ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

ప్రభాకర్ ధూపాటి గారి Professional Dignity అనే ఆంగ్లకధకు తెలుగు స్వేఛ్ఛానువాదం.

నేను ఏభయ్‍లలో వున్నాను. నాకు నేను పుట్టిన తేదీ తెలియదు. నా సరైన వయసూ తెలియదు. స్కూల్ మొహం చూడలేదు. ఎప్పుడయినా అవసరం అయితే వేలిముద్ర వేయటం తప్ప అక్షరజ్ఞానం లేదు.
నా భర్తకు కాలేయం పాడయిపోయిందన్నారు. అంటే ఏమిటో నాకు తెలియదు కానీ దాని కారణంగా నా భర్త పోయాడు. ఆ జబ్భు వచ్చిన కొత్తలో నొప్పి అనేవాడు. అక్కడే ఉన్న ఆరెంపీ దగ్గరకి తీసుకువెళ్ళాను. ఆ తరవాత హైద్రాబాద్ తీసుకువెళ్ళమంటే అక్కడికి తీసుకువెళ్ళాను. రెండుచోట్లా డాక్టర్లు నా భర్తని తాగుడు మానమన్నారు. ఆ నాటుసారా తాగడం మంచిది కాన్నారు. కానీ అతను వినలేదు.
తాగుడు పక్కకి పెడితే అతను సౌమ్యుడు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకునే మనిషి. నన్ను ,పిల్లలను బాగా చూసుకునేవాడు. మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అతని సౌమ్యతత్వంవలన అతనికి మా గ్రామంలో ఎవరితో గొడవలు ఉండేవి కాదు.
తాగుడు కారణంగా విసిగిపోయినపుడల్లా నేను అతనిమీద అరిచేదాన్ని. నేను అరిస్తే అతను తిండి మానేసేవాడు. అతను తినకపోతే నాకు మరింత బాధ కలిగేది. ఎంత అరిచీ లాభంలేక, చేసేది లేక నిస్సహాయత తో ఏడిచే దాన్ని. నేను ఏడిస్తే అతను కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు. ఇంకెప్పుడూ తాగను అనేవాడు. కానీ ఆ టైం అయేసరికి నాలుక పీకేదేమో, అతని బలహీనత అతను నాకిచ్చిన మాటను జయించేది. దానితో కధ మళ్ళీ మామూలే.
మా గ్రామంలో చాలామంది మగవాళ్ళు తాగుతారు. ఈ తాగుడువల్ల కొందరు ముప్పయిలోనే పోయారు. నావరకు నాకు ఈ నాటుసారాని మించిన విషం లేదనిపిస్తుంది. ఇందరు చస్తున్నారని తెలిసినా ప్రభుత్వం ఎందుకు ఈ సారా అమ్మకాలు అనుమతించడం, ప్రోత్సహించటం చేస్తుందో అనిపిస్తుంది. వాళ్ళ ఆదాయాలకోసం, ఓట్లకోసం ఈ నాయకులు, ప్రభుత్వాలు సారా సరఫరా, అమ్మకాలు చేయిస్తున్నారు. ఈ తాగుడువల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నా వాళ్ళకి పట్టదు.
నాకు పదేళ్ళ వయసులో పెళ్ళైంది. అప్పటికి నా భర్తకి పదిహేడేళ్ళు. అప్పుడే గ్రామంలో మంగలిపని చేస్తూ చిన్న సంపాదన మొదలుపెట్టాడు. ఈరోజుల్లోలా అప్పుడు కుర్చీలు, బల్లలు, పెద్దపెద్ద అద్దాలూ, హడావుడులూ లేవు. మధ్యాహ్నంవరకు ఇంటి దగ్గర క్షవరాలు చేసి తరవాత స్నానం చేసి ఏదో తిని కల్లు తాగటానికి ఊరవతలకి పోయేవాడు. నాకదేమీ అభ్యంతరకర విషయంలా అనిపించేది కాదు. ఊర్లో అందరు మగాళ్ళూ తాగుతారు, ఇతనూ తాగుతున్నాడనుకునేదాన్ని. పండగలకీ, పబ్బాలకీ, ఊరిసంబరాలకు ఆడవాళ్లు కూడా తాగేవారు. ఊరంతటికీ ఒక పూజారిగారి కుటుంబం, ఒక బనియా కుటుంబం తప్ప అన్ని కుటుంబాలవాళ్ళు తాగేవారు.
మా ఊర్లో పటేల్ కుటుంబం పెద్ద భూస్వాములు. వారిళ్ళలో ఆడా, మగా ఇళ్లలో తాగేవారు. మగవాళ్ళు రోజూ, ఆడవాళ్లు ప్రత్యేకదినాల్లో తాగేవారు. అప్పట్లో అందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడూ లభ్యం అయే మత్తుపానీయం కల్లు.
నా భర్తతోపాటు చాకళ్ళూ, మంగళ్ళు, సాలెలూ, వడ్రంగులూ, ఇనపసామానుల పని చేసేవారూ ఇలా వారూ, వీరూ అని లేదు. కులవృత్తులు చేసుకోవటం, పనులయాక అంతా కలిసి కల్లు తాగటానికి పోవటం సర్వ సాధారణం. గౌడులు సంపన్న రైతులకు ఇళ్ళకి కల్లు సరఫరా చేసేవారు. మిగిలిన గ్రామస్తులంతా కల్లుకోసం ఊరి బయటకి పోయేవారు.
ఆ రోజుల్లో డబ్బులతో పెద్దగా పని ఉండేది కాదు. చేసిన పనికి బదులు బియ్యం, వడ్లు, జొన్నలు, చింతపండు, కాయగూరలు ఇలా ఇచ్చేవారు. కల్లుకి బదులు గౌడ్‍కి మంగలిగా నా భర్త క్షవరం చేయటమే తప్ప ఎప్పుడూ డబ్బులు ఇచ్చింది లేదు.
మాకు పెళ్ళిళ్ళంటే చాలా ముఖ్యమైనవి. అంతా ఇంతా హడావుడి కాదు పెళ్ళిళ్ళలో. మావూర్లో పెళ్ళిళ్ళు ఎంతో సంబరంగా చేస్తారు. ఇళ్ళకి సున్నాలేసి, జేగురు, ఎరుపు, తెలుపు రంగులతో ముగ్గులేస్తారు. నా భర్త, అతని మిత్రుడు… ఒక చాకలి అతను కొండచీపుర్లతో ఇళ్ళకి సున్నాలేసేవారు.
నా భర్త మాంసం కూడా కొట్టేవాడు. ఆయన కోళ్ళని, గొర్రెలని, మేకలని కోసేవాడు. ఇప్పట్లా ఆరోజుల్లో చికెన్ సెంటర్లు లేవు. దసరాకి, సంక్రాంతికి కొందరు కలిసి ఓ మేకనో, గొర్రెనో కొనుక్కోవటం దాన్ని కోసినందుకు మాకు తల, కాళ్ళభాగాలు ఇచ్చేవారు. చర్మాన్ని ఒక తురకతను వచ్చి తన సైకిల్‍మీద పెట్టి తీసుకు పోయేవాడు. ఇలా ఇచ్చి పుచ్చుకోవటంతో గ్రామంలో అందరూ కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకుంటూ బతికేవారు.
అప్పట్లో మోటార్ సైకిళ్లు, బస్సులు లేవు. మా బంధువులుండే పక్క గ్రామాలకు మేము నడిచే వెళ్ళేవాళ్ళం. మొత్తం గ్రామంలో ఏ కొద్దిమంది దగ్గరో సైకిళ్లు ఉండేవి. తాలూకా హెడ్ క్వార్టర్స్ నుండి కిరోసిన్, సబ్బులు, ఏవో కొన్ని మందులు , ఇతర సరుకులు తెచ్చి తన దుకాణంలో పెట్టి అమ్మేవాడు దుకాణదారు. మా గ్రామంలో చాలామందికి పళ్ళపొడి, స్నానం సబ్బు వాడటం అంటే గొప్పలకి పోతున్నట్లే.
అక్కడ స్కూల్లో ఐదోతరగతి వరకే ఉంది. పెళ్ళిళ్ళుకూడా దగ్గరి బంధువుల మధ్యనే జరిగేవి. మేనమామ కూతురిని పెళ్ళి చేసుకునే ఆనవాయితీ ఉంది. దగ్గర సంబంధం లేకపోతేనే పక్కగ్రామాల్లో సంబంధాలకు వెతకడం. అందికే మాకు అన్ని సంబంధబాంధవ్యాలు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలోనే ఉండేవి. పెళ్ళిళ్లప్పుడుకూడా తమ కులం కానివారిని చాలా తక్కువమందిని పిలిచేవారు.
కానీ మంగలుల పరిస్థితి వేరు. ప్రతిపెళ్ళిలో మంగలిని పిలిచి తీరాలి. మంగలి భార్య కూడా పెళ్ళి సమయంలో తప్పని సరిగా ఉండాలి. పెళ్ళికూతురి గోళ్ళు కత్తిరించటం, ఆమెకి పసుపు రాయటం ఇలాటివి చేయటానికి ఆమెని పిలిచే వారు. వండిన పదార్ధాలు ఏవీ మంగలులు ముట్టకూడదు, అక్కడ అతిధులతో కూచుని తినకూడదు. వాళ్ళు ఇచ్చిన పదార్ధాలు అన్నీ ఇంటికి తీసుకుపోవాలి.
పెళ్ళికి బూందీ, లడ్డు, కారబ్బూంది చేసితీరాలి. సెనగపిండి బూందీ కొట్టి పంచదార పాకంపట్టి లడ్డు చేసేవారు. అదే పిండిలో ఉప్పు, కారం వేసి బూందీ కొట్టి కారబ్బూంది చేసేవారు. వియ్యలవారు వచ్చినప్పుడల్లా వీటిని చేసి పెట్టేవారు. పెళ్ళిళ్ళు పెళ్ళికూతురు ఇంటిదగ్గర చేసేవారు. డబ్బులు పెద్దగా ఉండేవికావు కనుక చీరలు, బంగారాలు అవీ పెద్దగా కొనేవారు కాదు.
మా పుట్టింటివారు కాస్త మెరుగయిన కుటుంబనేపధ్యం ఉన్నవారు. మా నాన్న మంగలి వృత్తి చేయలేదు. ఆయన చిన్నతనంలో ఇంట్లోంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ ఇల్లు చేరాడు. ఆయన విరిగిన ఎముకలు సరిచేసే నేర్పు సంపాదించాడు. అలాటి రోగులకు చికిత్సలు చేసేవాడు. కాళ్ళు చేతులలలో ఎముకలు పక్కకి తప్పితే సరిచేసేవాడు. చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా రోగులు వచ్చేవారు చికిత్సకోసం. ఆయనకి ఈ పనివలన బాగానే ముట్టేది. ఆయనకూడా తాగే వాడు. ఆయన కూడా ఉండి ఇలా రకరకాల వ్యక్తులను చూడటం, వారితో మాట్లాడటంవలన నాకు కాస్త లోకజ్ఞానం వచ్చింది. కొంచెం మెరుగయిన భాష పట్టుబడింది. మా అత్తగారు మా నాన్నకి స్వంత అప్పచెల్లెలే కావటంతో మేనగోడలిని అయిన నన్ను తన సొంతబిడ్డలాగే చూసేది.
నేనూ నా పిల్లలిద్దరిని స్కూల్‍కి పంపేదాన్ని. పాప ఐదోక్లాస్‍వరకు , బాబు పదవతరగతివరకు చదువు కున్నారు. మా అబ్బాయి ఐదు తరవాత పక్కఊరికి వెళ్ళి మరీ పదివరకూ లాక్కువచ్చాడు. కానీ పదవ తరగతిలో ఇంగ్లీష్, లెక్కలు ఫెయిల్ అయాడు. మా గ్రామంలో ఈ రెండు సబ్జెక్ట్స్‌లో ఎవరూ పాస్ అవరు. మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయి విసుగొచ్చి చదువు మానేసాడు. తరవాత రెండేళ్లు ఏమీ చేయకుండా గడిపేసాడు. వాడికి మేము చేసే పనులు ఇష్టం లేదు. దానితో వాడికీ, నా భర్తకీ పడేది కాదు. పదేపదే ఫెయిల్ అవుతుంటే చదువు మాని మా పని చెయ్యమని మా అబ్బాయి కృష్ణని పోరేవాడు నా భర్త. ఆపని నేను చెయ్యనుగాక చెయ్యను అనే వాడు కృష్ణ. నేను వాడిని “అసలు నువ్వు ఏమిచేదాం అనుకుంటున్నావు?” అని అడిగితే వాడి దగ్గర సమాధానం లేదు. రానురాను గొడవలు ఎక్కువయి ఒకరోజు వాడు ఎవరికీ చెప్పకుండా హైద్రాబాద్ వెళిపోయాడు.


కృష్ణ వెళిపోయి పది ఏళ్ళు అయింది. వాడు వెళ్ళిన కొత్తలో చుట్టాల సహాయంతో వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలని ప్రయత్నించాము. హైద్రాబాద్‍లో మంగలి షాప్‍ల్లోకూడా శక్తికొద్దీ వెతికించేము. లాభం లేకపోయింది.
ఈ పదేళ్ళకాలంలో ఎన్నో మార్పులు జరిగిపోయాయి. యుగాలుగా జరగని మార్పులు ఎంతో త్వరత్వరగా జరిగిపోయినట్లనిపిస్తోంది వెనక్కు తిరిగి చూస్తే.
ఇప్పుడు గ్రామంలోకి మోటార్ సైకిళ్ళు వచ్చాయి. తాలూకా హెడ్ క్వార్టర్స్‌కీ మాకూ, మా చుట్టుపక్కల గ్రామాలకూ ఆర్టీసీ బస్సులు పడటంతో జనం అటూ,ఇటూ రాకపోకలు ఎక్కువయాయి. ఇప్పుడు మా ఊర్లోకూడా పదివరకు చదివే వీలు ఉంది. మూడు చికెన్ సెంటర్లు వెలిసాయి. మాంసం కొట్టేవాళ్ళు వారానికి మూడుసార్లు మా ఊరికి వచ్చి మాంసం అమ్ముతున్నారు.
వ్యవసాయంచేసే తీరుకూడా మారింది. దున్న పోతులు, ఎద్దులు మానేసి ట్రాక్టర్లతో దున్నటం, మోటార్లు పెట్టి నీళ్లు తోడటంలాంటి
సులభపద్ధతుల్లో సేద్యం చేస్తున్నారు. గతంలో పొలాలికి బావినీళ్లు పెట్టుకునేవారు. ఇప్పుడు ఆ బావులు ఎండిపోయాయి. వాటి స్థానే బోరుబావులు వచ్చాయి. గతంలో పశువుల్ని మేపుకునే భూముల్లో ఇప్పుడు వరి, జొన్న పంటలు వేస్తున్నారు. ఈత, తాడి చెట్లు కొట్టేయటంతో కల్లు తయారీ బాగా తగ్గిపోయింది.
గ్రామాల్లో జనం సంఖ్య బాగా పెరిగిపోయింది. గ్రామాలనుండి పట్టణాలకు వలసవెళ్ళేవారి సంఖ్యకూడా చాలా పెరిగిపోయింది. ఇక ఈత, తాటి కల్లుల స్థానే పాకెట్స్‌లో సారా అమ్మకం మొదలయింది. ఖరీదయిన విస్కీ, వైన్‍లాంటి బ్రాండెడ్ సరుకు అమ్మే వైన్‍షాప్‍లు వెలిసాయి. ప్రభుత్వంవారి చవకబారు మద్యం అందరికీ అందుబాటులో ఉండటంతో యువకులు తాగుడికి బానిసలయి చిన్నవయసులోనే పోవటం,వారి భార్యాపిల్లలు అనాథలవటం అనేది సర్వసాధారణ విషయం అయింది.
సంపన్న రైతుల అధీనంలో వుండే భూములుకూడా పెళ్ళిళ్ళకీ, ఇతరత్రా అవసరాలకి ముక్కలు చెక్కలుగా చేసి అమ్ముకోవడంవలన తరిగిపోయాయి. బంగారం, భూములధరలు చుక్కలనంటేలా పెరిగిపోయాయి.
ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు, పేరంటాలు పోయి ఇప్పుడు ఇలాటివి అన్నీ ఫంక్షన్‌హాళ్లలో జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్స్‌కి వచ్చే అతిధుల సంఖ్య పెరిగింది. భోజనాల పద్ధతి బఫే సిస్టం. మటన్ ,చికెన్ , వెరైటీ డిషెస్, కొత్త స్వీట్స్, కొత్త రుచులు వడ్డించి గొప్పని ప్రదర్శించుకునే విందులుగా మారిపోయింది. ఇక డబ్బు పులిసిపోయినవారు తమ స్థాయిని ప్రదర్శించుకునేతీరులో బట్టలు, నగలు ఇతరత్రా ఆడంబరాలకి లెక్క లేకుండా ఖర్చుచేస్తూ ఈ పెళ్ళిళ్ళను ,ఫంక్షన్స్‌ను స్టేటస్ సింబల్స్‌గ మార్చేసారు. ఎందరు ఎక్కువ అతిధులు వస్తే అంత గొప్పవారికింద లెక్క.
నా భర్త పోయాడన్న కబురు ఎవరి ద్వారానో తెలిసి ఇన్నాళ్ళకి నా కొడుకు వచ్చాడు. మాగురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తున్నా వాడు ఇన్నాళ్లు మమ్మల్ని చూడటానికి రాలేదే అనిపించింది నాకు. మాగురించి తనకి తెలిసిన విషయం మానుండి దాస్తున్నాడా అని కూడా అనిపించకపోలేదు. ఇన్నాళ్లు వాడు మమ్మల్ని పట్టించుకోలేదని బాధకలిగింది. వాడికీ ,వాడి తండ్రికీ హస్తిమసికాంతరం తేడా ఉంది. వాడి మీద నాకెంత ఆపేక్షో అంతలా వాడు నన్ను దూరంపెట్టాడు. వాడికి పెళ్ళి అయింది. భార్యతో వచ్చాడు.
ఆ పిల్లది మహారాష్ట్ర. వాడు వాచ్‍మాన్‍గా పనిచేస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోనే పనిచేస్తోంది. అపార్ట్మెంట్ బిల్డింగ్ ఊడవడం కాక అక్కడే కొందరిళ్ళలో పనిచేస్తోంది.
నా భర్తదినం అయేవరకూ వాళ్ళు నా దగ్గర వున్నారు. నేను వాళ్ళతోకూడా బయలుదేరిపోవాలని వాళ్ళ ఉద్దేశ్యం అన్నది వారి ధోరణిలో నాకు ఆనిపించింది. బయలుదేరే ముందురోజు రాత్రి “అమ్మా! నువ్వు ఇక్కడ ఒంటరిగా ఎందుకు? మాతో వచ్చేయి. ఈ ఇల్లు అమ్మేసి మనం పట్నంలో ఓ చిన్న గది కొనుక్కుందాం” అన్నాడు.
ఆ మాట నాకు రుచించలేదు. నా గూడు అమ్మేసాక వాళ్ళ తీరు ఎలా ఉంటుందో అనే సందేహం నా మనసులో.
పైకి “మీ నాన్న ఆత్మ ఏడాదివరకు ఇక్కడే వుంటుందిరా! ఇప్పట్లో ఇంటి అమ్మకం గురించి మాట్లాడుకోవద్దు” అన్నాను.
నా మాటలు వాడికి నచ్చకపోయినా ఆ ఇల్లు నాకు మా నాన్న ఇచ్చినది అవటంతో ఏమీ అనలేకపోయాడు. అక్కడినుండి రెండేసినెలలకి ఓసారి వచ్చేవాడు. నాకు రేషన్‍కార్డ్. వితంతు పింఛను వున్నాయి కాబట్టి ఎలాగో గడుపుకొస్తున్నాను. ఇదికాక పనికి ఆహారం పధకంలో చేరగలిగేను. ఏదో కాస్త పని దొరికేది. కడుపుకి తిండి దొరికి అత్యవసరాలు కొనుక్కునేందుకు సరిపోయేది. ఈసారి వచ్చినపుడు నా కొడుకు మరికాస్త తెలివి మీరేడు.
“అమ్మా నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండటం నాకు నచ్చటం లేదు. పోనీ కొన్నాళ్ళు మా దగ్గర ఉండి చూడు. నీకు అక్కడ నప్పకపోతే వెనక్కి వచ్చేయ వచ్చును.” అన్నాడు. నాకు వెళ్ళక తప్పలేదు. వెళ్ళాను.
నాకు చీరలు చాలినన్ని లేవు. మేము నిజామాబాద్‍జిల్లావాళ్ళం. మా కట్టు బొట్టు, తిండి ,తీరుమీద మహారాష్ట్ర ప్రభావం ఎక్కువ. నేను ఎనిమిదిగజాల చీర కట్టుకుంటాను. పెట్టికోట్‍మీద చీర కట్టే అలవాటులేదు. ఇప్పుడు నాలా చీరలు కట్టేవాళ్ళు తగ్గిపోయి ఆ రకం చీరలు దొరకటం కష్టం అవుతోంది. నా కొడుకు ఇంట్లో నా కోడలు నన్ను పెట్టికోట్‍మీద చీర కట్టే విధానంకి మారిపోమన్నాది. మా అమ్మకూడా మీరు కట్టేలాటి చీరలు కట్టేది. మహారాష్ట్రలో ఇలాటి చీరలే కట్టేవారు. కానీ ఇప్పుడు ఎవరూ అలాటివి కట్టుకోవటంలేదు” అంటూ చెబుతుంటే మారటం ఇష్టం లేకపోయినా కాదనలేక పోయాను.
నా కొడుకు ఇంటికి వెళ్ళాక రెండువారాలు ఇంటి దగ్గరే వున్నాను. తరవాత నా కోడలు నన్ను రెండిళ్ళవాళ్ళకి పరిచయం చేసి వాళ్ళ ఇళ్లలో పనికి పెట్టింది.
ఒక ఇంట్లో ఒక యువజంట వుంటారు.రెండో ఇల్లు పెద్దకుటుంబం. తాత, మామ్మ, తల్లి , తండ్రి ,పిల్లలు. యువజంట చాలా దయగలవారు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ వుండటం వలన పొద్దుటి టిఫెను బయటనుండి తెచ్చుకునేవారు. వాళ్ళకి పిల్లలు లేరు. నన్ను రోజూ వాళ్ళకోసం ఇంటిదగ్గరలో బండిమీద ఇడ్లీ ,దోసెలు, పూరీలు అమ్మేవాడి దగ్గరనుండి టిఫిన్ తీసుకి రమ్మనేవారు. వాళ్ళతోపాటు నాకుకూడా ఒక ప్లేట్ టిఫిన్ తీసుకోమనేవారు. మధ్యాహ్నం ఆఫీసులలో తినేవారు. రాత్రికి వారానికి మూడుసార్లు ఏవో వండుకునేవారు. ఇక రెండో కుటుంబీకులుకూడా నాపట్ల జాలి, దయతోనే వుండేవారు. ఉదయం కాఫీ ఇచ్చేవారు. ఆ రుచి వేరుగా ఉండేది. మా గ్రామంలోనూ, నా కొడుకు ఇంట్లోనూ టీ తాగేదాన్ని. ఇప్పుడు కాఫీ అంటే రుచి పూర్తిగా మారిపోయింది. ఆ ఇంటావిడ ఇది ఫిల్టర్ కాఫీ అని చెప్పింది. క్రమేపీ ఆ రుచికి అలవాటు పడ్డాను. ఆ తరవాత అది నచ్చడం మొదలయింది. జీవితం సాఫీగా వెళుతోంది. కాస్త వేళకు తిండి, మానసికశాంతివలన నేను తేరుకున్నాను.
ఇంతలో ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి నా కోడలు ఊరునుండి వచ్చిన తన తల్లితో మాట్లాడుతోంది. ఆ మాటలు నా చెవిలో పడ్డాయి. “అమ్మా ! మాకు ఈమధ్య కూర తినటానికి చాలినంత ఉండటం లేదు. నేను చికెన్ వండితే సగం ఆ దయ్యానికే పెట్టెయ్యమంటాడు నీ అల్లుడు. ఆ గ్రామంలో ఇల్లు అమ్మకం అయేవరకూ ఆగుదాం అని ఊరుకుంటున్నాను” అనటం నాకు చాలా స్పష్టంగా వినిపించింది.
నా వెన్నులో వణుకు పుట్టింది. అయినా నేను బయటికి ఏమీ అనలేదు.
ఆరోజు భోజనాల దగ్గర “రమా! ఏదైనా పచ్చడిబద్ద ఉంటే వెయ్యమ్మా! ఈరోజు నేను పనిచేసే ఇంట్లో పూజ ఉంది. అక్కడికి వచ్చిన పూజారి నన్ను శుక్రవారాలు నీసు తినొద్దు అని చెప్పాడు.” అంటూ కాస్త కారం , నూనె వేసుకు తిని ఆ పూటకు భోజనం అయిందనిపించాను.
నా కోడలి మాటలు నన్ను చిత్రహింసకు గురిచేసాయి. ఎందుకంటే చాలామటుకు నేను పనిచేసే కుటుంబాలవాళ్ళు ఇచ్చినదే తింటాను. నాకోడలు నాకోసం పెద్దగా వండింది, చేసింది ఏమీ లేదు. ఈ విషయం నా కొడుకుతో చెప్పాలనిపించలేదు నాకు. కానీ వాళ్ళ కళ్ళు నా ఇంటిమీద ఉన్నాయని అర్ధం అయింది. ఇల్లు అమ్మకం ఆయాకా నన్ను బయటికి నెడతారని తెలిసింది. నాలో నేనే మౌనంగా ఏడ్చాను.
ఇంతలో కరోనా మహమ్మారి వచ్చింది. నేను పని చేసే అపార్త్‌మెంట్ కాంప్లెక్స్‌లోనివారు పనివారిని రావొద్దని అన్నారు. నాకు పని లేదు. ఓ నాలుగురోజుల తరువాత నేను నా కొడుకుతో “నేను గ్రామానికి వెళతాను”అన్నాను.
“సరే అమ్మా! నీ ఇష్టం” అన్నాడు. వాడు నాకు డబ్బేమీ ఇవ్వలేదు. నేను పనిచేసి ఇచ్చిన జీతంలో కనీసం సగమైనా ఇవ్వలేదు. బయలుదేరేముందు ఓ అయిదు వందలు చేతిలో పెట్టాడు. నేను అతికష్టంమీద నా గ్రామం చేరాను.
నా పేరు సిటీలో నా కొడుకు వాళ్ళ రేషన్‍కార్డ్‍లో చేర్చటంవలన నాకిప్పుడు గ్రామంలో బియ్యం, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఇక్కడ తీసుకునే అవకాశం పోయింది. ఇక్కడ వుండే ఒక రైతు భార్య నాకు బియ్యం ,కొన్ని అవసరమైన సరుకులు ఇచ్చింది. వాటితో కొన్ని రోజులు గడుస్తాయి. మరి నా కొడుకు ఇంటికి వెళ్ళాలి అని నాకనిపించ లేదు.
“ఎలా బతకాలి భగవంతుడా!” అని మొదట్లో నిస్పృహ ఆవరించింది. ఇల్లు మరమ్మత్తు చేయించాలి. ఇంటికప్పు పెంకులు విరిగిపోయాయి. కొత్తవి వేయించాలి. లేదా పైన రేకులు అయినా వేయించుకోవాలి. ప్రభుత్వ స్వచ్ఛభారత్ పుణ్యమా అని ఇంటికి టాయిలెట్ అమిరింది. గ్రామపంచాయితీవారి చొరవ వలన ఇప్పుడు వారానికి మూడుసార్లు నీటిసరఫరా ఉంటోంది. వీటివలన ఇంటి పరిస్థితి ఇప్పుడు గతంకన్నా కాస్త నయం అనిపిస్తోంది.
ఇంట్లో ఉన్న పాత ట్రంకుపెట్టె తెరిచాను. అందులో నా భర్త మంగలి పని చేసినప్పటి సామాన్లు అన్నీ ఉన్నాయి. కత్తెర తీసి కాస్త కత్తిరించి ఎలా వుందో చూసాను. కిరోసిన్‍తో , సబ్బునీళ్ళతో కత్తెర శుభ్రం చేసాను. షేవింగ్ బ్రష్, దువ్వెనలు అన్నీ శుభ్రం చేసాను. పట్నంలో పెట్రోల్‍బంకుల్లో, హోటల్స్‌లో ఆడపిల్లలు పని చేయటం చూసాను. వయసులో ఆడపిల్లలు అలా బయటికి వచ్చి అన్ని పనులు ధైర్యంగా చేస్తుంటే ఇంతవయసు వచ్చి నేను మంగలి పని చేస్తే తప్పేంటనిపించింది. అందికే నేనూ ధైర్యం కూడగట్టుకుని ఓ కుర్చీ,టేబుల్ సమకూర్చి చిన్న సెలూన్ ఇంటి దగ్గర ప్రారంభించాను. నేను గతంలో క్షవరాలు చేయలేదు. కానీ నా భర్త చేస్తూ ఉంటే చూసి ఎలా చేయాలో నేర్చుకున్నాను.
“అలిమేలు మంగమ్మ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్” అని నా సెలూన్‍ముందు ఓ ఫ్లెక్సీ చేయించి పెట్టాను.
నాదైన వృత్తి మొదలు పెట్టి హుందాగా జీవించటం మొదలు పెట్టాను.