వాకిట్లో అభ్యుదయం by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

(ఆంధ్రప్రభ దినపత్రిక, 1990)
వెయ్యిరూపాయల ఖర్చుతో ఈనెల బడ్జెట్లో ఔట్లు పేల్చి దీపావళి పండగెళ్ళింది. దీనికి కొసమెరుపులా రోజూ పొద్దున్నే వచ్చే పనిమనిషి బారెడు పొద్దెక్కినా ఇంకా రాలేదు. ఇంటి ముందు రాత్రి కాల్చి పారేసిన మతాబుల తుక్కూ…. ఇంటి చుట్టూ రాలిపడ్డ ఆకులచెత్త… పెరట్లో ఓవైపు అంట్లు…. మరోవైపు బట్టలకుప్ప… చెయ్యాల్సిన పని తలుచుకుంటే నిన్నటి దీపావళికి కొనసాగింపులా నా గుండెల్లో బాంబులు పేలడం మొదలెట్టాయి.
“మీరే… యాదలక్ష్మిని అసలు చెడగొట్టింది. మొన్న డిగ్నిటీ ఆఫ్ లేబరంటూ దానికెదురుగా లెక్చర్లు దంచారు. అవన్నీ వంట పట్టించుకుని ఈవేళ పనిమానేసి కూర్చుంది”” వంటింట్లో ఎదురొచ్చిన గిరిమీద ఎగిరాను.
“పొద్దున్నే నామీద ఈ దాడేంటి? మొన్న నేనిచ్చిన లెక్చరు ఘాటు వంటపడితే తను నిన్న మానెయ్యాలిగానీ ఈవేళ్టిదాకా ఎందుకాగుతుంది?” అలవాటుగా నా కొంగుతో మొహం తడుచుకోబోయి నేనసలే కోపంగా ఉండటంతో, తువ్వాలు వేటలో పడ్డాడు.
“నిన్నెందుకు మానేస్తుందీ? పండగ ఫలహారాలూ, మామూళ్ళూ అందుకోవద్దూ? ఐనా పనమ్మాయికి పండుగనాడు పనేం ఉంటుంది, మర్నాడుంటుందిగానీ””
“సరేసరే! నా లెక్చర్లు బియ్యే నాలుగో యేడూ ఐదో యేడూ చదువుతున్న వాళ్ళకే అర్థం కావడంలేదు. మన యాదమ్మకేం అర్థమౌతాయి? పొద్దున్నే నన్నాడిపోసుకోవడం కాకపోతే?”
“చాల్లే ఊరుకోండి, శ్రమ విలువగురించీ, శ్రమ దోపిడీ గురించీ గురించి అర్థం చేసుకోవాలంటే మీ వుపన్యాసాలు అక్షరమక్షరం ఆకళింపు చేసుకోవాలా ఏమిటి? యాదలక్ష్మి అసలే ఎర్రమట్టి, ఎర్రపూలు, ఎర్రకాయలు టైపు సినిమాలన్నీ ఒక్కటీ వదలకుండా చూస్తుంది. తనకి మీ మద్దతుందని అనుకునుంటుంది”
“పొద్దున్నే అర్భకుణ్ణి నేనొకణ్ణి దొరికాను. కాస్తంత కాఫీ ఏర్పాటు చేశావంటే పేపర్లో వాళ్ళేమంటున్నారో చదివి వస్తాను”
“ప్రళయం వచ్చి ప్రపంచమంతా కొట్టుకుపోయిందన్నా మీరు మాత్రం కాఫీ కప్పు, పేపరూ మర్చిపోరు”
“ఆ వార్తలన్నీ వచ్చేది పేపర్లోనేకదా!””
“ప్రపంచమంతా కొట్టుకుపోయినా మీకేమీ కాదంటారు!!!”
“ఆహా! ఈ వరంగలలాంటిది. కోనసీమ కొల్లేరౌతే మనకి మల్లెపూరెక్కల్లాంటి నాలుగు చినుకులు పడతాయి”
“మీ ముందుగదీ అలాంటిదేనేమో! యాదలక్ష్మి రాలేదని నేను హడావిడి పడుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు మీరొకళ్ళూ! పొద్దున్నే వాదనేసుకుంటే నా పని పాడు. వెళ్ళి మీ పీఠాన్ని అధిష్టించండి. కాఫీ పట్టుకొస్తాను” అన్నాను కొంగు బిగించి కార్యసన్నద్ధురాలినౌతూ.
అలా ఇద్దరం ఎక్కడివాళ్ళం అక్కడికి సర్దుకున్నాక తుఫాను వెలిసిన ఫీలింగ్ కలిగింది నాకు.
యాదలక్ష్మి మా ఇంట్లో పదేళ్ళనుంచీ చేస్తోంది. అప్పట్లో మేము ఇల్లు కట్టుకుంటున్నాం. పునాదులు తవ్వడం, పిల్లర్స్ వేసి బేస్‍మెంటు కట్టడం పూర్తైంది. సరంజామా ఒక్కొక్కటీ లారీమీద దిగుతోంది. వాచ్‍మేన్ ఇంకా ఎవరూ కుదరలేదు. నమ్మకస్థుడికోసం చూస్తున్నాం. ఒకరోజు సాయంత్రం…
కనుచీకటిగా ఉంది. శ్రీవారు ఇసుక చెప్పిరావడానికని వెళ్ళారు. నేనొక్కదాన్నే. ఇంకా డెవలప్‍కాని కాలనీ కావడంతో జనసంచారం లేక భయంభయంగా ఉంది.
“వాచ్‍మెన్ కావాల్నంటమ్మా?” అంత దూరాన్నించీ ఆడగొంతు వినిపించి ఉలిక్కిపడ్డాను.
ఎరుపురంగు చీర కట్టుకుని, కొప్పునిండా మల్లెపూలు పెట్టుకుని వొడ్డుపొడుగూ ఉన్న శాల్తీ నాకేసి వస్తుండడం చూసి నా గుండె గుబగుబలాడింది. అప్రయత్నంగా కొంగు భుజాల చుట్టూ కప్పుకున్నాను. ముంజేతులు కూడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాను.
“ఏందమ్మగారూ! వాచ్‍మెన్ కావాల్నంట?” ఆ స్త్రీ చేరువౌతూ అడిగింది. దూరాన్నించీ నన్నింత భయపెట్టిన ఆమె మొహంలో ఒక విధమైన నిర్మలత్వం!
“ఔను. కావాలి. సారు బైటికెళ్ళారు. ఈపాటికి వస్తుండొచ్చు. రాగానే మాట్లాడుకుందురుగాని” అన్నాను, ఆమె వలన నాకే ప్రమాదమూ రాదనే నమ్మకం కలిగాక.
“మా ఎంకటయ్య చాలా బాగా అరుసుకుంటాడు. పొద్దంతా కాపలుండి రాత్తిరి ఇసిక జల్లెడపడ్తం. ఈడనే గుడిసె వేసుకుని ఉంటం” అందామనిషి ఇసుకకుప్పమీద కూర్చుంటూ. వెంకటయ్యంటే ఆమె భర్త కాబోలు, అతని పేరు చెప్తుంటేనే ఆమె ముఖంలో ఒక విధమైన కళ.
“వెంకటయ్యంటే నీభర్తా? మరి నీ పేరేంటి?” అడిగాను.
“యాదలష్మి. యాదమ్మంటారు”
“పిల్లలెందరు?” యధాలాపంగా అడిగాను.
“మా ఎంకటయ్యకి ముగ్గురు. నాకిద్దరు. మా ఇద్దరికీ ఇద్దరు” అంది.
నేను అదిరిపోయాను. గుండె ఠారుకుంది. మొదటప్పటి భయం మళ్ళీ అందుకుంది. నా మొహంలోని భయం అర్థమైంది కాబోలు, తనే వివరించింది.
“మా యెంకటయ్యకి నేను మారుమనువు. మా యక్క సచ్చిపోయింది. ఆళ్ళకి ముగ్గురు. ఆడు నాకు తెలిసినకాడికే నాకు మనువైంది. ఇద్దరు పోర్లు ఐనంక మావోడు తాగుడు, అనంగ ఇంటికొచ్చి నన్ను కైమా కొట్టుడు షూరూజేసిన్డు. ఆడినొగ్గేసి ఎంకటయ్యతోని అచ్చేసినా” అంది.
“నీ పిల్లలు?” కుతుహలంగా అడిగాను.
“నాతో తెచ్చుకున్న”
నాకామెపట్ల కొంత నెగెటివ్ ఫీలింగ్ కలిగింది. మొగుడు తాగొచ్చి కొట్టాడని వదిలేసి మరొకడితో వచ్చెయ్యడం నా నరనరాన్న జీర్ణించుకుపోయిన సంప్రదాయం వొప్పలేకపోయింది. అది నీతిలేనితనంగా అనిపించింది. ఇంతలో గిరి వచ్చాడు. మాటలయ్యాయి. జీతం ఖరారైంది. వొప్పందం కుదుర్చుకోబోతుంటే మర్నాడు రమ్మని వాయిదా వేశాను. సరేనని యాదమ్మ వెళ్ళిపోయింది.
“అదేమిటి? వెతకబోయిన తీగలా వీళ్ళొస్తే నానుస్తావేమిటి? వెంకటయ్య నాకు ముందే తెలుసును. భార్యాభర్తలు నమ్మకస్థులు. వళ్ళు వంచి పని చేస్తారు” అన్నాడు ఆశ్చర్యంగా.
“ఏమో! వీళ్ళని పెట్టుకోవడం నాకిష్టం లేదు” అన్నాను.
“నీ అభ్యంతరం ఏమిటి?” గిరి గట్టిగా అడిగాడు. యాదమ్మపట్ల నాకు కలిగిన ఆలోచనలన్నీ చెప్పి, ” ఇక్కడుండగా మరెవర్తోనో పోయిందంటే లేనిపోని న్యూసెన్స్” అన్నాను.
గిరి నాకేసి విస్మయంగా చూసి, తర్వాత నవ్వేస్తూ “భలేదానివే! ఒకరిని వదిలేసి వచ్చిందని, తనకింక అదే పననుకుంటున్నావా? వాడు మంచిగా చూసుకునుంటే ఇది వచ్చేసేదేనా? అయినా అభ్యుదయం అభ్యుదయమంటూ ఉంటావు. రెండోపెళ్ళి చేసుకున్న స్త్రీని చూసి నెగెటివ్ ఫీలింగ్స్ కలిగాయంటే ఎలాగోయ్?” అన్నాడు
నేను స్త్రీ అభ్యుదయాన్ని కోరుకున్నమాట నిజమే! మాయింట్లో సమానహక్కులకోసం గిరితో పోట్లాడేదీ నిజమే. నా చిన్నప్పుడు మా అన్నయ్యతో దెబ్బలాడి వాడి నిక్కరు షర్టులు వేసుకుని ఏదో సాధించానని మురిసిపోయినదీ, గిరిని పేరు పెట్టి పిలిచి గర్వపడిందీ అన్నీ నిజమే! కాని అభ్యుదయం ఇంకాస్త ముందుకెళ్తే ఇలా ఉంటుందా?
నేను ఆలోచనలో పడడం చూసి తనన్నాడు.
“మనం నలుగురికోసం బ్రతుకుతాం. మిగిలినవాళ్ళకి అదరువులు తక్కువౌతాయేమోనని అందరికీ పెట్టాక ఆఖర్న ఇల్లాలు తినే సంస్కారం మనది. ఈరోజు తక్కువైనా రేపు కడుపునిండుతుందనే హామీ మనకుంది. కూర తక్కువైతే వేసుకుందుకు పొడో పచ్చడో వుంటుంది. కానీ వాళ్లకలా కాదు. మగవాడి భుక్తికే హామీలేదు. పొయ్యిమీదికి కుండ ఎక్కేదాకా ఈ పూట తిండికే నమ్మకంలేదు. ఎవరిది వాళ్లు సంపాదించుకుని తినే స్థాయి కల్చరు వాళ్లది. అలాంటిది తాగొచ్చి భర్త కొడితే ఎందుకు వూరుకుంటుంది? అలాగని వాళ్లకి ప్రేమలూ, విలువలూ, సర్దుబాట్లు ఉండవనికాదు. అవేవీ లేకపోతే యాదమ్మ పిల్లల్ని తనతో ఎందుకు తెచ్చుకుంటుంది? వెంకటయ్య వాళ్లకి పెళ్లిళ్లేందుకు చేస్తాడు? ఇందాకా నేనన్న పదానికి వాళ్లు చెప్పుకునే అర్థాలూ మనం చెప్పుకునే అర్థాలూ వేర్వేరు. ఐనా మనింట్లో పనికి పెట్టుకోవడానికి ఇవన్నీ ఆలోచించవలసిన అవసరంలేదు. నాలుగు నెలలు వుంటారు, ఇల్లయ్యాక వెళ్లిపోతారు” అన్నాడు.
అలా యాదమ్మ మా ఇంట్లో ప్రవేశించింది. తర్వాత ఇంటిపనిలోకి. పదేళ్లనుంచీ ఈ సిల్‍సిలా నడుస్తోంది.
కాఫీ చేసి రెండు కప్పుల్లో పోసి, మిగితాది ప్లాస్కులో పోశాను. పుత్రరత్నాలు ఇప్పుడే లేవరు. రాత్రి వంటిగంట దాకా చదివి బారెడు పొద్దెక్కాక లేస్తారు. అంతా సిద్దాంత విరుద్ధం. కొత్తగా సిద్ధాంతకరించామంటారు.
ఇంటి ముందు స్కూటరాగింది. ఎవరా ఇంత పొద్దున్నే అని చూస్తే గిరి ఫ్రెండు భాస్కరూ, భార్య స్వరూపా. ఇద్దరి మొహాలూ కళతప్పి ఉన్నాయి. మళ్లీ పోట్లాడుకున్నారు కాబోలు.
“ఏంటక్కయ్యా! పనిమనిషింకా రాలేదా?” అనడిగింది రాగానే బైటపడకుండా.
“ఎందుకోగానీ ఇంకా రాలేదు స్వరూపా! పొద్దున్నే వచ్చారు. ఏంటి విశేషం?” అడిగాను.
“విశేషాలకేం బోల్టున్నాయి. ముందీ వీధివాకిలి తుడిచేసి నీళ్లు చల్లెయ్యనీ. తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం” అంది స్వరూప కళ్లతోటే చీపురుకట్టకోసం వెతుకుతూ. ఆమెలో ఉన్న గొప్పతనం అదే. స్వపరబేధం లేదు. భేషజం అసలే లేదు. వాళ్లది లవ్ మేరేజి. దగ్గరుండి మేమే జరిపించాం. ఆ అభిమానంచేత నాతో స్వంత చెల్లెల్లా ఉంటుంది.
“బావుంది. నువ్వు తుడవడమేమిటి? ప్లాస్కులో కాఫీ ఉంది. పోసుకుని నువ్వూ భాస్కర్ తాగండి. నేనింతలో ఈపని కానిచ్చి వస్తాను”” అన్నాను.
“వంటింట్లో కెళ్లి స్వతంత్రంగా కాఫీ పోసుకుని తాగచ్చుగానీ ఈపని చెయ్యకూడదేమిటి?” అంటూ చీపురు తెచ్చుకుని వచ్చింది నేను తన చేతిలోంచీ లాక్కున్నాను. మా వివాదం ఇంకా పరిష్కారమవనే లేదు. యాదలక్ష్మి కూతురు పరిగెత్తు కొచ్చింది.
“మేడమూ! మా డేడీ మమ్మీని కొడతాండు. జల్దొచ్చి ఆల్లని కొట్టుకోవద్దని చెప్పు”” అంది.
ఆ పిల్ల పేరు సౌందర్య. కాన్వెంటు స్కూల్లో చదువుతోంది. నన్ను మేడమంటుంది. హరిని సారంటుంది. తల్లిదండ్రుల్ని మమ్మీ డాడీ అంటుంది. పక్క వాళ్ల పనిమనిషిని ఆంటీ అంటుంది.
“కొట్టుకోవడం దేనికే?”” అనడిగాను. వీళ్లకిదో అవాటైపోయింది. అమావాస్యకి పున్నానికీ ఏదో ఒక వంకని పోట్లాడుకుంటారు.
“నిన్న పండగ, సైన్యమంతా దిగారు. అటు ఎగేసేవాళ్లూ ఇటు ఎగేసేవాళ్లూ… ఎటూ తేల్చుకోలేక వీళ్లిలా తన్నుకుంటారు” అన్నాడు హరి.
నిజమే! మేమిద్దరం వెళ్లేసరికి వాళ్ల సంతానమంతా పిల్లా మేకలతో సహా వచ్చి ఉన్నారు. వెంకటయ్య యాదమ్మ జుత్తు పట్టుకుని కొడుతున్నాడు. విడిపించుకోలేక గింజుకుంటూ అరుస్తోంది. తిడుతోంది.
వెంకటయ్య సంతానం అతన్ని ఎగేస్తున్నారు. యాదమ్మ కూతుళ్లిద్దరూ మారుటితండ్రికి మెటికలు విరుస్తున్నారు. వెంకటయ్యా యాదమ్మల జమిలి సంతానం ఏ పార్టీలో చేరాలో తెలీక బిక్కమొహాలేసుకుని చూస్తున్నారు.
“అగో, సారొచ్చిండు”” అంది యాదమ్మ. వెంకటయ్య ఆమెనొదిలేశాడు.
“ఏంట్రా గొడవ?” అనడిగాడు హరి.
“నిన్న పండుక్కి దాని పిలగాల్లు, నాపిలగాల్లు అందరొచ్చిన్రు సారూ! దాని బొట్టిలకది రైకముక్కలిచ్చి చార్జిలిచ్చుద్దంట” అన్నాడు.
“నేను కట్టంచేసి దాసుకున్నా, నాబొట్టిలకి నేనిచ్చుకుంట” తలెగరేసింది యాదమ్మ.
“మరి నా పిలగాల్లకెవరియ్యాలే? నా పైసలన్నీ నువ్వే గుంజుకోబడివి” మళ్లీ చెయ్యెత్తాడు
“యాదలక్ష్మి! నువ్వు నీ పిల్లలకి పెట్టుకో. వెంకటయ్య తన పిల్లలకి పెట్టుకుంటాడు. మరి వీళ్ల మాటేంటి?” అనడిగారు శ్రీవారు. వాళ్లిద్దరూ తెల్లబోయారు.
“ఏమర్రా, మీకు పెళ్లిళ్లయాయి. పిల్లలు పుట్టారు. కూలోనాలో చేసుకుని మీ బ్రతుకులు మీరు బ్రతుకుతున్నారు. ఇలా పండగ పండక్కీ వచ్చి వీళ్లకి దండగ చేసి పోవడమే కాక తంపులు పెడ్తారా? వాళ్లు తన్నుకు చస్తుంటే తమాషాలు చూస్తున్నారా?” అని కేకలేసి. “నేను మా అమ్మావాళ్లని చూడ్డానికెళ్తే వాళ్లకి బట్టలు, మా అన్నదమ్ముల పిల్లలకి బొమ్మలు, స్వీట్లు తీసికెళ్తాను. మీరూ అంతే చెయ్యాలి. ఇక మీదట పండక్కి వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కళ్లు ఒక్కొక్కళ్లకి బట్టలు తెండి. ఒకళ్లు తిండి ఖర్చు పెట్టుకోవాలి. అలాగైతేనే ఇక్కడికి రావడం. ఇదో… యాదమ్మా! వెంకటయ్యా! మీరిద్దరూ నెలనెలా నాకు ఇరవయ్యేసి రూపాయలు తెచ్చివ్వాలి. పండక్కి వీళ్లొస్తే మీ వంతు ఖర్చు అందులోంచే చెయ్యాలి. అంతకి మించి పైసా ఖర్చు చేసినా వూరుకోను. తెలిసిందా?” అని ఆ వ్యవహారం సెటిల్ చేసి ,
“తొందరగా పనులు కానిచ్చేసి సినిమాకి పొండి అందరూ. సినిమా అయ్యాక ఎక్కడి వాళ్లక్కడికి వెళ్లిపోవాలి. మళ్లీ ఇక్కడ కనిపించారో కాళ్లూ చేతులూ విరగ్గొడతాను” అని అందరికీ వార్నింగులు జారీ చేసి వంద రూపాయలిచ్చి వచ్చాం.
నా వెనకాలే యాదమ్మ, వెంకటయ్యా వచ్చి పనంతా చేసేసి వెళ్లిపోయారు.
“ఇప్పుడు చెప్పండి, మీ గొడవేంటో?” అనడిగాడు హరి, భాస్కర్ని.
“నన్నీ వూర్నించీ ట్రాన్స్ఫర్ చేయించుకోమంటోంది” కొంచెం కోపంగా అన్నాడు భాస్కర్.
“అదేంటి?” హరి ఆశ్చర్యంగా అడిగాడు.
“అమ్మకీ సరూకీ ఒక్కక్షణంగూడా పడ్డంలేదు. పెద్దది ఆవిడేదేనా అంటే తను సర్దుకుపోవచ్చుగా! మాటకిమాట అప్పజెప్తుంది. మందలిస్తే వాళ్లమ్మనీ నాన్ననీ గుర్తుతెచ్చుకుని ఏడుస్తుందనే భయం ఒకటి…”
“అందుకేనా, నిన్న నామీద చెయ్యిచేసుకున్నారు?”” రోషంగా అడిగింది స్వరూప.
“అదేంటి?” నేను నివ్వెరపాటుతో అడిగాను.
నా ప్రశ్న పట్టించుకోకుండా భాస్కర్, “వెంటనే అందుకు సారీ చెప్పానుగా?” అనడిగాడు.
“చేసేదేదో చేసేసి సారీ చెప్పేస్తే సరిపోతుందా?” అంది స్వరూప.
“నువ్వుండరా” అని హరి భాస్కర్‍ని ఆపితే, “అసలేం జరిగింది సరూ?” అని నేను స్వరూపని నడిగాను.
“అక్కయ్యా! పెళ్లై రెండేళ్లైంది. మా అత్తగారి గురించి నీతో ఒక్కమాటేనా చెప్పానా? నేను కట్నకానుకలు తేలేదు. అందుకావిడకి ఎంతబాధో! అది నన్ను పుడకలమీదికి చేర్చి కాల్చినాక కూడా ఆవిడకి తీరదు. నా కంటతడి చూడకుండా ఏ వొక్కరోజైనా ఆవిడకి గడవదు. అన్నీ వంటిబిగువుని భరించి ఈయన రాగానే నాటకంలో అంకం మారినట్టు ముఖానికి నవ్వు పులుముకుని తిరుగుతాము. అక్కడికి నేను సంతోషంగా ఉన్నట్టే ఈయనకి లెక్క. నిన్నటికి నిన్న…. ఓవైపు గోదావరి జిల్లాలు తుఫానుతాకిడికి అతలాకుతలంగా వున్నాయి. అమ్మావాళ్లూ అక్కడ అమలాపురంలో ఎలా వున్నారో తెలీదు. ఎంత కట్టుబాట్లు తెంచుకుని వచ్చేసినా మమకారాలు చావవుకదా? భాస్కర్‍కసలు ఆ ధ్యాసే లేదు, వాళ్లెవరని తనకి? ఒకసారో రెండుసార్లో మాత్రమే చూసిన పరిచయస్థులు. కానీ నాకు? లోపల్లోపల ఏడుస్తూ పండగపనులు చేస్తుంటే మా అత్తగారందీ –
దిక్కుమాలిన సంబంధం ముడిపెట్టుకున్నాం. ఒక్కగానొక్క కొడుకు మనసు కష్టపెట్టలేక నిన్నింట్లోకి రానిచ్చి కోడలిహోదా ఇచ్చాం. మరొకరూ మరొకరూ అయితే వీధిలోంచే తగిలేసేవారు. ఏమయ్యేదప్పుడు నీ బతుకు? కుక్కలు చింపిన విస్తరయ్యేది. ఆ జ్ఞానం కూడా లేదు నీకూ మీవాళ్లకి. ఎంతటి దరిద్రులూ కూడా పండక్కి కూతుర్నీ అల్లుడినీ పిలిచి ఉన్నదేదో పెట్టుకుంటారు. మా మొహాలకి ఏదీలేదు. మమ్మల్నింత ఉసురుపెట్టుకుంటున్నారు. సర్వనాశమనమౌతారని తిట్లు “
“ఇవన్నీ నాకు తెలీవు” భాస్కర్ కలగజేసుకున్నాడు.
“పండగపూటా వాళ్లనెందుకలా తిడ్తారని అడిగాను. అదే నేను చేసిన తప్పు. ఇంకేముంది? చిలికి చిలికి గాలివానైంది. ఈయన నామీద చెయ్యెత్తారు” అంటూ లేచి వెళ్లిపోయింది స్వరూప మామధ్యనుంచీ.
నేను వెనకే వెళ్లాను. వంటింట్లో పీటమీద కూలబడి వెక్కివెక్కి ఏడుస్తోంది. పక్కలు అదుర్తున్నాయి. ఎప్పుడూ నేను స్వరూపనలా చూడలేదు. రెండేళ్ల క్రితం అమ్మానాన్నల్ని ఎదిరించి భాస్కర్తో ఇంట్లోంచీ వచ్చేసినప్పటి తెగింపూ, ఆ చొరవా, జీవం మచ్చుకేనా కనిపించట్లేదామెలో తుఫాన్లో చిక్కుకుపోయిన పసిపిల్లలా గిజగిజలాడిపోతోంది.
“స్వరూపా!” భుజాల చుట్టూ చేతులేసి దగ్గరికి తీసుకున్నాను.
అవతల హరి భాస్కర్ని కోప్పడుతున్నాడు. “
“ఇంట్లోంచీ లేవదీసుకొచ్చి పెళ్లి చేసుకున్నంత మాత్రాన సరికాదు. అమ్మకి కొడుకు కాదంటే నాన్న వుంటాడు కావాలనుకోవడానికి. కానీ భార్యకలా కాదు. ప్రప్రథముడు భర్త. అతనితోటే ఆమె సుఖసంతోషాలు ముడిపడివుంటాయి. అంత ఇంపార్టెన్స్ వాళ్లు మనకిచ్చినందుకు మనవంతు కృతజ్ఞత మనం కూడా చూపించాలికదా! అసలుకీ పెళ్లెప్పుడూ రెసిప్రొకేషన్‍మీదే ఆధారపడి వుంటుంది. ప్రేమ ఇస్తే తిరిగి దొరుకుతుంది. నమ్మకం, భద్రతా, గౌరవం…. అన్నీ అంతే!”” అంటున్నాడు.
“అక్కా! ఈ పెళ్లి వల్ల నేను పొందిన లబ్ది ఏమిటని ఆలోచిస్తే నేనెంత తెలివితక్కువదాన్నో అర్ధమౌతోంది. అమ్మానాన్నల్నీ, తోబుట్టువుల్నీ వాళ్లిచ్చే ప్రేమానురాగాలనీ, భద్రతనీ వదులుకుని ఈయనతో వచ్చేశాను. నేననే ఏమిటి? కాస్త అటూఇటూగా ఏ ఆడపిల్లేనా అంతే. ఇంతగా నమ్మి ఆధారం చేసుకున్న ఆమెకి మగవాడు ఇవ్వాల్సిందేమిటి? ఆస్తి అంతస్థులూ, నగలూ సౌఖ్యాలూ మాత్రమేనా? పెళ్లిద్వారా వెలితిపడిన ప్రేమానురాగాలని పూరించాల్సిన కనీసబాధ్యత మగడిస్థానంలో ఉండే మగవాడికి ఉండక్కర్లేదా? ఈయన నాకేలోటూ చెయ్యలేదు, కాదనను. కానీ ఈయన వెనక ఇంట్లోవాళ్లు నాపట్ల ఎంత నిర్దయగా ప్రవర్తించారు? క్షణక్షణం వెలివేత… ఎత్తిపొడుపులు….చీదరింపులు… నా వరకూ నేను నిన్ను బాగానే చూస్తున్నానుగా అనేస్తే సరిపోతుందా? చెప్పక్కయ్యా! ఈయన ఇంట్లో సంగతులు కొంచమేనా తెలుసుకోనక్కర్లేదా?”” వెక్కిళ్ల మధ్యని అడిగింది స్వరూప.
“నాతో ఒక్కసారైనా నువ్వనకపోతే ఎలా తెలుస్తుంది?” ముందుగదిలోంచీ భాస్కర్ కేకేశాడు. అతని మాటల్లో తప్పు చేసిన భావన వుంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
“మీ అమ్మ నన్నిలా అంటోందని చాడీలు చెప్పాలా? చెప్తే మీరు నమ్ముతారా? ట్రాన్స్ఫర్ చేయించుకుందామని మీతో అన్నిసార్లంటే ఒక్కసారేనా ఏంటి నీ సమస్యని అడిగేరా? లేదు. ఊరికే కోపం తెచ్చుకునేవారు… అక్కయ్యా! ఈ రెండేళ్లలోనూ మూడు ఎబార్షన్లయ్యాయి. సరైన తిండీ, విశ్రాంతీ, మనశ్శాంతీ… ఈ మూడులేక, ఆ సంగతి ఈయనకి తెలీదా? ఇప్పుడేంటి? యుటిరస్ జారిపోయి బెడ్‍రెస్టు తీసుకుంటేగానీ ప్రెగ్నెన్సీ నిలవదంటున్నారు డాక్టర్లు. అంటే తల్లినయ్యే యోగ్యత నాకు లేకుండాచేసి తర్వాత ఆ కారణంగా కొడుక్కి మరో పెళ్లి చేస్తుందట ఆవిడ. నేను…. నేనేం కాను? ఎక్కడికెళ్లను? ఏ గంగంలో దూకను? ఇందుకేనా నేను పెళ్లిచేసుకున్నది? ఇదేనా ప్రేమంటే?””
“ఏయ్… ఏయ్… అన్నీ మీరిద్దరే అనేసుకుని, అన్ని విషయాలూ మీ ఇద్దరే నిర్ణయించేసేసుకుంటే నేనేం చెప్పేది?” అన్నాడు భాస్కర్.
“అలా నెపం నెట్టెయ్యకు భాస్కర్” అన్నాన్నేను.
“తప్పయింది వదినా! చెంపలేసుకుంటున్నాను”” వంటింట్లోకి వచ్చాడు భాస్కర్. స్వరూప ప్రెగ్నెంటని ఇపుడే తెలిసినట్టుంది. అతని కళ్లలో దాచినా దాగని ఆనందం!
“ఏయ్ మొద్దూ! అన్నీ మనసులో దాచుకుంటే నాకెలా తెలుస్తాయి?” ఆర్తిగా అడిగాడు. నేనక్కణ్ణుంచీ తప్పుకున్నాను.
“అభ్యుదయం మన తలవాకిట్లోనే వేచిచూస్తూ ఉంటుంది. దాన్ని నాలిక చివరిదాకానే ఆహ్వానించగలుగుతున్నాంగానీ మనసులోకి స్వీకరించలేకపోతున్నాం” అన్నాడు హరి. నేను ఏకీభవించాను.
భాస్కర్‍కూడా దీనికి మినహాయింపు కాదు. గొంతుమీదికి వచ్చేదాకా తప్పించుకునే ధోరణి అవలంబించాడు. లేకపోతే ఇంట్లోని తెరచాటు భాగవతం కొంత కాకపోతే కొంతేనా అతనికి తెలీదా? తెలిసే ఊరుకున్నాడు. వాస్తవానికి స్వరూప ఏదేనా అతన్తో చెప్పి ఉండినా అది సిల్లీగానో, తప్పుగానో అనిపించేది. ఆమె ఏమీ చెప్పలేదుకాబట్టి ఇంత గొడవ, దానికి పర్యవసానంగా ఒక పరిష్కరం. అదే… నాలుక చివరి అభ్యుదయం.

1 thought on “వాకిట్లో అభ్యుదయం by S Sridevi”

Comments are closed.