బలిదానం – 2 by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

ఇన్‍స్టాంట్ ఎగ్జామ్స్‌కోసం మంచి కోచింగ్ సెంటరు వెతికి వంశీని చేర్చింది పావని. ఇంటరుకికూడా రెసిడెన్షియల్లోనే వెయ్యాలని ఆలోచిస్తుంటే_
“ఉన్నవూళ్ళో రెసిడెన్షియల్లో ఎందుకే? బోల్డుఖర్చు. వీళ్ళు తినే తిండికి ఏడాదికి పాతికవేలు దండగ” అంది ప్రమద. ఇద్దరూ పదేళ్ళుగా కలిసి పనిచేస్తున్నారు. మంచి స్నేహితులు. ఇంట్లో పరిస్థితులు క్లుప్తంగా చెప్పుకొచ్చింది పావని.
“వంశీ పరీక్షలు తప్పేదాకా నేనూ ఆ విషయాన్ని సీరియస్‍గా తీసుకోలేదు. మా అత్తగారు ఇటు పుల్ల తీసి అటు పెట్టదు. ఇల్లూ, ఆఫీసు… ఎక్కడా ఊపిరిసలపని పని. ఉన్నవి మూడుగదులు. హాలూ, కిచెను, మా పడగ్గది. ఏమూల చిన్నశబ్దమైనా యిల్లంతా వినిపిస్తుంది. అందులోనూ టీవీ. వీడు దానికి అలవాటుపడిపోయాడు. అందులోంచి బైటికి తీసుకురావాలి. రెండోది. వాడికోసం మేం ఏదైనా చేస్తామనే నమ్మకం పుట్టాలి. డబ్బుకన్నా అదిచాలా ముఖ్యం” అంది.
“మనుష్యులు అసలు పద్ధతిగా ఆలోచించడం మానేసారే. దాన్ని స్వార్థమనికూడా అనలేం. అసంబద్ధతే. వాళ్ళమంచి వాళ్ళు చూసుకుంటారు. పిల్లల్ని పైకి తెచ్చుకుంటారు. వాళ్ళు పిల్లాపాపల్తో హాయిగా వుంటే సంతోషపడతారు. ఎదుటివాళ్ళు పైకొస్తే అసూయపడతారు. కూతురు బావుంటే సంతోషం, కొడుకు కావాలి, కోడలక్కర్లేదు. ఇలా అనుకునేవాళ్ళతోనే చిక్కంతా వస్తుంది”
“ఆవిడది కాదు తప్పంతా. రాజేష్‍ది. నేను, భార్యా, పిల్లలు అనుకోడు. అమ్మ, తమ్ముడు, నేను అనే ఆలోచనలోంచీ బైటికి రావటంలేదు”
“మీ మరిదేం చేస్తాడు?”
“మేం సంపాదించి పెడితే ఖర్చుచేస్తాడు”
“నువ్వసలు జీతమంతా తీసికెళ్ళి మీవారికెందుకిస్తావు? కొంతతీసి దాచుకోవచ్చుకదా?”
“మాలో మాకు దాపరికమేమిటనుకునేదాన్ని. కానీ అతను నన్నూ, పిల్లల్నీ వేరుగా చూస్తాడనుకోలేదు. పిల్లలేనా ఒక్కపిసరు నయం. నేనైతే పూర్తిగా పరాయిదాన్నే”
“వేరుగా చూడటమేమీలేదు”” చురుగ్గా అంది ప్రమద. “”నీ జీతం తీసుకున్నప్పుడేమైపోయిందీ వేర్పాటు? అసలు తప్పంతా నీదే. చదువుకుని, వుద్యోగం చేసి, సగం బాధ్యత మోస్తున్నప్పుడు సమానంగా హక్కుల్ని కూడా తీసుకోవాలి. హక్కులు ఎవరూ యివ్వరు. మనమే తీసుకోవాలి. ఆడవాళ్ళకి చదువు చదువంటారుగానీ, లోకజ్ఞానం పూర్తిగా నశించిపోతోంది. మననీ మన పిల్లల్ని కాపాడుకునే తెలివి లేకపోతే ఎలా?”
“మా మరిదికి వుద్యోగం లేదు. అసలు ఏదీ నిలకడగా నాలుగురోజులు చెయ్యడు. భార్య, యిద్దరు కొడుకులు. కుటుంబం ఎలా నడుపుతున్నాడోనని ఆశ్చర్యపడేదాన్ని. మావారు కొంత పంపుతుంటారని తెలుసు. ఎంత… అనేది నేనెప్పుడూ తెలుసుకోలేకపోయాను”
“అదే తెలివితక్కువతనం. రాజేష్‍లాగే అతనూ మగవాడు. భార్యాపిల్లల్ని పోషించుకునే బాధ్యత అతనిది. ఆమె కూడా వుద్యోగం చెయ్యాలా అక్కర్లేదా అనేది వాళ్ళ సమస్య”
“ఆమె బాగా డబ్బుగలవాళ్ళమ్మాయి. ఇతను మోసం చేసి చేసుకున్నాడు. పరువుకోసమో మాటకోసమో వీళ్ళు భయపడుతున్నారనుకుంటా””
“ఎంతకాలం?”
“అదే నాకు తెలీడంలేదు. మాతోటికోడలు చాలా గట్టిది. తను, తన పిల్లల బాగూ చాలు. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా వూరుకోదు. మా మరిది ఆమెకి ఎదురు చెప్పడు. రాజేష్‍కి ఆ తెలివితేటలు లేవు” అంది పావని. ఆమెకి చాలా విరక్తిగా అనిపిస్తోంది. భర్తన్నా, యిల్లన్నా ఆఖరికి యీ వుద్యోగమన్నా విరక్తి కలుగుతోంది. పిల్లలకి కావలిసినవి సమకూర్చలేప్పుడు ఎందుకు తను పడీపడీ అన్నింటినీ పట్టుకుని వేళ్ళాడటం అనిపిస్తోంది. ప్రమద ఓదార్పుగా భుజం తట్టింది.


మెళ్ళోగొలుసూ, చేతిగాజులూ బేంకులో పెట్టి లోను తీసుకుంది పావని. కావాలనే పసుపుతాడు కట్టుకుని మట్టిగాజులేసుకుంది. తేడా కనిపించకుండా గోల్డుకవరింగువి వేసుకోవచ్చు. కానీ అలా చెయ్యలేదు. ఆమె అలా తిరుగుతుంటే రాజేష్ ఎదురుపడలేకపోయాడు. లలితకి మాత్రం మెరుపులాంటి ఆలోచన మెరిసింది.
“రవి కొడుకు… నీ కొడుక్కున్నా కూడా తెలివైనవాడు. టెన్త్ పాసుకాలేనివాడికి యింత ఖర్చుపెడ్తాంది నీ భార్య. వీడితోపాటు వాడికీ ఏదో ఒకటి చేస్తే పైకొస్తాడు”” అంది ఆశగా రాజేష్.
“డబ్బేదమ్మా?”” ఇబ్బందిగా అడిగాడతను.
“అంటే నీ జీతం భార్యకి ఇచ్చి కూర్చుంటావా?” ఆవిడ తెల్లబోయింది. “
“ఇవ్వకేం చెయ్యను? తనీ విషయంలో చాలా పట్టుదలగా వుంది. చూసావుగా, బంగారం తీసేసి బోసిబొమ్మలా తిరుగుతోంది”
“వాడితోపాటే వీడూను. వేణు నీకేమైనా పైవాడా? తమ్ముడి కొడుకేగా? వాడికే బాధ్యత తెలిస్తే నిన్నూ, నీ భార్యనీ యిలా దేవిరించాల్సిన అవసరం వచ్చేది కాదు”” అని ఏడ్చింది. రాజేష్ మెత్తబడేవాడే కానీ ఆ రాత్రి పావని అతనికి వంటరిగా వున్నప్పుడు వార్నింగిచ్చింది.
“మీరీనెల జీతం తెచ్చి ఇవ్వకపోతే మర్యాదగా వుండదు. ఇంటిని పట్టించుకోకుండా తిరుగుతున్నారని మీ ఆఫీసుకొచ్చి కంప్లెయింటిస్తాను”” అంది. అతను బెదిరాడు. ఆఫీసులో చర్య తీసుకుంటారని కాదు, పరువు పోతుంది ముందు. అందరిముందూ చులకనౌతాడు. ఇలాకాదని లలిత ఫోన్ చేసి చిన్నకొడుకు రవిని పిలిపించింది. భార్యాపిల్లత్తో వచ్చి వాలాడు అతను.
“నేనూ రెసిడెన్షియల్లో చేరతాను పెద్దనాన్నా! అక్కడైతే బాగా చెప్తారు. ఎన్విరాన్‍మెంటుకూడా బావుటుందట”” అని వేణుచేత అడిగించింది. వాడు వంశీకన్నా కొద్దిగా పెద్దవాడు. టెన్త్ మంచిమార్కులతో పాసయ్యాడు.
“వేణు చాలా యింటలిజెంట్ బావగారూ! మంచి కోచింగ్ యిప్పిస్తే ఐఐటీలోనో నిట్‍లోనో తేలతాడు” అంది రవి భార్య విద్య. రాజేష్ ఎటూ మాట్లాడలేకపోయాడు. అతను మొదట్లో తల్లి ప్రభావంలో వున్నాడు. ఇప్పుడు భార్య మాటలకి కట్టుబడిపోయాడు. అందులో అస్పష్టమైన ఐచ్ఛికతకూడా వుంది.
“చూడు విద్యా! మా పెళ్ళై యిప్పటికి పదహారేళ్ళు. మీ బావగారు జీతం తీసుకెళ్ళి ఎక్కడ తగలేసి వస్తున్నారో తెలీదు. ఈ మూడుగదుల కొంపలో పడేసి మగ్గబెడుతున్నారు. ఇద్దరం తెచ్చుకుంటున్నామన్నమాటేగానీ పిల్లలకి చదువుకుందుకు వేరే గదికూడా లేదు. వంశీని హాస్టల్లో వెయ్యడానికి నా బంగారం తాకట్టు పెట్టాను. నీదికూడా యిస్తే తాకట్టు పెడతాను. వేణుకి సరిపడా డబ్బొస్తుంది. ఈ ఏడాదికి గట్టెక్కుతాం. తర్వాత మాకంటే వుద్యోగాలున్నాయి. మరి మీరు?” అంది పావని మధ్యలోకి చొరబడి.
ఆమె నోరుతెరచి ఎప్పుడూ గట్టిగా మాట్లాడటం చూడని విద్య ఆ ధాటికి బెదిరింది. భర్తకి సరైన వుద్యోగంలేదు. ఏవో మాయమాటలు చెప్పి, చేసుకున్నాడు. తల్లిదండ్రులు తమకి సంబంధం లేదనేసారు. అతను ఎక్కడా నిలకడగా వుద్యోగం చెయ్యడు. ఐనా కుటుంబం సాఫీగా సాగుతోంది. బావగారు సర్దుతున్నారని తెలుసు. ఎంతో తెలీదు. ఇంత అసంతృప్తిని సృష్టించి అనీ తెలీదు. ఇప్పుడు పావని అన్ని మాటలంటుంటే బాధ కలిగింది. ఆమె అనడంలో తప్పులేదు. రవికి సరైన సంపాదన లేకుండా ఆశించడమే తప్పు. కానీ వుచితానుచితాలు ఆలోచిస్తేనూ, అభిమానపడితేనూ పిల్లలెలా పైకొస్తారు? వాళ్ళకో దారెలా ఏర్పడుతుంది? ఐనా తమకి అత్తగారి మద్దతుంది. ఆవిడే ఏదో ఒక ఏర్పాటు చేస్తుందనుకుంది. ఆమె ఆశించినట్టే లలిత పావనితో తలపడింది.
“ఏమిటే, తెగ నీలుగుతున్నావు? నా కొడుకు సంపాదన వాడిష్టం. నీబాబు ముల్లేం తెచ్చిపెట్టలేదుగా? ఐనా, మాయింటి విషయాల్లో నువ్వెందుకు కలగజేసుకుంటున్నావు? ఎక్కడుండాల్సినవాళ్ళు అక్కడుండడమే మర్యాద” అంది.
పావని ముఖం మానమైంది. తమమీద ఆధారపడి చీమూ నెత్తురూ చంపుకుని బ్రతుకుతున్న విద్య యీ యింటి మనిషి. తనుమాత్రం పరాయిది! కల్లోలమైనప్పుడే సముద్రం అవధులు దాటుతుంది. ఎంతో సహించాకే మనిషి అవధులు దాటుతాడు. తూట్లుతూట్లుపడ్డ పావని మనసు యింకేమాత్రం సహనాన్ని చూపించలేకపోయింది. వెంటనే హేళనగా అంది. “”మీ కొడుక్కికూడా కూడా జీతమొస్తుందని నాకు తెలీదులెండి నేను చెప్తున్నది నా జీతాన్ని గురించి”
వెంటనే రవి తలదూర్చాడు. “”ఎంతేంటి బోడిజీతం?” అంతకంటే హేళనగా అడిగాడు.
“బోడిజీతమే ఒక్క ఐదేళ్ళది పారెయ్యండి. నేనూ నా పిల్లలూ దర్జాగా బతికేస్తాం. నెలకి పదివేలు… ఏడాదికి లక్షాయిరవైవేలు …ఐదేళ్ళకి ఆరులక్షలు”” పావని తగ్గలేదు.
“ఏం చేసావో! ఎవరికి దోచి తగలేసావో! లెక్కలన్నీ నీకే తెలియాలి”
“ఔను ఉల్ఫాగా వచ్చిన డబ్బుకదూ, తాగి తగలేసాను””
“ఏమన్నావ్?” రవి చెయ్యిగాల్లోకి లేచింది.
ఆ పరిణామానికి అంతా నిశ్చేష్ఠులయ్యారు. పావని విసురుగా వెళ్ళి బెడ్రూంలో తలుపేసుకుంది. వంటింట్లో కూర్చుని చదువుకుంటూనే యీ గొడవంతా వింటున్న ప్రీతి ఒక్కసారి కేకలు పెట్టింది. “అమ్మ తలుపులన్నీ వేసేసుకుంటోంది నాన్నా! తియ్యమను నాన్నా!” అని.
రాజేష్ ఒక్కసారి బాహ్యసృహలోకి వచ్చినట్లై దబదబ బెడ్రూం తలుపులు బాదాడు.
“పావనీ! తలుపు తియ్యి. ప్లీజ్, తలుపు తియ్యి. తొందరపడకు. వాడిమాటలు పట్టించుకోకు… పావనీ!” “ఆందోళన నిండిన అతని గొంతు ఒకవైపు_
“అమ్మా! తలుపు తియ్యమ్మా!” ఏడుపుతో మిళితమైన ప్రీతిగొంతు మరోవైపు-
పావని నిర్ణయాన్ని సడలించాయి. ఫేనుకి కట్టబోతున్న చీర అలాగే వదిలేసి, ఒకవైపు గడియతీసి వచ్చి నిస్సత్తువగా మంచంమీద వాలిపోయింది.
“ఏంటీ పిచ్చిపని?”” రాజేష్ ఆమెని ఆతృతగా దగ్గరికి తీసుకున్నాడు. ఆమె పెద్దగా ఏడ్చేసింది.
“నేను ఎంతో అందంగా… వున్నతంగా బతకాలనుకున్నాను. నా పిల్లలు పెద్ద చదువులు చదవాలని ఆశించాను. మీరు నన్ను ప్రేమగా గౌరవంగా చూడాలని కోరుకున్నాను. ఆఖరికి రోజు నా బ్రతుకిలాగైపోయింది… వంశీ టెన్త్ తప్పాడు. అది నన్ను ముల్లులా గుచ్చుతోంది… పెళ్ళైన పదిహేనేళ్ళతర్వాతకూడా నేనీ యింటికి పైదాన్నే… నాడబ్బు తింటారు. నామీదికి చెయ్యెత్తుతారు…” దు:ఖంతో వుక్కిరిబిక్కిరైపోయింది.
“మగాడు…వాడినంత రెచ్చగొడతావా?” లలిత అరిచింది.
రాజేష్ రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టేసాడు. “జరిగిందిచాలు. నామీదా, నా భార్యాపిల్లలమీదా మీకున్న గౌరవాభిమానాలకి కృతజ్ఞతలు. దయచేసి ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపొండి” అన్నాడు.
కార్యభారమంతా తల్లికొదిలి, రవి తిరుగు ప్రయాణమయాడు. ఆరోజంతా పావని ఏడుస్తూనే వుంది. ఆమె చెప్పిన లెక్కలు రాజేష్‍ని దిగ్భ్రాంతిపరుస్తూనే వున్నాయి. ఆమె ఐదేళ్ళ సంపాదన…. ఆరులక్షలు అంటే తనదికూడా యించుమించు అంతే. అంతడబ్బు ఏమైనట్టు? తమ్ముడు అడిగినంత డబ్బిచ్చేవాడు… అతడు చేసే వ్యాపారాలకి పెట్టుబడి పెట్టి, నష్టపోయాక ఆ అప్పులు తీర్చేవాడు. అతను చిట్టీలుపాడి డబ్బులు తీసుకుంటే తనా వాయిదాలు తీర్చేవాడు. అన్నింటికి తల్లి సూత్రధారి.
“తమ్ముడేగా? చిన్నప్పట్నుంచీ వాడింతే” అనేది. ఆవిడ డబ్బడిగేది. తనిచ్చేవాడు. ఈరోజున యిలా మిగిలేడు. కాలరు చిరిగిన షర్టుతో తను… మెళ్ళో పసుపుతాడుతో భార్య…
ప్రతి మనిషికీ కొద్దోగొప్పో జ్ఞానం వుంటుంది. అది పరిస్థితులకి కప్పడిపోయి ఒక పెద్ద తుఫానులాంటిది వచ్చినప్పుడు బయటపడుతుంది. అలా జరిగింది అతనికి.


ఒక్కసారి తెగించాక యింక దేనికి వెనక్కి చూడకూడదనుకుంది పావని. టీవీ మీదకూడా పెద్దయుద్ధమే ప్రకటించింది. ఇంటిపనీ, పిల్లల చదువు, ఆఫీసు… క్షణం తీరికలేకుండా సతమతమౌతుండే ఆమెకి టీవీలో ఏ ప్రోగ్రామ్స్ వస్తున్నాయో చూసే తీరికుండదు. తన పనేదో తను ప్రశాంతంగా చేసుకోకుండా హాల్లో హోరెత్తిపోతుండే టీవీని చూస్తే చాలా చిరాకు.
“విసుగనిపిస్తే కాస్త ఎంటర్టైన్మెంటు వెతుక్కోవాలిగానీ ఎంటర్టైన్మెంటే విసుగు పుట్టించడమేమిటి?” అంటుంది.
టీవీ తీసికెళ్ళి యింటిముందు సిటౌట్లో పెట్టేసింది. “మేం వెళ్ళేదాకా యిక్కడ కూర్చుని చూడండి. ఇంట్లో పనివేళా అంత సౌండుతో పెడితే ఏదీ తోచడంలేదు. అదీగాక ప్రీతి చదువుకోవాలి”” అంది.
“ఏమిటే? వీధిలో కూర్చుని టీవీ చూడాలా? మతిపోయిందనుకుంటారు దారిన పోయేవాళ్ళు”” అరిచింది లలిత మతిపోయినంతపనై.
“ఐతే పెరట్లో పెట్టుకోండి”” తగ్గలేదు పావని.
రాజేష్ కలుగజేసుకున్నాడు. “”పావనీ! ఏంటీ గొడవ?”” అడిగాడు విసుగ్గా.
విరుచుకుపడింది పావని. “”నాది గొడవలా వుందా? వయసులో వున్నవాళ్ళం మనకో గదిలేదు. చదువుకుని పైకి రావల్సిన పిల్లలు… వాళ్ళకి కూర్చోవడానికి యింట్లో నిశ్శబ్దమైన చోటే లేదు. ఈ దరిద్రపుటీవీ మాత్రం యిల్లంతా ఆక్రమించుకుంటోంది. ఏముంటాయి అంత పడీపడీ అర్ధరాత్రిదాకా చూడటానికి సభ్యతా సంస్కారంలేని ఆ సినిమా తైతక్కలే కదా? లేకపోతే సీరియల్స్. అంతేనా? ఎవరేనా పిల్లలు చెడిపోతుంటే బుద్ధులు చెప్తారు. మనింట్లో… కాదు, మీ యింట్లో పెద్దాళ్ళకి చెప్పాల్సి వస్తోంది” అంది. ”
రాజేష్ ముఖం ఎర్రబడిపోయింది అంత బహిరంగంగా ఆమె అన్నందుకు. నిన్న మొన్నటిదాకా తనవే ప్రోగామ్స్ చూసేవాడు. కాకపోతే క్రికెట్… న్యూస్. వంశీ వచ్చి పక్కని కూర్చుంటే, “పోరా! చదువుకో” అనేవాడు. వాడు కదిలేవాడు కాదు.
“ఇదొక్కటే నాన్నా! ప్లీజ్, ఈ సాంగ్‍లో చిరూ ఎంతబాగా స్టెప్స్ వేస్తాడో తెలుసా?” అని వేళ్ళాడేవాడు. టీవీ కట్టేస్తే వాడు వెళ్ళేవాడేమో! తల్లి వప్పుకునేది కాదు.
“ఆనక చదువుకుంటాడులేరా! స్కూలునించీ ఇప్పుడేగా వచ్చింది? కాసేపు చూడనీ. కొంపలేం మునిగిపోవు” అనేది.
అందుకే వాడు టెన్త్ ఫెయిలయ్యాక… తనదీ తప్పుందని అర్థమయ్యాక అతనికి మారాలనిపిస్తోంది. పావనికి ఎదురు చెప్పలేకపోయాడు. ఆ సాయంత్రమే వెళ్ళి రెండు బెడ్‍రూంలుగల యింటికి అడ్వాన్సిచ్చి వచ్చాడు. వెంటనే అందులోకి మారిపోయారు. టీవీ హాల్లో పెట్టబోయాడు మామూలుగా.
“అదక్కడకాదు. మీ అమ్మగారికి ఒక గది ఇచ్చి, అందులో పెట్టండి. ఆవిడని తలుపు దగ్గరగా వేసుకుని చూడమనండి” అంది పావని.
“నేనేమైనా దొంగపని చేస్తున్నానా, తలుపులు వేసుకుని చాటుగా చూడటానికి?”” అంది లలిత కోపంగా.
“టీవీ హాల్లో వుండటం వలన దానికి అనవసరమైన ప్రాధాన్యత యిచ్చినట్టౌతుంది. దాన్ని ఇరవైనాలుగ్గంటలూ ఎలాగా నడిపిస్తారు. ఆసక్తి వున్నా లేకపోయినా వదిలించుకోలేం. ఓ చెవ్వో, ఓ కన్నో దానికి అతుక్కోకుండా వుండదు. ఓమూల పెడితే వెతుక్కుంటూ వెళ్ళి అంతసేపు కూర్చోము” అంది పావని స్థిరంగా ఆవిడతోకాదు, భర్తతో.
“అమ్మా! నీకో గది ఇచ్చాము. అందులో వుండి, నీ గొడవేదో నువ్వు పడక ఏమిటిది?” విసుక్కున్నాడు రాజేష్.” కానీ రెండ్రోజులు గడవకముందే అతనికోసం కంప్లెయింటు రెడీగా వుంది.
పక్కింటామె వచ్చి పావనికి చెప్పింది, “మీ అత్తగారు టీవీ చాలా సౌండు పెడుతున్నారు. మాకు యిబ్బందిగా వుంటోంది” అందట.
“నేను చెప్తే ఆమె వినదు. మీవారినొచ్చి మా వారికి చెప్పమనండి” అందట పావని.
ఆయనొచ్చి కచ్చితంగా చెప్పాడు రాజేష్‍కి. తల కొట్టేసినటైంది రాజేష్‍కి. టీవీ తీసుకొచ్చి హాల్లో పడేసాడు. లలిత విజేతలా చూసింది. పావని కేబుల్ సర్వీసెస్‍కి ఫోన్ చేసి డిస్కనెక్ట్ చేయించింది. టీవీ ఎందుకు ఆగిపోయిందో తెలీక లలిత కిందుమీదులైపోతుంటే అప్పుడొచ్చి చెప్పింది,“”అది మోగదు. డిస్కనెక్టైంది. మీరు మీ గదిలో కూర్చుని చిన్న వాల్యూమ్ పెట్టుకుని వింటేనే పలుకుతుంది”” రాజేశ్వరమ్మకి దిమ్మతిరిగిపోయింది. రాజేష్‍కి కూడా. ఇన్నేళ్ళు భార్యకి కాకుండా తల్లికి పెత్తనం యిచ్చినందుకు అతనికి విచారం కలిగింది.
వంశీకి మంచిమార్కులే వస్తున్నాయి. టీవీకి దూరమవడంతో జడ్డితనంపోయింది. చురుగ్గా వుంటున్నాడు. తల్లి తపననీ తండ్రి నిస్సహాయతనీ గుర్తించాడు. నాయనమ్మ తెలీనితనాన్ని కూడా అర్ధంచేసుకున్నాడు.


“మొత్తానికి విప్లవాత్మకమైన మార్పులే వస్తున్నాయన్నమాట యింట్లో. బోల్డ్‌గా వుండాలే పావనీ! మన సమస్యలని ఎవరూ పరిష్కరించరు” అంది ప్రమద.
“విప్లవాలూ, గెలుపోటములే జీవితమైతే అందులో సుఖశాంతులకీ పైకిరావటానికీ చోటెక్కడుంటుంది? నేను కోరుకునేది సుఖశాంతులనీ, పిల్లలు పైకి రావటాన్నీ… అసలు మనకి సమస్యలెందుకుండాలి? బ్రతకడం చేతకాకకాదూ?”” నిర్వేదంగా అడిగింది పావని.


“నువ్వింక వాళ్ళ విషయం పట్టించుకోవా? వాళ్ళనలా నట్టేట వదిలేస్తే ఎలారా? కనీసం వేణు చదువయ్యి ఒక వుద్యోగం వచ్చేదాకానేనా చూడకపోతే వాళ్ళు ఏమైపోతారు?” అడిగింది లలిత, రాజేష్‍ని. పావని లేనప్పుడు.
రాజేష్‍కి పావని చెప్పిన లెక్కలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే ఆమెమీదికి లేచిన రవి చెయ్యి గుర్తొచ్చింది. గుండె చిక్కబట్టినట్టైంది.
“నీ కోడలు చెప్పిన లెక్కలు నువ్వే విన్నావుకదమ్మా? పంపించిన డబ్బు పంపించినట్టు తగలేస్తే నేను మాత్రం ఎక్కడినుంచి తేను? పిల్లల చదువులు… ప్రీతికప్పుడే పదమూడు… దాని పెళ్ళికి చూసుకోవాలి. నాకింక పదమూడేళ్ళే సర్వీసుంది ఎలాగమ్మా?”” అని లేచి వెళ్ళిపోయాడు.
రోజులు నిర్లిప్తంగా దొర్లిపోతున్నాయి. లలిత పూర్తిగా దిగిపోయింది. ఇంట్లో చోటుచేసుకున్న మార్పులు ఆవిడకి దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. నోట్లో నాలికే లేనట్టుండే పావని యింతగా తిరగబడి రాజేష్‍ని మార్చెయ్యడం ఆవిడ జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు రవి యింట్లో పరిస్థితులు… మనిషి కష్టాన్నేనా సుఖాన్నేనా మనసుతోటే అనుభవిస్తాడు. ఆ మనసు గుర్తిస్తేనే అది కష్టమో సుఖమో ఔతుంది.
ఇంటరవగానే వేణు ఆర్మీలో చేరడానికి వెళ్ళాడు. అందరిలోనూ వులిక్కిపాటు. “
“వాడి మనసు చెదిరిపోయిందిరా! తోటిపిల్లాడు హాస్టల్లో వుండి చక్కగా చదువుకుంటుంటే తనకా రాతలేకుండా పోయిందని బాధపడి వెళ్తున్నాడు. యిద్దరూ ఒక్కయింటి పిల్లల్లా పెరిగారు… ఎప్పుడూ యిలాంటి బేధభావం ఎరుగరు”” ఏడ్చింది లలిత. నిజమే వేణుమనసు చెదిరింది, చదివించలేదనికాదు, పెద్దమ్మని తండ్రి కొట్టబోవడం చూసి.
రాజేష్ తలపట్టుకున్నాడు. పావనికీ కలుక్కుమందిగానీ తను మెత్తబడితే మొయ్యాల్సిన ఆర్థికభారం గుర్తొచ్చి మనసు గట్టిపరుచుకుంది.
“నాకెవరూ పెట్టక్కర్లేదు. నాకొడుకే సంపాదనపరుడయ్యాడు” అన్నాడు రవి గర్వంగా. అతన్నేమనాలో లలితకి అర్థంకాలేదు. అతని స్వార్ధపు విశ్వరూపాన్ని తొలిసారి చూసింది. విద్యావతి నిశ్శబ్దంగా ఏడ్చింది.
ట్రెయినింగ్‍కి వెళ్ళేముందు పెదతండ్రి యింటికొచ్చాడు వేణు.
“నువ్వు వెళ్ళకురా! ఎవరో అక్కర్లేదు నేనే నిన్ను చదివిస్తాను. ఈ వయసులో గొలుసూ, గాజులూ నాకెందుకు? అమ్మేసి చదివిస్తాను”” అంది లలిత. వాడిని దగ్గరికి తీసుకుని. నాలుగు తులాల బంగారంతో ఏదీ అవదని తెలీని ఆవిడ అమాయకత్వానికి వేణు నవ్వాడు. పావనికీ,
రాజేష్‍కీ వాడితో మాట్లాడాలంటేనే సిగ్గనిపించింది.
“ఎందుకురా వేణూ! ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇద్దర్నీ ఒక్కసారి హాస్టల్లో వేసి చదివించడమంటే తూగలేకపోయాం. అదీగాక వాడు యింట్లో వుంటే సరిగ్గా చదివేవాడుకాదు. నువ్వు చాలా తెలివైనవాడివి. మేథ్స్ పీజీ చేస్తే మంచి భవిష్యత్తు వుంటుంది”” అంది పావని బాధపడ్తూ.
“అప్పటిదాకా అమ్మా నాన్నలకెలా? డబ్బులేక నాన్న అమ్మమీద చెయ్యిచేసుకుంటున్నాడు” దాపరికం లేకుండా చెప్పాడు.
“అందుకిది పరిష్కారమా? పోనీ… కొంత డబ్బు అప్పుగా యిప్పిస్తాం. ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకో” అంది పావని.
“ఇప్పటికి మానాన్న ఎన్ని వ్యాపారాలు చేసి ఎన్ని దివాలాలు తీసాడో నీకు తెలీదేమోగానీ పెద్దనాన్నకి తెలుసు. ఆయన్ని పక్కన పట్టుకుని వ్యాపారంలోకి దిగనా?”
ఇందరు పెద్దవాళ్లుండి, పసివాడిని జీతంకోసం ఆర్మీలోకి పంపడమంటే ఆమెకి ఎలాగోవుంది. వేణు పైవాడు కాదు. వంశీతోపాటే పెరిగినవాడు. కానీ ఆపడమెలా? మరిది కుటుంబాన్ని తాము పోషించలేరు. చిన్న నిట్టూర్పు విడిచింది. వేణు ఆమెకేసి తదేకంగా చూసాడు. పెద్దమ్మ, పెద్దనాన్న చాలా మంచివారు. తమ కుటుంబానికి ఎంతో చేసారు. పెద్దమ్మ తననీ వంశీనీ ఎప్పుడూ తేడాగా చూడలేదు. కానీ ప్రేమతోపాటు డబ్బుకూడా పెట్టమంటే ఎక్కడినుంచీ పెడతారు? పెద్దనాన్న మంచితనాన్ని ఆఖరి అంచుదాకా వాడుకున్నారు. ఆఖర్లో పెద్దమ్మని కొట్టడానికి లేచాడు తన తండ్రి. ఆ దృశ్యాన్ని వేణు మర్చిపోలేకపోతున్నాడు. మనిషిలో సంస్కారం పెరగడానికి కొన్ని సంవత్సరాల కృషి అవసరం. ఎంతోమంది వ్యక్తుల సహకారం కావాలి. కానీ అది వీగిపోవడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఒక్కక్షణం చాలు. తండ్రి ఎలాంటివాడైనా గౌరవిస్తూనే వచ్చాడు వేణు. కానీ పావనిమీద చెయ్యెత్తినక్షణం ఆ గౌరవం నశించిపోయింది. దాని స్థానే అసహ్యంచోటు చేసుకుంది. అతనికిప్పుడు తండ్రిపట్ల ఏమీలేదు. తల్లికోసమే అతని వునికిని సహిస్తున్నాడు.
“నాకెలాంటి బాధగానీ, ఎవరిమీదేనా కోపంగానీ లేవు పెద్దమ్మా! మాయింట్లో సమస్యకి ఒక పరిష్కారం కావాలి. మాకు కొంత క్రమశిక్షణ కావాలి. నేనిలా ఆర్మీలో చేరితే తమ్ముడికేదైనా ఆర్మీకాలేజిలో సీటుకోసం ప్రయత్నించవచ్చు. డబ్బు పంపిస్తుంటే అమ్మని గొడవలేకుండా వుండనిస్తాడు నాన్న. ఎంతకాలం మీమీద ఆధారపడి?”” అన్నాడు. అతడిలో వచ్చిన మెచ్యూరిటీ తమ్ముడిలో యిప్పటికింకా రానందుకు బాధేసింది రాజేష్‍కి. కన్నతండ్రికే లేనిది వేణు విషయంలో తను మాత్రం చెయ్యగలడు?.
ఒకసారి ఆన్నదుమ్మల మధ్య చీలికలు వచ్చాయంటే ఇంక అవి సమసిపోవు. తమ కుటుంబపు బాధ్యతల్ని మొదటే పావనికి యిచ్చివుంటే పరిస్థితులు యిలాంటి మలుపు తిరిగేవి. కాదనిపించింది. సరైన నాయకత్వం వెతుక్కోకపోవడంలోనే మనిషైనా సమాజమైనా విఫలమయేది. ఆ వైఫల్యం తరువాతి పరిణామాలెప్పుడూ బాధాకరంగానే వుంటాయి. అడిగినంత డబ్బు పెట్టకుండా మొదట్లోనే ఆపి వుంటే రవికి బాధ్యత తెలిసేది. సంపాదించడానికి అలవాటుపడేవాడు. ఇప్పటికి రాజేష్‍కి ఆ విషయం అర్థమైంది.
“బలిదానం”అంది ప్రమద. “”పెద్దవాళ్ళ తెలివితక్కువతనానికి పిల్లలు బలౌతూ వుంటారు. ఇంతకుముందంతా మీ పిల్లలు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు”
పావనికిమాత్రం బాధే మిగిలింది.

3 thoughts on “బలిదానం – 2 by S Sridevi”

  1. Being a digital marketer today is definitely not easy! Not only do you need high-quality content, you need a lot of it. But creating good content is incredibly time consuming. At least that is what I thought until I came across WordAi… In case you have never heard of WordAi, it is a lightning fast content rewriter that uses Artificial Intelligence to automatically create unique variations of any piece of content. The best part is, WordAi creates rewrites that both humans and Google love.  I know, that’s a bold claim and I was pretty skeptical myself. So I decided to test their claims with their free trial and can tell you honestly, I opted directly for the yearly subscription after that. I’m not exaggerating when I tell you that WordAi is better than any other tool, service, or method on the market. I have been using WordAi to fill out my blogs and have already covered the cost of my yearly subscription. Its crazy but Im just scratching the surface of how far I can scale my SEO with WordAi! While I am using WordAi to scale my SEO efforts, you can also use WordAi to diversify your copy or even brainstorm to beat writers block! I could tell you about WordAi all day, but you really just need to try it for yourself. They are so confident in their technology that they offer a completely free 3-day trial AND a 30-day money back guarantee. So what are you waiting for? Click here to get started with WordAi for Free! Register here and get a bonus.

Comments are closed.