ఆవిడ మా అమ్మే by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

(సి.పి. బ్రౌన్ అకాడమీ 2009లో నిర్వహించిన పోటీలో బహుమతి పొందిన కథ)
కొందరు వ్యక్తుల పరిచయాలు వాళ్ళు చనిపోయిన తర్వాతే జరుగుతాయి. వాళ్ళ అంతరంగంలోని కోరికలు, వాళ్ళ ప్రవర్తన వెనకాల వుండే నిగూఢమైన కారణాలు వాళ్ళు గతించాక బహిర్గతమౌతాయి. అప్పుడు వాళ్ళు మనకి కొత్తగా పరిచయమౌతారు.
అమ్మ చనిపోయి నెలదాటింది. దినకర్మలనుంచీ నెలమాసికాలదాకా రోజులు సాగాయి. ఆమె అమ్మగానే తెలుసు. ఒక ఉమ్మడి కుటుంబంలో పుట్టి, మరో ఉమ్మడి కుటుంబానికి మెట్టి, తనో ఎనిమిదిమంది సంతానాన్ని కని, వాళ్ళ మంచిచెడ్డల్లో తను భాగమై ఇందరికి ఆలంబనగా నిలబడ్డ వ్యక్తిగా, క్లుప్తంగా చెప్పాలంటే ఈరోజుకి ఎనభయ్యేళ్ళు బతికిన మధ్యతరగతి స్త్రీ ఎంత సాదాగా బతుకుతుందో అలా… అందరికీ సర్వసాధారణంగా వుండే అనుభవాలనే తనూ అనుభవిస్తూ ఏ ప్రత్యేకతా లేకుండా బతికి పండుటాకులా రాలిపోయిన అమ్మగానే నాకు తెలుసు.
ఎవరికి అవసరం వచ్చినా “ఓ వారం రోజులు వచ్చి వుండవే!” అని నిర్మొహమాటంగా ఆమెని పిలుచుకుని వెళ్ళి చేయించుకున్నాం. ఆవిడ ఎప్పుడూ కాదనలేదు. తనకి ఓపిక లేదనలేదు. చాతనైనంతవరకూ చేసింది. తన పిల్లలని పెంచుకుంది. మా పిల్లలనీ… మనవల్నీ కూడా పెంచింది. చాలా సంతృప్తితోనూ, సునాయాసంగానూ చనిపోయింది.
నా దగ్గిరే వుండేది. ఎవరిళ్ళకి వెళ్ళినా తిరిగితిరిగి ఇక్కడికి వచ్చేది.
“మేమూ పిల్లలుగలవాళ్ళం… తృణమో పణమో ఆవిడది కలిస్తే మాక్కాస్త ఆసరా. ఆవిడేమో మాదగ్గర వచ్చి వుండమంటే వుండరు” అంది తమ్ముడి భార్య ఒకసారి. అమ్మ తదనంతరాలమీద తనకీ హక్కుంటుందన్న విషయం గుర్తుచేస్తున్నట్టుగా. గాజులూ, గొలుసూ ఆవిడకిగల వెలకట్టగల ఆస్తి. వాటి గురించి నా భార్యకీ, మిగిలిన కోడళ్ళకీ, ఆడపిల్లలతో గొడవైంది. అమ్మవి కాబట్టి ఆడపిల్లలకి రావాలన్నారు వాళ్ళు. ఇతరత్రా ఆస్తులేమీ లేవు, కర్మా అదీ చెయ్యాల్సినది మగపిల్లలు కాబట్టి తమకి రావాలన్నది కోడళ్ళ వాదన. ఆఖరికి గాజులు వాళ్ళు నలుగురు, గొలుసు వీళ్ళు నలుగురూ పంచుకునేట్టు ఒప్పందమైంది. అమ్మ పోయాక జరిగినా, ఇది కూడా ఆవిడకి సంబంధించిన అనుభవంలోని భాగమే.
ఆవిడ చీరల్లో ఖరీదైనవి అందరూ పంచుకున్నారు. మామూలువి పనిమనిషికి ఇచ్చేశారు. ఆవిడపరంగా ఇంకేవీ మిగిలిలేదు. పాత ట్రంకుపెట్టె వుంది. అందులో విలువైనవి ఏమీ లేవుగానీ వున్నవేమిటో చూసి ఖాళీచెయ్యాలి. ఆ పనిమీదే వున్నానిప్పుడు.
నాన్న కళ్ళద్దాలు, నా చిన్నప్పటి చొక్కా, పెద్దక్కవి కాబోలు రబ్బరుగాజులూ, ఒక బూరా, ఇంకా పిల్లలకి సంబంధించినవి ఇలాంటివి ఏవో వున్నాయి. అమ్మకి పిల్లలంటే ఎంత ప్రేమ! మా చిన్నప్పటి వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంది! నా మనసులో ఎక్కడో కదలిక. మాకూ మా పిల్లలమీద ప్రేమ వున్నా వాళ్ళ బాల్యపు గుర్తుల్ని మేం ఇలా దాచుకోలేదు. ఈ వస్తువులన్నిటితోపాటు పాతపత్రిక. అదీ ఒక జ్ఞాపకానికి చిహ్నమై వుంటుంది.
పెట్టెలో వస్తువులు పారెయ్యడానికి మనసు రాలేదు. ఓ మూల అలా వుండనివ్వమని వదిలేసి, పుస్తకం చేత్తో పట్టుకుని ఇవతలికి వచ్చాను. చాలా పాతపత్రిక అది. స్వరాజ్యవీణాపాణి దాని పేరు. ఎనిమిదో సంపుటి, ఆరో సంచిక. ముతగ్గా వున్న కాగితం… పాతబడి పచ్చబడినా ఎందుకో అమ్మ జాగ్రత్తగా దాన్ని దాచుకుంది. చాలాసార్లు తీసి చూసినందుకో, చదివినందుకో బాగా నలిగింది. యధాలాపంగా పేజీలు తిరగేశాను. స్వతంత్రం రాక ముందప్పటిది. సంపాదకీయం, కథలూ అన్నీ పరాధీనత చుట్టే వున్నాయి. ఆ రోజుల్లోకి తొంగి చూస్తున్న భావన కలిగింది.
అందులో ఒక కథ… రచయిత్రి భానుమతీదేవి… పేరు ఎఱ్ఱసిరాతో అండర్లైన్ చేసి, వుంది. నేను పుస్తకాలు బాగా చదువుతాను. ఆ పేరుగల రచయిత్రి నాకెప్పుడూ తటస్థపడలేదు. ఆవిడ రచనలు నేనేవీ చదవలేదు. అసలావిడ పేరుకూడా వినలేదు. అమ్మ అంత జాగ్రత్తగా దాచుకుందంటే బహుశ స్నేహితురాలో, ఆవిడని బాగా ప్రభావితం చేసిన పరిచయస్థురాలో అయుంటుందనిపించింది. మొదటి వాక్యంతోనే నన్ను ఆకట్టుకుంది. ఎంత అందమైన భావయుక్తమైన వాక్యం అది
“ప్రతి వీడ్కోలూ ఇంకెక్కడో స్వాగతానికి ఆహ్వానపత్రిక”
ఆ కథ చదవకుండా వుండలేకపోయాను. కథ బావుందని మరోసారి, శైలికీ శిల్పానికీ నివ్వెరబోతూ ఇంకోసారి… అలా ఆరేడుసార్లు చదివేశాను. చదువుతున్న ప్రతీసారీ కొత్తగానే అనిపించడం అందులోని విశేషం. చాలాసేపటిదాకా తేరుకోలేకపోయాను. అదొక అద్వితీయమైన, అనిర్వచనీయమైన అనుభూతి.
బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీతోపాటు వ్యాపారానికి వచ్చిన కుటుంబం. కాలం గడుస్తున్నకొద్దీ తమ దేశం భారతదేశాన్ని ఎలా దోచుకుంటోందో చూస్తూ చలించి పోతుంటారు. ఆ ఆలోచనాశైలిని వంటబట్టించుకున్న వారి కుటుంబంలో కొన్నితరాల తర్వాత పుట్టిన ఒక యువకుడు…
ఇటు బాహటంగా తమ దేశానికి వ్యతిరేకంగా స్వతంత్రపోరాటంలో పాల్గొనలేక, అటు తను పుట్టి పెరిగిన ఈ దేశాన్ని పరాయిదని అనుకోలేక తీవ్రంగా సంఘర్షించి ఆఖరికి స్వరాజ్యోద్యమంలో చేరాలని నిర్ణయించుకుంటే అతన్ని ఇక్కడివాళ్ళు నమ్మరు. అలా చేరాలనుకున్నందుకు తన దేశపు ప్రభుత్వంనించీ అభిశంసన ఎదుర్కొంటాడు. ఆఖరికి తనంతట తనే ప్రాణం తీసుకుంటాడు. దాన్నతను ఆత్మహత్య అనడు. ఈదేశ ప్రజలకోసం ప్రాణార్పణ చేశానంటాడు. ముగింపు ఎలాంటి కృతకతా లేకుండా అద్భుతంగా వుంది.
అమ్మ ఇంత వుచ్చస్థాయిలో వున్న కథని చదివి అర్ధంచేసుకోగలిగిందా? నాకు విస్మయం కలిగింది. నమ్మకం కలగలేదు. ఆ పుస్తకం… అందులోని ఆ కథ… అండర్లైను చెయ్యబడ్డ రచయిత్రి పేరు… ఇవన్నీ పెద్ద పజిలే.
కథ నన్ను కొద్దిరోజులు వెంటాడింది. మరోరెండుసార్లు చదివి నా అనుభూతుల్ని రిఫ్రెష్ చేసుకున్నాను. పంచుకోదగ్గ మిత్రులతో దాన్నిగురించి చర్చించాను. చాలామందిచేత చదివించాను.
“కొన్ని ప్రముఖ పత్రికలు పాతకథలని ముద్రిస్తున్నాయి. దీన్ని పంపిస్తే తప్పక ప్రచురిస్తారు” ఒక మిత్రుడు అన్నాడు.
నాకుగల పరిచయాల పరిధులని వెతుక్కున్నాను. ఒకతను తెలుసు. అతను మధుర అనే పత్రికలో పని చేస్తాడు. అతనికి పంపించాను. అమ్మ జ్ఞాపకంగా దాన్ని ప్రచురించమని కోరాను. అతను దాన్ని చదివి నాలాగా దిగ్భ్రాంతుడయ్యాడు.
“భానుమతీదేవి అనే రచయిత్రి వుండేదని, ఆవిడ ఒక కథ రాసిందనీ, అప్పట్లో ఆ కథ చాలా సంచలనాన్ని సృష్టించిందనీ మా నాన్నగారు నాతో ఒక సందర్భంలో అన్నారుగానీ, నేను ఎంత ప్రయత్నించినా కథ దొరకలేదు. మీకెక్కడిదండీ?” అని ఫోన్ చేసి ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పించాడు.
అమ్మదగ్గిర దొరికిందని చెప్పడానికి నాకు బిడియంగా అనిపించింది. చాలా వున్నతస్థాయి వాళ్ళని ఇప్పటికీ కుదిపిన ఆకథ అమ్మదగ్గిర దొరికిందంటే ఆవిడ ఎంత గొప్ప పాఠకురాలో అనుకునే ప్రమాదం వుంది. అమ్మకిలేని గొప్పతనాన్ని ఆపాదించలేను. నేను ఇబ్బందిలో పడలేను. పాతసామాన్లు సర్దుతుంటే దొరికిందని చెప్పేశాను.
కథ గురించి చాలాసేపు చర్చించుకున్నాము.
“ఒకే ఒక్క నవల… కాలాతీత వ్యక్తులు రాసి కాలానికి నిలిచిపోయారు శ్రీదేవి. ఇంతగొప్ప కథ రాసీ ఎందుకో కనుమరుగైపోయారు భానుమతీదేవి. కథలోని వాస్తవాలు ఈరోజుకీ మన సమాజానికి వర్తిస్తాయి. వెయ్యేళ్ళ క్రితం ఈ దేశానికి వచ్చినవారి సంతతికి చెందికూడా ఇంకా తాము వేరే అనుకుని దేశ వినాశకచర్యలకి దోహదం చేస్తున్నవాళ్ళు ఎందరో వున్నారు” అన్నాడు.
కథ మళ్ళీవారం పత్రికలో వచ్చేలా చూస్తానన్నాడు. అలాగే ప్రచురింపబడింది. దాన్ని డీటీపీలో అందమైన కాగితంమీద చదువుతుంటే మనసు మైమరచింది. అనుకోని ఒక స్పందన… ఒక పాఠకుడి నుంచీ.
“ఈ కథానుభవంలో నాకూ కొంచెం భాగం వుంది. ఆవిడ నాకు వ్యక్తిగతంగా తెలుసు. దాదాపు నలభయ్యేళ్ళ క్రితం నా పెద్దకూతురి పెళ్ళి సంబంధానికని వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడి భార్యగా చేతిలో ఎడపిల్లా, కొంగుపట్టుకుని తిరుగుతున్న పెడపిల్లా, చంకని నెలల పిల్లాడితో గర్భవతిగా వున్న ఆవిడ్ని చూశాను, నుదుట రూపాయికాసంత కుంకుమబొట్టూ, ముక్కుకి బేసరి, చెవులకి పెద్దపెద్ద రాళ్ళకమ్మలూ వున్నాయి. చేతులనిండా గాజుగాజులు, కాళ్ళకి అందెలూ… జుత్తు ముడిచుట్టుకుంది. ఏడుగురేమో పిల్లలు. అప్పటికి ఆవిడని నాకు తెలీదు. ఆవిడ భర్త నా స్నేహితుడు, పదో తరగతిదాకా కలసి చదువుకున్నాం.
నన్ను సస్నేహంగా ఆహ్వానించాడు నా మిత్రుడు. కుశలప్రశ్నలూ, భోజనాలూ అయ్యాయి. ఆ ఊళ్ళో అతను చాలా పలుకుబడిగలవాడు. ఎవరెవరో వస్తున్నారు. మాకు అంతరాయం కలిగిస్తున్నారు. అతను ఇబ్బందిపడుతున్నాడు. చాలాకాలానికి కలుసుకున్నందుకు నన్ను వదిలి పెట్టలేకపోతున్నాడు.
నువ్వెళ్ళి వ్యవహారాలు చూసుకుని రా! రాత్రికి మాట్లాడుకుందాం. నీతో మాట్లాడాకే నేను వెళ్తాలే

అని హామీ ఇచ్చాను.
నన్ను విశ్రాంతి తీసుకొమ్మని అతను వెళ్ళేడు. నాకు విశ్రాంతికి గది చూపించింది అతని భార్య. అప్పుడూ ఆమె చుట్టూ పిల్లలే, పిల్లలకోడి గుర్తొచ్చింది.
మీరు కథలవీ రాస్తుంటారటగా? మామయ్య చెప్పారు- అంది. వాళ్ళది మేనరికం. నాగురించి అతనలా చెప్పినందుకు గర్వంగా అనిపించింది. తలూపాను. ఆమె కళ్ళలో ఏదో దిగులు. నాకర్ధమవలేదు. ఒక పత్రిక తెచ్చి నాకిచ్చింది.
ఇందులో భానుమతీదేవి రాసిన కథ చదవండి-అంది. నేనప్పటికే ఆ పత్రిక చదివేను. ఆవిడ చెప్పిన కథనీ, దానిమీద వచ్చిన చర్చలనీ చదివేను.
మీరు పుస్తకాలు చదువుతారా? -ఆశ్చర్యంగా అడిగాను. ఆమె జవాబివ్వలేదు.
ఆ కథ చదివేరా?… మీరు??!! – మళ్ళీ అడిగాను.
నేనే రాశాను -అంది నిర్లిప్తంగా.
నేను అపనమ్మకంగా చూశాను. అది అపనమ్మకమూ కాదు, విస్మయమూ కాదు. ఎన్నో భావాల కలగలుపు. అవన్నీ నా ముఖంలో కనిపించాయేమో, ఆమె దెబ్బతిన్నట్టు చూసి అంతలోనే సర్దుకుని తలత్రిప్పేసుకుంది.
మీకు నమ్మకం కలగడంలేదేమో, దాన్ని నేనే రాశాను- అంది గట్టిగా. ఆమెని బాధపెట్టినందుకు నేను నొచ్చుకున్నాను. కానీ ఆవిడ ఆ కథ రాయడమనేది ఇంకా నాకు అసంగతమైన విషయంగానే అనిపిస్తోంది.
నమ్మించలేకపోతున్నాను. కానీ నిజం, ఆ తర్వాత మరేమీ రాయలేదు. అసలు నేను అక్షరాలు మర్చిపోయి చాలా యేళ్ళైంది. ఈ ఇంట్లో అడుగుపెట్టాక దీన్ని తప్పించి మరో పుస్తకాన్ని చూడలేదు- గొణుక్కుంది. ఆమె చెప్తున్న తీరునిబట్టి ఇక నమ్మక తప్పలేదు. నేను విభ్రాంతుడినయాను. ఆమె చెప్పినది నిజమేనా? ఇంత మంచికథని ఈమె రాసిందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అబద్ధం చెప్పినా నిజమేననిపించేంతగా నటిస్తూ?
కథ గురించి తెలుసుకోవాలని వుంది- కుతూహలంగా అడిగాను.
ఆమె కథ గురించి… ఆమె మాటల్లో…


నాకప్పుడు పద్నాలుగేళ్ళు. నలుగురు మగపిల్లల తర్వాత కలిగిన సంతానాన్ని. చాలా అపురూపంగా పెంచారు. ఐదోతరగతిదాకా చదివించారు కూడా. నాకు మూడేళ్ళప్పుడే వెళ్ళింది. మేనమామనే చేసుకున్నాను. మనవరాలినిగాబట్టి పెద్దయ్యేదాకా పుట్టింట్లోనే వుంటానన్నా, ఎవరూ పెద్దగా ఆక్షేపించలేదు. కానీ స్కూలుకెళ్ళి చదువుకుంటానంటే అమ్మకీ, అమ్మమ్మకి కూడా ఇష్టంలేకపోయింది.
నాన్నకి ఎదురుచెప్పడం బావోదని, అలా ఎదురుచెప్పి అమ్మ కాపురానికి ఇబ్బంది కలిగించడం దేనికని అమ్మమ్మ వూరుకుంది. నాకు వేరే పేరున్నా, భానుమతి అని పిలిచేవారు నాన్న. ఆ పేరంటే తనకి ఇష్టమట.
నాన్న బాగా చదువుకున్నారు. చదువుకున్న అల్లుడని అంతా మురిసిపోయారుగానీ ఆయనకి కొన్ని వేరే ఇష్టాలూ వుంటాయని కొంచెం వేరేగా ఆలోచిస్తారనీ అప్పుడనుకుని వుండరు. చదువుకున్నా చదువులేని యితరుల్లాగే ఆలోచించడాన్నీ, ప్రవర్తించడాన్నీ సాంప్రదాయం నిలబెట్టడం అంటారు. నాన్నకి నన్ను బాగా చదివించాలని వుండేది. సోషల్‍గా నలుగుర్లోనూ తిప్పాలని వుండేది. అందుకు అమ్మనించి వచ్చిన అభ్యంతరాలని తను పట్టించుకునేవారు కాదు.
అందరిళ్ళలో వసారాలూ, మండువాలూ వుంటే మా ఇంట్లోగదులకి హాలూ, డ్రాయింగురూంలాంటి పేర్లుండేవి. ఇంట్లో కాఫీ టీలు తాగటానికి పింగాణీ సామాన్లసెట్టు వుండేది. దాన్ని ఎప్పుడూ వాడగా నేను చూడలేదు. అమ్మ జాగ్రత్తగా పేముబుట్టలో పాతబట్టల్లో సర్ది వుంచింది పగిలిపోతాయని. ఎప్పట్లాగే డ్రాయింగ్‍రూంలో కూర్చుని నేనూ, ఇద్దరన్నయ్యలూ క్యారమ్స్ ఆడుతున్నాం. సుందరం హడావిడిగా వచ్చాడు. హడావిడికీ సుందరానికీ ఎడం లేదుగాబట్టి మేం అతని హడావిడిని గుర్తించం. అతను రాగానే అన్నయ్యలు వెళ్ళిపోయారు. వాళ్ళకి అతని మాటలు విసుగు. నేను, నాన్న మిగిలాం.
“ఏంటోయ్, విశేషాలు?” నాన్న అడిగారు.
“ఇంకో నాలుగురోజుల్లో జైలుకెళ్ళే అదృష్టం నాకూ పడుతుందేమోనండీ!!” అన్నాడు సుందరం. అతని మాటల్లో దిగులేదు. కొత్త అనుభవాన్ని పొందబోతున్న ఉత్సాహం కనిపించింది.
“మా నాన్న నన్ను జైలుకి పంపే ప్రయత్నం చేస్తున్నాడండీ! ఓ మాటు వెళితే సత్యాగ్రహం, కాంగ్రెసూ అన్నీ వదిలేసి మామూలుదార్లో పడతానని ఆయన ఆలోచన. ఐతే అలా జరగదు కాక జరగదు” అన్నాడు ఆవేశంగా. అతనిలోవున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎప్పుడూ అతనే వక్తగా వుంటాడు. ఐనా ఎదుటివాళ్ళకి తనూ మాట్లాడుతున్నట్టుంటుంది తప్పితే మౌనంగా కూర్చున్నట్టుండదు.
సుందరం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు గమ్మత్తుగా వుంటాయి. అతను గాంధీవాది. తండ్రిది బ్రిటీష్ గవర్నమెంటుకింద ఉద్యోగం. మంచి వుద్యోగమే. స్వంతకొడుకే కాంగ్రెస్‍లో వుంటే ఉద్యోగానికి ఎక్కడ ముప్పొస్తుందోనని ఆయన భయం. ఎన్నివిధాల చెప్పినా సుందరం వినడు. తండ్రినే ఉద్యోగం వదిలెయ్యమంటాడు. వాళ్ళిద్దరి మధ్యా సామరస్యం నీటిమీద గీయబడ్డ గీతలా రాయబడుతూ, చెరుగుతూ, మళ్ళీ రాయబడుతూ, మళ్ళీమళ్ళీ చెరుగుతూ వస్తోంది. సుందరం తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వచ్చేసి వేరే వుంటున్నాడు. ఇదిప్పుడింక రాయబడేది ఇంకో గీతో, చెరిపివేతో మరి!
సుందరం తన బాధంతా నాన్నతో చెప్పుకుంటాడు. నాన్న తను ఈ పార్టీకి చెందిన వ్యక్తినని చెప్పుకోగా ఎవరూ వినలేదు. అందుకేనేమో సుందరం తండ్రికూడా తన బాధ ఆయన్తోనే చెప్పుకుంటాడు.
దాదాపు గంటసేపు దేశాన్ని గురించి, తన ఆశల గురించీ, గాంధీగారి కలలగురించీ, తండ్రి గురించి చెప్పి ఆయనలాంటివాళ్ళు ఎలాంటి ఆటంకవాదులో చర్చించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే అమ్మ నన్ను లోపలికి పిలిచి దెబ్బలాడింది.
“పరాయిమగవాళ్ళతో నీకు కబుర్లేమిటి? అతను రాగానే లేచి లోపలికి వచ్చెయ్యలేవూ? ఐనా ముందు గదిలో మగవాళ్ళతో సమానంగా నువ్వూ కుర్చీలెక్కి కూర్చోవడమేమిటి? అమ్మమ్మకి తెలిస్తే నిన్నసలు వాళ్ళు ఏలుకుంటారా” అంది. సుందరాన్ని పరాయిమగవాడడం నాకు నవ్వు తెప్పించింది. అన్నయ్యలంత ఆత్మీయుడతను. ఈ నలుగురికీ, అతనికీ తేడా తెలీదు. నేను నవ్వేసి అక్కడినుంచీ వెళ్ళిపోయాను.
నా మనసునిండా సుందరాన్ని గురించిన ఆలోచనలే. క్రమంగా అవి రూపాంతరం చెందుతూ ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నాయి. సుందరం భారతీయుడు కాబట్టి అతను దేశస్వాతంత్య్రంకోసం పాటుపడడంలో అర్థం వుంది. అదే రెండుమూడుతరాలక్రితం ఈ దేశానికి వచ్చిన బ్రిటీష్ యువకుడు ఈదేశానికి తమ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్నీ, అన్యాయాన్నీ గుర్తిస్తే… భారతీయులకి మద్దతుగా తిరుగుబాటు చేస్తే? నా ఆలోచనలు ఎటుదారితీస్తున్నాయో నాకు తెలీడంలేదు.
ఒక ఉద్వేగం… పెన్ను, నోట్సు తీసుకున్నాను. కాగితాలమీద నా చేతివేళ్ళు పరుగులు తీశాయి. అలా దాదాపు రెండుగంటలు… అలిసిపోయి అలాగే పడుక్కుండిపోయాను. నిద్రలేచి చూసేసరికి నేను రాసిన పుస్తకం లేదు. అదేదో తప్పుపనిలా అనిపించి నేను ఇంక దానిగురించి పట్టించుకోలేదు. నాన్న ఒకటి రెండుసార్లు నాకేసి ఆపేక్షగా చూడడం గమనించాను. నెల తర్వాత ఆ ప్రత్యేక అపేక్షకిగల కారణం తెలిసింది.
“భానూ! భానూ!” అని పిలుస్తూ లోపలికి వచ్చారు. అమ్మ దగ్గిర కూర్చుని అమ్మమ్మావాళ్ళింటి కబుర్లూ, ఈ శ్రావణంలో ఇంక నేను అత్తవారింటికి వెళ్ళాలన్న ప్రతిపాదనలూ, నాపట్ల అమ్మమ్మకిగల ఆకాంక్షలూ వింటూ కూర్చున్న నేను నాన్నకి ఎదురెళ్ళాను.
“చూసుకో” అంటూ స్వరాజ్యవీణాపాణి పత్రికని నాచేతికిచ్చారు.
ఏం చూసుకోవాలో తెలీకపోయినా గబగబ నాలుగు పేజీలు తిరగేశాను. ఒక పేజీలో భానుమతీదేవి అనే అక్షరాలు పెద్దగా అచ్చువేసి వున్నాయి. దాన్ని చుట్టుకుని నేను రాసిన కథ. నేను సంభ్రమంగా పేజీలు తిప్పుతూ నేను రాసినదాన్నే మళ్ళీమళ్ళీ చదువుతూ వుంటే అమ్మ సర్పద్రష్టలా నిలబడిపోయింది.
“ఏం పని చేశారు మీరు? ఆడపిల్ల పేరు అచ్చేయిస్తారా? అది అత్తారింటికెళ్లి కాపరం చెయ్యక్కర్లేదా” అని ఒకటే ఏడుపు.
ఆ ఏడుపు… ఏడుపు… మంచిరోజు చూసుకుని అమ్మమ్మ దగ్గిరకి నన్ను అంపకం పెట్టేదాకా వూరుకోలేదు. శ్రావణందాకా కూడా ఆగలేదు. కొద్దివ్యవధిలోనే ఐనా ఘనంగా సారీ అవీ ఇచ్చి పంపించారు. నాన్నని వాళ్ళు ఆక్షేపించే పనులేవీ నేను చెయ్యకూడదనీ, నాన్న ఎలాంటి పోకళ్ళు పోయినా అత్తారింట్లో తనకి చాలా మంచి పేరుందనీ, నేనూ అలాగే ప్రవర్తించి నా అత్తవారింట్లో మంచిపేరు తెచ్చుకోవాలనీ చెప్పింది. అలాగని అమ్మ నాచేత వాగ్దానం చేయించుకుంది. నాన్న పుస్తకంలో నాపేరు అచ్చేయించినట్టు చెప్పొద్దని కూడా మాట తీసుకుంది.
అత్తవారింట్లో నన్ను వదిలేసి వెళ్తూ నాన్న చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను… సర్వం కోల్పోయినట్టూ, ఆశలన్నీ వదులుకున్నట్టూ చూశారు. సాంప్రదాయం అనే సంకెళ్ళకి మగవాళ్ళూ మినహాయింపు కాదు. కాబట్టే మూడేయేట నా పెళ్ళిని ఆపలేకపోయారు. పధ్నాలుగోయేట కాపురాన్ని కూడా.
నాన్న ఎదురీదలేకపోయిన సాంప్రదాయాన్ని నేనూ ఎదురీదలేనని ఆ చిన్నవయసులోనే గ్రహించాను.
మామయ్యన్నా, పెళ్ళన్నా నాకు విముఖతలాంటిదేమీ తెలియకపోయినా, ఆ ఊరు చాలా చిన్న పల్లెటూరవడం ఆ ఇల్లు మా ఇంటిలా అధునాతనంగా వుండకపోవడం నాకు కొంత ఇబ్బందిని కలిగించాయి. ఆ ఊరంటేనే పొగచూరిన వంటిల్లూ, బడితెల్లాంటి పదిమంది పాలేర్లూ, నిరంతరం వెలుగుతుండే గాడిపొయ్యీ గుర్తొస్తాయి నాకు. అంతేగానీ, అక్కడి మల్లెపూలూ, అరచేతులంతంత పూసే చేమంతిపూలూ, పచ్చటి పొలాలూ కాదు. ఏదో నిస్పృహ ఆవరించింది. కానీ సాంప్రదాయపు శిక్షణ చాలా బలమైనది. మనిషి ఇష్టానిష్టాలకన్నా బలమైనది. ఒక నియంతలా మనని మనకు దూరంగా జరిపి శాసించగలదు.
మనవరాలినని నాకు కొంతముద్దూ, కొన్ని మినహాయింపులూ వున్నా, ఇల్లూ సంసారం నన్ను తనలోకి లాక్కున్నాయి. వంటిల్లే నాకు బడైపోయింది. నన్ను చూడాలని రెండుమాట్లు అమ్మ వచ్చింది. అన్నయ్యలు వచ్చి వెళ్ళారు. నాన్న రాలేదు.
“నీ కూతురు ఇక్కడేం కష్టపడిపోవట్లేదు. రావయ్యా! అది నిన్ను చూడాలని కలవరిస్తోంది” అని అమ్మమ్మ పరిహాసంతో కూడిన ఆహ్వానాలూ, నా కన్నీటి వేడుకోళ్ళూ వెళ్ళాక నాన్న నన్ను చూడడానికి వచ్చారు..
“మళ్ళీ ఏమైనా రాశావమ్మా? రాస్తే నాకివ్వు నేను పంపిస్తాను” అడగలేక అడిగారు. నేను తెల్లమొహం వేశాను. కొత్తకాపురపు సంరంభంలో నేనివన్నీ మర్చిపోయాను. మర్చిపోవడం చాలా హాయిని కలిగించింది.
“అమ్మా! దైవదత్తమైన కళ నీది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యద్దు. పెద్ద చదువులు చదువుకోలేకపోయానని దిగులుపడకు. నీ మనసుకే ఆలోచన వచ్చినా దాన్ని కాగితం మీద పెట్టు” అంటూ ఇంత కాగితాలబొత్తి కొనిచ్చి, తన పెన్ను కూడా ఇచ్చారు. ఆ వస్తువుల్ని ఇంట్లో అంతా వింతగా చూశారు.
“అవెందుకే?” నా భర్త ఆశ్చర్యంగా చూశాడు. అత్తయ్యలూ, మిగిలిన మామయ్యలూ కూడా అలాగే చూశారు. అందరికీ నవ్వులాటగా అయిపోయింది. నాన్నంటే వాళ్ళకి ప్రేమ వుందిగానీ గౌరవం లేదు. చిన్నపిల్లాడిని చూసినట్టు చూస్తారు.
“మీ నాన్న ఇచ్చిన సారి”” అని ఒకటే పరిహాసాలు…
ఆ తర్వాతెప్పుడో వెళ్ళినప్పుడు అమ్మ ఈ విషయమ్మీద మమ్మల్నిద్దర్నీ కలిపి కోప్పడింది.
“మా మేనమామలు అసలే వేళాకోళం మనుషులు. మన పెళ్ళిలో మీరు చేసిన హడావిడికి ఒకటే నవ్వడం… ఆఖరికి మా చిన్నమామయ్య మీరు జోళ్ళేసుకుంటూ వుంటే ఒకటే ఎగాదిగా చూడ్డం. ఓ వయసువాళ్ళమేకదూ, ఏమిట్రా అని అడిగాను.
ఏమీలేదే, మీ ఆయన చదువుకున్నాడుకదా, జోళ్ళు కాళ్ళకేసుకుంటాడా చెవులకి వేసుకుంటాడా అని చూస్తున్నాను -అన్నాడు. అలా వుంటాయి వాళ్ళ పరాచికాలు. పిల్లని చూడ్డానికి వెళ్తే ఒక రవికముక్కో, రిబ్బనో కొనివ్వండి. పావలాయో అర్ధో చేతిలో పెట్టండి. అంతేగానీ ఇలా మా పుట్టింట్లో నాపరువూ, దాని పరువూ తియ్యద్దు… ఐనా నీకేనా తెలియద్దుటే? నాన్న యిస్తే మాత్రం ఎలా తీసుకున్నావు? పనికొచ్చేవేమిటో పనికిరానివేమిటో నీకు తెలియద్దా? అంత మొద్దురాచ్చిప్పవా?” అంది.
ఇక ఆయిల్లు… అదొక మహానది. ఇంట్లోవాళ్ళు నాతో కలుపుకుని నలభైమంది. ఉమ్మడికుటుంబం. ఇంకా తాతయ్యావాళ్ళూ వేర్లుపడలేదు. వచ్చే బంధువులు, వెళ్ళే బంధువులు… పెళ్ళిళ్ళు, పురుళ్ళు, చావులు, కర్మలు… నలుగురు మరుదులు, ఇద్దరు బావగార్లు, ఆరుగురు ఆడబడుచులు వున్న ఆ ఇంట్లో నేను మూడోకోడల్ని. నాకో ఏడుగురు పిల్లలు. వాళ్ళ పెంపకాలు, పెళ్ళిళ్ళు, అవసరాలు… వున్న కోడళ్ళలో ఒక్కరైనా మేనరికం అయుండాలి… ముసలితనంలో మమ్మల్ని చూసుకోవడానికి … అనే అమ్మమ్మా తాతయ్యల ఆకాంక్షలు… మంచికోడలిగా పేరు తెచ్చుకుని పుట్టింటి గౌరవాన్ని నిలబెట్టాలనే అమ్మ ప్రగాఢవాంఛ… ఇవన్నీ నన్ను తమలోకి పీల్చేసుకుంటూ వుంటే నేను చదువుల సరస్వతిగా వుండడంకన్నా ఒక మంచి ఇల్లాలిగా వుండడంలో వున్న సౌలభ్యాన్ని నాన్నకూడా అర్ధం చేసుకున్నారు. రాజీపడిపోయారు.
నాన్న ఇచ్చిన సారి… ఇంకు ఎండిపోయింది. పెన్ను పాళీ ఎండిపోయి పనికిరాకుండా.. అయింది. కాగితాలు చాకలిపద్దు రాసుకోవడానికీ, సరుకులలిస్టు రాసుకోవడానికీ పనికొచ్చాయి. ఆ మాటమాత్రం మిగిలిపోయింది. ఎప్పుడేనా నేనేమిటో గుర్తొచ్చి గుండె మూగవోతుంది. మళ్ళీ సర్దుకుంటాను. నాకోసం నేను బాధపడేంత వ్యవధి ఎక్కడ?.
మామయ్యకి ఎన్నో వ్యవహారాలు… ఊళ్ళో తనకి శత్రువులు వున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం. బైటికి వెళ్తే తిరిగొచ్చేదాకా గుండె దడదడలాడుతుంటుంది. ఇంటికొచ్చిన ఆ మనిషిని చూశాక నిశ్చింత. అతనికేదైనా జరిగితే ఈ ఏడుగురు పిల్లలతో నేనేం కావాలనే భయం…
పిల్లల అనారోగ్యాలు… వాళ్ళకేదైనా జరుగుతుందేమోనన్న ఆందోళన… దేవుడికి పూజలు, మొక్కుకోవడాలు, నోములు, వ్రతాలు… అభద్రత భక్తిని సృష్టిస్తుంది. నిశ్చింత ఆత్మవిశ్వాసాన్నీ, తద్వారా సృజనాత్మకతనీ పుట్టిస్తుంది. నేను పూర్తి అభద్రతాభావంలోకి జారిపోయాను.


రచయిత్రి కథ పూర్తైంది.
తరువాతిది ఆవిడ కథానుభవంతో ప్రత్యేక అనుబంధం వున్న పాఠకుడి మాటల్లో.


ఆమె చెప్తూ ఏడిచిందో, ఏడుస్తూ చెప్పిందో నాకు గుర్తులేదు.
విన్నాక చిన్నగా నిట్టూర్చాను. కలలు అందరికీ వుంటాయి. అవి సాకారం కాకపోతే మనిషి ఇంకాఇంకా కలలు కంటూనే వుంటాడు. వాటిని నెరవేర్చుకునే దిశగా కష్టపడుతుంటాడు. అవి సాకారమయ్యే అవకాశం వుందని తెలిసీ, ఆ తలుపులు మనకోసం మూసివెయ్యబడి వున్నప్పుడు కలిగే బాధ… ఆ ద్వారం దగ్గిరే తారట్లాడుతుండే మనసుని బుజ్జగించి వెనక్కి లాక్కురావడంలోని ఆవేదన నాకు అనుభవపూర్వకంగా తెలుసు.
“మన ప్రాప్తం ఇంతేననుకోవాలమ్మా! నీ భర్త మంచివాడు. అలాంటివాడికి నిన్ను భార్యని చెయ్యడం నీ అదృష్టమనుకోవాలి. దేవుడు ఒకటి లాక్కున్నా ఇంకొకటి ఇచ్చాడు. నావరకూ నేను… పెద్ద చదువులు చదవాలనీ పెద్ద ఉద్యోగం చెయ్యాలనీ అనుకునేవాడిని. కానీ మానాన్నకి చదువు చెప్పించే స్తోమతలేదు. చిన్న ఉద్యోగంలో చేరిపోయాను. సంపాదించినది కొద్దిగా మిగుల్చుకుని చదువుకుందామనుకునేసరికి చదువుకునే వయసు దాటిపోయింది. పెద్ద ఉద్యోగాలకి దారి మూసుకుపోయింది. నాకన్నా తక్కువ తెలివిగలవారికింద ఉద్యోగం చేస్తూ, రాజీపడి బతుకుతున్నాను. నాకున్న తెలివి నా ఉద్యోగంలో ఉపయోగపడదు. పైవాడు చెప్పినది కిందివాడికీ, కిందివాడు చెప్పినది పైవాడికీ బట్వాడా చేసే ఉద్యోగం…”
“…”
“నా ప్రాప్తం ఇంతే. ఆ బాధే ఇలా కథలరూపంతో బహిర్గతమౌతుంది. కథ అచ్చౌతే, దాన్ని నలుగురూ చదివి బావుందని పొగిడితే నాకూ తెలివితేటలున్నాయని సంతోషపడతాను. నీ కథ చాలా బావుంది. దానిమీద చాలా చర్చలు జరిగాయి. నువ్వెవరనే విషయంమీద చాలా ఊహాగానాలు జరిగాయి. ఆడవాళ్ళకి ఇలా ఆలోచించగలిగేంత తెలివితేటలు వుండవు, ఎవరో మగవాడే ఇలా రాసివుంటాడని అనుకుంటున్నారు. వాస్తవం తెలియపరచనా?” అని అడిగాను.
“వద్దు. నన్నిలా అజ్ఞాతంలోనే వుండిపోనివ్వండి. మామయ్యకి ఇలాంటివన్నీ ఇష్టం వుండవు” అంది.
ఆరోజుని ఆవిణ్ణి చూశాక మళ్ళీ కలుసుకోలేదు. నన్ను చూడగానే నిస్పృహ వ్యక్తపరిచే ఆ చూపుల్ని నేను తట్టుకోలేను. ఇంతకీ భానుమతీదేవిగా అంత సంచలనాన్ని సృష్టించి.. అజ్ఞాతంలోనే వుండిపోయిన ఆవిడ రాఘవమ్మగారు… నా స్నేహితుడు ఆదినారాయణరావు భార్య. ఆవిడ చనిపోయిందని తెలిసి చాలా బాధ కలిగింది. ఇప్పుడేనా ఈ విషయం బహిర్గతపరచకపోతే సాహితీప్రపంచానికి తీరనిలోటు జరుగుతుందని నా భయం.


చివరి వాక్యాలు విని నేను స్థాణువయ్యాను. ఎందుకంటే ఆవిడ మా అమ్మే!..