ప్రియమైన జీవితం – 1 by S Sridevi

  1. ప్రియమైన జీవితం – 1 by S Sridevi
  2. ప్రియమైన జీవితం – 2 by S Sridevi
  3. ప్రియమైన జీవితం – 3 by S Sridevi
  4. ప్రియమైన జీవితం – 4 by S Sridevi
  5. ప్రియమైన జీవితం – 5 by S Sridevi
  6. ప్రియమైన జీవితం – 6 by S Sridevi
  7. ప్రియమైన జీవితం – 7 by S Sridevi
  8. ప్రియమైన జీవితం – 8 by S Sridevi
  9. ప్రియమైన జీవితం – 9 by S Sridevi
  10. ప్రియమైన జీవితం – 10 by S Sridevi
  11. ప్రియమైన జీవితం – 11 by S Sridevi
  12. ప్రియమైన జీవితం – 12 by S Sridevi
  13. ప్రియమైన జీవితం – 13 by S Sridevi
  14. ప్రియమైన జీవితం – 14 by S Sridevi
  15. ప్రియమైన జీవితం – 15 by S Sridevi
  16. ప్రియమైన జీవితం – 16 by S Sridevi
  17. ప్రియమైన జీవితం – 17 by S Sridevi
  18. ప్రియమైన జీవితం – 18 by S Sridevi
  19. ప్రియమైన జీవితం – 19 by S Sridevi

ఏ వ్యకైనా తనకి ఎదురయ్యే సమస్యలకి స్పందించే తీరు వారికి తన జీవితంపట్ల వున్న ప్రేమమీద ఆధారపడి వుంటుంది. సుమిత్రకి కూడా ఒక జీవితం వుంది. ఐతే అది పూర్తిగా ఆమెకే స్వంతం కాదు. ఆమెకి దానిపట్ల కొన్ని అంచనాలూ, ఆపేక్షలూ వున్నాయి. వాటిని కుదిపేసే సమస్యలూ వున్నాయి. అలాగే ఆమె చుట్టూ వున్నవారికీ కొన్ని అంచనాలూ ఆశింపులూ వున్నాయి. తమ సమస్యలతో ఆమెని చుట్టి వేసే
మనస్తత్వమూ వుంది.
పుట్టడంతో మొదలవ్వదు మనిషి జీవితం. పుట్టుక అనేది మనిషి భౌతికంగా వునికిలోకి రావటం మాత్రమే. ఆ తర్వాత ఒక్కొక్క అనుభవమూ చేరి పడుగుపేకల కలనేతలాంటి జీవితానికి ఒక్కొక్క పోగుని కలుపుతూ వుంటుంది. అప్పుడు అతని వాస్తవమైన చిత్రానికి రూపకల్పన జరుగుతుంది. మనిషి జీవితం చివరిదాకా ఇది జరుగుతూనే వుంటుంది.


“సుమిత్రా! ఆ వుత్తరం ఎవరికి?”
“…”
“తేజాకేనా?”
“…”
“సుమిత్రా! ఈమెయిల్ వాడికేనా? ఐడీ మార్చుకున్నాడేమో!”
“…”
“సుమిత్రా! ఎవరి గురించి అంత ఆలోచన? వాడి గురించేనా?”
అన్నిటికీ ఒకటే జవాబు సుమిత్రది. మౌనం. కాకపోతే ఒకమాట అంది. “నువ్వు తేజాకి స్నేహితుడివి. నాకు కాదు””
విసుగొచ్చేస్తోంది ఆమెకి. ఇతనెవరు? ఎందుకిలా తన జీవితంలోకి చొచ్చుకుని వచ్చేస్తున్నాడు? దూరం నిర్దేశించినా పాటించడం లేదు? తనని చూడటానికి ఏదో వంకపెట్టుకుని ఆఫీసుకి వస్తాడు. తన ఆఫీసర్తో సహా అందరూ పరిచయస్తులే, స్నేహితులే అతనికి. ప్రపంచంలో వున్న మనుషులందరూ అతనికి స్నేహితులేనేమో! అతనితో అంతా సరదాగా మాట్లాడతారు. ఒక్క తనకే అతన్ని చూస్తే చిరాకు.
నాలుగైదుసార్లు ఆఫీసుకి వచ్చి కలిసాక ఒకసారైతే ఇంటికే వచ్చేసాడు. తలుపుతడితే ఎవరోననుకుని తీసింది. తీరా చూస్తే అతను. పొమ్మని అనలేదు కద! లోపలికి రమ్మని దారిచ్చింది. వచ్చి కూర్చున్నాడు. కాఫీ ఇస్తే తాగాడు. ఇల్లంతా స్వతంత్రంగా తిరిగాడు. తన గదిముందు నిలబడి లోపలికి చూస్తూ-
“ఈ గది నీదా? అలా అనిపించలేదు. తేజాని అంత తెలివితక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి లక్కపిడతలూ బొమ్మలూ వుంటాయనుకున్నాను”
అన్నాడు. అతని ముఖంలోనూ కళ్ళలోనూ ఏ భావం కనిపించలేదు. ఆ క్షణాన తనకి ఎంత కోపం వచ్చిందో! దాన్ని మాటలలో చెప్పటం సాధ్యపడదు.
అతను వెళ్ళాక తల్లి అంది. “ఎంత ఆఫీసులో పరిచయమైనా ఇలా ఇంటికి రావడం ఏం బాగుంది సుమిత్రా? ఆడపిల్లలుండే ఇల్లు. చెడ్డపేరు వస్తుంది. ఇంకోసారి రావద్దని చెప్పు”
నయం. ఆవిడకింకా చెప్పలేదు, అతనెవరో! చెప్తే వీధిలోంచే పంపేసేది. తన జీవితంలో అతని జోక్యానికి ఒకే ఒక్కసారి అనుమతించింది. ఒక్కసారి తన మనసు అతని ముందు పరిచింది. అప్పటినుంచీ అతనిలా. ఆ ఒక్కసారీ ఎందుకలా చేసింది? తనకి తనే ఆ సమస్య పరిష్కరించుకోవలసింది. ఎవరో వచ్చి తనకి సాయం చేయాలన్న సెల్ఫ్‌పిటీలో ఎందుకు పడింది? సమస్య తనది. పరిష్కారమూ తనదే కావాలి. ఎందుకంత సంయమనం కోల్పోయి ప్రవర్తించింది? దేని లెక్క దానిదే అన్నట్టు దేనికి దానికే జవాబు చెప్పుకోవలసిన పరిస్థితి.
వద్దనుకున్నా ఆ సంఘటనా, దానికి దారితీసిన పరిస్థితులూ కళ్ళముందునుంచీ తొలగటం లేదు.


ఆనందరావు చనిపోయి ఆవేళ్టికి పన్నెండోరోజు. వచ్చిన బంధువులంతా దాదాపుగా వెళ్ళిపోయారు. భార్యాపిల్లల్ని పంపేసి ఒక్క బావమరిది మాత్రం వున్నాడు. నలుగురు ఆడపిల్లల్తో నిస్సహాయంగా మిగిలిపోయిన చెల్లెలికి తనేం చెయ్యగలడా అని ఆలోచిస్తున్నాడు. అందర్నీ తనతో తీసుకెళ్లలేడు. అలాగని దూరంగా వుండేనా వాళ్ళ బాధ్యత తీసుకోలేడు. అతనిదీ అంతంతమాత్రం బతుకే.
“నీకైతే స్వీపరు పోస్టు ఇస్తామంటున్నారు రాధా! సుమిత్రని చేర్చితే మంచిదేమో! నువ్వే ఆలోచించు. బావ లేరన్న ఒక్క బాధా తప్పిస్తే అంతా వెనకట్లాగే సాగిపోతుంది” అన్నాడు.
“దానికి సంబంధం కూడా అనుకున్నాం కదన్నయ్యా! ఈ యేడు చేస్తే కన్యాదానఫలం దక్కుతుంది” అంది రాధ.
“మరైతే ఏం చేస్తావమ్మా? స్వీపరుగా చేరతావా? నువ్వు అంత చిన్న వుద్యోగంలో చేరితే వాళ్ళు సుమిత్రని చేసుకోవటానికి వస్తారా? మిగిలిన
పిల్లల పరిస్థితేమిటి? అదీ ఆలోచించాలి. అంతేకాక సుమిత్ర పెళ్ళికి అప్పుడే తొందరేమిటి? దానికేమంత వయసని? ఇంకా పంథొమ్మిది లేవు. సునీత ఇంకా డిగ్రీ చదువు తోంది. అతను చదువు ఇప్పుడే మొదలుపెట్టాడు. డిగ్రీ అయ్యి ఏ వుద్యోగమో చేస్తాడనుకుంటే అలా కాదు. ఇప్పుడు మెడిసిన్‍లో చేరాడు. అతని చదువు అవ్వాలి కదా? ఇప్పుడే పెళ్ళంటే వాళ్ళుమాత్రం ముందుకి వస్తారా? కనీసం సునీత చదువయ్యి వుద్యోగం వచ్చేదాకానైనా ఆగితే మంచిది. ఐనా బావ వున్నప్పుడేమైనా అనుకున్నారేమో, ఇప్పుడెలా కుదురుతుంది?”
మౌనమే ఆవిడ జవాబైంది.
సరిగ్గా అదే సమయానికి భద్రకాళి గుడి ఆవరణలో… అక్కడినుంచీ పద్మాక్షిగుట్టదాకా వేసిన బాటకి రెండువైపులా పరిచిన వత్తైన గడ్డిమీద కూర్చుని వున్నారు సుమిత్రా, తేజా.
“నాన్న వుద్యోగం నాకిస్తారేమో తేజా! నేనే ఇంక ఈ కుటుంబానికి ఆసరా. ఈ బాధ్యతలని నేను కాదనలేను” అంది సుమిత్ర.
“చాలా పెద్దదానివైపోతున్నావు” నవ్వేడతను.
“కాదు. నాకు నువ్వు దూరమౌతావేమోనని భయపడుతున్నాను” అంది సుమిత్ర. ఆమె కళ్లలో కన్నీళ్ళు నిండాయి.
“ఏయ్, ఎందుకా ఏడుపు? సుమిత్రా! నిన్ను నేను మర్చిపోవటమేమిటి? మనం ఒకరికోసం ఒకరం పుట్టాము. మనం విడిపోవటమనేది
జరగదు. కానీ ఇప్పుడే మనకి పెళ్ళేమిటి? పెద్దవాళ్ళు చేస్తామన్నా ఇప్పుడే నేను చేసుకోను. నా చదువు పూర్తవాలి. ముందు ఎంబీబియెస్ కావాలి. అదయ్యాక ఎమ్మెస్. ఆ తర్వాత స్పెషలైజేషన్. కనీసం పదేళ్ళు పడుతుంది. ఈలోగా నువ్వు నీ బాధ్యతలనుంచీ బైటికి రావచ్చు” అన్నాడు ఓదార్పుగా.
“నువ్వు వైజాగ్‍లో వుంటావు. మీ అమ్మావాళ్ళూ కూడా అక్కడికే వచ్చేస్తున్నారు. నువ్వింక ఇటు రానేరావు, మళ్ళీ నిన్నెప్పటికి చూస్తాను? నాకు చాలా దిగులుగా వుంది”
“ప్లీజ్, సుమిత్రా! నువ్వలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా వుంది. కొన్నికొన్ని పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. ఇలాంటప్పుడే ధైర్యంగా వుండాలి” ఆమె దగ్గరగా జరిగి ఎదుటికి తిరిగి చుబుకాన్ని తన మునివేళ్లతో ఎత్తిపట్టుకుని కళ్ళలోకి సూటిగా చూసాడు.
సుమిత్ర కళ్లలోంచీ నీళ్ళు జారిప డ్డాయి. అతని చేతిని గట్టిగా పట్టుకుంది. తేజా చిన్నగా నిశ్వసించాడు. తను సుమిత్రని చేసుకోవటమనేది నిన్నటి మాట. ఆమె తండ్రి చనిపోయి ఇంటిభారం సుమిత్రమీద పడుతుందనేసరికి తన తల్లి ఆలోచనలో మార్పొచ్చింది. తామిద్దరూ పెళ్ళి చేసుకోవటమంటే వాళ్లని ఎదిరించి చేసుకోవాలి. తన చదువు మధ్యలో వుండగా సుమిత్రమీద బాధ్యతలుండగా అది సాధ్యపడే విషయం కాదు. ప్రస్తుతానికి వాయిదా వెయ్యటమే. ఇద్దరికీ వ్యవధి కావాలి.
ఇంకొద్దిసేపు అక్కడే కూర్చున్నాక ఇద్దరూ లేచి నిలబడ్డారు.
“ఈ అమ్మవారి గుళ్ళో నీ బాధ్యతల్లో నీకు నైతికమైన ఆసరా ఇస్తానన్నాను. నేను చదువయ్యి స్థిరపడగానే నీకు చివరిదాకా
తోడుంటానంటున్నాను. పెళ్ళినాడు చేసుకునే ప్రమాణాలలో ఇంతకన్నా వేరే ఏదో వుంటుందని నేననుకోను. సుమిత్రా! మన పెళ్ళైపోయినట్టే” అన్నాడు ఆమె చేతిని తన చేత్తో గట్టిగా పట్టుకుని.
“ఎన్నియుగాలు పట్టినా పర్వాలేదు. నీకోసం నేను ఎదురుచూస్తాను”” అంది సుమిత్ర.
ఆ తర్వాత సుమిత్ర జీవితంలో కొన్ని సంఘటనలు త్వరత్వరగా జరిగాయి. తేజా వైజాగ్ వెళ్ళిపోయాడు. అతని తండ్రి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు తేజా తల్లిదండ్రులు సుమిత్రావాళ్ళకి చెప్పడానికి వచ్చినా సుమిత్ర, తేజాల పెళ్ళి ప్రస్తావన మాత్రం రాలేదు. వాళ్ళు వెళ్ళిన కొద్దిరోజులకే సుమిత్రకి వుద్యోగం వచ్చింది. ఇంకో మూడునాలుగేళ్ళు గడిచాక ఆమెకి ఒక సంబంధం వచ్చింది.
“మా సుమిత్రకి సంబంధం కుదిరే వుంది. చెల్లెళ్ల పెళ్ళిళ్ళయ్యాక చేసుకుంటానని ఆగింది. అతను మెడిసిన్ చదువుతున్నాడు. అతని చదువవ్వటానికి ఇంకా ఐదారేళ్లేనా పట్టేలా వుంది. అప్పటిదాకా చేసుకోనని అతనూ అన్నాడు. లేకపోతే మావారున్నప్పుడే వాళ్ల పెళ్లి జరిగిపోవలసిన మాట” అంది రాధ ఆ సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తితో. అతనెలా అర్ధం చేసుకున్నాడోగానీ మళ్ళీ సుమిత్రకి సంబంధం తీసుకురాలేదు.
అప్పటికి సుమిత్రకి తేజానుంచీ వుత్తరాలూ ఫోన్లూ ఆగిపోయి దాదాపు ఏడాదైంది.


ఉదయం పదకొండు. వాతావరణం తడీపొడీగా ఆహ్లాదంగా వుంది. నీరెండ మబ్బుల్తో దోబూచులాడుతోంది. అలాంటి ఆహ్లాదాన్ని ఏమాత్రం కనిపించనీకుండా చిన్నచిన్న కంప్యూటరు కేబిన్లు, వాటికి గాజుతలుపులు, కర్టెన్లు. కొన్ని పదులమంది అక్కడ తలొంచుకుని పని చేసుకుపోతున్నారు. వాతావరణం అలా వున్నందుకు వాళ్ళు కోరుకునేది వెంటనే ఒక కప్పు టీ మాత్రమే. ప్లాస్కులో టీ తీసుకొచ్చి అమ్మే
అబ్బాయికోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
కంప్యూటరు ముందు కూర్చుని వుంది సుమిత్ర. ఎదురుగా ఫీడ్ చెయ్యాల్సిన డాటా వుంది. కానీ మనసు నిమగ్నం కావటం లేదు. అంతకు ముందు పోస్టులో వచ్చిన వుత్తరం ఆమెని బాగా కలవరపెడుతోంది. మరోసారి తెరిచింది.
సుమిత్రా!
మురళికి టైఫాయిడ్ తగ్గి స్వస్థత చేకూరింది. కానీ బాగా నీరసించారు. మీరెవరూ వచ్చి చూడలేదని వాళ్ళందరికీ బాగా కోపం వచ్చింది. కనీసం చెల్లిని తోడిచ్చి అమ్మని పంపించవలసినది. మనకెంత వీలుపడకపోయినా కొన్ని తప్పవు. మురళికి ఆఫీసుకీ ఇంటికీ చాలా
దూరం. వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్వంతిల్లు కాబట్టి మారే ప్రసక్తి లేదు. రోజూ రెండు బస్సులు మారి అంత దూరం వెళ్ళి వస్తే మళ్ళీ జ్వరం తిరగబెడుతుందేమోనని భయంగా వుంది. వచ్చేనెల్లోనే దీపావళి. దానికి మీరు బైక్ కొనిస్తే బావుంటుందని వాళ్ళ అభిప్రాయం. నీకది పెద్ద భారమే కావచ్చు. కానీ నా క్షేమం దృష్ట్యా తప్పదు. నాన్న వుంటే తప్పకుండా కొనిచ్చేవారు. నాన్న లేరు. ఆ స్థానంలో నువ్వున్నావు. అందుకే నిన్నడుగుతున్నాను.
నాకు పెళ్ళి చేసావు. అందుకే నా కాపురం నిలబెట్టాల్సిన బాధ్యత కూడా నీదే. లేకపోతే ఏదో ఒక రోజు నాగురించి కూడా పేపర్లో వార్త చూస్తావు.. అర్ధమైందనుకుంటాను…
సునీత
ఏమిటీ వుత్తరం? భార్యాభర్తలు దసరాకి వచ్చి వెళ్ళారు. తమకి చాతనైన మర్యాదలేవో చేసి పంపించారు. వెళ్ళిన వారానికి మురళికి జ్వరం వచ్చిందని సునీత ఫోన్లో చెప్పింది. ఫోన్లోనే పరామర్శలయ్యాయి. టైఫాయిడని సునీత చెప్పలేదు. చెప్పి వుంటే తల్లి వెళ్ళేదేమో! కానీ వెళ్ళేంత తక్కువ దూరం కాదు. ఆమె ఒక్కర్తీ వెళ్ళలేదు. ఎవరో ఒకరు తోడుగా వెళ్ళాలి. అందుకే వెళ్ళే విషయం ఎవరూ ఆలోచించ లేదు.
రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసింది. పండుగ పండుక్కీ వచ్చి నాలుగేసివేలు వదిలించారు. పెళ్ళికైన అప్పులే ఇంకా తీర లేదు. ఇంకా ఇంకా అంటే తను మాత్రం ఎక్కడినుంచీ తేగలదు? బైక్ అంటే మాటలా?
మగదక్షత లేని కుటుంబమనీ, పెద్దగా ఆస్తులు పెద్ద సంపాదనలూ లేని కుటుంబమని తెలిసి ఇలా అడగటమేమిటి? అతని చేతుల్లో ఎంత బాధపడుతోందో తన చెల్లెలు? సుమిత్రకి బాధ కలుగుతోంది. ఏం చెయ్యాలో తోచటం లేదు.

(2.7.09 నుంచి 10.9.09 వరకు ఆంధ్రభూమిలో సీరియల్‍గా వచ్చింది)