A Handbook For Paranormal Investigators by Shishir Kumar- Review by S Sridevi

రచయిత రాంచీలో జన్మించారు. జర్నలిజంలో మాస్టర్స్ చేసి హిందుస్థాన్ టైమ్స్, ద పయనీర్‍లాంటి ప్రముఖదినపత్రికలలో పనిచేసారు. ఐతే అతీంద్రియ శక్తులు, మంత్రతంత్రాలమీద కల ఆసక్తితో IMHS, USA నుంచి పారానార్మల్ సర్టిఫికేషన్ కోర్సు చేసారు. Team Pentacle అనే పారానార్మల్ పరిశోధనాసంస్థని స్థాపించి దానిలో చీఫ్ ఇన్వెస్టిగేటర్‍గా చేస్తున్నారు. ఈ సంస్థ, పారానర్మల్ పరిశోధనకి సంబంధించి భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైనది.
ప్రస్తుతపు పుస్తకాన్ని హే హౌస్ పబ్లిషర్స్ ఇండియా అనే సంస్థ ప్రచురించింది. వెల 270/- రూపాయలు. దీనిని ప్రచురణకర్తల ఔట్‍లెట్‍నుంచీ, అమెజాన్, ఫ్లిప్‍కార్ట్‌లనుంచీ పొందవచ్చు.
మనిషి చనిపోయాక ఏం జరుగుతుందనేది సైన్స్‌కి అందని ప్రశ్న. వివిధమూలకాల సమ్మేళనమైన భౌతికశరీరం మరణం తర్వాత నశించిపోతుంది. మనసు, చేతన(కాన్షియస్‍నెస్)తో కూడిన ఈథరల్ శరీరం కూడా దాదాపుగా సృష్టిలో కలిసిపోతుంది. దాన్నే ఆత్మ లేదా దయ్యం అని వ్యవహరిస్తారు. చాలా అరుదుగా కొన్ని ప్రత్యేకమైన కారణాలచేత కొందరి ఆత్మ ఇంకా మనమధ్యనే వుండిపోతూ తన వునికిని గురించి కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికీ అతీంద్రియశక్తులనేవి మన జీవితంలో ఒక భాగమైపోయాయి. మనం నమ్మి ఆచరించే సైన్సు మనిషి పంచేద్రియాలు ఇచ్చే సమాచారంమీద మాత్రమే ఆధారపడి వుంటుంది. దీనికి అతీతంగా వున్నదాన్ని సైన్సు వప్పుకోదు. ఇన్ట్యూషన్, అంత:కరణ, సిక్స్త్ సెన్స్ అనేవి తరచు మనకి అనుభవంలోకి వస్తుంటాయి. ఈ అనుభవాలని శాస్త్రీయంగా నిరూపించలేము. ఇందుకు రచయిత వివరణ యిస్తారు. ఒకప్పుడు మనుషులు ఎంత దూరాలైనా నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు వాహనాలు వచ్చాక నడక పరిధిని, నడిచే సామర్ధ్యాన్నీ తగ్గించుకున్నారు. అదేవిధంగా ఇంద్రియాలు ఇచ్చే సమాచారంమీద మాత్రమే ఆధారపడి, మనం అంత:కరణశక్తిని తగ్గించుకుంటున్నామంటారు.
పారానార్మల్ పరిశోధనగురించి పదిహేను విభాగాలుగా సహేతుకంగా ఈ పుస్తకంలో వివరించారు. ఆత్మలతో ఎలా వ్యవహరించాలి, అవి ఇచ్చే
సంకేతాలని శాస్త్రీయంగా గుర్తించగలిగే మార్గాలు, వాటికిగల పరికరాలు, పద్ధతులు వీటన్నిటినీ వివరిస్తూ అతీంద్రియశక్తులు, వాటికి సంబంధించిన పరిశోధనలలోని శాస్త్రీయతని తెలియచెప్పారు. రచయితలు, ఈ విషయంలో ఆసక్తి వున్నవారు చదవదగిన పుస్తకం.