ఆకుపచ్చ నేలకోసం by స్వరాజ్య పద్మజ కుందుర్తి

Review by S Sridevi

రచయిత చిన్నతనంలో అమ్మమ్మ, ఆవిడ అక్కగారు తమ అనుభవాలని చెప్తూ వుంటే జ్ఞాపకం వుంచుకుని, కొన్ని దశాబ్ధాల తరువాత, ఈ పుస్తకరూపంలో పాఠకులముందు వుంచారు. కథాకాలం నూటపది సంవత్సరాలక్రితం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినది డెబ్భైనాలుగు సంవత్సరాలక్రితం. అప్పటికీ ఇప్పటికీ నాలుగైదు తరాలు మారాయి. సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈమార్పుల వెనుక జరిగిన పోరాటాలూ, కృషీ చాలామందికి తెలీవు. అవన్నీ చరిత్రపాఠాలుగా మారిపోయాయి. చరిత్రకి పాఠశాల, కళాశాలల్లో ప్రాధాన్యత లేదు. సాహిత్యంద్వారా పరిచయం చెయ్యవలసిన అవసరం వుంది. ఆ అవసరాన్ని ఈ పుస్తకం కొంతవరకూ తీర్చుతుంది. ఇలాంటి పుస్తకాలు సమకాలీన రచయితలద్వారా ఇంకా రావలిసిన అవసరం వుంది.
భూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణిదీ వునికికోసం పోరాటం. మనిషి ఈ ప్రాథమికస్థాయినుంచీ ఎన్నో మెట్లు ఎక్కి, సమాజాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ సమాజంయొక్క వ్యవస్థీకృత రూపమే రాజ్యం, సామ్రాజ్యం లేదా ఇప్పటి పరిభాషలోని దేశం. దేశకాలపరిస్థితులనేవి మనిషియొక్క జీవనశైలిని శాసిస్తాయి. సువిశాలమైన భరతఖండం చిన్నాపెద్దా రాజ్యాల సమాహారంగా వుండేది. రాజ్యాల మధ్య తగవులు, యుద్ధాలు వున్నా, భూబాగం మొత్తమ్మీద కాశ్మీరునించీ కన్యాకుమారిదాకా, గాంధారంనుంచీ కామరూపదాకా జనజీవనంలో సారూప్యత వుండేది. రాజులు, ప్రజలు అందరూ ఒకే ధర్మానికి చెంది నవారు. బౌద్ధం, జైనం, శాక్తేయం, వైష్ణవం ఏదైనా వాటి మూలాలు హిందూధర్మంలోంచే.
భరతఖండంలోకి అడుగుపెట్టాలంటే అదొక్కటే సులువైన మార్గం కావటాన్న మన వాయవ్యసరిహద్దులు ఎప్పుడూ దండయాత్రలకి గురౌతూ వుండేవి. గ్రీకులు, స్కిథియన్లు, పార్థియన్ల దండయాత్రలు మనకు మొదట్నుంచీ వున్నవే. ముస్లిం దండయాత్రలు ఎనిమిదవ శతాబ్దంనుంచీ మొదలయాయని చెప్పుకోవచ్చు. ఇవి కొనసాగి, అప్పటికి 457సంవత్సరాలుగా పాలిస్తున్న తోమార్, చౌహాన్ రాజపుతృలని వోడించి ఘోరీ సామ్రాజ్యం, ఆ తర్వాత డిల్లీసుల్తనేట్ ఏర్పడటానికి దారితీసాయి. తరువాతి పరిణామంగా డిల్లీ మొఘలుల అధీనంలోకి వచ్చింది. ఈ క్రమంలో అవధ్, బెంగాల్, దక్కన్ మొదలైన ప్రాంతాలుకూడా ముస్లింల కిందికి వచ్చాయి. విజయనగరసామ్రాజ్యం బహమనీల చేతుల్లో పతనమైంది. మరొకవైపు వ్యాపారనిమిత్తం విదేశీకంపెనీలు మన దేశానికి రావటానికి అనుమతులు పొందాయి. ఆ తర్వాత భూభాగాలు సంపాదించుకుని పాలన మొదలుపెట్టాయి. వాటిలో అవి ఆధిపత్యపోరు చేసుకుని, చివరికి భరతఖండాన్ని బ్రిటిష్ రాణీ పాలనలోకి నెట్టాయి. ఈ పాలకులందరికీ భరతఖండం ఒక ట్రెజర్‍హౌస్. ప్రజలు ఆదాయవనరులు. డబ్బుకోసం, సౌఖ్యాలకోసం, విలాసాలకోసం ప్రజలని పీడించారు. పరాయిపాలనతో విసుగెత్తిన ప్రజలు స్వాతంత్ర్యంకోసం తపించి, వుద్యమాలు చేసి, చివరికి గాంధీగారి నేతృత్వంలో ఏకత్రితమయ్యారు.
ఈ రాజకీయపరిణామాలన్నీ ప్రజాజీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి. ప్రజల్లో నీతి, నిబద్ధతలు తగ్గాయి. మూఢాచారాలు పెరిగాయి. సాటిమనిషిని నిలువనీడలేకుండా చేసి పరుగులు పెట్టించే దుష్టత మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో, రూపెనగుంట్ల అనే గ్రామ కరణంగారి ఇంట్లో నూటపది సంవత్సరాలక్రితం పదేళ్ళ వారాతో జన్మించిన ఇద్దరు స్త్రీలు హనుమాయమ్మ, సత్యవతమ్మగారలు. ఒకరు కనపర్తివారింటా మరొకరు కొండావారింటా మెట్టిన బాల్యవితంతువులు. ఒకే పక్షి రెక్కల్లాగా జీవనభారాన్ని మోస్తూ బతికిన అక్కచెల్లెళ్ళు వాళ్ళిద్దరూ. తండ్రి వారి పరిస్థితిని దృష్టిలో వుంచుకుని, ఇద్దరికీ కొంత భూమిని రాసారు. ఇద్దరూ ఆడపిల్లలే కావటం, అదికూడా బాల్యవితంతువులు కావటంతో తప్పనిసరై, ఒక మగపిల్లవాడిని దత్తత తీసుకున్నారు. దత్తుడు అక్కలను ఆ భూమి అనుభవించనివ్వడు. ఉన్నదంతా తనకి యిచ్చేస్తే, ఇంత తిండి పెడతాననే పురుషాహంకారం. తండ్రి వారసత్వంగా వచ్చిన కరణీకాన్నికూడా బెదిరింపులకి వాడుకుంటాడు. బతకలేని పరిస్థితుల్లో వీరు స్వగ్రామం వదిలి బంధువుల యిల్లు చేరతారు. అక్కడ వీరి జీవితం మలుపు తిరుగుతుంది. స్వాతంత్ర్యోద్యమబాట పడతారు. ఒకవైపు స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొంటూనే తమ భూమికోసం మరో పోరాటం సాగిస్తూ వుంటారు. కొండా సత్యవతమ్మగారు మంచి వక్త. మహిళాసమావేశాలలో మాట్లాడుతూ వుంటారు. ఆమె జైలుకి కూడా వెళ్ళి వచ్చింది. ఈ రెండుపోరాటాలూ సాగుతూ వున్న క్రమంలో ఎన్నో పరిచయాలు, ఇంకెన్నో అనుభవాలు. పూర్తిగా సాంప్రదాయాన్ని వదల్లేనితనం, అలాగని అదే పట్టుకుని వేలాడితే బతుకు పరాధీనం కావటం తప్పదన్న తెలికిడి, విజ్ఞతతో వ్యవహరించి, అప్పటి కాలానికి చాలా అధునాతనంగా మూడనమ్మకాలని ఎదిరిస్తూ బతికారని చెప్పాలి.

ఒకసారి సమావేశంలో రాధ అనే పాప దొరుకుతుంది. ఆ పాపని తమతో తెచ్చుకుని అనుబంధం పెంచుకుంటారు సత్యవతమ్మగారు. ఐనా బాధ్యత విస్మరించరు. పాప గురించి విచారించి వివరాలు తెలుసుకుని వారింటికి చేరుస్తారు. చివరకు పాప ఆమెకోసం బెంగపడటంతో శాస్త్రోక్తంగా దత్తత తీసుకుంటారు. పాపకూడా స్వతంత్రపోరాటంలో వార్తలు చేరవెయ్యటంలాంటి పనులలో తోడ్పడుతుంది. తరువాతికాలంలో యోగ్యుడైన యువకుడిని తెచ్చి వివాహం చేస్తారుగానీ అతడు సంసారరథచోదనంలో అంత నిపుణుడు కాకపోవటాన్న ఆ కుటుంబబాధ్యతని తలకెత్తుకుంటారు. విజయవంతంగా దింపుకుంటారు. ఆ పాపే, రచయిత తల్లి.

గాంధీగారి అనుయాయులుగా దేశ స్వతంత్ర వుద్యమంలో పాలుపంచుకున్నారు. ఇటువంటివారు మన చరిత్రలో అసంఖ్యాకంగా వున్నారు. నట్లూబోల్టుల్లా. ఏ వుద్యమంలోనేనా అంతే. నట్లూబోల్టులూ లేకపోతే ఒక యంత్రం ఎలా నడవదో ఈ అసంఖ్యాకులు లేకపోతే వుద్యమమూ అంతే. కానీ వీరికి ఎలాంటి గుర్తింపూ వుండదు. చరిత్రపుటల్లో స్థానం వుండదు. ప్రభుత్వం మాత్రం వీరి సేవలని గుర్తించింది. స్వతంత్రపోరాటయోధులుగా గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా ఐదేసి ఎకరాల భూమిని ఇస్తే అది స్వాధీనం చేసుకోవటానికి కూడా అనేక కుట్రలు. వారు ఆశించినది సబబైనదికాబట్టి చివరికి న్యాయం జరిగింది. కథ సుఖాంతమైందని అనలేముగానీ ఒక ముగింపుకి వచ్చిందనుకోవాలి.
పరిగెడుతున్న మనిషిని ఒక్క క్షణం ఆపి, ఆలోచనని తట్టి లేపి వదిలేసేలాంటి పుస్తకం ఇది.