“అంతా నీ స్వార్ధమేనా?”
“నాలో స్వార్ధాన్ని ఎక్కడ చూసావు నువ్వు? నామానాన్న నేను బతకాలనుకున్నాను. పిలిచి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళు. అందుకు ప్రతిగా
ప్రభాకర్‍ని నిలబెట్టాను. డబ్బు దగ్గిర మిమ్మల్నెవర్నీ ఎక్స్‌ప్లాయిట్ చెయ్యలేదే? ఒక తల్లి తన పిల్లలకోసం పడే తపన నీకు స్వార్ధంగా కనిపిస్తోందా మైకేల్?” సూటిగా చూస్తూ అడిగాను.
అతను తల దించుకున్నాడు. “ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావు?” చాలాసేపటికి నెమ్మదిగా అడిగాడు.
“ఈవేళ రాజ్‍మోహన్ మా యిద్దర్నీ చూసాడు. అతను నాపై చూపించిన అధికారాన్ని ప్రభాకర్ చూసాడు. ఈ సంఘటన ప్రభాకర్‍ని బాధపెట్టి వుంటుంది. ఇంత జరిగాక చెప్పకపోతే బాగుండదు. అందుకే చెప్పేసి…” నా గొంతు రుద్దమైంది. ఎందుకో తెలీదు… నిస్సహాయత ఒక పెద్దకెరటంలా నిలువునా ముంచెత్తింది. దాని వెనక నిస్పృహ. ఆ వెనక నిరాశ… భావోద్వేగాలనే మహాసముద్రం నన్ను క్రమంగా తనలోకి లాక్కోసాగింది. ప్రభాకర్ ఎలా అర్థం చేసుకుంటాడో! ఆ తర్వాత? మళ్లీ అంతా మొదటికొస్తుంది. ఈ ప్రభాకర్‍కి నామీద ప్రేమేంటి, అన్నీ పాడవటానికి కాకపోతే? నా జీవితంమీద నాకు హక్కు లేకపోవడాన్ని గుర్తించాను.
“చెప్పేసి…?” మైకేల్ నేను ఆపినదగ్గర వదిలిపెట్టలేదు. పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాడు.
“నేను ఇక్కడినుంచీ వెళ్ళిపోతాను. కన్సల్టెన్సీ మీరిద్దరూ నడుపుకోండి” అన్నాను. అతను నిశ్వసించాడు. ఏదైతే జరగకూడదని అతను అనుకున్నాడో అదే అన్నాను.
“నువ్వెందుకు వెళ్ళాలి? కన్సల్టెన్సీ నీది. ఇకపై నీదగ్గర చెయ్యాలో వద్దో ప్రభాకర్ నిర్ణయించుకోవాలి” అన్నాడు మైకేల్. నా పెదాలపై చిన్న నవ్వు. అందులో వ్యంగ్యం వుందా? దాన్ని చూసి వుంటే అతనికే తెలుస్తుంది.
లేచి నిలబడ్డాడు. “బాగా పొద్దుపోయింది. పైగా వర్షం. ఇక్కడుండటం బాగుండదు. వెళ్ళాంపద” అన్నాడు.
“ఎక్కడికి?” అని అడగబోతూ ఆగి పోయాను. ఇప్పుడిక నిర్ణయాలు తీసుకోవడం యింక నా చేతుల్లో లేదు.
హాస్టల్లోంచి రాజ్ జీవితంలోకీ, అక్కడ్నుంచి రోడ్డుమీదికీ, అడుగుపెట్టినప్పుడు వున్న తెగింపు యిప్పుడు నాలో లేదు. అనుభవాలు మనిషిని బలహీనపరచి ఆపైన పదేపదే తటస్థించి బండబారుస్తాయేమో!
మైకేల్ నన్ను వాళ్లింటికి తీసికెళ్లాడు.
“లూసీ! వసంత వచ్చింది, లోపలికి తీసికెళ్లు” అని బయటినుంచే చెప్పి, “ప్రభాకర్ దగ్గరకి వెళ్తున్నాను” నాతో అని, వెళ్ళిపోయాడు.
“అరే! వసంతా! రా లోపలికి… బాగా తడిసిపోయావే … వీడేడి? బండవెధవ… ఎండావానా తేడాలేకుండా తిరుగుతాడు. అందరూ తనలాగే అనుకుంటాడు” అంటూ లూసీ, వెనకే వాళ్లమ్మా వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్లారు. మేరీ తల తుడుచుకోవటానికి తువ్వాలు ఇచ్చింది. పొడిబట్టలు తీసి యిచ్చింది. అంటే తనదే నైటీ. నేను మార్చుకునేసరికి వాళ్లమ్మ కాఫీ యిచ్చింది. నాకిదంతా ఎలాగో అనిపించింది. నేనెవర్నో మైకేల్‍కి తెలుసు. రేవు వీళ్లకీ తెలుస్తుంది. తెలిసాక, వసంత… యిలాగట! అని నవ్వుకుంటారేమో! డబ్బు అవసరంగాబట్టి ఎదురుగా గౌరవిస్తూ, గౌరవిస్తున్నట్టు నటిస్తూ లోలోపల హేళన చేస్తారేమో! ఆత్మన్యూనతాభావం విషపువిత్తనంలా మొలకెత్తింది. ఒకరికి జవాబుదారీ లేనంతవరకూ ఎంత తప్పుచేసినా తలవంగదు. అప్రమేయంగానే జవాబుచెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది యిప్పుడు. మనుషులు ఇలాగో, ఎలాగో, ఏదో ఒకలాగో పుడతారు. ఆతర్వాత వాళ్ళని చెక్కడం మొదలౌతుంది. అప్పటిదాకా వాళ్ళలో వున్న సహజాతిసహజమైన స్పందనలన్నీ ఆ చెక్కుడులో పోయి, మూసబొమ్మలా తయారౌతారు. నా విషయంలో అలా జరగడాన్ని నేను గుర్తిస్తున్నాను.
మైకేల్ తల్లి భోజనం ఏర్పాట్లు చేస్తుంటే పెళ్ళింట్లో తిన్నవే అరగలేదని వద్దన్నాను.
“అలాకాదమ్మా! పిల్లల్తో కొంచెం తిను. ఎంత ఆకలేస్తే అంతే” అంది ప్రేమగా. కాదనలేకపోయాను. లూసీ మేరీలతో కలిసి కూర్చుని తిన్నాననిపించి లేచాను. మా తర్వాత మగవాళ్ళకి వేరే తీసి మూతపెట్టి ఆవిడా తిని లేచింది. గదిలో సామాన్లు అటూయిటూ సర్ది మధ్యలో పక్కలు వేసింది మేరీ. మైకేల్‍దో వాళ్ళ నాన్నదో పరుపు తెచ్చి నాకు వెయ్యబోతుంటే వద్దన్నాను. వాళ్లపక్కనే జంపఖానామీద పడుకున్నాను.
“వళ్ళు నొచ్చుతుందేమో, వసంతా!” అంది మైకేల్ తల్లి.
“ఫరవాలేదు” వారించాను.
మేరీ, లూసీ ఏవో కబుర్లు చెప్పబోయారుకానీ నేను వుత్సాహంగా లేకపోవటంతో మా సంభాషణ పెద్దగా సాగలేదు. ఈరోజు పెళ్ళివెంచర్లో ఎంత వస్తుందో, అందులో మైకేల్ వాటా ఎంతో తెలుసుకుందుకు మైకేల్ తల్లి చూచాయగా ప్రయత్నించింది. నేను దానికీ మౌనంగానే వుండిపోయాను. అది వాళ్ళ స్వవిషయం. వాళ్లలోవాళ్ళు చెప్పుకోవాలి. ఇంట్లో ఇదివరకంత లేమి లేదు. మైకెల్ తమ్ముణ్ణి రెసిడెన్షియల్ కాలేజీలో వేసారట.
“అంకుల్ అలాగే వున్నారా?” అడిగాను ఏదో అడగాలని.
“ఆయనా?! ఇంక మారడులే. ఇదివరకూ కొంచమేనా ఇంటిఖర్చుకి ఇచ్చేవాడు. ఇప్పుడు కొడుకు తెస్తున్నాడని అదికూడా మానేసాడు” అంది.
ఏవో మాట్లాడుతూ ఆవిడ నిద్రలోకి జారుకుంది. లూసీ, మేరీ కూడా. నేనొక్కదాన్నీ మిగిలిపోయాను. బైట యింకా వర్షం పడుతున్న చప్పుడౌతోంది. మైకేల్ రాలేదు. ప్రభాకర్ జరిగినదాన్ని ఎలా తీసుకుంటాడు? నాకోసం వస్తాడా? రాడా? అలా ఎదురుచూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. తెగుతున్న బంధంకన్నా, కోల్పోతున్నది గౌరవం కావడం నన్ను ఎక్కువ బాధపెడుతోంది.
ఉదయం లేచేసరికి కారిడార్‍లో ప్రభాకర్ గొంతు వినిపించింది. తలమీంచీ పెద్ద బరువు దిగినట్టయింది. నాకోసం వచ్చాడంటే అతనికింకా నామీద కొంచమైనా గౌరవం వున్నట్టే. గంటైందట వచ్చి. నేను నిద్రపోతున్నానని బైటికి వెళ్ళి మితృలు మళ్ళీ వచ్చారు. నేను లేచిన విషయం తెలిసి లోపలికొచ్చాడు ప్రభాకర్.
“గుడ్‍మార్నింగ్” చిరునవ్వుతో అన్నాడు. నేను జవాబు ఇవ్వలేదు.
“పద వెళ్ళాం” అన్నాడు లేవడానికి చెయ్యందిస్తూ. ఇక్కడేమీ మాట్లాడుకోకూడదన్న అతని సూచన నాకు అర్థమైంది. అతని చెయ్యి అందుకుని లేచి లోపలివెళ్లి వెంటనే తయారై వచ్చాను. బైక్‍మీద ఇద్దరం వెళ్తుంటే మైకేల్ చెయ్యి వూపాడు.
“నీ జీవితం నీదనుకున్నప్పుడు అక్కడెక్కడో కూర్చుని మైకేల్‍తో రాయబారం ఎందుకు?” దార్లో అడిగాడు. అతని గొంతు ఎప్పట్లాగే మెత్తగా వుంది. తీవ్రత లేదు. ఇతనికి అసలు కోపం రాదా?
“నేనలా అనుకోలేదు. ఆటోబయోగ్రఫీ పట్టుకుని తిరగలేనుగా?”
“చెప్పాను. నాకు యీ సొసైటీలో వుండే ద్వంద్వ విలువలు నచ్చవని”
“ఐనంతమాత్రాన? నేనెంత తెలివితక్కువదాన్నో మీ యిద్దరికీ చెప్పుకోవాలా?” వుక్రోషంగా అడిగాను.
“చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? ఇప్పుడేనా, చెప్తేనేగా తెలిసింది?” తల వెనక్కి తిప్పి అడిగాడు. అతని పెదాలమీద చిరునవ్వుంది. కోపంగా చూసాను.
అలంకార్‍దగ్గర ఒక సైడుకి బైక్ ఆపాడు. చుట్టూ చెట్లు, కింద చిన్న కాలువ, రాత్రంతా పడ్డ వానకి బురదనీళ్లు ప్రవహిస్తున్నాయి. కాలువమీద బ్రిడ్జి. రెయిలింగ్‍కి అనుకుని నిలబడ్డాను. పైన ఆకాశం నిర్మలంగా వుంది. ఇంకా ఎండ రాలేదు. కాంక్రీటు జంగిల్స్ మధ్యని కూడా రమ్యమైన ప్రకృతి! జనం లేకపోవటంతో ప్రశాంతంగా వుంది.
“నువ్వేం జరుగుతుందని భయపడి నాతో చెప్పలేదో సరిగ్గా నేనలాగే ఆలోచించాను వసంతా! అంతకన్నా లోతుగా ఆలోచించడానికి కొంత సంఘర్షణపడ్డాను. నువ్వొకరితో కలినుండి, అతని యిద్దరు పిల్లలకి తల్లివయావని తెలిసి నాకు మొదట వెగటనిపించింది. అవేవీ నాకు చెప్పకుండా దాచావని కోపమొచ్చింది. జవాబుగా నీకు దూరం జరగాలనుకున్నాను. కానీ నాకది సాధ్యపడలేదు. నాకు నీమీద చాలా ప్రేమ వుంది. అదెలాంటి ప్రేమో నాకు తెలీదుగానీ దాని తీవ్రత చెప్పగలను… నువ్వు లేనిదే నేను లేననిపించే ప్రేమ.”
“…”
“మైకేల్‍ని నువ్వడిగిన ప్రశ్న కరెక్టే. మా ప్రేమల్నిగాని విఫలప్రేమల్నిగానీ మేం చెప్పుకోలేదు. నా పరిచయంతోపాటుగా నేనిప్పటిదాకా ఎవర్నీ ప్రేమించలేదు. ఎవర్నీ మోసం చెయ్యలేదు. అనే స్టేట్మెంట్స్ యిస్తూ వెళ్లాననుకో, జనం నన్ను పిచ్చివాడిని చూసినట్టు చూస్తారు. ఎవరికి ఎంతవరకూ అవసరమో అంతవరకే చెప్పాలి. అది కామన్‍సెన్స్. కానీ మనిద్దరం యింత దగ్గిరకొచ్చాక కూడా చెప్పకపోడం”
అతను సూటిగా నాకేసి చూసాడు. నేను తలదించుకున్నాను. అతను అనుకుంటున్నంత దగ్గరితనం మామధ్య లేదనే విషయం తెలీదా? తను నాకు దగ్గరగా జరిగాడు. కానీ నాలో కూడా అతని దిశగా చలనం వుండాలికదా? అది గుర్తించలేదా? అతను మంచి స్నేహితుడే. కానీ అంతరంగరహస్యాలని పంచుకునేంత సన్నిహితుడు కాదు. మేమిద్దరమనే కాదు. ఏ యిద్దరు వ్యక్తులేనా యిటువంటి విషయాలని చెప్పుకోగలరా?
“నేను దాన్ని కూడా అర్ధం చేసుకోగలను. స్త్రీ అంటే అనుభవించదగ్గది, మగవాడి ప్రాపర్టీ అని శిలాక్షరాలతో మన సంస్కృతిమీద రాసుకున్నాం. మన సొసైటీలో వుండే పురుషాధిక్యత, పురుషాహంకారం అలాగే స్త్రీల న్యూనత వీటన్నిటికీ యీ భావాలే కారణం”
ప్రభాకర్ చెప్తుంటే నేను చకితురాలినయ్యాను. నాలో అప్పటిదాకా వున్న సంకోచంలాంటిది పొరలుపొరలుగా విడిపోయింది. పెళ్లి చేసుకోవాలని యిప్పటిదాకా అనిపించలేదు. బహుశః ఆ సంకోచంచేతనే కావచ్చు. కానీ ప్రభాకర్‍ని చేసుకుని సర్దుకోగలిగితే?
“వసంతా! మనముందు రెండు దారులున్నాయి. మొదటిది పెళ్లి చేసుకోవడం, రెండోది స్నేహితుల్లా మిగిలిపోవడం. మన పరస్పర అవసరాల గురించి యింతకు ముందే చెప్పాను. నేనైతే మొదటిదే ఎంచుకుంటాను” అన్నాడు. నేను మాత్రం ఎటూ నిర్ణయించుకోలేక పోయాను.
“మనం పెళ్లి… ఎలా సాధ్యం?” అస్పష్టంగా అడిగాను.
“ఎందుకు? అతన్తో నీది పెళ్ళి కాదుగా? లివింగ్ ఇన్ రిలేషన్లో చట్టపరమైన సమస్యలు వుండవనుకుంటాను. ఒకసారి నువ్వు పెళ్లి చేసుకుని సెటిలైతే నీ జోలికి రావటానికి అతనూ ఆలోచిస్తాడు. అంతేకాదు, పిల్లల్ని అసలు పట్టించుకోవేమోనన్న భయంతో తీసుకొచ్చి యిచ్చేస్తాడు”
నా చేతులు బ్రిడ్జి రెయిలింగ్‍మీద బిగుసుకున్నాయి. ఉద్వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టమనిపిస్తోంది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది. పిల్లల్ని తెచ్చుకోవడం అంత తేలికా? నమ్మాలనిపించలేదు.
“కానీ నేను… నా పిల్లలు.. నా గతం యిదంతా నీకు సమస్య కాదా? సమాజంలో ఎలా?”
“నువ్వింత సంఘర్షణ తట్టుకుని నిలబడలేదా, వసంతా? అలాగే” అతను నా దగ్గరగా వచ్చాడు భుజంమీద చెయ్యివేసాడు. నాలో విద్యుల్లతలు పరిగెత్తలేదు. రక్తం పొంగులెత్తలేదు. నాకిది తొలి ప్రేమ కాకపోవడం ఒకటే కారణం కాదు. అతని స్పర్శతో నాకు అందుతున్నది స్నేహం. అందుకే మనసుకి ప్రశాంతంగా అనిపించింది.
“సంఘం గీసిన హద్దుల్ని కొద్దిమంది దాటారు వసంతా! వాళ్ళు ఆ ఫ్రేమ్‍లో ఇమడలేకపోయినవాళ్ళో, దాని అవతలకి చూసి ఆలోచించినవాళ్ళో ఔతారు. వాళ్ళంతా చెడ్డవాళ్లని అనలేం. నిన్నూ నేను అలా అనను. మనం పెళ్ళిచేసుకుంటే నేనుకూడా ఆ కొద్దిమందిలో ఒకడినౌతాను. నన్ను నేను చెడ్డవాడినని ఎలా అనుకుంటాను? … నీ పిల్లల్ని నేను తండ్రిలా ప్రేమించలేకపోవచ్చు. కానీ… నీకు ముఖ్యమైన ప్రతిదానికి నేనెలాంటి ప్రాధాన్యత యిస్తానో అలా… నా చుట్టూ వుండే పిల్లల్ని ఎలా చూస్తానో అలా… వాళ్లని చూడగలను” అన్నాడు. అతని గొంతులో స్వచ్ఛమైన ఆత్మీయత ధ్వనించింది.
మాటల్లో వుండే భావాలు చేతలుగా మారేప్పుడు కొంత మార్పుకి లోనౌతాయి. ఒక రచయిత ఎన్నో వూహలు చేస్తాడు. అవి కాగితంమీద ప్రకటితమయ్యేసరికి అందులోని చాలాభాగం మారిపోతుంది. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి చదువుతాడు. మెదడులో చదివినదాన్ని నిక్షిప్తం చేసుకుంటాడు. పరీక్ష రాసేసమయంలో ఆ చదివిన అంతటినీ వ్యక్తపరచలేదు. అందుకే వివరణాత్మకమైన జవాబుల్లో మార్కులు తగ్గుతాయి. ఇవన్నీ నాకింకా అర్థమవని విషయాలు.

పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో 16 July, 1962 లో జననం. వరంగల్‌లో వుద్యోగం. హెడ్పోస్ట్‌మాస్టర్గా వరంగల్‌లో స్వచ్చందపదవీ విరమణ.
వివాహం శ్రీ చదలవాడ విష్ణుమూర్తిగారితో. వారు డెప్యూటీ ఏగ్జిక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయారు.
మొదటి కథ అనగనగా 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలినక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005 లో వచ్చింది. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, తిరస్కృతులు, నీకోసం నేను అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ, 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఎంతెంతదూరం? అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ఇవికాక కథలకు మరో ఏడెనిమిది బహుమతులు వచ్చాయి.
కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
వ్యక్తిత వికాసానికి దోహదం చేసే, మానవీయతకి పాదుచేసే, కౌటుంబిక వ్యవస్థలోని ఔన్నత్యాన్నీ లోటుపాట్లనీ ఎత్తిచూపే చక్కని రచన. చదివేది ఏ వయసువారైనా ఎంతో కొంత ఉపయోగపడేలా తీర్చిదిద్దిన కథనం. రచయిత్రికి అభినందనలు!
thanks ji