రచయిత్రి వృత్తిరీత్యా సైకో తెరపిస్టు. ఆమె రచనల్లో మొదటిది పారడైజ్ ట్రీస్ కాగా ఇది ఇది రెండవ నవల. ఈ పుస్తకం లెజెన్డ్ ప్రెస్ ప్రచురణ. ఇది అమెజాన్‍లో దొరుకుతుంది. వెల 150 రూపాయలు.
నవల చాలా ఆసక్తికరంగా వుంది. స్త్రీ మనసుని గాయపరిచే సమాజం, ఆలోచనావ్యవస్థా ఎక్కడేనా ఒకటే. ఐతే ఇంగ్లాండులో పోలీసులు వ్యవహరించిన తీరు, పసిపిల్లలకి ఇచ్చే విలువ ఎన్నదగ్గవి. కథంతా మొత్తం రెండుకుటుంబాల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళుకాక టీచరు కేటీ మరొక ముఖ్యపాత్ర. ఒక పాప సముద్రం వొడ్డుని నత్తగుల్లని ఏరి, దాన్ని కడగటానికని సముద్రం దగ్గరగా వెళ్ళి మునిగిపోవటంతో కథ మొదలౌతుంది.
మొదటి కుటుంబం కొలిన్ గ్రాంగర్, మేగీ, వాళ్ళ ఇద్దరు పిల్లలు జో, ఒలీవియా. పిల్లలకోసం ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లోనే వుండిపోతుంది మేగీ. చాలామంది స్త్రీలకన్నా తను అదృష్టవంతురాలిననే భావన వుంటుందికానీ పిల్లలు విసిగిస్తూ వుండి భర్త పట్టించుకోనప్పుడు మాత్రం కొంచెం చికాగ్గా అనిపిస్తుంది. ఇరవైనాలుగ్గంటలూ వీళ్ళ అల్లరి తనొక్కర్తే భరించాలా అని విసుగుపడుతుంది.
వీళ్ళు పిల్లలతో కలిసి సరదాగా గడపడానికి కార్న్‌వాల్‍లో సముద్రం వొడ్డుని కాటేజిలో దిగుతారు. ఒలీవియా మూడేళ్ళ పిల్ల. ఇంకోవారంలో నాలుగు నిండుతుంది. జో కొంచెం పెద్దవాడు. కొలిన్, జో రాక్ పూల్స్ దగ్గరికి వెళ్తారు. ఒలీవియాకి ఎండ్రకాయలంటే చిరాకు. అందుకని తల్లిదగ్గర వుండిపోతుంది. తల్లీకూతుళ్ళు పిచికగూళ్ళు కడతారు. వాటిని అందంగా అలంకరిస్తుంది ఒలీవియా.
“నేనీ కేజిల్‍కి యువరాణిని. అన్న బూట్ బోయ్, నువ్వు సర్వెంట్ గర్ల్‌వి. నాన్న కింగ్” అంటుంది. ఆ పిల్ల తెలిసీ తెలీక అన్న మాటలకి తల్లి మనసుకి చిన్న గాయమౌతుంది.
ఆ పిల్లకి తండ్రితో గడపాలని కోరిక. తండ్రి అన్నతో ఎక్కువగా గడుపుతున్నాడని కినుక. తల్లి సర్దిచెప్తుంది. నేను వున్నానుకదా అంటుంది. “నువ్వు ఎప్పుడూ వుంటావు, నాన్నతో గడపడమే స్పెషల్” అంటుంది ఒలీవియా. ఆ మాటలకి మేగీకి మరోసారి చివుక్కుమంటుంది.
తండ్రి దగ్గరకి వెళ్తానని అంటే ఆ విసుగూ, కోపంలో ఒక్క పిల్లనీ వెళ్ళమని వదిలేస్తుంది. తను టీ తాగుతూ కూర్చుంటుంది. ఆ పిల్ల మరింక కనిపించదు. మాయమౌతుంది. భార్యాభర్తలు పిచ్చివాళ్ళలా వెతికివెతికి చివరికి పోలీసులని ఆశ్రయిస్తారు. ఎంత వెతికినా, పిల్ల ఆచూకిగానీ, శవంగానీ దొరకదు. తప్పంతా ఆమెదే అని నిందించి కొడుకుని తీసుకుని వెళ్ళిపోతాడు కొలిన్. మేగీకూడా తప్పంతా తనదే అనుకుంటుంది. ఛీఫ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ హొవార్డ్, డిటెక్టివ్ సార్జెంట్ అమండా ఇద్దరికీ ఆమెపట్ల సానుభూతి వుంటుంది. కూతురు ఎలాగేనా తిరిగొస్తుందని ఎదురుచూస్తూ ఆ కాటేజిలోనే వుండిపోతుంది. కొన్నిరోజులు గడిచాక కోపం తగ్గి కోలిన్ తిరిగి వచ్చి మేగీని తీసుకెళ్తాడు. హొవార్డ్‌కూడా తను ఎప్పటికప్పుడు ఈ విషయంలో మాట్లాడుతునే వుంటానని హామీ యిస్తాడు. ఒలీవియా కనిపించకుడా పోయిన విషయం టీవిలోనూ రేడియోలోనూ వస్తుంది. ఫాంప్లెట్లు ముద్రించి అంతటా అతికిస్తారు. అలాంటి ఒక ఫాంప్లెట్‍ని అనుకోకుండా ఒకసారి చూస్తుంది కేటీ.
రెండో కుటుంబం ఫిలిప్ మార్షల్, అతని భార్య జెన్నిఫర్, కూతురు హెయిలీ. ఫిలిప్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే తన గ్రానీ ఎడ్వినా దగ్గర పెరుగుతాడు. ఆమెని చూడటానికని వచ్చి లాస్‍ఏంజిల్స్‌లో ఇరుక్కుంటాడు. ఆవిడకి కేన్సరు బయటపడుతుంది. పెద్దావిడ. ఇంక చివరిరోజులు. అలా నాలుగునెలలపాటు ఆవిడ దగ్గర వుండిపోయాక ఆమె చనిపోతుంది.
ఫిలిప్, జెన్నిఫర్‍ల జీవితంలో ఒక దుర్ఘటన జరుగుతుంది. ఐదేళ్ళ వాళ్ళ కూతురు సెలవులు గడపడానికి టర్కీ వెళ్ళినప్పుడు సముద్రంలో మునిగి చనిపోతుంది. జెన్నిఫర్ మానసికంగా చాలా దెబ్బతిని వైద్యం తీసుకుంటుంటుంది. కూతురు చనిపోయిన విషయంతోపాటు గతంలో జరిగిన ఎన్నో విషయాలు మర్చిపోతుంది. మనుషులందరికీ దూరంగా వంటరిగా గడుపుతుంటుంది. తల్లినికూడా దగ్గరికి రానివ్వదు. ఫిలిప్ దూరంగా వున్న ఈ సమయంలోనే ఆమె తను వుంటున్నచోటికి కాస్త దూరంలో పాల్‍పేన్ అనేచోట ఇంకో యిల్లు కొని, దానికి హంగులన్నీ చేయించి అందులోకి మారుతుంది. భర్త వెళ్ళినప్పటికి ఆమె నాలునెలల గర్భవతి. ఆ విషయం అతనిదగ్గర దాచి ఆశ్చర్యపరచాలని అనుకుంటుంది. ఆమెతోపాటు ఒక పాప కూడా వుంటుంది. ఆ పాపని చనిపోయిన తనకూతురి స్థానంలో ఇరికిస్తుంది. ఆ పాత్రలో ఆ పిల్లని ఇమిడ్చేందుకుగాను, పిల్లతో చాలా కరుకుగా ప్రవర్తిస్తూ వుంటుంది. హెయిలీ మార్షల్ అనే పేరుతో ప్రైమరీ స్కూల్లో చేర్చుతుంది. ఆ పిల్లకి జెన్నిఫర్ అంటే భయం. బట్టలు తడిపేసుకుంటూ వుంటుంది. స్కూల్లోకూడా చాలా విచారంగా ఎవరితోటీ కలవకుండా వుంటుంది. కేటీ ఆమె టీచరు. తనకిగల పదిహేనుమంది పిల్లల్లో ఇద్దరిలో తేడా గమనిస్తుంది కేటీ. ఆ యిద్దర్లో ఈ పిల్ల ఒకటి. కేటీ ఆమెతో చాలా దయతో ప్రవర్తిస్తుంటుంది. తండ్రి దూరంగా వుండటంచేత హెయిలీ బెంగపడిందని అనుకుంటుంది. ఇద్దరిమధ్యా మంచి అనుబంధం ఏర్పడుతుందిగానీ, జెన్నిఫర్‍కి అది యిష్టం వుండదు. కేటీతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటుంది. ఆ పిల్ల తెలీకుండానే తనగురించి కొన్ని అస్పష్టమైన విషయాలు బయటపెడుతుంటుంది. విని కేటీ తికమకపడుతుందిగానీ చివరిదాకా అర్థమవదు.
పరిస్థితులు ఇలా వుండగా ఎడ్వినా చనిపోయాక ఫిలిప్ ఇంగ్లాండ్ తిరిగొస్తాడు. జెట్‍లాగ్‍తోటే హిత్రూనుంచీ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. ఇటు చూస్తే భార్య గర్భవతి. కవలలతో. అప్పటికే ఆమెకి లేబర్ మొదలై వుంటుంది. మరోవైపు చనిపోయిన కూతురి స్థానంలో మరో పిల్ల. ఏమీ అర్థం కాని అయోమయంలో వుండగానే జెన్నిఫర్‍ని హాస్పిటల్‍కి తీసుకెళ్తారు. నార్మల్ డెలివరీ ఔతుంది. తనకూతురి స్థానంలో వున్న పాపగురించి భార్యని ఏదీ అడగలేని సందర్భం. ఇంట్లో వెతికితే కూతురికి సంబంధించిన డాక్యుమెంట్స్ వుండవు. ఇప్పుడున్న హెయిలీ విషయంలో ఏం చెయ్యాలో ఆలోచిస్తుండగానే కొద్దిరోజులు గడుస్తాయి. అతనుకూడా ఆ పిల్ల ప్రలోభంలో పడిపోయి, ఆ విషయాన్ని వాయిదా వేస్తుంటాడు. అలా ఆ పిల్లని తన యింట్లో వుంచుకోవటం సరైనది కాదనే విషయం అతనికి తెలుసు. కానీ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థమవదు. పోలీసుల సహాయం తీసుకుందామంటే జెన్నిఫర్‍ని మెంటల్ హాస్పిటల్లోనూ, తనని జైల్లోనూ పడేస్తారు. కొత్తగా పుట్టిన కవలల గతేమిటనే భయం అతన్ని అడుగు ముందుకి వెయ్యనివ్వదు.
అనుకోని పరిస్థితుల్లో ఫిలిప్, జెన్నిఫర్లకి యాక్సిడెంటైనప్పుడు ఈ ముడి విడుతుంది. కేటీ, పోలీసుల సహకారంతో పిల్లని తన అసలు తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తారు. యాక్సిడెంటువలన జెన్నిఫర్ చనిపోతుంది. ఫిలిప్కి రెండు సంవత్సరాల శిక్ష పడుతుంది. కవలలని జెన్నిఫర్ తల్లి తీసుకెళ్తుంది. ఫిలిప్ జైలునుంచీ విడుదలయాక అతన్ని తీసుకెళ్ళడానికి మొదట్నుంచీ జెన్నిఫర్‍కి సాయం చేస్తూ వున్న థియా అనే స్నేహితురాలు వస్తుంది.
ఒక పసిపాప కనిపించకుండా పోతే, లేదా చనిపోతే ఆ కుటుంబాలలో ఎలాంటి విషాదం చోటుచేసుకుంటుందనేది ఒక ఎత్తైతే, ఆ తల్లులు పడే వేదన మరొక ఎత్తు. ఒకే సంఘటనకి జెన్నిఫర్ ఒకలా, మేగీ మరొకలా స్పందించిన తీరు రచయిత్రి చక్కగా చూపారు. జరిగిన పొరపాటుకి ఆమే కారణమైనా, అది కేవలం పొరపాటే ఐనా, కోలిన్ మేగీని ఎలా బాధ్యురాలిని చేసాడో చూసాక ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పుకునే పాశ్చాత్యసమాజంకూడా భారతీయ సమాజంలాగే ప్రవర్తించడం మరో ఆశ్చర్యం. పొరపాట్లనేవి అలానే జరుగుతాయని మేగీని హోవర్డ్ సమర్ధిస్తాడు.
నవల చాలా ఆసక్తిగా సాగుతుంది. సరళమైన భాష, సూటిగా వున్న శైలి.
పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.