సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi

  1. దిక్సూచి by S Sridevi
  2. తుఫాను వెలిసింది by S Sridevi
  3. అమ్మ కొట్టిందా? by S Sridevi
  4. ఆమె మారిపోయింది by S Sridevi
  5. కదిలే మేఘం by S Sridevi
  6. క్రిస్‍మస్ చెట్టూ, పెళ్ళీ Translation by S Sridevi
  7. ఐదోది by S Sridevi
  8. పునరపి – 1 by S Sridevi
  9. పునరపి – 2 by S Sridevi
  10. పునరపి – 3 by S Sridevi
  11. సైబీరియాలో ప్రవాసానికి Translation by S Sridevi
  12. బలిదానం – 1 by S Sridevi
  13. బలిదానం – 2 by S Sridevi
  14. గమనం by S Sridevi
  15. పందెం (The bet) – Translation by S Sridevi
  16. వాకిట్లో అభ్యుదయం by S Sridevi
  17. ఆఖరి అవసరం by S Sridevi
  18. ఆవిడ మా అమ్మే by S Sridevi
  19. ఒక గొప్ప తీర్మానం by S Sridevi
  20. చట్టబంధం by S Sridevi

రష్యన్ మూలం:LEO N. TOLSTOY
The story was originally Published in Russian as “Bog pravdu vidit, da ne skoro skazhet” in the year , 1872.
Uncredited translation into English appeared in 1887 as “Exiled to Siberia” and, translation by Louise and Aylmer Maude, in 1906 as “God Sees the Truth, But Waits”
Available in Project Gutenberg in the Public domain.

ఐవాన్ దిమిత్రిచ్ అక్సియొనొవ్ వ్లాదిమిర్ పట్టణ నివాసి. వ్యాపారస్థుడు. యువకుడు. రెండు దుకాణాలు, ఒక యిల్లు స్వంతానికి సంపాదించుకున్నాడు. అందగాడు. ఇంకా అందంగా వుంగరాలు తిరిగిన జుత్తు అతని సొత్తు. సరదాయైన మనిషి. సంగీతమంటే ప్రాణం. పెళ్ళికి ముందు అతను బాగా తాగేవాడు. తాగినప్పుడు దురుసుగా ప్రవర్తించేవాడు. పెళ్ళయాక ఎప్పుడో తప్ప తాగుడు మానేసాడు.
ఒక వేసవికాలం…
అక్సియొనొవ్ నిజ్నీలో జరుగుతున్న వ్యాపారప్రదర్శనకి బయల్దేరాడు. భార్యాపిల్లలకి వీడ్కోలు చెప్తున్నప్పుడు భార్య అంది, “ఐవాన్ దిమిత్రిచ్! ఈవేళకి ఆగకూడదు? నాకేదో నీగురించి పీడకల వచ్చింది” అంది.
అక్సియొనొవ్ పెద్దగా నవ్వేసాడు. “నేనేదో ఈ పేరుతో జల్సాగా తిరగడానికి వెళ్తున్నానని నీ భయం… అంతేనా?” అన్నాడు.
“నాకు వచ్చినది పీడకల. అందులో ఇలాగే నువ్వు పట్టణానికి వెళ్తావు. తిరిగొచ్చేసరికి ముసలివాడివైపోతావు. టోపీ తీసి పక్కని పెట్టేసరికి జుత్తంతా నెరిసిపోయి వుంటుంది… ” అతని పరిహాసాన్ని పట్టించుకోకుండా అంది.
అక్సియొనొవ్ మళ్ళీ నవ్వాడు. “మంచి శకునమేకదా? చూస్తూ వుండు, సరుకంతా అమ్మి, మీకు మంచికానుకలతో తిరిగి రాకపోతే?” అన్నాడు. అంటూనే మరోసారి అందరికీ చెయ్యూపి బయల్దేరాడు.
సగందారిలో రియాజన్ అనే పాత పరిచయస్తుడు కలిసాడు. ఇద్దరూ రాత్రికి ఒకే సత్రంలో పక్కపక్కగదుల్లో దిగారు. కలిసి టీ తాగి, ఎవరిగదుల్లో వారు నిద్రకి వుపక్రమించారు. అక్సియొనొవ్‍కి పెందరాళే నిద్రపోవటం అలవాటు. వేకువనే లేచి ప్రయాణానికి గుర్రాలు సిద్ధం చెయ్యమని బండివాడికి చెప్పి, సత్రం కిరాయి చెల్లించడానికి సత్రం యజమానిని వెతుకుతూ వెళ్ళాడు. అతను సత్రం వెనకే వున్న గుడిసెలో వుంటాడు. అతనికి డబ్బు చెల్లించి బయల్దేరాడు.
ఓ పాతిక మైళ్ళ ప్రయాణం అయింది. గుర్రాలకి దాణాకోసమని మరో సత్రం ముందు ఆగారు. దాణాసంగతి బండివాడు చూసుకుంటుండగా తను కాసేపు సత్రంలో విశ్రాంతి తీసుకున్నాడు. సమురాయ్ వేడి చెయ్యమని పనివాడికి చెప్పి,వరండాలోకి వచ్చి గిటారు తీసుకుని వాయించసాగాడు.
హఠాత్తుగా ఒక మూడుగుర్రాలు కట్టిన బండి ట్రోయ్‍కా వచ్చి అతనిముందు ఆగింది. అందులో ఒక అధికారి వున్నాడు. వెనక ఇద్దరు సైనికులు నడుస్తున్నారు. ఆ అధికారి నేరుగా అక్సియొనొవ్ ముందు దిగి, అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
“నువ్వెవరు? ఎక్కడినుంచీ వస్తున్నావు?”
అక్సియొనొవ్‍కి ఏమీ అర్థమవలేదు. ఐనా జవాబులు చెప్పాడు.
“రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం” అని ఆహ్వానించాడు. కానీ ఆ అధికారి అతని ఆహ్వానానికి జవాబు ఇవ్వకుండా ఇంకా అడగసాగాడు.
“నిన్నరాత్రి ఎక్కడున్నావు? నువ్వొక్కడివేనా? వెంట మరో వర్తకుడు ఎవరేనా వున్నారా? అతన్ని పొద్దున్న చూసావా? అంత తెల్లవారే సత్రంలోంచీ ఎందుకొచ్చేసావు?” ప్రశ్నల వర్షం కొనసాగింది.
అక్సియొనొవ్‍కి ఆశ్చర్యం వేసింది. అన్నిటికీ వివరంగా జవాబులు చెప్పి, “దొంగనో దోపిడీకారునో అడిగినట్టు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? నేను వర్తకం మీద వెళ్తున్నాను. నన్నిలా నిలదీయాల్సిన అవసరమేంటి?” అన్నాడు.
అప్పుడు ఆ అధికారి అసలు విషయం చెప్పాడు.
“నేను జిల్లా పోలీసు అధికారిని. నిన్న నీతో కలిసి సత్రంలో బస చేసిన వ్యాపారిని ఎవరో గొంతుకోసి చంపారు. నీ వస్తువులు తనిఖీ చెయ్యాలి” అంటూ తన వెంట వున్న సైనికులకి ఆదేశాలిచ్చాడు.
అధికారితోపాటు అంతా సత్రంలోకి వెళ్ళారు. అక్సియొనొవ్‍ సామాన్లన్నీ తెరిచి వెతకడం మొదలుపెట్టారు.
“ఇదుగో, కత్తి…” అధికారి వున్నట్టుండి పెద్దగా అరిచాడు. “ఎవరిది ఇది? ” అని గట్టిగా అడిగాడు. అతని చేతిలో రక్తపుమరకలున్న కత్తి. అక్సియొనొవ్‍ భయంతో గడ్డకట్టుకుపోయాడు.
“దీనిమీద రక్తం ఎందుకుంది?”
“నాకు తెలీదు… అది నాది కాదు…” అక్సియొనొవ్‍ తడబడిపోయాడు.
“నీతో వచ్చిన వర్తకుడు ఈరోజు వుదయం పక్కమీద మెడతెగి పడి వున్నాడు. సత్రం తలుపులు లోపల్నుంచీ గడియవేసి వున్నాయి. మీరిద్దరూ తప్ప సత్రంలో ఇంకెవరూ లేరు. ఇదుగో, రక్తంమరకలున్న కత్తి నీ సంచీలో దొరికింది. నువ్వు తప్ప ఇంకెవరూ ఈ పని చెయ్యగలిగే అవకాశం లేదు. నువ్వెంత నటించినా నీ మొహంలో కంగారు, నీ ప్రవర్తన నిన్ను పట్టిస్తునే వున్నాయి. చెప్పు, అతన్నెలా చంపావు? ఎంతడబ్బు అతన్నుంచీ దొంగిలించావు?” అధికారి మాటలు చాలా కటువుగా వున్నాయి.
“అయ్యా! నేనీ హత్య చెయ్యలేదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నిన్న మేమిద్దరం కలిసి ప్రయాణీంచినదీ, సత్రంలో బసచేసినదీ నిజం. కానీ రాత్రి టీ తాగాక అతన్ని నేను చూడలేదు. నా దగ్గర వ్యాపారనిమిత్తం తీసుకెళ్తున్న ఎనిమిదివేల రూబుళ్ళు తప్ప ఇంకొక్క కొపెక్కుకూడా అదనంగా లేవు. అసలు ఆ కత్తికూడా నాది కాదు” అక్సియొనొవ్‍ కంగారుపడుతూ చెప్పాడు. మాటలు తడబడుతున్నాయి. ముఖం పాలిపోయింది. నిజంగా ఆ హత్య తనే చేసినట్టు భయంతో వణికిపోతున్నాడు.
” ఇతన్ని కాళ్ళు కట్టేసి బండిలో పడెయ్యండి” పోలీసు అధికారి సైనికులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే చేసాడు. అక్సియొనొవ్ చేతుల్తో ముఖం కప్పుకుని ఏడవసాగాడు. డబ్బు, వస్తువులు అన్నీ లాక్కుని, అతన్ని దగ్గర్లో వున్న చిన్న పట్టణంలో ఖైదు చేసారు. అతని ప్రవర్తన, గుణగణాలగురించి వ్లాదిమిర్‌లో విచారణలు జరిగాయి.
“అతను మనిషి మంచివాడేగానీ పూర్వపు రోజులలో త్రాగి తన సమయాన్ని వృధా చేసేవాడు” ఆ పట్టణంలోని వ్యాపారులు మరియు ఇతర గ్రామస్తులు చెప్పారు.
నేరవిచారణ మొదలైంది. అక్సియొనొవ్, రియాజన్‍ని హత్య చేసి ఇరవైవేల రూబుళ్లు దోచుకునట్లు అభియోగాలు మోపారు. అతని భార్యకి ఏదిజరిగిందో, భర్త గురించి విన్నది ఏమి నమ్మాలో, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పిల్లలు చాలా చిన్నవారు. ఆఖరిబిడ్డ మరీ పాలు తాగేంత చిన్నది. పిల్లలందర్నీ తీసుకుని ఆమె భర్త జైలులో ఉన్న పట్టణానికి వెళ్ళింది. మొదట అతన్ని చూడటానికి అనుమతించలేదు. ఎంతో వేడుకున్న తర్వాత, అధికారులు అనుమతిస్తే కిందివారు అతని వద్దకు తీసుకెళ్లారు.
అక్సియొనొవ్ జైలుదుస్తుల్లో,నేరగాళ్లతో కలిపి సంకెళ్ళలో బంధించబడి వున్నాడు. భర్తని అలా చూసి తట్టుకోలేకపోయింది. నిశ్చేష్టురాలై నిలుచున్నచోటే కూలబడిపోయింది. చాలాసేపటిదాకా తేరుకోలేదు. తర్వాత నెమ్మదిగా పిల్లలను దగ్గరకు లాక్కొని అతని దగ్గర కూర్చుంది.
ఇంట్లో విషయాలు చెప్పింది.
“అసలేం జరిగింది?” అడిగింది. అతను ఆమెకు అంతా వివరంగా చెప్పాడు.
“ఇప్పుడు మనం ఏమి చేయగలము?” ఆమె ప్రశ్న.
“ఒక అమాయకుడికి శిక్ష వేయద్దని జార్ చక్రవర్తికి అర్జీ పెట్టుకుందాం”
“ఆ పని జరిగిపోయింది. కానీ మన అర్జీ ఆమోదించబడలేదు”
అక్సియోనోవ్ ప్రత్యుత్తరం ఇవ్వలేదు. దిగులుగా చూశాడు.
“నేను నువ్వు బయల్దేరేముందు నాకు వచ్చిన కలగురించి చెప్పి, ప్రయాణం ఆపాలని చూసాను. నువ్వు నా మాట వినిపించుకోలేదు. చూడు, ఏం జరిగిందో!” అతని జుత్తులోకి వెళ్ళు పోనిచ్చి సర్దుతూ అంది. “నిజం చెప్పు, ఆ హత్య చేసింది నువ్వుకాదా? నిజం చెప్పు. నాదగ్గర దాస్తే ఎలా?” బుజ్జగింపుగా అడిగింది. అక్సియొనొవ్ నిర్ఘాంతపొయాడు.
“నువ్వుకూడా నన్ను అనుమానిస్తున్నావా?” చేతుల్లో ముఖం కప్పుకుని ఏడవసాగాడు. ఇంతలో ఒక సైనికుడు అక్కడికి వచ్చాడు.
“టైమైపోయింది. ఇంక నువ్వు, పిల్లలూ వెళ్ళాలి” అని అక్సియొనొవ్ భార్యతో అన్నాడు. అక్సియొనొవ్ ఆఖరిసారిగా భార్యాపిల్లల్ని చూసుకుని వీడ్కోలు చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు.
ఒక్కసారి ఏం జరిగిందో గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసాడు అక్సియొనొవ్.
“కట్టుకున్న భార్యే నన్ను అర్థం చేసుకోకుండా అనుమానించాక ఇంకెవరు నన్ను కాపాడతారు?” అనుకున్నాడు. “దేవుడొక్కడికే నిజం తెలుసు. అతనొక్కడికే నేను దరఖాస్తు పెట్టుకోవాలి. అతనొక్కడే నాపై దయచూపించాలి”
అన్ని ఆశలూ వదులుకున్నాడు. దేవుడిమీద భారం వేసి వూరుకున్నాడు. ఎటువంటి అర్జీలూ రాయలేదు.
అక్సియోనోవ్‌ను కొరడాలతో కొట్టి, గనులకు పంపంచారు. కొరడాముడి చేసిన గాయాలు నయం అయాక ఇతర దోషులతో సైబీరియాకు పంపివేసారు.


ఇరవైఆరు సంవత్సరాలు అక్సియోనోవ్ సైబీరియాలో దోషిగా జీవించాడు. జుట్టు, గెడ్డం మంచులా తెల్లగా మారాయి. గడ్డం పొడవుగా, సన్నగా సాధువులకిమల్లే పెరిగింది. నడుం వంగింది. నడక నెమ్మదించింది. ఆనందమంతా హరించుకుపోయింది. నవ్వన్నది మర్చిపోయాడు. మాట్లాడటంకూడా తగ్గించేసాడు. ఎక్కువగా భగవంతుని ప్రార్థనలో వుండేవాడు. ఆదివారాలు జైలు చర్చిలో బైబిలు పాఠాలు చదువుతున్నప్పుడూ గాయకబృందంతో గొంతు కలిపి భక్తిగీతాలు పాడుతున్నప్పుడూ తనలోపలి భక్తినంతటినీ వొలికిస్తున్నట్టు గొంతు శ్రావ్యంగా పలికేది. అతని మృదుస్వభావం జైలు అధికారులనికూడా ఆకట్టుకుంది. తోటిఖైదీలు అతన్ని గౌరవించేవారు. వారు అతన్ని “తాతయ్యా!” అనో, “సాధువా!” అనో ప్రేమగా పిలుచుకునేవారు. జైలు అధికారులకు ఏదేనా విన్నవించాలనుకున్నప్పుడు అతన్ని తమ ప్రతినిధిగా పంపేవారు. ఖైదీలు వాళ్ళలో వాళ్ళు తగాదాపడ్డప్పుడు న్యాయం అతన్నే అడిగేవారు.
అక్సియోనోవ్ బూట్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. దానివలన కొంచెం డబ్బు సంపాదించాడు. “ది లైవ్స్ ఆఫ్ ది సెయింట్స్” అనే పుస్తకం కొనుక్కున్నాడు. చదవటానికి తగినంత వెలుతురు వున్నప్పుడు తరుచూ చదివేవాడు.
అక్సియోనోవ్‌కు తన కుటుంబాన్నిగురించి ఎటువంటి వార్తలూ తెలీవు. భార్యాపిల్లలు ఏమయ్యారో, కనీసం బతికేనా ఉన్నారో లేదో తెలీదు.
ఒకరోజు తాజా ఖైదీలముఠా ఒకటి జైలుకు వచ్చింది. ఆ సాయంత్రం పాతఖైదీలు వారిని చుట్టుముట్టారు.
“ఎక్కడినుంచీ వచ్చావు? ఏ వూరు మీది? ఏ నేరం చేసావు? శిక్ష ఏమిటి?” ఎన్నో ప్రశ్నలు. అక్సియొనొవ్ వాళ్ళ మాటలు వింటూ కూర్చున్నాదు.
కొత్తదోషుల్లో ఒకడు, పొడవాటివాడు. అరవయ్యేళ్ళుంటాయి. బలంగా వున్నాడు. చిన్నగా కత్తిరించబడిన బూడిదరంగు గడ్డం. అతను తన కథ చెప్పసాగాడు.
“ఇంటికి తొందరగా వెళ్ళాలన్న ఆతృతలో ఒక బండికి కట్టబడిన గుర్రాల్లోంచీ ఒకదానిని తీసుకున్నాను. ఆ బండివాడు నాకు మితృడే. ఐనా దొంగతనం చేసానని ఆరోపించాడు. సరైన విచారణ లేకుండానే నన్ను అరెస్టు చేసి ఇక్కడికి పంపించారు. నిజానికి నేనిక్కడికి ఎప్పుడో రావలిసింది. అప్పుడు నన్ను పట్టుకోలేకపోయారు. అలాగని ఈ సైబీరియా జైలు నాకు కొత్తేమీ కాదు. ఇంతకుముందు ఒకసారి వచ్చాను. ఎన్నోరోజులు వుండలేదు” అన్నాడు.
“ఏ వూరు మీది?” ఎవరో అతన్ని అడిగారు.
“మాది వ్లాదిమిర్. నా పేరు మకర్. నన్ను సెమియొనిచ్ అనికూడా అంటారు” జవాబిచ్చాడు.
ఆ మాటలు వినగానే అక్సియోనోవ్ తల పైకెత్తాడు. ఏదో వుద్వేగం.
“సెమియోనిచ్! అక్కడి వ్యాపారి అక్సియోనోవ్ మీకు తెలుసా? అతని కుటుంబసభ్యులు ఇంకా బతికే ఉన్నారా?” ఆతృతగా అడిగాడు.
“తెలుసా అని అడుగుతున్నారా? బాగా తెలుసు. అక్సియోనోవ్‌లు బాగా ధనవంతులు. కానీ వారి తండ్రి సైబీరియాలో ఉన్నాడు. మనలాగే అతనూ ఒక పాపి అనిపిస్తోంది! మీ విషయం చెప్పండి తాతా! మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?”
అక్సియోనోవ్ తన దురదృష్టం గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు. నిట్టూర్చి వూరుకున్నాడు. “నా పాపాలే నన్నిక్కడికి చేర్చాయి. ఇరవయ్యారు సంవత్సరాలుగా ఈ జైలులో ఉంటున్నాను”
“ఏం పాపాలు?” అని మకర్ సెమ్యోనిచ్ అడిగాడు.
“నాకు తగిన శిక్షే పడింది” అక్సియోనోవ్ అని వూరుకున్నాడు. అతనైతే ఇంకేమీ చెప్పలేదుకానీ అతని సహచరులు వూరుకోలేదు.
“అన్యాయంగా ఇతనిపై నేరం మోపబడింది. ఒక వ్యాపారిని ఎవరో చంపి, ఇతని వస్తువుల మధ్య కత్తిని ఉంచారు. అలా శిక్షపడి సైబీరియా వచ్చాడు” అన్నారు.
మకర్ సెమ్యోనిచ్ ఈ విషయం వినగానే ఆశ్చర్యపోయాడు. తన మోకాలిమీద తనే చరుచుకుని, ” వింతగా వుందే! చాలా వింతగా వుంది. తాతా! అప్పుడు మీ వయసెంత?” అని అడిగాడు.
“ఎందుకంత ఆశ్చర్యం? నీకు ఆ అక్సియోనోవ్ తెలుసా? ఎక్కడ చూశావు?” మిగతావాళ్లు అడిగారు. కానీ మకర్ సెమ్యోనిచ్ సమాధానం ఇవ్వలేదు.
“మనం ఇక్కడ కలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది, అబ్బాయిలూ!” అని మాత్రమే అన్నాడు.
ఈ మాటలు అక్సియోనోవ్‌ను ఆశ్చర్యంలో పడేసాయి. ఇతనికిగాని ఆ హత్య చేసిందెవరో తెలుసా అనే అనుమానం వచ్చింది. “మకర్ సెమ్యోనిచ్, బహుశ: మీరు ఆ హత్య గురించి విని వుంటారు. లేదా మీరు నన్ను ఇంతకు ముందు చూసి వుంటారు” అన్నాడు.
“నాకెలా తెలుస్తాయి అలాంటి విషయాలు? ఐనా ఈ లోకం పుకార్లతో నిండిపోయింది. అలాంటిదేమైనా నా చెవిన పడ్డా, చాలకాలమైందికాబట్టి
మర్చిపోయాను”
“వ్యాపారిని ఎవరు చంపారో విన్నారా?” అక్సియోనోవ్ ఆతృతగా అడిగాడు.
“ఎవరి దగ్గరైతే కత్తి దొరికిందో అతడే హంతకుడౌతాడు. ఇంకెవరేనా మీ సంచీలో కత్తి పెట్టి వుంటే దొరికేదాకా హంతకుడు పెద్దమనిషే కదా? ఐనా మీ తలకింద వున్న సంచీలో ఎవరేనా కత్తి ఎలా పెట్టగరు? అలా పెట్టే ప్రయత్నం చేసి వుంటే మిమ్మల్ని నిద్రలోంచీ లేపినట్టేగా?”’ మకర్ సెమ్యోనిచ్ నవ్వుతూ జవాబిచ్చాడు.
వ్యాపారిని చంపినవాడు ఇతనే అని అక్సియొనోవ్‍కి అర్థమైంది. అక్కడినుంచీ లేచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. మనసంతా కలతబారింది. ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. ఎన్నో విషయాలు గుర్తొచ్చి, అప్పుడే జరిగినట్టు మనోనేత్రం ముందు రూపుకట్టాయి.
తను ఇంటినుంచీ బయల్దేరుతున్నప్పటి భార్య రూపం కళ్ళముందు కదిలింది… ఆమె ముఖం, కళ్ళు… ఏవొక్కటీ తప్పిపోలేదు. గొంతు, మాట, నవ్వు…చెవుల్లో మార్మోగాయి. తర్వాత పిల్లలు గుర్తొచ్చారు. చాలా చిన్నవాళ్ళు… ఒకడికి వొంటిమీద చిన్న చొక్కా మాత్రమే వుంది. ఇంకొకడు తల్లి చేతిలో.
ఎంత ఉల్లాసంగా వుండేవి ఆరోజులు! నిండు యౌవనం తొణికిసలాడేది. ఎంతలో మారిపోయాయి! తనను ఖైదుచేసిన రోజు సత్రపు వాకిట్లో గిటార్ వాయిస్తుండటం గుర్తొచ్చింది. తనని దెబ్బలు కొట్టినచోటు, కొట్టినవాడు, తన చుట్టూ వున్నవాళ్ళు… తనని బంధించిన ఇనుపగొలుసులు, ఇరవయ్యారేళ్ళ సుదీర్ఘమైన జైలుజీవితం, ఈ అకాలవృద్ధాప్యం… అన్నీ గుర్తొచ్చాయి. చచ్చిపోవాలన్న బలమైన కోరిక కలిగింది.
“ఇదంతా ఆ దొంగవెధవ వల్లనే!” కోపంగా అనుకున్నాడు. తనేమైపోయినా సరే, మకర్ సెమియోనిచ్‌‍మీద ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది. కోపం క్షణక్షాణానికీ పెరిందేగానీ తగ్గలేదు. మనస్సు మండుతున్న కొలిమిలా తయరైంది. మనశ్శాంతి కావాలనిపించింది. భగవంతుడిని ప్రార్థించసాగాడు. ప్రయోజనం లేకపోయింది. మర్నాడు మకర్ సెమ్యోనిచ్ తప్పించుకుని తిరిగాడు.
పదిహేనురోజులు గడిచాయి. అక్సియొనోవ్‍కి కంటిమీద నిద్రనేది లేదు. నిజమేమిటో బయటపడింది. ద్రోహి దొరికాడు. కానీ ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. నరకం కనిపిస్తోంది.
ఒక రాత్రి అలాగే నిద్రపట్టక అతను జైలు చుట్టూ తిరుగుతున్నప్పుడు ఖైదీలు పడుక్కునే అరల్లో ఒకదానికిందనించీ మట్టి దొర్లుకుంటూ రావటాన్ని గమనించాడు. ఖైదీలంతా పడుక్కునే వున్నారు. వింతగా అనిపించి ఏమిటాని ఆగి చూస్తుంటే ఒక అర కిందనుంచీ మకర్ సెమియోనిచ్ బయటికి వచ్చాడు. అక్సియొనొవ్‍ని చూసి భయపడిపోయాడు. అక్సియొనొవ్‍ అతన్ని చూడనట్టు దాటి వెళ్ళిపోబోయాడు.
మకర్ సెమియోనిచ్ అతన్ని ఆపాడు.
“తప్పించుకోవడానికి నేనిక్కడ ఒక సొరంగం తవ్వుతున్నాను. తవ్వగా వచ్చిన మట్టిని నా బూట్లలో నింపి ఖైదీలంతా పనికి వెళ్ళినప్పుడు రోడ్డుమీద పోస్తున్నాను. ఓ ముసలాయనా! చూసిందంతా ఇక్కడే మర్చిపో. నిన్నుకూడా నాతోపాటు తప్పిస్తాను. అలా కాకుండా అధికారుల దగ్గర వాగావనుకో, నాకు శిక్షపడటం సరే, నిన్నుమాత్రం ప్రాణాలతో వదలను” అని బెదిరించాడు.
అక్సియోనోవ్ కోపంతో వణికిపోయాడు. “నాకు తప్పించుకోవాలనే కోరిక ఎంతమాత్రం లేదు. చాలాకాలంక్రితమే నువ్వు నన్ను చంపేసావు. ఇప్పుడిక కొత్తగా నేను చచ్చేదేమీ లేదు… ఒక ఈ విషయాని వస్తే… నేను అధికారులతో చెప్పాలా వదా అనేది దేవుడే నిర్ణయిస్తాడు” అనేసి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు, నేరస్తులు పనికి వెళ్ళినప్పుడు ఎవరో మట్టి తరలించిన విషయాన్ని కాన్వాయ్ సైనికులు గుర్తించారు. జైలంతా వెతికితే సొరంగం కనిపించింది. గవర్నర్ వచ్చాడు.
“ఎవరి పని ఇది? చెప్పండి” ఖైదీలని నిలదీసాడు. వాళ్ళంతా దానిగురించి తమకు తెలియదని నిర్ద్వంద్వంగా చెప్పేసారు. అందులో ఒకరిద్దరు బూకరించారని చెప్పచ్చు. మకర్ సెమియోనిచ్‌ని కొరడాలతో కొట్టి దాదాపు చంపేస్తారని తెలిసి, వాళ్ళు నోళ్ళు మూసుకున్నారు. చివరికి గవర్నర్ అక్సియోనోవ్‍వైపు తిరిగాడు.
“నువ్వు నిజాయతీపరుడివి. దేవునిమీద ప్రమాణం చేసి చెప్పు, ఎవరు గొయ్యి తవ్వారు?”
మకర్ సెమ్యోనిచ్ నిర్లక్ష్యంగా అక్సియోనోవ్‍ని చూస్తూ నిలబడ్డాడు. మధ్యమధ్యలో గవర్నర్నికూడా. అక్సియోనోవ్ పెదవులు, చేతులు వణుకుతున్నాయి. చాలాసేపటిదాకా ఒక్కమాట కూడా పెకిలిరాలేదు. ఊగిసలాట.
“నా జీవితాన్ని నాశనం చేసిన వాడి నేరాన్ని, కళ్ళారా చూసినదాన్ని నేనెందుకు దాచాలి? నేను అనుభవించినదానికి బదులుగా ఇప్పుడు తను అనుభవిస్తాడు… కానీ చెప్పడం వలన అతన్ని వాళ్ళు దారుణంగా కొడతారు. దానివలన నేను పొందిన క్షోభ తగ్గదు… అదలా వుంచితే, ఆ హత్యచేసింది అతనేనని నేను తప్పుగా అనుకుంటున్నానేమో! ” ఎన్నో ఆలోచనలు.
“చెప్పు ముసలాయనా! నిజం చెప్పు. ఎవరది?” గవర్నరు మళ్ళీ అడిగాడు.
అక్సియోనోవ్, మకర్ సెమ్యోనిచ్‍వైపు నిర్వేదంగా చూసాడు. “మహాశయా! నేను చెప్పలేను. దేవుని అనుజ్ఞ లేదు. ఇందుకు నాకు మీరే శిక్ష వేసినాసరే” అన్నాడు. గవర్నర్ ఎంత ప్రయత్నించినా, అక్సియోనోవ్ చెప్పలేదు. ఇక ఆ విషయం వదిలేయాల్సి వచ్చింది.
ఆ రాత్రి, అక్సియోనోవ్ తన మంచంమీద పడుకుని నిద్రకి వుపక్రమించాడు. అప్పుడే చిన్న కునుకు వచ్చింది కంటిమీదకి. ఎవరో నిశ్శబ్దంగా వచ్చి అతని మంచంమీద కూర్చున్నారు. చీకట్లో తీక్షణంగా చూస్తే మకర్ సెమ్యోనిచ్.
“నీకు నానుండి ఇంకా ఏమి కావాలి?” అక్సియోనోవ్ అడిగాడు. “ఎందుకు వచ్చావు ఇక్కడకి?”
మకర్ సెమ్యోనిచ్ మౌనంగా ఉండిపోయాడు. అక్సియోనోవ్ లేచి కూర్చున్నాడు. చాలా అసహనంగా అనిపించింది.
“ఏం కావాలి నీకు? వెళ్ళిపో ఇక్కడినుంచీ. లేదంటే నేను గార్డుని పిలుస్తాను!” అన్నాడు.
మకర్ సెమ్యోనిచ్ అక్సియోనోవ్‌పైకి వంగి, “ఇవాన్ డిమిత్రిచ్, నన్ను క్షమించు!” అన్నాడు నెమ్మదిగా.
“ఎందుకు?” అక్సియోనోవ్ అడిగాడు.
“వ్యాపారిని చంపి కత్తిని నీ వస్తువుల మధ్య దాచింది నేనే. నిన్నుకూడా చంపాలని అనుకున్నాను. కానీ అదే సమయానికి బయట శబ్దం వినబడింది. నీ సంచీలోకి కత్తి తోసేసి కిటికీలోంచి దూకి పారిపోయాను”
అక్సియోనోవ్ మౌనంగా విన్నాడు. ఏమి చెప్పాలో అర్థం కాలేదు. మకర్ సెమియోనిచ్ పక్కమీంచీ జారి నేలపై మోకరిల్లాడు.
“ఇవాన్ దిమిత్రిచ్, నన్ను క్షమించు! దేవుని పేరిట, నన్ను క్షమించు! అధికారులముందు నా నేరాన్ని వప్పుకుంటాను. నువ్వు విడుదలౌతావు.
మీ ఇంటికి వెళ్ళవచ్చు” అన్నాడు.
“ఇలా మాటలు చెప్పడం చాలా సులువు” చివరికి అన్నాడు అక్సియొనొవ్. “కానీ నీ బదులుగా ఈ ఇరవయ్యారు సంవత్సరాలూ నేను బాధలు, కష్టాలు పడ్డాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను?… నా భార్య చనిపోయింది. పిల్లలు నన్ను మర్చిపోయివుంటారు. నేను వెళ్ళడానికి ఎక్కడా చోటన్నది లేదు…”
మకర్ సెమియోనిచ్ లేవలేదు. తల నేలకి కొట్టుకున్నాడు. “ఇవాన్ దిమిత్రిచ్, నన్ను క్షమించు!” బాధతో అరిచాడు. “అధికారులు నన్ను ముళ్ళకొరడాతో కొట్టినప్పటికన్నా బాధగా వుంది నిన్నిలా చూడటం… నువ్వింకా నామీద జాలిపడటం… దౌర్భాగ్యుడిని… క్రీస్తుపేరుమీద నన్ను క్షమించు ” ఏడవడం ప్రారంభించాడు.
అక్సియోనోవ్‍కి కూడా దు:ఖం ఆగలేదు. తనూ రోదించసాగాడు.
“నేనెవర్ని నిన్ను క్షమించడానికి? అన్నీటికీ ఆ దేవుడే వున్నాడు. ఇన్ని కష్టాలు నేను అనుభవించడానికి కారణం… బహుశ: నేను నీకంటే వందరెట్లు చెడ్డవాడిని కావచ్చు” అన్నాడు. ఈ మాటలతో అతని హృదయం తేలికైంది. ఇంటికి వెళ్ళాలనే తపనకూడా మాయమైంది. జైలు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాలనికూడా అనిపించలేదు. ఆఖరిక్షణాలకోసం ఎదురుచూపు మొదలైంది.
అక్సియోనోవ్ వద్దన్నప్పటికీ, మకర్ సెమియోనిచ్ అపరాధం వప్పుకోకుండా వుండలేకపోయాడు.
అక్సియోనోవ్ విడుదలకోసం ఉత్తర్వులు వచ్చాయి. కానీ అప్పటికే అతను చనిపోయాడు.