గురుదక్షిణ by Pati Muralidhara Sharma

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

అదొక ప్రైవేట్ కంపెనీ. మేనేజింగ్ డైరెక్టర్ రూమ్ ముందు వరుసగా కూర్చుని ఉన్నారు. పి.ఎ (పర్సనల్ అసిస్టెంట్ ) పోస్టు ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్దులు.
సమయం పదిగంటలు కావస్తుంది. ఇంతలో అత్యంతాధునికమైన ఇంపోర్టెడ్ కారు పోర్టికోలో వచ్చి ఆగింది. ఎటెండర్ గబగబా వెళ్ళి నమస్కారం చేసి కారు డోర్ తెరిచేడు. అందులోంచి సూటు వేసుకొన్న వ్యక్తి దర్జాగా దిగి హుందాగా నడిచి వస్తున్నాడు. అతని వెనకాలే ఎటెండర్ బ్రీఫ్‍కేస్ కారులోది తీసుకొని వస్తున్నాడు. అతను ఆ కంపెనీ ఎం.డి. అని వేరే చేప్పనక్కర్లేదు. ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్దులంతా ఒక్కసారి లేచి నిలబడ్డారు. అతనుమాత్రం ఎవరివైపూ చూడకుండా స్ప్రింగ్‍డోర్ తెరుచుకొని తన చాంబర్‍లోకి వెళ్ళిపోయేడు.
అయిదు నిముషాలు పోయేక బజ్జర్ వినపడింది. ఎటెండర్ లోపలికి పరిగెత్తేడు. ఇంటర్వ్యూ అభ్యర్ధులందరూ యుద్దానికి సన్నద్దులయ్యే వీరులలాగా అన్నీ సర్దుకొంటున్నారు . ఎటెండర్ లోపలినుండి వచ్చేడు. ఎవర్ని పిలుస్తాడో అని అందరూ కుతూహలంగా అతనివైపే చూస్తున్నారు. కాని అతనెవరినీ పిలవకుండా రూమ్ ముందున్న తన స్టూల్‍మీద కూర్చున్నాడు.
ఈసారి మళ్ళీ బజ్జర్ మ్రోగింది. అభ్యర్ధుల గుండెల్లో దడ. ఎటెండర్ లోపలికి వెళ్లేడు. బయటకు వచ్చి ఒక్కొకర్నీ పిలవసాగేడు. ఒకరూ ఒకరూ వెళ్ళి వస్తున్నారు.
ఒకరు పట్టిన చెమటను తుడుచుకుంటూ వస్తుంటే ఒకరు ధీమాగా వస్తున్నారు. తర్వాత ఒక లేడీ కేండిడేట్. ఆవిడకూ పిలుపొచ్చింది.
” మే ఐ కమిన్ సర్?” తీయని కంఠస్వరం.
” ఎస్ కమిన్ ” తలెత్తకుండానే ఫైలు చూసుకొంటూ అలవాటు ప్రకారం ఆదేశపూర్వకమైన అనుమతి ఇచ్చేడు ఎమ్.డి.మధుసూధనరావు.
స్ప్రింగ్‍డోర్ త్రోసుకొని లోపలకు అడుగుపెట్టింది సుధ.
” గుడ్ మార్నింగ్ సర్”
“వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ బీసీటెడ్” సౌహార్ద్రమైన కంఠం.
“థాంక్యూ సర్” ఎదురుగా ఉన్న సీట్లో కూచుంది ఆ అమ్మాయి.
ఒక్కసారిగా తలెత్తి చూసేడు. ఆశ్చర్యం ఈమె అతని మస్తిష్కం గతాన్ని నెమరు వేసుకుంటుంది.
” మీ పేరు ” అడిగేడు మొదటి ప్రశ్నగా.
“సుధ సర్” సమాధానమిచ్చింది బుద్దిగా.
“మీ నాన్నగారి పేరు” రెండోప్రశ్న వేసేడు మధుసూధన రావు
“వెంకట్రామయ్యగారండి” జవాబిచ్చింది జంకుతూ.
” మీరు తెనాలిలో ఉండేవారా ?” మరో ప్రశ్న.
“అవును సర్ ” సందేహనివృత్తి చేసింది.
“మీ నాన్నగారు స్కూల్‍టీచర్‍గా పనిచేస్తుండేవారు కదూ” ఆతృతగా అడిగేడు ఎమ్.డిలా కాకుండా.
” అవునండి ” ఇవన్నీ ఇంటర్వ్యూలో ప్రశ్నలేనా అనుకుంది.
” నేను గుర్తున్నానా?” ఈ ప్రశ్నకు త్రుళ్ళిపడి, ” మీరు …మీరు …” తత్తరపాటుతో ఆలోచిస్తూ అంది.
“నేను మధుని. మీ నాన్నగారి శిష్యుణ్ణి. నేను మీ నాన్నగారి దగ్గర ట్యూషన్ చదువుతున్నప్పుడు మీరు అంటే నువ్వు చిన్నపిల్లవు. నన్ను మధు కాదు మొద్దు అనేదానివి. మీ నాన్నగారికి నేనంటే ఎంతో అభిమానం. ఆయన దయతో అక్షర జ్ఞానంలేని నన్ను శ్రమకోర్చి సరస్వతి పుత్రుణ్ణి చేసేరు. ఆయన చలవవల్లే ఈవేళ నేనీ స్థితిలో ఉన్నాను. మీరిప్పుడీ ఊళ్ళో ఉన్నారా? ఎన్నాళ్లయింది వచ్చి ? మీ నాన్నగారెలా ఉన్నారు? కులాసాగా ఉన్నారా? ” ప్రశ్నల వర్షం.
ఎవరి ఆప్యాయతకూ నోచుకోని సుధకు అతని ఆప్యాయత వేడెక్కిన భూమిపై చల్లటి వర్షపు జల్లు పడినటైంది. అతన్నింతవరకూ గుర్తుపట్టనందుకు సిగ్గుపడుతూ ” క్షమించండి. మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయేను. చిన్నప్పటి సంగతులేవో గుర్తుచేయబట్టి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది” అంది.
“అది సరే. మరి నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినట్లు? ఇంకా పెళ్ళి కూడా కాలేనట్లుంది? సారీ, ఇంటర్వ్యూ అభ్యర్ధిగా మిమ్మల్ని నేను నువ్వు అని సంభోదించకూడదు. ఇలాంటి ప్రశ్నలు వేయకూడనుకో” అతని సభ్యత వ్యక్తమవుతుంది.
” అదేంటి సర్! మీరు ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్. ఒకవేళ తర్వాత మీరు నాకు బాస్ అయినా అవొచ్చు. అలాంటప్పుడు మీరు నన్ను నువ్వు అనడంలో తప్పేంలేదు”
” గడుసుదానివే. ఎలాగైనా మాస్టారమ్మాయనిపించుకున్నావ్. ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయ్? ఇంతకూ నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేవే కాదు” గుర్తు చేస్తూ అడిగేడు మధు.
” సారీ సర్. మీమాటల్లో పడి మర్చి పోయేను. మా నాన్నగారు రిటైరయిపోయేరు. ఎవరికైనా ఈ వయసులో కులాసా ఎలా ఉంటుందో మీకు తెలియదా! ప్రైవేట్లు చెప్పే ఓపిక నశించిపోయింది. అక్కడ అద్దె ఇంట్లో ఉండే స్థోమత లేక ఇక్కడ మా మేనమామ ఇంటికి వచ్చేసేం. ఏదో జీవనోపాధి చూపించమని అడుగుదామని. ఆయన ఇక్కడ ఓ కాలేజీలో లెక్చరర్. మేం వచ్చిన ముహూర్తమేమిటో ఆయనకు ఇక్కడి నుండి అనంతపూర్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. వాళ్ల ఇంటిని మాకు అప్పజెప్పి వెళ్లిపోయేరు. అంచేత ఇంటద్దె బాధ లేదనుకోండి కాని దినభత్యంకోసం ఏదో నౌకరీ ఉంటేనే కాని సాగదు. నేను బియ్యే పూర్తిచేసి ఆపేసి ఉద్యోగప్రయత్నంలో పడ్డాను. మా తమ్ముడ్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను. ఎలాగో ఇంతవరకూ నెట్టుకొచ్చేం. ఇటుపైనే ఏ ఆధారమూ లేకుండా గడవదు. అందుకనే నేనీ ఇంటర్వ్యూకి వచ్చింది. మా నాన్నగారికి నేను ఉద్యోగం చేయడం సుతరాము ఇష్టంలేదు. ఆయన ససేమిరా ఒప్పుకోలేదు. కాని పరిస్థితులలాంటివి తప్పదు, అని చెప్పి చివరకు ఆయనను ఎలాగో ఒప్పించేను” అని తన గోడు అంతా ఏకరువు పెట్టింది సుధ.
ఎంతో కుతూహలంగానూ, సహనంతోనూ వింటున్న మధు ” ఒక సాయంకాలం మీ ఇంటికి వస్తాను అన్నీ తీరికగా మాట్లాడుకుందాం. చాలా రోజులయింది మా మేస్టార్ని చూసి. మీ ఇల్లెక్కడ ?” అని అడిగేడు.
ఎడ్రసు చెప్పింది. ” తప్పకుండా వస్తారు కదూ ! ” అంటూ.
” ష్యూర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు” అన్నాడు మధు.
” మరి ఇంటర్వ్యూ?” అనుమానంగా అడిగింది సుధ.
” అయిపోయింది. నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళు ” ధీమా ఇచ్చేడు.
” నమస్తే. సాయంకాలం మీకోసం ఎదురు చూస్తుంటాము ” అంది.
” ఓ కే” హామీ యిచ్చేడు .
బయట మిగిలి ఉన్న అభ్యర్దులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. తమ పిలుపు కోసం. వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదేమా అనుకుంటూ అదే అడిగేరు ఎటెండర్ వెంకటేశాన్ని.
” ఏమోనండీ. ఎవర్నీ యింతసేపు ఇంటర్వ్యూ చేయలేదు ఎప్పుడూ అయ్యగారు ” అన్నాడు అతను.
” అయితే ఆ అమ్మాయి సెలెక్ట్ అయిపోయి ఉండవచ్చు ” అన్నాడు ఒకాయన.
” అయి ఉండొచ్చు ” అన్నాడు వెంకటేశం.
“నేను అప్పుడే అనుకున్నాను. ఆ అమ్మాయే సెలెక్టవుతుందని ” అసూయాగ్నితో అన్నాడు మరొకాయన. ఇంతవరకూ ఎంతో ఆశతో ఎదురుచూసి నిరాశపడి.
” ఏమండీ పి.ఎ. పోస్టుకు అమ్మాయే కావాలా?” ఒకరి సందేహం.
” పి.ఎ. అమ్మాయయితే ఏకాంతంగా ఉన్నప్పుడు తన చాంబర్‍లో ఎంతసేపు ఉన్నా ఎవరూ ఏమీ అనుకోరు ” మరొకరు సర్ది చెబుతున్నారు.
” అందులోనూ ఎర్రగా, బుర్రగా, అందంగా మంచి వయసులో ఉన్న అమ్మాయి కదా” మరో విమర్శ.
ఒక పురుషుడు ఒక స్త్రీని చూస్తే చాలు ఏ దృష్టితో అవనివ్వండి, ఏ ఉద్దేశ్యంతో కానివ్వండి, ఏ భావంతో అయినా ,ఏం మాట్లాడినా నలుగురూ నాలుగు విధాలుగా చిత్రీకరిస్తారు పదిమందికీ అదో కాలక్షేపం.
” అలాంటప్పుడు ఇంతమందిని ఇంటర్వ్యూకి పిలవడం దేనికి ?” ఒకాయన ప్రశ్న.
” ఈ కంపెనీలలో ఇంతేనండీ. అసలు కేండిడేట్ ఎప్పుడో సెలెక్ట్ అయిపోయి ఉంటాడు. బంధుప్రీతి లేని బడుద్దాయి ఎవరండీ ఈ రోజుల్లో” మరొకరి సదభిప్రాయం.
” ఈ ఎమ్.డి సంగతేంటో నేను చూస్తాను” బడా రాజకీయ పలుకుబడి ఉన్నట్టు ఓ ఛోటామనిషి సవాల్.
ఇంతలో స్ప్రింగ్‍డోర్ తెరచుకొని బయటకు వచ్చింది సుధ.
” అమ్మయ్య ” అని నిట్టూర్పు విడిచి తర్వాత ఎవరిని పిలవాలా అని పిలుపుకోసం ఎదురు చూస్తున్నాడు వెంకటేశం.
సంతోషం, సంతృప్తి మేళవించిన హృదయంతో నిండుగా ఊపిరి పీల్చుకొని ఇంటిదారి పట్టింది .
…………………..x………………………x……………………….

” సుధా ” పిలిచేరు వెంకట్రామయ్య గారు.
” ఏం నాన్నగారూ ” అడిగింది సుధ.
” మధు నిన్ను గుర్తు పట్టేడా అమ్మా?” అడిగేరు.
” ఆయన నన్ను గుర్తు పట్టేరు నాన్నా, నేనే ఆయన్ని గుర్తుపట్టలేకపోయేను” చెప్పింది సుధ.
” పూర్వకాలం మనసు లేకపోతే ఈరోజుల్లో ఎంత మంది శిష్యులు పాఠాలు నేర్పిన పంతుళ్లను గుర్తుపెట్టుకొంటున్నారమ్మా? ఇంతకూ మన ఇంటికి నిజంగా వస్తాడంటావా? అంత పెద్ద ఆఫీసరు కదా!” తన సందేహాన్ని వెలిబుచ్చేరాయన.
” ఆయనకు అలాంటి అహంభావమే లేదు నాన్నా ఎంతో కలుపుగోలుగా మాట్లాడేరు. చిన్నప్పటి చిలిపితనం ఇంకా పోలేదు. అప్పుడు మీ దగ్గర చదువుకున్నప్పటి లాగే ఉన్నారు ఇప్పుడూ ఆయన మాటలు. అదిగో ఆయన వచ్చినట్లున్నారు మాటల్లోనే. అని బయటకు వెళ్ళి, ” అరె, ఎలా వచ్చేరు కారు లేదే, ఏమండీ కార్లో రాలేదా ?” అని అడిగింది అమాయకంగా.
” కారు నా స్వంతం కాదు. కంపెనీది. నన్ను ఆఫీసుకి తీసుకెళ్ళి మళ్ళీ యింటికి దిగబెట్టడానికే అది. మా ఇల్లు కూడా ఇక్కడకు దగ్గరే. ఈవినింగ్‍వాక్‍లా ఉంటుందని నడిచే వచ్చేను” వివరించేడు మధు.
” ఓహ్! చాలా శ్రమ యిచ్చేను మీకు. కూర్చోండి ” అంటూ కుర్చీ తెచ్చి వేసింది సుధ. “ఉండండీ కాఫీ తెస్తాను ” అంటూ లోపలికి వెళ్లబోయింది.
” ఆగు, ఆగు. అతిధి మర్యాదలు తర్వాత. ఏరీ, మా మాస్టారేరీ?” అని అడిగేడు మధు.
“రండి లోపలికి. ఇదిగో ఈ గదిలో ఉన్నారు” అంటూ చూపించింది. తనకు నీడనిచ్చిన చెట్టు ఎండిపోతే చూస్తే ఎలాంటి ఆవేదన కలుగుతుందో అలాంటిదే కలిగింది మధుకు. మంచంమీదనుండి లేవలేని స్థితిలో ఉన్న తన విద్యాదాతను చూసి, “నమస్కారమండీ మాస్టారూ!” అన్నాడు బాధాతప్త హృదయంతో.
“దీర్ఘాయుష్మాన్ భవ! బాగున్నావా నాయనా? చిన్నప్పటి మాస్టార్ని గుర్తుపెట్టుకున్న ఈ శిష్యుడికి గురువును నేనే అని నా మనసెంతో ఆనందంతోనూ, సంతృప్తి తోనూ నిండిపోయింది నాయనా. ఈరోజుల్లో నీలాంటివారు కరువైపోయేరు నామీద నీకున్న భక్తి, విశ్వాసం ఈ రోజు నిన్ను నాదగ్గరకు తీసుకొచ్చేయి” ఆయన అభిప్రాయాన్ని సంతోషంతో వెలిబుచ్చేరు.
” అదేంటి మాస్టారూ! నేను మిమ్మల్నెలా మర్చిపోగలను! మీ వంట్లో ఎలా ఉంది ఇప్పుడు ? ” అంటూ తెచ్చిన పండ్లను అక్కడ పెట్టేడు మధు.
” ఇప్పుడివన్నీ ఎందుకు నాయనా” అని మాస్టారూ, “ఏదో ఉడతా భక్తి” అని శిష్యుడు.
“ఏం చెప్పను నాయనా ! ఊరు పొమ్మంటుంది. కాడు రమ్మంటుంది. నా సంగతిసరే నీగురించేమీ చెప్పవేం?” ఎదురు ప్రశ్న వేసేరు వెంకట్రామయ్య గారు.
” మీ ప్రోత్సాహంతో బి.టెక్ పూర్తి చేసి ఆ తర్వాత ఎమ్.టెక్ చేసేను. మీ ఆశీర్వాదంవల్ల వెంటనే ఈ కంపెనీలో ఎమ్ .డి పోస్టు వచ్చింది. ఈ మధ్యనే జాయిన్ అయేను. మా చెల్లాయి మీకు గుర్తుందా? ” అడిగేడు మధు.
” గుర్తు లేకపోవడమేమిటి బాబూ! పూర్ణ కదూ ! మా సుధా తనూ ఒకర్నొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు ” మాస్టారు తన జ్ఞాపకశక్తిని తెలియజేసేరు.
“దానికి ఆ మధ్య పెళ్ళి చేసేం”
” చాలా సంతోషం నాయనా!”
” కానీ….”
“కానీ… ఏమైంది బాబూ !” ఆతృతగా అడిగేరు మాస్టారు.
” కాళ్ల పారాణి ఆరకుండానే అతను బస్ ఏక్సిడెంట్‍లో చనిపోయేరు” కళ్ళు చెమ్మగిల్లేయి మధుకు.
“అయ్యో! పాపం. ఎంత ఘోరం? మంచివాళ్లకే భగవంతుడు పరీక్షలు పెడుతుంటాడు” ముసలాయన కనుకొలకుల్లో నీళ్ళు నిండేయి.
” దాని ముఖం చూసినప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంది మాస్టారూ. దానిమీద బెంగతో మా అమ్మ మంచం పట్టింది. నేను మాత్రం నా ధర్మాన్ని నిర్వర్తించక తప్పదు కదండీ”.
” ఇంతకూ నువ్వింకా పెళ్ళి చేసుకోలేదా? అడిగేరు మాస్టారు.
” లేదు మాస్టారూ. నాకు చేసుకోవాలనిపించలేదు”
అన్నీ వింటుంది సుధ బరువెక్కిన గుండెతో.
” పోనీ నువ్వు ఇంటర్వ్యూ చేసిన ఉద్యోగం మీ చెల్లెలికి ఇవ్వలేకపోయేవా? ఏదో కాస్త ఈ లోకంలో పడి బాధను కొంతవరకూ మరచిపోగలుగుతుంది” సలహా ఇచ్చేరు మాస్టారు.
“ఆపని నేను చేయలేక కాదు మాస్టారూ. ఆ ఉద్యోగం నా పి.ఎ. నాముందే నా చెల్లెమ్మ అలా తిరుగుతుంటే నేను చూడలేను” కారణం వివరించేడు.
” అన్నీ ఆలోచించబట్టే నువ్విలా ఉన్నావు. మా సుధ మనసుకూడా నీమనసులాంటిదే చూసేవా ! పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేయవలసిన వయసులో నన్నూ, దాని తమ్ముణ్నీ సాకుతూ ఈ సంసారాన్ని ఈదుతుంది. దానికి పెళ్ళి చేసి అత్తారింటికి పంపవలసింది పోయి నేనే దాని మెడకి గుదిబండయి కూర్చున్నాను. దాని తమ్ముడు అందివచ్చేవరకూ దానికీ కష్టాలు తప్పవు ” చెప్పుకుంటూ పోతున్నారు మేస్టారు.
” అందుకే మాస్టారూ. నా చెల్లెమ్మకు కాకపోయినా చెల్లెమ్మలాంటి సుధకు ఆ ఉద్యోగం ఇస్తున్నాను “
” నిజమా బాబూ !” మాస్టారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే.. ” మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేమండీ ” అంది సుధ విప్పారిన నేత్రాలతో.
“ఆ మాత్రానికేనా? జీతం ఊరికినే కాదు కదా నువ్వు చేసే ఉద్యోగానికి గాని. నవ్వలేకపోయినా నవ్వించడంలో ఒక సంతృప్తీ, ఆనందం ఉన్నాయి. రేపు ఆర్డర్సు వస్తాయి. వచ్చి జాయినవు. వస్తా సుధా. మరి సెలవా మాస్టారూ.అప్పుడప్పుడు వస్తుంటాను మీరు వద్దన్నా”
” అదేంటి మధూ! నాకంతకంటే కావలసిందేముంది?”
” కాఫీ తీసుకోరా?” సుధ అభ్యర్దించింది.
” చెల్లెమ్మ చేత్తో విషమిచ్చినా తీసుకోవచ్చు ” భరోసాగా అన్నాడు మధు.
” అయితే నేను విషమిస్తాననా? అనుమానమా?” అడిగింది సుధ.
“ఒకవేళ విషమిచ్చినా అది పనిచేయదని నా నమ్మకం” అని కాఫీ త్రాగడం పూర్తిచేసి “మరోసారి వస్తాను అప్పుడు మిమ్మల్ని మా యింటికి తీసుకెళ్తాను. అన్నట్లు అడగడమే మర్చిపోయేను మీ తమ్ముడేడీ”
” లైబ్రరీకి వెళ్ళేడు ” చెప్పింది సుధ.
” వీలైతే నన్ను కలవమను ” అని చెప్పి వచ్చేసేడు మధు.
………………….x………………………….x…………………….
” గుడ్ మార్నింగ్ సర్” పి.ఎ. గా ఏమ్ .డి చాంబర్ లోకి ప్రవేశించింది సుధ.
“గుడ్ మార్నింగ్ రా, సుధా రా… జాయినయిపోయేవు కదా! ఎలా ఉంది ఆఫీసు వాతావరణం?” అడిగేడు కుశల ప్రశ్నగా మధు.
” ఉద్యోగం క్రొత్త . అందులోనూ మొదటిరోజుకదండీ కొద్దికొద్దిగా అలవాటుపడుతున్నాను” అంది.
“సరే .ఇప్పుడు నేను చెప్పిన లెటర్స్ నోట్ చేసుకొని ప్రిపేర్ చేసి వెంటనే డిస్పేచ్ అయేలాగ చూడు” అంటూ లెటర్స్ డిక్టేట్ చేయడం మొదలుపెట్టేడు మధు. చివర్లో అన్నాడు ” చూడు సుధా సాయంకాలం నువ్వు ఆఫీసు నుండి ఇంటికి నా కార్లో వచ్చేయవచ్చు. మీ ఇల్లు మా యింటీకి దగ్గరే కదా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు”
” చూడండి సార్. మీఇంటివైపు ఇళున్న వాళ్లందర్నీ ఇలాగే డ్రాప్ చేస్తారా?”
“యూ సిల్లీ! నీ సందేహాలకు సమాధానం చెప్పే ఓపికా తీరికా లేవు నాకు ఇప్పుడు. కాని నేని చెప్పినట్లు చెయ్యి తెలిసిందా!” ఆజ్ఞాపించేడు ఆఫీసరులా.
గడియారం అయిదు కొట్టింది. మధుసూధన రావు తన చాంబర్‍లోంచి బయటకు వచ్చేడు. వెనక బ్రీఫ్‍కేస్‍తో వచ్చిన వెంకటేశం కారు వెనక డోర్ తీసి పట్టుకుని నిలబడ్డాడు.
“ఆవిడ వెనుక సీట్లో కూర్చుంటారు ” అన్నాడు మధుసూధనరావు అక్కడే నిలబడి ఉన్న సుధను చూపిస్తూ. తాను డ్రైవర్ ప్రక్క సీట్లో కూర్చున్నాడు. సుధ వెనక సీట్లో కూర్చుంది. మరుక్షణంలో కారు కదిలింది. అది చూస్తూ ఇంటిదారి పదుతున్న ఆఫీస్ స్టాఫ్ అంతా ముందు అవాక్కయి తర్వాత చెవులు కొరుక్కోవడం ప్రారంభించేరు.
” ఇదండీ సంగతి. ఇందుకూ ఈవిడ్ని సెలక్ట్ చేసింది”
” బలేపిల్లండీ. పైకి ఎంతో అమాయకంగా కనపడింది కాని ఎమ్.డి.ని ఎలా వలలో వేసేసుకొందో చూసేరా?”
“ఎన్నేళ్ళు వచ్చినా ఇన్నాళ్ల వరకూ పెళ్ళి చేసుకోకపోవడానికి ఇలాంటి రాసలీలలే కారణం అనుకుంటానండీ”
” అందుకేనేమోనండీ లేడీ క్లర్క్లూ, లేడీ టైపిస్టులూ, లేడీ స్టెనోలూ ఎక్కువగా సెలక్టవుతుంటారు”
ఇలా సాగిపోతున్నాయి వాళ్ల మాటలూ, సంభాషణలూ నడకతోపాటు.
…… కొన్ని రోజుల తర్వాత ఓ ఆదివారం
“సుధా” అంటూ వెంకట్రామయ్యగారి ఇంట్లో అడుగుపెడుతూ పిలిచేడు మధు.
“ఎవరూ?” మాస్టారి నీరసస్వరం.
” నేనండీ మధుని. నమస్తే మాస్టారూ!” అంటూ గదిలోకి వచ్చేడు.
ఆ! నువ్వా… రా…నాయనా..రా. ఆరోజు రావడం మళ్ళీ ఇదే! ఏంటీ విశేషాలు ?” అడిగారు మాస్టారు.
” సుధ ఏదండీ?” ఎంక్వయిరీ చేసేడు మధు.
” మార్కెట్‍కి వెళ్ళింది” జవాబు.
” మరి మీ అబ్బాయి రవి ?”
“బయటికెక్కడికో వెల్లేడు బాబూ”
” మీకో వార్త చెప్పడానికొచ్చేను మాస్టారూ” అసలు విషయం చెప్పేడు.
“ఏంటది ?” కుతూహలంగా అడిగేరు మాస్టారు.
” నన్ను మా కంపెనీ వరంగల్ బ్రాంచ్‍కి బదిలీ చేసింది ” చల్లగా చెప్పేడు మధు.
“ఏమిటి? ఇంతలో ఏమొచ్చింది?” ఆతృతగా ఆరాతీసేరు మాస్టారు.
” ఆ ! ఏం లేదు , నేను బంధుప్రీతిమీద ఉద్యోగాలిస్తున్నాననీ ఇంటర్వ్యూ నామమాత్రంగా జరుపుతున్నాననీ, ప్రవర్తనకూడా సరిగాలేదనీ మా హెడ్‍ఆఫీస్‍కు ఆరోపణలు వచ్చేయట. ముందుజాగ్రత్త చర్యగా ట్రాన్స్‌ఫర్ చేసేరు. టెలిఫోన్‍లో ఆర్డర్స్ వచ్చేయి. అది చెప్దామని వచ్చేను మాస్టారూ! ఇక్కడనుండి వెళ్ళి పోయేముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి మళ్ళీ వస్తాను”.
మాస్టారి కళ్ళు చెమ్మగిల్లేయి. ” ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బ్రొటనవ్రేలిని మాత్రమే యిచ్చేడు. కాని నువ్వు గురుదక్షిణగా మా అమ్మాయికి ఉద్యోగం యిచ్చి నీ ఉద్యోగానికే మచ్చ తెచ్చుకొన్నావు” అని తపనగా ” ఎక్కడున్నా నువ్వు చల్లగా ఉండాలని ఆ భగవంతుని రోజూ ప్రార్ధిస్తాను” అంటుంటే ఇక అక్కడ ఉండలేక ” వస్తాను మాస్టారూ ” అంటూ బయటపడ్డాడు మధు.
(ఆకాశవాణి విశాఖపట్నంకేంద్రంలో 26.9.1991న ప్రసారితమైంది.అమెరికాలోని తెలుగు అంతర్జాలపత్రిక “వాస్తవం”లో 30.11.2016న ప్రచురితమైంది.)

1 thought on “గురుదక్షిణ by Pati Muralidhara Sharma”

  1. మంగు కృష్ణకుమారి

    మంచి కథ అందించేరు. శ్రీదేవి గారి కృషి ఎంతయినా పొగడతగ్గది

Comments are closed.