గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari

  1. తాకట్టు విడుదల by Sailaja Kallakuri
  2. ఏం చేయాలి? by Sailaja Kallakuri
  3. డాక్టరుగారి భార్య by Pati Muralidhara Sharma
  4. పదవే చెల్లీ – పదరా అన్నా by Mangu Krishna Kumari
  5. గురుదక్షిణ by Pati Muralidhara Sharma
  6. మృతజీవుడు by Ramu Kola
  7. అత్తారింట్లో దారేదీ by Pathy Muralidhara Sharma
  8. తొణికిన స్వర్గం!!!… Translation by Savitri Ramanarao
  9. ప్రేమంటే ఇదేనా? by Pathy Muralidhara Sharma
  10. ఆనందం పరమానందం by Pathy Muralidhara Sharma
  11. మాతృదేవోభవ! Translation by Savitri Ramanarao
  12. రాధకు నీవేర ప్రాణం by Pathy Muralidhara Sharama
  13. ఏం దానం? by Mangu Krishna Kumari
  14. బందీ! నిన్నెవ్వరు కట్టేసారూ!! by Savitri Ramanarao
  15. కోటి‌విద్యలూ… by Mangu Krishna Kumari
  16. గొప్పవారింటి పెళ్ళి by Mangu Krishna Kumari
  17. స్వేచ్ఛ అంటే… by Savitri Ramanarao
  18. జ్ఞాననేత్రం by Rama Sandilya
  19. ధైర్యే సాహసే లక్ష్మీ translation by Savitri Ramanarao

వరదరాజు, భార్య సుమతికి ముందే చెప్పేడు, మేయర్‍గారి భార్య తమ ఇంటికి పెళ్ళిపిలుపులకి వస్తుందని. అతను చెప్పినట్టే మేయర్‍గారి భార్య ఇద్దరితో కలిసి వచ్చింది. సుమతి హడావిడిపడుతూ కూచోమంది.
ఇందిరాదేవి అంతసేపు ఉండలేదు. బంగారం కుంకం భరిణతీసి సుమతి నుదుటన బొట్టుపెట్టి పెళ్ళి శుభలేఖ చేతిలోపెట్టి “మా అమ్మాయి పెళ్ళి. వరదరాజు‌గారికి తెలుసు. తప్పకుండా రావాలి” అని, “పద శ్రీలూ” అంటూ బయలుదేరింది.
“అయ్యో.. కొంచెం టీ అయినా తాగి వెళ్ళండి” అంటూ సుమతి మొహమాటంగా అందిగానీ టైమ్ లేదని ఆవిడ గాభరాగా వెళిపోయింది.
ఇందిరాదేవి వెనక వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డ డ్రైవరు వచ్చి ఒక పళ్ళబుట్టా, ఒక‌ పేకెట్టు ఇచ్చి వెళిపోయేడు. అందులో వెండిగంధంగిన్నె చిన్నది ఉన్నాది.
సుమతి అయోమయంగా వరదరాజుతో “ఇదేమిటండీ? ఆవిడ మనింటికి వచ్చి పిలవడమే ఎక్కువ. ఈ వెండిగిన్నె ఎందుకు?” అంది.
“అంతే.. మేయర్‍గారు చాలా మంచాయన.‌ నేను ఆయనకి కావలసిన ప్రసంగాలు రాసి ఇస్తాను. ‘మంచి మంచి’ ఫొటోలు ఆయనకి పనికివచ్చేవి ఇస్తాను. ఇంకా చాలా సాయాలు చేస్తానని ఇంత గౌరవం ఇస్తున్నారు. తెలుసా…” ఛాతీ పొంగుతూ ఉంటే అన్నాడు వరదరాజు.
“అయితే మీరు పెళ్ళికి వెళతారన్నమాట” సుమతి సాగదీసింది.
“నేను వెళ్ళడం ఏమిటి? నువ్వూ రావలసిందే…”
“నాకు ఇలాటి పెద్దవాళ్ళతో స్నేహాలు, రాసుకుపూసుకు తిరగడాలు ఇష్టం ఉండదని మీకు తెలుసుకదండీ. ఏదో మధ్యతరగతి దాన్ని. అలా
బతకడమే నాకు ఇష్టం” సుమతి అయిష్టంగా అన్నాది.
“ఇలాటి ఆలోచనలు నీ ఒక్కదానికే వస్తాయి. రెండంతస్తులు ఎక్కి ఆవిడ వచ్చినందుకయినా నీ బెట్టు ఒక అంతస్తు దిగాలి. మరి వాళ్ళ
అమ్మాయికి ఏం బహుమానం ఇద్దాం?” అన్నాడు వరదరాజు.
“మనం సాదాసీదా మనుషలం. ఏం ఇస్తాం? వెండికుంకంభరిణ ఇద్దామా?”
“ఛీ ఛీ ఆవిడ మనకి ఇంత గంధంగిన్నె ముందే ఇచ్చింది. ఏవన్నా బంగారం ఇవ్వాల్సిందే” ధాటీగా అన్నాడు వరదరాజు.
ఇద్దరూ రెండురోజులు మల్లగుల్లాలుపడి చక్కటి జూకాలు కొన్నారు.
“మనకి ఇద్దరూ కొడుకులే… లేకపొతే ఇలాటివి ఆడపిల్లలకి కొనడం మహాముద్దుగా ఉంటుంది” అంది సుమతి.
కళ్యాణమండపం బాజాబజంత్రీలతో, మ్యూజిక్ తో దద్దరిల్లిపోతోంది‌. గుమ్మంలోనే ఎలుగుబంటి ముసుగులొ ఒకతను డేన్స్ చేస్తూ అందరినీ
నవ్విస్తున్నాడు. లోపల మేయర్‍గారు చాలా హడావిడిగా ఉన్నారు. సుమతి సిగ్గుతో నెమ్మదిగా నడుస్తోంది.
వరదరాజు తన స్నేహితులతో కలిసిపోయేడు. సుమతికి తెలిసినవాళ్ళు ఒక్కళ్ళుకూడా లేరు. రిసెప్షన్ అంతా టీవీల్లో వస్తున్నాది. ఇందిరాదేవి ఆ స్టేజ్‍మీద ఎక్కడో ఉంది.
వరదరాజు భార్య దగ్గరకి వచ్చి “పద‌ పద, పెళ్ళికూతురికి అక్షింతలు వేసొద్దాం” అని లాక్కెళ్ళేడు. తీరా అక్కడ ఓ అరగంట పట్టింది. విఐపిలు చాలామంది వచ్చి అక్షింతలు వేస్తున్నారు. వాళ్ళెవరూ అమ్మాయి చేతిలో ఏమీ పెట్టకపోడం సుమతి గమనించింది.
ఆఖరికి ఎలాగో ఇద్దరూ అమ్మాయిని దీవించి బహుమానం చేతిలో‌పెట్టేరు. వెనకాలున్నావిడ బహుమతులన్నీ దాస్తోంది.
దిగుతూ ఉంటే మేయర్‍గారు కనిపించి వరదరాజు భుజంమీద చెయ్యివేసి “డిన్నర్ మొదలయింది. బోజనం చేయండి” అని మళ్ళా మంత్రిగారు వస్తున్నారనగానే అటు వెళ్ళేరు.
వరదరాజు కళ్ళేగరేసి “పద డిన్నర్‍కి” అన్నాడు. భోజనాల దగ్గర సుమతి నిర్ఘాంతపోయింది. దాదాపు అందరూ తమలాటి ఫేమిలీలే. బిర్యానీ ముట్టుకోలేనంత ముద్దగా ఉంది. పనీర్ కర్రీలో పనీర్ ఉందో లేదో తెలీదు. ఒక్క స్టార్టింగ్ ఐటెమ్ లేదు. ఒక డిష్‍లో ఉన్న పూరీలు చూస్తూ ఉంటే అయిపోయేయి.
“వస్తాయి వస్తాయి” అంటున్నారే కానీ రాటంలేదు. సాంబారు ఒక్కటే కాస్త వేడిగా ఉంది. మిగతావేవి కూడా ఏమాత్రం నాణ్యత లేనివి.
ఓ బౌల్‍లో ఉన్న లడ్డూలు ముక్కలు విరిగిపోయేయి. సాంబారన్నం కాస్త, పెరుగన్నం తిని ప్లేట్ పడిసి వచ్చింది సుమతి.
“తమలాటి మధ్యతరగతి వాళ్ళే భోజనాలు అట్టహాసంగా పెడుతున్న రోజుల్లో ఇంతగొప్పవాళ్ళు ఇంత చెత్త భోజనం పెట్టేరేమిటా?” అని విస్తుపోతూ వరదరాజుకోసం చూసేసరికి అయిదునిమిషాల తరవాత అతను కనపడ్డాడు. ఇందిరాదేవి పోలికలతో ఉన్న ఒకావిడ వచ్చి “అయ్యో మేడమీద డిన్నరుకి వచ్చీలేకపోయేరా? ఇందక్క అక్కడే ఉంది” అంది.
అప్పుడు గమనించింది సుమతి. మెట్లమీదనించి వెళ్ళే దగ్గర ఒక సెంట్రీ కూచొని కొందరిని మేడమీదకి భోజనాలకి పంపుతున్నాడు.
అంటే భోజనాలు మామూలు అతిథులకి వేరు, విఐపీలకి వేరూ అన్నమాట. మొహాననవ్వు పులుముకొని జబాబు చెప్పేలోగా ఆవిడ మాయం.
నిశ్శబ్దంగా వరదరాజు వెనకాతల స్కూటర్ మీద కూచుంది. ఇంటికి వెళ్ళిన తరవాత భార్య మొహంలోకి చూసే సాహసం చేయలేదు వరదరాజు.