అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

(హాస్యకథ )
సుబ్బారావుకు పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ దసరా. అందుకే వాళ్ళ మామగారు మర్యాదపూర్వకంగా వచ్చి అల్లుడిని పండుగకు రమ్మని పిలిచేరు. ముందుగా అమ్మాయిని తనతో పంపించమని అడిగేరు. అలాగేనని తన శ్రీమతి సుందరిని మామగారితో పంపించేడు సుబ్బారావు. ఆ ఆహ్వానం సందర్భంగానే అందరికంటే ముందుగా సెలవుకు దరఖాస్తు చేసి కొత్త పెళ్లికొడుకన్న సానుభూతిపై సెలవు మంజూరు చేయించుకున్నాడు. దాని పర్యవసానమే సుబ్బారావు అత్తారింటి ప్రయాణం.
ట్రైన్ దిగి ఆటో ఎక్కేడేగాని సుబ్బారావు అత్తారింట్లో తనకు జరగబోయే మర్యాదల గురించిగాని, మామగారిచ్ఛే పండుగ కానుక గురించిగాని ఆలోచించడంలేదు. మరదలు గురించే ఆలోచిస్తున్నాడు. అదేంటి, కొత్త పెళ్ళికొడుకు తన భార్యగురించి ఆలోచించాలిగాని అనుకుంటున్నారా? అయితే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సుబ్బారావును మరదలు మాధవి అంత ఆట పట్టిస్తుంది, అందుకని. సుబ్బారావు పెళ్ళిలో మాధవి ఆడిన పరాచికాలు ఇప్పటికీ మర్చిపోలేదు.
ఇంటి ముందు ఆటో ఆగడం చూసి సుబ్బారావు అత్తవారి కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చేరు. సుబ్బారావు బేగ్ తీసుకుని ఆటోవాడికి డబ్బులిచ్చేసి వస్తుండగా “బావగారూ ఆటోలో ఏదో వదిలేసి వచ్చేస్తున్నారు” అంది మాధవి. అన్నది మరదలని తెలిసినా యధాలాపంగా ఆటో లోపలికి తొంగి చూసేడు. అంతే మాధవి నవ్వడం మొదలుపెట్టింది. సుబ్బారావు ప్రశ్నార్థకంగా చూసేడు. “అదే బావగారూ! మీరు ఆటో దిగి వచ్చేరంటే సీటొదిలి వచ్చినట్లే కదా” అంది. అప్పుడే మొదలయిందన్నమాట అనుకున్నాడు సుబ్బారావు.
మామగారు అల్లుడిని సాదరంగా ఆహ్వానించి “మాధవీ చెంబుతో నీళ్లు పట్టుకురా” అన్నారు అల్లుడు కాళ్ళు కడుగుకుంటాడనే ఉద్దేశంతో. “అదేంటి నాన్నగారూ! బావగారికి మళ్ళీ కాళ్ళు కడుగుతారా ఏంటి కొంపదీసి. అలాగైతే కన్యాదానం చేయాలి. అక్క ఒప్పుకుంటుందా ” అంటున్న మాధవిని మందలించేరు తల్లీ,తండ్రీ. “జస్ట్ ఫర్ ఫన్ బావగారూ! సీరియస్‍గా తీసుకోకండి ఏదీ ” అంది మరదలు.
లోపలికి వచ్చేక “బావగారూ! టీ త్రాగుతారా? కాఫీయా? “అడిగింది మాధవి. ఇంక అందులో ఏం కలుపుతుందో అని ” వద్దులే తల్లీ త్రాగి వచ్చేను” అన్నాడు సుబ్బారావు. “అదేంటి బావగారూ! ఈ అలవాటు ఎప్పటినుండీ? అక్కకు తెలుసా? త్రాగినా మీరు తూలడం లేదే!”చురక అంటించింది మరదలు పిల్ల. ఈసారి సుందరి కోప్పడింది చెల్లెల్ని. సుబ్బారావు నవ్వడం చూసి ఫీల్ అవలేదని తెలుసుకుంది.
రాత్రి భోజనానికి పిలవడానికి వచ్చింది మరదలు “పదండి బావగారూ! విందుకు ముందు సందుకు వెనక ఉండాలిట.” అంటూ తీసుకు వెళ్ళింది. తీరా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళేక కుర్చీ తీసేసింది. “అదేమిటే నువ్వు శృతి మించిపోతున్నావు ” అన్నారు తల్లీ,తండ్రీ.
” అది కాదు బావగారూ! కూర్చుని తింటే కొండలయినా తరిగిపోతాయిట.అందుకే ఈ రోజుల్లో బఫే పెడుతున్నారు. సారీ బావగారూ! మీరు తినేదానికి మాకేవీ తరిగిపోవులెండి. రండి.కూర్చోండి” అంటూ కుర్చీ త్రోసింది. అలా రాత్రి గడిచింది.
తెల్లవారుతూనే మరదలు మళ్ళీ ప్రత్యక్షం “బావగారూ! పండుగ రోజుకూడా రోజూలాగ లేట్‍గా లేవకూడదు. బ్రష్ చేసేరా ఇంకా లేదా ? ” అని అడిగింది.
“లేదు మరదలా! నా బేగ్‍లో బ్రష్ కనబడడంలేదు”అన్నాడు సుబ్బారావు. “అందుకే తెచ్చేను నేచురల్ టూత్ బ్రష్. దీనితో తోముకుంటే మీ దంతాలు మిలమిలా మెరుస్తాయి ” అంది.
“అంటే ఇది నీ పనేనన్నమాట ? ఇదేంటి వేపపుల్ల. దీనితో తోముకుంటే దంతాలు మిలమిలలాడడంకాదు జలజల రాలిపోతాయి “
“ఏం అంత వీక్‍గా ఉన్నాయా బావగారూ? “అడిగింది. ఇంక లాభం లేదని ఎలాగో మరదలి బారి నుండి తప్పించుకుని వెళ్లి స్నానం చేసి తయారయి వచ్చి టిఫిన్ చేస్తుండగా సెల్ మ్రోగింది.
” బావగారూ మీకు ఫోన్ ” అంటూ అందించింది మాధవి. ఫోన్ అందుకుని సుబ్బారావు, “హలో … నమస్తే సర్ … ఏంటి సర్ … ఈవేళ జీఎంగారు వస్తున్నారా … నేను అర్జంటుగా రావాలా … తప్పదా … సరే సర్ ” అంటుంటే బావగారి ఫోన్ కాల్ నిజమేనా లేక ఫేక్ కాలా అనుకుంది మరదలు పిల్ల.

(ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ (అమృతోత్సవ) ప్రత్యేక సంచిక 12.4.2017 మధురిమలో ప్రచురితమైంది.)