The Emporer’s Riddles by Satyarth Naik
పరిచయం – యస్. శ్రీదేవి

సత్యార్థ్ నాయక్ రచయిత, జర్నలిస్ట్. ఈ నవలని Amaryllis అనే సంస్థ మొదటిసారిగా 2014లో ప్రచురించింది. 2015సరికే మూడవముద్రణకు వచ్చింది. పుస్తకం వెల రూ. 299/-
మగథ రాజ్యాన్ని బార్హద్రథులు, ప్రద్యోతనులు, హర్యాంకులు, శిశునాగులు, నందులు వరుసగా పాలించాక మౌర్యుల శకం వచ్చింది. చంద్రగుప్తమౌర్యుడు ఈ వంశానికి ఆద్యుడు. ఈయన కొడుకు బిందుసారుడు, మనుమడు అశోకుడు. అశోకుడు తన అన్నలు 99మందిని చంపి రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడనే కథనం వుంది. అశోకుడు కళింగరాజ్యాన్ని జయించిన తర్వాత ఆ నరమేథం చూసి విచలితుడై బౌద్ధధర్మాన్ని అనుసరించి, అహింసావాదిగా మారతాడు. ఈ యుద్ధంలో తను వాడిన అధునాతన సాంకేతికత తన తదుపరి తరాలకి అందుబాటులో వుంటే మరిన్ని యుద్ధాలు జరిగి యింకాయింకా ప్రజానష్టం జరుగుతుందని భావిస్తాడు. మొత్తం అందుబాటులో వున్న సాంకేతికతనంతటినీ వుపసంహరించుకుని దాన్ని తొమ్మిది విభాగాలుగా విభజించి, బౌద్ధమతానుయాయులైన శాస్త్రవేత్తల అజమాయిషీలో వుంచి పరిరక్షించమని నిర్దేశిస్తాడు. వారి వారసులద్వారా ఇది నిరంతరాయంగా సాగాలని ఏర్పాట్లు చేస్తాడు. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పుకుంటారు.
గ్రీకులోని మ్యూజియంలో వున్న ఏంటికెథెరా అనే ప్రాచీనకాలంనాటి కంప్యూటర్, వేలసంవత్సరాలతర్వాతకూడా తుప్పుపట్టని సాంచీస్థూపం ప్రాచీన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనాలు. ఇలాంటివి యింకా ఎన్నో వున్నాయి. ఈ చారిత్రక నేపథ్యంలో రాసిన నవల యిది. బుద్ధుడి మూడుసూక్తులైన బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అనే మూడు భాగాలుగా రచించబడింది.
ఓమ్ పట్నాయక్ ప్రముఖ రచయిత. ముప్పయ్యారేళ్ళ వయసు. అవివాహితుడు. రామ్ మాథుర్ చరిత్రకారుడు, ఓం పట్నాయక్ మితృడు. సియా, రామ్ మాథుర్ కూతురు, స్పేస్ సైంటిస్టు. అనుమానాస్పద పరిస్థితుల్లో రామ్ మాథుర్ చనిపోతాడు. అదే పద్ధతిలో ఇంకో ఎనిమిది హత్యలుకూడా జరిగి వుంటాయి. ఐతే రామ్ మాథుర్ విషయంలో మిగిలిన హత్యలకి భిన్నంగా అతని బుగ్గమీద ఓం అనే అక్షరాలు చెక్కబడి వుంటాయి. ఇన్స్పెక్టర్ సూరి ఈ హత్యకేసుల్ని చూస్తుంటాడు. తరువాతి కాలంలో ఆలియా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు అతనికి సాయం చేయడానికి ముందుకి వస్తుంది. ఈ హత్యలన్నీ చేసింది స్కార్పియన్ అనే మారుపేరుగల హంతకుడు. స్కార్పియన్ ఆలియానికూడా హత్య చేస్తాడు.
తండ్రి బుగ్గమీద వున్న అక్షరాలని చూసి ఆయన ఓం పట్నాయక్‍తో ఏదో చెప్పాలనుకున్నాడనుకుని సియా అతన్ని పిలిపిస్తుంది. రాం మాథుర్ చనిపోయిన మూడునిముషాలకి అతని ఐడీనుంచీ సియాకి ఒక మెయిల్ వస్తుంది. అందులో ఒక పజిల్ వుంటుంది. ఈ పజిల్ ఛేదించే క్రమంలో వారికి ఒక బౌద్ధారామంలో చిన్న రోబో దొరుకుతుంది. ఆ విషయాన్ని గమనించి వారితో పరిచయాన్ని పెంచుకుంటుంది జశోధర. ముగ్గురూ కలిసి పజిల్‍‍ని సాల్వ్ చెయ్యడానికి ముందుకి సాగుతారు. ఈ రోబో ఒక విషయానికి ప్రతీక. అది ఒక చిక్కుప్రశ్న విసుర్తూ వుంటుంది. దాన్ని సాధించగానే మరొక రోబో దొరికి మరొక కొత్త చిక్కుప్రశ్నని సంధిస్తుంది. ఇలా అంచెలంచెలుగా మొత్తం తొమ్మిది రోబోలు, తొమ్మిది చిక్కుప్రశ్నలు వాళ్ళు ఎదుర్కొంటారు. వాటిని విడదీస్తూ, అశోకుడు స్థాపించిన తొమ్మిదిమంది అజ్ఞాతవ్యక్తుల స్థావరానికి చేరుకుంటారు. ఆసరికి వాళ్ళందరూ చంపబడి వుంటారు. ఆ వ్యక్తులందరినీ చంపింది ఎవరు, ఎందుకు, అనే విషయం బయటపడటంతో నవల ముగుస్తుంది.
నవల ఆద్యంతం చాలా ఆసక్తిగా సాగినా, ఇంకొంచెం స్పష్టతతో రాస్తే బావుండేదనిపించింది. పాత్రలమధ్య సంభాషణల్లో భావోద్వేగాలు సరిగా ప్రతిబింబించలేదు. ఏదేమైనప్పటికీ వినూత్నమైన విషయం కాబట్టి ఆకట్టుకునే విధంగానే వుంది.