చట్టబంధం by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

నెలక్రితం వుదయం వాకింగ్‍కి వెళ్ళినప్పుడు సూర్యలక్ష్మి మెడలోని నాలుగుతులాల గొలుసు ఎవరో తెంపుకుపోయారు. ఐదువందల గజాల దూరంలో వున్న పార్కుకి పొద్దున్నే వెళ్తుంది. పార్కులో అరగంటసేపు నడిచి ఇంటికి వస్తుంది. వెళ్ళేప్పుడూ వచ్చేప్పుడూ వుండే ఈ వెయ్యిగజాలదూరం ఆడవాళ్లకి పెద్ద సవాలే. గొలుసు తెంపుకుపోయేవాళ్ళు బాగా తిరుగుతుంటారు. అడపాదడపా జరిగే కథలు విన్నప్పుడు కొన్నాళ్ళు జాగ్రత్తగా వున్నా, ఏదో శతృస్థావరంలో వున్నట్టు నిత్యం అప్రమత్తంగా వుండలేరు మనుషులు. అలాంటప్పుడు మరో దొంగతనం జరుగుతుంది.
ఎదురుగా మోటారుసైకిలు మీదిమీదికి వస్తుంటే రోడ్డు దిగింది సూర్యలక్ష్మి. బైకుమీద ఇద్దరున్నారు. వెనక వున్నవాడు గొలుసు తెంపేసి రెండుచేతులతోటీ గాల్లోకి ఎగరేసి పట్టుకున్నాడు. వెంటనే రెయిజ్ చేసుకుని వెళ్ళిపోయారు. అంతా సెకన్లలో జరిగిపోయింది.
ముందు దిగ్భ్రాంతి… తర్వాత ఏం జరిగిందో తెలీని పరిస్థితి… ఆ తర్వాత ఏం చెయ్యాలో తోచని స్థితి… అప్పటికే అక్కడక్కడ వున్నవాళ్ళు దగ్గరికి వచ్చారు.
“పోలీసు కంప్లెయింటివ్వండి. వెంటనే యిస్తే మంచిది” అని ఒకరన్నారు.
“ఇస్తే మాత్రం దొరుకుతుందా? ఈపాటికే చేతులు మారిపోయి వుంటుంది. ఇదంతా పెద్ద నెట్‍వర్కు”
రకరకాల మాటలు… రకరకాల సలహాలు…
ఒకావిడ సూర్యలక్ష్మి ఇల్లెక్కడో తెలుసుకుని అపార్టుమెంట్ దగ్గర వదిలిపెట్టింది. ఆమె కలలోలా నడుస్తూ వెళ్ళి డోర్‍బెల్ నొక్కింది. అనురాగ్ వచ్చి తలుపుతీసి భార్యని అలా చూసి తెల్లబోయాడు.
“ఏమైంది?” అడిగాడు ఆదుర్దాగా. మాటలకోసం తడుముకుంటూ చెప్పింది.
“నీకేం కాలేదుకదా? ఎందుకంత భయపడుతున్నావు? లోపలికి రా, ముందు” అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి యిచ్చాడు. అవి తాగాక కొంచెం కుదురుకుని వివరంగా చెప్పింది. చెప్పడానికంటూ ఏముంది? పేపర్లోనూ టీవీలోనూ చూసేవే. నిత్యం జరిగేవే. బైక్‍మీద వచ్చారు, గొలుసు తెంపుకుని వెళ్ళారు… అంతేకదా? ఎన్నిసార్లు గుర్తుచేసుకున్నా అంతే. ఇప్పుడు విక్టిమ్ తను.
అనురాగ్ ముందు షాకయాడు. ఇలాంటివి వినటం వేరు. ప్రత్యక్షంగా తమకే జరగడం వేరు.
“కంప్లెయింటు ఇచ్చి వద్దాం. ఇంత పొద్దున్నే ఎవరూ రారు. టిఫెను బయటే చేసేద్దాం ” అన్నాడు కాసేపటికి సర్దుకుని. బట్టలు మార్చుకోవటానికి లేచి వెళ్ళాడు.
మరొకరూ మరొకరూ ఐతే ఎంత గొడవ చేద్దురో! నాలుగు తులాలగొలుసూ, సూత్రాలూ మధ్యన వుండే సకినంగుండ్లతో కలిపి దాదాపు రెండున్నరలక్షలు. తనది ఆర్నెల్ల జీతం, నూటనలభైనాలుగు పనిగంటలు తన జీవితంలోంచీ తప్పిపోయాయి. పొద్దున్నే వెళ్ళేముందు సూత్రాలగొలుసు తీసెయ్యాలంటే తప్పు చేసినట్టు అనిపిస్తుంది. భయపడుతునే వెళ్తుంది. పొరపాటు తనదే. ఏ పసుపుతాడుకో సూత్రాలు గుచ్చుకుని వేసుకోవలిసింది. ఈ గొలుసు పైన వేసుకుంటే సరిపోయేది. కానీ అటు అత్తగారూ, ఆడబడుచులూ, ఇటు తల్లీ, చెల్లెలూ ఎవరూ పసుపుతాడు కట్టుకోరు. తనకీ ఆ ధ్యాస పోలేదు… అనురాగ్ తయారై వచ్చేదాకా పరిపరివిధాలపోయింది మనసు.
“లే సూర్యా, వెళ్దాం” అన్నాడు.
ఆమె లేచి లోపలికి వెళ్ళి నల్లపూసలగొలుసు వేసుకుని వచ్చింది. భర్త ముఖంలోకి చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టు అనిపించింది. తను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందేమో! ఆమె ఆలోచనలు అర్థం చేసుకున్నట్టు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు.
“కంప్లెయింటు ఇక్కడే రాసుకుని వెళ్దాం” అంది.
అతనికీ అదే మంచిదనిపించింది. కంప్యూటర్ ముందు కూర్చుని రాసి అతనికి చూపించి ప్రింటౌట్ తీసుకుని వచ్చింది.
అందుకూ ఇద్దరూ పోలీస్‍స్టేషన్‍కి వెళ్ళింది.
“చెయిన్ స్నాచింగ్ కేసా? ఐదు తులాలా? ఎందుకు తిరుగుతారమ్మా, అంతంత బంగారం వేసుకుని? మీకు సెక్యూరిటీ యివ్వడానిక్కాదుకదా, మాకు జీతాలిచ్చేది?” కంప్లెయింటు చూస్తూ కొంచెం చులకనగా అన్నాడు పోలీస్ ఆఫీసరు.
సూర్యలక్ష్మి ముఖం ఎర్రబడింది. ఆవేశపడద్దన్నట్టు చేతిమీద సున్నితంగా తట్టాడు అనురాగ్.
“సారీ సర్! బంగారం వేసుకోవడం నాదే తప్పన్నారు. సరే. రోడ్డుమీదికి వెళ్ళిన మనిషిని రాష్‍డ్రైవింగ్‍లోనో డ్రంకెన్ డ్రైవ్‍లోనో యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారు. జేబులు కొట్టేస్తున్నారు. ఆడవాళ్ళని రేప్ చేసి చంపేస్తున్నారు. మమ్మల్నింక ఇంట్లోంచీ బైటికి రావద్దంటారా?” అడిగింది.
అతని ముఖం కూడా ఎర్రబడింది. ఈవిడ వుద్యోగం చెయ్యకపోతే తుపాకీ పట్టుకుని అడవుల్లోకి వెళ్ళేదేమో! అలా నిలదీస్తోంది! “మీమంచికోసమే కదా, మేం చెప్పేది? ఈ చెయిన్ స్నాచింగ్‍లలో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్ళూ వున్నారు. అనవసరం రిస్కు ఎందుకని?” అని కంప్లెయింటు తీసుకుని ఎఫ్‍ఐఆర్ నమోదు చేసుకుని కాపీ ఇచ్చాడు.
ఇద్దరూ ఇవతలికి వచ్చారు. ఆమెని ఇంట్లో దింపి తను ఆఫీసుకి వెళ్ళిపోయాడు అనురాగ్. ఆమె వెళ్ళలేనంది. ఆ లీవులెటరుకూడా తనే రాయించి తీసుకెళ్ళాడు, ఆమె ఆఫీసులో ఇవ్వటానికి.
ఇంట్లో ఒక్కర్తీ కూర్చుంటే చాలా దిగులేసింది సూర్యలక్ష్మికి. రోజువారీ చిన్నచిన్న సంఘటనలు జరగటం వేరు. అలవాటైపోయిన చిన్న నేరాలు చుట్టూ జరుగుతున్నా, మనం పట్టించుకోం. ఇది రొటీన్‍కి భిన్నంగా జరిగిన సంఘటన. మరోసారి జరిగిందంతా గుర్తొచ్చింది. పచ్చిగాయంలా వుంది బాధ. ఎవరికేనా చెప్పుకోవాలనిపించింది. తల్లితో మాట్లాడదామనుకుంటుంటే ఆవిడే ఫోన్ చేసింది.
“అల్లుడు ఇప్పుడే ఫోన్ చేసాడు. అలా ఎలా జరిగిందే? కాస్త జాగ్రత్తగా వుండద్దుటే? ఐనా ఇలాంటివి తెల్లారి లేస్తే బోల్డన్ని వింటున్నాం. పొద్దున్నే ఆ వాకింగ్‍కి వెళ్ళకపోతే ట్రెడ్‍మిల్ కొనుక్కుని అదేదో ఇంట్లోనే చేసుకుంటే సరిపోయేది… సర్లే, ఇలా జరుగుతాయని ఎవరనుకుంటారు? జరిగాక వచ్చే ఆలోచనలే. పోలీసుకంప్లెయింటు ఇచ్చారుకదా? దొరుకుతుందేమోలే. ఇంక పెద్దగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోక, తిని కాసేపు పడుక్కో”అంది ఆవిడ.
అక్కడినుంచీ ఎడతెరిపి లేకుండ ఫోన్లు వస్తునే వున్నాయి.
“పోన్లేమ్మా! పెద్ద గండం తప్పింది. వాళ్ళు నిన్నేమీ చెయ్యలేదు. లేచినవేళ మంచిది. శనివారం వేంకటేశ్వరస్వామికి అఖండదీపం వెలిగిస్తానని దణ్ణం పెట్టుకున్నాను” అంది అత్తగారు. ఆవిడ చాలా పెద్దావిడ. కోడలంటే పంచప్రాణాలూ పెడుతుంది. అసలా వార్త ఫోన్‍చేసి కొడుకు చెప్పగానే కంగారుపడిపోయింది.
ఆడబడుచు, చెల్లెలు, పిల్లలు, స్నేహితులు ఒకటే ఫోన్లు. టీవీలో సీసీటీవీ ఫుటేజి ఇచ్చి తన వివరాలు చెప్తున్నారట. మధ్యలో కొలీగ్స్. అనురాగ్‍ద్వారా విషయం తెలిసి.


ఆ తర్వాత నెలరోజులకి పోలీస్ స్టేషన్‍నుంచి ఫోనొచ్చింది, దొంగలు దొరికారని. అంత తొందరగా పట్టుకున్నందుకు పోలీసు వ్యవస్థమీద ఎంతో గౌరవం కలిగింది ఇద్దరికీ.
“దొంగని మీరు గుర్తుపట్టగలరా?” అని కొంతమందిని సూర్యలక్ష్మి ముందు వరసగా నిలబెట్టారు.
ఆమె తెల్లబోయింది. ఒక్క నిముషంకూడా జరగని ఆ హఠాత్సంఘటనలో వాళ్ళ ముఖాలు ఎలా గుర్తుంటాయి? అసలు తను చూసిందో లేదో కూడా గుర్తు లేదు. భయం గడ్డకట్టుకుపోయిన క్షణాలవి. ఇప్పుడూ భయమే, అంతమంది అనుమానితులని ఒక్కచోట చూసేసరికి. గుర్తుపట్టలేదంటే దొరికిన బంగారం వెనక్కిపోతుందేమో! ధైర్యం తెచ్చుకుంది. ఎవరైతే తనకేమిటి? వస్తువు దొరికింది, వీళ్ళు దొంగలు. సుమారుగా అనిపించిన ఓ మనిషిని చూపించింది.
“ఈ మేడమ్ దగ్గర నువ్వు గొలుసు తెంపుకుపోయావా?” అని అతన్ని అడిగాడు పోలీస్ ఆఫీసరు. అతను వప్పుకున్నాడు.
“దొంగలు దొరికారుగానీ సొమ్ము ఇంకా దొరకలేదమ్మా! ఎక్కడో అమ్మేసారట. ఎంక్వైరీ చేస్తున్నాం. ఇలాంటి దొంగబంగారాలు కొనేవాళ్ళు కొందరు వుంటారు. ఏదేనా విషయం తెలిస్తే మీకు కబురు పెడతాం” అన్నాడు ఆఫీసరు. థాంక్స్ చెప్పి ఇద్దరూ తిరిగొచ్చారు.


“సొమ్ముకూడా దొరికిందిగానీ కరిగించేసారు” అన్నాడు పోలీసాఫీసరు మరో నెలతర్వాత.
ఇండియన్ పోలీసువ్యవస్థగురించి ప్రపంచమంతా గొప్పగా చాటి చెప్పాలనిపించింది ఇద్దరికీ. వెంటనే సోషల్‍మీడియాలో పోస్టులు పెట్టారు.
“వెరీ సారీ అండీ! సొమ్ము దొరికిందికానీ అంతా కరగబెట్టేసారు. దొంగా దొరికాడు, దొంగసొమ్మూ దొరికింది. కానీ అది మీదని మీరుగానీ దొంగగానీ చెప్పలేరుకదా!” అన్నాడు స్టేషన్‍కి వెళ్ళినప్పుడు ఆ పోలీసు ఆఫీసరు.
సూర్యకి అర్థమవలేదు. నిరాశ నెమ్మదిగా కమ్ముకుంది.
“దొంగసొమ్ము అలాగే వుంచెయ్యరుకదండీ? మార్చేస్తారు. మాది పోయింది ఐదుతులాలు. కరిగించినదాంట్లోంచీ మాముక్క మాకిచ్చేస్తే సరిపోతుంది. మళ్ళీ చేయించుకోవాలన్నా మాకు నష్టమే. మజూరి ఖర్చు, తరుగు… ” అంది ఆవేశాన్ని అదుపుచేసుకుంటూ.
“అలా వుండదమ్మా! చట్టం అన్నాక కొన్ని రూల్సుంటాయి. దొంగ మిమ్మల్ని గుర్తుపట్టాలి. దొంగని మీరు గుర్తుపట్టాలి. ఆతర్వాత దొంగసొత్తుని మీరూ అతనూ గుర్తుపట్టాలి. ఇక్కడ అలాంటిది లేదు… సొత్తు మార్చేసారు” అన్నాడు ఆఫీసరు.
చట్టబంధం… ఎక్కడో ముడి వుంది. ఆ ముడికి అవతలివైపునించే మనుషులు నడుస్తుంటారని, దాన్ని ఇప్పడం తమకి సాధ్యపడదని అర్థమైంది. నిశబ్దంగా ఇవతలికి వచ్చింది. కంట్లోంచీ ఒక చుక్క కన్నీరు జారిపడింది. అనురాగ్ వోదార్చుతున్నట్టు ఆమె భుజంమీద తట్టాడు. ఆమెకి కావల్సింది భర్త వోదార్పుతోపాటు, సమాజాన్నించీ, పాలనావ్యవస్థనించీ ఒక ధైర్యంకూడా. రెండోది దొరకలేదు.