కృతజ్ఞతలు by S Sridevi

  1. అక్కాచెల్లెళ్ళు by S Sridevi
  2. గుండెలోతు by S Sridevi
  3. మనుష్యరేణువులు by S Sridevi
  4. బడి వదిలాక by S Sridevi
  5. హలో మనోరమా! by S Sridevi
  6. ఇరవైమూడో యేడు by S Sridevi
  7. అతనూ, నేనూ- మధ్యని మౌనం By S Sridevi
  8. ఒకప్పటి స్నేహితులు by S Sridevi
  9. పుత్రోత్సాహం by S Sridevi
  10. వెంటాడే జ్ఞాపకాలు by S Sridevi
  11. ప్రేయసి అందం by Sridevi Somanchi
  12. ఉరి by S Sridevi
  13. మరోజన్మ by S Sridevi
  14. అంచనా తప్పింది by S Sridevi
  15. వప్పందం by S Sridevi
  16. శతాయుష్మాన్ భవతి by S Sridevi
  17. కొత్త అతిథికోసం by S Sridevi
  18. చెయ్ by S Sridevi
  19. పరారైనవాడు by S Sridevi
  20. కృతజ్ఞతలు by S Sridevi

తుమ్ రూఠీ రహో
మై మనాతా రహూ…
గాలి అలలమీంచీ మంద్రస్థాయిని తేలివస్తున్న పాట! సరసన వున్నది ప్రియురాలైతే ఆమె అలకలో కూడా అందమే వుంటుంది. ఆర్ద్రతే కనిపిస్తుంది. ప్రేమస్వరాలు పలికిస్తుంది.


“నాకు శ్రియని చేసుకోవాలని లేదంటే వినరేం? నేను తనని చేసుకోను. అంతే” అందరూ అదే విషయాన్ని పదేపదే అడుగుతుంటే కోపంగా చెప్పాడు సాకేత్.
“అదే ఎందుకని? దానికి తెలిస్తే ఎంత బాధపడుతుంది?” కొడుకుని అనునయంగా అడిగింది రాజ్యలక్ష్మి అంతే నిదానంగా.
“నాకిష్టం లేదమ్మా”
“శ్రియంటేనా?”
“కాదు, తనతో పెళ్లంటే”
“ఎందుకు? ఎవర్నేనా ప్రేమించావా?”
“అలాంటిదేం లేదు”
“మరి?”
“దాన్ని చేసుకోను. అంతే”


“ఏంటి నన్ను చేసుకోనన్నావుట?” దూకుడుగా వచ్చి అడిగింది శ్రియ. ఆమె కళ్లలో కోపం, రోషం పోటీపడుతున్నాయి. చిన్నప్పటినుంచీ ఏదడిగితే అది, ఎవర్నడిగితే వాళ్లు ఇచ్చారు. తనమాట చెల్లకపోతే ఊరుకునేది కాదు. అందుకే అంత రోషం.
“అప్పుడే నీదాకా వచ్చిందా?”
“ముందు నేనడిగిన దానికి జవాబు చెప్పు”
“నాకిష్టం లేదని చెప్పానా?”
“నేనంటేనా?”
“కాదని కూడా చెప్పాను””
“మరి?”
“అది కూడా చెప్పాను”
“కానీ నాకు నీతో పెళ్లి ఇష్టమే”
“నీకిష్టమైనంత మాత్రాన సరిపోతుందా?”
“చూద్దువుగానీ” వచ్చినంతే విసురుగా వెళ్లిపోయింది.


“శ్రియ స్లీపింగ్ పిల్స్ మింగేసిందట. మామయ్య చూసి భయపడిపోయి వెంటనే హాస్పిటల్‍కి తీసుకెళ్లాడు. చావు తప్పింది పిచ్చిపిల్లకి. నీమీద ఎంత ప్రేమ లేకపోతే అలాంటి పని చేస్తుంది?” బయటనుంచి వచ్చిన సాకేత్‍తో చెప్పింది రాజ్యలక్ష్మి. షూ విడుస్తూ తల్లి చెప్పినదంతా నిదానంగా విన్నాడు.
“ఐడోన్ట్ కేర్. నాకు తనతో పెళ్లిష్టంలేదు” అన్నాడు.
“నువ్వు… నువ్వేనా, ఇలా మాట్లాడుతున్నది సాకేత్? ఏమైందిరా నీకు? వాళ్ల మొహం కూడా చూడలేకపోతున్నాను. ఒక్కగానొక్క పిల్ల వాళ్లకి. రెండిళ్లమధ్యా అపురూపంగా పెరిగింది. ఈనాటికి నీకోసం చావుకి తెగించింది. ఇంత దుర్మార్గుడివేమిట్రా, నువ్వు? అది నిన్ను కోరరాని కోరికేం కోరలేదు. పెళ్లి చేసుకోమంది. అంతేగా? వెళ్లి కనీసం దాన్ని చూసి అత్తయ్యకీ మామయ్యకి ధైర్యం చెప్పిరా” అంది రాజ్యలక్ష్మి సగం కోపంగానూ సగం అనునయంగానూ.
ఏమనుకున్నాడో, విడిచిన షూ మళ్లీ వేసుకుని వెళ్లిపోయాడు సాకేత్.


“కనీసం ఇప్పుడేనా పెళ్లికి ఒప్పుకుంటావా?” హాస్పిటల్ బెడ్‍మీద పడుకుని వుండి అడిగింది శ్రియ.
“ఒప్పుకోను”
“ఏం ఎందుకని?”
“నీకోసం ఒక చాక్లెట్, ఒక బొమ్మ, ఒక పుస్తకం త్యాగం చెయ్యగలను. దెబ్బలకి కాసేపు వీపు అప్పగించగలను. నువ్వు చెప్పే జోక్ నచ్చకపోయినా నవ్వగలను. అంతేకానీ పెళ్లిచేసుకుని నీ లయకి జీవితాంతం తాళం వేయలేను”
“సాకేత్!!”
“యస్”
“అంటే అవన్నీ నేనంటే యిష్టంలేకే చేసావా?”
“ఇష్టపడే చేసాను. చాలావరకూ. కనీసం ఇష్టపడటానికి అలవాటుపడ్డాను”
“…”
“ఇంకోసారి ఇలాంటి పిచ్చిపనులు చెయ్యకు. విష్ యూ గుడ్ లక్”


“ఏం జరుగుతోంది అసలీ ఇంట్లో? నీకూ నీ కొడుక్కీమధ్య? శ్రియని వీడెందుకు చేసుకోడట? వీడు చేసుకోననడం, అది నిద్రమాత్రలు మింగడం, వాళ్లమ్మ వైశాలి ఏడవడం… ఇదంతా నాకు నచ్చలేదు. ఈ నెల పద్దెనిమిదికి ముహూర్తం పెట్టించాను. వాడికిష్టమైనా లేకపోయినా దాన్ని చేసుకుని తీరాల్సిందే. ఏం తక్కువ దానికి అందమా? చదువా? చురుకుదనమా? మర్యాదగా నా మాట విన్నాడా సరేసరి. లేకపోతే కాళ్లు విరగ్గొట్టి మరీ పీటల మీద కూర్చోబెడతాను” అన్నాడు ప్రతాపరావ్ కోపంగా. శ్రియ ఆయన మేనకోడలు. చెల్లెలి కూతురు. అన్నాచెల్లెళ్ళకి చాలా సఖ్యత. ఇంక శ్రియతో అనుబంధాన్ని గురించి చెప్పనే అక్కర్లేదు.
ఆయన తండ్రి బ్రతికున్నప్పుడే పిల్లలిద్దరికీ ఒకే కాంపౌండులో పక్కపక్కనే చెరో ఇల్లూ కట్టించి ఇచ్చాడు. పెళ్లయినా దూరంగా వెళ్లకపోవడంతో అన్నాచెల్లెళ్ల అనుబంధం మరింత బలపడింది. శ్రియ ఆయన ఒళ్లోనే పెరిగింది. ఆ పిల్లంటే పంచప్రాణాలూను. అలాంటిదాన్ని కొడుకు బాధపెట్టడం ఏమాత్రం నచ్చలేదు.
“వాడెందుకు చేసుకోనంటున్నాడో అడిగి తెలుసుకోవచ్చుగా? బలవంతంగా పెళ్లిచెయ్యడానికి వాడేమైనా చిన్నపిల్లాడా?” అంది రాజ్యలక్ష్మి. శ్రియంటే ఆమెకీ ఇష్టమే. కానీ సాకేత్‍కంటే కాదు. శ్రియ వైశాలికి ఒక్కర్తే కూతురైనట్టే సాకేత్ తమకీ ఒక్కడే. ఆ విషయం ఎవరికీ తట్టదు. అతని ఇష్టాఇష్టాలెవరూ పట్టించుకోరు. వైశాలి ఏకపక్షంగా నిర్ణయాలు చెయ్యడం దానికంతా భర్త తాళం వెయ్యడం.
“శ్రియకీ సాకేత్‍కీ పెళ్లి చేసేస్తే ఇంక బావుంటుందన్నయ్యా?” అని ఆమె ప్రతిపాదించింది. ఇవన్నీ దాని తదుపరి పరిణామాలు. కొడుకీ పెళ్లికి ఒప్పుకుంటే ఏ గొడవా వుండేది కాదు. కానీ అతడెందుకు కాదంటున్నాడో? ఈ గొడవలు దేనికి దారి తీస్తాయో? ప్రతి నిమిషం సంఘర్షించి రాజ్యలక్ష్మి అంతరంగం శిధిలపడిపోయింది. ఇప్పుడి కొత్త ఉద్వేగాలని తట్టుకోలేకపోతోంది.


“అమ్మా! నేనిక్కడ జాబ్ వదిలేసాను. బెంగుళూరులో వేరేది, చూసుకున్నాను. రేపే ప్రయాణం” బట్టలు సర్దుకుంటూ చెప్పాడు.
ఆమె తెలతెలబోతూ ఏదో అనేలోగానే అవతలి గదిలోంచీ ప్రతాపరావ్ అరిచాడు. “ఇల్లు దాటి కదిల్తే కాళ్లు విరగ్గొడతానని చెప్పు నీ కొడుక్కి, పద్ధెనిమిదిన ముహూర్తం పెట్టుకుని ఎవర్ని ఉద్దరించటానికట బెంగుళూరు వెళ్లడం?”
“నేను శ్రియని చేసుకోను. నిజంగా కాళ్లు విరగ్గొట్టి బలవంతపు పెళ్లిచేసినా అది మీకోసంగానీ నాకోసం కాదు. నేను తనతో సరిగ్గా వుండను. సరా?” జవాబిచ్చాడు సాకేత్. రాజ్యలక్ష్మి ఎటూ మాట్లాడలేక నీళ్లు నిండిన కళ్లతో కొడుకేసి చూసింది. అతను తల తిప్పుకున్నాడు. ప్రతాపరావు గిజగిజలాడిపోయాడు. ఎందుకు వీడి కింత మొండితనం?
సాకేత్ బెంగుళూరు ప్రయాణం గురించి విని వైశాలి భర్తతో కలసి వచ్చింది.
“ఎందుకు సాకేత్, శ్రియని పెళ్లిచేసుకోనంటున్నావు? ఏం తక్కువ దానికి?” ఎన్నోరకాలుగా ఒప్పించాలని చూసింది. దేనికీ జవాబివ్వకుండా కూర్చున్నాడు సాకేత్.
“మేనరికంకదాని ఏమీ ఇవ్వమనుకుంటున్నావేమో! అలాంటిదేమీ లేదు. పెళ్ళవ్వగానే విజిటింగ్ వీసా తీసుకుని యూరోప్ టూర్ చేసి రావాలని ప్లాన్ చేసింది శ్రియ. ఆ ఖర్చంతా మాదే. కొత్త కారు కావాలంది. అదీ కొంటానన్నాను. అలాగే నీకేం కావాలో చెప్పు” అనునయంగా అన్నాడు ఆమె భర్త,
“అంకుల్! శ్రియని చేసుకుంటే ఏవేవో ఇస్తామని మీరంటున్నారు. తనని చేసుకోమని నన్నడగకుండా వుండేందుకు నేనూ ఇవ్వచ్చా?” కూల్‍గా అడిగాడు సాకేత్.
“ఎంత పొగర్రా నీకు? శ్రియ నీమీద మనసుపడిందని ఇందరం ఇన్నివిధాల బతిమాలుతున్నాం. దాన్ని కాదని ఇంకో పిల్లనెలా చేసుకుంటావో చూస్తాను” అంది వైశాలి కోపంగా,
సాకేత్ చిన్నగా నవ్వాడు. “నేను శ్రియని చేసుకోనన్నానుగానీ ఇంకెవర్నో చేసుకుంటాననలేదుకదత్తా!” అన్నాడు.
“వాడి ఇష్టాఇష్టాలతో పనేంటి? పద్ధెనిమిదన ముహూర్తం, వెళ్లి ఏర్పాట్లు చూసుకోండి” అన్నాడు ప్రతాపరావ్.
“అంత బలవంతపు పెళ్లేం చెయ్యక్కర్లేదులే అన్నయ్యా. వాడంతట వాడే దిగి రావాలి. కాళ్ళమీద పడాలి. అప్పుడే పెళ్లి” అంది వైశాలి పట్టుదలగా.
వద్దు మొర్రోమంటుంటే ఎందుకింత పంతం పడుతున్నారో రాజ్యలక్ష్మికి అర్ధం కాలేదు. మొదట్నుంచీ అంతే, వైశాలి చాలా పట్టుదల మనిషి. ఎవరికెంత నష్టం జరిగినా తను ఏమీ పొందకపోయినా పట్టుపడితే దిగొచ్చేదికాదు. ‘విడుపు’ అనేది ఆమె డిక్షనరీలోనే లేదు. శ్రియ ఆమె నోట్లోంచే వూడిపడింది. ప్రేమలేని ఈ పెళ్లి గురించి ఆ పిల్లకెందుకింత పంతం? కనీసం పౌరుషమేనా ఉండక్కర్లేదా? చిరచిరలాడింది.
సాకేత్ బెంగుళూరు వెళ్లిపోయాడు. వెళ్లేముందు తండ్రి లేకుండా చూసి తల్లితో అన్నాడు. “పెళ్లయిన ఆడపిల్లని అత్తవారింటికి పంపకుండా తనింట్లోనే భాగం ఇచ్చి తాతయ్య చాలా పెద్ద పొరపాటు చేసాడమ్మా. అత్తయ్య మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసింది. నాన్నగానీ ఆవిడగానీ మీ పెళ్ళితో ఇంట్లో రావల్సిన మార్పుని గుర్తించలేకుండా వున్నారు. అయాం సిక్ ఆఫ్ దట్ లేడీ. నాకు నా ఇల్లూ, నాదైన సంసారమూ కావాలి. స్వేచ్ఛ కావాలి. కోరుకున్నది చెయ్యగలిగే స్వతంత్రం కావాలి. నాన్నకా అవి లేవు. నేనుకూడా ఎందుకు పోగొట్టుకోవాలి?” “
“సాకేత్…”” ఏడ్చేసింది రాజ్యాలక్ష్మి,


సాకేత్ ఇచ్చిన షాక్కి తట్టుకోలేకపోయింది వైశాలి. తన కళ్ల ముందు పుట్టి పెరిగిన పిల్లవాడు. కన్నది వదినే అయినా పేరు సెలక్ట్ చెయ్యడం దగ్గర్నుంచీ అన్నీ తనే చూసుకుంది. చక్కగా క్రమశిక్షణతో పెంచితే శ్రియకి చక్కటి భర్త అవుతాడనుకుంది. ఎన్నో ఏళ్లుగా తను పెంచుకున్న ఆశలన్నీ తుంచిపారేశాడు. ఎందుకు? శ్రియలో ఏ లోపం వుందని? జ్వలించి పోయింది.
“వాడెందుకు చేసుకోనన్నాడో! లోకంలో ఇంకెందరు మగపిల్లలు లేరు? బావ పెట్టిన ముహూర్తానికే వాడిని తలదన్నిన సంబంధం తీసుకొస్తాను” అన్నాడు ఆమె భర్త.
చప్పున కలగజేసుకుంది శ్రియ “సాకేత్‍కాబట్టి సరేనన్నానుగానీ ఇప్పుడు నా పెళ్లికి తొందరేమిటి నాన్నా? అంత హడావిడిగా తీసుకొచ్చే సంబంధాలు సరిగా వుండవు. ఆ పెళ్లిళ్లు చాలావరకూ ఫెయిలవుతాయి. నేనింకా చదువుకుంటాను” అంది. ఆమె మాట కాదనలేకపోయారు వాళ్ళిద్దరూ.
బియ్యెస్సీలో యూనివర్శిటీ టాపర్ శ్రియ. బెంగుళూరులో ఇంటిగ్రేటెడ్ పీహెచీకి ఎప్పుడో అప్లయ్ చేసినదానికి సీటొస్తే వెళ్లి చేరిపోయింది. లోలోపల ఏదో వెలితి. అన్నిటిమీదా అనాసక్తి. రొటీన్లో పడటానికి కొంత టైమ్ పట్టింది. అదే వూళ్లో వుంటున్నా సాకేత్ ఎప్పుడూ వచ్చి కలవలేదు. అతనికి తెలుసో, తెలీదో తనిక్కడున్నట్టు. గుండెల్లో సన్నటిమంటలాంటి బాధ. దాన్ని చల్లార్చుకుంటూ చదువుకేసి మనసు మరల్చుకుంటుంటే చిన్న జెర్క్..


పుష్యమి… సన్నగా పొడవుగా సాబర్‍గా వుండే పుష్యమి, శ్రియ కోస్కాలర్. ఆమె ద్వారానే శ్రియ సాకేత్ పేరు మళ్లీ వింది. ఏదీ పట్టనట్టు, తన చదువేదో తన పనేదో తనదన్నట్టుండే పుష్యమిలో వున్నట్టుండి మార్పు. పెదాలమీద చిరునవ్వులు, ముఖంలోనూ కళ్లలోనూ మెరుపులు.
ఆజ్ ఫిర్ జీకి తమన్నా హై… గొంతులోంచీ లవ్‍ట్యూన్స్.
“ప్రేమలో పడ్డాను” కేంటిన్లో కూర్చుని ఇద్దరూ టీ తాగుతున్నప్పుడు చెప్పింది.
“టూ లేట్” అంది శ్రియ నవ్వి.
“ఏంటి? నువ్వప్పుడే?” ఆశ్చర్యంగా అడిగింది.
“ప్రేమించడం, విఫలమవడం రెండూ అయ్యాయి. అందుకే చదువుమీద ఇంత శ్రద్ధ పెట్టగలుగుతున్నాను” భుజాలు ఎగరేసింది శ్రియ. పైకలా తేలిగ్గా అనేసినా లోలోపల బాధ. ఐనా దాన్ని ముఖంలో కనపడకుండా దాచుకుని కుతూహలంగా అడిగింది. “ఎవరతను?”
“పేరు సాకేత్. హైదరాబాదీ”
పెద్ద సంచలనం శ్రియలో, అతనేనా?
“లైబ్రరీలో పరిచయం. ఇద్దరం ఒకే పుస్తకంకోసం వెతుకుతున్నాం. రేక్‍లో కనిపించింది. నేను చెయ్యి పెట్టేలోపే అతను దాన్ని అటువైపునుంచీ తీసేసుకున్నాడు. అమ్మాయినికదా, నాకోసం వదిలేస్తాడనుకుంటే, అలాంటిదేం లేదు. సింపుల్‍గా తీసేసుకుని రేపు ఇదే సమయానికి తీసుకొచ్చి తిరిగిచ్చేస్తాను. మీరు తీసుకోండి- అన్నాడు.
రెండోరోజు తెచ్చిస్తూ- నిన్న మీకు ఇవ్వలేదని రాత్రంతా తెగ ఫీలైపోయారుకదూ? ఏదో మొహమాటానికి ఇచ్చి వుంటే అది మళ్లీ చేతికొస్తుందో లేదోనన్న టెన్షన్ నావంతయ్యేది. నేను నా హక్కుల్నీ, ఎదుటివారి పరిధుల్నీ చాలా నిర్దుష్టంగా గుర్తిస్తాను. అంత సోఫిస్టికేటెడ్ కాదు …
బైదబై అయాం సాకేత్. విప్రోలో చేస్తున్నాను.
ఒకే పుస్తకంకోసం ఇద్దరం వెతికామంటే బహుశా ఇద్దరి అభిరుచులూ ఒకటే కావచ్చు. మీకెప్పుడైనా ఏదైనా మంచి బుక్ కనబడితే నాకు చెప్పడం మర్చిపోకండేం. నా సెల్ నెంబరు-
అలా మొదలైంది మా పరిచయం. అప్పటికే నా మతి పోగొట్టేసాడనుకో” అని నవ్వింది పుష్యమి.
“తర్వాత నువ్వు చదివిన పుస్తకాన్ని గురించి అతనికి చెప్పడం, అతను తనవి నీకు చెప్పడం… సెల్‍ఫోన్ బిల్లెంత వచ్చింది?” దబాయించింది శ్రియ. పుష్యమి నవ్వేసింది.


పుష్యమి అనే అద్దంలో సాకేత్ ప్రతిబింబాన్ని చూస్తోంది శ్రియ.
“అతనికి యిండివిడ్యువాలిటీ చాలా ఎక్కువట. పెద్దగొప్ప! అదేంకాదు. వట్టి పసిపిల్లాడితనం. చేతుల్తో చుట్టేసి వుక్కిరిబిక్కిరి చేస్తే గుండెల్లో తలదాచుకుని సేదదీరతాడు”
“రెడ్ పాంటు, గ్రీన్ షర్టు, వైట్‍షూస్, ఎల్లో టై కాంబినేషన్లో కనిపించినా నవ్వకూడదట. అదతని టేస్టని గుర్తించాలట. పెద్ద ఫోజు, సెలక్షన్ రాదని చెప్పుకోలేక..” విరగబడి నవ్వుతుంది పుష్యమి నవ్వీ నవ్వీ ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నవ్వకుండానే శ్రియ కళ్ళల్లో నీళ్ళు నిండుతాయి.
“అసలీ ప్రపంచం యింత తలక్రిందులుగా వుండటానికి కారణం ఒకే ఒక స్త్రీట. ఆమె తలక్రిందులుగా చూస్తూ ప్రపంచాన్ని తనకి అనుగుణంగా మార్చుదామని ప్రయత్నిస్తుందట. అయాం సిక్ ఆఫ్ దట్ వుమన్ అంటాడు. ఆవిడ అతని మేనత్తట. ఆవిడకి అతను పెట్టిన పేర్లు… బొద్దింక, తోకతెగిన బల్లి, హిట్లరు యింకా చాలానే వున్నాయి. తనకి నచ్చనివన్నీ ఆవిడ నిక్‍నేమ్స్ అయిపోయాయి” చెప్తున్న పుష్యమి ఆపేసి-
“శ్రియా! అదేంటి, నీ కళ్ళలో నీళ్ళు? ఓహ్! నేనొక పూల్ని, నీకో బ్రోకెన్ ఎఫేరుందన్న విషయం మర్చిపోయి ఏవేవో చెప్పేస్తున్నాను నిన్ను హర్ట్ చేసినట్టున్నాను” అంది బాధపడూ.
“అదేం లేదు. చాలా యింట్రెస్టింగా వున్నాయి నువ్వు చెప్పేవి. కానీ ఎందుకో మా యిల్లు, వూరు మరీమరీ గుర్తొస్తున్నాయి యీవేళ. మా అమ్మకూడా బాగా జ్ఞాపకాని కొస్తోంది. నాలుగు రోజులు వెళ్ళిస్తాను” అంది శ్రియ చప్పున కళ్ళు తుడుచుకుని. బాధ… వ్యక్తమవకుండా కన్నీళ్ళైతే ఆపగలదు కానీ లోలోపల సుళ్ళు తిరిగేదాన్నెలా ఆపడం?
సాకేత్ చాలా బాగా అర్ధమయ్యాడు శ్రియకి. చిన్నప్పుడు క్రమశిక్షణ పేరుతో అతన్ని బాగా పనిష్ చేసేది తల్లి. ఆఫీసునించి రాగానే మేనమామకి అతని అల్లరంతా చెప్పి కొట్టించేది. అత్తయ్య కలగజేసుకోబోతే గారంచేసి పాడుచేస్తున్నావని యిద్దరూ కలిసి ఆవిణ్ణి అనేవారు. దెబ్బలన్నీ తిన్నాక సాకేత్‍ని దగ్గరికి తీసుకుని ఆవిడ నిశ్శబ్దంగా ఏడ్చేది. అలా ఏడవటం తనెన్నోసార్లు చూసింది. మగపిల్లాడికీ ఆడపిల్లకీ పోలికేమిటి, ఎవరి అల్లరి వాళ్ళది… అదర్థం కాదేం? అని విసుగుపడేది. తనూ అల్లరి చేసేది. కానీ తన వంటిమీద ఎవరూ ఈగకూడా వాలనిచ్చేవారు కాదు. తన అల్లరికీ ఒకోసారి అతనికే దెబ్బలుపడేవి. అప్పుడు తిన్న దెబ్బలు ఎంత గుర్తో అతనికి! అందుకే తనని చేసుకోనన్నాడు. చేసుకుంటే తనకి భర్త. తన తల్లికి అల్లుడు. వెరసి తమిద్దరి చేతిలో కీలుబొమ్మ. అంతే! అందుకే చేసుకోలేదు. ఎంత తుడుచుకున్నా కన్నీళ్ళు ఆగడం లేదు శ్రియకి.
“పిల్లా! మీ వూరెళ్ళి అమ్మ దగ్గర్నుంచీ పిసరంత వోదార్పు తెచ్చుకుని రా!” అని దగ్గరుండి రైలెక్కించింది పుష్యమి.
శ్రియ యిల్లు చేరేసరికి అక్కడ మరొక డ్రామా నడుస్తోంది.
“సాకేత్ అక్కడెవరో అమ్మాయిని ప్రేమించాడటనే. మామయ్య మండిపడుతున్నాడు. ఆస్తిలో చిల్లిగవ్వ కూడా యివ్వనంటున్నాడు. అక్కడ తెలిసినవాళ్ళెవరేనా వుంటే వాళ్ళద్వారా ఆ వుద్యోగం కూడా పీకించమన్నాను. వెధవకి పొగరణుగుతుంది” అంది వైశాలి అక్కనుగా. శ్రియ దిగ్భ్రాంతిగా చూసింది తల్లిని అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు.
“నువ్వెందుకు వాళ్ళింటి వ్యవహారాల్లో తలదూరుస్తావు?” అడిగింది.
“వాళ్లిల్లేమిటి? నా అన్న యిల్లది. నా పుట్టినిల్లు”
“నీ అన్న యిల్లైతే, అత్తయ్యుంది, చూసుకుంటుంది”
“శ్రియా!”
“ఔనమ్మా! అతను మామయ్యకి ఎంతో, అత్తయ్యకీ అంతే. వాళ్ళ తర్వాతే నువ్వు. అతని విషయం వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకు మధ్యలోకి వెళ్తావు?”
“నీకేం తెలీదు. నువ్వూరుకో” అంటున్న తల్లిని అలాగే వదిలి మేనమామ దగ్గరకి వెళ్ళింది శ్రియ.
“శ్రియా! రామ్మా ఎప్పుడొచ్చావు? ఎలా వుంది బెంగుళూర్లో?” ప్రతాపరావు ఆప్యాయంగా ఆమెని దగ్గరకి తీసుకున్నాడు.
“బెంగుళూరు చాలా బావుంది మామయ్యా! మనింటికన్నా, మన వూరికన్నా విశాలమైనది. అక్కడ ప్రపంచాన్ని చూసాను” అంది శ్రియ. వెళ్ళి పక్కన కూర్చుంది.
“సాకేత్ సమస్య నన్ను చేసుకోవటమా వద్దా అనేది కాదు. మానుంచి దూరంగా వెళ్ళిపోవడం. మా అమ్మ పెత్తనంనుంచీ అత్తయ్యని విడిపించుకోవడం. అతన్ని చిన్నప్పుడెన్నిసార్లు కొట్టారో గుర్తుతెచ్చుకోండి. అల్లరిచెయ్యకుండా ఏ పిల్లలూ వుండరు. అలాగే అల్లరి చేసాడని ఒక్కగానొక్క కొడుకుని అంతగా కొట్టే పేరెంట్సూ వుండరు. మా అమ్మ మిమ్మల్ని రెచ్చగొట్టేది. మీరు అతన్ని కొట్టేవారు. అందుకతను మా అమ్మని ద్వేషిస్తున్నాడు. ఆవిడ అతనికి బొద్దింకలాగో, గొంగళీపురుగులాగో యింకా అసహ్యకరమైన కీటకంలాగో కనిపిస్తోంది. ఆ కోణంలోంచి చూస్తే అతనికి నామీద ఎలాంటి ప్రేమా వుండదు. వుండక్కర్లేదు కూడా. అతను చక్కగా పెరిగితే నాకు మంచి భర్త ఔతాడనేది అమ్మ ఆలోచన కావచ్చు. కానీ తను తిన్న దెబ్బలు అతని గుండెల్నింకా మండిస్తున్నాయి. మామయ్యా! మా అమ్మని ద్వేషించే, నన్ను ప్రేమించలేని సాకేత్ నాకూ వద్దు”
“శ్రియా!”
“అతను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి పుష్యమి అని నా ఫ్రెండు. చాలా మంచమ్మాయి. నేను బాధపడ్డాననో అమ్మకి కోపం వస్తుందనో కాదనకండి. మీరు వద్దనుకునే లోపాలేవీ తనలో లేవు. అలాగే నాకు నచ్చిన వ్యక్తి యింకా తటస్థపడలేదు. తారసపడగానే చేసుకుంటాను. నా జీవితం, నా యిష్టాలూ నావి. అలాగే అతని జీవితం, కోరికలూ, ఆకాంక్షలూ అతనివి” అనేసి ఆగకుండా అక్కడినుంచి కూడా వచ్చేసింది.
ప్రతాపరావు హృదయపు మూలమూలల్నీ కదిల్చాయి శ్రియ మాటలు. నిజమే! ఒక్కగానొక్క కొడుకు. తను ఎప్పుడూ వాడిని గారం చెయ్యలేదు. ఏవో అల్లరి పనులు చేసి తన్నులు తినేవాడు. వాడిని స్పేర్ చెయ్యనిచ్చేది కాదు వైశాలి. అక్కడ ఆయన ఆలోచనలు మలుపు తిరిగాయి.
తన చిన్నతనంనుంచీ యింట్లో వైశాలిదే పైచెయ్యి. డామినేట్ చేసేది. అలిగేది. దెబ్బలాడేది. అన్నిట్లోనూ ఆమె మాటే కరెక్టనేది. ఆడపిల్లని చాలా గారం చేసేవారు తమ తల్లిదండ్రులు. తనని సర్దుకుపొమ్మనేవారు. అలాగే అలవాటైపోయింది. తమ పెళ్ళిళ్ళయ్యాక కూడా ఆమెదే పైమాట. ఇప్పటికీ అదే పంతం.
తనెందుకు సాకేత్ యిష్టాన్ని మన్నించలేకపోతున్నాడు? వైశాలిలాగే తనకీ పంతం వుందా? ఇక్కడ నెగ్గించుకోవాలని చూస్తున్నాడా? ఆతర్వాత? సాకేత్ తమకి అన్నివిధాలా దూరమౌతాడు. అందుకేనా వాడిని కన్నది? వాడివలన ఎప్పుడేనా సంతోషాన్ని అనుభవించాడా? పోనీ… తను వాడికి సంతోషాన్నిచ్చాడా? చాలా అశాంతిగా అనిపించింది.
ఇంతలో వైశాలి గొంతు వినిపించింది.
“సాకేత్ విషయం ఏం చేసావన్నయ్యా?”
“వాడు నాకొక్కడే కొడుకు వైశాలీ!”.
“శ్రియ నాక్కూడా ఒక్కర్తే”
“ఐతే ఏం చెయ్యమంటావమ్మా?” కొంచెం విసుగ్గా అడిగాడు.
“ముందు ఏదో ఒక కారణం చెప్పి వాడినిక్కడికి పిలిపించు. కాళ్ళూ చేతులూ విరగొట్టేనా పెళ్ళి చేయిస్తానన్నావు చూడు, అదేదో యిప్పుడు చేయించు”
“శ్రియ వాడిని చేసుకోదట. తనక్కర్లేనివాడు దానికీ అక్కర్లేదట”
“చిన్నపిల్ల. దానికేం తెలుసు? వాడు చేసుకోనంటేనే కదా, అది వెతుక్కుంటూ బెంగుళూరు వెళ్ళిపోయింది?”
“అందరికీ అన్నీ తెలుసు వైశాలీ! ఆ విషయం మనకే తెలీదు”
“అంటే యిప్పుడేమంటావు?”
“వాడికి నచ్చిన అమ్మాయితో వాడి పెళ్ళిజరుగుతుంది. శ్రియ ఎంచుకున్నవాడితో శ్రియకి జరుగుతుంది. అదే ఇద్దరికీ మంచిది”


పుష్యమి ఫోన్ చేసింది శ్రియకి. “
“హలో! ఎలా వున్నావ్? సాకేత్ తల్లిదండ్రులు మా పెళ్ళికి వప్పుకోవటం లేదు. వాళ్ళ బొద్దింకే కారణమంటున్నాడు. మావాళ్ళకి యిష్టమైనా ఎటూ మాట్లాడలేకపోతున్నారు. గుళ్ళో చేసేసుకుందామంటున్నాడు తను పెద్దహీరోలా. మాఅమ్మావాళ్ళే కాదు, నువ్వూ లేకుండానే మా పెళ్ళి. ఇంకో గంటకి. మిస్సింగ్ యూ సోమచ్” అంది.
శ్రియ గుండెల్లో సన్నగా చీలిక వస్తున్నలాంటి బాధ. సాకేత్ తనలో సగం. ఆ సగం తనని విడిచి వెళ్ళిపోతోంది శాశ్వతంగా.


“నాన్నా! నేనూ పుష్యమీ గుళ్ళో పెళ్ళి చేసుకున్నాం. ఆశీర్వాదంకోసం అక్కడికొస్తున్నాం. మీకిష్టం లేకపోయినా అమ్మకి తన కోడల్ని చూపించడానికి” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సాకేత్ తండ్రికి మరో మాట మాట్లాడే అవకాశం యివ్వకుండా,
“ఒక్కగానొక్క కొడుకు.ఇప్పటికే చాలా దూరం చేసుకున్నాను. మళ్ళీ దగ్గరకి చేరుకునే అవకాశం వుందేమో చూడు రాజ్యలక్ష్మీ!” అన్నాడు ప్రతాపరావు భార్యతో. ఆయన గొంతులో ఆవేదన.
“వాడికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. మీరు రిసెప్షన్‍కి ఏర్పాట్లు చూడండి. అమ్మాయినీ ఆమె తల్లిదండ్రులనీ బంధువుల్నీ తీసుకుని బయలుదేరమంటాను. ఏరోజు వీలుగా వుంటుందో ఆ రోజుని ఏర్పాటు చేద్దాం” మృదువుగా అంది రాజ్యలక్ష్మి. చిన్నది శ్రియ చెప్తేగానీ ఈయనకి తెలిసిరాలేదు! చిన్నగా నిట్టూర్చింది.


శ్రియని అక్కడ చూసి చకితురాలైంది పుష్యమి. “శ్రియా! నువ్వు నువ్విక్కడ?”
ఆమె నవ్వేసింది.
“సాకేత్ గురించి అంతగా చెప్తున్నా ఒక్కసారేనా నాతో చెప్పలేదు” పుష్యమి ఆరోపించింది.
“చెప్తే?”
“మా పరిచయాన్ని స్నేహంగా మార్చుకుని ఒక కామన్‍ఫ్రెండులా అతని మనసు మార్చే ప్రయత్నం చేసేదాన్ని”
“సాకేత్ నన్ను కోరుకోలేదు”
“కానీ నువ్వుతన్ని ప్రేమించావు”
“ఏకపక్షప్రేమ చెల్లని నాణెం లాంటిది. ప్రేమ అనే నాణేనికి రెండు ముఖాలు. ప్రేమించడం, ప్రేమించబడటం. ప్లీజ్, ఈ విషయాన్నింతటితో వదిలెయ్. నువ్వు సంతోషంగా వుండు, తననీ సంతోషపెట్టు”


“అమ్మమ్మ తన నగల్ని నాకూ వదినకీ చెరిసగం యిచ్చింది. అప్పుడే దెబ్బలాడాను బైటినుంచి వచ్చినదానితో నేను పంచుకోవటమేమిటని. కానీ ఆవిడ వినలేదు. కూతురూ కోడలూ యిద్దరూ తనకి సమానమేనంది. నీద్వారా అత్తయ్యకిచ్చినవి కూడా మళ్ళీ మనింటికే వచ్చి చేరతాయనుకున్నాను. ఇలా జరిగింది. ఇప్పుడు అవన్నీ పుష్యమికి పెట్టేసింది. ఇంకా చేయిస్తుందట. మాకెవరున్నారూ.. అంటోంది వాళ్ళతో. వాళ్ళు అత్తయ్యకీవాళ్ళకీ, పుష్యమికీ బట్టకొంటున్నారట. షాపింగుకి వెళ్తున్నారు. మాటవరసకి నన్ను రమ్మంది అత్తయ్య. రానన్నాను. వదిలేసారు. ఐనా అత్తయ్యకేం సెలక్షనొచ్చు? వాళ్ళింట్లో దిండుగలేబుల దగ్గర్నుంచీ డోర్‍మేట్లదాకా అన్నీ నేను కొనుక్కొచ్చినవే. ఇప్పుడు నేను పనికిరాకుండా పోయాను” వైశాలి అక్కనంతా వెళ్ళగక్కుతుంటే శ్రియ అక్కడినుంచీ డాబామీదికొచ్చి నిలబడింది.
పక్కింట్లో సాకేత్ పెళ్లి రిసెప్షన్‍కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే కార్లు, వెళ్ళే కార్లు, తాము ఆమధ్యకి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినా అంతా పరాయిగా అనిపిస్తోంది. ఒకప్పుడు తనదే స్వతంత్రం అనిపించిన యిల్లిప్పుడు పుష్యమిది. రెండు కుటుంబాల మధ్య హద్దురేఖ వుండాల్సింది, తల్లి దాన్ని అతిక్రమించింది. ఆవిడని తిప్పికొట్టడంలో అది అగడ్తగా మారిపోయింది.
ప్రతాపరాంట్లో లైట్లు వెలిగాయి మిరుమిట్లు గొలిపేలా, ఉలిక్కిపడింది శ్రియ. తనేమిటిలా? చీకట్లో? వెళ్ళకపోతే పుష్యమి ఏమనుకుంటుంది? క్రిందికి రాబోతుంటే మెట్లమీద సాకేత్ ఎదురయ్యాడు. వెనకే పుష్యమి. అంతా చెప్పేసినట్లుంది.
“నాకు థేంక్స్ చెప్పవా?” ప్రసన్నంగా నవ్వుతూ అడిగాడు.
“ఎందుకు?” నవ్వింది శ్రియ.
“మన పెళ్ళి జరగకుండా ఆపినందుకు. అదే జరిగితే మరో ప్రపంచయుద్ధానికి తీసిపోయేది కాదు. యుద్ధాలన్నీ ఆధిపత్యంకోసం పోరుతో మొదలై స్వతంత్ర పోరాటాలతో ముగుస్తాయి. మన పెళ్ళి జీవితకాలపు యుద్ధమయ్యుండేది. అలాగే నీక్కూడా థేంక్స్”
“అదెందుకు?” అడిగింది మళ్ళీ నవ్వి.
“ఈ వెన్నెల కిరణాన్ని నా జీవితంలోకి పంపినందుకు. మా నాన్నకి లెక్చరిచ్చావటగా? అమ్మ చెప్పింది” అన్నాడు ఆరాధనగా పుష్యమిని చూస్తూ.
అతను నవ్వుతున్నాడు. పుష్యమికూడా సిగ్గుసిగ్గుగా నవ్వుతోంది. వాళ్ళిద్దరూ అలా నవ్వుతుంటే శ్రియ గుండె బరువెక్కిందిగానీ పెదాలు మాత్రం నవ్వుతూనే వున్నాయి.
తుమ్ రూరీ రహో!
మై మనాతా రహూ… ఎప్పుడో విన్న పాట మళ్ళీ యిప్పుడు గుర్తొచ్చింది. అలిగేది ప్రియురాలు కాకపోతే ప్రత్యర్ధి ఔతుందని. యిప్పుడర్థమైంది.
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 17/7/2003