ఆఖరి అవసరం by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

చిట్‍ఫండ్ కంపెనీనుంచీ అప్పుడే వచ్చింది మధుర. మొదటివారం కావటంతో కలెక్షన్లు బాగా వున్నాయి. ఎకౌంటు టేలీ కావడం కాస్త కష్టమైంది. ఇంటికొచ్చి టీవీ ముందు కూర్చున్నాక కూడా ఆ లెక్కలు కళ్ళముందునించీ చెదరలేదు.
“అమ్మా! అమ్మా! నాకు నాన్న లేరా?””
ఆటలకని వెళ్ళిన పూజిత గోడక్కొట్టిన బంతిలా తిరిగొచ్చి సోఫాలో ముడుచుకుని పడుకుంది. పిల్లల ఆటల్లో ఏదో జరిగిందని అర్థమైంది మధురకి. పూజని వళ్ళోకి తీసుకుని బుజ్జగిస్తూ అడిగింది. “ఏమైందమ్మా? ఏం జరిగిందసలు?””
“నాకు నాన్న లేరా?” మళ్ళీ అదే ప్రశ్న.””
ఆ పిల్ల యిప్పటిదాకా ఎప్పుడూ తండ్రి గురించి అడగలేదు. తండ్రి దగ్గర లేకపోవటమనేది ఒక లోటని అనిపించకుండా వుండేలా పెంచింది తను. అమ్మ చెప్పిందే వేదమని నమ్మిన పిల్ల దాన్ని దాటి ఆలోచిస్తోందంటే పసితనపు అమాయకత్వాన్ని వీడి బయటి ప్రపంచంలోకి పరుగుపెడ్తోందన్నమాట. కళ్ళలో నీళ్ళు నిలిచాయి. తల్లి కన్నీళ్ళు చూసి పూజిత భయపడింది.
“సారీ అమ్మా! ఇంకెప్పుడూ అడగను. ప్రామిస్” తల్లి మెడని కౌగలించుకుని ఆమె గుండెల్లో తలదాచుకుంది. ఇంక తల్లిని విసిగించకుండా పాలు తాగేసి ఆడుకోవడానికి తల్లిని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళింది.
దెబ్బలాడుకుని విడిపోయిన ఇద్దరు స్త్రీపురుషులమధ్య అలా విడిపోలేని శరీరపు ఏకత్వంతోటీ కలిసిపోలేని వ్యక్తిత్వపు భిన్నత్వంతోటీ సతమతమయ్యే పిల్లలు వుంటారు. పెద్దవాళ్ళ అహంభావపు ఒరిపిడికి నలిగిపోతుంటారు. ఇవన్నీ తెలిసీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆమెది. పూజిత అంత హఠాత్తుగా తండ్రి గురించి అడగటమే పెద్దషాక్ మధురకి. అలాంటిది ఆ పిలుపు అందుకున్నట్టు ఆనంద్ రావటం యింకా పెద్ద షాక్.
వాకిట్లో చప్పుడైతే ఎవరోనని తలతిప్పి చూసి స్థాణువైంది మధుర. ఆ తర్వాత ఒక్కక్షణం కూడా అతన్ని ఎదురుగా వుండలేనట్టు లేచి వంటింట్లోకి వెళ్ళి కూర్చుంది. ఆమెనుంచీ ఎలాంటి ఆహ్వానం లేకపోయినా లోపలికి వచ్చి కూర్చున్నాడతను.
ఇన్నేళ్ళ తర్వాత ఎందుకొచ్చినట్టు? మధుర ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి. ఆనంద్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. ఏం మాట్లాడాలి? ఎలా అడగాలి? తనెందుకొచ్చాడో ఎలా చెప్పాలి? ఎన్నో ప్రశ్నలు. తీరా చెప్పాక ఆమె వప్పుకుంటుందా? భయం.
ఇద్దరూ అలాగే కూర్చున్నారు చాలాసేపు. టీవీ దానిమానాన అది మోగుతోంది. ఆటలకెళ్ళిన పూజిత బంతికోసం తిరిగొచ్చింది. వాకిట్లో వున్న చెప్పుల్ని చూసింది. ఎవరు వచ్చారా అనుకుంటూ కుతూహలంగా తొంగిచూసి, ఒక్కడే కూర్చుని వున్న ఆనంద్ కనిపించగానే బెరుగ్గా అడుగులో అడుగేసుకుంటూ తల్లి దగ్గరకి జారుకుంది. తల్లి ముఖంలో ఎప్పుడూ చూడని భావాలు.
“ఎవరు?” గుసగుసగా అడిగింది.
“నాన్న!” లోగొంతుతో చెప్పింది మధుర.
“ఉన్నారా?”
“లేకుండా ఎలా వుంటుంది?”
పూజిత తండ్రిని చూడటం అదే మొదటిసారి. తల్లిని అపనమ్మకంగా చూసి హాల్లోకి వెళ్ళింది. ఆనంద్ కూడా పూజితని ఆశ్చర్యంగా చూసాడు. తామిద్దరూ విడిపోయినప్పటికి పూజిత ఆర్నెలలపిల్ల. ఎంత పెద్దదైంది! విస్మయంగా అనుకున్నాడు. దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆ పిల్ల వెళ్ళలేదు. చురచుర చూసింది.
“మీరు మా నాన్నా?” సూటిగా అడిగింది.
కూర్చున్నచోటే అస్థిమితంగా కదిలాడు ఆనంద్. ఇన్నేళ్ళ తర్వాత సంబంధాలని పునరుద్ధరించుకోవాలని వచ్చినందుకు భార్యకి జవాబు చెప్పుకోవాలనుకున్నాడు. అలాగే ఆమె అడుగుతుందనుకున్న ప్రశ్నలకి జవాబులు తయారుచేసుకుని వచ్చాడు. కానీ ఆమె ఒక్కమాటేనా మాట్లాడలేదు. బదులుగా ఈ పిల్ల నిలదీస్తోంది. నవ్వొచ్చింది. నవ్వుతూనే తలూపాడు పూజిత ప్రశ్నకి జవాబిస్తున్నట్టు.
“నన్ను మీరెప్పుడేనా చూసారా?”
“…”
“మా స్కూల్ డే ఫంక్షన్‍కి వచ్చి పేరెంట్సు గేలరీలో కూర్చున్నారా?”
“…”
“నాకు నాన్న లేడని ఎప్పుడూ ఏడిపిస్తుందే కేథరీన్, దానికి బుద్ధి చెప్పారా?”
“…”
ఆనంద్ నిస్సహాయంగా తలదించుకున్నాడు. అతని మొహంలోని చిరునవ్వు హరించుకుపోయింది. పూజిత అడిగినవేవీ తను చెయ్యలేదు. ఇప్పుడొస్తూ కూడా ఆ పిల్లకోసం ఏమీ తీసుకురాలేదు.
“పూజా! అయాం సారీ! ఇంక ముందెప్పుడూ నిన్నొదిలిపెట్టి వుండను. నీతోటే వుంటాను. మనింటికి వెళ్ళి పోదాం. అమ్మకి చెప్పు” నెమ్మదిగా అన్నాడు. లోపల మధుర వుక్కిరిబిక్కిరైంది. ఆనంద్ సారీ చెప్పటమా? తను చెయ్యని తప్పులకి కూడా అతని తల్లికి క్షమార్పణ చెప్పించేవాడు. అలాంటి వ్యక్తి తప్పు వప్పుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచటమా?
“నేను రాను. ఇదే మా యిల్లు. అమ్మకూడా రాదు” కచ్చితంగా అనేసింది పూజిత.
ఆ పిల్ల అంతరంగం లోపల అతనిపట్ల ప్రకృతిపరమైన ప్రకంపనాలూ, ఆకర్షణా వున్నాయోమోగానీ, వాటిని గుర్తించే వయసింకా రాలేదు. అందుకని అతని యింటికి వెళ్ళటమంటే అయిష్టంగా అనిపించింది. సమస్యని నిమిషంలో పరిష్కారం చేసేసి, మరోమాటకి అవకాశం యివ్వకుండా బంతి వెతుక్కుని మళ్ళీ వెళ్ళిపోయింది.
ఆనంద్ ముఖం పాలిపోయింది. అప్పుడొచ్చింది మధుర అతని సమక్షంలోకి. పూజిత మాటలు, పాలిపోయిన ఆనంద్ ముఖం ఆమె అహాన్ని చాలా సంతృప్తిపరిచాయి. కానీ అంతలోనే విచక్షణ మేలుకొంది. జీవితం అంటే అహాన్ని సంతృప్తిపరుచుకోవటం ఒకటే కాదు.
“పూజ చాలా సరిగ్గా చెప్పింది మధూ! అది అడుగులేస్తున్నప్పుడు నా గుండెలని పరవలేదు. స్కూలుకి వెళ్తున్నప్పుడు చిటికెనవేలు అందివ్వలేదు. నేను నీకు చేసిన అన్యాయం దానిమీద ప్రతిబింబించింది. కానీ ఒక్క విషయం చెప్పాలని వచ్చాను. నువ్వు నమ్మితే సంతోషం. నేను చాలా మారిపోయాను. భార్యాపిల్లలకన్నా తల్లిదండ్రులు ఎక్కువ అనే భ్రమలోంచీ బైటపడ్డాను. ఎవరి స్థానాలు వారివేనని గ్రహించాను. నువ్వు వెళ్ళిపోయాక నాలో ఏర్పడిన శూన్యం అంతకంతకీ విస్తరించి నన్ను నిలువునా ఆవరించింది. దయచేసి నన్ను అర్థంచేసుకో. మళ్ళీ మనం కలిసుండటాన్ని మన అహాలకి వదలకు. పూజ చాలా దూకుడుగా వుంది. దానిది ఏదీ తెలియని వయసు. నువ్వు నచ్చచెప్పు” అభ్యర్ధించాడతను.
మధుర మాట్లాడలేదు. అతను చెప్తున్నది నిజమే కావచ్చు. మనిషిలో చాలా మార్పొచ్చినట్టే వుంది. అతనిమీద కొద్ది ప్రేమ కలిగింది. అది జాలితో కూడుకున్నది. అతను నిస్సహాయతని చూపించుకుంటే తాత్కాలికంగా కలిగినది. మరి తను? ఎన్నో ఆశలతో పెళ్ళిచేసుకుని, అవన్నీ కరిగిపోతుంటే నిలుపుకోవాలని ఆరాటపడి ఆఖరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో విరాగిలా బతుకుతున్న తను…ఈ విధమైన జీవితానికి అలవాటుపడ్డాక మళ్ళీ కుటుంబజీవితంలోకి అడుగుపెట్టగలదా? ఎక్కడో అయిష్టత.. యింకెక్కడో భయం… అన్నీ లోపల దాచుకుంది.
“టీ త్రాగి వెళ్తురుగాని కూర్చోండి” అంది అతను లేవటం చూసి క్లుప్తంగా. దానికే ఎంతో సంతోషపడిపోయాడు. బిగుసుకున్న ముడి కొద్దిగా వదులైనట్టనిపించింది. మధుర టీకప్పుల్తో తిరిగొచ్చేసరికి అతను సోఫాలో ఇందాకట్లా ఉదుకుష్టంగా కాకుండా సౌకర్యంగా కూర్చున్నాడు. అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది మధుర. ఆమె దూరాన్ని చూపెట్టడాన్నీ తనపట్ల ఎలాంటి ఆతృతనీ ప్రకటించకపోవడాన్నీ అతను గమనించకపోలేదు.
ఒక మొక్కని పీకి పారెయ్యటం క్షణాల్లో చెయ్యగలిగే పని. అదే మొక్కని నాటి మళ్ళీ పెంచడం అంత తేలిక కాదు. తామిద్దరిమధ్యా అనుబంధం కూడా అంతే. తుంచేసినదాన్ని తిరిగి బ్రతికించాలి. అది ఒక్కసారిగా జరగదు. వ్యవధి పడుతుంది. సుదీర్ఘంగా నిశ్వసించాడు.
ఇద్దరి మధ్యనీ ఎన్నో కబుర్లు దొర్లాయి. అతని తల్లిదండ్రుల గురించీ చెల్లెలూ, తమ్ముడి గురించీ అడిగి తెలుసుకుంది.
“ఇన్నేళ్ళలో మీకుగానీ, మీ యింట్లోవాళ్ళకిగానీ నేనూ పాపా ఒక్కసారేనా గుర్తురాలేదా? శుభకార్యాల్లో మీరు వంటరిగా తిరుగుతున్నప్పుడేనా?” అడిగింది.
అతను తలదించుకున్నాడు. మధుర గుర్తొచ్చేది. కానీ ఆర్తితో కాదు. బాధ్యతలకి భయపడి కాపురాన్ని వదులుకుని వెళ్ళిపోయిన అమ్మాయిగా.
“అమ్మానాన్నలతో కలిసి బాధ్యతలు పంచుకున్నప్పుడు వాళ్ళంతా నావాళ్ళేననిపించేది. ఎక్కడివాళ్ళక్కడికి వెళ్ళిపోయాక తిరిగి చూసుకుంటే నాకంటూ ఎవరూ లేరనిపించింది. చాలా చిత్రంగా అమ్మానాన్నా కూడా పరాయిగానే అనిపించారు. అప్పుడర్ధమైంది మధూ, వ్యక్తిగత జీవితానికీ, కుటుంబజీవితానికీ గల తేడా. మరో పెళ్ళి చేసుకోమంది అమ్మ”
మధుర ముఖం ఎర్రబడింది. “చేసుకోవలిసింది” అంది పదునుగా.
“మా అమ్మ అలా అనటంతోనే ఎక్కడ పొరపాటు జరిగిందో అర్థమైంది. నాకు వండిపెట్టి, నా అవసరాలు తను చూడగలిగినంత కాలం… నేను కొన్ని బాధ్యతల్ని అందుకోవాల్సి వున్నంతకాలం నువ్వు నన్నెక్కడ వాళ్ళనుంచి వేరుచేస్తావోనని భయపడింది. నీపట్ల వైరాన్ని పెంచుకుంది. అక్కడ నువ్వనేకాదు, యింకెవరు నీ స్థానంలో వున్నా అంతే. ఆవిడ వయసైపోయింది. విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. నా అవసరాలు చూడాల్సిన బాధ్యత యింకా మిగిలుంది. ఇప్పుడు నాకో భార్య వుంటే బావుంటుందనిపించింది ఆవిడకి. అది నువ్వే కానక్కర్లేదు, ఎవరో ఒకరు. నాకు మాత్రం నువ్వే కావాలి. నా బరువు మొయ్యడానికి కాదు. ప్రేమగా చూసుకుందుకు. నేను చేసినది సరిదిద్దుకుందుకు. జరిగింది మర్చిపో మధూ! నేను చాలా సిగ్గుపడుతున్నాను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయినందుకు”
“మీ అమ్మగార్ని ద్వేషించమనిగానీ వేరుకాపురం పెడదామనిగానీ నేనెప్పుడూ మిమ్మల్ని అడగలేదు. నా తల్లిదండ్రుల్నీ, అన్నదమ్ముల్నీ పుట్టి పెరిగిన పరిసరాలనీ, నావనుకున్న అన్నిటినీ వదులుకుని వచ్చిన నాకు మీ యింట్లో పిసరంతేనా ఆదరణ దొరకలేదు. నా అవసరాలకీ, ఖర్చులకీ సరిపడా కట్నం తెచ్చుకున్నాను. ఐనా కూడా నన్ను కోరుకోని అతిథిగా చూసేవారు మీ యింట్లో. నాకేం కావాలనిగానీ, నేను మీ అందరి ప్రవర్తన వలన బాధపడతాననిగానీ ఎవరూ ఎప్పుడూ గుర్తించలేదు. ఆఖరికి మీరు కూడా. నేనెంతగా చెప్పాలని ప్రయత్నించినా మీరు వినిపించుకునేవారు కాదు. అసలు కుటుంబంలోని ఏ యిద్దరు వ్యక్తుల మధ్యనేనా యజమాని, సేవకుడి సంబంధం ఎందుకుండాలి? కట్నకానుకలు తెచ్చుకుని వచ్చిన కోడలిని అలా ఎలా చూడగలిగారు మీ యింట్లో?”
ఆనంద్ తలొంచుకున్నాడు. తల్లి మాటలు విని తను మధురని ఎంతగా హర్ట్ చేసిందీ గుర్తొచ్చింది. పూజ దూకుడు గుర్తొచ్చింది. గుండెల్లో ఎక్కడో వాడిగా గుచ్చుకు న్నట్లైంది. లేచి నిలబడ్డాడు.
మధుర నిర్వేదంగా నవ్వుకుంది. పోయేముందు ప్రాణం శరీరాన్ని వదల్లేక కొట్టుకుంటుంది. శరీరాన్ని వదిలేసాకకూడా కొంతకాలం మమకారాన్ని వదలలేదని చెప్తారు వేదాంతులు. అతనింట్లోంచీ వచ్చేముందూ, వచ్చేసిన తర్వాత కొంతకాలమూ తనకలాగే వుండేది. ఆ తర్వాత పునర్జన్మ ఎత్తినట్టైంది. మళ్ళీ అతని గురించీ, వైవాహిక జీవితాన్ని కొనసాగించడాన్ని గురించీ ఆలోచించడమంటే వదిలిపెట్టేసిన శరీరంలోకి తిరిగి ప్రాణాన్ని పంపటమే!
“పూజకి నచ్చజెప్పి చూస్తాను” అంది అతను గుమ్మం దాటుతుంటే. వెళ్ళిపోయాడు.
రాత్రి పూజని అడిగింది మధుర, “నాన్న మనని రమ్మంటున్నారు వెళ్తామా?” అని.
“ఎందుకు?” అడిగింది పూజ.
“పోనీ నాన్ననే యిక్కడికి రమ్మందామా?””
“అదే ఎందుకని?”
“నువ్వేగా, నాన్నగురించి అడిగావు?”
“అంటే, కేథరిన్‍కి జవబు చెప్పాలని. కానీ నాన్నతో ఎందుకు వెళ్తాం?”
కూతురి ఎదురు ప్రశ్నల్తో నిరుత్తరురాలైంది. వదిలెయ్యడానికీ, వదిలెయ్యబడటానికీ గల తేడాని సమాజం యిప్పుడిప్పుడే గుర్తిస్తోంది. సంపాదించి పెట్టి, రక్షణ నివ్వగలిగే తల్లి వున్నప్పుడు తండ్రి అవసరమేమిటో పూజలాంటి పిల్లలకి తెలిసే అవకాశం లేదు. దానికి జవాబు ఆనందే చెప్పాలి. తనదగ్గర లేదు. పూజ నిద్రపోయాక అతనికి ఫోన్ చేసి అదే విషయం చెప్పింది.
రాత్రంతా మధురకి కలతనిద్రే అయింది. కళ్ళ ముందు ఎన్నో జ్ఞాపకాలు… సమాధుల్లోంచి నిద్రలేచిన ప్రేతాల్లా. తనలో పెళ్ళి మధురస్మృతుల్లో ఒక్కటేనా మిగలకపోవటం, ఆనంద్ పునరాగమనం ఎలాంటి అనుభూతుల్నీ రేపకపోవటం స్త్రీగా ఈ దేశంలో పుట్టి ఆమె చేసుకున్న పాపం. కళ్ళలో నీళ్ళు నిలిచాయి.


నాలుగుసార్లు పెళ్ళిచూపుల్లో కూర్చుని ఐదోసారి నెగ్గింది మధుర ఆ పరీక్షలో. అప్పుడు ఇంటర్నెట్, ఆన్‍లైన్‍లో సంబంధాలు వెతుక్కోవడం లేదు. మధ్యవర్తులు వుండేవారు. తెలిసిన సంబంధాలు చెప్పేవారు. అలా కుదరకపోతే వివాహవేదికలు వుండేవి. ఒక వివాహవేదికద్వారా కుదిరిన సంబంధం ఇది. తండ్రి ఉన్నంతలో ఘనంగా పెళ్ళి చేసాడు.
పెళ్లి!
ఏముందిందులో? స్త్రీపురుషుల సంబంధమేగా అనుకోవటం వుంది. ఏమీ లేకపోతే పెళ్ళికోసం ఎందుకింత ఆరాటం అని ప్రశ్నించుకోవటం కూడా వుంది. పెళ్ళి పేరిట దోచుకోవటం వుంది, దివాలా తియ్యటమూ వుంది. కాల్చుకు తినటం జరిగింది. కాల్చి చంపటం కూడా జరిగింది. ఇంత రసబీభత్సంగా వుండే పెళ్ళిలో మధురకి ఎలాంటి రసానుభూతీ దొరకలేదు.
కారణాలు వెతకడానికంటూ ఏమీ వుండవు. ఒకటిగా కలిసిపోయి వుండాల్సిన భార్యాభర్తల మధ్య ఇంకొందరి అవసరాలూ, దాన్నిబట్టి వాళ్ళ జోక్యమూ వుండటంతో ఒక వేర్పాటు గీత గీయబడుతుంది. భార్యా భర్తా సరిపడకపోతే సర్దుకుంటూనేనా ఏదో ఒకలా చివరిదాకా కలిసి వుంటారు. అత్తాకోడళ్ళకి సరిపడకపోతే మాత్రం ఆ కాపురం నిలిచేది అనుమానమే.
మధురని అత్తవారింట్లో చాలా చులకనగా చూసేవారు. పెళ్ళైనకొత్త అనే గందరగోళంలో కొన్నాళ్ళు గడిచాయి.
ఇంటిపనంతా చేసేది. ఆమె చేసిన ఏ ఒక్క పనీ ఎవరికీ నచ్చేది కాదు. ప్రతి చిన్నదానికీ అత్తగారు ఆక్షేపించేది. ఎంతోమంది చదువుకున్న అమ్మాయిల్లాగే ఆమెలోనూ సంఘర్షణ మొదలైంది. పుట్టింట్లో అపురూపంగా పెరిగింది తను. చదువు, స్నేహితులు, యింటిపనిలో తల్లితో భాగం పంచుకోవడం. పెళ్ళి గురించి భర్త గురించి అందమైన ఆలోచనలుండేవి. అందుకు భిన్నమైన వాతావరణం అత్తగారింట్లో ఎదురైంది.
అత్తింట్లోకి ప్రేమపూరితమైన ఆహ్వానం లేదు. పటిష్ఠమైన కోటలోకి ఆమె చొరబడి వచ్చినట్టో, ఆత్మీయంగా అల్లుకున్న పొదరింట్లోకి పరాయిపక్షి దూరిపోయినట్టో వుండేది ఆమెపట్ల వాళ్ల ప్రవర్తన. తన రాకనీ వునికినీ అయిష్టంగా, తప్పనిసరిగా వప్పుకున్నట్టు వుండేది. అందరికీ వంట చెయ్యడం, రెండుపూటలా స్నానం చేసి అందరూ విడిచిన బట్టల్ని వుతకడం, యింకా మిగిలిన పనులూ… ఆపైన అత్తగారి కస్సుబుస్సులు పడటం… ఇవేనా కోడలిగా, ఆనంద్ భార్యగా, తన బాధ్యతలు?
అడిగినంత కట్నం యిచ్చాడు తండ్రి తనకి. అందులోంచే కొంత బంగారం పెట్టారు. పట్టుచీరలకి యిచ్చారు. మిగిలిన డబ్బంతా అత్తవారే తీసుకున్నారు. వాడుకున్నారేమో! తనది అంత డబ్బు వాళ్ళ దగ్గర వున్నాక కూడా తను వాళ్ళకి బరువనిపించటమేమిటో అర్థమవక యింకొంత అసంతృప్తి. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఆనంద్‍కీ ఆమెకీ మధ్య పెద్దగా అను బంధం ఏర్పడకపోవటం- ఆ దిశగా అతనెలాంటి ప్రయత్నం చెయ్యకపోవటం.
అతన్తో ఏవో చెప్పబోయేది. అతను వినిపించుకోకుండా, “మా యింట్లో పెద్దవాళ్ళని గౌరవించడం, వాళ్ళెలా చెప్తే అలా వినడం అలవాటు. ఈ రెండూ నువ్వూ నేర్చుకుంటే మంచిది” అనేసాడు.
“మీ అమ్మ మిమ్మల్నందర్నీ చూస్తున్నట్టే నన్నూ చూస్తోందా?” గాయపడి అడిగింది మధుర. ఆమె అలా అడుగుతుందని అతను వూహించలేదు. అతనివరకూ అతనికి పెళ్ళి ఒక బాధ్యత. తను పెళ్ళిచేసుకోవడంద్వారా తండ్రికి ఆర్ధికంగా కొంత వెసులుబాటు కలిగింది. అలాగే యింటిపనుల్లో తల్లికి ఆసరా దొరికింది. తన భౌతికావసరాలు కూడా తీరుతున్నాయి. అంతకుమించి మధురపట్ల అతనికి ఇంకే ఆలోచనలూ లేవు. ఆమెకికూడా అంతేనా? అవి సరిపోతాయా? సరిపోవాలికదా? పెళ్ళి చేసుకోకుండా జీవితాంతం పుట్టింట్లో వుండిపోలేదు. ఆమెకీ పెళ్ళి అవసరమే. పెళ్ళన్నాక బాధ్యతలు. అదేగా, పెళ్ళంటే? అదే అతని ఆలోచనా పరిధి.
ఆమె మాటలకి కోపం వచ్చింది. ఆమెతో మాట్లాడటం మానేసాడు. తల్లికి ఆమెచేత క్షమార్పణ చెప్పించిగానీ మళ్ళీ మాట్లాడలేదు. అప్పట్నుంచీ మధురకి భర్తపట్ల చిన్నగా అసహ్యం మొదలైంది.
ఈ పరిస్థితుల్లో మధుర ప్రెగ్నెంటైంది. ఐదుగుర్ని కని, తన తొలికాన్పు మధురానుభూతుల్ని కాలవాహినిలో రాల్చేసిన ఆనంద్ తల్లికి అదేమంత గొప్ప విషయంలా అనిపించలేదు. మధురకి అదే పని, అదే దిగులు… పైనుండీ తిండి సహించకపోవటం. విరక్తిలాంటిది ఏర్పడిపోయింది.
ఐదోనెలలోనూ, ఏడోనెలలోనూ ఆమెని తమ దగ్గరికి తీసుకెళ్ళాలని మధుర తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు సాగలేదు. తొమ్మిదవనెలలోగానీ ఆనంద్‍వాళ్ళూ పంపలేదు. అప్పటికి పెళ్ళిపేరిట ఒక అనవసరమైన బాధ్యతని తలకెత్తుకున్నానన్న భావన మధురలో బాగా బలపడిపోయింది. తల్లితో యివన్నీ చెప్పి బాధపడింది.
ఆవిడ నిట్టూర్చి “కొత్తకోడలికి యివ్వన్నీ తప్పవు మధూ! మేమంతా అనుభవించినవాళ్ళమే కదా! పెళ్ళైన కొత్తలో కూర మాడిపోయిందని మీ మామ్మ గరిట కాల్చి వాతపెట్టింది” అంది.
మధురకి దిగ్భ్రాంతి కలిగింది. “మరి నాన్నేమీ అనలేదా?” అడిగింది.
“ఇలాంటి విషయాలు మగవాళ్ళదాకా వెళ్ళేవి కాదు. వెళ్ళినా నష్టం మనకే”
“ఎందుకని ఆవిడలో అంత అసహనం?”
“కారణాలు రెండు. మొదటిది వ్యక్తిత్వం అణచివేయబడటం, రెండోది అభద్రతా భావం. స్త్రీ అంటే వంటింటికే అంకితమై వుండాలన్న భావం బాగా వుండేది ఆ రోజుల్లో. మీ తాతకి మరీను. ఆవిడేదైనా చెప్పబోతే నీకేం తెలీదు, నోరుమూసుకుని పడుండు అని బాహాటంగా తిట్టేవారు. ఇకపోతే… కోడలొచ్చి కొడుకుని కొంగుకి కట్టేసుకుని యింటి పెత్తనం చేతిలోకి తీసుకుని తనని ఆ వంటింటికి కూడా కాకుండా చేస్తుందనే భయం. ఈ విషయంలో తరాలు మారినా ధోరణులు మారలేదు”
“అలాంటప్పుడు ఎవరిదారిని వాళ్ళు వేరే వుండచ్చు కదమ్మా!”
కూతురి అంతర్గతభావం అర్థమైందావిడకి.
“వేరు కాపురానికి అతనొప్పుకుంటాడా?” అడిగింది.
మధుర జవాబివ్వలేదు.
“తొందరపడకమ్మా! తప్పు నీలో కూడా వుందేమో! ఆలోచించు. అతన్తోపాటు అతని వాళ్ళనీ నీవాళ్ళనుకోవాలి మరి!” అందావిడ నచ్చజెప్తున్నట్టు. అంతకన్నా ఏం చెప్పగలదు? ఏదైనా ఆనంద్‍ని బట్టి వుంటుంది.


మధురకి పాప పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని అలిగి ఆనంద్‍వైపునుంచీ చూడటానికి ఎవరూ రాలేదు. ఆఖరికి ఆనంద్ కూడా. పాప పేరుమీద పాతికవేలు- అదీ ఆనంద్ మైనర్ గార్డియన్‍గా వేస్తే వస్తామని చెప్పారు, బారసాలకి పిలవడానికి వెళ్ళిన మధుర తల్లిదండ్రులతో.
“ఇదెక్కడి గొడవ? ఆడో మగో దేవుడెవర్నిస్తే వాళ్ళు… ఎవరైనా స్వంత పిల్లలు. పుట్టిన పాపాయిని చూడటానికి ఇప్పటిదాకా ఎవరూ రాలేదు. పైగా యిదొకటా? వట్టి డబ్బుమనుషుల్లా వున్నారే!!” అంది మధుర తల్లి. మళ్ళీ గట్టిగా అనడానికి భయం. అసలే వాళ్ళంటే అయిష్టంగా వున్న మధుర ఆ అయిష్టాన్ని యింకా పెంచుకుంటుందేమోనని.
వాళ్ళు అడిగినట్టే డబ్బు పాప పేర వేసి బారసాల ఏర్పాట్లు చేసాడు మధుర తండ్రి. ఎవరికీ సంతోషంగా లేదు. బలవంతంగా తిరుగుతున్నారంతే.
పెళ్ళి చేసుకోవడానికి కట్నం తీసుకుని, కాపురం చెయ్యడానికి కానుకలు తీసుకుని, కడుపు చేసి పురిటి ఖర్చులు మామగారిమీదకి నెట్టి, పాతికవేలు తీసుకునిగానీ పాపాయికి పేరు పెట్టడానికి రాని ఆనంద్‍ని బారసాల పీటల మీద తన పక్కని కూర్చున్నప్పుడు తృణీకారంతో చూసింది మధుర.
“జాగ్రత్త మధూ! వాళ్ళు మూర్ఖులని నువ్వూ మూర్ఖంగా ప్రవర్తించకు. ఎవరేమనుకున్నా వేళకి భోజనం మానకు. ఆరోగ్య పాడౌతుంది. ఇప్పుడు పాపకూడా వుంది. కొంత వోర్చుకుంటే పరిస్థితులు అవే దార్లో పడతాయి. స్త్రీపురుషుల మధ్య ప్రేమలూ, యిష్టాలూ అనేవి కథల్లోనూ సినిమాల్లోనూ మాత్రమే కనిపించేవి. నిజజీవితంలోని ఆకాంక్షలూ, కోరికలే వాటిల్లో ప్రతిబింబిస్తాయి. ఆ యింట్లో నిలదొక్కుకునే ప్రయత్నం చెయ్యి. పాప మీమధ్యని వుంటుందిగాబట్టి అతను కూడా మారవచ్చు” మూడో నెలలో మధురని పంపిస్తూ చెప్పింది తల్లి.
మధుర తన శాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయింది. సంస్కారికి సంస్కారంతోటీ కుసంస్కారికి కుసంస్కారంతోటీ జవాబివ్వాలి. అందరు ఆడపిల్లల్లా నోరు చేసుకుని దెబ్బలాడినా, అడుగడుక్కీ తను తెచ్చిన కట్నకానుకల్ని గుర్తుచేస్తూ అత్తవారిని కించపరచడమో, చౌకబారుగా ఆనంద్‍ని వశపరుచుకుని చూపుడువేలి చుట్టూ తిప్పుకోవటమో చేసి వుంటే ఆమె అత్తవారింట్లో నిలదొక్కుకుని వుండేది.
అప్పటికి పూజితకి ఆరునెలలు.


పాపాయి అదనపు భారం కాగా అత్తింట్లో చాకిరీకీ, దానికన్నా ఎక్కువగా నిరాదరణకీ నలిగిపోయి అలిసి, పుట్టెడు అనారోగ్యంతో పుట్టినిల్లు చేరింది మధుర.
“ఇదెక్కడి రాక్షసత్వమే? కక్ష కట్టినట్టు చంటిపిల్ల తల్లిచేత అంతపని చేయించడమేమిటి? పనిమనిషిని పెట్టుకునే తాహతుకూడా లేదా వాళ్ళకి? అంత గతి లేక వున్నారా?” అని విలవిల్లాడింది తల్లి.
“అది నా యిల్లు కాదు, అతనిది. అక్కడ నాకు స్థానం లేదు. మీకు నేను గుండెలమీద కుంపటినీ, మొయ్యలేని భారాన్నీ కాబట్టి యింత డబ్బిచ్చి వదుల్చుకున్నారు. పెళ్ళి పేరుతో, వాళ్ళింట్లో అడ్డమైన చాకిరీ చేస్తే దయతల్చి యింత ముద్ద పడేస్తారు. అంతే. అతని తల్లి అభిప్రాయం అది. అతను జడుడు. తప్పొప్పుల విచక్షణ తెలీని జడపదార్ధం. తల్లి ఎంత చెప్తే అంత” అంది మధుర విరక్తిగా.
ఇంట్లోని అందరూ నిశ్చేష్టులైపోయారు. అప్పటికి ఆ విషయం వదిలేసినా అదొక నివురుగప్పిన నిప్పులా రగులుతునే వుండిపోయింది. “మధూ? పెళ్ళయ్యాక ఆడపిల్ల భర్త దగ్గర వుండటం ఉచితం. నువ్వొక్కదానివే అయితే అది వేరే విషయం. ఇప్పుడు పాప కూడా వుంది. పెద్దవాళ్ళం వెళ్ళి మాట్లాడతాం” అన్నాడు మధుర తండ్రి, ఆమెకి స్వస్థత చేకూరాక.
“భయపడి పారిపోతే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యపడదు. బావతో నేనూ మాట్లాడతాను. ఇది పద్ధతి కాదని చెప్తాను” అన్నాడు మధుర అన్న. అతనికి చెల్లెలి పెళ్ళి మిస్‍వెంచర్‍లా, తప్పుడుగుర్రంమీద పెట్టిన పెట్టుబడిలా అనిపిస్తోంది.
మధుర గుండెకి పదునైన గాయమైంది. ఆడపిల్లకి పుట్టిల్లూ అత్తిల్లూ తప్ప స్వంతిల్లంటూ వుండకపోవటమే అన్ని సమస్యలకీ మూలం. పుట్టింట్లో ఆదరణే తప్ప హక్కులుండవు. అత్తింట్లో హక్కులే తప్ప ఆదరణ వుండదు. ఆ హక్కులేనా కోర్టుకి వెళ్ళి చట్టబద్ధంగా సాధించుకోగలిగితేనే. ఈ రెండూ కాని చోటే ఆ రెండిటి సమన్వయం సాధ్యపడుతుంది. ఆచోటికి ఆనంద్ రాడు.
తండ్రితోగానీ అన్నతోగానీ వాదించలేదు ఆమె. వెంటనే ఒక స్నేహితురాలి గదిలోకి మారిపోయింది. తర్వాత చిట్‍ఫండ్ కంపెనీలో ఎకౌంటెంట్ పోస్టు సంపాదించుకుని విడిగా వుండటం మొదలుపెట్టింది.
మధుర తల్లికి బాధేసింది. “పైస పైస కూడ బెట్టి లక్షలు చేసి వాళ్ళ ముఖాన పోసాం, పిల్ల సుఖప డుతుందని. అందులోంచీ అది తిన్నదీ అనుభవించిందీ లేదు. బంగారం, చీరలూ కూడా వాళ్ళ దగ్గరే వున్నాయి. అక్కడ యిమడలేక అది తిరిగొస్తే దాన్ని దూరం చేసుకున్నాం. వాళ్ళకేం? దర్జాగా వున్నారు. ఎటొచ్చీ రెండువైపులా నష్టపో యింది మనమే” అని భర్త దగ్గర ఏడ్చింది.
కూతురంటే ప్రాణం మధుర తండ్రికి. బెదిరిస్తే వెళ్ళి అత్తవారింట్లో నిలదొక్కుకుంటుందని ఆశించాడుగానీ తనకే దూరమౌతుందనుకోలేదు. ఒక్కర్తీ వుంటూ, వుద్యోగం చేసుకుంటూ, పాపని పోషించుకుంటూ…ఆయనకీ దుఃఖం కలిగింది. ఎప్పుడూ తన సరదాలకోసం పైసకూడా ఖర్చుచెయ్యని తను, కూతురు సుఖపడుతుందని ఒక అపరిచితుడికి ఎంతో డబ్బిచ్చాడు. కానీ ఆమెనతడు సుఖపెట్టలేదు. ఇప్పుడామె కష్టపడుతుంటే తను చూస్తూ వూరుకున్నాడు. తనది నిజమైన ప్రేమేనా లేక కూతురికి ఘనంగా పెళ్ళి చెయ్యటమనేది ఒక బాధ్యతగా, సామాజికగౌరవానికి సంబంధించిన విషయంగా చేసాడా అనిపించి అపరాధభావన కలిగింది.
మధురని యింటికొచ్చెయ్యమన్నాడు. ఆమె రాలేదు. ఆమెకి కావల్సిన కనీసావసరాలన్నీ సమకూర్చి మనవరాలి పేర మళ్ళీ కొంత డబ్బు ఫిక్స్ చేసాడు. ఈసారి మధుర మైనర్‍గార్డియన్. అక్కడితో ఆయనకి కొంత నిశ్చింత కలిగింది.


మధురది మొదట పొగరనుకున్నాడు ఆనంద్. తిరిగొచ్చినా ఆమెని ఏలుకోననుకున్నాడు. క్రమంగా ఆ ఆవేశం తగ్గింది. ఆమె తనంతట తను రాదనిపించింది లోలోపలెక్కడో. తనుగా పిలవటానికి అతనికి అహం.
“నీకేంట్రా? మళ్ళీ సంబంధం వస్తుంది” అన్నారు అతని తల్లిదండ్రులు. కానీ అప్పటికే వాళ్ళు మధురని పెట్టిన బాధలు బంధువర్గమంతా తెలిసిపోయి ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఒకటో రెండో సంబంధాలు వచ్చినా అవి మధుర సంబంధం ముందు కాలిగోటికి కూడా తీసికట్టనిపించాయి. వీళ్ళ కోరికలు వాళ్ళకి చుక్కల్ని చూపించాయి. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఎన్నో మార్పులు…
మధుర తల్లీతండ్రీ చనిపోయారు. ఆనంద్ దగ్గరకి వెళ్ళిపోతే బావుంటుందన్న ప్రస్తావన ఒకటి రెండుసార్లు వచ్చినా ఆమె తిరస్కరించింది.
“నా దగ్గరికి వచ్చెయ్యమ్మా! ఒక్కదానివీ విడిగా ఎందుకు?” అన్నాడు ఆమె అన్న. ఆమె వినలేదు.
“ఇద్దరం చదువులోనూ, ఆటల్లోనూ పోటీపడేవాళ్ళం. ఈరోజున నాకో స్థిరమైన వుద్యోగం వుంది. భార్యాపిల్లలున్నారు. మనిషన్నవాడికి వుండాల్సిన సంతృప్తి వుంది. కానీ నువ్విలా వుండిపోవడం చూస్తుంటే బాధనిపిస్తోందమ్మా” అన్నాడు.
“నేను ఆడపిల్లని కదన్నయ్యా! అందుకే పోటీలో వెనకబడిపోయాను” విరక్తిగా అంది మధుర.
“ఈరోజుల్లో తప్పేముంది? పూజితని మేం పెంచుకుంటాం. మా పిల్లతోపాటే అదీను. నువ్వు విడాకులు తీసుకుని మరో పెళ్ళి చేసుకోవచ్చు కదా మధూ?”” అంది వదిన.
“ఒకసారి నరకంలోకి వెళ్ళి అదృష్టవశాత్తూ బైటికొచ్చాను. మళ్ళీ వెళ్ళమంటావా వదినా?” అడిగింది మధుర.
“అందరూ ఒకలా ఎందుకుంటారు? ఆనంద్‍కి కాంట్రాస్ట్‌గా మీ అన్నయ్యలేరా?”
మధుర నవ్వింది. “ఆనంద్ తటస్థపడటం నా దురదృష్టం. అన్నయ్యతో పెళ్ళవటం నీ అదృష్టం. అదృష్టంమీద ఆధారపడే ఈ ఆటకోసం మరోసారి నేను పావులు విసరలేను” అంది. నిజమే. దానికి సమాధానం ఎవరి దగ్గరా లేదు.
ఇంత జరిగాక ఆనంద్ మధుర దగ్గరకొచ్చాడు. కారణాలు ఏవైనా కావచ్చు. అతను మారాననుకుంటున్నాడు. అవసరాలు అతన్ని మార్చాయనిపిస్తోంది మధురకి. పెరుగుతున్న వయసు, పెద్దవాళ్ళ బాధ్యత, అతనికి భార్య అవసరాన్ని చూపించి వుంటాయి. రెండో సంబంధం ఎప్పుడూ మొదటి సంబంధమంత బావుండదు కాబట్టి తనకి ప్రాధాన్యత యిచ్చి వుండచ్చు. ఏది ఏమైనా మారింది అతను కాదు, పరిస్థితులు. అంతకన్నా సున్నితంగా ఆలోచించడం ఆమెకి సాధ్యపడలేదు. అదీ నిజమే.
మధుర వెళ్ళిపోయాక ఆనంద్ తమ్ముడికి పెళ్ళైంది. మరో కోడలు ఆ యింటికి వచ్చింది. ఇంట్లో పనిమనిషీ, వాషింగ్ మిషనూ అన్నీ అమిరాయి. ఆనంద్ తమ్ముడు చాలా కచ్చితంగా చెప్పేసాడు.
“నా భార్య వదినలా కాదమ్మా! చాలా సున్నితంగా పెరిగింది. ఈ పనులన్నీ చెయ్యలేదు. వంట నువ్వు చూసుకో. పైపనులకి మనిషి వుంది. ఆపైన ఇంకా ఏవేనా వుంటే తను చూసుకుంటుంది” అన్నప్పుడు ఆనంద్‍లో మొదటిసారి కదలిక కలిగింది. తనుకూడా మధురగురించి అలా చెప్పవలసి వుండెనా అనే ప్రశ్న చిన్న విత్తులా ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో జరిగాయి. అప్పుడు మధుర యింటిదారి పట్టాడు.


ఉదయం మళ్ళీ వచ్చాడు ఆనంద్ ఆశ వదలక. కూతురికోసం బొమ్మలూ, స్వీట్సూ, చాక్లెట్లూ పట్టుకొచ్చాడు. ఆ పిల్ల యింటిముందు మొక్కలకి నీళ్ళుపెడ్తోంది. ఆనంద్‍ని చూడగానే పైపు వదిలేసి లోపలికి పరిగెత్తింది.
“అమ్మా! నాన్న మళ్ళీ వచ్చారు. రామని చెప్పెయ్” అంది తల్లి మెడని అల్లుకుపోయి. ఆ మాటల వెనకే వచ్చిన ఆనంద్ విన్నాడు. ముఖం పాలిపోయింది. ఒక తప్పు జరిగి, దాన్ని సరిదిద్దుకునేలోగా ఎంత నష్టం జరిగింది. పూజ మనసులో తనకి స్థానం లేదు. అతను నిశ్చేషుడయ్యాడు.
మధుర తననుండీ విడదీస్తూ “నువ్వెళ్ళి మొక్కలకి నీళ్ళు పెట్టు. లేకపోతే మనిద్దరం బయటికి వెళ్ళిపోగానే ఆకలికి అవి ఏడుస్తాయి” అంది.
పూజిత వెళ్ళింది.
“మీరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తానంటే నేను కొద్దిగా చెప్పనా?” అడిగింది మధుర. అతను తలూపాడు.
“పిల్లలకి తాము పుట్టిన క్షణంనుంచీ తల్లిదండ్రులు విడదియ్యలేని జంటగా కనిపించాలి. భౌతికమైన అవసరాలన్నీ తల్లే తీర్చినా పరిచ్ఛాయలా ఆమెని ఆవరించుకుని వుండే తండ్రినీ వాళ్ళు గుర్తిస్తారు. తండ్రికూడా వాళ్ళని ఎత్తుకుని షికారు తిప్పడం.. ఏడ్చి, అల్లరిచేసి అమ్మని విసిగిస్తున్నప్పుడు తాము కూడా వోదార్చడంలాంటి చర్యల ద్వారా పిల్లలకి దగ్గరౌతారు. పూజకి మీరు అపరిచితులు. అది నన్ను వంటరిగానే చూసింది. దాని ప్రతి అవసరానికీ నేనే పలికాను. దాని ప్రాథమ్యాల లిస్టులో మీరు చివరెక్కడో వుంటారు. తనకి నాన్న లేరనుకుంటుంది తప్ప వుండి తీరాల్సిన అవసరం అనుకోదు. దాని మనసు గెలుచుకోండి” అంది. “దాన్ని వప్పించడానికి నేనూ ప్రయత్నం చేస్తాను. నావి కొన్ని షరతులు. నేను చేస్తున్న కంపెనీ బ్రాంచి అక్కడకూడా వుంది. ట్రాన్స్ఫరు అడుగుతాను. ఇస్తే సంతోషం. లేకపోతే మీరే ఇక్కడికి రావల్సి వుంటుంది. ఉద్యోగం మాత్రం వదల్ను. రెండవది… మనం విడిగానే వుంటాం. మీ అమ్మావాళ్ల బాధ్యత మీదే. నాకు ఎలాంటి సంబంధం లేదు”
ముగ్ధమోహనంగా తన వెన్నంటి వచ్చిన నవవధువు మనసే గెలుచుకోలేకపోయిన ఆనంద్ కూతురి మనసు గెలవటం తనకది సాధ్యమౌతుందనుకోలేదు. కానీ కూతురి ప్రాధమ్యాల వరసలో పైకి రావాలంటే అది తప్పనిసరని అర్థమైంది. లేకపోతే తామిద్దరూ కలిసి బతికినా అదొక చీలిక ఔతుంది. తను ఆమె అవసరాల్లో చివరికే వుంటాడు.

1 thought on “ఆఖరి అవసరం by S Sridevi”

  1. నాగలక్ష్మి వారణాసి

    కథ హృద్యంగా ఉంది. మన దేశంలో ఇలాంటి జీవితాలు కోకొల్లలు. ఇలా కొన్ని తరాలు గడిచి ఇపుడు బాక్ లాష్ మొదలైంది. ప్రేమగా గౌరవంగా చూసుకునే అత్తమామలు కూడా అనవసర బాధ్యతలాగా బరువుగా తోచే పరిస్థితి ప్రస్తుతం నడుస్తోంది.

Comments are closed.