతంత మాత్రం. ఇప్పుడింక అసలే వాడిని లెక్కచెయ్యదు” కోపం వచ్చిందావిడకి. ఆవిడకి అకారణంగా వస్తున్న కోపాల్లో యిదొకటి.
“వాడిని సంపాదించద్దని ఎవరన్నారు? ఇద్దరూ తెచ్చుకుంటే మంచిదేగా?” అంది గీత.


కాలం వేగంగా సాగిపోతోంది. దారం అంతా నిండిపోయే పూసలదండలా కాకుండా అక్కడక్కడా ఒక్కో సంఘటనని గుచ్చుకుంటోంది. ఎవరింట్లో హడావిడి వాళ్లదే తప్ప, అందరూ కలిసే సందర్భాలు దాదాపుగా ఆగిపోయాయనే చెప్పుకోవాలి. రామారావు, ప్రమీల, అరుణ, రవి భార్యలనీ, భర్తలనీ తీసుకుని ఆర్నెల్లకోమాటు యూయస్ వెళ్ళొస్తున్నారు. అందరూ కలిసి ఒకేసారి వెళ్లగలిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఐనా రామారావుకీ రవికీమధ్య యింకా మాటలు కలవలేదు. ఎవరి పంతం వాళ్ళదే. బాధ్యతల్లో చెయ్యి వదిలిపెట్టేసినవాడితో నాకెంటి సంబంధం అని ఒకరూ, నా తప్పేం లేదని యింకొకరు. మనుషులు చాలావరకూ సమాంతరరేఖలే. లూప్‍లైన్స్‌లోగానీ కలవని రైలుపట్టాలే. రీపర్స్‌తో కలుస్తూ, దూరాన్ని నిలుపుకునే సంబంధాలే.
రాణాకీ సుమంత్‍కీ చాలా పోలికలు కలుస్తాయి. ఇద్దరూ చిన్నమేనమామ పోలిక. విడిగా రాణాని చూస్తే చిరాకుతప్ప మరేమీ అనిపించదు లతకి. యమున పక్కని అతన్ని చూడగానే చాలా డిస్టర్బైంది. తమకి డిస్టోర్టెడ్ వెర్షన్‍లా అనిపించారు యిద్దరూ.
సుమంత్‍తో ఆమె పరిచయం మెడిసిన్ చదువుతున్నప్పుడు. పరిచయం ప్రేమదాకా వచ్చాక తెలిసింది తను అతనికన్నా పెద్దని. వరహీనం ఇరువైపుల పెద్దవాళ్ళూ వప్పుకోరనేది స్పష్టం. కులాలూ మతాలకన్నా పెద్ద సమస్య. ఐనా బై చెప్పుకుని మూవాన్ కాలేకపోయారు.
“ఎవరు వప్పుకున్నా వప్పుకోకపోయినా మన పెళ్ళి జరిగేది ఖాయం. ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి జరగక దేవదాసులా తిరుగుతున్నవాడొకడు నాకు తెలుసు. వాడి దు:ఖం చూసి నేను చలించిపోతుంటాను. అదంతా నాకు సరిపడదు. పోతే స్మూత్‍గా హేండిల్ చేద్దాం. ఇప్పటికే మాయింట్లో ఒక గొడవ నడుస్తోంది. అదవ్వనీ. చదువయ్యేదాకా నీ పెళ్ళికి టైం వుంటుందికదా?” అన్నాడు.
తలూపింది. “ఎవరా దేవదాసు? నాకు చూపిస్తావా?” అడిగింది.
“వద్దొద్దు. కొంపలంటుకుపోతాయి” అన్నాడు.
సుమతి పెళ్ళికి పిలుచుకుని వెళ్ళి కజిన్సందరికీ పరిచయం చేసాడు. ఎటెళ్ళినా ఎవరో ఒకర్నీ చూపిస్తున్నాడు.
“సుమంత్, ఒకమాటు ఎత్తుకోరా! ఆ పైనేదో వుంది. అందట్లేదు” అని చేతులందించిన పల్లవినీ,
“వియ్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్- అని వుపోద్ఘాతం ఏమీ లేకుండా ఇతనంటే,
ఐ డోన్ట్ నొ డోన్ట్ నో వాటు యూ సే- అని అల్లరిపట్టించి అవేమాటల్ని పదిసార్లు అనిపించిన రవళినీ, ఆ పక్కని కొంచెం మొహమాటంగా నవ్వుతూ నిలబడ్డ మహతినీ, అందర్నీ గర్వంగా పరిచయం చేసాడు. రాణానికూడా. సుమంత్ పోలికలతో వున్నాడు. పెద్దగా చదువు రాలేదట. మామూలు విషయంలా చెప్పాడు.
అప్పుడే గీతని చూడటం. మయూని ప్రెగ్నెంటు. కూర్చునీ, నిలబడీ ఎలా కుదిరితే అలా నిద్రపోతోంది. కాసేపు వాసూ, కాసేపు ఆమె తల్లీ, ఎవరో ఒకరు భుజాన్ని ఆసరా యిస్తున్నారు. తనని పరిచయం చేద్దామని ఆమె దగ్గిరకి తీసుకెళ్ళాడు సుమంత్. అప్పుడు టర్న్ వాసుది.
“గీతూ! సుమంత్ వచ్చాడు. మాట్లాడదాం” అని, లేపబోయాడు.
ఆమె బద్దకంగా కళ్ళిప్పి చూసి, “అబ్బ! ఈ పిల్లలేంటో! కడుపుల్లో పెరగటమేంటో! చిరాకెత్తిపోతోంది” విసుగ్గా అని మళ్ళీ నిద్రలోకి జారుకుంది. వాసు సిగ్గుపడిపోవడం అందంగా అనిపించింది.
ఎవరు ఏం మాట్లాడినా, ఏది చేసినా ఆ పదకొండుమంది మధ్యనీ వైల్డ్‌ఫైరే.
అప్పటికే తమకి కోట్లలో ఆస్థి వుంది. ఒక సంపన్నకుటుంబంలో పుట్టి, మరో ఆస్థిపరుల యింటికి దత్తత వెళ్ళి, కలిగిన యింటి అమ్మాయిని చేసుకుని ఇల్లరికపు అల్లుడిగా స్థిరపడ్డ తన తండ్రి మధ్యతరగతి కుటుంబంతో వియ్యమందడాన్ని ఏమాత్రం యిష్టపడలేదు.
“వాళ్ళు పైకెదగడానికి నిచ్చెనలు వెతుక్కుంటూ వుంటారు. నిన్నలా వాడుకోవడం నాకు యిష్టం లేదు. అతని తల్లి స్వంత అన్నగారినే పెద్దకొడుక్కి కట్నం అడిగిందట. అంత డబ్బుమనుషులు” అన్నాడు.
“మనిళ్ళలో అడగరా?”
“ఆస్తులు చేతులు మారతాయి. తరగవు”
“అతన్ని నేను తీసుకొస్తాను. మీరు మాట్లాడండి. మీ భయాలూ, ఏవన్నా వుంటే షరతులూ చెప్పండి. చాలా ఫ్రాంక్” అంది తను.
సుమంత్‍ని ఇంటికి ఆహ్వానించి పరిచయం చేస్తే తండ్రి మరోలా అర్థంచేసుకుని ఆ విషయాలేవీ మాట్లాడకుండా పంపించేసాడు.
“అంతకన్నా అందమైన కుర్రాడిని పట్టుకొస్తాను. సరేనా?” అన్నాడు.
“అతన్ని యిష్టపడటానికి అందం ఒక కారణం. నిజమే. కానీ అతని చుట్టూ వున్న మనుషులూ, చైతన్యం నాకు చాలా నచ్చాయి. అవి నాకు లేకపోవడం ఒక వెల్తిలా అనిపిస్తోంది. మనకి డబ్బుంది. ఉన్నదాన్నే ఇంకొంచెం యిస్తానంటున్నారు మీరు. ఇతను పరిచయమవకపోతే మీ మాట కాదనేదాన్ని కాదేమో! ఇప్పుడుమాత్రం ఆ వెల్తిని భరిస్తూ బతకడం నావల్లకాదు”
“అతను నీకన్నా చిన్నంటున్నావుకదే? వాళ్ళూ వప్పుకోరు. వరహీనం మగపిల్లాడికి ఆయు:క్షీణమని భయపడతారు” అంది తల్లి కలగజేసుకుని.
ఇటు తన తల్లిదండ్రులు యిలా. అతనింట్లో సుమంత్ అన్న పెళ్ళే చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. చదువయ్యేదాకా ఏదీ పొసగలేదు. తనకి చాలా సంబంధాలు వచ్చేవి. తిరిగిపోయేవి. సుధీర్ని పెళ్ళికి వప్పించిందట గీత. ఇక తప్పనిసరై అనేక షరతులతో పెళ్ళికి వప్పుకున్నారు తన తల్లిదండ్రులు.
ఇప్పుడీ యముననీ రాణానీ చూస్తుంటే ఎదురైన ప్రశ్న. మొట్టమొదట తను సుమంత్‍ని ఏం చూసి పరిచయం చేసుకుంది? కాలేజి కేంపస్ అనేది ఒక సంభావ్యత. బైటకూడా పరిచయాలై, ప్రేమకి దారితీస్తాయి. సుమంత్‍తో సారూప్యంగా వుండే రాణా పరిచయమై వుంటే? చదువుకోనివాళ్ళనీ, తక్కువ చదువుకున్నవాళ్లనీ, మోసం చేసినవాళ్లని తప్పనిసరయ్యీ పెళ్ళిచేసుకున్న తోటి డాక్టర్లెందరో తనకి తెలుసు. తన జీవితాన్ని నడిపించింది సుమంత్ రాణాల్లోంచీ సుమంత్‍ని ఎంపికచేసుకోగలిగిన తన అంతశ్చేతనా, లేక కేవలం అదృష్టమా? అంతశ్చేతనకి సామాజికవిలువలూ, తాహతుబేధాలూ, నియమనిబద్ధతలవంటివి తెలుస్తాయా?
సుమంత్‍తో అంటే, “డెస్టినీ. ఎవరు ఎవరికి రాసి పెట్టి వున్నారో! ఆ అల్గారిథమ్ మనం పుట్టేసరికే రాయబడి వుంటుంది. మనం పుట్టడానికి వేదికగా మన తల్లిదండ్రులని కలపడమే ఒక వింత. ఆ తర్వాత దేశం, కాలం, పరిస్థితులు ఎన్నో అంశాలుంటాయి. అంతశ్చేతన జాగృతం కావడానికి ఇవన్నీ కారణమౌతాయి. ఆలోచిస్తే దేనికీ మూలం దొరకదు. జీవితం దేన్నిస్తే దాన్ని తీసుకోవడమే. లవ్యూ లతా! నా జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన భాగంలో నువ్వున్నందుకు. ఇద్దరం ఒకరిగా మారాక, ఆ ఒక్కరితనాన్ని నాతో పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు” అన్నాడు.
అంతే. అంతకన్నా ఏమీ వుండదు.
యమున తెలివిగానే వ్యాపారం నడిపిస్తోంది. రాణాతో ఆమెకి డబ్బుదగ్గిర గొడవలు మొదలయ్యాయి. ఎందులోనూ సాయపడడు. చిన్నతనం. ఆమె సంపాదించే డబ్బుమాత్రం కావాలి. తన కుటుంబంలోవాళ్లంతా కలిసి పెట్టించిందికాబట్టి కొడుకుదే పెత్తనం అని సంధ్య దెబ్బలాట. చెప్తే సుమతి వింటుంది, రాణాని కోప్పడుతుంది, అతను వినడు, వదిలేస్తుంది. ఎవరేనా పైకి ఎక్కడానికి నిచ్చెన యివ్వగలరు. ఎప్పటికీ దాన్ని తామే పట్టుకుని నిల్చోరు. యమునకి అండగా ఎవరూ లేరు. కుదిరినంత డబ్బు పిల్లల చదువులకోసం సమీరకి పంపేస్తోంది.
కుటుంబరావు పక్షవాతం వచ్చి, మూడేళ్ళు మంచంలో తీసుకుని చనిపోయాడు. కమలాక్షి ఆ యింట్లోనే పెన్షను పెట్టుకుని బతుకుతోంది. కూతుళ్ళెవరేనా రమ్మంటే వెళ్ళి నాలుగురోజులుండి వస్తుంది. ఎప్పుడేనా గీతని చూడటానికి వెళ్తుంది. ఆక్షేపణలూ, ఆరోపణలూ వుండవు ఆమెదగ్గిర. నవ్వుతూ పలకరిస్తుంది. ఇంకో కూతురిలాగే అనిపిస్తుంది. ప్రస్తుతపు జీవితం ప్రశాంతంగా వుందావిడకి. భర్త పోయినందుకా, నిర్ణయాధికారం చేతికి రావడాన్నా అనేది హిందూసమాజపు కుటుంబవ్యవస్థలోని అత్యంత గోప్యమైన విషయం.
అందరిళ్ళలోనూ పిల్లల చదువుల హడావిడి వూపందుకుంది. మయూ తర్వాత పుట్టిన పిల్లలంతా వరసలో వున్నారు. రెసిడెన్షియల్ కాలేజిల్లో వెయ్యడం, వాళ్లచుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం ఒక వుద్యమంలా సాగుతోంది. చదువుతున్నారా, ఎలా చదువుతున్నారు, వారంవారం ప్రగతి ఎంత, నెలవారీ పరీక్షల్లో ఎంత, మంచి రేంకు వస్తుందా, రాదా ఎన్నో భయాలతో సతమతమైపోతున్నారు.
మయూ బీటెక్ చేసి, జాబ్‍లో చేరిపోయాడు. యూయస్ వెళ్ళాలన్నది కోరిక. కృష్ణకూడా వచ్చెయ్యమంటున్నాడు. టోఫెల్ రాసి, ఎమ్మెస్‍కి వెళ్ళటమా, కంపెనీ పంపిస్తే వెళ్ళటమా అనే సందిగ్ధంలో వుండి పేకేజి, కంపెనీ బావుండటంతో వుద్యోగంలో చేరిపోయాడు. అతని వెనక విహీకూడా బైటిప్రపంచపు దారిపట్టాడు. అతనికి లాంగ్‍‍టర్మ్ కోచింగు అవసరమైంది. వీళ్ళిద్దరికోసం తిరగడం, మిగిలిన పిల్లలందరినీ రకరకాల కాలేజిల్లో చేర్పించడం, వాళ్లందరి వెనకా తిరగడం గీతకీ వాసుకీ హడావిడిగానే వుంది. సరదాగానూ వుంది. మయూ, విహీ మధ్య పిల్లలు ఎమ్‍సెట్‍లో మంచి రేంకుల్తో సీట్లు తెచ్చుకుని చేరిపోయారు.
“లెక్కాపత్రం లేకుండా డబ్బు ఖర్చుపెడుతున్నారు. బైటిపిల్లలకోసం ఇంతంత ఖర్చుపెట్టేవాళ్లని ఎవర్నీ చూడలేదు. మనమేం జమీందార్లం కాదు. మీ పిల్లలకి అసలేమైనా మిగులుతుందా?” అడిగింది లక్ష్మి చిరుకోపంగా.
“నేను వుద్యోగంలో చేరినప్పట్నుంచీ దాస్తున్నాను. డబ్బు దాచడమేగానీ ఖర్చుపెట్టడం నాకు ఎవరూ నేర్పించలేదు. గీతకికూడా రాదు. ఇప్పుడీ పెడుతున్నది ఖర్చనీ అనుకోవట్లేదు. ఇరవైముప్పయ్యేళ్ళపాటు పెట్టిన చిన్నచిన్నమొత్తాలమీద వచ్చిన లాభాలని తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. మయూ చదువవ్వగానే ఆపేద్దాం. కొత్తవాళ్లని ఇంక తీసుకోవద్దు” అన్నాడు వాసు. కొంతకాలంతర్వాతిదాకా కొడుకుతో ఆవిడ ప్రేమగానూ, బాధ్యతగానూ మాట్లాడిన మాటలవే ఆఖరు. ఆ తర్వాతకూడా కొడుక్కి దగ్గరవగలిగిందిగానీ, గీతతో తలెత్తిన కొత్తగొడవ ఇద్దరికీమధ్యని అగాథాన్ని సృష్టించింది. గీత చాలా దూరం జరిగిపోయింది. తనదారి తను వెతుక్కుని చనిపోవాలనిపించేంత దూరం.
సేతుకూడా వుద్యోగంలో చేరిపోయాడు. తనకని ఒక కచ్చితమైన దారి, తన తరవాతివాళ్ళుకూడా అనుసరించేలా వేసుకున్నాడు. అతని చదువుకైన ఖర్చు కొద్దికొద్దిగా తిరిగిచ్చేస్తానన్నాడు వాసుతో. పిల్లలంతా గీతని అమ్మా అని స్వతంత్రంగా పిలిచేస్తారు. వాళ్లకేమీ అనిపించదు. వాసుని నాన్నా అని పిలవలేరు. మయూస్‍డాడ్ అని ఎవరో మొదలుపెట్టారు. అదే అతనికి సంబోధనగా స్థిరపడిపోయింది.
“మీలాంటి పిల్లల తెలివితేటలు వృధా కాకూడదన్న కోరిక అమ్మది. దాన్ని నువ్వెలా తీసేసుకుంటావురా? తన సంతోషం ఆగిపోదా? మయూ చదువయ్యేదాకా చేద్దామనుకుంటున్నాం. ఒకొక్కరూ చదువులై వెళ్ళిపోతే మాకింక ఖర్చులేం వుంటాయి? ముందు మీ అమ్మానాన్నలకి సదుపాయాలు చూసుకుని, పెళ్ళి చేసుకున్నాక నీకూ, నీభార్యకీ యిష్టమైనదేదైనా నువ్వూ మొదలుపెట్టు” అన్నాడు వాసు.
“నాకు మీపట్ల కృతజ్ఞతా, ప్రేమా వున్నాయి. మీకోసం ఏదేనా చేసి, వాటిని చూపించుకోవాలనుంటుంది. బట్టలు, గేడ్జెట్స్ ఇలా ఏవో ఒకటి యివ్వచ్చు. నిజానికి మీకు లేనివేవీ లేవు. అమ్మకి మరో పట్టుచీర, మీకో ఖరీదైన సెల్ కొనడం మీరు చూపించిన కరుణకి వీసమెత్తుకూడా తూగవు. మీరు మాకోసం మోస్తున్న బరువులో కొంచెమేనా నన్ను తీసుకోనివ్వండి” అని పూర్తిగా నెలజీతం లెక్కేసుకుని వాసుకి యిచ్చాడు. “బాగా మాటలు నేర్చావురా!” అంది గీత. ఇద్దరూ ఎంత వద్దన్నా వినలేదతను. అతని తర్వాత వుద్యోగాల్లో చేరినవాళ్లుకూడా అలానే యివ్వడం మొదలుపెట్టారు.
విహీకూడా వెళ్లిపోయాక ఇంట్లో సందడి పూర్తిగా తగ్గిపోయింది. తమ ప్రయాణాలతో పిల్లలు ఇబ్బందిపడతారని వాళ్ళ భోజనాలని ఒక పూజారి యింటికి మార్చారు. చదువులుమాత్రం యిక్కడే. రామకృష్ణ గదిని మార్పుచేసిచ్చారు. దాన్ని స్టడీరూమ్‍గా వాడుకుంటారు. పిల్లలు చదువుతున్నారో లేదో చూడటానికి ట్యూషన్ మాస్టర్ వస్తాడు. గీత, వాసు పైనుంచీ చూసుకుంటారు. పగలంతా ఏవో ఒక పనులతో కాలం గడిచిపోతుంది లక్ష్మికి. అంతా కలిసి కూర్చుని టీవీ చూస్తారు. ఇష్టమైతే గీత ఒకటో రెండో పాటలు తనూ పాడుతుంది. పియానో వాయిస్తుంది. పుస్తకాలూ, పత్రికలూ కొనుక్కొచ్చి తను చదువుతుంది, లక్ష్మికి యిస్తుంది. రెండు న్యూస్‍పేపర్లొస్తాయి యింటికి. ఇవన్నీ వాళ్ళ కాలక్షేపాలు. లక్ష్మికి కావు. ఎంత రాత్రిదాకా మాట్లాడినా, వాళ్ళగదిలోకి వాళ్ళు వెళ్లగానే వంటరితనం చుట్టుముడుతుంది ఆవిడ్ని. రామకృష్ణ ఆవిడ చెయ్యి వదిలిపెట్టినప్పటి దు:ఖం పునరావృతమౌతోంది. మయూ, విహీ వున్నన్నిరోజులూ చదువూ, ఆటలూ ఎన్నున్నా, నిద్రమాత్రం ఆవిడ గదిలోనే. చిన్నప్పుడైతే కబుర్లు, కథలు చెప్పుకునేవారు. పెద్దౌతున్నకొద్దీ వాళ్ళు చెప్తుంటే ఆవిడ వినడం ఎక్కువైంది. ఇప్పుడు అవన్నీ ఆగాయి. ఫోన్లకోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. తులసి ఫోన్ చేస్తుందా? మాధవ్ చేస్తాడా? కొడుకుచేతా, కూతురిచేతా మాట్లాడిస్తాడా? మయూ, విహీలా? చేతన్, చరణ్‍లా? గుండె అలా కొట్టుకుంటూ, తపించిపోతూ వుంటుంది. ఎప్పుడు తెల్లవారుతుంది? గీత దగ్గరకొచ్చి ఎప్పుడు కూర్చుంటుంది? వాసు పలకరింపు ఎప్పుడు మొదలౌతుంది? నిముషాలనీ, గంటలనీ నత్తలబండిమీద ఎక్కించి పంపుతూ ఎదురుచూపులు.
మయూ హాస్టల్‍కి వెళ్ళినప్పుడు గీత, వాసు తల్లడిల్లిపోయారు. విహీ టైముకి అది అనివార్యమనేది అర్థమైంది. ఆ అనివార్యతతోపాటు వెలితికూడా మనసుల్లో వచ్చికూర్చుంది. తాము పెద్దౌతుంటే ఒక మనిషికి యింకోమనిషి తోడయ్యేవారు. ఇద్దరు కొడుకులూ, కోడళ్ళూ, వచ్చిపోయే కూతురూ, అల్లుడితో ఇంటినిండా మనుషులే అన్నట్టుండేది. దానికి తగ్గట్టే వచ్చిపోయేవాళ్ళు, వేడుకలు. తమ తరానికి అన్నీ ముగిసాయి. ఇప్పుడింక ఆడపిల్లలకి తోడు మగపిల్లలుకూడా వచ్చిపోయే అతిథులే. ఏ అనుభూతులూ మిగల్చకుండా లేతలేత వయసుల్లోనే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు.
“ఇదేంటి గీతూ, ఇలా మారిపోయింది జీవితం? మనని మనం కొద్దికొద్దిగా పోగొట్టుకుంటున్నట్టనిపిస్తోంది. ఎక్కడికెళ్ళినా పాతజ్ఞాపకాలే తప్ప కొత్తగా గుర్తుపెట్టుకునేందుకు సంఘటనలే జరగట్లేదు?” వాసు ఆశ్చర్యంగా అన్నాడు.
“ఇలా సంఘటనలేవీ జరక్కుండా గడిచిపోయే కాలాన్నికూడా జీవితమనే అనాలా?” అడిగిందామె.’
“ఇంకో ఐదారేళ్ళు ఇలానే వుంటుందేమో!”
“తర్వాతైనా, పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తారు, మాధవ్‍లాగా కృష్ణలాగా విడికుటుంబంగా ఎదుగుతారుగానీ, ఇక్కడొచ్చి వుండరు. వచ్చిపోయే చుట్టాలే. ఇక్కడ నువ్వు, నేనూ, అత్తా. అంతే. ఈ యిల్లూ, ఇంటిని నిలబెట్టడంకోసం మనం పడిన తపనా అర్థంలేనివనిపిస్తున్నాయి. ఇక్కడి జ్ఞాపకాలు మనం కాపలా కాసినంతకాలం వుంటాయి. పక్షులు వాలి ఒకటో రెండో గింజలు ఏరుకున్నట్టు చూసుకుని వెళ్తారు. క్రమంగా వాళ్లకీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ల జ్ఞాపకాలు వేరేచోట పోగుపడటం మొదలౌతుంది. మనింట్లో మనమే నీడల్లా తిరుగుతున్నాం. ఇది దు:ఖమో మరేదోగానీ, తట్టుకోలేకపోతున్నాను వాసూ!”
“అన్నిళ్లలోనూ ఇలానే వుంది. మనం, మన ముందుతరాలూ, పెద్దవో చిన్నవో చదువులు చదివి వుద్యోగాలు వెతుక్కుని చేరిపోయాం. పిల్లల్ని ఇక్కడే వుంచడానికి కావలిసిన స్కిల్స్ మనకి లేకుండాపోయాయి. ఒక పరిశ్రమ లేదా వ్యాపారం పెట్టి, పదిమందికి వుద్యోగాలిచ్చి మన పరిధిలోనే పిల్లల్ని ఆపుకోగలిగే నైపుణ్యం నేర్చుకోలేదు. ఉద్యోగాలున్నాయికాబట్టి అవసరం లేదనుకున్నాం. ఎవరో ఒకరు వుద్యోగం యిస్తేనే బతకగలిగేలా మనం పెరిగాం, వీళ్లని పెంచాం. వ్యవస్థమీద ఆధారపడేలా పెంచాంగానీ, వ్యవస్థలో భాగం చెయ్యలేకపోయాం. పిల్లల్ని చదివించకపోతే ఎలా బతుకుతారని చదివిస్తున్నాం. ఇప్పుడైతే చదువంటే పిల్లలకి విమానం రెక్కలు తొడగడం. ఎగిరి వెళ్లిపోతున్నారు. మనకి లైవ్‍స్టాక్ వుంది, డైరీ యిండస్ట్రీ పెట్టచ్చు, పొలాలున్నాయి, ఎండ్ ప్రోడక్టు తయారయ్యేలా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టచ్చు. డబ్బుకూడా వుందికాబట్టి, చిన్నగా మరేదైనా మొదలుపెట్టచ్చేమో! నాకు అవేవీ రావుకాబట్టి, వాళ్ళలో ఆ ఆసక్తి కల్పించలేకపోయాను” అన్నాడతను.
చాలాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నారు. తొమ్మిది కుటుంబాలవాళ్ళు ఇరవైకుటుంబాలయ్యారు. ఇప్పుడు పిల్లలు మరో ముప్పైమంది. గమ్యాలు మారిపోయాయి. స్తబ్దచైతన్యంగా మారిపోయింది ఈ అన్ని కుటుంబాలనీ బంధించి వుంచిన అంత:సూత్రం.
ఉన్నట్టుండి ఒకరోజు శేఖర్, లీల లక్ష్మి యింటికి వచ్చారు. అందరి స్మృతిపథంలో ఎక్కడో అడుక్కి చేరిపోయారు వాళ్ళు. రాజశేఖరం పోయినప్పుడు కనిపించి వెళ్ళినవాళ్ళు మళ్ళీ ఎవరికీ ఎదురుపడలేదు. తమ్ముడిని చూసి తెల్లబోయింది లక్ష్మి. బీపీ, షుగరూ పట్టుకున్నాయట. మైల్డ్‌గా బ్రెయిన్‍స్ట్రోక్‍కూడా వచ్చి తగ్గింది. పిడికెడంత మనిషయ్యాడు.
“ఏమిట్రా, ఇది? ఇన్నాళ్ళూ ఏమైపోయారు? ఎవరికీ కనిపించకుండా దాక్కోవడం దేనికి? మిమ్మల్ని ఎవరేమన్నారని? వీణెలా వుంది? సంతోష్?” లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ప్రారంభమర్యాదలన్నీ చేసి, ప్రశ్నల వర్షం కురిపించింది.
“ఏం చెప్పమంటావులేవే? ఎవరు మాట్లాడతారు దాంతో? దాన్ని తీసుకుని నలుగురిమధ్యకీ ఎలా వస్తాం? దారీతెన్నూ దొరకట్లేదు. సంతోష్ యూయస్‍లో వున్నాడు. అక్కడే ఎవరో అమ్మాయిని చేసుకున్నాడు. వాడు ఎవరితోటీ మాట్లాడట్లేదు. నాకిదుగో, పక్షవాతం వచ్చి తగ్గింది. ఎన్నాళ్ళుంటానో, ఎప్పుడు పోతానో తెలీదు. ఒకమాటు అందరినీ చూసేస్తే నిశ్చింతని బయల్దేరాం” అన్నాడు.
“అవేం మాటలు? పెద్దవాళ్లం మేమందరం వుండగా నీకేమౌతుంది? నిండునూరేళ్ళూ వుంటావుగానీ, వీణ సంగతేంటి? దాన్నేదైనా వుద్యోగంలో పెట్టారా, లేదా?”
“చెయ్యనంది. ఇక్కడి యిల్లమ్మేసాం. ఆ డబ్బు దాని పేర్న పడేసాం. ఇప్పుడు మేం వుంటున్న ఫ్లాటుంది. సంతోష్ తనకేవీ అక్కర్లేదన్నాడు”
“ఆ దౌర్భాగ్యుడు యింకా జైల్లోనే వున్నాడా? బైటికొచ్చాడా?”
“ఇంకా రాలేదు. మనవొక్కటే కాదు, ఇంకా చాలా కేసులున్నాయి వాడిమీద. విడుదలై వస్తే ఏం జరుగుతుందోనని భయంగా వుంది”
“ప్లీడరెవర్నేనా అడగండి! ఇదింకా చిన్నదేకదు లీలా! ఉద్యోగంకూడా చెయ్యకుండా యింట్లో కూర్చుని ఏం చేస్తోంది? ఎలా కాలక్షేపమౌతుంది? దాన్నీ తీసుకురాలేకపోయారా? ఇక్కడ తప్పుపట్టేవాళ్ళెవరు?” అడిగింది. ఇంత వయసొచ్చి, ఇన్ని వ్యాపకాలు వున్నా తనకి తోచట్లేదు. వయసులో వున్నది, ఏమీ చెయ్యకుండా ఎలా కాలం గడుపుతోంది? తింటూ, తిరుగుతూ, నిశ్చింతగా పడుకుంటూ అదే సంతోషమని సర్దుకుపోతోందా? అర్థం కాలేదు లక్ష్మికి.
“ఏమో వదినా! వాసూ, గీతా ఏమంటారోనని తీసుకురాలేదు” అంది లీల.
“ఏమంటారే? అలా అనుకునేవాళ్ళు కాదు యిద్దరూను. మన పిల్లని మనం కాకపోతే ఇంకెవరు దగ్గిరకి తీస్తారు?” అంది లక్ష్మి.
శేఖర్ ఎక్కువసేపు కూర్చోలేక అక్కడే సోపాలో పడుక్కుని నిద్రలోకి జారుకున్నాడు. లోపలికి వెళ్ళి మంచంమీద సౌకర్యంగా పడుక్కొమ్మని లక్ష్మి ఎంతచెప్పినా వినలేదు. వదినామరదళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. మొదట్నుంచీ లీలకి వున్నదే, ఆకుని అందకుండా పోకని పొందకుండా సగం చెప్పీ, సగం దాచీ తనకి అనువుగా మాట్లాడటం.
వీణకి అక్కడినుంచీ వచ్చేసాక చాలా జబ్బుచేసింది. ప్రమీల చెప్పిందని లత వెళ్ళి చూసి, కొన్ని పరీక్షలేవో చేయించుకొమ్మంది. విషయం బైటికొస్తుందని వీళ్ళు చేయించలేదు. గీత భయపడ్డట్టు ప్రెగ్నెన్సీకూడా వచ్చింది. తల్లి కాళ్ళావేళ్ళా పడి, ఆవిడ సాయంతో నాటువైద్యాలేవో చేయించింది. చచ్చి బతికింది ఆపిల్ల. వీళ్ళింటికి రావడానికి ఆవిడకి షరతులు. వీణ గదిలోంచీ ఇవతలికి రాకూడదు. ఆవిడతో మాట్లాడకూడదు. ఆవిడున్న రోజో రెండురోజులో కూతురి గదికి బైటినుంచే గొళ్ళెం పెట్టేసేది లీల. అదైంది.
“పరాయిమగాడు ముట్టుకుంటే నీకు వొళ్ళెలా తెలిసేదికాదు? అలాంటివి జరుగుతుంటే మత్తు విడకపోవడమేంటి? సరే, మత్తులో తెలీలేదు, తర్వాతేనా అర్థమవ్వాలికదే? వద్దని చెప్పలేదా వాడికి? నీకూ యిష్టమేననుకున్నాడేమో! అంత యిష్టమైనదానివి అక్కడే చావకపోయావా? ఇంట్లోంచీ పారిపోవడం దేనికి? వీళ్ళ పీకకి చుట్టుకున్నావు గుదిబండలాగా” పెద్దావిడ వీణ గదిలోకి పనిగట్టుకుని వెళ్లి కూర్చుని, గుచ్చిగుచ్చి అడిగేది. తిట్టేది. శాపనార్థాలు పెట్టేది. అదీ అయింది.
కళ్ళెదురుగా ఎండ్రిన్ డబ్బా పెట్టడం, చావు, చావమనే నిరంతరఘోష ఆమె చెవుల్లో.
లత చెప్పిన టెస్టులన్నీ చేయించి, మంచిగైనిక్కి చూపించమని తల్లికి ఎన్నోవిధాల చెప్పాడు సంతోష్. సైకాలజిస్టుకీ, అవసరమైతే సైకియాట్రిస్టుకీ చూపించి ట్రౌమాలోంచీ బైటపడేస్తే బావుంటుందని తండ్రికీ చెప్పాడు. తీసుకెళ్ళి చూపించడంవరకూ తను చెయ్యగలడు. ఫాలో అప్ ఇంట్లోవాళ్ళ సహకారం లేనిదే కాదు. జాబ్స్‌కి అప్లైచేయించాడు. వల్లికూడా అన్నమాటప్రకారం నాలుగైదు నోటిఫికేషన్స్ పంపించింది. ఇంటర్వ్యూలు చెయ్యలేకపోయేది వీణ. కెరీర్ గేప్, అప్‍డేట్ కాలేకపోవటం, అనారోగ్యం, ఇంట్లో టార్చరు.
“వీణా! ఎలానో ఒకలా కష్టపడవే! నీకిది జీవన్మరణ సమస్య. ఉద్యోగం తెచ్చుకున్నావంటే వీళ్ళమధ్యనుంచీ బైటపడతావు. నీ బతుకు నువ్వు బతకచ్చు. చివరిదాకా నేను నీకు తోడుంటాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. పెళ్ళికూడా చేసుకోను. నీకన్నా ఏదీ ఎక్కువకాదే” అని చెల్లెలిని బతిమాలేవాడు.
మరి ఆమెకి?
మనుషులకేసి చూడాలంటే భయం, మాట్లాడాలంటే భయం, ఫోన్ ముట్టుకోవాలంటే భయం.
అమ్మన్నా, అమ్మమ్మన్నా భయమే, ఫోన్ యే వీడియోలు మోసుకొస్తుందోనని భయం.
మగవాళ్లని చూస్తే భయం, అసహ్యం. చేతకాని తండ్రిని చూస్తే అసహ్యం.
సంతోష్ కోరుకున్న మార్పులు రాలేదు వీణలో. కానీ,
“నేనెందుకు చస్తాను? మీ అందరి చావూ చూసాకకానీ చావను” అనేంత తిరుగుబాటు వచ్చింది ఆమెలో. మొండితనం, కసీ, కోపం.
“నీగోలేదో నువ్వు చూసుకోక నావెంటపడతావెందుకురా? ఇంటర్వ్యూలవీ నావల్ల కావని తెలీటంలేదా? ఎవడితోనేనా వెళ్తే వుద్యోగం యిస్తాడేమో చూడు. లేదూ, నాకున్న అనుభవంతో ఒక బ్రోతల్‍హౌసు నడిపిస్తాను. అందరూ దేశంమీదికి వెళ్ళి నలుగురమ్మాయిల్ని తెచ్చిపడెయ్యండి” అని అరిచింది సంతోష్‍మీద. చేతకాని కోపం, తన అసమర్ధతమీది కోపం, ఏం చెయ్యాలో తెలీని అసహనంలోంచీ వచ్చిన కోపం.
“అదీ, దాని బుద్ధి” అంది అమ్మమ్మ.
“ఔను. నా బుద్ధి అదే. నేనలాగే బతికాను. అలా బతకడానికే మీరంతా నాకు పెళ్ళిచేసి పంపించారు” అంది వీణ.
“అర్థమైందా, లీలా! కూతురని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నావు. దాని కడుపులో వున్న ఆలోచనలివి. అది అందుకే చావకుండా బతికుంది. మీ పరువు గంగలో కలపడానికే ఇంతదూరం వచ్చింది. లేకపోతే విషయం అర్థమైన మరుక్షణమే ప్రాణం తీసుకునేది. ఇది చావదు. మిమ్మల్ని చంపుకు తింటుంది. నీ కొడుకునికూడా చెడగొడుతుంది. దాని కడుపులో వున్న ఆలోచన బైటపడెయ్యాలనే ఇక్కడికొచ్చి నీ యింటికూడు తిన్నాను. ఇక చాలు. నే వెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ చావు మీరు చావండి” అని ఆవిడ ప్రయాణమైపోయింది.
తండ్రి మేథకుడు. తల్లి సహకారం లేదు. మొదట్నుంచీ వున్నదే. అంతా పరామర్శకి వస్తున్నారని రాత్రికి రాత్రికి ఇల్లు మార్పించేసింది. తండ్రి రిటైర్‍మెంటు తీసుకున్నాడు. ఎవరికీ అడ్రెసు చెప్పద్దని తనపై ఆంక్ష. ఫోను నెంబరు మార్చుకుని సైలెంటుమోడ్‍లోకి వచ్చేసాడు. తాము ఎక్కడుంటున్నారో వాసూవాళ్ళూ తెలుసుకోవాలంటే తెలుసుకోలేరా? తేలిగ్గా తెలుసుకోవచ్చు. తండ్రి ఆఫీసుకి వెళ్ళి అడిగితే చెప్తారు. వెళ్ళారేమో, తెలుసుకున్నారేమో! లేకపోతే వసంత్ తండ్రి పోయినవార్త తమదాకా ఎలా చేరుతుంది? తమ స్పేస్‍ని గౌరవించినట్టే దూరంగా వుండిపోయారు.
కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ నీడలు తమ పిల్లలదాకా విస్తరిస్తాయని మిగతావాళ్ళు భయపడటం సహజం. అందుకే తక్షణపరిణామంలా పల్లవికి పెళ్ళి చేసి పంపేసాడు పినతండ్రి. అర్చననికూడా మా పిల్లని మేం చదివించుకుంటాం, మీ పిల్లవాడిని మీరు చదివించుకోండి అనే ప్రాతిపదికన అమెరికా పంపేసాడు.
తల్లికీ ఆయనకీ పడదు. పద్ధతిగా ఆలోచించేవాళ్లెవరితోటీ ఆవిడకి కుదరదు.
ఈ అజ్ఞాతవాసంలో చెల్లి సమస్యకి పరిష్కారం దొరకదు. అందరూ దాంతో ప్రేమగా మాట్లాడాలి. నీకేం జరగలేదన్న భరోసా యివ్వాలి. తమతో తిప్పుకోవాలి. అదంతా జరిగితే వీణలో మార్పొస్తుంది. తండ్రి బంధువులకీ, తమకీ మధ్య తల్లి అడ్డంకి. అప్పుడూ, యింత జరిగాక యిప్పుడుకూడా. అమ్మమ్మావాళ్ళూ తమకి తలుపులు మూసేసుకున్నారు. కానీ ఆవిడ వాళ్ళ వాకిట్లోనే సాగిలపడి వుంది. పరిష్కారం దొరకట్లేదతనికి. చెల్లెలి జీవితం చక్కదిద్దడం తనొక్కడివల్లా కాదు. ఆఫీసుకి వెళ్ళాలి, సంపాదించుకు రావాలి. అప్పుడే ఖర్చుపెట్టగలడు. తనదారిని తను ఆఫీసుకెళ్ళిపోతే ఆమెని వెంట తీసుకెళ్ళీ ప్రయోజనం వుండదు. ఐనా అడిగాడు, అసలంటూ వస్తానంటే ఇంకేదైనా ఆలోచించవచ్చని.
“చెల్లీ! ఒక తప్పు జరిగినంతమాత్రాన అదే జీవితం కాకూడదు. పోనీ, జాబ్ చెయ్యద్దు, నాతో వచ్చేస్తావా? ఫారిన్ చాన్సుకూడా వచ్చేలా వుంది. ముందు నేను వెళ్తాను, తర్వాత నిన్నూ తీసుకెళ్తాను” అన్నాడు.
“వద్దురా! ఇంట్లోనే యిలా వుంటే బైట ఇంకెలా వుంటుందో! నా చెల్లెలికి యిలా జరిగిందని నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికేనా చెప్పు, వాళ్ల ప్రవర్తనలో ఎంత మార్పొస్తుందో నువ్వే చూస్తావు. ఫారిన్ వెళ్ళినా ఎవరిమధ్యని వుంటావు? ఇదే మనుషులు. మారిపోరుకదా? ఎవరిదాకానో ఎందుకు, మనం పందొమ్మిదిమందిమి అని గొప్పగా చెప్పుకుంటారు, వాళ్లలో ఎందరొచ్చారు నాతో మాట్లాడటానికి? సుమతొచ్చిందా? గీతొచ్చిందా? పెళ్ళిళ్ళైనవాళ్ళూ, పెద్దవాళ్ళేకదా? రావడానికేం? ఎక్కడో వున్న మహీ, రవళీగురించి అడగట్లేదు. వీళ్ళిద్దరూ ఇక్కడే వున్నారు. పట్టనట్టు వూరుకున్నారు. నావిషయం బైటికి రాకుండా దాచిపెట్టి కొంపలేవో అంటుకుపోయినట్టు పల్లవికి పెళ్ళిచేసి పంపించేసాడు బాబాయ్. కొత్తగా పెళ్ళైంది దాన్నొదిలెయ్, అర్చనకేమైంది? పుట్టినప్పట్నుంచీ కలిసి తిరిగాం. అమెరికా వెళ్తున్నప్పుడు కనీసం ఫోన్‍కూడా చెయ్యలేదు అది” అంది.
“మామ్మ పదోరోజుకి నువ్వు రాకపోయేసరికి గీతా, సుమతీవాళ్లంతా ఏడెనిమిదిమంది కలిసి నీదగ్గిరకి బయల్దేరారు వీణా! ఇంతలో నువ్వే వచ్చేసావు” నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు.
“కావచ్చు. నేనొచ్చాకమాత్రం రాలేదు. సుమతినికూడా వదిలెయ్, జో పైవాడు. వాసు మనలో ఒకడు. అత్తతో కలిసి గీతెందుకు రాలేదు? లత వచ్చినప్పుడు దానికేమైంది? వల్లికూడా వచ్చింది? అదేనా, వూళ్ళోవాళ్లందరినీ వుద్ధరించేది?”
“అందరికీ దూరంగా వుండాలని ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది మనమేకదే?”
“తెలుసుకోవడం ఎంతపని? ప్రేమ వున్నవాళ్ళు వెతుక్కుంటూ వస్తారు” నిస్తేజంగా నవ్వింది. “నేనిప్పుడు ఎవరికీ పనికిరాను. నాతో మాట్లాడాలన్నా, నన్ను ముట్టుకోవాలన్నా బహుశ: అందరికీ అసహ్యంగా వుంటుంది. వాళ్ళ పవిత్రత భంగపడుతుంది. వాసుని ఎవరేనా ఎత్తుకుపోతారేమోనన్నట్టు ఒక్కక్షణమైనా వదిలిపెట్టదు గీత. అది గీసిన గీటు దాటడతను. అదో పతివ్రతామతల్లి. ఇప్పుడింక నా నీడకూడా దానికి పనికిరాదు. అప్పుడు వీళ్లందరినీ చూస్తుంటే సరదాగా వుండేది. నేనూ అలానే వుండాలనుకునేదాన్ని. అమ్మ కలవనిచ్చేదికాదని కోపంగా వుండేది. ఇప్పుడంతా తలకిందులైపోయింది. ఒక బ్రోతల్‍కన్నా నా విలువ ఎక్కువేమీ వుండదు. మనుషుల అసలు రంగులు ఆవిడకి తెలిసినంత మనిద్దరికీ తెలీదు. అమ్మ కరెక్ట్ అన్నా! అందుకే వాళ్లకి దూరంగా తీసుకొచ్చేసింది. నాకు సమాజంలోకి రావాలని లేదు. డెస్టినీ ఎలా వుంటే అలా జరుగుతుంది. వాడు, వాడి అమ్మానాన్నలు రేపోమాపో జైల్లోంచీ వస్తారు. చంపేస్తారేమో నన్ను. అందుకోసం ఎదురుచూస్తాను” అంది.
“పిచ్చిమాటలు మాట్లాడకు. వాళ్ళు జైలునించీ వచ్చి, నీకు హానిచేస్తారనుకుంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం. చంపమని నిన్ను ఎదురు పంపించం. వీణా! మనం అక్కడే వుంటే క్రమంగా విషయం పాతబడేది. అక్కడినుంచీ వచ్చెయ్యడం తప్పు. గీతా, సుమతీ రావడం, రాకపోవడం నీ సామాజికజీవితానికి కొలతబద్దలు కావు. వాళ్ళెవరూ ఒకప్పుడు రాలేదు, ఇప్పుడూ అంతే. వాళ్ళతో నీ జీవితం ముడిపడి లేదు. ఇప్పుడు నాతో వచ్చినా నీ విషయం అందరికీ చెప్పుకుంటూ తిరగం. నీకు నచ్చినట్టే నువ్వుంటావు” అన్నాడతను.
వీణ అతనితో వెళ్ళిపోతుందేమోనని చాలా భయపడింది లీల. దీని జీవితం ఎలాగా భ్రష్టుపట్టిపోయింది. వీడిదికూడా నాశనం చేస్తుందా? ఆవిడ అవగాహన అది. కూతురిదీ జీవితమే. పొరపాట్న తప్పుదార్లో పడింది. దాన్ని దార్లోకి తెచ్చుకోవలసిన బాధ్యత తమదే. ఎవరో వచ్చి చెయ్యరు. ఆ క్రమంలో కొంత నష్టం జరగచ్చు. సంతోష్ త్యాగానికి సిద్ధంగానే వున్నాడు, ఆవిడ లేదు.
“సంతోష్, దాని తలరాత ఎలా వుంటే అలానే జరుగుతుంది. ఎవరో వచ్చి మాకేదో చేస్తారన్న ఆశ లేదు. వాళ్ళమధ్యనే వుంటూ, రోజుకొకరు వచ్చి చూసి, ముల్లుని కెలికినట్టు కెలుకుతుంటే చూస్తూ, వాళ్ళంతా మాకు మేలుచేస్తున్నారన్న అనే భ్రమలో నేనుండలేను. ఎవరేం చెయ్యగలరు దీని విషయంలో? విడాకులయ్యాయి, ఇంకో పెళ్ళిచేస్తాం, సంబంధం చూడండని అడిగే పరిస్థితికూడా కాదు. ఉద్యోగం చెయ్యనంది. పదిమందిలోకి వెళ్ళి చెయ్యాల్సిన ఖర్మకూడా దానికి లేదు. అది తినే తిండెంత? దాని ఖర్చెంత? అమ్మానాన్నలం, నడిబజార్లోనైతే దాన్ని వదిలెయ్యం. వదిలెయ్యలేకనే తెచ్చి యింట్లో పెట్టుకున్నాం. డబ్బుకి దానికే లోటూ లేదు. నీతో తీసుకెళ్ళి కొత్తసమస్యలు తెచ్చిపెట్టకు. కనీసం నువ్వేనా బాగుపడి, మాకొడుకువని మేం చెప్పుకునేలా బతికితే సంతోషం. కాదంటావా, నాన్నకి యిచ్చి యింత విషం నేనూ తీసుకుంటాను. మా శవాలు కదిలాక నీకు తోచినట్టు చెయ్యి” అంది. అంతేకాదు, ఒట్లు పెట్టుకుంది. ఆవిడ మొండితనం అతనికి తెలుసు. చెప్పింది వినకపోతే ఏ మందో మింగి ప్రాణాలమీదికి తెచ్చుకునేంత మొండిది.
అలా వెళ్ళినవాడు దేశం యెల్లలు దాటాడు. పెళ్ళీ చేసుకున్నాడు. వీణకోసం చాచిన చేతినిమాత్రం వెనక్కి తీసుకోలేదు. దాన్నందుకోవడం లీలకి యిష్టం లేదు. కనీసం కొడుకేనా సుఖంగా వుంటాడనే స్వార్థం ఆవిడది. అది సుఖమేనా? అనే ప్రశ్న వేసుకోలేదు. కుటుంబం అనేది విడివిడి వ్యక్తుల సముహం కాదు. కొంచెం త్యాగంచేసేనా, కొంచెం రాజీపడేనా అందరూ కలిసి సుఖంగా వుండాలి. అప్పుడే అది సమాజంలోని అంతర్గత భాగమౌతుంది. లేకపోతే పరిష్కారం వెతకని సమస్యలని ముందుకి తోస్తూ సమాజాన్ని కిందుమీదులు చేస్తుంది.
తనపట్ల తల్లిలోనూ, తల్లివైపువాళ్లలోనూ వచ్చిన మార్పులకి వీణకూడా రాటుతేలింది. ఇష్టమైతేనే, యిష్టమైనప్పుడే స్నానం, తిండీ. మనసులో ఏదేనా కదలిక జరిగినప్పుడు తల్లినీ తండ్రినీ నోటికొచ్చినట్టు తిడుతుంది. చేతికందినవి వాళ్లమీదకి విసిరేస్తుంది. రోజంతా టీవీయే. వీడియోలు రావడం ఆగింది. అదొక నిశ్చింత. కానీ తను వెతుక్కుని చూడటం మొదలుపెట్టింది. అలవాటుపడిపోయింది. తనకో గదీ, కంప్యూటరు, వీడియో ప్లేయరు. ఎవర్నీ రానివ్వదు గదిలోకి. కాస్త వొళ్ళూ, కళ్ళచుట్టూ చిన్నగా వలయాలూ, దాచుకున్న కోపం, ముందేం జరుగుతుందోనన్న భయం, ప్రేమరాహిత్యంతో వచ్చిన వుదాశీనత. ఎవరేనా లాలనగా దగ్గిరకి తీసుకుని గుండెల్లో పొదువుకోవాలనే కోరిక వుంటుంది. అది ఆమెకి ఎప్పుడూ తీరలేదు. ఆ నిస్పృహ మనసంతా నిండిపోయి వుంది.
లీల కూతుర్ని ప్రేమగానే చూసుకుంటోంది. వీణకీ పెద్దగా కోరికలేం లేవు. నచ్చినవి వండుకునో, హోటల్‍కి వెళ్ళో తింటున్నారు తల్లీకూతుర్లు. మరీ విసుగనిపించినప్పుడు షాపులకి వెళ్ళి చీరలూ, నగలూ కొనుక్కుంటారు. అవలా పడుంటాయి. కొత్తచీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? శేఖర్ కూతుర్నలా చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఎంతకాలం ఇలా బతికితే దీని బతుకు గట్టెక్కుతుందనే నిరంతరచింతన అతన్ని తినేస్తోంది. ఒకవైపు భర్త పరిస్థితి చూస్తే అలా వుంది. అతనికేదైనా జరిగితే తను వంటరిదౌతుంది. ఇలాంటి కూతుర్ని పెట్టుకుని ఒక్కర్తీ యీదాల్సిన భవిష్యత్తు ఆమెకి భయం కలిగిస్తోంది. కూతురికేదైనా దారి దొరుకుతుందా?
ఆరేడేళ్ళ సుదీర్ఘకాలంలో జరిగిన విషయాలలో చాలావరకూ ప్రాధాన్యాన్ని కోల్పోగా అతిముఖ్యమైన విషయాలు చెప్పింది లీల లక్ష్మికి.
“దాని విషయంలో ఎవరం ఏమీ చెయ్యలేం. మామూలు విడాకులైతే సంబంధం ఏదేనా చూడచ్చు. విషయం దాచిపెట్టి చేసినా బైటపడితే కష్టం. చెప్తే ఎవరూ ముందుకి రారు. మరోసారి దాన్ని నిప్పులగుండంలోకి తొయ్యడం దేనికి? ఎప్పుడేనా యిక్కడికి పంపిస్తూ వుండు” అంది లక్ష్మి.
శేఖర్ నిద్ర లేచాడు. లక్ష్మి కాఫీ యిస్తే తాగాడు. టిఫెను పెడితే తిన్నాడు. అక్క పిల్లలగురించీ, మనవలగురించీ పేరుపేరునా అడిగాడు. అక్కగారి చెయ్యిపట్టుకుని కూర్చున్నాడు. తనవాళ్లమధ్యన వుంటే దొరికే సాంత్వన అతనికి దొరికింది. కూతురికికూడా ఏదో ఒక దారి దొరుకుతుందనిపించింది.
వాసు, గీత ఆఫీసుల్నించీ వచ్చారు. వీళ్లని చూసి ఆశ్చర్యపోయారు. పెద్దసంతోషమేం కలగలేదు యిద్దరికీ. గీతని చూసి లీలకి సన్నగా అసూయ మొదలైంది. ఎంత అపురూపంగా పెంచింది కూతుర్ని! ఎండిపోయిన మోడులా బతుకుతోంది. ఏమీ లేని దరిద్రంలోంచీ వచ్చిన ఇదిమాత్రం మహారాణీ వైభోగం వెలగబెడుతోంది. ఇద్దరు కొడుకుల్నీ చదివించుకుంటూ, వాసుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది! వయసులు పెరిగినట్టే లేరు యిద్దరూను. ఆరోగ్యంతో మిసమిసలాడుతున్నారు. లక్ష్మిని ప్రేమగా చూసుకుంటారట. కొడుకూకోడళ్లతో వుండే అదృష్టంకూడా లేదు తనకి. నెగడు అంటుకోవడం మొదలైంది.
వాసు శేఖర్‍తో మాట్లాడాడు. గీత లీలతో మాట్లాడింది. పొడిపొడి మాటలు నడిచాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత లక్ష్మి వాళ్లింటికి రెండుసార్లు వెళ్లింది. భార్యాభర్తలు నాలుగైదుసార్లు వచ్చి వెళ్లారు. వాళ్ళు వచ్చి వెళ్ళడం పెద్ద ప్రధానమైన విషయంలా చెప్పడం మానేసింది లక్ష్మి.
“వాళ్ళొచ్చి వెళ్తున్నారు. ఒకమాటు మీరిద్దరూ వెళ్ళి రాకూడదూ?” అంది వాసుతో.
“నువ్వెళ్తున్నావుకదా, చాల్లే” అన్నాడతను.
“ఎన్నాళ్ళని కోపాలు మనసులో పెట్టుకుని కూర్చుంటారు వాసూ? నీలిమ గీతనీ నిన్నూ ఎన్ని మాటలంది? పద్మ అనలేదా? సర్దుకున్నాం. లీల మనింట్లో మనిషే. దాని పెంపకానికీ, పుట్టింటిపద్ధతులకీ తగ్గట్టు ఏదో అంది. అన్నందుకు బుద్ధొచ్చేలానే జరిగింది. ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది వాళ్ళకి. మనిల్లు వెతుక్కుంటూ వచ్చారంటే అండగా వుంటామనేకదా? వెళ్ళి ఒకమాటు చూసి వస్తేనేం? రామారావేకాదు, శేఖర్‍కూడా నీకు మేనమామే” కొంచెం గట్టిగా అంది. సరే అనిపించింది అతనిచేత.
కష్టాలూ సమస్యలూ వచ్చేటప్పుడు ముందస్తు సంఘటనలు కొన్ని జరుగుతాయి. అవి జనాంతికంగానే జరుగుతాయి. రాబోయే ప్రళయానికి ఎలాంటి సూచనలూ యివ్వవు. శేఖర్ కుటుంబం వాసూగీతలకి రెస్టరెంట్లో కలవడం అలాంటి సంఘటన.
ఇంట్లో వుండేదే ముగ్గురు మనుషులు. ఆ ముగ్గుర్లోకూడా లక్ష్మి తులసిదగ్గిరకి వెళ్ళింది. ఇల్లు మరీ బోసిపోయినట్టుంది గీతకీ వాసుకీ. ఆఫీసయ్యాక నేరుగా యింటికి వెళ్ళకుండా రివర్‍సైడు వెళ్ళారు. ఎప్పుడో గడిచిపోయిన బాల్యాన్నీ, ఇప్పటి వర్తమానాన్నీ కలిపే ప్రయత్నాలు కాసేపు చేసాక యింటికెళ్ళి వండుకోవడానికి బద్ధకంగా అనిపించి, హోటల్‍కి దారితీసారు. అక్కడ కలిసారు శేఖర్, లీల, వీణ. వీళ్ళని చూసి వీణ ఆశ్చర్యపోయింది. ఆమెని చూసి వీళ్ళుకూడా అలానే అయారు.
“ఎలా వున్నావే?” ప్రేమగా భుజంచుట్టూ చెయ్యేసి దగ్గరకి తీసుకుని అడిగింది గీత. కళ్ళలో పల్చటి కన్నీటిపొర కదిలింది. దాన్ని వ్యక్తమవనివ్వలేదు. చెల్లెలన్న మమకారంలో తనని ముంచెత్తేసిన పన్నెండేళ్ళపిల్ల రూపం యీ ముప్పైరెండేళ్ళ వయసులో కొంచెం వికృతీకరించినట్టుంది. గుండె పిండేసినట్టైంది. దాదాపు పదేళ్ళ తర్వాత ఆమెని చూడటం. పెళ్ళయ్యాక మళ్ళీ చూడలేదు.
గీత చనువు వీణకి కొత్త. తనెలా వుందో ఇన్నాళ్ళూ పట్టించుకోని వ్యక్తికి ప్రేమేమిటి? ఎదురుపడిందికాబట్టి చూపిస్తోందనిపించింది. చిన్నప్పుడు చాలా యిష్టంగా వుండేది ఆమెంటే. అక్కని. మిగతావాళ్లంతా వదినలట. వెనకనుంచీ వెళ్లి ముద్దుపెట్టుకుని పారిపోయేది. పట్టుకుందామని చూసేది గీత. తను దొరికేది కాదు. హైడ్ అండ్ సీక్. అంతే. తల్లి ఆంక్షలుండేవి. ఎప్పుడూ పక్కన కూర్చుని మాట్లాడలేదు. ఎప్పుడేనా వాళ్ళింటికి వెళ్ళినా మాధవ్‍తో మాట్లాడుతూ కూర్చునేది తను. సంతోష్ గీతతో మాట్లాడేవాడు. తర్వాత ఎవరి దారులు వాళ్లవయ్యాయి. గీత పట్టు విడిపించుకుని దూరం జరిగింది వీణ.
వాసుకూడా పలకరించాడు. అతనికీ మనసు చెమ్మగిల్లే వుంది. అర్చనా పల్లవిలతో చూసిన పిల్ల. వాళ్లలాగే హాయిగా వుండాల్సింది యిలాగైందని బాధనిపించింది.
అందరూ కలిసి లోపలికి నడిచారు. తినడం అయ్యాక, వాళ్ళింటికి ఆహ్వానించారు శేఖర్, లీల.
“ఇక్కడ కలిసాంకదా, మరోసారి వస్తాం” అన్నా వినలేదు.
“లక్ష్మి లేనేలేదు. రేపు ఆఫీసులూ లేవు. రాత్రికి వుండి పొద్దున్నే వెళ్లచ్చు” అని బలవంతం చేసారు. రెండు కార్లూ శేఖర్ యింటిదారి పట్టాయి. సిటీకి బాగా దూరంగా వుంది అపార్టుమెంటు. అరగంటపైనే పట్టింది చేరడానికి. వెలుతుర్లోంచీ చీకట్లోకి వచ్చినట్టనిపించింది ఇద్దరికీ. వీణకిమాత్రం గాలీ వెలుతురూ వచ్చే కిటికీ యేదో తెరుచుకున్నట్టుంది. లోపలికి వెళ్ళి సర్దుకుని కూర్చున్నాక, అందరికీ టీ చేసుకొచ్చింది లీల.
“ఏం వాసూ! ఇంకా నామీద కోపం పోలేదా? మాట్లాడట్లేదు? ఇంక ఆ పాతమనుషుల్ని మర్చిపో. వీణని గొప్పగా పెంచుతున్నాననుకున్నాను. దాని చదువూ, తెలివీ, నా పెంపకంలోని గొప్పతనం- అన్నిటినీ దాని తలరాత మింగేసింది” అంది. ఆవిడ గొంతు దు:ఖంతో జీరవోయింది.
“అదేం లేదత్తా! అప్పుడైతే దెబ్బలాడటానికేనా వుండేది. యుద్ధమూ అయింది, సంధీ కుదిరింది. ఇంకేం మాట్లాడుకుంటాం?” అన్నాడతను.
“నువ్వు విరగ్గొట్టిన టీపాయ్ ఆమూల పెట్టుకున్నాం బావా! అదొక్కటే నీగురించి నాకు తెలిసిన విషయం. నీకు చాలా కోపమని భయపడేదాన్ని” అంది వీణ.
“గీతని అంటే వూరుకునేవాడు కాదు. రాణానికూడా కొట్టావటకదరా?” అడిగాడు శేఖర్ నవ్వుతూ. తనూ నవ్వేసాడు వాసు.
“అబ్బో! ఎప్పటిమాట? ఇంకా గుర్తుందా, నీకు? ఆరోజైతే హడిలిపోయాను, ఎవరెవరు ఏం దెబ్బలు తగిలించుకున్నారోనని. పొద్దున్న వీళ్ళింటికి వెళ్ళి వాసుని కళ్ళతో చూసాకగానీ భయం తీరలేదు”’అంది గీత.
“నాకలా చెప్పలేదు గీతూ, నువ్వు. చాలా పెద్దపెద్ద పాఠాలేవో చెప్పినట్టు గుర్తు” అన్నాడు వాసు.
“చిన్నప్పట్నుంచీ అనుకునేవారా గీతా, వాసుకి నిన్నివ్వాలని?” కుతూహలంగా అడిగింది లీల. గీతని జడ్జిచెయ్యాలనే కోరిక ఆవిడకి యింకా తీరలేదు.
“ఇంకా మా విషయాలేం చెప్పుకుంటాం పిన్నీ? మయూకే పెళ్ళీడు వస్తేను?” అంది గీత.
“అప్పుడే వాడికి పెళ్ళేంటే?” అంది లీల. “పిల్లల ఫోటోలున్నాయా?” అడిగింది. గీత ఫోన్లో చూపిస్తుంటే మనసు భగ్గుమంది లోలోపల. శేఖర్ వాసు ఫోన్లో చూడసాగాడు. ఆయనకీ గుండె చిక్కబట్టినట్టే వుంది.
మాటలు నడుస్తున్నాయి. మిగతావాళ్ళతో మాట్లాడినట్టు చనువుగా అరమరికల్లేనట్టు కాకుండా పైపై పరిహాసాలతో, డిప్లమాటిగ్గా సాగాయి. తండ్రితోపాటు తనూ ఫోన్లో చూస్తూ, మధ్యమధ్యలో వాసుని కుతూహలంగా చూసింది వీణ. తల్లికి గారాలకొడుకట. ఆవిడ్ని వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లడు. ఆవిడొక్కర్తే కాదు, ఇంట్లో వున్న పెద్దవాళ్ళంతా పోటీలుపడి అతన్ని పేంపర్ చేసేవారట. గీతని ప్రేమించి చేసుకున్నాడని రవి బాబాయ్ అన్నాడు. అబ్సెస్‍డ్ విత లవ్‍ట. ఏముంది గీతలో అంత అందం, ఆకర్షణ? ఎవరు ఎవరి వెంట తిరుగుతారోగానీ, ఇద్దరూ తాడూబొంగరంలా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతుంటారని చుట్టాల్లో అనుకోవడం వింది. తల్లిమాత్రం అతన్ని గీత కీ యిస్తే ఆడే బొమ్మనేది. రెండు జీతాలూ, చేతినిండా డబ్బూ వున్న పిల్లజమీందారని సంతోష్ అనేవాడు. చాలా మంచివాడనికూడా చెప్పాడు. ఫోటోగ్రఫీ హాబీట. అవంతీపురంవాళ్ళ రెండోరాకుమారుడట. వాళ్లలో వాళ్ళకి చాలా కథలున్నాయి. ఒక్కొక్కరికీ అనేక కోణాలు. తను అన్నిటికీ దూరం. అప్పుడూ యిప్పుడూకూడా. ఫంక్షన్లలో కలవడమే, ఎప్పుడూ పెద్దగా మాట్లాడుకోలేదు. గీరిగీసి దానికి అవతల వుంచేది తన తల్లి.
ఏం మిగిలింది తనకి? తల్లి నిర్దేశించిన దూరం వంటరితనంగా మారిపోయి తనని నిలువునా దహించేస్తోంది. చిన్నగా నిట్టూర్చింది. వచ్చినవాళ్ళు వెళ్లిపోతే బావుణ్ణనిపించింది. కాసేపటికింద తెరుచుకున్న కిటికీ మళ్ళీ మూసేసుకుని, చీకటి గుహలాంటి తనగదిలోకి వెళ్ళిపోవాలనిపించింది.
సంఘటనలు మామూలుగానే జరుగుతాయి. వాటికి భావోద్వేగాలుండవు. అవి వొట్టి భౌతికమైనవి. మన మనసులోని భావాల్ని రంగరించి వాటికి పట్టించినప్పుడు అర్థాలు స్ఫురిస్తాయి. అవంతీస్ ఇన్‍లోంచీ వస్తున్నప్పుడు గీత కాలుజారి పడబోయింది. వాసు పట్టుకుని ఆపాడు. సుమతి, లత, సమీర ఆఖరికి శశిధర్‍కూడా ఎవరు పడబోయినా అలానే ఆపేవాడు. సుమతికి వాసు, గీత అపురూపం. మనసులోని ప్రేమని దానికి పులిమింది. దానికో భావం కల్పితమైంది. శశిధర్ మనసులో ఈరోజుకీ అసూయ రగుల్తునే వుంది. ఇక్కడ వాసు, గీత చాలా మామూలుగా, నలభయ్యేళ్ళు దాటిన భార్యాభర్తల్లానే ప్రవర్తిస్తున్నారు. పెళ్ళి విఫలమైన ఒక ఆడపిల్లముందు ఎంత అప్రమత్తంగా వుండాలో అలానే వున్నారు. కానీ వాసు గీతవైపు చూసిన చూపు, ఆమెతో అన్న మాట అన్నీ ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి వీణకి. తట్టుకోలేకపోతోంది. తను పొందని, పొందలేకపోయిన జీవితం వెక్కిరించినట్టనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *