పునరపి – 3 by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

పెళ్లికి వచ్చిన బంధువులంతా వెళ్లిపోయారు. శ్రీరామ్ కాస్త స్థిమితపడ్డాడు. అనూరాధ విషయంలో ఏం తెలియడం లేదు. ఎంతకాలమని కృష్ణవేణికి భారంగా ఉంచుతాడు? ఇంతలో మరో విషయం బాంబులా బద్దలైంది.
“ఆమె అతనితో సన్నిహితంగా గడిపింది. తనిప్పుడు గర్భవతి” అంది కృష్ణవేణి హఠాత్తుగా ఫోన్ చేసి. “నాకు మొదట్లోనే ఆ విషయంలో అనుమానం ఉంది. పరీక్ష చేసి రిపోర్ట్స్ తెప్పించాను. నిర్ధారణ అయింది” అంది.
“అబార్షన్ చేయించుకోదట. ఎన్ని విధాలుగా చెప్పినా వినడం లేదు” అని కూడా అంది.
శ్రీరామ్‍కీ అనూరాధకీ మధ్యగల పల్చటి తెరలాంటి విభజన ఇప్పుడు అడ్డుగోడగా మారిపోయింది.
“డెలివరీ అయ్యేదాకా నా దగ్గర ఉంటుంది శ్రీరామ్. తర్వాత కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి నా స్నేహితులు ఎవరి దగ్గరయినా పంపిస్తాను. నా దగ్గరే ఉంచుకోవచ్చు. అది నీకు ఇబ్బందిగా ఉంటుంది” అంది కృష్ణవేణి.
“వేణీ! ఎంత భారాన్ని ఎత్తుకుంటున్నావు?” ఆర్ద్రంగా అడిగాడు. తన బరువుని ఆమె తలమీదికి మార్చినందుకు అపరాధ భావన కలిగింది.
“ఆమెకోసం ఏదైనా చెయ్యగలిగే అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాను. ఆమె నీకేమౌతుందని నీతో తీసుకొచ్చావు? ఆ సందర్భంలో సహజంగా కలగాల్సిన కోపాన్ని కూడా జయించగలిగావంటే దానికి కారణం మానవత్వం. మగవాడిపై ఉండి నువ్వు చూపించగలిగినదాన్ని సాటిస్త్రీని నేను చూపించలేనా?”
“…”
“ఆమె చట్టపరంగా నీ భార్య. ఆ విషయం ఆలోచించు. ఇంకా ఆలస్యం చెయ్యకు” అని హెచ్చరించింది.
శ్రీరామ్ ప్లీడర్ని కలిసాడు. ఆయన ఎదురుగా అనూరాధ రాసిచ్చింది. తనకి శ్రీరాంతో పెళ్లికన్నా ముందే మరో వ్యక్తితో సంబంధం ఉందని. ఆమె దాన్ని పెళ్లి అన్నా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు కాబట్టి సంబంధమనే అన్నాడు ప్లీడరు. ఆమె ప్రెగ్నెంట్ అని కృష్ణవేణి సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ రెండింటి ఆధారంగా వాళ్ల పెళ్లిని రద్దు చేస్తూ కోర్టు డిక్రీ ఇచ్చింది.
“మేమైతే దాన్ని చచ్చినదానికిందే జమ కట్టాము. అయినా నలుగురిలో పరువు పోకూడదని పెళ్లి చేసాము. దారికొచ్చి ఏమీ జరగనట్టు కాపురం చేస్తే సరే, లేకపోతే ఏదో ఒక దారి చూద్దామనుకున్నాము. ఇలా జరిగింది. మీరు కూడా దాన్ని వద్దనుకున్నారు. దాని కర్మ దానిది. మాకు సంబంధం లేదు. పెళ్లప్పుడు మేము పెట్టిన బంగారం, ఖర్చులు తిరిగిచ్చేస్తే బాగుంటుంది” అని కబురు చేశాడు అనూరాధ తండ్రి. మనుషులంటే ఏవగింపు కలిగింది. శ్రీరామ్‍కి. ఖర్చులూ లెక్కలూ వేసుకోకుండా వాళ్ళు అడిగింది అంతా పంపించేశాడు. అలా పంపించడంలో అతనికొక నిర్దుష్టమైన వుద్దేశం ఉంది. పంపించగానే వాళ్లతో తనకున్న సంబంధం తెగిపోతుంది. లేకపోతే వాళ్లా డబ్బుకోసం తనని వెంటాడుతూనే ఉంటారు.
అనూరాధకి పాప పుట్టింది.
“చూస్తావా?” అని అడిగింది కృష్ణవేణి.
“సారీ!” అన్నాడు బిట్టర్‍గా, తనది కాని భార్య, తనకి పుట్టని పాప!
ఆరోజు ఆఖరిసారిగా అనూరాధ భవిష్యత్తు గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు.
“ఆమె షాక్‍లోంచీ తేరుకోలేదు శ్రీరామ్. అతని చావు దృశ్యం ఆమె స్మృతిపథంలో ఇంకా మసకబారలేదు. ఓ రాత్రివేళ హఠాత్తుగా లేచి ఏడుస్తుంది. కలలో మనిషిలా వుంటోంది. నాకు ఆమె ఏమవుతుందన్న ప్రశ్న పక్కనడితే, ఆమె నన్ను చాలా డిస్ట్రబ్ చేస్తోంది. ఇది ఆమె ఒక్కదాని సమస్య కాదు. చరిత్ర ఆరంభంనుంచి మగవాడు తనకి నచ్చిన అమ్మాయిని చేసుకోగలుగుతున్నాడు. ఇష్టంలేని అమ్మాయిని కూడా మరేవో ప్రయోజనాలకోసం చేసుకుని భార్యగా కట్టిపడేస్తున్నాడు. స్త్రీ మాత్రం ఇష్టమైనవాడిని చేసుకోలేకపోతుంది. ఇష్టంలేని కాపురాన్ని తప్పించుకోలేకపోతోంది. ప్రేమించుకున్నందుకేగా, అనూరాధకి ఈ శిక్షంతా? తనకి నచ్చిన వ్యక్తిని చేసుకుని నచ్చినట్టు జీవించే స్వేచ్ఛ స్త్రీకి లేదా?” ఆవేదనగా అడిగింది కృష్ణవేణి.
“నీకుందికదా?”
“ఎక్కడి నుంచి వచ్చింది?”
నిజమే! ఎక్కడినుంచి వచ్చింది వేణికి ఆ స్వేచ్చ? చదువు, సంపాదన, సమాజంలో పరపతి? అవి ఎక్కడినుంచి వచ్చాయి? తల్లిదండ్రులు చదువు చెప్పిస్తే వచ్చాయి. లేకపోతే లేదు. అంటే వేణి స్వాతంత్రాలు కూడా పరాధీనం అన్నట్టే.
సృష్టిలో ఎంతో గొప్పదని మనం చెప్పుకునే మానవజాతిలో శిశువు అత్యంత నిస్సహాయ స్థితిలో పుట్టి… ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియని దశలో కొన్ని సంవత్సరాలు గడుపుతుంది. ఆ సమయంలోనే అతని ప్రగతికి పడుతుంది. కాలంతోపాటు అది బలపడుతుంది. స్త్రీకి చదువు, పెళ్లి విషయంలో స్వేచ్ఛ ఉండాలని ఆలోచించే మనుషుల మధ్య పుట్టి పెరగడం వేణి అదృష్టం. అలా పుట్టకపోవడం అనూరాధ దురదృష్టం. వాళ్ళిద్దరూ కలవటం మాత్రం యాదృచ్చికం.
“మొదట ఆమెకి నర్సు ట్రైనింగ్ ఇచ్చి హైదరాబాద్‍లో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరికి పంపిద్దామనుకున్నాను. వకుళ… నీకు తెలుసుగా? కానీ చంటిపాపతో ఒంటరిగా అంత పెద్ద సిటీలో బతకలేదనిపించింది. అమ్మకి చెల్లి వరసయ్యే ఒకావిడ వరంగల్ దగ్గర పల్లెటూర్లో ఉంటుంది. పిల్లలు లేరు. భర్త పోయాడు. ఆవిడకి ఇల్లు, కొద్దిపాటి డబ్బు ఉన్నాయి. ఈ మధ్యనే పక్షవాతం వచ్చి తగ్గింది. చేసుకోలేకపోతుంది. అనూరాధ గురించి చెప్తే పంపించమంది. అదే మంచిదనిపించింది” అంది కృష్ణవేణి..
“నీ ఇష్టం” అన్నాడు శ్రీరామ్.
చంటిపాపతో వెళ్ళిపోయింది అనూరాధ. అతనికి క్షమాపణలు చెప్పమని వెళ్లేముందు కృష్ణవేణితో అంది. మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు.


కృష్ణవేణి పెళ్లి చేసుకుంది. కాలిఫోర్నియాలో ఉండే ఒక వ్యాపారవేత్తని. హాస్పిటల్‍తోపాటు ఇంటిని గుడ్‍విల్‍తో లీజుకి ఇచ్చి వెళ్ళింది. శ్రీరాంని కూడా పెళ్లి చేసుకోమని పోరుతుంది. అనూరాధ విషయంలో సెంటిమెంట్లకి ఉద్వేగాలకి అతీతంగా ప్రవర్తించిన వైనం అతనిలోని సున్నితమైన భావాలని చంపింది. ఎంతగానో ఇష్టపడి చేసుకున్నాడు. ఆమెని. అలాంటిది ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చి, మానవీయ విలువలమీద నమ్మకాన్ని పోగొట్టి ఒక కలలాగా అదృశ్యమైంది. అతనిలో ఒక విధమైన జడత్వం చోటుచేసుకుంది.
తుషార పరిచయం అయ్యేదాకా అతను అలాగే ఉన్నాడు. ఆమె పరిచయం అతనిలో మళ్లీ స్పందన రేపింది. పిల్లతెమెరలా స్పృశించింది. తొలకరివానలా వర్షించింది. బీటలువారిన జీవితంలోకి మళ్లీ వసంతం వచ్చింది


శ్రీరామ్ వెంట వచ్చిన పూర్ణిమని కుతూహలంగా చూసింది తుషార. అతను కాకతాళీయం అనుకుంటున్న దాన్ని ఆమె సిక్స్త్ సెన్స్ అంది.
“మీకు ఆమెపట్ల అంతర్లీనంగా ప్రేమ ఉంది. అదే ఆ టైంకి మిమ్మల్ని అక్కడికి చేర్చింది” అంది
“కావచ్చు తుషారా! పెళ్లిచూపుల్లో చూసి మనసు పారేసుకున్నాను. పీటల మీద ఆమెని చూసి కలల్లో తెలిపోయాను ప్రేమేమీ నీరు కాదుగా ఆవిరై గాల్లో కలిసిపోవడానికి అదొక బీజం. నిద్రాణంగా ఉండి చైతన్యం” అన్నాడు.నిజమే! ఎంత అణచుకున్న జ్ఞాపకమేనా ఎప్పుడో ఒకప్పుడు చెలరేగక మానదు. ఎంతటి ద్వేషమైనా. చల్లారుతుందేమోగానీ అణువంతైనా ప్రేమ అజరామరమైనది.
“ఏమి చేద్దాం ఈ అమ్మాయిని” అడిగింది.
“నీ ఇష్టం” తేలికగా అనేసాడు. “ఆరోజుని అనురాధని వదిలేసి ఎలా రాలేకపోయానో ఈరోజుని పూర్ణిమని కూడా అంతే. పసిపిల్ల, ఒక్కత్తే ఎలా బతుకుతుంది? అనాథని అనాథగా వదిలేస్తే సమాజానికి శాపం అవుతుంది. ఆశ్రయం ఇచ్చి ఆధారం చూపిస్తే వ్యవస్థలో భాగమౌతుంది” అన్నాడు.
లేత వయసులో తండ్రి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టం గురించి చెప్పిన పాఠం అతని మనసులో చాలా లోతుగా ఇంకింది. ఆ చెమ్మ ఎప్పటికీ ఆరదు. దాన్నే అతను మానవత్వం అనుకుంటున్నాడు. పూర్ణిని అక్కడే వదిలేస్తే ఏమయ్యేదో అతనికి తెలుసు. ఆ విషయం తుషార కూడా ఊహించగలదు. కానీ ఈ అంతటితో ఆమెకేం సంబంధం?
పూర్ణిని ఇంట్లోనే ఉంచాలా, హాస్టల్లో వెయ్యాలా అనే విషయంమీద తుషార ఇంకా నిర్ణయించుకోలేకపోతోంది. ఆ పిల్లని చూస్తుంటే జాలీ, ద్వేషం రెండూ కలుగుతున్నాయి. ద్వేషం అకారణమైనదనీ, తెలుసు. అయినా దాన్ని జయించలేకపోతోంది. రెండురోజులు గడిచాయి. శ్రీరామ్ పట్టించుకోక, తుషార పలకరించక బిక్కుబిక్కుమని గడుపుతోంది పూర్ణి.
“అనూరాధ కూతుర్నేం చేసావ్?” కృష్ణవేణి కాలిఫోర్నియానుంచి అడిగింది.
“ఇంట్లోనే ఉంది. ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు”
“బాస్టర్ద్శ్ ఆర్ అవుట్ ఆఫ్ లవ్ అన్నాడు ఆస్కార్ వైల్డ్. అంతకన్నా ఖచ్చితమైన నిజం చెప్పనా??”
“ఏమిటది?”
“ప్రేమికులు ప్రేమని అనుభవిస్తారు. సమాజం వాళ్ల ప్రేమ ఫలితాన్ని అనుభవిస్తుంది. కదా?”
“…”
“సమాజంలో ఇప్పుడున్న ఈ అసంబద్ధతలన్నిటికీ కారణం అప్పుడెప్పుడో నువ్వన్నట్టు కొందరు వ్యక్తులు హద్దులని దాటడంవలన. అస్వతంత్రురాలైన అనూరాధ ఎందుకు ప్రేమించాలి? ఈ పిల్లనెందుకు కనాలి? కన్నాక బతకడంకోసం పోరాడక చావు దిశగా ఎందుకు ప్రయాణించాలి? ఎలా ఉంటోందో పూర్ణిమ? నిలువ నీడ లేక… ఆదరించేవాళ్లు, ప్రేమించేవాళ్లు లేక… రేపు ఏమవుతుందో తెలీక నిస్సహాయంగా ఏడుస్తూ… అలా ఏడవాలని తెలీని అయోమయంలో కొట్టుకుంటూ…. శ్రీరామ్, తుషారకి ఇష్టంలేదట పూర్ణిము మీమధ్యని ఉండటం”.
చివరి మాటలు విని ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్, “ఎందుకట?”
“స్పష్టమైన కారణం ఏదీ లేదట”
తర్వాత ఇద్దరూ వ్యక్తపరిచింది మౌనమేగానీ దాని వెనుక అవ్యక్తమైన ఆవేదన ఉంది. కొద్దిసేపటి తరువాత అంది కృష్ణవేణి.
“”యురెత్రాలోంచీ వోవంని చేరుకున్న స్పెర్మ్ జైగోట్‍గా మారి, ఫీటస్‍గా ఎదిగి, మానవశిశువుగా జన్మించడానికి ప్రకృతి ఎంతో శక్తిని వినియోగిస్తుంది. ఒక శోణిత శుక్రకణం రెండుగా, నాలుగ్గా, ఎనిమిదిగా… నిరంతరాయంగా విభజించుకుంటూ వెళ్లి పరిపూర్ణ ఆకృతిగల మనిషిగా రూపుదిద్దుకోవడం ఎంతో అద్భుతమైన ప్రక్రియ.. అది మన చేతుల్లో లేనిది. చూస్తూ చూస్తూ ఒక గాజు బొమ్మని పారేయలేము. చిన్న వస్తువు… ప్రాణంలేని ఆకృతి పాడైతేనే బాధపడతాము. అలాంటిది ప్రాణం ఉన్న మనిషి గురించి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నామో తెలియడం లేదు”
“నన్ను ఏం చేయమంటావు? పూర్ణిని దగ్గర ఉంచుకోవడం తుషారికి ఎందుకు ఇష్టం లేదట?” అసహనంగా అడిగాడు శ్రీరామ్.
“ముందు ఇది చెప్పు. ఈ రెండు రోజుల్లో పూర్ణితో నువ్వు ఎన్నిసార్లు మాట్లాడావు? దగ్గరికి తీసుకుని ఎంతసేపు వోదార్చావు?”
“వే…ణీ!”
“నిన్ను తప్పుపట్టడంలేదు. నీకు లేని బాధ్యత తనకి ఎందుకుంటుంది? అనవసరపు బాదరబందీ. అనిపిస్తోంది. నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వేరు. నిర్ణయం కూడా ఆమెకే వదిలేస్తే ఎలా?”
“…”
“ఇక్కడివాళ్లు ఆసియా పిల్లల్ని పెంచుకుంటారు. నాకు తెలిసిన భార్యాభర్తలతో మాట్లాడాను. పూర్ణి క్షేమంగా ఉంటుంది. వాళ్లకి కూడా ప్రేమించడానికి, ప్రేమించబడడానికి ఎవరో ఒకరు కావాలి. పంపించు. ఆలోచించకు” అంది.
“అప్పుడూ ఇప్పుడు నువ్వే ఆదుకున్నావు” అన్నాడు శ్రీరామ్. వేణి నవ్వి ఫోన్ పెట్టేసింది.
పూర్ణి తమ మధ్యనుంచి వెళ్లిపోతున్నందుకు తుషార సంతోషపడింది. ఎక్కడో అట్టడుగున అపరాధభావన కూడా కలిగింది. ఒక పసిపిల్లను తను ప్రేమించలేకపోవడానికి, ఆమె ఉనికిని భరింలేకపోవడానికి గల కారణం ఏమిటో అర్థం అవ్వలేదు.
గాలికి కొట్టుకొచ్చిన గడ్డిపరకలా ఈ భూమ్మీద పడిన పూర్ణి తన ఉనికిని స్థిరపరుచుకునేందుకు యూఎస్ బయలుదేరింది.
(ఇండియా టుడే 2003)