తిరస్కృతులు – 18 by S Sridevi

  1. తిరస్కృతులు – 1 by S Sridevi
  2. తిరస్కృతులు – 2 by S Sridevi
  3. తిరస్కృతులు – 3 by S Sridevi
  4. తిరస్కృతులు – 4 by S Sridevi
  5. తిరస్కృతులు – 5 by S Sridevi
  6. తిరస్కృతులు – 6 by S Sridevi
  7. తిరస్కృతులు – 7 by S Sridevi
  8. తిరస్కృతులు – 8 by S Sridevi
  9. తిరస్కృతులు – 9 by S Sridevi
  10. తిరస్కృతులు – 10 by S Sridevi
  11. తిరస్కృతులు – 11 by S Sridevi
  12. తిరస్కృతులు – 12 by S Sridevi
  13. తిరస్కృతులు – 13 by S Sridevi
  14. తిరస్కృతులు – 14 by S Sridevi
  15. తిరస్కృతులు – 15 by S Sridevi
  16. తిరస్కృతులు – 16 by S Sridevi
  17. తిరస్కృతులు – 17 by S Sridevi
  18. తిరస్కృతులు – 18 by S Sridevi
  19. తిరస్కృతులు – 19 by S Sridevi
  20. తిరస్కృతులు – 20 by S Sridevi

“కొన్నాళ్ళు అద్దె యింట్లో వున్నారు. తర్వాత స్థలాలు అమ్మేసి చిన్న యిల్లు కొనుక్కుని అందులో వుంటున్నారు. ఇప్పుడు ఆ మనిషికి యిరవైనాలుగ్గంటలూ తాగుడే. తాగేసి అందర్నీ తిడుతూ వుంటాడు” అల్లుడు… కూతురికి అపురూపమైన కానుకగా ఎంచెంచి వెతికి తెచ్చిన మనిషి… కాళ్ళు కడిగి, కన్యధారపోసి, తమ పంచప్రాణాలూ ఐన ఆడపిల్లని తోడిచ్చి పంపిన మనిషి… ఒకప్పటి నవయువకుడు, ఇప్పుడు శక్తులన్నీ పోగొట్టుకుని కళ్ళముందు తిరుగుతున్న వృద్ధుడు… అతన్ని గురించి చెప్తుంటే అమ్మమ్మ గొంతులో దుఃఖపుజీర తొంగిచూసింది.
“ఎవరమ్మమ్మా?” వాస్తవాన్ని జీర్ణించుకోలేక అడిగాను.
“ఇంకెవరు? మీ నాన్నే” అంది పెరుగుపోస్తూ.
నాకొక్కసారి ఏడుపు ముంచుకొచ్చింది. నాన్నని అలా పూహించుకోలేకపోయాను. తండ్రి ఎలాంటివాడైనా పిల్లలకి అతను హీరోయే. చిన్నప్పట్నుంచీ మమ్మల్ని హాస్టల్స్‌లో వేసి పెంచి వుండవచ్చు. కానీ శలవులిస్తే మేం వస్తామని మాకన్నా ఎక్కువగా ఎదురుచూసేవారు. మాతో షటిల్ ఆడేవారు. కేరమ్స్, చెస్… ఒకటేమిటి, అన్నిట్లోనూ ప్రవేశం వుండేది. పెద్ద నైపుణ్యం లేకపోయినా మమ్మల్ని నిరుత్సాహపరచడం
ఇష్టంలేక అన్నీ ఆడేవారు. అమ్మకన్నా నాన్నతోటే నాకు అనుబంధం ఎక్కువ. అన్నం నోటికి ఎక్కడంలేదు. దు:ఖం తెర్లుకు వస్తోంది. కంచంలో గీతలుగీస్తూ కూర్చున్నాను.
“అలా కెలుకుతావేమే? ఇంకా సరిగ్గా తినడం రాలేదా?”” అని అమ్మమ్మ కోప్పడింది. ఆవిడ గొంతు బొంగురుపోయింది.
“ఎవరైనా నైతిక మార్గంలో వెళ్లాలమ్మా! దారి తప్పి నడుస్తున్నప్పుడు ఎదురుదెబ్బలు తప్పవు. మీ అమ్మని నేను సరిగ్గానే పెంచానుగానీ
డబ్బుపట్ల భ్రమనేది నా పెంపకాన్ని సవాలు చేసి నెగ్గింది. అది చదువుకుంటానంటే చదివించాను. ఉద్యోగం చేస్తానంటే దానికి కాదనలేదు. మీ ఇంట్లో ఖర్చులవీ చూసాక నిలదీసి అడిగాను. అది నవ్వేసి-
ఈరోజుల్లో ఎవరూ మడికట్టుకుని కూర్చోరమ్మా! మనం తీసుకోమని నియమం పెట్టుకుని కూర్చున్నంత మాత్రాన మన దగ్గర తీసుకునేవాడు వూరుకోడుకదా! ఇవ్వక తప్పనప్పుడు తీసుకోకమాత్రం తప్పుతుందా?
-అంది.
“ఇచ్చిపుచ్చుకోవటాలనేవి మన సమాజంలో సర్వసాధారణం. ఎవరి యింటికేనా వెళ్తే వుత్తిచేతుల్తో వెళ్ళం. ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించిగానీ పంపం. దాన్ని ఒక తప్పనిసరి లావాదేవీగా మార్చేసి, రూపురేఖలని లంచగొడితనంగా మలిచాము. వసూ! రోజులనిబట్టి అలా తీసుకున్నా ఎవరికీ హాని కలగకుండా తీసుకోవాలి. ఒకడికి పనిచేసి పెట్టడానికి తీసుకోవచ్చుగానీ అది మరొకడి పని చెడగొట్టడం కారాదు. కడుపుమండితే ఎవరూ వూరుకోరుకదా? మీనాన్న సంతకం పెట్టిచ్చిన ఎస్టిమేట్‍లో ఏవో లొసుగులున్నాయట. కాంట్రాక్టర్‌తో లాలూచిపడ్డాడు. కట్టిన బిల్డింగ్ కాంప్లెక్స్ పేకమేడలా కూలిపోయింది.. కొనుక్కున్నవాళ్ళంతా కోర్టుకెళ్లారు. ఎస్టిమేట్ రాసిచ్చిన నేరానికి యితడికి పడింది. నిజానికి యితడి లెక్కల ప్రకారం చేస్తే కూడా బిల్డింగ్ అంత తొందరగా దెబ్బతినదట. కానీ ఆ కాంట్రాక్టరు యింకా కక్కుర్తిపడటంతో యిదంతా జరిగింది”
“ఎన్నాళ్ళైంది డిస్మిసై?”
“అప్పుడే మూడేళ్లింది.”
“అప్పీలు చేసారా?”
“అన్నీ అయ్యాయి. ఇతన్ని ముంచితేగానీ ఆ కాంట్రాక్టరు బైటపడడు. అందుకని చాలా గట్టి ప్రయత్నాలు చేసాడు. తన్నుమాలిన ధర్మం వుండదుకదా?””
నేను తినటం ముగించి లేచాను. మనసంతా బరువుగా ఉంది. మూడేళ్లక్రితం…అంటే నేనప్పుడు రాజ్‍తో కొడైలో వున్నాను. అక్కడ అతనొక కొత్త వెంచరు స్టార్ట్ చేసాడు. దాదాపు ఆర్నెల్లు వున్నాము అక్కడ. చాలా ఎంజాయ్ చేసాం. సుమ చిన్నపిల్ల. ఇప్పుడు తలుచుకుంటే అసహ్యంగా అనిపిస్తోంది. ఒకవైపు ప్రమీలాదేవిని బాధపెట్టి మరోవైపు అమ్మానాన్నలు యింత కష్టంలో వుంటే నేను నిజంగా ఎంజాయ్
చేసినట్లేనా?
కంచం కడిగి స్టాండులో పెట్టి వచ్చాను. అమ్మమ్మ పెరటి వాకిట్లో కూర్చుని వత్తులు చేసుకుంటుంటే ఆవిడ వొళ్లో తలపెట్టుకుని ముడుచుకు పడుకున్నాను. చేస్తున్న పని ఆపి, “కింద పడుకున్నావేమే? చాపా దిండూ తెచ్చుకో”” అంది.
“నాకిలాగే బాగుంది” ఆవిడ వొళ్ళో తలదాచుకున్నాను. ఆవిడ చేతిలో వున్న పత్తిని పక్కనిపెట్టి, చేసిన వత్తుల్ని జాగ్రత్తగా లెక్కపెట్టి పత్తితోపాటుగా డబ్బాలో వుంచి మూతపెట్టింది. నెమ్మదిగా నా భుజాలు పట్టుకుని సరిగ్గా తిప్పింది.
“అపరాధభావన నన్ను నిలువునా దహించేస్తోందమ్మమ్మా!” అన్నాను, ఆవిడ ముఖంలోకి సూటిగా చూడలేక.
“ఎవరిపట్ల?”
“నేను చేసిన పనిపట్ల. చేసినప్పుడు అందులోని వుచితానుచితాలు తెలీలేదు. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోలేకపోతున్నాను””
“ఎందుకు? ఇద్దరూ గొడవపడ్డారా?””
“అంతకంటే ఎక్కువే”
“ఏం జరిగింది? ఉన్నపళంగా ఈ రాకేంటి?””
సంకోచాన్ని విడిచిపెట్టి జరిగినవన్నీ చెప్పాను.
ఆవిడ చాలా శ్రద్ధగా విన్నది. మధ్యలో ఏమీ మాట్లాడలేదు. రాజ్‍తో పరిచయం దగ్గర్నుంచీ మొదలుపెట్టి అతన్నుంచి తప్పించుకోవడంకోసం యిక్కడికి రావడందాకా చెప్పాను. ప్రభాకర్ గురించి చెప్పాను.
“అతనేమంటాడు?” సాలోచనగా అడిగింది రాజ్‍గురించి.
“ఆ పంపించెయ్యటం నా మంచి కోరేనంటాడు”
“మరి పిల్లల్ని వాళ్ల దగ్గర వుంచుకోవడం?”
“అదీ నా మంచికోరేనట”
“ఆ తెలివి ముందేమైందట? తనకన్నా వయసులో బాగా చిన్నపిల్లని మభ్యపెట్టినప్పుడు?”
“అందులో అతని తప్పేం లేదు. నా అంతట నేనే అతని దగ్గిరకెళ్లాను. తిరిగి వెళ్ళిపొమ్మనే చెప్పాడు. నేనే వినలేదు”
“ఆ తర్వాత? నీ బతుకేదో నువ్వు బతుకుతుంటే వదిలెయ్యక మళ్లీ ఎందుకు నీ విషయాల్లో తలదూర్చడం?”
“అదే నాకూ అర్థం కావడంలేదు”
“మరి యితనేమంటాడు?” ప్రభాకర్ గురించి అడిగింది.
“మొదట యిక పిల్లలు నా దగ్గరకి రారనే అనుకున్నాను. ఆ టైంలో తనంతట తనే అడిగాడు చేసుకుంటానని. ఏ ఒక్కటీ దాచకుండా
చెప్పాను. తర్వాత వీళ్ళు వచ్చారు. అప్పుడు కూడా నిర్ణయాన్ని మార్చుకోలేదు. రాజ్ వచ్చి వెళ్తుంటే మాత్రం అతనికి కోపం వస్తోంది”
“ఈ పరిస్థితుల్లో తొందరపడి పెళ్లి చేసుకోకుండా యిక్కడికొచ్చేసి చాలా మంచిపని చేసావు. తొందరపాటు పనులెప్పుడూ మంచి ఫలితాన్నివ్వవు నెమ్మదిమీద ఆలోచిద్దాం ఏంచెయ్యాలో. మీ నాన్నంటే అలా తయారయ్యాడుగానీ అమ్మ బాగానే వుంది. ఏదో
ఒకటి ఆలోచిస్తుంది” ఓదార్పుగా అంది.
మనసు విప్పి అంతా చెప్పేసాక చాలా తేలిగ్గా అనిపించింది. ఇంతదాకా నేను చేసినది ఒంటరిపోరాటం. ఇప్పుడింక నాకందరూ వున్నారు. వీళ్లు నన్నొదులుకోలేదు. నా కోసం ఆరాటపడుతూనే వున్నారు.
“ఇక్కడికి రావాలనీ, అమ్మావాళ్ళనీ చూడాలనీ ఎప్పుడూ అనిపించలేదా వసూ?” ఉన్నట్టుండి అడిగింది ఆవిడ.
“నా బతుకు నాదనుకున్నాను. ఎవరూ ఒక ఫోనుగానీ, రావటంగానీ చెయ్యలేదు. నామీద మీకు కోపంగా వుందేమోననుకున్నాను” తలదించుకుని చెప్పాను. “అదీకాక… నాన్నని ఫేస్ చెయ్యాలంతే భయం వేసింది. అమ్మైతే ఏదో ఒకలా నచ్చజెప్పచ్చు”
ఆవిడ నిట్టూర్చింది. “బంధాలు తుంచుకుంటున్నారు. చుట్టూ గోడలు కట్టుకుంటున్నారు. ఎందరు పిల్లలు హాస్టళ్లలో వుండి చదువుకోలేదు? మీలా ఎవరూ లేరు. ఈ బలహీనత ఎక్కడినుంచీ వచ్చిందో తెలుసా, ఇంటిని కట్టి వుంచే బంధం అమ్మ. అక్కడ బలహీనపడింది. మీ అమ్మ డబ్బుపిచ్చిలో పడిపోయింది. చదువుకోవటందగ్గరా, వుద్యోగం చెయ్యటందగ్గరా ఆగలేదు అది ఒక మగవాడిలా డబ్బువేటలో పడిపోయింది. మీకు మంచీ చెడూ నేర్పలేదు. ఎలా బతకాలో తను బతికి చూపించలేదు” అమ్మమ్మ అక్కడే గోడకి జారబడింది. కళ్ళలోంచీ నీళ్ళు జారిపడ్డాయి. అమ్మమ్మ బాధ లోతెంతో తర్వాతగానీ నాకు తెలీలేదు.
లేచి యిల్లంతా కలియతిరిగాను. చిన్నప్పుడు ఎన్నెన్ని ఆటలాడుకున్నామో! వేసవి సెలవులివ్వగానే హాస్టల్‍నుంచీ తిన్నగా యిక్కడికి వచ్చేసేవాళ్లం. ఉయ్యాలలూ, దాగుడుమూతలూ ఎన్నని? సాయంత్రమయ్యేసరికి పెరట్లో నిలబడేదాన్ని, పశువులకాపర్లు ఆవుల మందల్ని
తోలుకుంటూ ఏవో పదాలని పాడేవారు. వాటిని వింటుంటే చెవుల్లో అమృతం వొలికినట్టుండేది. రాత్రి వెన్నెల్లో ఆటలు వేరే! ఏమైపోయాయో ఆరోజులన్నీ !


రెండు రోజులు గడిచేసరికి బాగా తేరుకున్నాను. అమ్మమ్మ ఆదరణ నాలో నిద్రాణమైన ఉత్సాహాన్ని వెలికి తీస్తోంది.
నీకేం పర్వాలేదు, మేమంతా వున్నాం- అనే ఒక్కమాటా మంత్రంలా పనిచేసి నాకో కొత్త శక్తినిచ్చింది.
“నా వస్తువులన్నీ అందరికీ పంచిచ్చేసాను వసంతా! నీ కోసమని యివి దాచిపెట్టాను” అని వెండికంచం, గ్లాసు, రెండుతులాల బంగారం గొలుసూ యిచ్చింది. కంచం చూస్తుంటే తాతయ్య గుర్తచ్చాడు. అది ఆయనదే… మాకు కాస్త వూహ తెలుస్తుంటే ఆయన పోయారు.
“ఇప్పుడే ఎందుకు?” అడిగాను.
“ఒకసారి దొంగలు పడ్డారు. ఏమీ పోలేదనుకో. కానీ పెద్దదాన్ని ఎప్పటికో ఒకప్పటికి యివ్వాల్సినదేగాని నాతోనైతే రావు. అలాంటప్పుడు యిచ్చేస్తేనే మంచిదని. నాలుగేళ్ళనాడు పెద్దమ్మ వచ్చినప్పుడు కూర్చోబెట్టి పంపకం వేసేసాను” అంది.
“నీ దగ్గిరేదాచు” అన్నాను.
“గొలుసు వేసేసుకో” అంటూ నా మెడకేసి చూసి “అదేమిటీ, మంగళసూత్రం లేదు?” అంది అప్పుడే గుర్తించినట్టు. ఎలా చెప్పను, నాకు ఇలాంటి విషయాలమీద ఆసక్తి లేదని? ఇప్పటికీ యింత జరిగాకకూడా.
“అదే అతనికి లోకువైంది. ఎంతైనా పెళ్లి చేసుకున్న తీరు వేరు. ఏ గుళ్లోనో చేసుకోలేక పోయారా?” అంది.
కానీ పెళ్లనేది మేం కలిసి వున్నప్పుడెప్పుడూ ఆటంకం కాలేదు. అసలు మాయిద్దరికీ పెళ్లవలేదనిగానీ పెళ్లికాకుండానే కలిసి వుంటున్నామనిగానీ
ఎప్పుడూ అనిపించలేదు. రాజ్ ప్రవర్తనలో అలాంటి భావం ఎప్పుడూ వ్యక్తమయ్యేది కాదు. చాలా గౌరవంగా చూసేవాడు నన్ను.
అమ్మమ్మ అలా అడుగుతుంటే… యిప్పుడు నాకు ఆ విషయంలో తప్పు చేసినట్టనిపిస్తోంది. ప్రవాహానికి ఎదురీదినవాడు వడ్డు చేరాలి. కొట్తుకుపోకూడదు. లేకపోతే వాలునిబట్తి వెళ్ళిపోవాలి. సమాజపు విలువలకి ఎదురుతిరిగినప్పుడు గెలిచి చూపించాలి. మళ్లీ నైతికబలంకోసం ఆ సమాజం మీదే ఆధారపడకూడదు. మౌనంగా అక్కడినుంచి వచ్చేస్తుంటే ఆవిడే మళ్లీ అంది.”
“కనీసం ఆ గొలుసు లోపలికి వేసుకో. ఇది అసలే పల్లెటూరు. మనం మనశ్శాంతితో వుండాలంటే ఎదుటివాళ్లకి కూడా విలువివ్వాలి. మనని మనంకన్నా అవతలివాళ్లని పట్టించుకుంటే ఎక్కువ సుఖం దొరుకుతుంది”
వచ్చి వరండాలో కూర్చున్నాను. తేలికపడ్డ మనసు మళ్లీ బరువెక్కింది. చీకట్లు ముసురుకున్నట్టుంది. సంతోషంగా వుండటానికి అలా లేకపోవడానికీ ఎంత తేడా! రెండూ నా చేతిలో లేకపోవడాన్ని గుర్తించాను. అమ్మమ్మ మెత్తగా మాట్లాడితే సంతోషం కలిగింది. ఆవిడొక మాటనగానే బాధ కలిగింది. నాకోసమే నేను బతకాలంటే చుట్టూ ఎవరూ వుండకూడదు. రాజ్ అదే చేసాడు. నన్నొక అద్దాల భవనంలో
వుంచి జాగ్రత్తగా కాపాడుకున్నాడు. తనతో తీసికెళ్లినప్పుడు భార్యననే చెప్పేవాడు. అందులో చాలామందికి నేనతని భార్యని కాదని తెలుసు. ఐనా రాజ్ మాటల్ని మన్నించేవారు. నా గ్రేస్, డిగ్నిటీ, కల్చర్…వాటితో సమతూకంగా అతనితో వాళ్లకుంటే అవసరం, మరోమాట మాట్లాడనిచ్చేవి కాదు. ఆ తర్వాత….కన్సల్టెన్సీ నడుపుతున్నప్పుడు నా గతం ఎవరికీ తెలీక గౌరవించారు. ఇప్పుడింక నా అసలు
విలువని ఎదుర్కోవాలి.
“నేను అన్నానని బాధపడకు. మనం నలుగుర్లో వున్నప్పుడు నలుగురిలాగే వుండాలి. లోకులు పలుగాకులు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మనస్తత్వం. నీకు ముఖ్యం అనిపించనిది, అసలే ప్రాధాన్యం లేనిది మరొకరికి ప్రాణాధారమౌతుంది. నీకు అవసరమైనదాని విలువ ఎదుటివాడి దృష్టిలో గుడ్డిగవ్వంత. వీళ్లందరితో సంఘర్షిస్తూ కూర్చుంటే నువ్వేం చెయ్యాలనుకుంటావో అది చెయ్యలేవు” నేనలా కూర్చోవటం చూసి అమ్మమ్మే
మళ్లీ అంది.
ఔను! నేను బతకడం నేర్చుకోవాలి, పుస్తకాల్లోలా కాదు- వాస్తవంలో.