డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

సుధాకర్ కారులో కూర్చున్నాడన్నమాటేగానీ అన్యమనస్కంగా ఉన్నాడు. కారు దమయంతి నలుడికి పంపిన రాయబారం మోసుకుపోయే రాజహంసలా రివ్వున దూసుకుపోతోంది. అతని మనసు మాత్రం అంతే వేగంగా వెనక్కు వెళ్ళింది. దానికి కారణం తనకూ, తండ్రికీ మధ్య జరిగిన సంవాదం.ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు.

” సుధా! నేనింత కష్టపడి, ఎంతో ఖర్చుపెట్టి నిన్ను డాక్టరు చదువు చదివిస్తే నువ్వేమో కాసులు కురిపించే కార్పొరేట్ హాస్పటల్లో చేస్తున్న కొలువును వదులుకుని సర్కారీ దవాఖానాలో సేవ చేస్తానంటావేమిట్రా?  అదీ ఓ పల్లెటూళ్ళో. నీకు మతిగాని పోయిందేమిట్రా?”

“మీరు పెట్టిన ఖర్చు సద్వినియోగం అవాలనే నేనీ నిర్ణయం తీసుకున్నాను నాన్నా! కార్పొరేట్ హాస్పటల్లో కాసులు కురిపించొచ్చుగాని మనసులు మురిపించవు. పూర్వం నాడి చూసే రోగమేమిటో తెలుసుకునేవారు. చెప్పేవారు. అలాంటిది మరిప్పుడు జలుబు చేసిందన్నా అన్ని టెస్టులూ చేయించవలసిందే. అన్ని రకాల మందులూ వాడించ వలసిందే. ఎందుకో నేను అలా చేయడంలో సమాధానపడలేకపోతున్నాను.”

” అలాంటప్పుడు పోనీ ఇక్కడే నువ్వే ఓ క్లినిక్కో , నర్సింగ్‍హోమో పెట్టి ప్రైవేట్‍ప్రాక్టీస్ చెయ్యొచ్చుకదా !”

” సిటీలో హాస్పటల్స్‌కు కొదవలేదు. నాలుగడుగులకో నర్సింగ్‍హోమ్, పదడుగులకో ప్రైవేట్‍క్లినిక్‍లూ ఉన్నాయి. ఎటొచ్చీ పల్లెటూళ్ళలో పేదలకి వైద్యం చేయడానికి ముందుకు వచ్చే డాక్టర్లే కరువయ్యేరు. కార్పొరేట్ హాస్పటల్లో ఉద్యోగంకోసం కో అంటే కోటిమంది క్యూ కడతారు కాని గవర్నమెంట్ హాస్పటల్లో పనిచేయడానికి పనిష్మెంట్ అనుకుని వెళ్తారు తప్పితే పనికట్టుకుని ఎవరూ వెళ్లరు. అందులోనూ ఓ పల్లెటూళ్ళో. అక్కడ చేస్తే ఆ పరమార్థమే వేరు”

“ఏమిటో! అందరూ పైసాయే పరమార్థం అనుకుంటూ ఉంటే నువ్వేమో ఇలా ..”

“మీరూ అలా అంటే ఎలా చెప్పండి? మీ మాట కాదంటున్నందుకు మరేమీ అనుకోకండి. వైద్యవృత్తి ఓ సేవావృత్తి. విత్తవృత్తి కాదు”  అని చెప్పి తండ్రిని సముదాయించాడు. కాని భార్య లక్ష్మీప్రసన్నకూడా అతని నిర్ణయానికి సుముఖంగా లేదు. వ్యతిరేకించింది. అయితేనేం ఎలాగోలాగ సర్దిచెప్పి ఆమెను కూడా ప్రసన్నం చేసుకోగలిగేడు. దాని పర్యవసానమే ఈ పల్లెటూరి మజిలీ.

ఇలా నెమరు వేస్తున్న సుధాకర్ గతానికి డ్రైవర్ పిలుపుతో బ్రేక్ పడింది. “సార్! హాస్పటల్ వచ్చేసింది.”అంటూ డోర్ తీసి నిలబడ్డాడు. చూస్తే అది ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణం. కారు దిగగానే అక్కడి అసిస్టెంట్ అప్పారావు వచ్చి నమస్కారం చేసి బ్రీఫ్‍కేస్ అందుకున్నాడు.లోపలకు తీసుకువెళ్ళి ఛాంబర్ చూపించేడు.అక్కడి స్టాఫ్ అందరూ ఒక్కొక్కరూ వచ్చి విష్ చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు. సుధాకర్ చుట్టూ అంతా చూసి పేషెంట్లు ఎవరూ లేకపోవడం గమనించి “అయితే మీ ఊరు నిజంగా ఆరోగ్యకేంద్రమే అన్నమాట” అన్నాడు.

“ అదేంటి సార్? “ అన్నాడు అప్పారావు.

“మరి హాస్పటల్‍కు పేషెంట్లు రాలేదంటే అందరూ ఆరోగ్యవంతులనేకదా అర్థం?” అన్నాడు సుధాకర్.

“మీకు ఇక్కడి సంగతి తెలియదు సార్!”

“ పేషెంట్లు రావడానికీ,ఇక్కడి సంగతులు తెలియడానికీ ఏమిటి సంబంధం? నాకు అర్థం కావడంలేదు.”

“అది కాదు సార్!” అంటూ చెప్పుకొచ్చేడు అప్పారావు.ఇక్కడ పనిచేయడానికి ఏ డాక్టరూ రాడనీ, ఎవర్ని వేసినా ఇక్కడకు రాకుండానే అక్కడినుండే ఆర్డర్స్ కేన్సిల్ చేయించుకునేవారు ఒకరయితే వచ్చి జాయినయి ఓ నెలో,రెండు నెలలో పనిచేసి ఈలోపున ట్రై చేసి ట్రాన్సఫర్ చేయించుకుని వెళ్ళిపోయేవారు మరొకరనీ…

“ అయితే నేనూ అలా వెళ్లి పోతాననుకుంటున్నావా?” అడిగేడు సుధాకర్.

“ కాదా సర్?” అడిగేడు అప్పారావు ఆశ్చర్యంగా.

“ కాదోయ్! నేను కావాలనే ఇక్కడికి వేయించుకుని వచ్చేను.”

“ నిజమా సార్! ఎంతదృష్టం? ఉండండి సార్! ఇప్పుడే వస్తాను.అర్జంటుగా మీకు కాఫీ పట్టుకొస్తాను.” అంటున్న అప్పారావుతో “ తర్వాత తీసుకువద్దువుగాని పేషెంట్లు రావచ్చు.”అన్నాడు సుధాకర్.

“పేషెంట్లు అప్పుడే రారు సార్!  పది తర్వాతే “ తెలియపర్చేడు.

“అదేం? హాస్పటల్ తొమ్మిదింటికే తెరుస్తారు కదా!”

“ హాస్పటల్ తెరుస్తారు సార్! కాని డాక్టరుగారే రారు పేషెంట్లు వెయిట్ చేస్తున్నట్లు కబురందితేనేగాని వచ్చేవారుకాదు .ఈ మధ్య ఓ డాక్టరుగారేమో ఇది పల్లెటూరు కదా అంచేత ఇక్కడ ఉండలేక ప్రక్కనున్న టౌన్‍లో ఉండేవారు. అక్కడినుండి వచ్చేసరికి పదయేది. అంచేత ముందొచ్చి పడిగాపులు పడడం ఎందుకని డాక్టరుగారు వచ్చే టైమ్‍కే పేషెంట్లు కూడా వస్తారు సర్!” అని అప్పారావు చెప్పగానే-

“రేపటినుండి పేషెంట్లను తొమ్మిదింటికే రమ్మని ఈవేళే అందరికీ చెప్పు” అని చెప్తూ “మరి డాక్టరుగారు పదింటివరకూ రాకపోతే ఎవరూ అడగరా?” అని అడిగేడు సుధాకర్.కల్లా

“ఎవరు అడుగుతారు సార్? ఇక్కడకు వచ్చేవాళ్ళంతా కూటికి గతిలేనివాళ్ళూ, రెక్కాడితేనేగాని డొక్కాడనివాళ్ళూ, పైసా ఇచ్చుకోలేనివాళ్ళూ. అలాంటివాళ్ళు ఉచితంగా వైద్యం పొందుతూ ఏమడుగుతారు సార్? అది సరే సార్, సాయంత్రం ఇంటికి పేషెంట్లను పంపమంటారా సర్? మీకూ ఆదాయం.నాకూ ఏదో కిడుతుంది.” అని అడిగేడు అప్పుడే అసిస్టెంట్ డ్యూటీగా.

“అదేంటోయ్! హాస్పటల్‍కి మానేసి పేషెంట్లు ఇంటికి వస్తారా?” అని అడిగిన డాక్టరుగారికి “ ఇంటికొచ్చే కేసులు వేరు సార్! హాస్పటల్‍లో వెయిట్ చేసే ఓపికలేనివాళ్ళు అంటే డబ్బులిచ్చుకునే ఓపిక ఉన్నవాళ్ళు” చెప్పేడు అప్పారావు.

“ ఇంటికెప్పుడు రావాలంటే హాస్పటల్ వేళలు కానప్పుడూ, అత్యవసర పరిస్థితుల్లోనూ ఎప్పుడైనా రావచ్చు. అలా వచ్చినా నేనేం ఫీజు తీసుకోను.ఈ విషయంకూడా అందరికీ చెప్పు.” తెలియజేసేడు సుధాకర్.

” సారు ఈ కాలంలో ఉండవలసినవాళ్లు కాదు” అనుకుంటూ “అదేంటి సార్? డాక్టర్లందరూ హాస్పటల్లో పనిచేస్తున్నా ప్రైవేట్‍గా క్లినిక్‍లూ, నర్సింగ్‍హోమ్‍లూ పెట్టుకుని సంపాదిస్తుంటే…?”

“ చూడు అప్పారావ్! మనిషికి ఎంత ఆదాయం వచ్చినా ఇంక చాలు అని మాత్రం అనుకోడు..ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు.డబ్బు మనిషి అవసరాలను తీర్చగలదుకాని ఆశలను తీర్చలేదు.అంచేత అవసరాలకు సరిపడేవరకే మనిషి డబ్బు సంపాదించాలి.అంతేగాని అంతకు మించి సంపాదిస్తే అది అత్యాశే అవుతుంది.మనం అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పాలిగాని మీ రోగమే మా భాగ్యం అన్నట్లు మనం ఉండకూడదు.”

“ మీలాగే అందరూ ఉంటే ఈ లోకమే ఎప్పుడో బాగుపడిపోయేది సార్!”

“ సరిసరి నువ్వు నాకేం చెప్పక్కర్లేదుగాని నేను చెప్పినట్లు చేస్తుండు చాలు. చూడు, పేషెంట్లు వస్తున్నట్టున్నారు. ఇక్కడ మనిద్దరం ఇలా మాట్లాడుకుంటూ కూచుంటే అవతల పేషెంట్లు విసుగెత్తి వెళ్ళిపోగలరు.వరసగా ఒక్కొక్కర్నీ లోపలికి పంపించు.” ఆర్డర్ వేసేడు సుధాకర్.

“నువ్విలా వచ్చి కూర్చో అమ్మా!ఓయ్! నాయుడూ! నువ్వు అక్కడ ఉండు.నేను పిలుస్తాను అప్పుడు వద్దువుగాని.” అసిస్టెంట్ అప్పారావు తన డ్యూటీ ప్రారంభించేడు.

* *

హాస్పటల్లో ఇప్పుడు పేషెంట్లు రావడంలో ఇంప్రూవ్‍మెంట్ కనిపించింది.ఠంచనుగా ఉదయం తొమ్మిదయేసరికల్లా వచ్చి కూచుంటున్నారు. పేషెంట్లూ ఎక్కువయేరు.

కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు సుధాకర్ హాస్పటల్ నుండి ఇంటికి వచ్చి “ హాయ్! మై డియర్ ఎల్.పి “ అని పిలిచేడు భార్యని.“ అల్పీ లేదూ, గిల్పీ లేదు నాకు బి.పి వచ్చేలా ఉంది.” అంది భార్యామణి. “ నేనున్నాగా! మొగుడే డాక్టరయితే మందులకేం కొదువ అని ఏమొచ్చినా పరవాలేదు.” భరోసా ఇచ్చేడు డాక్టర్ భర్త.

“ చాల్లెండి సంబడం.అయితే మీరు వైద్యం చేస్తారని నేను రోగం కొనితెచ్చుకోవాలా? ” అడిగింది అర్థాంగి.

“ఈరోజుల్లో రోగాలు కొని తెచ్చుకోనక్కర్లేదు.వాటంతటవే వస్తాయి.అయినా జరిగితే జ్వరమంత సుఖం లేదట తెలుసా?” తెలియజెప్పేడు పతిదేవుడు.

“ జరిగినప్పుడు కదా?”

“ ఏం జరగక ఏమైందిప్పుడు? ” ఆదుర్దాగా అడిగేడు ఆయనగారు.

“ మీకెంతసేపూ హాస్పటల్, అది అయిపోతే ఇంటిదగ్గర పేషెంట్లూ తప్పితే పెళ్ళాం ఒకర్తె ఉందని గుర్తుంటేగా?” అని నిలదీస్తున్న భార్యతో- “ఎంతమాట డార్లింగ్? గుర్తుండబట్టేకదా నీకోసం ఏం తెచ్చేనో చూడు “ అనగానే “ ఏం తెస్తారు? ఓ నిద్రమాత్ర తెచ్చి ఉంటారు నేను వేసుకుని మాటాడకుండా పడుకోడానికి.” నిష్ఠూరంగా అంది సతీమణి.

“ ఛ! చ! అదేం మాటోయ్? ఎంతైనా బి.హెచ్‍వి కదా!”

“ఈ ఎల్.పి ఏమిటీ? బి.హెచ్ ఏమిటీ? ముందా హాస్పటల్ డ్రెస్ మార్చి ఈ లోకంలోకి రండి.” సలహా ఇచ్చింది సాధ్వీమణి.

 “ మై డియర్ వైఫ్!ఎల్.పి అంటే ఒకటి, తమరి పేరు లక్ష్మీప్రసన్నకి షార్ట్ కట్, రెండోది లైఫ్ పార్టనర్ అని. ఇంక బి.హెచ్ అంటే బెటర్ హాఫ్ అంటే అర్థాంగి అని.ఇంతకీ నీకోసం నేనేం తెచ్చేనో చెప్పలేకపోయేవు”

“ చెప్పేనుగా!”

“ అది కాదు.”

“మరి?”

“ జె.ఎఫ్. అంటే ఏమిటో చెప్పు చూద్దాం.” భర్త వేసిన క్విజ్‍కి “ ఏమో బాబూ! ఎల్.పి అయిపొయింది.బి.హెచ్ అయిపొయింది ఇంక జె.ఎఫ్ బాగుంది. ఎ.బి.సి.డి.ఇ.ఎఫ్ లాగ ఉన్నాయి. “ అంది భార్యామణి.

“జె.ఎఫ్ అంటే జాస్మిన్ ఫ్లవర్స్. మల్లెపూలు మై డియర్!లక్ష్మీకాంత ప్రసన్నం కావాలంటే ఇలాంటి కానుకలు ఇచ్చుకోక తప్పదు.”

“ ఆ ఏక్షన్ కాస్త ఆపండి.డాక్టర్ అయిపోయేరుగాని ఏక్టర్ అవవలసింది.”అన్న భార్య సలహాకు జవాబుగా సుధాకర్ “అదేనోయ్! డాక్టర్లు కావాలనుకున్నవాళ్ళు ఏక్టర్లు అయినట్లు ఏక్టర్లు కావాలనుకున్నవాళ్ళు డాక్టర్లు అవొచ్చుగా. అది సరేగాని త్వరగా తయారవు.పిక్చర్‍కి వెళ్దాం.” అన్నాడు.” ఏంటి పిక్చర్‍కి? ఈ ఊళ్ళో.ఇంకా నయం తోలుబొమ్మలాటకి వెళ్దాం అనలేదు.” అంది అర్థాంగి వెటకారంగా. “ పోనీ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనుకో”సర్దుబాటు చెప్పేడు సుధాకర్.

“ ఎందుకూ? మీకు ఆపరేషన్ థియేటర్ ఉంటే చాలు.” అంటుండగానే ఎవరో డాక్టరుగారూ అంటూ పిలిచేరు.” అదిగో! మాటల్లోనే వచ్చేరు ఎవరో మీ పేషెంట్. ఇంకా ఇంటికి ఇలా వచ్చేరో లేదో అప్పుడే తయారు.”

“ ఏం చెయ్యమంటావు చెప్పు?వృత్తిధర్మం అలాంటిది.ఇప్పుడే వస్తాను ఉండు.”

“ ఉండక ఎక్కడికి పోతాను?” అని అలిగిన ఇల్లాలితో “ చూడు ప్రసన్నా! చాలా సీరియస్ కేసట. వెళ్ళొస్తాను.ఆ బేగ్ ఇలా అందుకో.” అన్నాడు. మళ్ళీ ఎప్పుడొస్తారో కాస్త టిఫిన్ చేసి కాఫీ త్రాగి వెళ్ళమని చెప్పింది భోజ్యేషు మాతలా. కాని ఇలాంటి సమయాల్లో ఒక్క క్షణం ఆలస్యం చేసినా ప్రమాదమే.వచ్చేక చేస్తానంటూ వెళ్లిపోతుంటే పోనీ కాఫీ అయినా త్రాగి వెళ్ళమని చెప్పింది.

” ఫ్లాస్క్ లో పోసి ఉంచు వచ్చేక త్రాగుతాను” అంటూ వెళ్ళిపోయేడు సుధాకర్.

“ఖర్మ. స్టెతస్కోపు డాక్టరుకు అందం అనుకున్నానుగాని గేదె మెడలో కన్నెలా బంధం అవుతుందనుకోలేదు” నిట్టూర్చింది డాక్టరుగారి భార్య.

* *

కాలింగ్ బెల్ విని తలుపు తీసి వచ్చిన భర్తను చూసి “అరె!వచ్చేసేరా? అప్పుడే తెల్లారిపోయిందా?” అంది ఎల్.పి.

“జోకులెయ్యకోయ్! తెల్లారిపోలేదు. తొమ్మిదే అయింది.త్వరగా స్నానం చేసి వస్తాను.ఇద్దరం భోంచేద్దాం.నావల్ల పాపం నీకు లేటయిపోయింది.” అన్నాడు సుధాకర్ సానుభూతితో.

“ పన్నెండు గంటలకు రాలేకపోయేరా? పడుకుని ఉదయమే లేచి స్నానం చేద్దురుకదా!”

“ నీకు వేళాకోళంగా ఉందిగాని అక్కడ ఓ మనిషి చావుబ్రతుకులలో ఉంటే వదిలేసి ఎలా రమ్మంటావు చెప్పు?”

“ నన్నడగడమెందుకూ? అక్కడికేదో నేను చెప్పింది వినేసినట్లు” చురక అంటించింది ఎల్.పి.

“ నువ్వు బాగా అప్ సెట్ అయినట్లున్నావు.సరేగాని నాకు ఆకలేస్తుంది.పద.పోనీ నువ్వు చేసేయలేకపోయేవా? ఇంతవరకూ ఉండడమెందుకు?”

“నాకు ఆకలిగా లేదు.”అంది ఎల్.పి.

“పోనీ నేను వడ్డించనా?”

“ అక్కర్లేదు.మీకు వడ్డిస్తున్నాను. తినండి.” అర్థాంగి అలా అనగానే ప్చ్! ఇప్పుడేం మాట్లాడినా లాభం లేదని ఊరుకున్నాడు సుధాకర్.

* *

లక్ష్మీప్రసన్న ఫ్రెండ్ మాలతి సర్ప్రైజ్ విజిట్‍గా వచ్చింది.”హాయ్! లచ్చూ! ఎలా ఉన్నావ్?సారీ! నీకు పెళ్ళయిపోయిందికదూ! లచ్చూ,గిచ్చూ అంటే మీ శ్రీవారు వింటే ఊరుకుంటారా?”అంటూ.

“మావారు లేరు కాని నాకు పెళ్లయిపోతేమాత్రం నువ్వు నాకు ఫ్రెండ్‍వి కాకుండాపోతావా? అలా పిలిచే హక్కు నీకు పోతుందా?అది సరేకాని ఏంటిలా సడన్ గా ఊడి పడ్డావ్? ఇది కలా? నిజమా?” అని ఎల్.పి అంటుండగానే “కలలాంటి నిజం.ఇంతకీ నన్ను లోపలికి రానిస్తావా?లేక బయటే గుమ్మంలోనే నిల్చోబెట్టి మాట్లాడేసి పంపించేస్తావా? ఈ ఊళ్ళో ఏకైక డాక్టరుగారి భార్యవు కనుక ఇల్లు తెలుసుకుని వచ్చేను.” అంది మాలతి.

“ సారీరా! నిన్ను చూసేసరికి ఆ ఆనందంలో నా బుర్ర పనిచేయలేదు.”

“ మరి మీ శ్రీవారిని చూస్తే ఏం పనిచేయదో?” కొంటెగా అంది ఆ క్లోజ్ ఫ్రెండ్.

“ ఏం శ్రీవారో ఏం లోకమో?” నిట్టూర్చింది ఎల్.పి

“ ఏం తల్లీ! అప్పుడే మొహం మొత్తేసిందా? ఇంకా క్రొత్త కాపురం కదా నేను పానకంలో పుడకలాగ వచ్చేను అనుకున్నాను.”అంది మాలతి.

“అదేం లేదే!పిల్లలకు సండే డాడీల్లాగ నాకు సండే హజ్‍బండ్.” చెప్పింది ఎల్.పి

“ పోనీలే! మండే హజ్‍బండ్ కాదు కదా?”నచ్చచెప్పింది మాలతి.

“అదేంటే! మండే హజ్‍బండ్‍లు కూడా ఉన్నారా?”ఆశ్చర్యంగా అడిగింది ఎల్.పి.

“ అదేనే! మండే హజ్‍బండ్ అంటే మండిపడే హజ్‍బండ్”భావార్థం తెలియచెప్పింది.

“ చంపేవ్! ఉండు కాఫీ పట్టుకొస్తాను త్రాగి స్నానం చేసి రిలాక్స్ ఆవు.ఇంతలో భోజనం రడీ చేస్తాను.” అంటూ ఎల్.పి లోపలికి వెళ్తుంటే “నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయిందే!కాఫీ వరకూ అయితే ఓకేగాని భోజనం,గీజనం అదీ పెట్టకు.ఓ పనిమీద వెళ్తూ త్రోవలోనే కదా నిన్ను చూసిపోదామని వచ్చేను.వెంటనే వెళ్లిపోవాలి.”అంది మాలతి.

“ఇలా కాలు పెట్టావో లేదో అప్పుడే వెళ్లి పోవాలంటున్నావ్!ఏమిటంత రాచకార్యం?”ఆరా తీసింది ఎల్.పి.

“అవును. రాచకార్యమే తర్వాత చెప్తాను” అంది మాలతి.

ఇంతలో కాఫీ పెట్టడానికి వెళ్తున్న స్నేహితురాలివెంట వెళ్ళింది అక్కడే మాట్లాడుకోవచ్చునని. కాఫీ పెడుతూ అంది ఎల్.పి “ ఏదో నువ్వొచ్చేసరికి నా ప్రాణం లేచివచ్చినట్లయిందే.”

“అదేం రా? నీకు ఏమిటంత కష్టమొచ్చింది? న్యూలీ మేరీడ్ లైఫ్.అందులోనూ వేరే కాపురం.స్వీట్‍డ్రీమ్స్‌లో ఉండవలసింది పోయి… అంటున్న క్లోజ్‍ఫ్రెండ్‍కి చెప్పుకుంటూ వచ్చింది ఎల్.పి “ ఏం చెప్పమంటావ్?మావారికి ఇరవైనాలుగ్గంటలూ పేషెంట్లతోనే సరిపోతుంది.ఓ టైమూ లేదూ పాడూ లేదు. పగలూ లేదు.రాత్రీ లేదు”

 “అయితే మీ శ్రీవారు రెండు చేతులా సంపాదిస్తున్నారన్నమాట. అంతా నీకోసమే కదా!”అంది మాలతి.

”సంపాదనా? పాడా? ఊరు చూసేవు కదా! ఇక్కడున్నవాళ్ళలో నూటికి తొంభైమంది డబ్బులు ఇచ్చుకోలేనివాళ్ళే!దానికి తగ్గట్టు ఈ దయామయులైన డాక్టరుగారు పైసా తీసుకోరు.అదేమంటే మానవసేవే మాధవసేవ అంటారు.” అంటూ మాలతికి కాఫీ ఇచ్చింది.”థాంక్ యూ ” అంటూ అది తీసుకుని త్రాగుతూ “పోనీ ఆయన ఆ మానవుల సేవ చేస్తుంటే నువ్వు నీ మాధవుడి సేవ చెయ్యి.”సలహా ఇచ్చింది ప్రియసఖి.

“ రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టుంది నువ్వు చెప్పింది. పగలంతా హాస్పటల్లో. ఇంటికి వచ్చేక ఊళ్ళో. ఏ రాత్రికో అలిసిపోయి వచ్చి పడుకోవడం.తెల్లారేసరికి మళ్ళీ ఎవరో ప్రత్యక్షం తీసుకువెళ్లి పోవడానికి. ఇదీ కార్యక్రమం.ఓ ముద్దూ లేదు.ముచ్చటా లేదు. అయినా ఇలాంటి పల్లెటూళ్ళో ఏం సరదాలుంటాయి సంతోషంగా ఉండడానికి?”

అది విన్న మాలతి “ అయ్యయ్యో! నీ లైఫ్ ఇలా అయిపోయిందా? నేనింకా నువ్వు ఓ డాక్టరుగారి భార్యగా ఎంతో హేప్పీగా ఉంటావనీ, బాగా ఎంజోయ్ చేస్తుంటావనీ అనుకున్నానే కాని ఇలా డిసప్పాయింట్ అవుతావనుకోలేదు.”అంది.

దానికి పరిష్కార మార్గం చెప్పమని అడిగింది ఎల్.పి.

“నేనేం తలపండినదాన్ననుకున్నావా నీకు సలహాలివ్వడానికి? అయినా నువ్వు అడిగేవు కాబట్టి నీకోసం చెప్తున్నాను. ఓ పని చెయ్యి. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరాలంటే అప్పుడప్పుడు ఎడమవుతుండాలి.ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నారు.”

“మరి ఎంత ఎంత కుడి అయితే ఏమవుతుంది?” ఎల్.పి వేసిన ప్రశ్నకి “ఛ! మధ్యన వెధవ జోకులెయ్యక నే చెప్పింది విను “ అంది మాలతి.”“ఓకే యువరానర్!” చెప్పు అంది ఎల్.పి.

“ ఈ పల్లెటూరినుండి ఏదైనా సిటీకి మకాం మారిస్తేనేగాని వచ్చేదిలేదని చెప్పి ఎంచక్కా మీ ఇంటికిచెక్కెయ్.ఆడవాళ్ళకు కేంప్ పుట్టిల్లే కదా!ఎంతవారలైనా కాంతదాసులే. నువ్వు దూరమైతే మీ వారికి నీ అవసరమూ తెలుస్తుంది. నీ అవసరాలూ తెలుస్తాయి.” మంత్రోపదేశం చేసింది గడసరి మిత్రురాలు.

“ తప్పదంటావా?మరో మార్గం లేదా?”అడిగింది అమాయకంగా ఎల్.పి.

ఇంతలో “ ఓ మై గాడ్! నీతో మాట్లాడుతూ టైమ్ చూడలేదు.మరి వస్తా.నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు తెలియపరుస్తుండు. నే చెప్పాకదా!విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్.టాటా బై “ అంటూ బయలుదేరింది మాలతి.

* *

సుధాకర్ హాస్పటల్ నుండి ఇంటికి వచ్చి “హాయ్! ఎల్.పి “ అని పిలిచేడు.

“నేను మీతో మాటాడను పొండి” అంది అలిగిన ఇల్లాలు.

“అలా అంటూనే మాట్లాడేసేవు” అన్నాడు సుధాకర్.

“నేను మీతో మాట్లాడలేదు. మాటాడను అని చెప్పేను అంతే” అంది ఎల్.పి.

“పోనీ మాటాడొద్దుగాని ఎందుకు మాటాడవో చెప్పేసి అప్పుడు మానేయ్” అన్నాడు వాళ్ళాయన.

“మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు?” మొదటి ప్రశ్న వేసింది.

“అదేంటోయ్! అలా అడుగుతావ్?ఏదో నిన్ను ఎత్తుకొచ్చేసినట్టు? లైఫ్ బోయ్ ఎక్కడ ఉంటే వైఫ్ గర్ల్ అక్కడ ఉండొద్దా మరి?’ చెప్పేడు చిద్విలాసంగా.

“ అలాంటప్పుడు ఆ బాలిక కష్టసుఖాలు చూడడం మంచి బాలుడి కర్తవ్యం కాదా?”అడిగింది ఎల్.పి

“ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమిటి బాలికా?” అడిగేడు.

”తిండికి లోటు లేనంతమాత్రాన మరింకేం అక్కరలేదా మనిషికి? జైల్లో పెట్టినట్లు నన్ను తీసుకొచ్చి ఈ పల్లెటూళ్ళో పడేసేరు. నాకేం తోస్తుంది చెప్పండి?” అనగానే “పల్లెటూరయినంతమాత్రాన మనుషులుండడం లేదా? వాళ్లకు కాలక్షేపం అవడం లేదా?” ఎదురు ప్రశ్నవేసేడు సుధాకర్.

“ మీకంటే మీ పేషెంట్స్‌తో కాలక్షేపం అయిపోతుంది.మరి నాకు? కనీసం ఓ మంచి ధియేటర్ అయినా లేదు.సరదాగా షికారయినా వెళ్దామంటే బయటకు వెళ్తే దుమ్మూ,ధూళీ తప్పితే మరేం లేవు.చుట్టుప్రక్కల జనం చూస్తే డాక్టరుగారి భార్య,అమ్మగారు అంటూ నన్ను వింతమృగాన్ని చూసినట్టు చూస్తున్నారు.” చెప్పింది.

“అయితే అశోకవనంలో సీతలా ఉన్నానంటావ్”అన్నాడు సుధాకర్.

“కాకపోతే?”

“ అంటే వీళ్ళంతా రాక్షసులంటావా? చూడు ప్రసన్నా! నిజం చెప్పాలంటే పట్నం మనుషుల్లో ఉండే కృత్రిమత్వం,మాయా,మర్మం వీళ్ళలో ఉండవు.మనసిస్తే ప్రాణమైనా పెడతారు.సిటీల్లో నాగరికత పెరగొచ్చు కాని మానవత్వం మృగ్యమైపోతుంది.” అంటున్న భర్తతో “ అలా ఎందుకనుకోవాలి? అది మనుషుల్లో ఉంది.సిటీలో ఉన్నా,చిన్న పల్లెటూళ్ళో ఉన్నా మానవత్వం మనుషుల్ని బట్టి ఉంటుంది.అయినా మీతో వాదన నాకు ఎందుకుగాని మీకు ఈ పల్లెటూరు తప్ప మరే ఊరూ దొరకలేదా ఉద్యోగం చెయ్యడానికి?”అని అడిగింది.

దానికి సమాధానంగా “ఇలాంటి ఊళ్లలో పనిచేయడంలో నాకో ఆశయం ఉంది” చెప్పేడు సుధాకర్.

“మీ ఆశయాలు మీతోనే ఉంచుకొండి.మీరు ఈ ఊరినుండి కనీసం ఏదైనా టౌన్‍కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటానంటేనే మీతో మాట్లాడేది.లేకపోతే మాట్లాడను”అల్టిమేటం ఇచ్చేసింది డాక్టరుగారి భార్య.

“అంటే మౌన పోరాటమన్నమాట ” డాక్టరుగారు.

 “అంతేకాదు.మా ఇంటికి వెళ్ళిపోతాను.ఇక్కడ ఉండను” యమసీరియస్‍గా చెప్పింది భార్యామణి.

” ప్రతి డాక్టరూ పట్నాలకే ఎగబడితే ఇక పల్లెల్లో చేసేదెవరూ?”అడిగేడు.

”ఆ< మీరు తప్ప మరెవరూ లేరా చేయడానికి?” ఎదురు ప్రశ్న వేసింది.

“ ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటే రాజుగారికి పాల సేకరణ కథలాగే ఉంటుంది. రాజుగారి పుట్టిన రోజున అందరూ పాలు పోస్తున్నప్పుడు నేనొక్కడ్నీ నీళ్ళు పోస్తే ఏమవుతుందని ప్రతి ఒక్కరూ అనుకుని అందరూ నీళ్ళే పోసేసేరట.అలా ఉంది నువ్వు చెప్పింది.మన దేశం బాగుండాలంటే ముందు పల్లెలు బాగుండాలని గాంధీగారన్నారు.”నచ్చచేప్పేడు సుధాకర్.

“ అయితే మీరో గాంధీగారి శిష్యులు.పల్లెల్ని బాగుచేయడానికి పుట్టిన దేశభక్తులు.దేశాన్ని ఉద్ధరించడానికి అవతరించిన మహా పురుషులు.”ఉక్రోషంగా అంది ఎల్.పి.

“నువ్వేమన్నా అనుకో నా నిర్ణయం మారదు” చేప్పేసేడు సుధాకర్. అయితే తన నిర్ణయమూ మారదని తెగేసి చెప్పేసింది సత్యభామలా.

“అంతేనా?” అని వాళ్ళాయన అడిగినా “ముమ్మాటికీ అంతే” అంది.

* *

మర్నాడు సుధాకర్ హాస్పటల్‍కు వెళ్ళినప్పుడు తెలిసిందేమిటంటే ముందురోజు రాత్రి ఎవరో ఒకతనిని పాము కాటేసిందనీ,నురగలు కక్కుతున్నాడనీ తనకోసం ఇంటికి వస్తే డాక్టరుగారు కేంప్ వెళ్లేరని తన భార్య చెప్పిందనీ,పాపం అతను చనిపోయేడనీ. అప్పుడు గుర్తుకు వచ్చింది తను భోజనం చేస్తుండగా ఎవరో వస్తే చూడమని ప్రసన్నకు చెప్తే ఎవరో అడ్రస్ తెలియక వచ్చేరని చెప్పింది.అది ఇదే అయి ఉంటుంది.ఆ విషయమే ప్రసన్నను నిలదీసి అడిగేడు ఇంటికి రాగానే.

గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పింది.”మీరు అప్పుడే భోజనానికి కూర్చున్నారు. వదిలేసి వెళ్ళిపోతారు అందుకే అలా చెప్పేను.ఎంత డాక్టరయితే మాత్రం మీకు తిండీ,నిద్రా అక్కరలేదా? పల్లెటూళ్ళలో పాము కాటుకు మంత్రాలు వేసేవాళ్లుంటారు.వాళ్లకు చూపించమని చెప్పేను”అని.

“అలాంటివాళ్ళు లేకేకదా నాకోసం వచ్చేరు.అయినా ఒకరి ప్రాణంకన్నా మన తిండీ,నిద్రా ముఖ్యమా?” అడిగేడు ఓ డాక్టర్‍లా ఆవేశంగా. “ ఎప్పుడూ వాళ్ళ సోదేగాని మీకు విశ్రాంతీ,సుఖమూ అక్కర్లేదా?”అభిమానంతో అడిగింది ఆ ఇల్లాలు.

”మన సుఖమే కాదు అవతలివాడి కష్టాన్ని గుర్తించే వాడే మనిషి.” అన్నాడు సుధాకర్.

“ అంటే నేను మనిషిని కాదంటారు. అనండి.అనండి.కోరి మిమ్మల్ని చేసుకున్నందుకు” అంటూ కంట తడి పెట్టింది. అయినా ఊరుకోకుండా సుధాకర్ “ నీ మూలాన ఓ నిండు ప్రాణం బలైపోయింది.అతని భార్యా,తల్లీ ,తండ్రుల బాధ చూడలేం.అదొక్కటే కాదు మొన్న ఉదయం ఏక్సిడెంట్ అయిందని ఎవరో వస్తే అప్పుడూ ఇలాగే నేను లేనని చెప్పి పంపించేసేవట”అడిగేడు.

” లేకపోతే ఇది ఇల్లులా ఉందా? ఇదో హాస్పటల్లా తయారయింది.తెల్లారితే చాలు మొదలు కేసులు.అప్పుడు మీకు చెప్తే మీ బర్త్‌డే ప్రోగ్రాం అంతా చెడిపోదూ? “

“ మన బర్త్‌డేలకోసం మరొకరి డెత్‍డే చూస్తామా?ఇదేనా మానవత్వం?” ఆవేశంగా అన్నాడు సుధాకర్.

“ మహాప్రభో! నాకు మానవత్వం లేదు.మీరు ఈ పల్లెటూళ్ళోనే పరవశించండి.నేను మా ఇంటికి వెళ్లి పోతాను.మీరు ఈ ఊరినుండి ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకూ లేదా చేయించుకుంటానని మాట ఇచ్చేవరకూ తిరిగి వచ్చేదిలేదు.” కరాఖండిగా చెప్పేసింది కాంతామణి. తొందరపడుతున్నావు, ఆలోచించమని భర్త చెప్పినా “ ఇప్పటికే ఆలస్యం చేసేను.ఇంకా ఆలోచించేదేమీ లేదు.మీరే ఆలోచించుకోండి” అని చెప్పేసింది సుధాకర్ ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా.

* *

తను అనుకున్నట్లుగా,భర్తకు చెప్పినట్లుగా లక్ష్మీప్రసన్న పుట్టింటికి వచ్చేసింది.హఠాత్తుగా ఊడిపడిన కూతుర్ని చూసి “ఏంటి ఇలా సడన్‍గా దిగేవ్? వంట్లో బాగుందా?’అని అడిగేరు అమ్మా,నాన్నా.

“ఏమమ్మా! నువ్వు ఒక్కర్తెవే వచ్చేవ్? మీ ఆయనగారు రాలేదా?’ అని తండ్రి అడిగితే-

“ మీ అల్లుడుగారు కట్టుకోవడం అయితే నన్ను కట్టుకున్నారుగాని ఆయనను ఆకట్టుకున్నది వేరు.” అనేసరికి “ ఏంటండీ! ఇంట్లో అడుగు పెడుతూనే ఇది ఇలా మాట్లాడుతుంది.నాకేదో అనుమానంగా ఉంది దీని వాలకం చూస్తుంటే “ అంది ప్రసన్న తల్లి పంకజం భర్త భానుమూర్తితో.

” నీకా భయమేమీ అక్కర్లేదు.క్రొత్త కాపురాల్లో ప్రణయ కలహాలు మామూలే”సర్దిచెప్పేడు భానుమూర్తి.

”ఇది కలహమాడిందంటే ప్రణయం కాదు ప్రళయం పుడుతుంది” అంది పంకజం.

”నీ అనుభవంకొద్దీ చెప్తున్నావు. ఎంతైనా ఈ తల్లి కూతురే కదా!” అన్నాడు భానుమూర్తి.

“ బాగుంది. ఉరుమురిమి మంగళంమీద పడ్డట్టు నన్నంటారేమిటి మధ్య?”అంది పంకజం.

“అమ్మా,నాన్నా నన్నంటున్నారుగాని ముందు మీరు కలహమాడుకుంటున్నారు”తెలియజెప్పింది కూతురు.

“చెప్పేనుకదా మీ అమ్మ ధోరణే అంత అని.”అని తండ్రి అంటుంటే “ చూసేవా అమ్మా! ముందు కదిపిందెవరు?”అని అడిగింది తల్లి కూతుర్ని. “ ఎవరు కదిపినా ఇంక ఆపండి.నాకసలే తలనొప్పిగా ఉంది.“ అని కూతురు అనగానే “ఏమోయ్! ముందు అమ్మాయి స్నానం,భోజనం వగైరా ఏర్పాట్లు చూడు.బాగా అలిసిపోయినట్లుంది.తర్వాత మాట్లాడదాం”అన్నాడు భానుమూర్తి.

” ఆ! ఇలాంటి ఆర్డర్లు వేయడానికేం తక్కువ లేదు.” అన్న భార్య పంకజంతో “ పోనీ నన్నేమైనా సాయం చెయ్యమంటావా” అని అడిగేడు భర్త. “ వద్దులెండి. దెప్పకపోతే సాయం చేసినంత పుణ్యం”అంటూ “అమ్మా! నువ్వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకో.” చెప్పింది కూతురికి పంకజం.

* *

“ పంకజం…పంకజం…ఇదిగో నిన్నే…” పిలిచేడు భానుమూర్తి భార్యని.

“ఎందుకూ? అమ్మాయిముందే నాకు కలహకంఠీ అని బిరుదిచ్చేరుకదా మళ్ళీ నాతో మాట్లాడడమెందుకూ?నేను మాట్లాడితేనే కయ్యమాడుతానంటున్నారు” మూతి ముడుస్తూ అంది పంకజం.

”చూడు భార్యామణీ! మొగుడూ,పెళ్లాలన్నాక పోట్లాటలూ, పొరపచ్చాలూ లేకుండా ఎలా ఉంటాయి చెప్పు? అయినా అమ్మాయి ముందు మనమే పోట్లాడుకుంటుంటే ఇంక వాళ్ళ తగువు మనమేం తీరుస్తాము?” సర్దిచెప్పేడు భర్తగారు.

”బాగుంది కోడలికి బుద్ది చెప్పి అత్త చేసిందని నాకు నీతులు చెప్తారు కాని మీరు చేసిందేమిటి? అసలు కయ్యానికి కాలు దువ్విందే మీరు”

గుర్తుచేసింది భార్యామణి.

”ఆల్‍రైట్ ఇంక ఆపేయ్! ఇంతకీ అమ్మాయి గొడవేంటో చెప్పిందా” అని ఆదుర్దాగా అడిగేడు తండ్రిగా.

“అది చెప్పలేదు.నేనే అడిగేను” అంది తల్లిలా. పోనీ ఏదయితేనేం చెప్పమన్నాడు.

“ఏం లేదు.వడ్లగింజలో బియ్యపుగింజ అని… అమ్మాయికి ఆ పల్లెటూళ్ళో ఉండడం ఇష్టం లేదట.అల్లుడికేమో పల్లెల్లోనే పేదవాళ్ళకి వైద్యం చెయ్యాలని ఆశయంట.అదే వీళ్ళిద్దరికీ పడడంలేదు” అసలు విషయం చెప్పింది పంకజం.

“ఓస్! ఇంతేనా?నేను అమ్మాయికి నచ్చజెప్పి తీసుకెళ్ళి దిగబెట్టివస్తాను.నేను చెప్తే వింటుందని నా నమ్మకం.”అన్నాడు.

”మీరు తీసుకెళ్తానన్నాఅది రాదు.అదో మొండిఘటం”అంది తెలిసిన తల్లి.

”పెళ్లి కానన్నాళ్ళూ ఎలా ఉన్నా పరవాలేదు.మనం సర్డుకుపోతాం.కాని పెళ్లయేక ఇలాంటి పంతాలూ,పట్టింపులూ వదలకపోతే పచ్చటి కాపురం పాడయిపోతుంది.”జాగ్రత్త చెప్పేడు కూతురి బాగు కోరుతూ.

“ఏం చేస్తారో ఏమిటో?” దిగులుపడుతున్న భార్యతో “ ఏదో ఒకటి చెయ్యక తప్పదు.సరే.పడుకో. అమ్మాయికి బోధపరుస్తాను. అల్లుడికి కూడా చెప్తాను ఆ పల్లెటూరినుండి మారమని” అని చెప్పి నిద్రకు ఉపక్రమించేడు భానుమూర్తి.

* *

మర్నాడు మధ్యాహ్నం భానుమూర్తి కూతుర్ని పిలిచేడు “ఇలా రా అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి” అంటూ.

మీరేం మాట్లాడతారో నాకు తెలుసని చెప్పేసింది కూతురు.

“తెలిసినా నేను చెప్పవలసింది చెప్పాలి కదమ్మా” అంటూ ప్రారంభించేడు తండ్రి.అది శ్రీకృష్ణార్జునసంవాదంలా ఇలా సాగింది.

“అమ్మా! నువ్వో డాక్టర్ని చేసుకుంటానని ఏరికోరి చేసుకున్నావ్.ఇప్పుడతనితో ఎడ్జస్ట్ అవకపోతే ఎలా?”

“ఎడ్జస్ట్‌మెంట్ అనేది ఒక్కరికే కాదు నాన్నా! ఇద్దరిలోనూ ఉండాలి.”

“ఎడ్జస్ట్ కాలేక బయటపడి ఇక్కడకు వచ్చేసింది నువ్వే కదమ్మా!”

“ అంటే మీరూ నాదే తప్పంటారా?”

“ తప్పని కాకపోయినా ఒప్పేదో చెప్తున్నాను. మీ ఆయన పల్లెటూళ్ళో పనిచేస్తే నీకొచ్చిన నష్టమేమిటి?కష్టమేమిటి?”

“ఎవరైనా తన భర్త డాక్టరు అయితే పట్నవాసాన్ని కోరుకుంటారుగాని పల్లెటూళ్ళో పాట్లు కాదు.పంజరంలో చిలకకి మనమే లోటు చెయ్యకపోయినా దాని బాధ మనకేం అర్థమౌతుంది?”

“నిజమే కాని చూడమ్మా!మనుషుల్లో నూటికి తొంభైమంది స్వార్థపరులే ఉంటారు.ఏ ఒక్కరో మీ ఆయనలాంటివాళ్ళు ఉంటారు తమ సుఖాల్ని త్యాగం చేసేవాళ్ళు.డబ్బులు తీసుకోకుండా పేదవాళ్ళకు వైద్యం చేసే ఉపకారబుద్ది ఎంతమందికి ఉంటుంది?అలాంటిది మీ ఆయనకు ఉన్నందుకు నువ్వెంతో గర్వపడాలి.పల్లెల్లో సమయానికి సరైన వైద్యసహాయం అందక ఎంతమంది బలైపోతున్నారో మనకేం తెలుసు?”

“ఇంతకీ మీరు చెప్పేది?”

“ నేను చెప్పేది పూర్తిగా వినమ్మా! ఓ సారి నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను.బస్సు ఓ పల్లెటూళ్ళో ఆగింది.జబ్బేమిటో తెలియదుగాని కండిషన్ సీరియస్‍గా ఉన్న ఓ కుర్రాడ్నిబస్సులో ఎక్కించేరు.”

“అయ్యో పాపం.”

“ సమయానికి వైద్యసహాయం అందితే బ్రతికేవాడే కాని…”

“ఏమయింది? ఆ ఊళ్ళో డాక్టరుగారు లేరా?”

“కరెక్ట్‌గా చెప్పేవ్.అది నువ్వున్నలాంటి పల్లెటూరు.అక్కడ డాక్టరుగారు లేరు.కనీసం ప్రథమ చికిత్సకైనా నోచుకోని ఆ కుర్రాడ్ని అతికష్టం మీద దగ్గరలో ఉన్న మరో ఊరికైతే చేర్చగలిగేరు కాని ఈ లోపునే కొన ఊపిరితో ఉన్న ఆ కుర్రాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేయి.”

“ప్చ్!”

“అదే ఆ పల్లెటూళ్ళో ఓ డాక్టరుంటే ఆ కుర్రాడికి ఆ దుర్గతి పట్టేదికాదుకదా! అసలు ఇంకో ముఖ్యమైన సంఘటన చెప్తాను. విను.”“ఏమిటది?”

“మా పెళ్ళయిన క్రొత్తలో మీ అమ్మా,నేనూ హనీమూన్ ట్రిప్‍గా కార్లో వెళ్తున్నాం.ఇంతలో సడన్‍గా వర్షం పట్టుకుంది.చీకటి పడింది.ఉరుములూ,మెరుపులూ ఏమైందో తెలియదుగాని మా కారుకి ఏక్సిడెంట్ ఆయిందని మాత్రం తెలిసింది.”

“అయ్యో! నాకెప్పుడూ చెప్పలేదే!”

“సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.నేనూ,మీ అమ్మా గాయాలతో లేవలేని స్థితిలో ఉన్నాం.అయితే ఓ గొప్పతనం ఏమిటంటే ఆ ఏక్సిడెంట్ ఓ ఊరి పరిసరాల్లోనే అవడం. వెంటనే డ్రైవర్ పరుగెత్తుకుని ఆ ఊళ్ళో డాక్టరుగారి ఇల్లు తెలుసుకుని వెళ్లి సంగతి చెప్పి ప్రాధేయపడ్డాడట డాక్టరుగారికి చెప్పమని.

ఆ డాక్టరుగారి భార్య –

వేళా,పాళా లేదా వైద్యానికి?డాక్టరుగారు ఇప్పుడు రారు

– అని చెప్పి తలుపు వేసేసిందట.

డ్రైవరు అదే పనిగా పిలవడం,బ్రతిమాలడం డాక్టరుగారి చెవిన పడి ఆయన వచ్చి మా ప్రాణాలు కాపాడేరు.లేకపోతే నువ్వుండేదానివి కాదు. నీకు చెప్పడానికి మేముండేవాళ్ళం కాదు ఆ డాక్టరుగారే తనభార్య మాటలు విని రాకపోయినట్లయితే. “

“ఏం మాటలు నాన్నా?”

“ ఇప్పుడు చెప్పు.పల్లెటూళ్ళో డాక్టరు ఉండాలంటావా?వద్దా? వైద్యానికి వేళా,పాళా ఉండాలంటావా?”

“ బేతాళుడు విక్రమార్కుడ్ని అడిగినట్లు అడిగేవు.విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా ఉండలేడు.చెప్తే ఓ ముప్పు. అలా ఉంది నువ్వు చెప్పింది.కాదని ఎలా అనగలను?అవుననకుండా ఎలా ఉండగలను?నేనే ఓడిపోయేను.అయినా పరవాలేదు.ఓ నిజాన్ని తెలుసుకున్నాను.”

“వెరీ గుడ్.దటీజ్ మై చైల్డ్.” ఇలా గీతోపదేశం ముగిసింది.

* *

గుమ్మంలో ప్రత్యక్షమైన మామగార్ని చూసి “అరె! మామగారా! రండి.” అని ఆహ్వానించేడు సుధాకర్.

“ నేనెందుకొచ్చేనో నీకు తెలిసే ఉంటుంది.నేనొక్కడినే కాదు అదిగో నీ భార్యను కూడా వెంటబెట్టుకొచ్చేను.”

“అరె! అక్కడే నిలబడిపోయిందేం” అన్నాడు భార్యను చూసి.” దానికి మొహం చెల్లడంలేదు గుమ్మంలో అడుగుపెట్టడానికి.” అన్నారు మామగారు.

” ఏమంత తప్పు చేసిందని?” వెనకేసుకొచ్చేడు భార్యని ఓ మంచి భర్తలా సుధాకర్.

“ అది చేసింది తప్పని నువ్వనుకోకపోవచ్చు బాబూ!కాని అది చేసింది నిజంగా తప్పే.నీ మనసు మంచిది కాబట్టి అలా అంటున్నావుకాని.”అని కితాబు ఇచ్చేరు మామగారు.

”రండి ఇలా కూర్చొండి.కాఫీ తెస్తాను “ అని అల్లుడు అంటుంటే “అదేంటి బాబూ! నువ్వు చెయ్యి కాల్చుకుంటున్నావా?” అడిగేరు మామగారు. “ మరేం చెయ్యమంటారు చెప్పండి?ఇది పల్లెటూరు. సిటీ కాదు మంచి హోటళ్ళు ఉండడానికి.అయినా వారాలబ్బాయికిలా ఈ ఊళ్ళో రోజుకొకరు నాకు భోజనం తెచ్చిపెడుతున్నారు నేను వద్దన్నా వినకుండా. ”అన్నాడు డాక్టర్ అల్లుడు.

“అలా చూస్తావేంటి? లోపలికి వెళ్ళమ్మా.వెళ్లి ఆ కాఫీ ఏర్పాటేదో చూడు”అని కూతురికి చెప్పి “నువ్వుండు బాబూ! రా ఇలా కూర్చో.నీతో నాలుగు ముక్కలు చెప్పి పోదామని వచ్చేను.”అన్నాడు భానుమూర్తి. “ ఎంతమాట.చెప్పండి మామగారూ! మీరు పెద్దవారు.”అన్నాడు అల్లుడు.

” నీలో ఆ వినయం,విధేయతా నాకు బాగా నచ్చేయి.అందుకే నువ్వంటే నాకు ఎంతో అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే నిన్ను మా అల్లుడిగా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.”అన్నారు మామగారు.” బలేవారండీ.ఇవాండీ మీరు చెప్పాలనుకున్న నాలుగు ముక్కలూ?”అన్నాడు సుధాకర్.

“ అది కాదు బాబూ! మా అమ్మాయికి వయసొచ్చినా ఇంకా తెలిసీ తెలియని చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది.తొందరపాటు కూడా ఎక్కువే. నీ మనసు నొప్పించినందుకు నా ముఖం చూసి దాన్ని క్షమించు బాబూ!” అంటున్న మామగారితో-

“అదేంటండీ? మీ అమ్మాయి ఏమైనా అన్నదనిగాని,చేసిందనిగాని నేను అనలేదే!” అన్నాడు సుధాకర్.

“అది చిన్నప్పటినుండీ పట్న వాతావరణంలో పెరిగిన పిల్ల.అంచేత ఈ పల్లెటూళ్ళో ఇమడలేకపోతుంది. పోనీ నువ్వైనా ఏదైనా సిటీకో,టౌన్‍కో ట్రాన్సఫర్ చేయించుకోకూడదూ?”సలహా ఇచ్చేరు మామగారు.

“పట్నాల్లో అడుగుకో డాక్టరు ఉంటారండీ” అనగానే,

“ ఎంతమంది ఉంటేనేం బాబూ!ఎవరి ప్రాక్టీస్ వారిది.సిటీల్లో వచ్చే సంపాదన పల్లెల్లో ఏం వస్తుంది? ఓ ఎటాచెడ్ మెడికల్ షాపూ,లేబ్ కూడా పెట్టేవనుకో.నీ సంపాదన ఇంకా బాగుంటుంది.”అని మామగారు అన్నారో లేదో –

“ అలాంటి దురాశతో ధనార్జన చెయ్యాలన్న కోరికా,ఆలోచనా నాకు లేవు మామగారూ! అసలు వైద్యవృత్తి ఓ సేవా వృత్తి.వైద్యో నారాయణో హరి అని మంచి మనసుతో చేసే వైద్యం భగవంతుడికి చేసే సేవ లాంటిది. ” తెలియజేప్పేడు సుధాకర్.

“నీ మనసు నాకు తెలుసు. కాని నీ అభిమతం తెలుసుకుందామనీ, మరోసారి మా అమ్మాయికి బోధపడాలనే అలా అడిగేను.ఏమనుకోకు.” అన్నారు మామగారు.  ఇంతలో ప్రసన్న ఇద్దరికీ కాఫీ తెచ్చింది.

“ కాఫీ తీసుకోండి మామగారూ నేను చేసిందయితే సందేహించాలిగాని మీ అమ్మాయి చేసిందే. పరవాలేదు. తీసుకోండి.”అన్నాడు అల్లుడు.

“బలేవాడివోయ్ అల్లుడూ!అన్నిటినీ స్పోర్టివ్ గా తీసుకుంటావు.దట్ ఈజ్ వై ఐ యాం ప్రౌడ్ ఆఫ్ యూ.”

ఇంతలో ఎవరో పిలిచేరు.

“చూడమ్మా!” అన్నాడు భానుమూర్తి కూతురితో.

”ఇంకెవరు ఏ పేషెంటో వచ్చిఉంటాడు”అంది అలవాటు ప్రకారం.

” అమ్మగారూ! మీరు వచ్చేసేరా?” అంటూ ఒకతను లోపలికి వచ్చేడు.

“ఎవరు బాబూ అతను? ” అని అడిగేడు భానుమూర్తి.

“నాకు భోజనం తెస్తుంటాడు” అని చెప్పేడు సుధాకర్.

“ఎక్కడినుండి? హోటల్ నుండా?”

“ఈ ఊళ్ళో ఏం హోటల్ అండీ?”

“మరి?”

“వాళ్ళ ఇంటి నుండే .” చెప్పేడు అల్లుడు.

“ ఏంటి బాబూ? ఎవరైనా హాస్పటల్లో పేషెంట్‍కి భోజనం తెస్తారు.కాని డాక్టర్ గారికి ఇంటికి భోజనం తేవడం ఏమిటీ? నాకేమీ అర్థంకావడం లేదు.”

ఇంతకీ అతను ఎవరూ? అన్నట్టు మొహం పెట్టిన మామగారితో “అతను నా పేషెంట్ భర్త. నా మీద అభిమానంకొద్దీ నేను భోజనానికి ఇబ్బంది పడడం చూసి కేరేజి తెస్తున్నాడు వద్దన్నా వినకుండా.” అంటూ

“మా మామగారు” అంటూ పరిచయం చేసేడు అతనికి.వెంటనే అతను నమస్కారం పెట్టి “డాక్టరుగారు మా ఊరికి దేవుడండీ.ఇది ఓ పల్లెటూరు.పేరుకు హాస్పటల్ ఉన్నా సమయానికి డాక్టరుగారు ఉండేవారు కాదు.డాక్టర్లందరూ పట్నాల్లో పనిచేయడానికే ఇష్టపడతారుగాని ఇలాంటి పల్లెటూళ్ళో పనిచేయడానికి ఎవరు వస్తారు చెప్పండి.అలాంటిది ఈ డాక్టరుగారు వచ్చేక మా ప్రాణాలు నిలబడ్డాయి.ఎవరి సంగతో ఎందుకు నా భార్యకీ,మా బిడ్డకూ ప్రాణదానం చేసేరు. అందుకే ఆయన మా పాలిటి దేవుడు.”

“ఇంతకీ ఏమయిందీ? “ అడిగేడు భానుమూర్తి.

“ నా భార్య తొలిచూలు కాన్పు సమయంలో డెలివరీకి కొద్దిరోజుల ముందు చాలా సీరియస్ అయింది.అర్థరాత్రి.కన్ను చించుకున్నా కనబడని అమావాస్య చీకటి.ఒక ప్రక్క తుఫాను.భోరున వర్షం,హోరున గాలీ.అలాంటి సమయంలో కూడా పిలిచిన వెంటనే వచ్చి నా భార్యను బ్రతికించడమే కాదు మా బిడ్డను కూడా దక్కించేరు.కాళ్ళ దగ్గరకొచ్చినా కాసులిస్తేనేగాని కన్నెత్తి చూడని పట్నం డాక్టర్లు ఎందరుంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి.పల్లెటూళ్ళలో మాలాంటివాళ్ళ బ్రతుకుల్ని కాపాడే ఈ డాక్టరుగారు మా కోసం దిగివచ్చిన దేవుడు.అలాంటి దేవుడు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం చెప్పండి.అందుకే మాకు తోచిన చేతనైన సాయంగా డాక్టరుగారికి భోజనం ప్రత్యేకంగా తయారుచేయించి తెస్తున్నాను.” అని చెప్పి మళ్ళీ వస్తాను అమ్మగారూ అంటూ వెళ్ళిపోయేడు.

“ విన్నావా అమ్మా!ఇప్పటికైనా తెలుసుకున్నావా?పల్లెటూళ్ళో డాక్టరు అవసరం,ఇక్కడి మనుషుల విశ్వాసాలూ,ఆప్యాయతలూను లేక ఇంకా మీ ఆయన్ని ఈ ఊరినుండి ట్రాన్సఫర్ చేయించుకోమంటావా?”అడిగేడు కూతుర్ని భానుమూర్తి.

“లేదు నాన్నా” అంది. భర్తకు సారీ చెప్పింది.

“టేక్ ఇట్ ఈజీ “ అన్నాడు బ్రాడ్ మైండెడ్ భర్తగారు.

“ఇప్పుడు నిజంగా డాక్టరుగారి భార్యవనిపించుకున్నావ్” అని కూతుర్ని మెచ్చుకుని “అల్లుడూ! నేనొచ్చిన పని అయిపోయింది.అలా అని అప్పుడే వెళ్లిపోతాననుకునేవు.భోజనం చెయ్యకుండా వెళ్ళేది లేదు.”అన్నాడు భానుమూర్తి.

“బలేవారండీ! మిమ్మల్ని అప్పుడే వెళ్ళనిస్తామా? మీ అమ్మాయి పర్మిషన్ ఇవ్వద్దూ?” అన్నాడు అల్లుడి మర్యాదగా.