Kusinerla Nandu
నది దాటి అవతలి గట్టుకు చేరిన నీలకి ఒక వేప చెట్టు కనిపించింది. తరాలుగా పెరుగుతూ దిట్టంగా నిలబడిన కాండం. గుబురైన శాఖోపశాఖలతో కూడిన కొమ్మలతో ఆకుపచ్చని లోకంలాగా అగుపించింది. చెట్టుమొత్తం అన్ని కొమ్మలూ తిరిగి పరిశీలించి ఒక అనువైన కొమ్మని ఎంచుకున్నది. అక్కడ తన ముక్కుతోని అక్కడ ఒక గీత గీసింది. పైన ఒక కొమ్మ అటూ ఇటూ ఊగటం వల్ల గాలి వీస్తుంది. ఈ కొమ్మ పెద్దది కావటంతో గట్టిగా ఊగదు. కాబట్టి పిల్లలకి ఆ గాలి తగిలి , ఈ స్వల్ప కదలికకి హాయిగా నిదురపడుతుంది. అన్నది నీల ఆలోచన. ఇక పుల్లల కోసం బయలు దేరింది. ఇంత మంచి చెట్టు , అంత మంచి కొమ్మ మొదటిసారి పిల్లలపుడు దొరికిఉంటే ఎంత బాగుండేది అని ఆ రోజులని తలుచుకున్నది.
అపుడు తనకి తెలియక చలువదనం కోసం ఒక కానుగ చెట్టుని ఎంచుకున్నది. దాని కొమ్మలు స్థిరంగా ఉండక గట్టిగా గాలి వచ్చేసరికి గూడు ఊగిపోయి రెండు గుడ్లు తన కళ్ళ ముందు నుండే కిందపడి పగిలిపోయినయి. ఆ పచ్చెల నుండి “ఇంకా పూర్తిగా ఏర్పడని పొరలాంటి శరీరాలతో మట్టికి తగిలి కిచకిచ మంటూ సన్నని స్వరంతో ఆర్తనాదం పెడుతున్న ఆ చిట్టి ప్రాణాలని చూసి తల్లడిల్లిపోయింది తన మనసు. ఇంకా గాలి పెడుతూనే ఉంది. గూటిలో మిగిలిన గుడ్లు ఏమవుతాయో అన్న భయం , ఇక్కడ ఇంకా సరిగ్గా పుట్టని పసికందుల రోదన ఆ రెండింటి మద్యలో నలిగి పోయింది ఆ చిటికెడు గుండె. ఆ గూటికి , నేలకి మద్య ఎన్ని సార్లు తిరిగిందో తనకే తెలియదు. పుట్టి ఏడవవలసిన పచ్చి ప్రాణాలు తన మనసులో ఇంకిపోయిన ఆశలై ఇంకా కళ్ళముందే కనబడుతున్నాయి. గుర్తుకొచ్చినపుడల్లా నీల కళ్ళు జలపాతాలవుతూనే ఉంటాయి. అపుడపుడూ అనుకొని బాధపడుతుంటుంది “నేను రెక్కలు కుదురుకోగానే అమ్మని వదిలి ఏగిరి వచ్చేశాను. అదే ఆ సమయంలో నేను అమ్మ వద్దనే ఉన్నుంటే నాకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ చెప్పేది. కానీ ఏం చేస్తాం !” అని
దొరికిన పుల్లలని ఏరుకొచ్చి కొమ్మ మీద పేరుస్తూ సాయంత్రం వరకి అడుగు భాగాన్ని అల్లింది. మళ్ళీ పుల్లలని ఏరుకోడానికి వెళ్ళింది. వచ్చి చూసే సరికి చెట్టు చుట్టూ మందల కొద్దీ మేకలు కనబడినయ్. వెంటనే రెక్కలని రెట్టింపు వేగంతో ఊపింది. తను అక్కడికి చేరే సరికి దాదాపుగా పది మంది మనుషులు గొడ్డళ్ళతో చెట్టు పైకి ఎక్కి కొమ్మలని నరికేస్తున్నారు . కలపకోసం మంచి వాటంగా ఉన్న కొమ్మలని ఎంచుకొని గొడ్డలికి బలి చేస్తున్నారు. నీల అక్కడికి చేరే సరికే తను గూడు అల్లిన కొమ్మ విరిగి కొనలతో వేలాడుతూ కనిపించింది. తన గూడు ఎక్కడ పడిందా అని చూస్తుండగానే ఒకతను వేసిన ఒక వేటుతో ఆ కొమ్మ పూర్తిగా తెగి నేల మీద పడింది. నీల కి ఒక్క సారిగా తన ఎముకలు విరిగినంత బాధ కలిగింది. తన లాంటి ఎన్నో రకాల పక్షులు రెక్కలతో గుండెలు బాదుకుంటున్నాయి. ఆ విరిగిన కొమ్మలతో పాటు నేలన పడిన గూళ్ళు , వాటిలోని తమ పిల్లలు శవాలు. ఏ పక్షిని సముదాయించాలో ఏ పిచ్చుకని ఓదార్చాలో తనకి తోచటం లేదు. చూస్తుండగానే ఆ చెట్టు విస్తీర్ణాన్ని సగం చేసి వెళ్ళి పోయారు మనుషులు. ఆ పక్షుల రోదనలు చూస్తుంటే తనకి రెండవసారి పిల్లల సమయం గుర్తొచ్చింది.
అపుడు తనకు గల గత అనుభవం గుర్తు వల్ల ఈ సారి నేరేడు చెట్టుని ఆశ్రయించింది. పళ్ళు లేని కాలమేకదా అని ధైర్యంగా గూడు కట్టింది. ముగ్గురు పిల్లలని కూడా పొదిగింది. వాటితో సంతోషంగా గడుపుతూ మిగితా గుడ్లని పొదిగే పనిలో ఉండగానే ఒకరోజు వచ్చిన భీకరమైన తుఫాను గాలులకు ఆ చెట్టు కూలి నేల పై పడింది. అంతవరకూ తన రెక్కలని పిల్లల మీద కప్పి చినుకులని ఆపగలిగింది కానీ వాటితో చెట్టుని నిలబెట్టలేదు కదా ! ఆ చెట్టు పడిపోతుండగా పరుచుకొని ఉన్న రెక్కలతో అలాగే గాలిలోనే ఉండగలిగింది కానీ వాటితో ఆ గూడుని పట్టుకొని భద్రపరుచుకోలేకపోయింది. మొత్తం గుడ్లు , పిల్లలూ అంతా శివైక్యం.
“అది ప్రకృతి వైపరీత్యం. తప్పు ఎవరిదీ అనలేము. కానీ ఇపుడు జరిగింది మనుషులు విచక్షణా రహితంగా చేసింది. వాళ్ళు చేసిన దానికి మేం మా సర్వస్వం పోగొట్టుకొని ఏడవటం ఏమిటి?” అని నీల అనుకుంటూ అక్కడినుండి బయలుదేరింది. తన ప్రయాణం మద్యలో ఒక ఊరు , ఇళ్ళు కనిపించినయ్. తన తల్లి తనకి చెప్పింది , వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలంలో అమ్మమ్మ వాళ్ళ అమ్మ తన గుడ్లని ఒక ఇంటిలోని వెంటిలేటర్ లో గూడు కట్టి, అందులో ఉంచి పెంచిన రోజుల గురించి తన పిల్లలకి వివరిస్తే ,ఆ విన్న పిల్లలు తమ పిల్లలకు చెప్పారు. వాళ్ళ తర్వాతి తరమైన నీలకి తన తల్లి ద్వారా తెలిసింది. అపుడు వారు మనుషుల ఇళ్ళలో వాళ్ళు ఏరేసిన బియ్యం మెరికలు , ఇతర గింజలు తింటూ వాళ్ళ కిటికీల గుండా ఆడుకుంటూనే జీవితం గడిపేవారంట. కానీ , ఏమైందో తెలియదు. ఇపుడు జానావాసాలకి కాస్త దగ్గరలో ఉన్నా సరే శరీరమంతా ఏదో తెలియని ఒక వింత క్షోభ. ఏదో ఊపిరి బిగుసినట్టుగా , నరాలు స్తంభిస్తున్నంత అవస్థకి లోనవుతుంది శరీరం. అందుకే అడవుల బాట పట్టాల్సి వచ్చింది. అనుకుంటూ తను ఎదుర్కుంటున్న అసహాయతని తలుచుకుని లోలోననే కుమిలింది.
ఒక దగ్గర పొలంలో మామిడి చెట్టు కనిపించింది. కలపకోసం దాన్ని నరకరు. గాలి వాన నుండి కూడా ఇబ్బంది పెద్దగా ఉండదు. కానీ దాని పళ్ళ కోసం రాళ్ళతో కొడతారు. చానా ప్రమాదం అనుకొని ముందుకు వెళ్ళింది. మరో చోట నల్లతుమ్మ చెట్టు కనిపించింది తనకి. దాని కొమ్మలు ఊగవు. ఆ చెట్టు కాడ ఇంకా పెద్దగా కాలేదు. కాబట్టి దీన్ని నరకడానికి రారు. పళ్ళ చెట్టు కాదు. గాలికి తట్టుకోగలదు. ఇదే ఉత్తమం అనుకొని , గూడు కట్టి గుడ్లు పెట్టింది. పొదిగిన తర్వాత పిల్లలని చూసుకుంటూ మురిసిపోయేది. వాటికి ఆకలేసి కిచకిచ మని అడిగకమునుపే పోయి గింజలని నోటిలో పెట్టుకొని వచ్చి వాటి నోళ్ళకి అలాగే అందించి తినబెట్టేది. వాటి రెక్కలు బలమై మెల్లగా ఎగరటం మొదలు పెట్టినయ్. ఆ కొమ్మనుండి ఈ కొమ్మకు ఏగురుతూ , చెట్టు పరిధిలోనే తిరుగుతూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఆడుకుంటుంటే చూసుకొని ఆ ఆనందంలోనే కడుపు నిండిపోయేది. ఇక అవి పిల్లలు కావు. తన లాగానే పిచ్చుకలు. వాటి పథం వైపుకి అవి వేటికవే ఎగిరిపోయినయ్. నీల కూడా ఎటో తెలియదు. కానీ, రెక్కలు విదిల్చింది.
కె. నందన్ కుమార్ గౌడ్s/o రామాంజనేయులు గౌడ్.అమ్మ :- లక్ష్మి.గ్రామం :- ఉయ్యాలవాడ.
విద్య :- M.A. తెలుగుసాహిత్యం.MVS GOVT కాలేజ్.occ :- Self employment.email :- kusinerlanandu@gmail.com ph :- 9603234503.
కవితలు , కథలు , వ్యాసాలు రాస్తుంటాను.పుస్తకాలు చదవటం అలవాటు.
కుషినేర్ల నందు.పేరుతో రాస్తుంటాను.