ఝరి 203 by S Sridevi

  1. ఝరి 200 by S Sridevi
  2. ఝరి 202 by S Sridevi
  3. ఝరి 203 by S Sridevi

ఏం మిగిలింది తనకి? తల్లి నిర్దేశించిన దూరం వంటరితనంగా మారిపోయి తనని నిలువునా దహించేస్తోంది. చిన్నగా నిట్టూర్చింది. వచ్చినవాళ్ళు వెళ్లిపోతే బావుణ్ణనిపించింది. కాసేపటికింద తెరుచుకున్న కిటికీ మళ్ళీ మూసేసుకుని, చీకటి గుహలాంటి తనగదిలోకి వెళ్ళిపోవాలనిపించింది.
సంఘటనలు మామూలుగానే జరుగుతాయి. వాటికి భావోద్వేగాలుండవు. అవి వొట్టి భౌతికమైనవి. మన మనసులోని భావాల్ని రంగరించి వాటికి పట్టించినప్పుడు అర్థాలు స్ఫురిస్తాయి. అవంతీస్ ఇన్‍లోంచీ వస్తున్నప్పుడు గీత కాలుజారి పడబోయింది. వాసు పట్టుకుని ఆపాడు. సుమతి, లత, సమీర ఆఖరికి శశిధర్‍కూడా ఎవరు పడబోయినా అలానే ఆపేవాడు. సుమతికి వాసు, గీత అపురూపం. మనసులోని ప్రేమని దానికి పులిమింది. దానికో భావం కల్పితమైంది. శశిధర్ మనసులో ఈరోజుకీ అసూయ రగుల్తునే వుంది. ఇక్కడ వాసు, గీత చాలా మామూలుగా, నలభయ్యేళ్ళు దాటిన భార్యాభర్తల్లానే ప్రవర్తిస్తున్నారు. పెళ్ళి విఫలమైన ఒక ఆడపిల్లముందు ఎంత అప్రమత్తంగా వుండాలో అలానే వున్నారు. కానీ వాసు గీతవైపు చూసిన చూపు, ఆమెతో అన్న మాట అన్నీ ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి వీణకి.
మనిషికి అనేక జీవితాలుంటాయి. ఒకరి మనసులో ఆ వ్యక్తిపట్ల నిండా ప్రేమ వుంటుంది. అందులో జీవింపజేస్తారు. మరొకరి మనసులో అది స్నేహంగానూ, ఇంకోచోట ద్వేషంగానూ రూపుదిద్దుకుని వుంటుంది. ఉదాశీనతగా మారి వుంటుంది. ఊహ తెలిసినప్పట్నుంచీ పినతల్లి అసూయలోనూ ఈర్ష్యలోనూ బతికింది గీత. అదే స్పర్థ వీణకి పైకి కనిపించకుండా. గీతని ఇలా చూస్తుంటే తను పొందని, పొందలేకపోయిన జీవితం వెక్కిరించినట్టనిపిస్తోంది.
పల్లవీ, అర్చనాకూడా ఇలానే వుంటారేమో! తాము ముగ్గురూ కలిసి తిరిగేవారు. బాబాయ్, పిన్నీ ముగ్గుర్నీ ఒకేలా చూసేవారు. పిన్ని తనకి అందరితోనూ కలిసిపోయి తిరగాలని చెప్పేది. తల్లికీ ఆవిడకీ అక్కడే గొడవొచ్చేది. ఇప్పుడు బాబాయ్, పిన్నీ కూతుళ్ళ జీవితాలు సుందరీకరించే హడావిడిలో వున్నారు. ఎవరిది తప్పు, ఎక్కడ జరిగింది పొరపాటు అని తిరిగి చూసుకుని సరిదిద్దుకునే అవకాశంకూడా లేకుండా ధ్వంసమైంది తన జీవితం. పల్లవీ అర్చనేకాదు, ప్రేమగా చూసుకుని, అపురూపంగా పెంచిన అమ్మమ్మ, మేనమామలుకూడా వదిలిపెట్టేసారు. దు:ఖం భరించలేనంతగా నిండిపోతోంది వీణ మనసులో. బైటపడిపోతానేమోనని భయపడింది.
ఏవో మాటలు సాగుతున్నాయి. ఇంక వెళ్తామని రెండుమూడుసార్లు లేచారు అతిథులు. చూస్తుండగానే పదకొండు దాటిపోయింది.
“ఇంత రాత్రేం వెళ్తారు? ఉండిపోండి. ఇదేం పరాయిల్లు కాదు” అంది లీల.
“కార్లోనేకదా, వెళ్లిపోతాం” అన్నా వినలేదు. బలవంతపెట్టి ఆపేసారు భార్యాభర్తలు. పడక ఏర్పాట్లు చేసి, గది చూపించింది లీల.
“పంచ కావాలేంట్రా? మార్చుకుంటావా?” అడిగాడు శేఖర్ వాసుని. వద్దన్నాడు. ఇక్కడిలా ఆగడం చాలా కోపంగా వుంది అతనికి.
“నువ్వేనా చీర మార్చుకుంటావా? నాది యివ్వనా?” అడిగింది లీల, గీతని.
“వద్దు పిన్నీ! పొద్దున్నే లేచి వెళ్ళేదేకదా?” అందామె.
“అంత తొందరేమే? మూడురోజులూ వరసగా సెలవులేగా?”
“రేపు మా పిల్లలని ఫామ్‍హౌస్‍కి తీసుకెళ్ళాలి. రేపటి ట్రిప్‍గురించి కలలు కంటూ నిద్రపోతుంటారు యీపాటికి”
“ఇంకే పిల్లలు? ఇదప్పుడే సగం నిద్రలోకి వెళ్ళిపోయినట్టుంది” అంది లీల నవ్వుతూ.
“నాకు గంపెడుమంది పిల్లలు పిన్నీ! కన్నది యిద్దర్నేగానీ, అంతకి పదిరెట్లమందిని పెంచుకుంటున్నాం” అంటూ పెంపుడు పిల్లలగురించీ, వాళ్ళ చదువులగురించీ చెప్పింది గీత.
“అందరు పిల్లలకి చదువు చెప్పించడానికి డబ్బెక్కడిదిరా?” శేఖర్ ఆశ్చర్యంగా అడిగాడు. అందరికీ చెప్పే జవాబే చెప్పాడు వాసు. తమనీ రమ్మంటారేమోనని లోలోపల ఆశపడింది లీల. వాసు అలాంటి మొహమాటాలేం పెట్టుకోలేదు. ఆకుని అందకుండా పోకని పొందకుండా మాట్లాడాడు ఏది మాట్లాడినా. పరిస్థితులు మారితే మనుషులు మారినట్టు కాదు. ఎప్పుడో ఒకసారి రిజర్వేషన్ దొరక్క జనరల్ కంపార్టుమెంటులో ఎక్కినవాడు జీవితాంతం జనరల్ కంపార్టుమెంటులోనే ప్రయాణం చెయ్యడు. తర్వాతి ప్రయాణంలో మళ్ళీ తన కంపర్ట్‌జోన్‍లోకి మారిపోతాడు. శేఖర్ కుటుంబానికి ఇదొక ఫేజ్. అంతే. అందుకే వీణతోకూడా మాటలు కలపలేదు అతను. శేఖర్‍కి మాత్రం యిద్దర్నీ దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడాలని చాలా అనిపించింది. వాసు యింకా ఫైటింగ్ మోడ్‍లోనే వున్నాడని అర్థమై వూరుకున్నాడు. తన భార్య గీతగురించి అన్నవి చిన్న మాటలు కాదు.
మరోగంట కబుర్లయాక గుడ్‍నైట్ చెప్పుకుని అందరూ లేచారు. తమకి చూపించిన గదిలోకి వెళ్ళారు వాసు, గీత.
“ఒళ్ళు మండిపోతోంది. నేను విరగ్గొట్టిన టీ పాయ్ యింకా దాచుకున్నారట. రోజూ చూసుకుని దు:ఖపడుతున్నారేమో! మరి తెలియాలికదా, నన్నిలా యింటికి పిలవకూడదని. అడ్డంగా దొరికిపోయాం గీతూ! ఈ ప్లేసేంటో గుర్తుపెట్టుకుని, దీనికి పదికిలోమీటర్ల పరిధిలోకి పొరపాట్నకూడా రాకుండా జాగ్రత్తపడాలి” అన్నాడు వాసు గది తలుపులు దగ్గరగా వేసి. నవ్వేసింది గీత. అతని మొహం చూస్తుంటే ఇంకా నవ్వు వుబికి వస్తోంది. ఆపుకుందుకు చెయ్యి నోటికి అడ్డంపెట్టుకుంది.
“అమ్మ అందని ఒక గంటో అరగంటో వచ్చి వెళ్దామనుకున్నాను. కిడ్‍నాప్ హోస్టింగ్ అంటారు దీన్ని” అన్నాడు.
“జోక్స్ ఆపు. మన నవ్వులు బైటికి వినిపిస్తే బావుండదు. వాళ్లగురించే అనుకుంటారు”
“కేప్టర్ కేర్ అనికూడా అంటారట. రివర్స్ రేన్సమ్ అడగచ్చేమో!”
“అదేం మహాభాగ్యం అని యిచ్చేసినా యిచ్చెయ్యగలరు. ప్రస్తుతం వీళ్ళింట్లో బకరాలకి డిమాండ్ చాలా వుంది”
చాలాసేపు నవ్వీనవ్వీ అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు.
తెల్లవారిమూడింటిదాకా టీవీ చూసింది వీణ. మనసునిండా అలజడి. నెమ్మదిగా వంటింట్లోకి వెళ్ళి, ఫ్రిజి తెరిచింది. ఒక్కక్షణం ఆలోచించుకుని ఆగి, గెస్ట్‌రూం వైపు వెళ్ళింది. చప్పుడు కాకుండా గదిముందు నిలబడి మునివేళ్లతో తలుపు కొద్దిగా తోసింది. బెడ్‍లాంపు వెలుతుర్లో దగ్గరగా పడుకుని గాఢనిద్రలో వున్న ఇద్దరినీ తదేకంగా చూసింది. సెల్‍లో ఫోటో తీసుకుని, అంతే నిశబ్దంగా వెనక్కి తిరిగింది. కోపం, ద్వేషం, కసీ. ఆ తర్వాత దు:ఖం. ఫోటో ఎందుకు తీసుకుందో వీణకి అప్పటికి ఇంకా రూఢీయైన ఆలోచన లేదు. అలా చూస్తూ కూర్చుంది. తీసుకోవడం తప్పన్న తప్పొప్పుల విభజనరేఖకూడా ఆమె విచక్షణలోంచీ చెరిగిపోయింది. తరువాతిరోజుల్లో ఆ ఫోటో గీతా వాసుల జీవితంలో ప్రకంపనాలు సృష్టించింది. జరిగినవి తెలీడం, తెలీకపోవడం అనే మంచుగోడకి అటూయిటూ వుంటాయి సంఘటనలు. మయూ పుట్టినప్పట్నుంచీ గీత జీవితం మంచుగోడకి అటూయిటూ దోబూచులాడుతోంది. ఇప్పుడూ అదే జరిగింది.
మామూలు అలవాటుప్రకారం ఐదింటికి లేచి తయారైపోయారు వాసు, గీత. కాఫీ చేసి, ఉప్మా ప్రయత్నాలు చేస్తుంటే యింత పొద్దున్నే ఏం తింటామని ఆపింది గీత. ఫోన్ చేస్తుండమని వీణకి చెప్పింది.
“అందరం గెట్ టుగెదర్లా పెట్టుకుని కలుద్దాం మామయ్యా! నువ్వెప్పుడంటే అప్పుడు. ఒకసారి అందరిమధ్యకీ వచ్చారంటే మీకూ బావుంటుంది. గీతా సుమతీవాళ్లంతా కలిసి పదిమందిదాకా వున్నారు. వాళ్ళని కలిస్తే వీణకికూడా బావుంటుంది. జరిగినవి ఎంత బాధాకరమైన సంఘటనలైనా వాటిని దాటుకుని వచ్చేసారు. ఇంక వెనక్కి చూసుకునే అవసరం లేదు” అన్నాడు వాసు శేఖర్‍తో.
కాఫీ తాగి బయల్దేరారు. వాళ్లతో కిందికి వెళ్ళారు లీలా, శేఖర్. కారు కదిలేదాకా బాల్కనీలో నిలబడి చూసింది వీణ.
“ఇద్దరం ఈ కుటుంబంలోనే పుట్టి పెరిగాం. అర్చనా పల్లవిలతో నన్నెప్పుడూ పోల్చుకోలేదు. గీతతోనే నా పోలిక. అది పద్ధతిగా పెరగట్లేదని చాలా మాటలు జరిగేవి మనింట్లో. అలాంటి గీత జీవితం ఎంతో నిశ్చింతగా వుంది. దురదృష్టం నన్ను ఎక్కడికో విసిరేసింది. వాసు దగ్గిర అది సురక్షితంగా వుంది. వాసు చదివిన మంత్రాలే తనూ చదివి, అతను చూసిన అరుంధతినే తనూ చూసి, అవే ప్రమాణాలు తనూ చేసినవాడు నా జీవితాన్ని భ్రష్టుపట్టించాడు. నేను చేసిన నేరమేంటి, అది చేసిన పుణ్యమేంటి?”’పైకొచ్చాక తండ్రిని అడిగింది వీణ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షించాయి.
“గీత చాలా స్వతంత్రంగా పెరిగింది. దాని జీవితాన్ని అదే రాసుకుంది. చదువు, వుద్యోగం, వాసు అన్నీ దాని ఎంపికే. అందుకే ఆ తేడా. మహీని భర్త కొడుతుంటే యింట్లోంచీ పారిపోయింది. నీలా తన్నులూ దాష్టీకాలూ భరిస్తూ వంట్లోని శక్తంతా అయిపోయేదాకా కూర్చోలేదు. నేరుగా మాధవ్ యింటికి వెళ్ళి అక్కడ కూర్చుని మిగతా అందరినీ రప్పించుకుని దానికేం కావాలో సాధించుకుంది. వాళ్ళని చూసి ఎలా బతకాలో నేర్చుకో. అక్కావాళ్ళూ బైటిపిల్లలని పెంచి చదువు చెప్పిస్తున్నారట. వాళ్ళింటికి వెళ్తుండు. ఆ పిల్లల చదువదీ చూసుకో. వాళ్లకీ సాయం చేసినట్టౌతుంది, నీకూ కాలక్షేపమౌతుంది. జాబ్ చెయ్యననుకున్నావు. ఇలా నీ చదువు వుపయోగపడుతుంది” కూతుర్ని దగ్గిరకి తీసుకుని తలనిమిరి లోపలికి వెళ్ళిపోయాడు. ఆమె ప్రశ్నలకి జవాబు దొరకలేదు. అలాంటివాళ్ళు పనికిరాకుండాపోతారని చిన్నప్పట్నుంచీ తల్లి నేర్పిన పాఠం. జరిగింది అందుకు భిన్నంగా వుంది. మహీ కథ ఒక సంచలనం ఆరోజుల్లో. గీత కథల సంచయం.
తిరిగి యింటికెళ్తూ గీతావాసూకూడా మాట్లాడుకున్నారు.
“అక్కడి వాతావరణం నచ్చలేదు గీతూ! వీణని చూస్తుంటే బాధనిపించింది. పల్లవీవాళ్ల తోటిపిల్లేకదా? ఎంత డైనమిగ్గా వుండాలి? ఇంట్లో దాచెయ్యడమేమిటే దాన్ని? చదువుకున్న చదువుకి సానపట్టి ఎక్కడికేనా పంపించెయ్యాలి. ఆవిడకి ఎవరూ చెప్పలేరు! శేఖర్‍గారు ఎప్పుడో చేతులెత్తేసారు. సంతోష్ పట్టించుకోకపోవడమేంటి? అమెరికా వెళ్లి పెళ్ళి చేసేసుకుని కూర్చున్నాడట. స్వంతచెల్లెలేకదా, యిది? వాళ్లమ్మ ఎలాంటిదో తెలిసికూడా ఆవిడకి ఎలా వదిలేసాడు?” కారు కదిలాక అన్నాడు వాసు.
“మరోసారి వాళ్ళింటికి వెళ్ళద్దు, మనం. అత్తకి నువ్వే చెప్పు. వీణ నార్మల్‍గా లేదు. దాని చూపులూ, వాలకం నచ్చలేదు. దానికి ఏదేనా చేద్దామన్నా మనకి ఆ స్వేచ్ఛ వుండదు. మహీ విషయంలోలా స్వతంత్రించి ఏదీ చెయ్యలేం. ప్రయోజనం లేకుండా అలాంటి మనుషుల్ని వుత్తుత్తిగా కలవడం సమస్యలకి దారితీస్తుంది” అంది గీత.


జీవితంలో దెబ్బతిన్నవాళ్లని దగ్గిరకి తియ్యడానికి అలాంటి దెబ్బలేమీ రుచిచూడని బావున్నవాళ్ళకి కొంత తటపటాయింపు వుంటుంది. కారణం, చాలామందికి తమ వైఫల్యాన్ని హేండిల్ చెయ్యడం రాదు. తమకి జరిగిన నష్టాన్నో ఏర్పడిన వెల్తినో ఎదుటివారి సంతోషంలోంచీ తీసుకుని భర్తీచేసుకోవాలనుకుంటారు. వీణ దీనికి మినహాయింపు కాదు. మహతి తన వివాహవైఫల్యాన్ని చాలా హుందాగా స్వీకరించింది. వీళ్ళ మధ్యకి రావడంగానీ తనేదో కోల్పోయినట్టు బాధపడటంగానీ, సానుభూతి ఆశించడంగానీ చెయ్యలేదు. వీణ అలాకాదు. ఆమెకి చాలా కావాలి. ఇద్దరి అనుభవాలూ, దు:ఖాలూ, దు:ఖానంతరపు పరివర్తనకూడా వేరేగా వున్నాయి. ప్రేమపూరితమైన స్పర్శకోసం, ఆప్యాయపు కౌగిలికోసం తపించిపోతోంది. తల్లాడుతోంది.
లక్ష్మి యింటికి ఆమె రాకపోకలు మొదలయ్యాయి. రెండుమూడుసార్లు శేఖర్ వెంటబెట్టుకుని వచ్చాడు. గంటారెండుగంటలు వుండి వెళ్ళిపోయేవారు. లీలతో కలిసి ఇంకోసారి వచ్చాక తనొక్కర్తే రావడం మొదలుపెట్టింది. లక్ష్మికి వీణకూడా మేనకోడలే. తనింట్లో తను యువరాణిలా పెరిగినదే, బావుండాలనీ, సుఖపడాలనే పెళ్ళి చేసారు. ఎలాంటిపిల్ల ఎలాగైందనే బాధ, అంత కష్టాన్ని ఎలా తట్టుకుందోనన్న జాలి, సానుభూతి, ఇప్పుడేమిటనే చింతా ఆవిడని పూర్తిగా లోబర్చుకున్నాయి. ఆవిడకి తమ్ముడిమీదా, మరదలిమీదా వుండే కోపాన్ని మమకారం తుడిచేసింది. రెండుచేతులా ఆహ్వానించి చేరువ చేసుకుంది. గీతా, వాసూ కొంచెం తటపటయిమ్చారుగానీ ఆవిడకి ఎదురుచెప్పలేకపోయారు. మొదట్నుంచీ ఆ యింట్లో అలాంటిది జరగలేదు.
ఇల్లంతా తిరిగింది వీణ. ఒకప్పుడు తను చూసిన యిల్లే. మాధవ్‍తో కూర్చుని మాట్లాడిన గదే. అపరిచితంగా అనిపించాయి. ఆ యిల్లుండి అప్పటి మనుషులు యిప్పుడు యిక్కడ లేకపోవడం ఒక దు:ఖపురేకలా అనిపించింది. కొంచెం చనువొచ్చాక గీత గదిలోకి వెళ్ళింది వీణ.
లేతరంగుల్లోని అందమైన దుప్పటీ పరిచిన విశాలమైన మంచం, ఎదురుగా పెద్దకిటికీ, చెయ్యితిరిగిన చిత్రకారుడి వర్ణచిత్రంలా కిటికీలోంచీ కనిపించే పెరడు, ఇద్దరు కూర్చోవడానికి సోఫా, ఎదురుగోడకి చిన్నటీవీ, డ్రాయింగ్ స్టాండు, గోడలకి కొన్ని పెయింటింగ్స్, పియానో, టీపాయ్‍మీద కొన్ని పుస్తకాలు. అభిరుచులనీ, కళలనీ ఇముడ్చుకున్న వింతప్రపంచంలా అనిపించింది. కదిలితే అదృశ్యమైపోతాయేమోనన్న సంకోచంతో చాలాసేపు వాటిమధ్యని చిత్తరువులా నిలబడిపోయింది.
“ఎంత పెట్టి పుట్టింది ఇది! నేనుకదా, యిలాంటి జీవితం గడపాల్సింది! దేవుడు పొరపాటుపడ్డాడా?” దిగ్బ్రమగా అనుకుంది. తన సంతోషం ఇక్కడ నిక్షిప్తమై వుందా అన్న సందేహం, దాన్ని వెతికిపట్టుకోవాలన్న ఆలోచనా మొదలయ్యాయి.
శశిధర్ని కొత్త బ్రీడ్ అన్నాడు వాసు. వీణ లేటెస్ట్ మాల్‍వేర్. ఆ వైరస్ వాళ్ళమీద చాలా ప్రభావం చూపించింది. ఎన్నో ప్రేమలు కరప్టయాయి.
ఇస్త్రీదో, నలిగిందో, బావున్నదో, బాలేనిదో డ్రెస్సొకటి తగిలించుకుని వచ్చేసి, ఏ సరదా లేకుండా మరబొమ్మలా తమమధ్యని తిరుగుతున్న వీణని చూస్తే గీతకీ వాసుకీ జాలిగానేవుంది. కానీ ఈ కొత్తచుట్టరికాలు దేనికి దారితీస్తాయో అర్థంకావట్లేదు. తోచక ఇక్కడికి వస్తోందనుకోవడానికి, ఇక్కడెవరున్నారు? రోజంతా లక్ష్మితో ఏం మాట్లాడుతుంది? ఎంతసేపు మాట్లాడుతుంది? అనే ప్రశ్నలకి జవాబులు దొరకట్లేదు.
ఇక్కడికి మాత్రమే వస్తోంది. గీతకి ఎవరేనా ఫోన్ చేస్తే యివ్వబోయినా మాట్లాడదు. పక్కకి తప్పుకుని వెళ్లిపోతుంది.
“ఏమ్మా? మనవాళ్ళేకదా?” గీత అంది.
“ఆ వీడియోలవీ తీసినవాళ్ళు ఎవరో తెలీదు. ఎక్స్‌పోజ్ కావడం యిష్టం లేదు. పొరపాట్న ఎవరికేనా తెలుస్తుందని చాలా భయంగా వుంటుంది” అంది. గీతకి మనసు చిక్కబట్టినట్టైంది.
మొదట్లో పొద్దున్న వచ్చి, ఏ మధ్యాహ్నానికో వెళ్లిపోయేది. లక్ష్మి వుండమంటే సాయంత్రం భార్యాభర్తలిద్దరూ వచ్చేదాకా వుంటోంది. పగలంతా టీవీ చూస్తూ గడిపేస్తుంది. సాయంత్రాలు వీళ్ళొచ్చాక కాస్త చైతన్యవంతంగా వుంటుంది యిల్లు. నలుగురూ కలిసి టీ తాగుతారు. కేరమ్సో షటిలో ఆడతారు. లక్ష్మి షటిల్ ఆడటం మానేసింది. చూస్తూ కూర్చుంటుంది. వీణ దేంట్లోనూ వీళ్లకి సమవుజ్జీ కాదు. ఆటలు రావు, పుస్తకాలు చదవదు. ఆమెని ఎంగేజ్ చెయ్యడానికి వీళ్ళు కాసేపు ఆడటం అంతే. రాత్రికి ఆగిపోవడంకూడా మొదలైంది. లక్ష్మి వుండిపొమ్మంటుంది.
అక్క చీర కట్టేసుకో ఇవాళ్టికి- అనటం ఆలస్యం, వీణ స్వతంత్రంగా గీత చీరలు తెచ్చుకుని కట్టుకుంటుంది. బ్లౌజు సైజు ఇద్దరిదీ ఒకటే. ప్రత్యేకమైన సందర్భాల్లో వాసు కొన్న చీరలు పైకి కనిపించకుండా లోపల పెట్టి మిగతావి వదిలేసింది గీత. ఆ పిల్ల సంతోషంగా తిరిగితేనే చాలన్న భావన ఆమెది.
సాయంత్రం ఆటలూ, మాటలూ అయాక స్నానాలూ, వంట. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. భోజనాలయ్యాక పెరట్లోకూర్చుని ఇంకాసేపు మాట్లాడి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రోజులు గడుస్తున్నాయి.
“ఇంట్లో తోచట్లేదా వీణా? ఇక్కడమాత్రం ఏముందే? అమ్మతో ఏం టైంపాసౌతుంది? ఏదేనా జాబ్‍లో చేరచ్చుకదా?” అడిగాడు వాసు ఒకరోజు.
“ఇంట్రెస్టు లేదు బావా! మాయిల్లమ్మిన డబ్బు నాకే ఇచ్చేసాడు నాన్న. ఫిక్స్ చేసాడు. ఏడాదికి నాలుగు లక్షల వడ్డీ వస్తుంది. అంటే ఫోర్ లాక్ పేకేజి అన్నమాట. ఇంట్లో ఖర్చులన్నీ వాళ్ళవే. ఫ్లాట్‍కూడా నాకే యిచ్చేస్తానన్నాడు. సంతోష్‍కి అక్కర్లేదట. ఇంక సంపాదించడం దేనికి?” అంది నిర్లక్ష్యంగా.
మహతి గుర్తొచ్చిందతనికి. ఇంత తిండి తిని, ఒక్క పిల్లని పెంచుకోవడంకోసం రేయింబవళ్ళూ కష్టపడుతోంది. కొత్తగా జీవనపోరాటంలోకి అడుగుపెట్టిన యమున ఒకవైపు రాణాని నిలవరిస్తూ, మరోవైపు పిల్లలకోసం పాటుపడుతోంది. వీణకి అలాంటి ఏ గమ్యం లేవు. డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. మరేం చేస్తుందట? ఇప్పట్నుంచీ ఇలా తిని తిరగడమేనా?
“అలాక్కాదే! అక్కని చూడు, ఎన్ని చేస్తుందో! ఇప్పుడంటే తగ్గించిందిగానీ మా అమ్మ చాలా పుస్తకాలు చదివేది. జాబ్ చెయ్యకపోయినా రోజంతా బిజీగా వుండేది. డబ్బుకోసమే ప్రతీదీ చెయ్యం. హాబీకి ఏదేనా నేర్చుకో” అని, తనకికూడా ఫోటోగ్రఫీ హాబీ అని చెప్పాడు.
“ఫోటోలు చూడచ్చా?” అడిగింది.
“డెస్క్‌టాప్‍లో వున్నాయి. చూడు” అన్నాడు. అతను వాడే సాఫ్ట్‌వేర్‍గురించి అడిగింది. ఇంకా లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పింది. కనీసం అందులోనేనా ఆసక్తి వున్నందుకు సంతోషపడ్డాడు.
వీణ కంప్యూటర్ తెరవటం మొదలుపెట్టాక వీళ్ళిద్దరి జీవితాలూ నెమ్మదినెమ్మదిగా ఆమె చేతిలోకి వెళ్లిపోవడం మొదలైంది.
“ఇప్పట్నుంచీ గదిలోకెళ్ళి కూర్చుని ఏం చేస్తారు? ” అడిగింది వీణ వింతగా. తొమ్మిదయ్యేసరికి అన్నీ ముగించుకుని, తమ ప్రపంచంలోకి వెళ్ళే వాసు, గీతల గురించి. ఏం మాట్లాడచ్చో, ఏం మాట్లాడకూడదో తెలీనిదాన్లా అనుకున్నది అనుకున్నట్టు అనేస్తుంది, అడిగేస్తుంది. తన విషయాలు పెద్దగా ఏవీ చెప్పకూడదని తల్లి హెచ్చరించి పంపింది. తల్లిలాగే తనూ ఆరాలు తీస్తుంది.
“ఇంటికి సంబంధించిన అకౌంట్సవీ రాసుకుంటారు. తొమ్మిది తర్వాత అందరూ ఫోన్లు చేస్తారు. అదయ్యాక ఏవో మాట్లాడుకుంటూనో, చదువుకుంటూనో పడుక్కుంటారు” అంది లక్ష్మి ఏం చెప్పాలో తెలీక.
“హాల్లో కూర్చుని రాసుకోవచ్చుకదా అత్తా! ఫోన్ నీకివ్వరా? నువ్వు మాట్లాడవా వాళ్ళెవరితోటీ?”
“నాకు విడిగా చేస్తారమ్మా! ” జవాబిచ్చింది లక్ష్మి.
“పెద్దదానివి, నిన్నొక్కదాన్నీ ఇలా వదిలేసి వెళ్ళిపోవటమేంటి? వంటరితనం ఎంత భయంకరంగా వుంటుందో నాకు తెలుసు. పగలంతా టీవీ చూస్తాను. ఇంట్లో అమ్మా, నాన్నా తిరుగుతుంటారు. లిఫ్టు పైకీ కిందకీ తిరుగుతున్న చప్పుళ్లౌతాయి. రాత్రైందంటే అవన్నీ ఆగిపోతాయి. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశబ్దం చుట్టూ పరుచుకుంటూ వుంటుంది. అది క్రమంగా చిక్కబడుతూ వుంటే చాలా భయంగా అనిపిస్తుంది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తుంటాను” అంది వీణ.
లక్ష్మికి అనుభవమే. పసిపిల్ల, దీనికేమిటీ ఖర్మ అనిపించింది.
“అమ్మ పడుక్కోదే, నీ దగ్గర?” అడిగింది.
“ఆవిడ గురక పెడుతుంది, నేను టీవీ పెడతాను. ఇద్దరికీ సరిపడదు” ఠపీమని అంది. లక్ష్మి నవ్వింది.
“పోనీ, ఇక్కడుండిపో. నా పక్కని పడుక్కుందువుగాని. ఇద్దరం మాట్లాడుకోవచ్చు” అంది ప్రేమగా. ముందు సంధ్య గుర్తొచ్చింది. తర్వాత మహతి గుర్తొచ్చింది. ఇప్పుడీ వీణ. అక్కడ మహీ తండ్రి నారాయణకూడా అలానే అవస్థపడుతున్నాడేమో, నిర్మల పోయాక. పెద్దతనంలో పలికే మనిషి లేకపోవడం దుర్భరమైన విషయం. ఇంత చిన్నవయసులో దాన్ని దుర్భరం అనడం చాలా చిన్నవిషయం.
“గీత వూరుకుంటుందా, నేనిక్కడుంటే?” అడిగింది వీణ.
“అదెందుకు వద్దంటుందమ్మా? చాలా మంచిపిల్ల. ఎవరికి కష్టం వచ్చినా అదే ముందుంటుంది”
“ఉ<హు< నువ్వే చెప్పాలి, ఆవిడ గొప్పతనం”
“నిన్నేమైనా అందా?”’
“నేను దానికి పనికిరానులే”
“అలా అందా?”
“అనదు. చూపిస్తుంది”
“ఏమైందే?”
“నాతో మాట్లాడదు. బావే నయం. కాస్త మొహం చూసి నవ్వుతాడు. తనేనా నీతోటీ అక్కతోటీ మాట్లాడినట్టు నాతో ఎందుకు మాట్లాడడు?” అంది.
“మీ అమ్మ దాన్నేదో అందట, ఆ కోపం వుందేమో! నువ్వు మాట్లాడు” అంది లక్ష్మి. వాసుని గురించిన ప్రశ్నకి జవాబు చెప్పలేదు.
“ఉ<హు<“
రోజులు గడుస్తున్నకొద్దీ సమస్యలు మొదలయ్యాయి. వాసు ఏదో కావలిసి మధ్యాహ్నం ఆఫీసునుంచీ వచ్చాడు. గదిలోకి వెళ్లబోతూ గీత చీర కట్టుకుని మంచంమీద పడుక్కునున్న వీణని చూసి, గీతనుకుని దగ్గరకి వెళ్ళాడు. వీణని చూడగానే తెల్లబోయాడు.
“ఇక్కడ పడుక్కున్నావేమ్మా? అత్త దగ్గిరకి వెళ్ళు” అన్నాడు, వాళ్లమ్మ ఆపాదించిన బావ కేరక్టర్ గుర్తురావటంతో కలిగిన చిరాకు అణుచుకుని. అతని మాటల్లో స్వల్పంగా కాఠిన్యం ధ్వనించింది.
“టీవీ చూస్తుంటే నిద్రొచ్చింది. పడుక్కున్నాను. అదంత తప్పా?” చిన్నబుచ్చుకుని లేచి వెళ్లిపోయింది. రెండురోజులు అలక. అతను పట్టించుకోలేదు. పంతం. అదీ పట్టించుకోలేదు వాసు. తనే తగ్గింది. భావరాహిత్యంలోంచీ యివతలికి వస్తోందామె. తన యిల్లు నచ్చట్లేదు. అక్కడి స్తబ్దత, గుహలాంటి తనగదీ, అమ్మానాన్నలూ ఏదీ నచ్చట్లేదు. ఇక్కడుండే చైతన్యంలో తనకి భాగం కావాలన్న బలమైన కోరిక ఆమెని నిలవనివ్వట్లేదు.
వయసులో వున్న భార్యాభర్తలెవరినీ పెద్ద దగ్గరగా చూడలేదు వీణ. అవంతీపురం యిళ్ళలోవాళ్లకి పూర్తి దూరం. వాసూ గీతలని గురించి ఇదివరకు వింది. ఇప్పుడు చూస్తోంది. ముఖ్యంగా వాసు. అతనికి ఉద్యోగం చేస్తున్న కొడుకున్నట్టో, వయసులో తనకన్నా బాగా పెద్దవాడన్నట్టో అనిపించలేదు. పదేళ్లలో అతనిలో పెద్దగా మార్పుకూడా లేదు. జుత్తు పండిపోవడం, బాల్‍హెడ్, లావెక్కడంలాంటివేం లేవు. వాటిల్లో ఒక్కటేనా వాసుకి వుండివుంటే ఆమె దృక్పథం మరోలా వుండేది. కావచ్చు. అప్పటి రూపానికి యిప్పుడు కొనసాగింపులా వున్నాడు. చాలా సమస్యలకి మొదటికారణం బాహ్యరూపం చేసే ఆకర్షణ. గీతతో వున్న స్పర్థముందు అతను మాట్లాడిన కొద్దిమాటలూ ఫ్రెండ్లీగా అనిపించాయి. ఆ పిల్ల గీతతో చనువుగా మాట్లాడి వున్నా మరోలా వుండేది. ఆమెని పక్కకి పెట్టేసి వాసు చుట్టూ తిరుగుతోంది.
గీత పిల్లల చదువులు చూసుకుంటుంటే అతను కంప్యూటర్లో పని చేసుకుంటాడు. తీసిన ఫోటోలని క్రాప్ చెయ్యడం, విడగొట్టడం, కలపడం, ఎఫెక్ట్స్ చేర్చడం, కెమేరాతో పనిచేసిన అతనికి కంప్యూటర్లో చెయ్యడం చాలా సరదాగా అనిపిస్తుంది. అలాగే ఆఫీసు వర్కు. మూస వుత్తరాలు. కార్బన్లు పెట్టి రెండేసి, మూడేసి కాపీలు రాసేవాళ్ళు. అవన్నీ ప్రొఫార్మాలుగా మారిపోయాయి కంప్యూటర్లో. పని చాలా తగ్గింది. రెండేసి మూడేసి బ్రాంచిలు కలిపేసి యితనికి యిస్తారు. కాదనడు. సీఆఫ్‍లు ఇస్తారు. చక్కగా తీసుకుంటాడు. గీతదీ ఆఫీసులో అదే పరిస్థితి. వీణ రాకముందు అతనికి యింట్లో వుండటం సరదాగా వుండేది. అతనితోపాటు గీతకూడా వుండిపోయేది. ఇప్పుడది మారిపోయింది.
అతిథిని అతిథిగా ఎంతోకాలం భరించలేరు. వీణ చిరాకుపుట్టిస్తోంది వాసుకీ, గీతకీ.
ఇంట్లో వస్తువులకి కదలికలు వస్తున్నాయి. సర్దుతున్నట్టూ, తిరిగి పెడుతున్నట్టూ అర్థమౌతోంది గీతకి. ఏం చూస్తోందో తెలీడం లేదు. పక్క పొద్దున్నా, సాయంత్రం మార్చుకుంటోంది. పర్సనల్ ఆల్బంస్ లోపల పెట్టేసింది. ఒకటేదో కనిపించలేదు. వెతికింది. వాసుని అడుగుదామనుకుని వేరే హడావిడిలో మర్చిపోయింది. కొన్ని చీరలు మళ్ళీ తిరిగిరాలేదు. వాసుకూడా అతను గమనించేవి అతనూ గమనించాడు. కంప్యూటర్లో ఏం చూస్తోందోగానీ, హిస్టరీ తీసేస్తోంది వీణ. అతను పద్ధతిగా పెట్టుకున్న సీడీలన్నీ కలగాపులగమౌతున్నాయి. ఆమె అనుకున్నంత అమాయకంగా లేదని యిద్దరికీ అర్థమైంది. వాళ్ళు గ్రహించినంత సూక్ష్మంగా లక్ష్మి గ్రహించలేకపోయింది. ఆమెదగ్గిర ముద్దుకబుర్లు చెప్తుంది.
గీత పిల్లల చదువు చూసుకుంటోంది. వాసు కంప్యూటర్లో పని చేసుకుంటుంటే వెనక వెళ్ళి నిలబడి, భుజాలమీద చేతులు వేసింది వీణ. ఆమె ఛాతీ అతనికి వెనక తగులుతోంది. చెంపకి చెంప తగులుతోంది. చివాల్న కుర్చీ పక్కకి తోసి లేచి నిలబడ్డాడు. కావాలని చేస్తోందా? ఏం కావాలని? తెలీక చేస్తోందా? తెలీక చెయ్యడానికి పసిపిల్ల కాదు. అన్నీ అనుభవించినది. గ్రహించినట్టు తను బయటపడితే ఓపెనప్ ఐపోతుంది.
“వీణా! ఏంటమ్మా, ఇది? చిన్నపిల్లవి కాదు. దూరంగా వుండాలి. ఎవరేనా ముట్టుకుంటే నాకు నచ్చదు” అన్నాడు.
“అక్కకూడానా?” కవ్వింపుగా అడిగింది.
“అక్కేనా అంతే. అందరూ తిరిగేచోట హుందాగానే వుండాలి” జవాబిచ్చి మరోమాటకి ఆస్కారం లేకుండా అక్కడినుంచీ వెళ్ళిపోయాడు. నేను హుందాగా లేనా అని గింజుకుంది ఆ మాటలకి. కోపంగా వాళ్లింటికి వెళ్లిపోయింది.
“అమ్మా! వీణ వూరికే మనింటికి ఎందుకొస్తోంది? వద్దని చెప్పు. ఇదివరకూ లేని చుట్టరికాలు కొత్తగా ఇప్పుడెందుకు?” అన్నాడు వాసు తల్లితో.
“రావద్దని ఎలా చెప్తానురా? వస్తే నీకొచ్చిన కష్టమేంటి? ఇక్కడికి రావడం మొదలుపెట్టాక దిగులు మర్చిపోయి తిరుగుతోందని మామయ్య ఎంతో సంతోషంగా చెప్పాడు. మీ గదిలోకి వెళ్తోందనేనా? చిన్నది, ఇలాంటివేవీ చూడలేదు. వింతగా అనిపించి వెళ్తోన్నట్టుంది. వద్దని చెప్తాలే” అంది లక్ష్మి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థవలేదతనికి. తనకన్నా పదిహేనేళ్ళ చిన్నపిల్లకి యిలాంటి ఆలోచనలున్నాయని చెప్తే లేనివి ఆపాదిస్తున్నాడని తననే తప్పుపడతారు.
అతను చెప్పినట్టు తెలీక గీతకూడా అంది.
“నీకు బాగా కళ్ళు నెత్తికెక్కాయి! సంధ్య పనికిరాదు. పదేళ్ళపాటు మాట్లాడటం మానేసి సాధించిన సుమతి పనికొస్తుంది. యాయవారం బ్రాహ్మల పిల్లలనీ, వంటవాళ్ళ పిల్లలనీ తీసుకొచ్చి వొళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మా అని పిలిపించుకుంటున్నావు, ఇదొస్తే నచ్చట్లేదా మీకిద్దరికీ? నీకు నచ్చిందైతేనే చెయ్యాలి, నచ్చకపోతే చెయ్యకూడదా? లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా? దాన్ని ముట్టుకుంటేనే అపవిత్రమైపోతానని భయపడుతున్నావా? పెళ్లవకుండానే రాణాతో తిరిగిన యమున పనికొచ్చిందేం?ఇల్లు నాదికూడా గీతా! నాయింటికి అదొస్తే నువ్వెవరే, వద్దనడానికి? అదీ నా మేనకోడలే. నువ్వు అన్నకూతురివైతే, అది తమ్ముడి కూతురు. దాని ఖర్మకాలి ఇలా మనిల్లు పట్టుకుని వేలాడుతోంది. లేకపోతే నీలానే అదీ రాణివాసమేలేది” కోపంగా అంది లక్ష్మి.
“ఇప్పుడు నేనేమన్నానని అంత చదివావు? దాని పద్ధతేమిటో నచ్చట్లేదు నాకూ వాసుకీ కూడా. ఏ సమస్యలు వస్తాయోనని వద్దన్నాను” అంది గీత. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
“కొన్నాళ్ళు ఎటేనా తిరిగొద్దాం గీతా!” అన్నాడు వాసు విసుగ్గా.
“ఎక్కడికి? ఎన్నాళ్ళు? ఈవిడ్ని ఈ తింగరిదానికి వదిలేసి వెళ్దామా? కొత్తచుట్టాలు చూసుకుంటారా? నాలుగు చీరలు కట్టుకెళ్లింది. ఇంకేం పట్టుకెళ్తోందో తెలీదు. అన్నిటినీ కదిలించేస్తోంది. మనిల్లో మ్యూజియంలా కనిపిస్తున్నట్టుంది. మనం తిరిగొచ్చేసరికి ఇంటికో తాడు కట్టి వాళ్ళింటి దగ్గిరకి లాక్కెళ్తుందేమో!” అంతకంటే విసుగ్గా అంది గీత. వాళ్ల ఆలోచనలు అంతకంటే లోతుకి సాగలేదు.
రోజులు ముందుకి సాగుతున్నాయి. వీణతో చాలా అనుభవాలౌతున్నాయి లక్ష్మికి. పచ్చిగా మాట్లాడేస్తుంది.
“మామయ్య నిన్నెందుకు వదిలేసాడు? మహీ ఒక్కర్తీ అలా ఎలా వుంటోంది? మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? గీతది ఏం వుద్యోగం? చేసే గుమస్తా వుద్యోగానికి జరీచీరలూ, హంగు ఆర్భాటాలు దేనికి? వీళ్ళు బాగా సంపాదించారట? లంచాలు తింటారా?”రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. లక్ష్మి చాలా యిరుకునపడుతుంది. ఇదేమిటీ పిల్ల, ఇలా అడిగేస్తోందని తెల్లబోతోంది. కొన్నిటికి చెప్తుంది, యింకొన్ని అర్థం కానట్టు వదిలేస్తుంది. శేఖర్ కుటుంబం ఈ పిల్లద్వారా పరిచయమౌతున్నట్టుంది.
“జరిగేవి జరుగుతుంటాయి వీణా! అలా ప్రతీదీ అడిగేసి తెలుసుకోరు. ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్లవి. మరొకళ్లతో చర్చించరు. ఎంత కుతూహలం వున్నా ఆపుకోవాలి. అడిగెయ్యడం సభ్యతకాదు. నువ్వు నన్నడిగిన ప్రశ్న వాసు వింటే వూరుకోడు. వాడికి చాలా కోపమొస్తుంది. మామయ్య మమ్మల్ని వదిలేసారని ఎవరుచెప్పారు నీకు? మీయింట్లో అలా అనుకునేవారా? అదేం లేదు. ఆయన భక్తిలో పడ్డారు. పిల్లలూ సంసారం వదిలేసి నేను తనదార్లో వెళ్లలేకపోయాను. ఇద్దరం విడివిడిగా సంతోషంగా వుండేవాళ్లం” అంది లక్ష్మి.
“మరి మహీ?”
“దాని విషయం నేనెలా చెప్తాను? ఎప్పుడేనా కలిస్తే నువ్వే అడిగి తెలుసుకో”
“గీతంటే నీకు యిష్టమా?”
“ఇష్టానిదేముందే? అది నా కోడలు”
“చిన్నప్పుడు?”
“అదొక్కర్తనే కాదు, మీ అందరన్నా యిష్టమే.
“వీళ్ళిద్దరూ ఎప్పుడూ యింతేనా? ప్రపంచంలో మరొకరు లేనట్టుంటారు? ఏం మాట్లాడుకుంటారు? నేను ఎంతగా వెంట తిరిగినా బావ నాతో మాట్లాడడు” అంది ఫిర్యాదుగా. వాసు మాట్లాడడని చెప్పడం ఇదెన్నోసారో. ఏం మాట్లాడతాడు పనిగట్టుకుని? వాడిదేమైనా చిన్నవయసా?
“భార్యాభర్తలమధ్య అనేకం వుంటాయి. వాళ్లకో సంసారం, పిల్లలూ, బాధ్యతలూ వున్నాయి. బావెందుకు? అక్క వుందికదా?”
“మామూలు చదువు, వుద్యోగం. ఆస్తి లేదు, అందం లేదు. ఏం చూసి చేసుకున్నారు దాన్ని? రాణివాసం యేలుతోంది. నాకు అన్నీ వున్నా యీరోజుకి యిలా వున్నాను. చాలా విషయాలకి నాకు జవాబులు దొరకవు. అదృష్టం, తలరాత అని ఏవేవో అంటారు. అవి నాకే ఎందుకు వికటించాలి? అందరూ బావుండి నేనొక్కదాన్నే ఎందుకిలా వుండాలి? ఎంతకాలం యిలా? ఏం చేస్తూ బతకాలి? చచ్చిపోవాలనికూడా అనిపించదు. ఇంట్లో ఎండ్రిన్ బాటిల్ ఎదురుగా పెట్టి, చావు, చావనేది అమ్మమ్మ. ఎందుకు చావాలి నేను? నా తప్పేం వుందని చావాలి? జవాబులు ఎవరేనా చెప్తే వినేసి చచ్చిపోతాను” అంది.
“అలాంటి మాటలు మాట్లాడకూడదు వీణా! ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకోవాలి. మరొకర్ని అడిగితే మళ్ళీ నీమీది అధికారం వాళ్లకి యిచ్చినట్టే. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెప్తే గీత తను చెయ్యగల సాయం చేస్తుంది” అంది లక్ష్మి.
“నాకు ఏమీ చెయ్యాలని లేదు. సంతోషంగా బతకాలనుంది”
లక్ష్మి నవ్వింది. “అలాగే బతుకు. ఎవరొద్దన్నారు?”
“దానికేనా ఒక దారంటూ దొరకాలికదా? వెతుక్కుంటున్నాను” అంది సాలోచనగా. నిగూఢమైన మాటలవి. ఆ సంభాషణ తర్వాత మరికొన్ని రోజులు గడిచాయి. ఆఫీసునుంచీ ఇంటికి రావడానికి ఒక్కోసారి గీతకీ వాసుకీ కొంచెం ముందువెనకలౌతోంది. వాసు ముందు వచ్చేసాడు. గీత వచ్చేసరికి టీ చేద్దామనుకుంటుంటే వీణ వచ్చింది.
“నేను చేస్తాను. నువ్వు లే” అంది. అతను వెళ్లబోతుంటే చప్పుని చెయ్యిపట్టుకుని ఆపింది.
“గీత చేస్తుంటే వెనక నిలబడి, మీద చేతులేసి చేయిస్తుంటావు, నేను రాగానే వెళ్లిపోతున్నావేం” అడిగింది. అతని ముఖం ఎర్రబడింది. చెయ్యి విడిపించుకుని వెళ్లబోయాడు.
“నేనేం నిన్ను బెడ్‍రూమ్‍లోకి రమ్మనట్లేదు. ఐ హావ్ హేడ్ ఇనఫ్ ఆఫ్ ఇట్. నీకు కావాలంటే దానిక్కూడా సిద్ధమే. కానీ యిలాంటి చిన్నచిన్న సరదాలు ఒక్కటికూడా తీరలేదు. ఇలాకూడా బతుకుతారని మిమ్మల్ని చూసాకే తెలిసింది. ఒక్క హగ్, ఒక్క కిస్ ఇవ్వచ్చుకదా? దగ్గిరకి తీసుకుని మాట్లాడచ్చుకదా? అక్కకి కోపం వస్తుందని భయమా? అది చూడకుండా. పోనీ మాయింట్లో. నేనేం చేసినా ఎలా వున్నా అక్కడెవరూ అడగరు” అంది.
“వీణా! తప్పుకదమ్మా, ఇలా మాట్లాడటం? పెళ్ళి చేసుకుంటావా? ఎవరేనా ముందుకొస్తారేమో ప్రయత్నిద్దామా?” అన్నాడు.
“బ్లఫ్ చేయకు. ఎవ్వరూ ముందుకి రారు. నాకు తెలుసు. మరోసారి ముక్కూమొహం తెలీనివాడిని చేసుకునే రిస్కు నేను తీసుకోలేను. నువ్వు చేసుకో. ఇక్కడే వుండిపోతాను” అతన్ని గట్టిగా వాటేసుకుంది. అతని సౌమ్యత ఎగిరిపోయింది.
“దూరంగా వుండి నీ పని నువ్వు చేసుకో. నేను విదిలించానంటే ఎక్కడో వెళ్లి పడతావు” కఠినంగా అన్నాడు.
అతనొచ్చిన కాసేపటికి వచ్చిన గీత కాళ్ళూచేతులూ కడుక్కుని వచ్చేసరికి కనిపించిన దృశ్యం యిది. మనసులో లీలగా కదుల్తున్న అనుమానం రూపుకట్టి కనిపించింది. వీళ్ల మాటలకి లక్ష్మికూడా వచ్చేసింది. తెల్లబోయి చూస్తూ నిలబడింది.
“వీణా! బావేం చెప్తున్నాడు? అతన్నొదిలేసి దూరంగా నిలబడు. నీకన్నా ఎంత పెద్దే అతను? ఇదేనా, మీ అమ్మ పెంపకం? నడు, మీయింట్లో వదిలేసి వస్తాను. ఇంకోసారి యిటొచ్చావంటే కాళ్ళువిరగ్గొడతాను” అంది గీత, వాసుకంటే కఠినంగా. ఆమె గొంతులోని కమాండ్‍కి దూరం జరిగి నిలబడింది వీణ.
“నేను వెళ్లగలను” అంది విసురుగా.
“వచ్చినదానివి వెళ్లలేవని ఎందుకనుకుంటాను? మీ అమ్మకి నిన్నప్పజెప్పాలి” అంది గీత.
“బావా! కారు కీ యివ్వు” అంటే అతను తెచ్చిచ్చాడు.
“నేను తీసుకెళ్తానే” అంది లక్ష్మి తేరుకుని.
“ఎందుకు? నీ మరదలిచేత తలంటించుకునే కార్యక్రమం తప్పిపోతుందనా? నేను వెళ్తాను” అంటూ వీణ రెండుచేతులనీ మణికట్లదగ్గిర కలిపి పట్టుకుని చిన్నపిల్లల్ని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి కార్లో కూలేసి, స్టార్ట్ చేసింది.
“ఇద్దరం కలిసి చద్దాం” కొంచెం స్పీడు అందుకున్నాక స్టీరింగ్‍మీద చెయ్యి చెయ్యబోయింది వీణ బుసలు కొడుతూ. చేతిమీద టప్‍మని ఒక్కటి కొట్టి, కారు పక్కకి ఆపింది గీత. ఆమె కొట్టినచోట ఎర్రబడింది చూసుకుంటూ వుండిపోయింది వీణ.
“చూడు, నాగురించి నీకు తెలీదు. మీ యింటికెళ్ళేదాకా బుద్ధిగా కూర్చో. లేకపోతే నాలుగంటించి, నడిపించి తీసుకెళ్తాను” అంది.
“ఐ విల్ సీ యువర్ ఎండ్”
“అలాగే చూద్దువుగానిలే” అని, మళ్ళీ స్టార్ట్‌చేసింది గీత. మరో పావుగంట పట్టింది యిల్లు చేరడానికి. బెల్ నొక్కితే శేఖర్ తలుపు తీసాడు. గీతని ఆశ్చర్యంగా చూసి, “రామ్మా! వాసు రాలేదా?” అడిగాడు దారిస్తూ.
“నేను చూట్టపుచూపుగా రాలేదు బాబాయ్. ఇది మాయింట్లో ఏం చేసిందో అడుగు. ఇంకోసారి పంపద్దు. మర్యాదగా వుండదు” అంది. తండ్రి స్థాయిలో వున్న ఆయన్ని చూడగానే అప్పటిదాకా ఆపుకున్న దు:ఖం ఒక్కసారి ముంచెత్తింది. గిర్రుని వెనక్కి తిరిగి వచ్చేసింది. బలవంతంగా ఆపుకుని కారుదగ్గిరకి వచ్చేసరికి వాసు బైకు ఆపుచేసుకుని ఎదురుచూస్తున్నాడు. ఇద్దరూ ఎవరి వాహనంమీద వాళ్ళు యిల్లు చేరారు. కోపం, దు:ఖం ఆపుకోవడం ఇక ఆమెవల్ల కాలేదు. విసురుగా లోపలికి వెళ్ళింది. వెనకే వస్తున్న వాసుమీద పెద్దగా అరిచేసింది.
“రేపట్నుంచీ తలకి తెల్లరంగేసుకుని తిరుగు. నీదగ్గిర బోల్డన్ని డబ్బులున్నాయికదా, ఒక మేకప్‍మేన్ని పెట్టుకుని మేకప్ చేయించుకో” అంది. చేతికందినవన్నీ అతనిమీదికి విసిరేసింది. రెండుచేతుల్లో ముఖం దాచుకుని నిలుచున్నచోటే కూలబడిపోయింది.
“గీతూ! దీనికిలాంటి ఆలోచనలున్నాయని నాకు తెలీలేదే! తప్పంతా నాదే. నువ్వూ వాసూ చెప్పినా అర్థం చేసుకోలేదు. ఇంకెప్పుడూ నీమాట కాదనను. నువ్వు చెప్పినట్టే వింటాను” లక్ష్మి దగ్గిరకి తీసుకుంది. ఆవిడకీ ఏడుపొచ్చేసింది.
“గీతా! ఏంటిది? పరిస్థితిని చాలా హుందాగా హేండిల్ చేసావు. దేనికా ఏడుపు?” అడిగాడు వాసు.
“శేఖర్‍కి ఫోన్ చేసి, నాలుగూ కడిగేస్తాను” లక్ష్మి కోపంగా లేచింది.
“ఉండమ్మా! వాళ్లని ముందు మాట్లాడనీ” ఆపాడు వాసు.
అతనలా అంటునే వున్నాడు, శేఖర్‍దగ్గిర్నుంచీ లేండులైన్‍ మోగింది.
“ఏమైంది లక్ష్మీ? సంతోషంగా కనిపిస్తోందని మీయింటికి పంపిస్తున్నాం. ఏం జరిగింది అక్కడ?” అని అతను అంటుంటే, లీల ఫోనందుకుంది.
“మిమ్మల్ని నమ్మి పిల్లని పంపించినందుకు గొప్ప మర్యాద చేసి పంపించారు. సరదాపడి గీత చీర కట్టుకుని తిరిగితే మీదమీద పడ్డాడట నీ కొడుకు. ఎలాగా చెడిపోయిన పిల్లేకదా అనుకున్నాడా? నడిరోడ్డుమీద ఆడపిల్లకోసం కొట్టుకున్న సజ్జు, అవంతీపురం సజ్జు. వయసులు పెరిగినా బుద్ధులెక్కడికి పోతాయి? వాడిని వెనకేసుకుని మాయింటిమీదికి వచ్చింది నీ కోడలు” మాటలు వడగళ్లవానలా కురిసాయి. లక్ష్మి పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేసింది. మళ్ళీ మోగితే ఎత్తలేదు.
“ఇదేమిటే, ఇలా దెబ్బలాడుతోంది లీల?” అంది తెల్లబోయి.
వాసు మనసులో అస్థిమితంగా ఏవో ఆలోచనలు కదుల్తున్నాయి. ఇదంతా యిక్కడితో ఆగుతుందనిపించలేదు. గీత వీణ రెండుచేతులూ పట్టుకుని లాక్కెళ్లడం గుర్తొచ్చింది. దాని ఫోను? మిస్డ్ కాల్ యిస్తే లక్ష్మి గదిలో మోగింది. తీసుకుని గదిలోకి వెళ్లిపోయాడు. గీత తనని తను కూడదీసుకుని అతనివెంట వెళ్లింది.
“రవి బాబాయ్‍తో మాట్లాడదాం వాసూ!” అంది.
“ఏం మాట్లాడతాం గీతా? ఎంత అసహ్యంగా వుందో తెలుసా, నాకు? దాని వయసెంత? నా వయసెంత? పల్లవీవాళ్లలాంటిదేకదా? జోక్స్‌కూడా వేసుకునేవాళ్లం ముగ్గురిగురించీ. అసలు యిలాంటి ఆలోచనలు ఎందుకొచ్చాయి దానికి? వాళ్లమ్మ నేర్పి పంపిందా? వీణని యింట్లోకి తీసుకురావద్దందట వాళ్ళ అమ్మమ్మ. అలా చెయ్యలేక ఈ పద్ధతిలో వదిలించుకుందామనుకున్నారా వాళ్ళు? నాకేం అర్థం కావట్లేదు” అన్నాడు చిరాగ్గా.
“ఎవరో ఒకరికి తెలియాలి బావా! వాళ్ల వెర్షన్ వాళ్ళు చెప్పేలోగా, మనం కొంచెమైనా చెప్పాలి. వీళ్ళొకళ్ళు. అందరూ ఒక్కసారి కట్టకట్టుకుని యూయస్ వెళ్లిపోతున్నారు. అవసరానికి ఒక్కరూ వుండట్లేదు. ఇంక వీళ్ళ పిక్నిక్ టైమ్ ఐపోయిందని చెప్పాలి” అంటూ టైమ్ చూసుకుని, రవికి చేసింది. క్లుప్తంగా విషయం చెప్పి,
“మాయింటినీ, మాయిద్దర్నీ చూసాక దాని మనసుకేమైనా అనిపించిందేమో బాబాయ్! మమ్మల్ని దగ్గిరకి రానివ్వరని మేం పట్టించుకోలేదు. ఇంతదాకా వచ్చాక వదిలేస్తే ఒక్క హగ్, ఒక్క కిస్ అని ఎవరి వెంటపడుతుందో తెలీదు. డబ్బు చాలానే వుందట, ఎవరేనా ముందుకొచ్చి చేసుకుంటారేమో చూడండి” అంది. దు:ఖం ఆపుకోలేక ఏడ్చేసింది.
“గీతా! ఏడవడం దేనికమ్మా? ఏం జరగలేదుకదా? వాసు మంచివాడు. నేను శేఖర్తో మాట్లాడతాను” అన్నాడు రవి. అతనికి జరిగింది నమ్మశక్యంగా అనిపించట్లేదు. వీణని తీసుకురావడానికి శేఖర్ వెంట అతనూ వెళ్ళాడు. కుటుంబంలో అలాంటివి కొత్త. ఎవరెవరు వీణ వెనక వున్నారో తెలీదు. రిస్కెందుకుని పల్లవికి పెళ్ళిచేసి పంపించేసాడు. అర్చననికూడా యిక్కడుంచలేదు. ఇదంతా జరుగుతున్న సమయానికి వాళ్ళు యిల్లమ్మేసి, ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. మధ్యలో ఒకసారి వసంత్ యింట్లో కనిపించినా మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ యిలా బైటికొచ్చారు.
“బాబాయ్! ఈ గొడవ నాన్నకి తెలియనివ్వద్దు. బీపీ పెరిగిపోతుంది. ఆయన్ని కంట్రోల్ చెయ్యడం కృష్ణకి కష్టమౌతుంది” అని హెచ్చరించి, ఫోన్ పెట్టేసింది.
అతను శేఖర్‍కి చేసాడు.
“గీత నాతో మాట్లాడింది. ఇప్పటిదాకా మనింట్లో ఆడపిల్లలు చాలా పద్ధతిగా, ఒకరిచేత వేలెత్తి చూపించుకోకుండా పెరిగారు. గీత ఎవర్రా? అన్నకూతురు నీకూతురు కాదా? వాసుకి రాముకి వున్నంత గౌరవం వుంది మనింట్లో. ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమౌతోందా? వీణని యింట్లోంచీ కదలనివ్వద్దు. సంబంధాలు వెతుకుదాం. ఎవరో ఒకరు దొరక్కపోరు. దొరక్కపోతే కర్మనుకుని వూరుకోవాలి. సంధ్య బతకట్లేదా, మహీ లేదా? ఎవరింటిమీద పడితే ఎవరూ వూరుకోరు” అని కడిగేసాడు.
అతను చెప్పింది శేఖర్‍ద్వారా విని, తెల్లబోయింది లీల.
“ఏమే, నిజమా? నీకిలాంటి బుద్ధులెందుకు పుట్టాయి వీణా? మనింటా వంటా లేవు. నీ పరిస్థితికి నువ్వే తగ్గి వుండాలి. అసూయలూ, కోపాలూ, ద్వేషాలు ఎన్నో వుంటాయి. అంతమాత్రాన గీత మా కూతురు కాకుండా పోతుందా? ఎంత మూర్ఖుడైనా వాసు మనింటి అల్లుడు కాదా? గతంలో జరిగినవన్నీ మర్చిపోయి, కలిసిపోదామనేకదా, మేం లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళింది? అక్కడ వుండేదికూడా గీత. పెద్దనాన్న కూతురు. మిగతాకోడళ్లంతా పైవాళ్ళు. దగ్గిరకి రానివ్వరని భయపడ్డాం. వాసు మగవాడు. మీదమీదపడితే ఎందుకు వూరుకుంటాడు? ఏ ఫామ్‍హౌసుకేనా రమ్మని మరోసారి పాడుచేస్తే ఏం చేస్తావే, తెలివితక్కువదానా? వాళ్ళిల్లే వుంటుంది లంకంత. అక్కడే చెయ్యచ్చు, ఏదేనా చెయ్యాలనుకుంటే” తిట్టింది లీల. తిడుతునే వుంది.
భగవంతుడా, ఈ ఖర్మేమిటి నాకని ఏడ్చింది.
అంతా విని, “నాన్నా! నాకు ఫోటోప్రింటరు కావాలి. కొని తెచ్చివ్వు. అందరికీ అన్ని విషయాలూ తెలుస్తాయి” అంది వీణ. ఆయన్ని నిలవనివ్వలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *